Sunday, February 19, 2023

ప్రక్షిప్తాలు లేని వాల్మీకి రామాయణమే ప్రామాణికం : వనం జ్వాలా నరసింహారావు

 ప్రక్షిప్తాలు లేని వాల్మీకి రామాయణమే ప్రామాణికం

(పరిశోధనాత్మక వ్యాసం)

వనం జ్వాలా నరసింహారావు

సాక్షి దినపత్రిక (19-02-2023) 

ఉత్తర కాండలో చెప్పబడింది అంటూ, ప్రక్షిప్తమో, నిక్షిప్తమో, మరేదో తెలియని ఒక అప్రాధాన్యమైన ‘శంబుక వధ’ స్వకపోల కల్పిత కథ గురించి పుంఖాను పుంఖాలుగా వ్యాసాలూ, నాటికలూ, వ్యాఖ్యానాలూ గతంలోనూ, ఇటీవలి కాలంలోనూ ప్రచారంలోకి తేవడం వేదకాలం నుంచి భారతీయులు ఆచరిస్తూ వస్తున్న అపారమైన సంస్కృతీ, సంప్రదాయాలకు విఘాతం కలిగించడమే. శ్రీరాముడు ధర్మంగా పాలన చేస్తున్న సమయంలో, ఒక బ్రాహ్మణుడు ఆయన దగ్గరకు వచ్చి, చనిపోయిన తన కుమారుడిని చూపించి, అతడి అకాల మృత్యువుకు కారణం ఏమిటని రాముడిని ప్రశ్నించి, దీనికి కారణం ఆయన చేసిన పాపం అని నింద వేస్తాడట. కొడుకుని బ్రతికించకపోతే తాను, తన భార్య ప్రాణాలు విడుస్తామని, దానివల్ల శ్రీరాముడికి బ్రహ్మహత్యా దోషం కలగుతుందని హెచ్చరిస్తాడట!!!

అక్కడే వున్న నారదుడు, యుగధర్మం గురించి రాముడికి వివరించి, త్రేతాయుగంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, మాత్రమే తపస్సు చేయడానికి అర్హులని, దీనికి విరుద్ధంగా ఒక శూద్రుడు తపస్సు చేస్తున్నాడని, అందుకే బ్రాహ్మణుడి కుమారుడు మరణించాడని, దీనికి తగిన ప్రతిక్రియ చేయమని సలహా ఇస్తాడట. రాముడు పుష్పక విమానాన్ని స్మరించడం, అది రావడం, దానిలో ఎక్కి తిరుగుతూ, ఒక పర్వత సమీపంలో తలకిందుగా తపస్సు ఇస్తున్న ఒకడిని చూసి (అతడే నారదుడు చెప్పిన శూద్రుడని ఎలా తెలిసిందో?) అతడి దగ్గరికి పోయి, తపస్సు చేయడానికి కారణం అడిగి, అతడు శూద్రజాతివాడని, పేరు శంబుకుడు అని, దేహంతో స్వర్గానికి పోవడానికి తపస్సు చేస్తున్నానని అతడి ద్వారా తెలుసుకుని, వెనకా ముందూ చూడకుండా, కనీసం అతడి వాదన వినకుండా, కత్తితో శంబుకుడి తల నరికాడని అల్లిన అభూత కల్పన. రాముడి చేతిలో చనిపోయిన శంబుకుడికి మోక్షప్రాప్తి, చనిపోయిన బ్రాహ్మణుడి కుమారుడు బ్రతకడం, దానికి పొడిగింపు కథ. ఇందులోని వాస్తవాలు నమ్మదగ్గవో, కాదో, చదివినవారికే అర్థం కావాలి!!!

ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడి చరితాన్ని ఆదికావ్యంగా, శ్రీరామాయణ కావ్యంగా వాల్మీకి మహర్షి అనుగ్రహించారు. వాల్మీకి రామాయణాన్ని యధావాల్మీకంగా 24 వేల శ్లోకాలను 24వేల పద్యాలతో 7 కాండలుగా ‘శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం’ గా తెలుగు భాషలోనికి అనువదించిన మహామహానుభావులు, ఆంధ్ర వాల్మీకిగా, వాసు దాసుగా ప్రసిద్ధికెక్కిన వావిలికొలను సుబ్బారావు గారు. వారి ప్రతిపదార్థ తాత్పర్య సహిత వేలాది పేజీల ‘మందరాల’ ను ఆసాంతం రెండు-మూడు పర్యాయాలు చదివి, శిష్ట వ్యావహారిక భాషలో అనువక్తగా రాసిన వ్యక్తిగా, బహుళ ప్రచారంలో అనేక విషయాలు వాల్మీకి రామాయణంలో లేవనే సంగతి అర్థం చేసుకున్న వ్యక్తిగా, కొన్ని విషయాలు తెలియచేసే ప్రయత్నం ఇది. శ్రీసీతారాముల చరితానికి సంబంధించినంతవరకు వాల్మీకి రామాయణం మాత్రమే ఏకైక ప్రామాణిక గ్రంధం.

ఉదాహరణకు సీతా స్వయంవరం సమయంలో రావణుడు అక్కడే వుండి శివుడి విల్లు ఎక్కుపెట్టడానికి విఫల యత్నం చేశాడని, సీతను వదిలి రాముడికి సహాయంగా పోయేటప్పుడు లక్ష్మణరేఖ గీశారని, భూమిని పెకలించి రావణుడు సీతను తాకకుండా ఎత్తుకుపోయాడని, అహల్య శిలగా మారి రాముడి పాద స్పర్శకు నిజరూపం వచ్చిందని, చార్వాకుడు (జాబాలి) నాస్తికుడని, రావణుడి పొట్టలో అమృత కలశం వుందని, దానిని నాశనం చేస్తే వాడు చస్తాడని విభీషణుడు రాముడికి చెప్పాడనేవి వాల్మీకి రామాయణంలో లేని విషయాలు. బ్రహ్మాస్త్రం వేసి  రాముడు రావణుడిని చంపాడని  వాల్మీకి రామాయణం చెబుతోంది. సీతను అగ్నిప్రవేశం చేయమని శ్రీరాముడు ఆదేశించడం వాల్మీకి రామాయణంలో లేదు. శబరి ఏరి కోరి తెచ్చి రాముడితో ఎంగిలి పండ్లు తినిపించినట్లు ఎక్కడా లేదు. వాల్మీకి రామాయణం ప్రకారం రావణుడు ప్రయోగించిన ‘శక్తి’ వలన లక్ష్మణుడు  మూర్ఛపోతే (చనిపోతే కాదు), హనుమంతుడు సంజీవిని  పర్వతాన్ని తెస్తాడు కాని ఇంద్రజిత్తు బాణానికి చనిపోయినప్పుడు కాదు. సాధారణంగా పారాయణ గ్రంథాలకు చివరన వుండే ఫలశ్రుతి లాగానే, శ్రీరామాయణ పారాయణ ఫలశ్రుతి కూడా యుద్ధకాండ చివరన వున్నది కాని ఉత్తరకాండ చివరన లేదు. అంటే రామాయణ కథలో అది భాగం కాకపోవచ్చు.    

వాల్మీకి బోయవాడికి ఇచ్చిన శాపమే రామాయణ ఉత్పత్తికి కారణం. ఇక వాల్మీకి ఏ కులం వాడో తెలియచేసే విషయం కూడా బాలకాండలో వాల్మీకి మాటల్లోనే వున్నది. కిరాతకుడిగా జీవనం సాగిస్తున్న పూర్వాశ్రమంలోని వాల్మీకి, అడవిలో పోతున్న మునులను అడ్డుకున్నప్పుడు అతడిని ‘బ్రాహ్మణాధముడి’ గా గుర్తించి, మోక్ష మార్గం ఉపదేశిద్దామని తలచి, ’రామ’ నామాన్ని తలకిందులు చేసి, వాళ్లు మరల వచ్చే వరకు, ’మరా, మరా’ అని ఎల్లవేళలా జపించమని ఆదేశించి పోయారని వాల్మీకి ఉవాచ. దీర్ఘకాలం తరువాత మునులు తిరిగి రావడం, పుట్ట నుండి బయటకొచ్చిన ఆయన్ను ’మునీశ్వర వాల్మీకీ’ అని సంభోదించడం, స్వయంగా రాసుకున్నాడు వాల్మీకి. వాల్మీకి రామాయణంలో ఆయన బోయవాడని ఎక్కడా చెప్పబడలేదు. బ్రహ్మ కూడా వాల్మీకిని ఓ సందర్భంలో ‘బ్రాహ్మణుడా’ అని సంబోధిస్తాడు.

