Friday, September 4, 2015

108-అత్యవసర సహాయ సేవల తొలినాళ్ల జ్ఞాపకాలు:వనం జ్వాలా నరసింహారావు

108-అత్యవసర సహాయ సేవల తొలినాళ్ల జ్ఞాపకాలు
వనం జ్వాలా నరసింహారావు
(ఇ. ఎం. ఆర్. ఐ. మాజీ కన్ సల్టెంట్)
ఎందరినో ఆదుకున్న 108 ఆరంభం ఇలా...

సూర్య దినపత్రిక (10-09-2015)


సత్యం కంప్యూటర్స్ చైర్మన్ రామలింగ రాజు పదేళ్ల క్రితం స్థాపించిన 108-అత్యవసర సహాయ సేవల సంస్థలో ఆరంభపు రోజుల్లో పనిచేసిన కొందరం ఆత్మీయులం హైదరాబాద్‌లోని ఒక హోటెల్ లో కలుసుకున్నాం. అలనాటి అనుభవాలను, జ్ఞాపకాలను పంచుకున్నాం. ఆ మరుసటి రోజు రామలింగ రాజును వారింటికి వెళ్లి కలిసి వచ్చాం. ఆయన అందరినీ పేరు-పేరున ఆప్యాయంగా పలకరించి ఎవరెవరు ప్రస్తుతం ఏం చేస్తున్నది అడిగి తెలుసుకున్నారు. మేం పంచుకున్న జ్ఞాపకాల సారాంశం...

అత్యవసర సహాయ సేవల సంస్థ ప్రారంభించడానికి పూర్వ రంగంలో రాజుగారు మొట్టమొదట సంప్రదించిన వ్యక్తి  డాక్టర్ ఊట్ల బాలాజి. ఈ విషయంలో అవగాహన-ఆలోచన-అనుభవం-నిబద్ధత వున్న వైద్య రంగ నిపుణుడి కొరకు వెతికారు బాలాజి. స్నేహితుడు శశి ద్వారా డాక్టర్ రంగారావును కలుసుకున్నారు. రాజు గారి ఆలోచనలు కార్యరూపంలోకి తేవడానికి డాక్టర్ బాలాజికి తోడ్పడిన వారిలో ముందు వరుసలో డాక్టర్ ఎ. పి. రంగారావు, వారణాసి సుధాకర్, శ్రీకాంత్, కృష్ణ కోనేరు, శ్రీనివాస రాంబాబు, పొలిమల్లు శివ వున్నారు. ఆవిర్భావ నేపధ్యంలో, అమోఘమైన కృషిచేసి, వైద్య పరంగా ప్రతి చిన్న అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి, ఆ మోడల్ ను రూపొందించి, మొదట్లో ఏడాదికి పైగా అన్నిరకాల సలహా సంప్రదింపులను అందచేసిన వ్యక్తి డాక్టర్ ఎ.పి. రంగారావు. ఈ నేపధ్యంలో, ఒక "ప్రతిపాదనను తయారుచేసి రాజుగారి దగ్గరకు పట్టుకెళ్లారు బాలాజి. ఆ ప్రతిపాదనను అప్పటి ముఖ్యమంత్రికి రాజశేఖర్ రెడ్డికి ఆయన ఏలూరు పర్యటనలో వున్నప్పుడు చూపించి ఆయన మెప్పు పొందారు. సత్యం సంస్థలోనే పనిచేస్తున్న ఉద్యోగి వారణాసి సుధాకర్ సహాయం కూడా తీసుకోమని బాలాజికి సూచించారు రాజు గారు. కృష్ణ కోనేరు కూడా వీరికి తోడయ్యారు. ఆయన సూచించిన "సెన్స్-రీచ్-కేర్" నమూనా రాజుగారికి బాగా నచ్చింది. ఈ లోగా డాక్టర్ రంగారావు సుమారు 132 రకాల "ఎమర్జెన్సీలను" క్రోడీకరించారు. వీటన్నిటితో కలిపి మరోసారి ముఖ్యమంత్రిని కలిసి ఆయనకు వివరించారు రాజు గారు.

బెంగుళూర్లో వుంటున్న వారణాసికి సెప్టెంబర్ 17, 2004 న రాజు గారి దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది. కాన్ఫరెన్స్ కాల్ ద్వారా, తమ్ముడు రామరాజును, . ఎస్. మూర్తి ని, వారణాసిని కలిపి మాట్లాడారు. వృత్తి పరంగా వారణాసికి సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యం వుంది. అత్యవసర సహాయ సేవలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకనుగుణంగా అందచేయాలంటే, సాంకేతిక పరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవడం ప్రాధాన్యతా పరమైన అంశమని గ్రహించిన రాజు గారు, అవి సమకూర్చగల సామర్థ్యం వున్న వ్యక్తి వారణాసి సుధాకర్ అని భావించారు.

తనతో ఫోన్లో మాట్లాడిన రాజు గారు, తనకు బాధ్యతను అప్పచెప్తూ, పేపర్ పై రాసుకుని, ఫోనులోనే చదివిన దాన్ని వారణాసి సుధాకర్ ఇప్పటికీ మర్చిపోలేదు. "సుధాకర్! అమెరికాలోని 911 తరహా అత్యవసర సహాయ సేవలను అందించేందుకు, అవసరమైన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ను, అంతర్జాతీయ ప్రమాణాలతో, ఒక సంవత్సర కాలంలో మీరు ఏర్పాటుచేసి తగు విధమైన సేవలు లభించేలా చర్యలు చేపట్టాలి. తొలుత ఆంధ్ర ప్రదేశ్ లోను, క్రమేపీ దేశ వ్యాప్తంగానూ దాని ద్వారా పౌరులందరికీ ఆ సేవలు లభ్యమయ్యేలా చూడాలి" అని దాని సారాంశం. రాజుగారి ఆలోచనలను కార్యరూపంలోకి తెచ్చే బాధ్యతను స్వీకరించిన సుధాకర్‍కు  టోల్ ఫ్రీ టెలిఫోన్ గురించి, దాని నంబర్ గురించి, అంబులెన్స్ డిజైన్ గురించి, లోగో గురించి, వైద్య పరమైన ప్రోటోకాల్స్ గురించి, సాంకేతిక సదుపాయాల గురించి, ప్రభుత్వ భాగస్వామ్యం గురించి స్పష్టత రాసాగింది. సుధాకర్ వైద్య పరమైన విషయాలనేకం డాక్టర్ రంగారావుతో చర్చించేవారు. తనకు సాంకేతిక పరంగా తోడ్పడేందుకు వై.ఎన్.ఎస్ కిషోర్ అనే నిపుణుడిని ఇ.ఎం.ఆర్.ఐ లో నియమించారు. అంతకు ముందే సత్యం సంస్థలో బాలాజి నియమించిన మరో నిపుణుడు అనీల్ జంపాలను కూడా ఇ.ఎం.ఆర్.ఐ కి తీసుకొచ్చారు. ఆయనకు అమెరికాలో ఆ రంగంలో పనిచేసిన అపారమైన అనుభవం వుంది.

వీరిద్దరు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ పెరుగుదలకు చాలా కృషి చేశారు. కిషోర్ కక్కడ ప్రమేయం లేని రంగం లేదనాలి. అంతర్జాతీయంగా 108-అత్యవసర సహాయ సేవలకు వివిధ దేశాల్లో గుర్తింపు రావడానికి, వివిధ దేశాల్లోని సంబంధిత సంస్థలతో అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకోవడానికి అనిల్ జంపాల అపారమైన కృషి చేశారు. అనిల్-కిషోర్ , ఇద్దరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన వారే కావడంతో, ఆ రంగానికి సంబంధించిన అనేక విషయాలు, సమీక్షా సమావేశాల్లో చర్చకొచ్చేవి. మొదటి అవగాహనా ఒప్పందం ప్రభుత్వంతో కుదుర్చుకోవడానికి పూర్వ రంగంలో అనిల్, కిషోర్ ఇద్దరు చేసిన కృషి, ఆ తర్వాత సంస్థ ద్వారా పది రాష్ట్రాల్లో అత్యవసర సహాయ సేవలు లభ్యమయ్యేలా చూడడంలో చేసిన కృషి అమోఘం. .ఎం.ఆర్." ముఖ్య కార్య నిర్వహణాధికారిగా బాధ్యతలు చేపట్టారు వారణాసి సుధాకర్. డాక్టర్ రంగారావు సంస్థ మెడికల్ సలహాదారుగా వుండేవారు. ఒక వైపు రంగారావు సలహా తీసుకుంటూనే, మెడికల్ ప్రోటోకాల్స్ విషయంలో కొంత అధ్యయనం చేసేందుకు అమెరికా లాంటి దేశాలకు వెళ్లొచ్చారు. "అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల" కు అనుగుణంగా-ఏ మాత్రం నాణ్యత తగ్గకుండా వుండే తరహా "ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్లను" ఒక్కో రాష్ట్రానికి ఒకటి రూపు దిద్దుకోవాల్సిన అవసరం వుందని సూచించారు జనవరి 29, 2005న రాజు గారు. మొదలు ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించి, హైదరాబాద్ లో ఏర్పాటు చేయమన్నారు. ఆయన తర్వాత సీ..ఓ బాధ్యతలు చేపట్టిన వెంకట్-ఆయన సహచరుడు కిశోర్ తమకు 108 నంబర్ కేటాయించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం, అలానే కేటాయించడం, ఆ నంబర్ అచిర కాలంలోనే ఆబాలగోపాలానికి అత్యంత ఆదరణీయమైంది కావడం జరిగింది.

ప్రభుత్వంతో ఏప్రియల్ 2, 2005 న మొట్టమొదటి "అవగాహనా ఒప్పందం" (Memorandum of Understanding-MoU) పై ప్రభుత్వ ప్రతినిధి, .ఎం.ఆర్.ఐ ప్రతినిధి సంతకాలు చేశారు. రాజుగారు కోరినట్లు గానే జులై 14, 2005 కల్లా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన మౌలిక సదుపాయాలు తయారయ్యాయి. ఎం..యు పై సంతకం చేసింది సుధాకర్ అయినప్పటికీ, సరిగ్గా ఆ రోజునుంచే ఆయన స్థానంలో ఇ.ఎం.ఆర్.ఐ సీ..ఓ గా వెంకట్ చంగవల్లి నియమించబడ్డ సంగతి ఆ క్షణం వరకు గోప్యంగానే వుంచబడింది. వెంకట్ సారధ్యంలో సుధాకర్ సేవలూ కొనసాగాయి. బాలాజి, రంగారావుల సలహాలు కూడా కొంతకాలం కొనసాగాయి.

అప్పట్లో, చైర్మన్ సమీక్షా సమావేశాల్లో, వెంకట్ తో పాటు తప్పనిసరిగా, డాక్టర్ అనిల్ జంపాల, వై ఎన్ ఎస్ కిశోర్, వారణాసి సుధాకర్, డాక్టర్ ఎ పి రంగారావు, శ్రీనివాసరావు ప్రభృతులు హాజరయ్యేవారు. ఆఫీస్ కార్యకలాపాలన్నీ జూబ్లీ హిల్స్ కార్యాలయం నుంచే జరిగేవి. జులై 29, 2005 న ప్రస్తుతం వుంటున్న మేడ్చల్ రోడ్ లోని కార్యాలయంలోకి మారారు. డాక్టర్ అనిల్ జంపాల ని స్వార్థంగా సంస్థ పురోగతికి కృషి చేసే తరహా వ్యక్తని, అపారమైన నిబద్ధతతో పని చేసేవాడని, అనుభవజ్ఞుడని, ఎటువంటి పరిస్థితుల్లోను ఎవరినీ కించపరిచే స్వభావం లేనివాడని అనిల్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఇ.ఎం.ఆర్.ఐ తో సంబంధం వున్న పలువురు అంటారు. ఏ పనైనా, ఏదో విధంగా సాధించగల నేర్పరి తనం కిశోర్ కు వుంది. సుధాకర్ ఏర్పాటు చేసిన "టెక్నాలజీ టీం"-దాని లీడర్ రంగనాథం గురించి, ఆ బృందంలోని శ్రీకాంత్ - మరో ముప్పైమంది గురించి, వారు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ను నెలకొల్పిన తీరు గురించి, అత్యంత గర్వంగా-గౌరవంగా ప్రస్తావించేవారు వెంకట్. మెడికల్ ప్రోటోకాల్స్, ఎమర్జెన్సీల గుర్తింపు విధానం, గ్రామీణ ప్రాంతాల పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన విధానం లాంటి విషయాలను డాక్టర్ రంగారావు చూసేవారు. ప్రాజెక్ట్ ప్రణాళిక, సిబ్బంది నియామకం, అంబులెన్స్ డిజైన్, 108 నంబర్ కేటాయింపు లాంటి విషయాలను కిశోర్ చూసుకునేవారు. ఎంఓయు కు సంబంధించిన అంశాలు, ప్రభుత్వ సంబంధాలు, అంతర్జాతీయ సంబంధాలు-విధానాలు అనిల్ పర్యవేక్షణలో జరిగేవి. .ఎం.ఆర్.-వివిధ అంతర్జాతీయ సంస్థల మధ్య కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాలన్నీ అనిల్ చొరవతోనే జరిగాయి. డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ-ప్రయివేట్ ఆసుపత్రులతో ఒప్పందాలను కుదుర్చుకోవడానికి కృషి చేసేవారు. సత్యం సంస్థలో పనిచేసే డిజైన్ బృందం 108-అంబులెన్స్ ను డిజైన్ చేశారు. ఎస్.ఎస్. శ్రీరాం వీరికి చేదోడుగా వుండేవారు.

ఆగస్ట్ 15, 2005 న లాంఛనప్రాయంగా అంబులెన్సు సేవలను ఆరంభించాలంటే, అవి తయారు కావాలి. అంబులెన్స్ డిజైన్ లో, వైద్య పరమైన జాగ్రత్తలన్నీ డాక్టర్ రంగారావు-ఆయన సహచర వైద్యుల బృందం తీసుకుంది. 30 ఎ ఎల్ ఎస్ (అడ్వాన్స్ లైఫ్ సపోర్టింగ్), 40 బి ఎల్ ఎస్ (బేసిక్ లైఫ్ సపోర్టింగ్)  అంబులెన్సులుండాలని నిర్ణయించారు. రెండింటికి తేడా వుంది. మామూలు బజాజ్ టెంపో ట్రావెలర్ వాహనం ఆరున్నర లక్షల బేసిక్ ధరకు కొనుగోలు చేసి, తొమ్మిది లక్షల రూపాయలు ఫాబ్రికేషన్-వైద్య పరికరాల కొరకు వ్యయం చేసి, రు. 15.5 లక్షలకు అంబులెన్సును రూపొందించారు మొదట్లో. నాణ్యత పరంగా ఏ మాత్రం రాజీ పడకుండా, దరిమిలా, అదే బి ఎల్ ఎస్  అంబులెన్స్ ధరను రు. 9.75 లక్షలకు స్థిర పరిచింది ఇ.ఎం.ఆర్..

అంబులెన్స్ సేవలను ఆరంభించడానికి పక్షం రోజుల ముందర, జులై 29, 2005 న మేడ్చల్ రోడ్ లో వున్న ఒకనాటి సత్యం పబ్లిక్ స్కూల్ ఆవరణలోకి ఇ.ఎం.ఆర్.ఐ ప్రధాన కార్యాలయం మారింది. ఆ తరువాత అదే ఆవరణలో సమస్త హంగులతో తయారైన భవనంలోకి మార్చ్ 31, 2006 న మారడం జరిగింది. ఆ భవనంలోకి మారడానికి ఒక పదిహేను రోజుల ముందు నేను ఆ సంస్థలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం విభాగం చూసేందుకు లీడ్ పార్ట్ నర్ గా బాధ్యతలు చేపట్టాను. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి దయానిధి మారన్, గౌరవ అతిథిగా (దివంగత) ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి, కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు అప్పటి ఆరోగ్య-ఆర్థిక శాఖల మంత్రి (ఆ తర్వాత ముఖ్యమంత్రి) రోశయ్య వచ్చారు. ప్రధాన కార్యదర్శి మోహన్ కందా కూడా వచ్చారు. హైదరాబాద్ గ్రాండ్ కాకతీయ హోటల్ లో భారీ సంఖ్యలో హాజరయిన ఆహుతుల సమక్షంలో, ఆగస్ట్ 15, 2005 , ఆద్య తన భవిష్యత్ లో, లక్షలాది ప్రాణాలను కాపాడనున్న అత్యవసర ఆరోగ్య, వైద్య-పోలీసు-అగ్నిమాపక దళ సహాయ సేవలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. కేవలం పదిహేను అంబులెన్సులతో ఆరంభమయిన ఆ సేవలు, అచిర కాలంలోనే, దేశంలోని పది రాష్ట్రాలలో సుమారు నాలుగు వేలకు పైగా అంబులెన్సులను ప్రవేశ పెట్టడానికి దారితీసింది. ఆంధ్ర ప్రదేశ్ తో సహా ఆ పది రాష్ట్రాలలో ఇ.ఎం.ఆర్.ఐ సేవలందించడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకోవడంలో నా పాత్ర కూడా వున్నందుకు ఇప్పటికీ గర్వంగా వుంది.

సంస్థ ఎదుగుదలకు అహర్నిశలూ కృషి చేసిన వారెందరో వున్నారు. మొట్ట మొదట గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి డాక్టర్ అనిల్ జంపాల. అమెరికా వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగులో పి.హెచ్.డి , సియాటిల్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.బి.ఏ పట్టాలు పొందిన అనిల్, ఎమర్జెన్సీ మెడిసిన్ కి చెందిన అమెరికన్ సంస్థల్లో, తత్సంబంధమైన సాఫ్ట్ వేర్ విభాగాల్లో పనిచేసిన అనుభవం అపారంగా వుంది. .ఎం.ఆర్.ఐ కి సాంకేతిక భాగస్వామ్యంతో సాఫ్ట్ వేర్ ను రూపొందించిన సత్యం కంప్యూటర్స్ లో వైస్ ప్రెసిడెంట్ స్థాయి ఉద్యోగిగా పనిచేస్తున్న అనిల్ అనుభవాన్ని, చైర్మన్ రాజు, .ఎం.ఆర్.ఐ లో వినియోగించుకోవాలని భావించారు. వెంకట్ కన్నా ఏడాది ముందు నుంచే వారణాసి సుధాకర్, డాక్టర్ రంగారావు, డాక్టర్ బాలాజిల ఉమ్మడి పర్యవేక్షణలో సంస్థ రూపు దిద్దుకుంటున్న రోజుల్లో, అనిల్ కూడా ప్రధాన భూమిక నిర్వహించారు. .ఎం.ఆర్.ఐ వర్కింగ్ మోడల్ రూపకల్పనలో ఆయన కృషి చాలా వుంది. .ఎం.ఆర్.ఐ టెక్నాలజీ విభాగానికి, ఆపరేషన్స్ విభాగానికి నాయకత్వం వహించడమే కాకుండా, దేశ-విదేశాల్లోని పేరెన్నికగన్న పలు జాతీయ-అంతర్జాతీయ సంస్థలతో, ఒకరి అనుభవాలను మరొకరు పంచుకునేందుకు, ఆయా సంస్థలతో అవగాహనా ఒప్పందాలు కుదిరించిన ఏకైక వ్యక్తి అనిల్ జంపాల. అంతర్జాతీయంగా ఇ.ఎం.ఆర్.ఐ సారధ్యంలోని 108-అత్యవసర సహాయ సేవలకు గుర్తింపు రావడానికి అనిల్ కృషి మరువలేనిది. అంతర్జాతీయంగా ఆయన ద్వారా లభించిన గుర్తింపు వల్లే, దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సేవలను ప్రారంభించాయి. ఇప్పుడు ఆయన అమెరికాలో స్థిరపడ్డారు.


మా ఆత్మీయ కలయికలో నాతో సహా డాక్టర్ రంగారావు, అనిల్, బాలాజి, వారణాసి, శ్రీనివాస రావు, కొండపి, విజయ్, శ్రీకాంత్, దయాకర్, రంగనాథ్, శ్రీరాం, గోపాల్, భండారు, ఏకే రావు, కిషోర్...తదితరులు పాల్గొన్నారు. శ్రీరాం పుట్టిన రోజు కూడా జరిపాం.

No comments:

Post a Comment