Tuesday, August 6, 2013

బొగ్గారపు సీతారామయ్య అరుదైన వ్యక్తిత్వం: వనం జ్వాలా నరసింహారావు

బొగ్గారపు సీతారామయ్య అరుదైన వ్యక్తిత్వం

వనం జ్వాలా నరసింహారావు

ఈ ఫొటోలో కనిపిస్తున్న ఉన్నతమైన వ్యక్తి శ్రీ బొగ్గారపు సీతారామయ్య గారు. నేను ఖమ్మం రికాబ్ బజార్ పాఠశాలలో చదువుతున్నప్పుడు మాకు ఇంగ్లీష్ బోధించిన ఉపాధ్యాయుడు. 85 సంవత్స్రాల సీతారామయ్య సార్‍ను కలవడానికి నిన్న సాయింత్రం స్నేహితుడు గూడూరు సత్యనారాయణ గారితో కలిసి, ఎమ్మెల్యే కాలనీలోని వారింటికి వెళ్లాను. అక్కడి నుంచి గూడూరు వారింటికి ముగ్గురం కలిసి వెళ్లి, కబుర్లు చెప్పుకుంటూ, మద్యం సేవిస్తూ, ఓ గంట సేపు కులాసాగా గడిపాం. పాత రోజుల నాటి సంగతులు, బొగ్గారపు సీతారామయ్య సార్ ఎమ్మెల్యే అయిన రోజులనాటి విషయాలు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వ్యవహారం....ఇలా ....చాలా కబుర్లు చెప్పుకున్నాం. 



స్వాతంత్ర్య సమరయోధుడుగా, నిజాం హైదరాబాద్ సంస్థానం పాలన నుంచి విముక్తికొరకు జరిగిన పోరాటంలో పాల్గొన్న వ్యక్తిగా, శాసన సభ సభ్యుడుగా, ప్రముఖ న్యాయవాదిగా, శాసన సభ అంచనాల కమిటీ అధ్యక్షుడుగా, పానెల్ స్పీకర్ గా, బొగ్గారపు సీతారామయ్య గారు తెలంగాణ ప్రజలకు చిరపరిచితుడే. ఆగస్ట్ 15, 1932 న ఖమ్మం జిల్లా పండితాపురంలో జన్మించిన సీతారామయ్య గారు కేవలం 15 సంవత్సరాల వయసులోనే సత్యాగ్రహం చేసి జైలుకెళ్లారు. శిక్షా కాలం పూర్తైన తరువాత, తెలంగాణ సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడుగా భారత ప్రభుత్వం నుంచి తామ్ర పత్ర సత్కారం పొందారాయన. ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వ విద్యాలయం, ఉస్మానియా విశ్వ విద్యాలయం, సీతారామయ్య గారిని విశిష్ఠ స్వాతంత్ర్య సమరయోధుడుగా సత్కరించాయి. 1951 లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. ఉపాధ్యాయ సంఘాలను నెలకొల్పారు. ప్రధానోపాధ్యాయ స్థాయికి కూడా ఎదిగారు. హైదరాబాద్ స్టేట్ యూనియన్ నాయకుడిగా సేవలందించారు. 1961 లో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి ఖమ్మంలో న్యాయవాదిగా పనిచేయడం ప్రారంభించారు. జిల్లా న్యాయవాదుల సంఘానికి అధ్యక్షుడయ్యారు. 1969 లో తెలంగాణ ప్రజాసమితిలో చేరి, ప్రత్యేక తెలంగాణ వేర్పాటు ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేస్తూ, జైలు శిక్షను కూడా అనుభవించారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పటివరకూ అందులోనే కొనసాగుతున్నారు. 1978 లో ఇందిరా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖమ్మం జిల్లా సుజాత్ నగర్ నియోజక వర్గం నుంచి శాసన సభకు పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం హైకోర్టు న్యాయవాదిగా పని చేస్తున్నారు.

85 సంవత్స్రాల వయసులో కూడా నవ యవ్వన యువకుడిలో వున్న ఉత్సాహంతో అలనాటి సంగతులు చెపుతుంటే ఎంతో సంతోషం వేసింది మాకు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరుగుతున్న విషయాన్ని మరీ-మరీ చెపుతూ ఆయన ఎంతగానో ఆనందించారు. తన జీవితకాలంలో తెలంగాణ ఏర్పాటును చూడగలగడం తనకెంతో సంతోషాన్నిస్తున్నదని పలుమార్లు అన్నారు. 

బొగ్గారపు సీతారామయ్య గారికి భగవంతుడు నూరేళ్ల జీవితం ప్రసాదించాలని, అతి త్వరలో ఏర్పాటు కానున్న తెలంగాణ రాష్ట్రానికి ఆయన తన బహుముఖ సేవలను, సలహాలను, సూచనలను అందించాలని కోరుకుంటున్నాను.

No comments:

Post a Comment