ఆసక్తిగా శోధించిన వారికి, పరీక్షించిన వారికి మాత్రమే, వాల్మీకి రామాయణానికి, ఇతర రామాయణాలకు గల తారతమ్యం, వాల్మీకి రామాయణంలోని గొప్పదనం తెలుస్తుంది. వాల్మీకి రామాయణార్థం సరిగ్గా గ్రహించాలంటే అనేక శాస్త్రాల జ్ఞానం వుండాలి. అదిలేనివారికి యదార్థ జ్ఞానం కలగదు. శ్రీమద్రామాయణం గొప్ప ధర్మ శాస్త్రం. ఇందులో సర్వ విధాలైన, అన్ని రకాల ధర్మాల గురించి వివరంగా చెప్పబడింది. రాజ ధర్మం, ప్రజా ధర్మం, పతి ధర్మం, సతీ ధర్మం, భాతృ ధర్మం, పుత్ర ధర్మం, భృత్యు ధర్మం, మిత్ర ధర్మం లాంటి అన్ని ధర్మాలను గురించి చక్కగా తెలుపబడి వుంది. శ్రీరాముడు అనుసరించిన సామాన్య ధర్మాన్ని, అలాగే విశేష ధర్మాన్ని కూడా తెలుసుకోవచ్చు.

       రామాయణ రచనకు పూనుకున్న వాల్మీకి మహర్షి, తన ఆశ్రమానికి వచ్చిన నారదుడిని పదహారు ప్రశ్నలు వేస్తాడు. ఆ ప్రశ్నలకు జవాబుగా శ్రీరాముడి గుణగణాలను వర్ణిస్తాడు నారదుడు. వాల్మీకి ప్రశ్నించింది అవతార మూర్తి గురించే, నారదుడు జవాబిచ్చిందీ అవతార మూర్తిని గురించే. ఆ జవాబులో నారదుడు శ్రీరాముడి గుణగణాలను వర్ణిస్తాడు. వానరులతో, గుహుడితో, శబరితో, సుగ్రీవుడితో, ఇతరులతో చేసిన స్నేహాన్ని ఆయన సౌశీల్యానికి గుర్తుగా చెప్తాడు. ‘స్మరణ మాత్ర సంతుష్టాయ’ అంటే స్మరించినంత మాత్రాన సంతోషించే వాడు రాముడు. ‘ప్రణతి ప్రసన్న జానకి’ అంటే ఒక్క నమస్కారంతో సంతోషించేది సీత. భక్తులకు సీత-రాములిరువురూ సేవ్యులే అనేది శ్రీరామాయణం చదువుకుంటూ పొతే అర్థమవుతుంది.  

స్వధర్మ నిర్వహణ తన విధి అని శ్రీరామచంద్రమూర్తి ఆసక్తి లేకపోయినా విశ్వామిత్రుడి ఆదేశం మేరకు తాటకిని చంపాడు. అహల్య శిలగా మారిందనడం వాస్తవం కాదని వాల్మీకి రామాయణం స్పష్టం చేసింది. గౌతముడు అహల్య స్వరూప నాశనం చేయకుండా, గాలిని ఆహారంగా తీసుకుంటూ, కఠిన వ్రతం ఆచరించమని మాత్రమే అంటాడు. గాయత్రీ బీజసంయుతమైన వాల్మీకి రామాయణంలో, వశిష్ట విశ్వామిత్ర యుద్ధం, బ్రాహ్మణ క్షత్రియ యుద్ధం మాత్రమే కాదు. ఆత్మ విద్యకు, అనాత్మవిద్యకు మధ్య జరిగిన యుద్ధంగా వర్ణిస్తాడు. రాముడు తండ్రి ఆజ్ఞ పాలించడానికి అడవులకు పోవడానికి కారణం తమ్ముడికి చెప్తూ, ఇవన్నీ కేవలం దైవ కృత్యాలేనని, విధి చేష్టలనీ అంటాడు.

తాను నాస్తికుడిని కాదని, నాస్తికోక్తులను చెప్పనని, నాస్తి అనేది లోకంలో లేదని, సర్వం అస్తియే అని, తనని క్షమించమని స్వయంగా జాబాలి రాముడికి చెప్పడం, వసిష్ఠుడు సహితం జాబాలి వాస్తవానికి నాస్తికుడు కాదని చెప్పడం వాల్మీకి రామయణంలో వున్నది. అడవిలో అన్నకు సాయంగా వెళ్తూ-వెళ్తూ సీతను జాగ్రత్తగా వుండమని మాత్రమే అన్నాడు లక్ష్మణుడు కాని ఎలాంటి రేఖా (లక్ష్మణ రేఖ) గీయలేదు. బ్రాహ్మణ సన్న్యాసి వేషంలో వచ్చిన రావణాసురుడు ఎడమ చేత్తో సీతాదేవి తల వెంట్రుకలను, కుడిచేత్తో తొడలను, బెదిరించి, బలాత్కారంగా ఒడిలో ఎత్తుకున్నట్లు ఎత్తుకుని, తన మాయా రథంలో వేశాడు. అంటే, వాల్మీకి రామాయణంలో రావణుడు సీతాదేవిని తాకి తీసుకుపోయాడని స్పష్టంగా చెప్పడం జరిగింది.

రామరావణ యుద్ధంలో, ఇంద్రజిత్తు నాగాస్త్రాన్ని ప్రయోగించి రామలక్ష్మణులను ఆ బాణాలతో కట్టిపడేసినప్పుడు రామలక్ష్మణులు మూర్ఛ పోయారు కాని చావలేదు. గరుత్మంతుడు రాగానే పాములన్నీ చెల్లాచెదరై రామలక్ష్మణులు మూర్ఛ నుండి తెప్పరిల్లారు. మరోమారు యుద్ధానికి వచ్చిన ఇంద్రజిత్తు, రామలక్ష్మణుల మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే, బ్రహ్మ వాక్కుకు కట్టుబడి వారు మూర్ఛపోయారు. అప్పుడు హనుమంతుడు హిమవత్పర్వతం పోయి, సంజీవని పర్వతం తేవడంతో, మహామూలికల వాసన చూసి రామలక్ష్మణులు స్మృతి తెచ్చుకుని తెప్పరిల్ల్లారు. ఇంద్రజిత్తు లక్ష్మణుడిని చంపాడని ప్రచారంలో వున్న కథ వాస్తవం కాదు. సంజీవని తేవడం వాస్తవం అయినప్పటికీ, లక్ష్మణుడిని బతికించడానికి కాదు.

ఇంద్రజిత్తు మరణించిన తరువాత యుద్ధానికి వచ్చిన రావణుడు, శక్తి’ అనే బాణాన్ని లక్ష్మణుడి మీద ప్రయోగించగా లక్ష్మణుడు మూర్ఛపోయి నేలకూలాడు. మరణించలేదు. హనుమంతుడు తెచ్చిన సంజీవని కొండనుంచి బయటికి తీసి ఔషధులను లక్ష్మణుడికి వాసన చూపించాడు. వెంటనే అతడు సంతోషంగా మూర్ఛనుండి తేరుకున్నాడు. ఈ సారి కూడా లక్ష్మణుడు మరణించలేదనేది ప్రధానం. రామరావణుల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో శ్రీరాముడు ఇంద్రుడి సారధి మాతలి రథాన్ని ఎక్కి బాణాన్ని సంధించి రావణుడి శిరస్సు నరికాడు. రావణుడి తల కిందపడ్డది కాని వెంటనే మరొక తల మొలిచింది. వాడు చనిపోయే విధం రాముడికి కనబడలేదు. అప్పుడు మాతలి సలహా ఇవ్వగా బ్రహ్మాస్త్రాన్ని రామచంద్రమూర్తి రావణుడిమీద వేయడంతో వాడు మరణించాడు. అసలు విషయం ఇది కాగా, ‘ఇంటి గుట్టు లంకకు చేటు’ అనీ, విభీషణుడు రావణుడి మరణ రహస్యం చెప్పాడని ఇతర రామాయణాలలో ప్రచారంలో వున్న విషయం వాస్తవం కానే కాదు.

విభీషణుడిని లంకకు అభిషిక్తుడిని చేసిన తరువాత రామాజ్ఞ ప్రకారం విభీషణుడు సీతను ఆయన దగ్గరికి తెచ్చాడు. సీతాదేవి రాగానే, లోకులు సందేహించడానికి అవకాశం ఇచ్చే చరిత్ర కలదానివయ్యావని, ఆమె తన ఇష్టం వచ్చిన చోటుకు పోవచ్చని అంటాడు. సీతాదేవి తన శీలంలో ఏ దోషం లేదని, తన  పాతివ్రత్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నానని అంటుంది. మరది లక్ష్మణుడిని చూసి తనకు అగ్నిప్రవేశం తప్ప మరొక మార్గం లేదని, చితి పేర్చమని, అగ్నిప్రవేశం చేస్తానని అంటుంది. లక్ష్మణుడు చితిని పేర్చగా, అగ్నిలో సీతాదేవి ప్రవేశించింది. అగ్నిహోత్రుడు సీతాదేవిని ఒడిలో వుంచుకుని బయటకు వచ్చి, ఆమెను రాముడికి అప్పగిస్తూ, సీతలో ఏపాపం ఏమాత్రం లేదని, ఆమెను స్వీకరించమని అన్నాడు. సీతాదేవి తనకు తానే అగ్నిపరీక్షకు సిద్ధమైంది కాని రాముడి ఆదేశంతో కాదు. రాముడు సీతను స్వీకరించాడు. అయోధ్యకు మరలి వచ్చిన శ్రీరాముడికి వసిష్టుడు పట్టాభిషేకం జరిపించాడు. పదకొండు వేల సంవత్సరాలు తమ్ములతో శ్రీమంతుడై జగత్ప్రసిద్ధిగా ప్రపంచాన్ని పాలించాడు. ప్రపంచం అంతా రామమయం అయింది.

రామాయణమే ఆదికావ్యం. శ్రీమద్రామాయణం వేదంతో సమానమైందే కాకుండా వేదమే అనాలి. అందువల్లనే, వేద పఠనం అవశ్యంగా చేయాల్సిన కార్యక్రమాల్లో, రామాయణ పఠనం నియమితమైంది. వేదార్థం ఇందులో విస్తరించి చెప్పడం జరిగింది. ఇది వేదం స్వరూపం అని బ్రహ్మ కూడా చెప్పాడు. వాల్మీకి రచించిన రామాయణ మహాకావ్యం చదివినా, విన్నా, పాడినా వీనులకింపై, మనస్సుకు సంతోషకరమై, శుభకరమై వుంటుంది. శృంగార, హాస్య, కరుణ, వీర, రౌద్ర, శాంతి, అద్భుత, భయానక, బీభత్స అనే నవరసాలతో నిండినదైనప్పటికీ, శృంగార రసమే ప్రధానంగా వున్న మనోజ్ఞమైన కావ్యం శ్రీరామాయణం.

అందుకే, ఇందుకే వాల్మీకి రామాయణం చదవాలి. చదివినకొద్దీ, ఆస్వాదించినకొద్దీ, అనేక ప్రశ్నలు, సరైన సమాధానాలు పుట్టుకొస్తాయి. వాల్మీకి మహర్షి దీన్ని అశ్వమేధయాగం చేయడానికి పూర్వం రచించి బహిర్గతం చేశాడు. శ్రీమద్రామాయణం బ్రహ్మ అనుమతితో వాల్మీకి మహర్షి రచించాడు. ఈ కావ్యంలో అనృతం కొంచెమైనా వుండదని బ్రహ్మ వరం. కాబట్టి ఇలాంటి యోగ్యత, మహాత్మ్యం, గాయత్రీ ప్రణవ మంత్రాది సంపుటీకరణ ఇతర గ్రంథాలలో లేవు. రామాయణ పఠనం వల్ల, రామ కథా శ్రవణం వల్ల సర్వ సుఖాలు కలుగుతాయి. చివరగా ఒక్క మాట. ప్రక్షిప్తాలు లేని వాల్మీకి రామాయణమే ప్రామాణికం.  

No comments:

Post a Comment