Saturday, November 16, 2019

మాజీ ఐఏఎస్ స్వర్గీయ చంద్రమౌళితో అనుబంధం .... వనం జ్వాలా నరసింహారావు


మాజీ ఐఏఎస్ స్వర్గీయ చంద్రమౌళితో అనుబంధం  
వనం జ్వాలా నరసింహారావు

“చంద్రమౌళి స్పీకింగ్....యీజ్ జ్వాలా దేర్?” అని ఫోన్లో కంచు గొంతుకతో అడిగే  మాజీ ఐఏఎస్ అధికారి శాశ్వతంగా కన్నుమూశారు. బుధవారం నవంబర్ 13 న హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారాయన. ఆయన మృతికి గవర్నర్ తమిలిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సంతాపం తెలియచేశారు. ఎనబైరెండు సంవత్సరాలు జీవించిన ఆ బడుగుజన బాంధవుడు, బలహీనవర్గాల పెన్నిధి చివరి రోజుల్లో ఆనారోగ్యానికి గురైనందున ఆయన్ను కలవడానికి వెళ్లే నాలాంటి ఆయన సన్నిహితులతో ఎక్కువగా సంభాషణ చేయలేకపోయేవారు. చివరిసారిగా ఆయన్ను నేను ఏడాది క్రితం స్వర్గీయ డాక్టర్ ఏపీ రంగారావు (రంగారావుకు కాన్సర్ రావడంతో ఇక ఎక్కువకాలం బతకనని చంద్రమౌళి గారిని కలవడానికి వెళ్లాడు) తో కలసి వెళ్ళినప్పుడు ఒకింత బాధ కలిగింది. ఉద్యోగం చేసినంత కాలం, అది ఏ ఉద్యోగం అయినా సరే, ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా, ఎవరికో ఒకరికి ఏదో ఒక విధంగా సహాయ పడాలనే ఆర్భాటంతో, నవ్వుతూ-నవ్విస్తూ, వివిధ రకాలుగా ప్రతివార్నీ ప్రోత్సహిస్తూ వుండే చంద్రమౌళి ఆయనేనా అని బాధకలిగింది.

   డాక్టర్ వి చంద్రమౌళి 1937 సంవత్సరంలో తమిళనాడులో జన్మించారు. ఎంఏ ఆర్థికశాస్త్రంలో గోల్డ్ మెడలిస్ట్. హిస్టరీలో కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్. సోషల్ యాంత్రపాలజీలో డాక్టరేట్ పొందారు. రెండు సంవత్సరాలు మద్రాస్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారిగా 33 సంవత్సరాలు వివిధ హోదాల్లో పనిచేశారు. వాటిలో రెవెన్యూ పాలన, గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖ, ఆహార-పౌర సరఫరాల శాఖ, కార్మిక సంక్షేమ శాఖలున్నాయి. గవర్నర్ కార్యదర్శిగా శంకర్ దయాళ్ శర్మ దగ్గర, కుముద్ బెన్ జోషి దగ్గర పనిచేశారు. అదే రోజుల్లో భారత రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్ర ప్రదేశ్ విభాగానికి చైర్మన్ గా కూడా వున్నారు. ఆంగ్లంలో తొమ్మిది పుస్తకాలు రాశారు. వాటిలో మూడు పుస్తకాలకు (హైదరాబాద్, చెన్నై, గోవా) నేను సహరచయితను. అప్పట్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ గా వ్యవహరించబడ్డ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధిసంస్థలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో డైరెక్టర్ జనరల్ గా ఆయన 1995 లో పదవీ విరమణ చేశారు.

చంద్రమౌళి గారిని మా బంధువు డాక్టర్ రంగారావు ద్వారా 1984-85 సంవత్సరంలో మొదటిసారిగా కలిశాను. అప్పట్లో ఆయన సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా, డాక్టర్ రంగారావు వికలాంగుల కార్పోరేషన్ ఎండీగా పనిచేసేవారు. ఎన్టీరామారావు అప్పట్లో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. హైదరాబాద్ లో అప్పట్లో నెలకొల్పిన ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హాండీకాప్డ్’ (ఎన్ఐఎంహెచ్) కు చంద్రమౌళి సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి హోదాలో ప్రత్యేక అధికారిగా, డాక్టర్ రంగారావు తాత్కాలిక ఎండీగా ప్రభుత్వం నియమించింది. ఎన్ఐఎంహెచ్ లో ఒక ‘డాక్యుమెంటేషన్ కమ్ లైబ్రరీ’ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో దానికి అవసరమైన ప్రాజెక్టు రిపోర్టును తయారుచేయమని అప్పట్లో బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో లైబ్రేరియన్ గా పనిచేస్తున్న నన్ను అడిగారు చంద్రమౌళి, రంగారావులు. నేను తయారు చేసిన తరువాత బాగుందని అంటూ, ఆ ఉద్యోగం నాకిస్తామని చెప్పారు. తర్వాత పత్రికలో ప్రకటన చేయడం, నాకన్నా ఎక్కువ అర్హతలున్న నా లైబ్రరీ సైన్స్ క్లాస్మేట్ హరికృష్ణరెడ్డికి ఆ ఉద్యోగం రావడం జరిగింది. అలా చంద్రమౌళి గారితో ఐన పరిచయం ఆయన చనిపోయేదాకా కొనసాగింది.

