Tuesday, November 29, 2022

మడి …. పండుగలు…. తిరునాళ్లు (గుర్తుకొస్తున్నాయి) : వనం జ్వాలా నరసింహారావు

 మడి …. పండుగలు…. తిరునాళ్లు

(గుర్తుకొస్తున్నాయి)

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక (29-11-2022)

ఖమ్మం పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో, సరైన రహదారి సౌకర్యం కూడా లేని ఒక కుగ్రామంలో, 75 సంవత్సరాల క్రితం, నిప్పులమీద నీళ్లు చల్లుకుని శుద్ధి చేసుకునేటంత ఛాందస కుటుంబంలో పుట్టాను. బాల్యంలో గ్రామంలోని పాఠశాలకు వెళ్లొచ్చిన తరువాత, అక్కడ మైల పడిపోయామని, ఇంటికి రాగానే దుస్తులు విడిపించేవారు మా పెద్దలు. స్నానం చేసిన తరువాతే శుద్ధి ఐనట్లు పరిగణలోకి తీసుకునేవారు. అప్పటి రోజులకు ఆ ఆచారం సరిపోయింది. ఇప్పటి సంగతి వేరే. తరాలలో, అంతరాలలో చెప్పలేనంత మార్పు. 

మా ఇంట్లోని బావి నీరు ఉప్పు నీరు. తాగడానికి ఉపయోగపడదు. మా పాలేరు ప్రతిరోజు వాళ్లింటి బావి నుంచి ఒక రెండు బిందెల మంచి నీళ్లు పట్టుకొచ్చేవాడు. అందులో మా అమ్మ కొద్దిగా చల్ల చుక్క వేసేది. అలా చేయడంతో ఆ నీళ్లు చల్లతో సమానమని ఆమె నమ్మకం. ఇంట్లో వంట మడి కట్టుకుని చేసేవారు. మామిడి కాయ వూరగాయలు కూడా మడితోనే పెట్టేవారు. రోజువారీ ఉపయోగానికి కొంత బయటుంచుకునేవాళ్లం. అవి అయిపోతే, మళ్లీ మడి కట్టుకునైనా తీసేవారు, లేదా, పిల్లల్లో ఒకళ్లని ‘బరివాత’ (వంటి మీద బట్టలేమీ లేకుండా) తీయించేవారు. ఆనాటి ఆచారం అది. పెద్దలమాట వినక తప్పేది కాదు. ఇప్పుడు వూరగాయ పచ్చళ్లు పెట్టేవారు దేశమంతా వున్నారు. ఆ మాటకొస్తే విదేశాలలో కూడా వున్నారు. ఇంకా చెప్పాలంటే మూడొందల అరవై ఐదు రోజులు మామిడికాయలు దొరుకుతున్నాయిప్పుడు. ఎవరో కొందరు తప్ప అంతా మార్కేట్లోన్ర్ కొంటున్నారు.

         ఉదయం నిద్ర లేవగానే, వేప పుల్ల నోట్లో వేసుకుని, దంత ధావనం చేస్తూ, మా నాన్న గారు, ఎదురింటి గ్రామ పటేల్, కొంచెం దూరంలో వున్న సర్పంచ్, మరో ఇద్దరు-ముగ్గురు గ్రామ పెద్దలు, వీధిలో వున్న అరుగుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ, గ్రామంలో ఆ రోజున తీర్పు చెప్పాల్సిన పంచాయతీలేవన్న వుంటే చర్చించేవారు. ఆ రోజుల్లో గ్రామాల్లో పెద్దమనుషుల పంచాయతీ తీర్పులు అమోఘంగా వుండేవి. అన్నీ పదిమంది సమక్షంలోనే జరిగేవి. పెద్ద మనుషులిచ్చిన తీర్పుకు తిరుగు లేదు. న్యాయస్థానాలలో మాదిరిగా ‘అపీల్’ లేదు. ఒక సారి పెద్ద మనుషులు తీర్పు చెప్పారంటే ఆ గ్రామంలోని ఎవరైనా సరే బద్ధులై పోవడమే! పెద్ద మనుషులుగా వ్యవహరించిన వారిలో గ్రామంలోని వెనుకబడిన వర్గాలకు, దళితులకు చెందిన వారు, ముస్లింలు కూడా వుండేవారు. మా గ్రామానికి సంబంధించినంతవరకు వారికి సమానమైన ప్రాధాన్యత వుండేది.

బాల్యంలో అనుభూతి పొందిన జ్ఞాపకలాలో, ఈ రోజుల్లో అంతగా ప్రాచుర్యం లేని చిన్నతనంనాటి ఆటపాటలింకా మదిలో మెదులుతూనే వున్నాయి. ఇంట్లో ‘అచ్చన గిల్లలు’, ‘వాన (వామన) గుంటలు’,  సాయంకాలాలు కొఠాయి (రచ్చబండ) వైపుకు వెళ్ళి ‘గోలీలు’, ‘బలిగుడు-చెడు గుడు’ (కబడ్డీ), ‘బెచ్చాలు’, ‘పత్తాలు’, ‘జిల్ల గోనె, ‘దస్తీ ఆట’. ‘తొక్కుడు బిళ్ల’, ‘ఉప్పు బీర ఆడేవాళ్లం. మా అక్కయ్య స్నేహితులతో కలిస్  ‘పచ్చీసు’ ఆడుతుంటే మేం కూడా వాళ్లతో కలిసి ఆడేవాళ్లం.  అచ్చన గిల్లలు ఆటలో ఓడిపోయిన వారికి ‘పులుసు పోయడం’ అని పందెం వుండేది.  బలే సరదా ఐన ఆట అది.

ఆ రోజుల్లో పెళ్లి వేడుకలు కూడా ఇప్పటివాటికి పూర్తి భిన్నంగా వుండేవి. మా అక్కయ్య వివాహం ఆ రోజుల్లో (1955 ప్రాంతంలో) ఐదు రోజులు వైభవోపేతంగా జరిపించారు మా నాన్న గారు. ప్రతిరోజూ హరి కథలు, బుర్ర కథలు కూడా ఏర్పాటు చేసారు. ఇప్పటిలాగా పెద్ద-పెద్ద మ్యారేజ్ హాళ్లు లేవప్పుడు. గ్రామంలోని సొంత ఇంట్లో, ముందున్న ఖాళీ స్థలంలో తాటాకుల పందిళ్లు వేసి వివాహం జరిపించేవారు. వచ్చిన బంధువులు ఆ ఇంట్లోనో, లేదా గ్రామంలోని సమీప బంధువుల ఇళ్లల్లోనొ సర్దుకునేవారు. చతుర్ముఖ పారాయణం ఆనవాయితీ!

చిన్నతనంలో బతుకమ్మ పండుగ వచ్చిందంటే మా అక్కయ్యతో పాటు మాకూ సంబరమే! దసరా పండుగకు ముందు వచ్చేది బతుకమ్మ పండుగ. ఒక విధంగా దసరా, బతుకమ్మ పండుగలు ఏక కాలంలోనే జరుపుకుంటాం. బతుకమ్మ పేర్చడానికి కావాల్సిన పూలను మేం ఇంటింటికి వెళ్లి సేకరించేవాళ్లం. పాలేర్లు తంగేడు ఆకును, పూతను తెచ్చే వాళ్లు. ఆ పూలతో, తంగేడు పూతతో బతుకమ్మను పేర్చేవారు. ఒక్కొక్కరి స్థోమతను బట్టి బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మలను ఓ చోట చేర్చి స్త్రీలు లయబద్ధంగా పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఆడుతుంటే మేమూ ఆనందించేవాళ్లం. ఓ గుడి ముందో, లేకపోతే ఎవరో ఒకరి ఇంటి ముందో దీనికి అనువుగా వుండే స్థలాన్ని ఎంపిక చేసుకునేవారు. ఎనిమిది రోజులపాటు...అమావాస్య రోజున ఎంగిలి పువ్వుతో మొదలెట్టి, తొమ్మిదో రోజున మా వూరు సమీపంలోని ఊర చెరువు ఒడిలో చేర్చేవారు. చద్దుల బతుకమ్మ నాడు స్త్రీలతో పాటు పురుషులు కూడా వచ్చి దూరం నుంచి సంబురం చూసి ఆనందించేవారు.

గ్రామాలలో ఆనందంతో జరుపుకున్న ఇతర పండుగలు దసరా, దీపావళిలు. దసరాకు విధిగా, జమ్మి చెట్టు దగ్గర గుమిగూడి, ‘శమీ శమయతే పాపం, శమీ శతృ వినాశనం, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియ దర్శనం’ అంటూ ఒక కాగితం మీద రాసి, జమ్మి కొమ్మకి గుచ్చి, రామ చిలుక దర్శనం చేసుకునే వాళ్లం. జమ్మి చెట్టు వద్ద, ‘యాట’ (మేక పోతు కాని, గొర్రె కాని) ను బలి ఇచ్చేవారు. ఇటీవల పండుగ చేసుకుంటున్నప్పటికీ విధానంలో మార్పు కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. దాదాపు చాలామంది ఇంటికే పరిమితం. 

దీపావళికి ‘రోలు-రోకలి’ అనే ఒక పనిముట్టును మా వూరి వడ్రంగితో తయారు చేయించేవారు నాన్న గారు. అందులో పౌడర్ (పొటాషియంతో చేసిందను కుంటా) లాంటిది వేసే రాపిడి కలిగించితే బాంబ్ ధ్వనితో మోగేది. అదే విధంగా, రాత్రిపూట కాల్చుకునే టపాసులు ఎంతో ఆనందాన్ని కలిగించేవి. 15 రోజుల తరువాత వచ్చే కార్తీక పౌర్ణమికి వూరి పరిసరాలలోని చెరువులో దేవుడి ‘తెప్ప ఉత్సవం’ జరిగేది. అక్కడా కొన్ని టపాసులు కాల్చేవాళ్ళం. కొన్నాళ్ల తరువాత వచ్చే ముక్కోటి ఏకాదశికి పండుగ కూడా బాగా జరుపుకునేవాళ్లం.

మరో పండుగ ‘సంక్రాంతి’. ఆ పండుగ రోజుల నాటి ‘గొబ్బిళ్లు’, ‘హరిదాసులు’, ‘గంగిరెద్దులు’, ‘రేగు పళ్లు’, మళ్లీ మళ్లీ జ్ఞప్తికి వస్తున్నాయి. సంక్రాంతికే పంటలు ఇంటికి చేరేవి. కల్లాలు పూర్తై, ఎడ్ల బండ్లలో, ‘బోరాల’ నిండా నింపుకుని పుట్లకు-పుట్ల ధాన్యం ఇంటికి వస్తుంటే బలే ఆనందంగా వుండేది.

ధాన్యం కొలవడానికి కుండలు, మానికలు, తవ్వలు, సోలలు, గిద్దెలు ఉపయోగించేవారు. కుండకు పదిన్నర మానికలు; మానికకు రెండు తవ్వలు, నాలుగు సోలలు, పదహారు గిద్దెలు; తవ్వకు రెండు సోలలు, ఎనిమిది గిద్దెలు; సోలకు నాలుగు గిద్దెలు. ఐదు కుండలైతే ఒక ‘బస్తా’ ధాన్యం అవుతుంది. అలాంటి ఎనిమిది బస్తాలు కలిస్తే ఒక ‘పుట్టి’ అవుతుంది. క్వింటాలలో కొలతలు అప్పట్లో లేవు. ధాన్యం ఇంటికి చేర్చిన తరువాత, ‘పాతర’ లో కాని, ‘గుమ్ముల’ లో కాని, ‘ధాన్యం కొట్టుల’ లో కాని భద్రపరిచేవారు. మార్కెట్ అనుకూలంగా వున్నప్పుడు అమ్మేవారు. ఆ ధాన్యంలోనే కొన్ని బస్తాలు మరుసటి సంవత్సరానికి విత్తనాలుగా ఉపయోగించేందుకు వేరే భద్రపరిచేవారు. మార్కెట్లో విత్తనాలు కొనే ఆచారం లేనేలేదు. ఆశ్చర్యకరమైన విషయం, పంట కోసినప్పటి నుంచి, ధాన్యం ఇంటికొచ్చే వరకు, లక్షలాది (అప్పటి విలువ ప్రకారం) రూపాయల విలువ చేసే ఆ పంట మొత్తం బహిరంగంగా పొలాలలో పడి వుండేది. ఏ రైతుకు కూడా అభధ్రతా భావం వుండకపోయేది.

అలానే శ్రీరామ నవమి, గోదా కల్యాణం పండుగలు. భద్రాచలంలో వలెనే ప్రతిసంవత్సరం శ్రీరామనవమి నాడు, (తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించిన) అపర భాద్రాచలమైన మా రెవెన్యూ గ్రామం ముత్తారంలో కూడా సీతారాముల కళ్యాణోత్సవం అశేష జనవాహిని మధ్య అంగరంగ వైభోగంగా జరిగేది. ఇప్పటికీ జరుగుతూనే వున్నది. గోదాదేవి కళ్యాణం సంక్రాంతి ముందురోజు భోగి రోజున జరుగుతుంది. బాల్యంలో ఎద్దుల బండ్లు కట్టుకొని, వాటిలో శివారు గ్రామమైన మావూరినుండి దేవుడు పెళ్లి చూడడానికి ముత్తారం పొయ్యే వాళ్లం. కచ్చడపు బండ్లలో కూడా వెళ్తుండే వాళ్లం అప్పుడప్పుడు. దేవుడు పెళ్లికి కొన్ని గంటల ముందు, జరిగిన కొన్ని గంటల దాకా దేవాలయం పరిసరాలన్నీ కోలాహలంగా వుండేవి. పల్లెటూళ్లల్లో ఆ సందడిని ‘తిరునాళ్లు’ అని పిలిచే వాళ్లం. ఆ రోజున ఎక్కడెక్కడినుండో, చిరు వర్తకులు అక్కడ కొచ్చి, తమ దుకాణాలను పెట్టి సరకులమ్మేవారు. పట్టణాలలో ఎగ్జిబిషన్ సందడిలాంటిదే కాసేపు కనిపించేది. ఇప్పటికీ దుకాణాలు పెటుతున్నప్పటికీ, బాల్యం నాటి సందడికి మారుగా కొంచం పట్టణ వాతావరణం చోటుచేసుకుంటున్నట్లు అనిపిస్తుంటుంది.

మా గ్రామంలో ముస్లింలు పది-పదిహేను కుటుంబాల వరకున్నారు. వాళ్ల పండుగలను హిందు-ముస్లింల ఐక్యతకు ప్రతీకగా జరుపుకునే వాళ్లం. అన్నింటిలోకి ప్రధానమైంది, అట్టహాసంగా జరుపుకునే పండుగ ‘పీర్ల పండుగ’. గ్రామంలో ‘పీర్ల గుండం’ వుంది. దాన్నిండా కణకణలాడే నిప్పులు పోసి, ఆ నిప్పుల్లోంచి పీర్లను ఎత్తుకునే వ్యక్తులు నడిచి పోతుంటే బలే గమ్మత్తుగా వుండేది. మొత్తం పదకొండు "సరగస్తులు", దినం విడిచి దినం జరుపుకునే వాళ్లం. పీరు అంటే ఒక పెద్ద పొడగాటి గడ లాంటి కర్రకు జండాలు కట్టి, ఆ గడలను బొడ్లో దోపుకుని, హిందు-ముస్లిం అన్న తేడా లేకుండా అందరూ ఎత్తుకుని ఆనందించేవారు. మా కుటుంబానికి వంశ పారంపర్యంగా "హస్సేన్-హుస్సేన్" పీర్లుండేవి. ఏడవ సరగస్తు నాడు వాటిని బయటకు తీసేవారు. కుదాయ్ సాహిబ్ అనే నిబద్ధత కలిగిన ఒక వ్యక్తి అప్పట్లో వీటిని నిర్వహించేవాడు. ఇప్పటికీ అలానే కొద్దిపాటి మార్పులు-చేర్పులతో జరుగుతూనే వున్నాయి.  

No comments:

Post a Comment