Sunday, May 22, 2022

పదకొండవ రోజు యుద్ధం, ద్రోణాచార్యుడు సర్వసేనాధిపతిగా మొదటిరోజు : ఆస్వాదన-72 : వనం జ్వాలా నరసింహారావు

 పదకొండవ రోజు యుద్ధం, ద్రోణాచార్యుడు సర్వసేనాధిపతిగా మొదటిరోజు

ఆస్వాదన-72

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధం (22-02-2022)

భీష్ముడు పదవరోజు జరిగిన యుద్ధంలో రణరంగం నుండి తొలగి పోయిన తరువాత కౌరవ వర్గం మళ్లీ ఎవరిని సేనాపతిగా నియమించాలని, పరాక్రమంలో సాటిలేని పాండవ సైన్యాన్ని ఎలా ఎదుర్కోవాలని ఆలోచన చేసింది. భీష్ముడు శరతల్పగతుడై దేవత్వాన్ని పొందిన సందర్భంలో ఆయన చెప్పిన మంచి మాటలు కౌరవులు పట్టించుకోకుండా అక్కడి నుండి లేచి వెళ్లిపోయారు. ఆ నేపధ్యంలో దుర్యోధనుడి దగ్గరకు వచ్చిన కౌరవ పక్షానికి చెందిన రాజులు కర్ణుడు ఇకనైనా యుద్ధరంగానికి వస్తే బాగుంటుందని ఆయనతో అన్నారు. అంతా ఒక విధంగా కర్ణుడిని తలచుకున్నారు.

హస్తినాపురం నుండి కర్ణుడు దుర్యోధనుడి దగ్గరకు వచ్చాడు. భీష్ముడిని తలచుకుని కర్ణుడు విచారగ్రస్తుడయ్యాడు. కన్నీరు కారుస్తూ ఏడ్చి, తనను తాను ఓదార్చుకున్నాడు. తాను చెదిరిపోయిన కౌరవ సైన్యాన్ని కాపాడుతానని, అర్జునుడి పూనికను ప్రతిఘటిస్తానని, భీష్ముడు ఏవిధంగా శౌర్యంతో ప్రకాశించాడో అట్లాగే తానూ తన భుజబలాన్ని ప్రదర్శిస్తానని అన్నాడు కర్ణుడు. ఒకవేళ తాను పాండవులను జయించలేకపోతే సంతోషంగా వీరస్వర్గాన్ని అలంకరిస్తానని చెప్పాడు. అలా అంటూ తన సారథితో రథాన్ని సిద్ధం చేయమన్నాడు. రథం ఎక్కి కర్ణుడు దుర్యోధనుడికి నమస్కారం చేసి భీష్ముడు వున్న చోటుకు వచ్చాడు. శరతల్పగతుడైన ఆ మహానుభావుడికి నమస్కరించాడు. భీష్ముడు ఆజ్ఞాపిస్తే దివ్యాస్త్రోపేతుడైన అర్జునుడి బాహుగర్వాన్ని తానొక్కడినే తన అస్త్ర శస్త్ర విద్యా నైపుణ్యంతో అణచివేస్తానని అన్నాడు. ఆర్జునుడిని ఓడించడానికి తనను యుద్ధరంగానికి పంపమని భీష్ముడిని అడిగాడు కర్ణుడు.

జవాబుగా, దుర్యోధనుడి రాజ్య రక్షణ భారం ఇక కర్ణుడి మీదే వున్నదని అతడు తెలుసుకోవాలని, కర్ణుడి క్షేమాన్ని తానెప్పుడూ కోరుతానని, కౌరవులను ముందుకు నడిపించి ఆ మహారాజుకు విజయం చేకూర్చమని భీష్ముడు కర్ణుడితో అనగానే, కర్ణుడు సంతోషంతో భీష్ముడి పాదాల మీద శిరస్సు మోపి నమస్కరించి, సెలవు తీసుకున్నాడు. ఆ తరువాత కర్ణుడు యుద్ధ భారాన్ని స్వయంగా తన మీద మోపుకున్నాడు. చతురంగ బలాలను సంఘటితపరచాడు. ఆ సమయంలో దుర్యోధనుడు తన రథాన్ని కర్ణుడి దగ్గరకు పోనిచ్చాడు. భవిష్యత్ కార్యక్రమం ఏమిటో చెప్పమని కర్ణుడిని అడిగాడు దుర్యోధనుడు. కౌరవ యోధులలో సేనాపతిగా ఎవరిని నియమించవచ్చో తెలియచేయమని కోరాడు కర్ణుడిని.

దానికి స్పందిస్తూ కర్ణుడు, కౌరవ యోధులలో సేనాపతికాగల ఆర్హతలు చాలామందికి వున్నాయని, అంతా సమర్థులే అని, అంతమాత్రంచేత అందరినీ నియమించలేం కదా అని, గురువు, బ్రాహ్మణుడు, అన్ని యుద్ధ విద్యల్లో మహా నిపుణుడు, వయోవృద్ధుడు, మిక్కిలి బలశాలి, మహావీరుడైన ద్రోణాచార్యుడికి సర్వసేనాధిపతిగా పట్టం కట్టమన్నాడు. అప్పుడు ఆ పదవికి ఒప్పుకొమ్మని ద్రోణుడి దగ్గరికి వెళ్లి ప్రార్థించాడు దుర్యోధనుడు. ఆయన సర్వసైన్యాధిపత్యానికి అంగీకరించాడు. వెంటనే దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి సేనాధిపత్యాన్ని అభిషేకించాడు.

సర్వసైన్యాధిపతైన ద్రోణాచార్యుడు తనను దుర్యోధనుడు ఆ విధంగా గౌరవించినందుకు ఏదైనా వరాన్ని కోరుకొమ్మని చెప్పాడు. యుద్ధంలో ధర్మరాజును సజీవంగా బంధించి తన ముందుకు తీసుకురావాలని అడిగాడు దుర్యోధనుడు. అతడిని బంధించి తెమ్మనడానికి కారణం ఏమిటని, తెస్తే ఏం చేస్తావని, అర్థరాజ్యం ఇస్తావా? అని ప్రశ్నించాడు ద్రోణుడు. ధర్మరాజుతో మళ్లీ జూదం ఆడించి, ఓడగొట్టి అడవులకు పంపితే అతడితో పాటు తమ్ములు కూడా పోతారని, అప్పుడు భూమండలాన్ని చాలాకాలం పాలిస్తానని అన్నాడు దుర్యోధనుడు. అతడి కుత్సితమైన అభిప్రాయానికి ద్రోణుడు అసహ్యించుకున్నాడు. అర్జునుడు యుద్ధంలో అడ్డగిస్తే ధర్మరాజును బంధించడం తన చేతకాదని, అర్జునుడు లేకుండా చేస్తే బంధించి తెస్తానని చెప్పాడు ద్రోణుడు తెలివిగా. దుర్యోధనుడు ద్రోణుడి ప్రతిజ్ఞను అంతట చాటించాడు. ధర్మరాజుకు వేగులవారి ద్వారా ఆ విషయం తెలిసింది.

ధర్మరాజు ఆ విషయాన్ని అర్జునుడికి చెప్పాడు. తాను జీవించి వుండగా ధర్మరాజును ప్రాణాలతో బంధించడం ద్రోణుడికే కాదు, రుద్రుడికి కూడా సాధ్యం కాదన్నాడు అర్జునుడు. ధర్మరాజు సంతోషించాడు ఆ మాటలకు. పాండవులు ఆరోజున క్రౌంచ వ్యూహాన్ని రచించారు. దాని ముందు భాగంలో శ్రీకృష్ణుడు, అర్జునుడు వున్నారు. అర్జునుడి రథం పక్కన ధృష్టద్యుమ్నుడి రథం వున్నది. భీముడు, అభిమన్యుడు, ద్రౌపది పుత్రులు, ద్రుపదాదులు, ధృష్టకేతువు మొదలైనవారు ఆ వ్యూహం మధ్యలో వున్నారు. ధర్మరాజు వ్యూహం నడిమధ్యలో మంచి ఏర్పాట్లతో, గట్టి ప్రయత్నంతో వచ్చి నిలబడ్డాడు. కౌరవులు శకట వ్యూహాన్ని రచించారు. దాంట్లో కుడిపక్క జయద్రథ, భగదత్తులతో కలిసి వికర్ణుడు; అతడికి సహాయంగా శకుని; ఎడమ పక్క కృతవర్మ, వివింశతి, చిత్రసేనలతో కూడిన దుశ్శాసనుడు; అతడికి సహాయంగా పక్కన కాంభోజ, శక, యవన దేశాధీశులు; నడుమ త్రిగర్త, మద్ర, శిబి, శూరసేన దేశాల రాజులు చుట్టూ వున్నారు. ద్రోణుడు ముందుండగా దుర్యోధనుడు, కర్ణుడు ఆ ముందర నిలిచారు.

ఇరుపక్షాల సైనికులు యుద్ధానికి సిద్ధం కాగా కర్ణార్జునులు యుద్ధం చేయడానికి ఉబలాటపడి నిలిచారు. కౌరవ పాండవ సైన్యాలు మహోగ్రంగా పోరాడారు. ద్రోణుడు స్వైరవిహారం చేశాడు. ఆయన తన సాటిలేని శూరత్వాన్ని, బాహుబలాన్ని, దివ్యాస్త్రాల మహిమను చూపడంతో పాండవ సైన్యంలో రక్తపుటేఱులను ప్రవహింప చేశాడు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు మహాభయంకరంగా ద్రోణాచార్యుడిని ఢీకొన్నాడు. అర్జునుడు అతడితో కలిశాడు. వారిద్దరినీ ద్రోణుడు ఎదుర్కున్నాడు భీకరంగా. మరోవైపున శకునికి, సహదేవుడికి మధ్య యుద్ధం జరిగింది. భీముడు వివింశతి రథాశ్వాసాలను నేలకూల్చాడు.

అలంబసుడు, ఘటోత్కచుడు రాక్షసమాయలతో, అదృశ్యులై యుద్ధం చేయసాగారు. క్షత్రదేవుడు దుర్యోధనుడి కొడుకు లక్ష్మణ కుమారుడితో తలపడ్డాడు. శల్యుడు నకులుడితో, కృపాచార్యుడు ధృష్టకేతువుతో, కృతవర్మ సాత్యకితో యుద్ధం చేశారు. ధృష్టద్యుమ్నుడు సుశర్మను నొప్పించాడు. కర్ణుడు తనను ఎదుర్కున్న విరాటరాజు చతురంగ బలాలను సంహరించాడు. ద్రుపదుడు, భగదత్తుడు పోరాడారు. పౌరవుడు అభిమన్యుడితో యుద్ధం చేశాడు. మధ్యలో వచ్చిన జయద్రథుడిని పారిపోయేట్లు చేశాడు అభిమన్యుడు. తన శక్త్యాయుధంతో శల్యుడి సారథిని చంపాడు అభిమన్యుడు. శల్యుడు రథం మీదనుండి కిందికి దిగి గదా యుదానికి సిద్ధమయ్యాడు. అది చూసిన భీమసేనుడు అభిమన్యుడిని పక్కకు నెట్టి శల్యుడిని ఢీకొన్నాడు. ఇద్దరూ ఒకరికొకరు తీసిపోకుండా గదా యుద్ధం చేశారు. కాసేపటికి భీమశల్యులు ఇద్దరూ నేలమీద పడ్డారు. కృతవర్మ శల్యుడిని తీసుకునిపోయాడు. దుర్యోధనాదులు భీముడిని ఎదుర్కున్నారు. ఇంతలో మధ్యాహ్నం అయింది.

కర్ణుడి కొడుకు వృషసేనుడు నకులుడి కొడుకైన శతానీకుడితో తలపడ్డాడు. ద్రౌపది కొడుకులంతా శతానీకుడికి సహాయంగా వచ్చారు. ఇంతలోనే ఇరుపక్షాల వైపున యోధానుయోదులంతా యుద్ధానికి దిగారు. కౌరవ సైన్యం కలత చెంది వెనుదిరిగి పోసాగింది. ద్రోణాచార్యుడు కౌరవ సైన్యాన్ని యుద్ధానికి మళ్లించి ధర్మారజును ఢీకొన్నాడు. అప్పుడు ధర్మరాజు చక్ర రక్షకుడైన సుకుమారుడు ద్రోణుడి రొమ్ములో తీక్షణమైన బాణాన్ని నాటాడు. తెప్పరిల్లుకున్న ద్రోణుడు ధర్మరాజును తాకాడు. ఆ సమయంలో పాండవ వీరులంతా ధర్మరాజుకు సహాయంగా వచ్చి, ద్రోణుడిని చుట్టుముట్టారు. అప్పుడు ద్రోణుడు రథికులందరినీ బాధించి ధర్మరాజును ఆక్రమించడానికి సమీపించాడు. సరిగ్గా అదే సమయంలో అర్జునుడు వచ్చి ద్రోణాచార్యుడిని ఎదుర్కున్నాడు.

కౌరవ వీరులు అంతా ఒక్కటై ద్రోణుడికి సహాయంగా అర్జునుడిని చుట్టుముట్టారు. అర్జునుడు విజృంభించి కౌరవ పక్షంలో రక్తపు నదులను ప్రవహింప చేశాడు. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. ద్రోణాచార్యుడు, దుర్యోధనుడు యుద్ధం ఆపుచేసి సైన్యాలను వెనక్కు మరల్చారు. పాండవుల జయజయ ధ్వానాల మధ్య అర్జునుడు సైన్యాలను మరల్చి ధర్మరాజు దగ్గరకు వెళ్లాడు. ఈ విధంగా రెండు సైన్యాలు తమతమ శిబిరాలకు చేరాయి.

ధర్మరాజును బంధించే విషయాన్ని మళ్లీ ప్రస్తావించాడు దుర్యోధనుడు ద్రోణుడితో. అర్జునుడు దగ్గర వున్నప్పుడు ధర్మరాజును బంధించడం ఎవరివల్లా కాదని తాను మొదటే చెప్పానని, వీరుడెవరైనా పరాక్రమంతో అర్జునుడిని యుద్ధభూమికి దూరంగా తీసుకోనిపోతే ధర్మరాజును ఉపాయంగా పట్టుకుంటానని చెప్పాడు ద్రోణుడు. 

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ద్రోణపర్వం, ప్రథమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment