Sunday, November 1, 2015

మార్క్స్ లాంటి మహా మహానుభావులు కారణజన్ములే : వనం జ్వాలా నరసింహా రావు

మార్క్స్ లాంటి మహా మహానుభావులు కారణజన్ములే
వనం జ్వాలా నరసింహా రావు
నవ తెలంగాణ దినపత్రిక వేదిక (02-11-2015)

ఆధునిక ప్రపంచంలో మానవ విలువలకు నూటికి నూరుపాళ్లు అద్దంపట్టిన అతి గొప్ప సిద్ధాంతం "మార్క్సిజం-కమ్యూనిజం".

సాహిత్యానికీ, మానవ విలువలకూ, ఛాందసత్వానికీ, కమ్యూనిజానికీ, గతితార్కిక భౌతిక వాదానికీ, కర్మ సిద్ధాంతానికీ ఏదో ఒకరకమైన, అనిర్వచనీయమైన, విడదీయరాని అనుబంధం వుందేమో అనిపిస్తుంది. హిందూత్వం అనేది మతం అయినా, కాకపోయినా, మనిషి జీవించడానికి తగినటువంటి ఆదర్శమైన జీవనవిధానం. అలాగే, ఆధునిక ప్రపంచంలో మానవ విలువలకు నూటికి నూరుపాళ్లు అద్దంపట్టిన అతి గొప్ప సిద్ధాంతం "మార్క్సిజం-కమ్యూనిజం". హిందూత్వ కర్మ సిద్ధాంతం ప్రకారం,  సకల చరాచర ప్రపంచమంతటికీ, భూతకాలంలో జరిగిన దానికీ, వర్తమానంలో జరుగుతున్న దానికీ, భవిష్యత్ లో జరగబోయే దానికీ, కర్త-కర్మ-క్రియ ఒక్కడే.  పనిని, ఎప్పుడు-ఎలా-ఎవరి ద్వారా జరిపించాలో, జరిగినదాని పర్యవసానం ఏమిటో, లాభ నష్టాలేంటోనన్న విషయాలను నిర్ణయించే అధికారం ఒకే ఒక్కరికి వుంది. అంటే, ఎవరో ఒక "జగన్నాటక సూత్రధారి" స్వయంగా రచించి, నిర్మించి, దర్శకత్వం వహించిన భారీ సెట్టింగుల నిడివిలేని అద్భుతమైన నాటకంలో, సకల చరాచర ప్రపంచంలోని జీవ-నిర్జీవ రాసులన్నీ తమవంతు పాత్ర పోషించాయి. 

"ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగేయుగే" అన్న వేదవాక్కు ప్రకారం, కార్ల్ మార్క్స్ లాంటి మహా మహానుభావులు-కారణజన్ములు-గొప్ప ఆలోచనాపరులు, అవనిలో అరుదుగా అవతరిస్తుంటారు. పెట్టుబడిదారీ ధన స్వామ్య-భూస్వామ్య వ్యవస్థ అనుసరించే దోపిడీ విధానాన్ని, వక్రమార్గంలో అది అభివృద్ధి చెందడాన్ని అన్ని కోణాల్లోంచి విశ్లేషణ చేసేందుకు, పరిణామక్రమంలో శ్రామికవర్గ నియంతృత్వం స్థాపించబడి, ఒకనాటి దోపిడీ వ్యవస్థే సామ్యవాద వ్యవస్థగా మార్పు చెందనున్నదని చెప్పేందుకు కార్ల్ మార్క్స్ తన కమ్యూనిస్ట్ సాహిత్యంలో ప్రాధాన్యమిచ్చాడు. ఒక వైపు అలా ప్రాధాన్యమిచ్చినప్పటికీ, ఆయన రాసిన ప్రతి అక్షరంలో మానవతా విలువలే ప్రతిబింబిస్తాయి. అరిస్టాటిల్ నుండి ఆయన తరం వరకు వేళ్లూనుకుంటూ వస్తున్న సామాజిక విశ్వాసాలను-విజ్ఞానాన్ని కూలంకషంగా సంశ్లేషణ చేయడానికి మార్క్స్ చేసిన ప్రయత్నంలో, స్వయం ప్రతిభతో నిండిన ఆయన ఆలోచనా ధోరణి ప్రస్ఫుటమౌతుంది. ఏ విధమైన పరిస్థితులుంటే మానవాభివృద్ధి సుసాధ్యమవుతుందన్న అంశాన్ని అందరికీ విశద పర్చాలన్న ఆతృత-ఆందోళన మార్క్స్ రచనల్లో-సాహిత్యంలో అణువణువునా దర్శనమిస్తుంది. ప్రతివ్యక్తి స్వేచ్ఛగా అభివృద్ధి చెందడంలోనే ఇతర వ్యక్తులందరి అభివృద్ధి సాధ్యపడి, తద్వారా సామాజికాభివృద్ధి జరిగేందుకు వీలవుతుందని, ఆ ప్రక్రియను వేగవంతం చేయాలనీ మార్క్స్ భావిస్తాడు. హేతుబద్ధ ప్రణాళిక-సహకార ఉత్పత్తి-పంపిణీలో సమాన వాటాల ఆధారంగా, అన్నిరకాల రాజకీయ-సామాజిక-ఉద్యోగ స్వామ్య అధికార క్రమానికి దూరంగా వుండే, ప్రజాస్వామ్య-లౌకిక వ్యవస్థ ఏర్పాటై తీరుతుందని మార్క్స్ నిర్ధారిత సిద్ధాంతంలో పేర్కొంటాడు. మార్క్స్ జీవించిన రోజుల నాటి ప్రపంచంలో-ఆ మాటకొస్తే ఇప్పటికీ, ఎప్పటికీ, మన చుట్టూ జరుగుతున్న వాస్తవాలకు-యదార్థ సంఘటనలకు అద్దంపట్టే తాత్త్విక-సామాజిక మార్గమే ఆయన ప్రవచించిన గతి తార్కిక భౌతికవాదం.


ఆ సిద్ధాంతాన్ని అన్వయిస్తూ, మానవ విలువలను-మానవాళి చరిత్రను మార్క్సిజం విశదీకరించే ప్రయత్నం చేసింది. మనుషుల మానసిక-ఆధ్యాత్మిక జీవనశైలి, ఆలోచనా సరళి, జీవిత లక్ష్యం-గమనం వారి-వారి మనుగడకు, సహజీవనానికి అవసరమైన భౌతిక పరిస్థితులపైనే ఆధారపడి వుంటాయి. మానవుడు తను బ్రతకడానికి అవసరమైన వాటిని ఉత్పత్తి చేసుకునేందుకు, ఎవరెవరితో, ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవాలనే దానిపైనే సమాజంలో వర్గాలు ఏర్పడతాయి. వీటికి అనుకూలమైన ఆర్థిక ప్రాతిపదికపైనే, సామాజిక-రాజకీయ సంస్థలకు-వ్యవస్థలకు అనుకూలమైన ఆలోచనల నిర్మాణ స్వరూపం ఏర్పాటవుతుంది. అందువల్లే వర్గపోరాటాల చరిత్రే సామాజిక చరిత్రంటాడు మార్క్స్. ఒక మజిలీ, లేదా దశ నుండి, దానికి పూర్తిగా విరుద్ధమైన వ్యతిరేక మజిలీకి, దశకు చరిత్ర పయనించి, సంశ్లేషణ దశలో ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడే శ్రామిక రాజ్య ఆధారితమైన వ్యవస్థ ఏర్పాటవుతుంది. కాకపోతే, ఈ విధమైన మార్పు జరగాలంటే, ఆద్యంతం విరుద్ధ-విభిన్న మార్గాలలో పయనించడం, విరుద్ధ-విభిన్న అంశాలను ఎదుర్కోవడం, ఒత్తిళ్లను-సంఘర్షణలను తట్టుకోవడం తప్పనిసరి. అంటే, సమాజంలోని వైరుధ్యాలే సంఘర్షణలకు దారితీసి, ప్రజా వ్యతిరేక వ్యవస్థను కూల దోసి, శ్రామిక రాజ్యస్థాపన ద్వారా వర్గ భేదాలు లేని సమసమాజ వ్యవస్థ ఏర్పాటవుతుందని మార్క్సిజం చెప్తుంది.

హిందూత్వ కర్మ సిద్ధాంతం ప్రకారం, ఒక "జగన్నాటక సూత్రధారి" స్వయంగా రచించి, నిర్మించి, దర్శకత్వం వహించిన భారీ సెట్టింగుల నిడివిలేని అద్భుతమైన నాటకంలో, సకల చరాచర ప్రపంచంలోని జీవ-నిర్జీవ రాసులన్నీ తమవంతు పాత్ర పోషించాలని చెప్పిన విషయాన్ని నిశితంగా పరిశీలిస్తే, కార్ల్ మార్క్స్ నిర్థారితవాద సిద్ధాంతంలో కూడా ఇలాంటి అంశాలే కనిపిస్తాయి. ఆయన కలలు కన్న కార్మిక రాజ్య స్థాపన పూర్వ రంగంలో "నిరంకుశ, భూస్వామ్య, ధన స్వామ్య వ్యవస్థ" కు వ్యతిరేకంగా శ్రామికవర్గం పోరాడుతుందని, దరిమిలా విజయం సాధిస్తుందనీ, ముందున్న వ్యవస్థ కూలిపోతుందని, శ్రామికవర్గ నియంతృత్వం స్థాపించబడుతుందని, కుల-మత-వర్గ-పేద-ధనిక తేడాలు సమసిపోతాయని మార్క్స్ జోస్యం చెప్పాడు. హిందూత్వ కర్మ సిద్ధాంతంలో మాదిరిగానే, జరిగినదానిని (భూతకాలం) విశ్లేషించి, జరుగుతున్నదానిని (వర్తమానకాలం) వ్యతిరేకించి, జరగాల్సినదాన్ని (భవిష్యత్ కాలం) ముందుగానే నిర్ణయించాడు. తన సిద్ధాంత ధోరణైన గతితార్కిక భౌతిక వాదాన్ని "యాంటీ థీసిస్‌, థీసిస్‌, సింథసిస్" అని పిలిచాడు. ఒకరకమైన "కర్త, కర్మ, క్రియ" అనొచ్చేమో. ఈ సిద్ధాంత సృష్టికర్త కార్ల్ మార్క్స్, వేళ్లూనుకున్న వ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతుందని భావించిన వర్గపోరాటంలో, ఎవరి పాత్ర ఏమిటో ఆయనే నిర్దారించాడు. పాత్రను పోషించే విధానం కూడా ఆయనే వివరించాడు. కార్మిక-కర్షక రాజ్య స్థాపన తదనంతర పరిణామాలెలా వుండాలో, వుండబోతాయో కూడా ఆయనే నిర్ణయించాడు. ఆరంభం, అంతం అంతా కర్మ సిద్ధాంతంలో మాదిరిగానే, నిర్ణయించిన విధంగానే జరుగుతుందని తన సిద్ధాంతంలో చెప్పాడు. ఆయన చెప్పినట్లే చాలావరకు జరిగిందికూడా. చూసారా! మనం నమ్ముతున్న కర్మ సిద్ధాంతానికి మార్క్స్ చెప్పిన దానికి ఎంత పోలికో!

మార్క్స్ ప్రవచనాలకు, తదనుగుణంగా సంభవించిన సోవియట్ రష్యా- చైనా విప్లవానికి, శ్రామిక రాజ్య స్థాపన జరగడానికి వేలాది సంవత్సరాల పూర్వమే, వాల్మీకి మహర్షి సంస్కృతంలో రామాయణం రచించాడు. వాల్మీకి రచించిన రామాయణం సృష్టికర్తైన బ్రహ్మ ప్రేరణతోనే జరిగింది, అంటే జగన్నాటక సూత్రధారి అనుమతితోనే కదా. రామాయణంలోని పాత్రలను, చేయబోయే పనులను ముందుగానే యోగదృష్టితో కనిపెట్టాడు వాల్మీకి. శ్రీరామచంద్రమూర్తిని దైవంగా, మహావిష్ణువు అంశగా, జరగబోయే దాన్ని వివరంగా, రామాయణ గాధగా లోకానికి తెలియచెప్పాడు. శ్రీరామచంద్రమూర్తి త్రేతాయుగంలో జన్మించి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి, ధర్మ సంస్థాపన చేసేందుకు అవతరించాడని తెలియచేసేదే రామాయణ కథ. శ్రీమహావిష్ణువుకు అత్యంత ఆప్తుడిగా, భక్తుడిగా, కాపలాదారుడిగా వుండే వ్యక్తి దైవా(ను)గ్రహానికి గురై, శ్రీరాముడికి శత్రువుగా, రావణాసురుడనే రాక్షసుడిగా పుట్టబోతున్నాడని ముందే ఊహించి రాశాడు వాల్మీకి.

మార్క్స్ గతితార్కిక-నిర్ధారిత సిద్ధాంతంలో పేర్లు లేకపోయినా, రష్యా-చైనాలో జరిగిన విప్లవాలకు నాయకత్వం వహించిన లెనిన్, మావోలు మార్క్స్ పరిభాషలోని శ్రీరామచంద్రుడి లాంటి వారే. రష్యా నిరంకుశ రాజు జార్ చక్రవర్తి, చైనా చాంగ్-కై-షెక్ లు రావణాసురుడిలాంటి రాక్షసులు. మార్క్స్ పరిభాషలోని నిరంకుశ-భూస్వామ్య-ధన స్వామ్య వ్యవస్థకు అధినేతైన మహా బలవంతుడు-రాక్షసరాజు రావణాసురుడు, "శ్రామిక వర్గం" లాంటి బలహీన శక్తులైన నర వానరుల కూటమి ఉమ్మడి పోరాటంలో ఓటమి పాలయ్యాడు. కూటమిని విజయపథంలో నడిపించింది నాయకత్వ లక్షణాలున్న యుద్ధ కోవిదుడు శ్రీరామచంద్రుడు. ఆయనకు తోడ్పడింది తమ్ముడు లక్ష్మణుడు, ఆచార్య లక్షణాలున్న హనుమంతుడిని ఏంగిల్స్ తో పోల్చవచ్చు. మార్క్స్ పరిభాషలో చెప్పుకోవాలంటే: మావో, లెనిన్, చౌ-ఎన్-లై, స్టాలిన్ కోవకు చెందినవారు. మార్క్స్ చెప్పిన "యాంటీ థీసిస్‌, థీసిస్‌, సింథసిస్" రామ రావణ యుద్ధంలోనూ అన్వయించుకోవచ్చు. మార్క్స్ కోరుకున్న "శ్రామిక-కార్మిక-కర్షక" రాజ్యమే రావణ వధానంతరం ఏర్పడిన "రామ రాజ్యం". కాకపోతే మార్క్స్ చెప్పడానికి వేలాది సంవత్సరాల క్రితమే వాల్మీకి చెప్పాడు.మానవతావాదం అనాదిగా సాగుతున్న ఒక మహోద్యమం. విజ్ఞాన సముపార్జనకవసరమైన సూక్ష్మాతిసూక్ష్మ విషయాలకు సంబంధించిన ప్రతి అంశం, సంస్కృతీ-సాహిత్యాల సాంప్రదాయిక నేపధ్యం మీదనే ఆధారపడి వుండే రీతిలోనే మానవతావాద ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. మేధావులు, సాహిత్యాభిలాషులు, శాస్త్రీయ దృక్ఫధంతో ఆలోచన చేసిన పలువురు, శతాబ్దాల పూర్వమే, మానవ విలువల పరిరక్షణకు ఆరంభించిన మహోద్యమం నాటికీ ప్రత్యక్షంగా-పరోక్షంగా వాటిని కాపాడేందుకు దోహదపడుతూనే వుంది. క్రైస్తవమత మానవతావాదమనీ, సాంస్కృతిక మానవతావాదమనీ, సాహితీ మానవతావాదమనీ, రాజకీయపరమైన మానవతావాదమనీ, మతపరమైన మానవతావాదమనీ రకరకాల పేర్లతో-ఎవరికి నచ్చిన విధంగా వారు పిలువసాగారు. రామరాజ్యమైనా, గ్రామరాజ్యమైనా, కార్మికరాజ్యమైనా, శ్రామికరాజ్యమైనా.. .. ... ... మానవతా దృక్పథం కలిగిందైతేనే, మానవ విలువలకు అర్థముంటుంది. అలా కానప్పుడు, ఏదో ఒక రూపంలో, మానవ విలువలు కాపాడబడేందుకు నిరంతర పోరాటం జరుగుతూనే వుంటుంది.  పోరాటానికి మొదలు-చివర అంటూ ఏమీలేదు. సాహిత్యానికీ, మానవ విలువలకూ విడదీయని అనుబంధం వుందనీ, వుండితీరాలనీ నా భావన. End

1 comment:

  1. మార్క్స్ సిద్దాంతాన్ని ఒక మత సిద్దాంత స్తాయికి దిగజార్చారు. మీలాంటి కుహనా అల్పమనస్కులు గతంలొనూ కొంతమంది చేశారు.

    ReplyDelete