నాకు ఎన్ఐఎంహెచ్ లో ఉద్యోగం ఇవ్వలేకపోయాననే భావన చంద్రమౌలిగారిలో వుండేది. నవంబర్ 1985 లో శంకర్ దయాళ్ శర్మ స్థానంలో కుముద్ బెన్ జోషి గవర్నర్ గా నియామకం కావడంతో చంద్రమౌళి బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో లైబ్రేరియన్ గా పనిచేస్తున్న నాకు రాజ్ భవన్లో ఉద్యోగం ఇప్పించడానికి నిర్ణయించుకున్నారు. కుముద్ బెన్ జోషి, అంతకు ఏడేళ్ళ ల్రితం శారదా ముఖర్జీ గవర్నర్ గా వున్నప్పుడు స్థాపించిన చేతన స్వచ్ఛంద సంస్థను పునరుద్ధరించడంతో పాటు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ (నీసా) అనే మరో స్వచ్ఛంద సంస్థను స్థాపించి, పలు కార్యక్రమాలను చేపట్టారు. చేతన స్వచ్ఛంద సంస్థలో నన్ను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా నియమించారు చంద్రమౌళి. వాస్తవానికి నాకు అప్పగించిన పనుల్లో రాజ్ భవన్ లైబ్రరీ పునరుద్ధరణ కూడా వుంది. చంద్రమౌళి గారు నన్ను తక్షణమే రిలీవ్ చేయాలని, నా సేవలు అత్యంత ముఖ్యమని బీహెచ్ఇఎల్ అధికారులకు చెప్పడంతో నేను అక్కడ రిలీవ్ అయి రాజ్ భవన్లో జనవరి 1, 1986 న కొత్త ఉద్యోగంలో చేరాను. చేరిన కొద్దిరోజులకే రాజ్ భవన్ క్వార్టర్స్ లో నాకు ఇల్లు కూడా కేటాయించారు. కారణాంతరాల వల్ల నన్ను ఆ ఇల్లు ఖాళీ చేయమని కుముద్ బెన్ జోషి తరువాత వచ్చిన గవర్నర్ కృష్ణకాంత్ నన్ను అదేశించినప్పుడు ఆయన ఆదేశాలను నేను హైకోర్టులో సవాలు చేసిన సందర్భంలో చంద్రమౌళి నాకు ఎంతగానో సహాయ పడ్డారు. నా అఫిడవిట్ మొత్తం ఆయన సూచనతోనే రూపొందించుకున్నాను. 


చంద్రమౌళి రాజ్ భవన్లో అన్నీ ఆయనే. గవర్నర్ కుముద్ బెన్ జోషికి ఆయన సలహాలు, సూచనలు చాలా ఇష్టం. ఆమె చంద్రమౌళికి అమితమైన గౌరవం ఇచ్చేది. ‘నీసా స్వచ్ఛంద సంస్థ ఆరంభించడంలో, ‘చేతన’ స్వచ్ఛంద సంస్థను పునరుద్ధరించడంలో ఆయన పాత్ర కీలకం. ఆ రెండు సంస్థల ద్వారా చేసిన కొన్ని కార్యకలాపాలు ఇప్పటికీ గుర్తున్నాయి. జోగినీ వ్యవస్థ రూపుమాపడానికి నీసా ద్వారా చేసిన కృషిలో భాగంగా చంద్రమౌళి చొరవతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వర్ణిలో లవణం, హేమలతా లవణంల తోడ్పాటుతో “చెల్లి నిలయం” కార్యాచరణ వ్యవస్థ ఏర్పాటు, దరిమిలా రాజ్ భవన్ దర్బార్ హాలులో నాటి సీఎం ఎన్టీఆర్, కేంద్ర మంత్రి జలగం వెంగళరావు,  గవర్నర్ కుముద్ బెన్ జోషి సమక్షంలో ముగ్గురు జోగిన్ల వివాహం, ధిల్లీలో జోగిన్ల సంక్షేమం మీద జాతీయ స్థాయి సదస్సు నిర్వహించడం జరిగింది. రెడ్ క్రాస్ సంస్థ ద్వారా వరద బాధితులకు సహాయం, వయోధికాశ్రామం ఏర్పాటు, ఉద్యమంలాగా మొక్కలు నాటడం, భారత-పాకిస్తాన్ బెనిఫిషరీ క్రికెట్ మాచ్ లాంటివి చంద్రమౌళి చొరవతోనే జరిగాయి. అలాగే ‘చేతన’ స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టడం చంద్రమౌళి పుణ్యమే. అప్పటి పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఎవరోకాదు, నేటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఆ క్రికెట్ మాచ్ నిర్వహణలో మాజీమంత్రి గీతారెడ్డి, నేను చురుగ్గా పాల్గొన్నాం.

ఒకసారి ‘చేతన’ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న ఒక డ్రైవర్ రాజ్ భవన్ క్వార్టర్లలో నివసిస్తున్నప్పటికీ, తనకు 24 గంటలు పని వున్నందున అదనంగా హెచ్ఆర్ఏ (ఇంటి అద్దె అలవెన్స్) ఇవ్వమని అభ్యర్థించాడు. దానికి ఆమోదిస్తూ చంద్రమౌళి హెచ్ఆర్ఏ అంటే “హార్డ్షిప్ రెమ్యూనరేటివ్ అలవెన్స్” అని భాష్యం చెప్పారు. సహాయం చేయాలనుకుంటే ఎన్నో మార్గాలనేవారాయన. ఆయన వ్యక్తులకే కాకుండా ఎన్నో సంస్థలకు సహాయం అడక్కుండా చేశాడు. ఐఏఎస్ ఎస్ఆర్ శంకరన్ కు చంద్రమౌళి అంటే చాలా ఇష్టం.

చంద్రమౌళి ఎక్కడ ఉద్యోగం చేసినా నన్ను అక్కడికి ఎదో ఒక కారణంతో డిప్యుటేషన్ మీద తీసుకెళ్ళేవారు. రాజ్ భవన్ లో ఉద్యోగం చేస్తున్నప్పుడే డిప్యుటేషన్ మీద మర్రి చెన్నారెడ్డి దగ్గర పీఆర్వోగా పనిచేసి, టర్మ్ అయిన తరువాత వెనక్కు వస్తే అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ పుణ్యమా అని నా ఉద్యోగం పోతే, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా వున్న చంద్రమౌళి తన శాఖ పరిధిలోని హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీ గాయత్రి రామచంద్రన్ కు చెప్పి సీనియర్ మానేజర్ గా ఉద్యోగం ఇప్పించారు. ఇండస్ట్రీస్ కార్యదర్శిగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులో సుమారు మూడెకరాల భూమిని హస్తకళల అభివృద్ధి సంస్థకు కేటాయించారు ఆయన. అక్కడే ఇప్పుడు మనకు కనిపిస్తున్న (ఇప్పటి మార్కెట్ విలువ ప్రకారం) సుమారు వంద కోట్లకు పైగా విలువ చేసే గోల్కొండ హస్తకళల ఎంపోరియం కట్టడం జరిగింది.

హస్తకళల అభివృద్ధి సంస్థలో నేను పనిచేస్తున్నప్పుడే నాలుగేళ్ల తరువాత ఆయన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థకు డీజీగా వెళ్లడం, వెళ్ళిన కొన్నాళ్ళకే నన్ను అక్కడికి ఫాకల్టీ మెంబర్ గా డిప్యుటేషన్ మీద తీసుకుపోవడం జరిగింది. ఆ సంస్థ అభివృద్ధికి ఆయన రోజుల్లోనే అంకురార్పణ జరిగింది. ఇప్పుడున్న హాస్టల్, గెస్ట్ హౌజ్ భవనాల శంఖుస్థాపన ఆయన హయాంలోనే జరిగింది. అలాగే ఆయన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉన్నతాధికారిగా వున్నప్పుడు ప్రస్తుతం వున్న ఆ కార్యాలయ భవన సముదాయాన్ని కట్టించాడు. నిబంధనలకు విరుద్ధంగా కట్టించాడని ఆయన్ను ఆక్షేపించిన వారు కూడాలేకపోలేదు. కడప కలెక్టర్ గా ఆయన చేసిన సేవలు ఇప్పటికీ అక్కడి ప్రజలు గుర్తుంచుకుంటారు.

నిబద్ధతకు, నిజాయితీకి, సామర్థ్యానికి, నైపుణ్యానికి, బడుగు-బలహీన వర్గాలవారికి అండగా వుండడానికి స్వర్గీయ చంద్రమౌళి పర్యాయపదం అంటే అతిశయోక్తి కాదేమో!     

1 comment: