Sunday, June 21, 2015

ఎమర్జెన్సీని తలపిస్తున్న రోజులు: వనం జ్వాలా నరసింహారావు

ఎమర్జెన్సీని తలపిస్తున్న రోజులు
వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (21-06-2015)
          దేశంలో తిరిగి మరోసారి అత్యవసర పరిస్థితి వచ్చే వాతావరణం కనిపిస్తున్నదంటూ భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు అద్వానీ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే, ఎమర్జెన్సీని తలపించే రీతిలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసులు తమ పరిధిలో లేకపోయినా, టీ న్యూస్ కార్యాలయంలోకి చొరబడి, ఆ ఛానల్ ప్రాధమిక హక్కులను హరించే రీతిలో నోటీసులు జారీచేశారు. అటు అద్వానీ మాటలు, ఇటు ఆంధ్రా పోలీసుల చర్యలు, నాలుగున్నర సంవత్సరాల క్రితం దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక హెబియస్ కార్పస్ కేసు తీర్పులో చేసిన వ్యాఖ్యలను గుర్తుకు తెస్తున్నాయి. వివరాల్లోకి పోతే...

          2011 జనవరి మొదటి వారంలో ఒక రివ్యూ పిటీషన్లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో, పౌరుల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన అరుదుగా జరిగే వీలున్నప్పటికీ, భవిష్యత్ లో అసలే జరుగదనే నమ్మకం లేదన్న అభిప్రాయం వెలిబుచ్చింది. ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో 1976 లో సుప్రీం కోర్టు ముందుకొచ్చిన ఒక "హెబియస్ కార్పస్ కేసు" లో తీర్పిచ్చిన నలుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, "ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు పౌరుడి జీవించే హక్కు కూడా రద్దుచేయవచ్చు" అని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన విషయం జస్టిస్ ఆలం, జస్టిస్ గంగూలీలు ఆ సందర్భంగా పేర్కొనడం గమనించాల్సిన విషయం. సందర్భంగా ప్రాధమిక హక్కుల అంశాన్ని ప్రస్తావిస్తూ, 1976 నాటి సుప్రీం కోర్టు తీర్పులోని అంశాలను పేర్కొన్నారు ఆ ఇద్దరు న్యాయమూర్తులు. కంచే చేనును మేసిందని, పౌరుల ప్రాధమిక హక్కులను పరిరక్షించాల్సిన అత్యున్నత న్యాయస్థానమే వాటి ఉల్లంఘనకు మార్గం సుగమం చేసిందని, మూడున్నర దశాబ్దాల విరామం తర్వాత, అదే అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది.

          1976 నాటి అత్యున్నత న్యాయస్థానం బెంచిలోని ఐదుగురు న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ ఖన్నా, మిగిలిన నలుగురు సహచర న్యాయమూర్తుల మెజారిటీ తీర్పుతో ఏకీభవించకుండా వెలిబుచ్చిన అభిప్రాయాన్ని కూడా జస్టిస్ ఆలం, జస్టిస్ గంగూలీలు పేర్కొన్నారు. "హెబియస్ కార్పస్ ఆదేశం" అనేది రాజ్యాంగంలో ప్రధానమైన అంతర్భాగమని, అలాంటి ఆదేశాలను ఇచ్చే రాజ్యాంగపరమైన హైకోర్టుల అధికారాన్ని రద్దుచేసే నిర్ణయాధికారం ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా, రాజ్యాంగం ఎవరికీ దఖలు చేయలేదని, ఖన్నా వెలిబుచ్చిన అభిప్రాయాన్ని న్యాయమూర్తులు పేర్కొన్నారు. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం ఎన్ వెంకటచలయ్య ఫిబ్రవరి 25, 2009, ఖన్నా స్మారకోపన్యాసం చేస్తూ, ఎమర్జెన్సీ రోజుల నాటి మెజారిటీ నిర్ణయాన్ని "చరిత్ర పుటల్లో పనికిరాని పేజీలకు పరిమితం" చేయాలని చేసిన వ్యాఖ్యను కూడా న్యాయమూర్తులు గుర్తుచేసుకున్నారు. అలనాటి సుప్రీం కోర్టు నిర్ణయం పౌరహక్కుల అమలును త్రి కరణ శుద్ధిగా కోరుకునే వారిపై ఎటువంటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవడానికి ఇదొక ఉదాహరణగా భావించాలి.

          భారత రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత, రాజ్యాంగంలో పొందుపరచిన విధానం ప్రకారం, దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టుది. న్యాయం కొరకు పౌరుడు ఆఖరు పోరాటం చేసే న్యాయ వ్యవస్థ కూడా సుప్రీం కోర్టే. దురదృష్టవశాత్తు, ఇందిరా గాంధి విధించిన ఎమర్జెన్సీ పుణ్యమా అని, 1975-1977 మధ్య కాలంలో, న్యాయ వ్యవస్థకున్న స్వతంత్ర అధికారాలకు సహితం భంగం వాటిల్లింది. "ముందస్తు నిర్బంధ చట్టాల" కు అనుగుణంగా అరెస్టు చేయబడి జైళ్లలో నిర్బంధించిన పౌరుల రాజ్యాంగ పరమైన హక్కులు కాల రాయబడ్డాయి. సుప్రీం కోర్టు ముందుకు విచారణ కొచ్చిన ఒక హెబియస్ కార్పస్ కేసులో ఆ రోజున తీర్పిచ్చిన ఐదుగురు న్యాయమూర్తులలో నలుగురు, ఏఎన్ రే, పిఎన్ భగవత్, వైవి చంద్రాచూడ్, ఎంహెచ్ బెగ్ ప్రభుత్వ సర్వాధికారాలను సమర్థించారు. ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు పౌరహక్కుల ఉల్లంఘన జరిగినా తప్పులేదన్న రీతిలో తీర్పిచ్చారు. జస్టిస్ ఖన్నా మాత్రం, విచారణ జరపకుండా నిర్బంధంలో వుంచడం పౌరుల వ్యకి స్వేచ్ఛ పై ఆంక్షలు విధించడమేనని తన తీర్పులో చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తికి, చట్ట ప్రాధాన్యత తెలియ చేయడానికి, భవిష్యత్ రోజుల విజ్ఞతకు, మెజారిటీ నిర్ణయం భవిష్యత్ లో సరిదిద్దడానికి, తన భిన్నాభిప్రాయం ఉపయోగపడుతుందని ఖన్నా అన్నారు ఆ రోజున. ఆయన వెలిబుచ్చిన భిన్నాభిప్రాయానికి ప్రతిఫలంగా తనకు దక్కాల్సిన సుప్ర్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదా ఇతరులకు ఇవ్వడం జరిగింది. జనవరి 1977 లో, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎంపిక చేయడానికి కేంద్ర ప్రభుత్వం అందరికంటే సీనియర్ న్యాయమూర్తైన జస్టిస్ ఖన్నా పేరును సిఫార్సు చేయలేదు. అంతవరకు వస్తున్న సాంప్రదాయానికి ఇందిర ప్రభుత్వం స్వస్తి పలికింది. జరిగిన అన్యాయానికి నిరసనగా పదవికి రాజీనామా చేస్తూ జస్టిస్ ఖన్నా తీసుకున్న నిర్ణయం, నేటికీ-ఏ నాటికి, సహచర భారత దేశ న్యాయ వ్యవస్థకు చెందిన వారిలో ఒక సాహసోపేత వ్యక్తిగా గుర్తింపు తెచ్చింది. ఎమర్జెన్సీ రోజుల్లో సుప్రీం కోర్టు హెబియస్ కార్పస్ పిటీషన్ కేసులో ఖన్నా వెలిబుచ్చిన "భిన్నాభిప్రాయం", దరిమిలా 44 వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టంగా రూపొంది, వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన రాజ్యాంగంలోని 20, 21 ఆర్టికల్స్, ఎమర్జెన్సీ నిబంధనల పరిధి నుంచి తొలగించడ జరిగింది.

          బహుశా జస్టిస్ ఖన్నా గురించి అప్పట్లో అమెరికా పత్రిక న్యూయార్క్ టైమ్స్ రాసిన కధనం పౌరహక్కులు కోరుకునే అందరికీ మార్గదర్శకంగా పేర్కొన వచ్చు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో మొదటి పద్దెనిమిది సంవత్సరాల స్వేచ్ఛా-స్వాతంత్ర్యాలు, ప్రజాస్వామ్యానికి, సర్వ సత్తాక స్వతంత్ర జాతికి, గుర్తుగా ఎవరో ఒకరు-ఎప్పుడో ఒకప్పుడు, జస్టిస్ ఖన్నా జ్ఞాపకార్థం శాశ్వతంగా వుండే "స్మారక స్థూపం" నిర్మించడానికి పూనుకుంటారని పేర్కొంది న్యూయార్క్ టైమ్స్. స్వతంత్ర న్యాయ వ్యవస్థ నిరంకుశ ప్రభుత్వానికి లొంగి పనిచేయడమంటే, ప్రజాస్వామ్యం నశించిపోయే దిశగా ఆఖరి అడుగు వేసినట్లే అని కూడా వ్యాఖ్యానించింది ఆ పత్రిక.

          ఎమర్జెన్సీ విధించి పలువురిని నిర్బంధించి జైళ్లలో నిర్బంధించిన దరిమిలా, హెబియస్ కార్పస్ పిటీషన్ల రూపంలో చాలా మంది డిటెన్యూలు రాష్ట్ర హైకోర్టులను ఆశ్రయించారు. రాజ్యాంగం పౌరుడికి ప్రసాదించిన హక్కులకు భంగం కలిగిందని, తమ హక్కులను పునరుద్ధరించి విడుదలకు ఆదేశాలిప్పించాలని వారు కోరారు. అయితే, ఎమర్జెన్సీ విధించు తూ, రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులో, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులన్నీ, తాత్కాలికంగా రద్దుచేస్తున్నట్లు పేర్కొనడంతో, వివిధ హైకోర్టులు, భిన్నాభిప్రాయాలను వెల్లడించాయి. ఎమర్జెన్సీ ఉత్తర్వులున్నప్పటికీ పౌరుడు కి వున్న రాజ్యాంగపరమైన హక్కుల ఉల్లంఘన జరగడానికి అంగీకరించని కొన్ని హైకోర్టులు, నిర్బంధాన్ని న్యాయస్థానాల్లో డిటెన్యూలు సవాలు చేయవచ్చని అభిప్రాయ పడ్డాయి. రాజ్యాంగపరమైన మౌలిక అంశం ఇమిడి వున్నందున సమస్య సుప్రీం కోర్టుకు చేరింది. మెజారిటీ న్యాయమూర్తులు ప్రభుత్వ ఉత్తర్వులకు అనుకూలంగా తీర్పు ఇస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు "కార్యనిర్వాహక వ్యవస్థ" దేశాన్ని కాపాడే బాధ్యత స్వీకరిస్తుందని, ఆ వ్యవస్థ చేపట్టిన చర్యలు, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగాయనో, మరేదో కారణానో సవాలు చేయడం సరికాదని, "వ్యక్తి స్వేచ్ఛ చట్ట పరిధికి లోబడి, నియంత్రించబడి" వుంటుందని న్యాయ మూర్తులు అన్నారు. స్వేచ్ఛ "చట్టం ఇచ్చిన కానుక" లాంటిదని, అదే చట్టం ఆ కానుకను వెనక్కు తీసుకోవచ్చునని వారంటారు. తాత్కాలికంగా పౌరుల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన జరిగినంత మాత్రాన, సుప్రీం కోర్టు-హైకోర్టుల అధికారాలకు భంగం కలిగిందని భావించరాదని కూడా న్యాయ మూర్తులు పేర్కొనడం విశేషం. రాష్ట్రపతి ఎమర్జెన్సీ ఉత్తర్వులకనుగుణంగా, డిటెన్యూలకు హెబియస్ కార్పస్ పిటీషన్ ద్వారా కోర్టును ఆశ్రయించడానికి అవకాశం లేదని కోర్టు స్పష్టం చేస్తూ, అంతర్గత భద్రత కాపాడడం రాజ్యాంగ రీత్యా చెల్లుబాటవుతుందని అన్నారు.


అల నాడు అత్యున్నత న్యాయస్థానానికి చెందిన ఆ నలుగురు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు వల్ల, భారీ సంఖ్యలో దేశ పౌరుల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని, అదే అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పడం ప్రజాస్వామ్యంలో ప్రాధమిక హక్కుల పరిరక్షణ దిశగా మరో అడుగు ముందుకు వేసేందుకు దోహద పడుతుందనాలి. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కులను ఆస్వాదించే హక్కు, అనుభవించే హక్కు, భంగం కలిగినప్పుడు ప్రశ్నించే హక్కు, దేశంలోని ప్రతి పౌరుడికి తాత్కాలికంగానైనా రద్దు చేసే అధికారం ఎవరికీ వుండరాదు. ఎమర్జెన్సీ లాంటి చీకటి రోజులు మళ్లీ తలఎత్తకూడదు. ప్రభుత్వ-ప్రభుత్వేతర మానవ హక్కుల సంస్థలు, వ్యక్తులు నిరంతరం ఆ దిశగా కృషి చేసిన నాడే అద్వానీలాంటి వారి భయాలకు ఆస్కారం లేకుండా పోతుంది.End

4 comments:

  1. మీ భయం మీది. ఏ ఎమర్జెన్సీ లేకుండానే 23నిమిషాలసేపు పార్లమెంట్ తలుపులు మూసి విభజన చేయించుకున్న తీరులోనే ఆంధ్రప్రదేశ్ ని తిరిగి తెలంగాణాలో కలిపేయవచ్చు. నియంతృత్వంగా తెలంగాణాని సాధించుకుంటే లేని భయం నియంతృత్వంగా ఆంధ్రప్రదేశ్ ని తెలంగాణాలో కలిపితే రాకూడదు.ఆంధ్రావాళ్ళకు మళ్ళీ తెలంగాణాతో కలిసే ఆలోచన వస్తుందంటారా ?

    ReplyDelete
    Replies
    1. మంచి ప్రశ్నవేశారు నీహారికగారూ.

      మరి ఎన్నటికీ తెలంగాణావాళ్ళతో కలిసి ఉందామనే ఆలోచన అంధ్రప్రాంతవాసులకు వస్తుందని అనుకోలేము. ఐన అనుభవంచాలుననే అక్కడివారు భావిస్తున్నారని నా అభిప్రాయం.

      రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలంటే విడిపోతామన్నవారి అభిప్రాయం చాలుననే వాదన ధాటీగా వినిపించింది. ఆమాట సబబో కాదో అది వేరే సంగతి. మీరన్నట్లు రేపు రెండుప్రాంతాలనీ కలుపుతామంటే మాత్రం ఇరుప్రాంతాలవారి అనుమతి కావాలా అన్న ప్రశ్న వస్తుందో రాదో కాని తెలంగాణాప్రాంతంవారి ఆమోదం తప్పనిసరిగా కావాలన్న వాదన మాత్రం వస్తుంది. ఎందుకంటే మాటకారి మేథావులంతా తమకు అవసరమైన వాదనలు బాగానే వినిపించగలరు కాబట్టి, ఐతే తెలంగాణావారి అవస్రమో అభీష్టమో అదే ఐయతే ఆంధ్రావారి ఆమోదంతో పని లేదూ కేంద్రానికి ఏ ప్రాంతలనైనా కలిపే అధికారం ఉందీ అన్న వాదన కూడా మహా ధాటీగా వినిపిస్తుందని గమనించండి. కాని ఈ విషయంలో చర్చఅవసరం కాదు ఇప్పుడు. బహుశః ఎప్పటికీ అవసరం రాకపోవచ్చును కూడా. మన మేథావులేమటారో తెలుసుకదా మీకు? ఊహాజనితమైన ప్రశ్నలకు సమధానాలు ఇవ్వనవసరం లేదూ అని.

      నియంతృత్వమా కాదా ఈ విభజనప్రక్రియ అన్న ప్రశ్నకు ఎవరి దృక్కోణం నుండి వారు సమాధానం చెబుతారు. నష్టపోయా మనుకుంటున్న వారి భావోద్వేగం అది నియంతృత్వపు పోకడ అనే అంటుంది. లాభపడ్డవారి సంతోషపూరితాంతరంగాలు మాత్రం న్యాయం జరిగింది, ధర్మం గెలిచింది కాని ఎక్కడా అనుచితమైన పని జరుగనే లేదు అని సంతృప్తిని ప్రకటిస్తాయి. ఇదంతా సహజం. ఏలికలు స్వార్థపరులై వ్యవహరించారని ఒకరంటే ఏలికలు ధర్మపరాయణులై వ్యవహరించారని ఒకరంటారు.

      ఎప్పటినుండో చెబుతున్న మాటే మరలా అంటాను. విజయమూ పరాజయమూ అనేవి సాపేక్షాలు. కాలగతిలో ఇలంటివి చాలా జరిగాయి ఇంకా ఎన్నో జరుగుతాయి.అంతా చక్రనేమిక్రమేణ అన్నట్లే జరిపిస్తుంది కాలం. కాలో దురతిక్రమణీయః

      Delete
  2. వనంవారూ,
    ఒక చిన్న ప్రశ్న. ఏమీ అనుకోకండి. సభాభవనం తలుపులు మూసి, మీడియా కవరేజి బందు చేసి, కాదన్నసభ్యులపై దౌర్జన్యంచేసి మరీ విభజనబిల్లు అనేదాన్ని అమోదించిన తీరు చూసినప్పుడు మీకు అది ఎమర్జెన్సీ ధాష్టీకాన్ని తలపించలేదా? లేదా అది తెలంగాణావారికి లాభసాటి బేరం అయ్యింది కాబట్టి అంతా ధర్మయుక్తమే అని సంతృప్తిని కలిగించిందా? మేధావులు నిష్పాక్షికంగా మాట్లాడవలసిన అవసరం మనదేశంలో లేదా?

    ReplyDelete
    Replies
    1. అందుకే రాజనీతి గురించి, ధర్మాన్ని గురించి, ఎప్పుడు ఏ ధర్మం అవసరమో అనే దాన్ని గురించి మన పురాణాలలో ఇతిహాసాలలో (ఉదాహరణకు మహాభారతంలో అర్జునిడిని భీష్ముడి పైకి బాణం వేయమని పురమాయించిన శ్రీకృష్ణుడి వ్యవహారం) చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఇక మీరడిగిన ప్రశ్నలోనే జవాబుంది!

      Delete