Monday, March 27, 2023

జ్వరం పుట్టుకను, శాస్త్రతత్త్వాన్ని, కాలపాశ ఛేదనను, సద్ధర్మాలను చెప్పిన భీష్ముడు ..... ఆస్వాదన-113 : వనం జ్వాలా నరసింహారావు

 జ్వరం పుట్టుకను, శాస్త్రతత్త్వాన్ని, కాలపాశ ఛేదనను,

సద్ధర్మాలను చెప్పిన భీష్ముడు

ఆస్వాదన-113

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (27-03-2023)

శంకరుడి తేజస్సు చలించే జ్వరంగా రూపొంది వృత్రుడిని ఆక్రమించిన విషయం భీష్ముడు చెప్పగానే, ఆ జ్వరం ఎలా పుట్టిందని, దాని విధానం ఏమిటని అడిగాడు ధర్మరాజు.

‘దక్షయజ్ఞాన్ని ద్వంసం చేసే సందర్భంలో ఈశ్వరుడి పాలభాగంలో కోపం వల్ల పుట్టిన చెమట బిందువొకటి భూమ్మీద పడింది. వెంటనే అక్కడ పెద్ద మంటలు ఏర్పడ్డాయి. ఆ మంటల్లోనుండి ఒక పురుషుడు ఎర్రటి నేత్రాలు, నల్లటి రూపం, ఊర్ద్వముఖమైన రోమాలుగల భయంకరమైన ఆకృతితో జన్మించాడు. అతడే జ్వరం అనే పేరుతో ప్రసిద్ధుడు అవుతాడని, అతడు సర్వత్రా సంచరిస్తాడని, ఆ జ్వరం ఏకరూపమై వుంటే భూమి భరించలేదని, అందువల్ల దాన్ని నానారూపాలుగా సృష్టించమని బ్రహ్మ దేవుడు శివుడికి చెప్పాడు. శివుడు బ్రహ్మ చెప్పినట్లే దానికి నానారూపాలు కలిగించాడు’.

‘ఏనుగులకు తలనొప్పిగా, పాములకు కుబుసంగా, గోవులకు గిట్టలలో నొప్పిగా, లేళ్లకు తమ రూపు చూసేదానికి ఆటంకంగా, గుర్రాలకు పార్శ్వ భాగంలో శోషణంగా, నెమళ్లకు ఈకలు ఊడిపోవడంగా, కోకిలలకు నేత్రవ్యాధిగా, చిలుకలకు వెక్కిళ్ళుగా, మేకలకు మనోభ్రాంతిగా, పులులకు శ్రమగా, మానవులకు చావుపుట్టుకలు మొదలైన సందర్భాలలో దుఃఖంగా విభజించాడు. ఇది జ్వర స్వరూపం. జ్వరం శివుడి తేజస్సు. అందువల్ల అందరికీ నమస్కరించతగినది’. అని చెప్పాడు భీష్ముడు.

‘శాస్త్రతత్త్వం ఫలానా విధంగా వుంటుందని సందేహించేవాడు పరమార్థం గ్రహించలేడని, అలాంటివాడు ఏపని చేస్తాడో వివరించమని పితామహుడిని కోరాడు ధర్మరాజు. గురువులను పూజించడం, వృద్ధులను సేవించడం, విద్యను వినడం తప్పక చేయాల్సిన పనులని అంటూ భీష్ముడు నారదగాలవుల మధ్య జరిగిన సంవాదాన్ని తెలియచేశాడు. నారద మునీంద్రుడు గాలవుడికి చెప్పిన మాటలుగా భీష్ముడు ఇలా అన్నాడు ధర్మరాజు సందేహానికి జవాబుగా.

‘బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్న్యాసం అనే నాలుగు ఆశ్రమాల పరిస్థితులను పరికించాలి. అందులో ప్రవేశించాలని అనుకునేవాడు వాటి పోకడను సూక్షదృష్టితో చూడాలి. సదా ధర్మార్థకామాల నడవడికలో సౌమ్యభావం కలిగి వుంటూ మనుజుడు పాపానికి హేతువులైన పనులన్నిటినీ వదలాలి. యథాశక్తి పవిత్రమైన చిత్తంతో పుణ్యకార్యాలు మాత్రమే చేయాలి. సదా సజ్జనులతో సాంగత్యం కలిగి వుండాలి. పురుషుడు కపటవృత్తిని వదలి ఋజుత్వాన్ని పూర్ణంగా కలిగి వుండాలి. దేవతలను, పితృ దేవతలను శాస్త్రోక్తవిధి ప్రకారం పూజించాలి’.

‘ఎల్లప్రాణుల పట్లా కాఠిన్యాన్ని వదలి మెత్తదనంతో వ్యవహరించాలి. మధురమైన మాటలకు అలవాటు పడాలి. పురుషుడికి అహంకారం పనికిరాదు. యాచన కూడదు. అలాగే శబ్దస్పర్శ రూప రసగంధాలు అనే విషయాలలో అపరిమితమైన ఆసక్తి తగదు. అహంకారాది దోషాలు లేకుండా వుంటే మేలు కలుగుతుంది. ఎప్పుడైనా సరే ఇతరులను నిందించడం, తనను తాను పొగడుకోవడం తగవు. మానవుడు సోమరిపోతు, గర్వగ్రస్తుడు, నిష్ప్రయోజనకారి, మాత్సర్యదోషం కలవాడు, కోపశాలి కాకూడదు. అతిథులకు తన శక్త్యానుసారం సత్కారం చేయాలి. వేదాధ్యయనం, వేదాంగాలైన శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అనే ఆరు శాస్త్రాల పట్ల ప్రీతి వుండాలి. ఇలా మానవుడు పవిత్రమైన నడవడిక కలిగి ప్రవర్తిస్తే అతడి చిత్తదోషం పరిహరించబడుతుంది. ఆ దోషం తొలగగానే అతడికి జ్ఞానోదయం కలుగుతుంది.

         భీష్ముడు చెప్పిన మాటలు విన్న ధర్మరాజు తనలాంటి వాడు కాలపాశాన్ని ఎలా ఛేదించగలడని ప్రశ్నించాడు ఆయన్ను. పూర్వం సగరుడు అనే నృపాలుడు అరిష్టనేమి అనే మునీంద్రుడిని ఇలాగే ప్రశ్నించాడని, అతడి జవాబును అతడి మాటల్లోనే చెప్తానని, ఇలా అన్నాడు.

         ‘ధనం, ధాన్యం, పశువులు, భార్య, పుత్రులు మొదలైన వారి ఒత్తిడిలో తగులుకుంటే, చిత్తం వ్యాకులత్వం పొంది, మోక్షమార్గం తొక్కరానిదై పోతుంది. మానవుడు అందరినీ వదలి నిబ్బరంగా ఏకాంత ప్రదేశానికి పోవాలి. నిత్యం ప్రాణులు పుట్టి, కర్మలు చేసి, గిట్టుతూ వుంటారు. దీన్ని చక్కగా గమనించినవాడు మోక్షకాంక్షతో శ్రేయోమార్గంలో పయనిస్తాడు. సంసార వ్యామోహానికి చిత్తం లొంగిపోతే, అతడు ప్రేయోమార్గంలో పడిపోతాడు. వాడికి మోక్షం కలగడం కష్టం. ఎవరైతే అన్నిటినీ సమదృష్టితో చూస్తాడో వాడు ముక్తి పొందుతాడు. సమస్త భూమండలాన్ని పరిపాలించిన మహారాజులు సైతం కాలం చెల్లగానే నేలకొరిగి పోతున్నారు. ఇంద్రియ శక్తులు ఉడిగిపోగానే శరీరం చెడిపోతున్నది. దీన్ని చక్కగా భావించి, సంసారం నిస్సారతను గమనించగలవాడు మోక్షలక్ష్మిని చేపట్టగలడు’.

         భీష్ముడు ఆవిధంగా చెప్పగా విన్న ధర్మరాజు మళ్లీ భీష్ముడితో మరో సందేహాన్ని వ్యక్తపరిచాడు. ధర్మాన్ని ద్వేషించే రాక్షసులకు మంత్రిగా మనగలిగే శుక్రత్వమహిమ శుక్రాచార్యుడికి ఎలా కలిగిందని ప్రశ్నించాడు. సమాధానంగా భీష్ముడు ఇలా చెప్పాడు.

         ‘భార్గవుడు (శుక్రుడి పూర్వ నామం) గొప్ప యోగబలం ప్రదర్శించి కుబేరుడిని వంచించాడు. అతడి ధనాన్ని అపహరించాడు. కుబేరుడు జరిగిన విషయాన్ని శివుడికి చెప్పాడు. కోపం తెచ్చుకున్న శివుడు భార్గవుడిని మింగాడు. కడుపులో నుండి బయటకు రాకుండా దారులన్నీ మూసేశాడు. కాని పురుషాంగం మాత్రం తెరిచి వుంచాడు. భార్గవుడు ఆ దారినుండి బయటకు వచ్చాడు. శివుడి కోపం ఇంకా చల్లారలేదు. అప్పుడు పార్వతి, పుత్ర సమానుడైన అతడి మీద దయచూపమని వేడుకుంది. శివుడు పార్వతి మాటలకు ప్రీతి పొందాడు. భార్గవుడిని తేజోవంతుడిని చేశాడు. తన శిశ్నం నుండి బయటికొచ్చాడు కాబట్టి భార్గవుడిని ఇక ముందు శుక్రుడు అన్న పేరుతో వ్యవహరిస్తారని చెప్పాడు’.

         తన మనస్సుకు ఇంకా-ఇంకా తృప్తి కలిగే విధంగా సద్ధర్మాలను బోధించమని పితామహుడిని ప్రార్థించాడు ధర్మరాజు. సమాధానంగా పరాశర మహర్షి గీతా సారాంశాన్ని వినిపించాడు భీష్ముడు. జనకుడు పరాశర మహర్షిని సద్ధర్మతత్త్వాన్ని గురించి ప్రశ్నించగా ఆయన చెప్పిన సమాదానంలోనే ధర్మరాజు సందేహం కూడా తీరుతుందని అన్నాడు భీష్ముడు. దాని తాత్పర్యం ఇలా సాగుతుంది.

         ‘మానవుడు ఇహపరలోక సుఖాలు ధర్మమూలకాలే అని భావించాలి. ధర్మం ఆచరించి సుఖం పొందాలి. పుణ్యం సుఖాన్నీ, పాపం దుఃఖాన్నీ మానవుడు చేత అనుభవించకుండా వదలవు. చేసే పనులలో అన్యాయం అంటకుండా వుండగలిగితే సన్మార్గం మీద ఆసక్తి కలుగుతుంది. సత్యం, అంతరేంద్రియాలను నిగ్రహించడం, బాహ్యేంద్రియాలను నిగ్రహించడం, హింస లేకుండా వుండడమే సన్మార్గాలు అంటారు. పాపరహితుడైన మానవుడు శ్రేష్టమైన తెలివి అనే పగ్గాలతో, ఇంద్రియాలు అనే గుర్రాలతో లాగబడే కోరికలనే రథాన్ని అపమార్గంలో పోనీయకుండా నిగ్రహిస్తాడు. పవిత్ర కార్యాలలో శరీరం శోభాయమానంగా వుంటుంది. పాపకార్యాలతో చివరకు దానిని బూడిదపాలు చేయడం తగదు’.

         ‘దుష్టకార్యాలు చేయడం మురికి నీటిలో స్నానం చేయడం లాంటిది. పుణ్యకార్యాలు చేయడం మంచినీటి స్నానం లాంటిది. వేదాలను చదవడం వల్ల ఋషి ఋణాన్ని, యజ్ఞాలు చేయడం వల్ల దేవతల ఋణాన్ని, పూజాది సత్కారాలతో అతిథి ఋణాన్ని, పితృకర్మలతో పితరుల ఋణాన్ని, చక్కటి పాలనతో రంజింప చేయడం వల్ల ప్రజల ఋణాన్ని తీర్చాలి. విష్ణు స్తోత్రం, తపస్సు, ధర్మాచరణం అనేవి మనస్సులో గొప్ప జ్ఞానాన్ని కలిగిస్తాయి. అయోగ్యులను యోగ్యులుగా మారుస్తాయి. ఎంతటి దుర్జనుడైనా సజ్జన సాంగత్యంతో పవిత్రుడు అవుతాడు.

         ‘అధిక లాభం కలిగించేదైనా ఆ పని పాపంతో కూడుకుంటే చేయకూడదు. స్వల్పలాభం కలిగించేవైనా పుణ్యకార్యాలను తప్పకుండా చేయాలి. అందువల్ల ఇహ-పర సుఖాలు కలుగుతాయి. నాలుగు వర్ణాలకు సంబంధించిన మానవులు వారి-వారి వర్ణ ధర్మాలను ఆచరించడం ఉత్తమం. ఆయా ధర్మాలలో నేర్పు సంపాదించి తపస్సును ఆశ్రయించినప్పుడే ధర్మార్థ కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. మనుష్యులకు అజ్ఞానం కంటే విరోధి మరొకటి లేదు. ఫలాకాంక్ష లేకుండా సత్కర్మలు చేస్తే నిత్యుడవుతాడు. దేనితోనూ సంగం లేకుండా వుండడం మేలు. సుజ్ఞానం సుగతినిస్తుంది. తపస్సు వల్ల నాశనం వుండదు. ఇది తెలియడమే వేదార్థసారం. ధీరుడిని జ్ఞానలక్ష్మి ఎప్పుడూ వీడిపోదు.

         ‘పెద్దలు కీర్తించే సద్గుణాలు దమం, సత్యం, ఓర్పు అంత మంచి గుణాలా?’ అని ప్రశ్నించాడు భీష్ముడిని ధర్మరాజు తన తరువాత ప్రశ్నగా. ‘హంసగీత వింటే ధర్మరాజు ప్రశ్నకు సరైన సమాధానం దొరుకుతుందని అంటూ దాని తాత్పర్యాన్ని వివరించాడు భీష్ముడు ఇలా.

         ‘వేద సారాంశం సత్యం, సత్యసారరూపం దమం, దమసారాంశం ముక్తి. సత్త్వాదులను పాటించేవారికి మోక్షం కరతలామలకం. ఎవడు మనస్సునూ, మాటనూ, అపమార్గంలో పోనీయకుండా రక్షిస్తాడో అతడి చేతిలోనే వేదం, తపస్సు, త్యాగం వుంటాయి. సత్యం, ఓర్పు, దమం అనే మూడూ శాశ్వతమైన మోక్షాన్ని చేరుకోవడానికి నిచ్చెన మెట్లలాంటివి. అవి సజ్జన సాంగత్యం వల్ల కలుగుతాయి. ఆత్మజ్ఞాన సంపన్నుడైన పండితుడు ఒక్కడే తనలో తాను ఆనందిస్తాడు. చాలామందికి ప్రీతి కలిగిస్తాడు. అంతా అతడిని గౌరవిస్తారు. బ్రాహ్మణుడు వేదాధ్యయనం చేయడం వల్ల దేవత్వం పొందుతాడు. ఉపవాసాది పుణ్యకర్మలు చేయడం వల్ల సాధువుగా ప్రశస్తి పొందుతాడు. నింద్యమైన శీలం కలవాడు దుర్జనుడుగా పిలువబడుతాడు. శౌచం పాటించక పోవడం వల్ల మరణభీతితో దీనుడౌతాడు’.

         భీష్ముడు అలా చెప్పేసరికి విని ధర్మరాజు అతడితో సాంఖ్య శాస్త్రం, యోగశాస్త్రం మధ్యన వున్న భేదాలను, వాటి స్వరూపాలను తెలియచెప్పమని అడిగాడు. సాంఖ్యులు, యోగులు తమ-తమ మార్గాలే మేలైనవని కారణాలు ప్రకటిస్తారు కాని తన దృష్టికి ఆ రెండు మార్గాలు ఒక్కటేనని చెప్పాడు భీష్ముడు. యోగులు ప్రత్యక్షమొక్కటే ప్రమాణహేతువని వాదిస్తారని, సాంఖ్యులు శాస్త్ర ప్రతిపాదితమైన అర్థాలలో విశ్వాసం కలిగి అవే ప్రమాణమని నిరూపిస్తారని, ఏదేమైనా ఈ రెండు మార్గాలవారూ చివరకు పొందే లక్ష్యం ఒక్కటే అని భీష్ముడన్నాడు. సాంఖ్యయోగాల మార్గాలు రెండూ విభిన్నమై కనిపించడమనేది కేవలం శాస్త్రంలో మాత్రమేనని, ప్రాణుల పట్ల హితం, మంచి నియమాలు పాటించడం, శౌచం, ఈ రెండు మార్గాలకూ నియతమైన కార్యాలేనని చెప్పాడు భీష్ముడు ధర్మరాజుకు.     

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, పంచమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

  

                          

        

No comments:

Post a Comment