Monday, July 17, 2023

అహింస తీరుతెన్నులను, ‘నమో నారాయణాయ’ మంత్ర మహిమను వివరించిన భీష్ముడు ..... ఆస్వాదన-129 : వనం జ్వాలా నరసింహారావు

 అహింస తీరుతెన్నులను,

‘నమో నారాయణాయ’ మంత్ర మహిమను వివరించిన భీష్ముడు

ఆస్వాదన-129

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (16-07-2023)

దేవతలూ, బ్రాహ్మణులు, మునిశ్రేష్ఠులు ప్రశంసించే అహింస తీరుతెన్నులను తెలియజెప్పమని ప్రార్థించాడు ధర్మరాజు. జవాబుగా భీష్ముడు, అహింస అనే ధర్మంలో సర్వధర్మాలూ ఇమిడి ఉంటాయనేది సత్యమని, అహింస నాలుగు తీరులలో వుంటుందని, అందులో ఏ ఒక్కటి లోపించినా శ్రేష్టమైన ధర్మపు సాగుదల కుంటుపడుతుందని, మనసుచేత, మాటచేత, దేహంచేత హింస చేయటం, మాంసం తినటం అనేదానితో కలిపి ఆ పద్ధతులు నాలుగైనాయని, హింసను కలిగిస్తుంది కాబట్టి మాంసభోజనం దోషమని, నాలుగు విధాలైన హింసలను మానడమే అహింసలోని నాలుగు గొప్ప పద్ధతులని అన్నాడు. ఈ కారణాన మాంసం మీద ప్రీతిని వదలుకోవడమే అహింసగా ఒప్పుతుందని చెప్పాడు.  

మాంసం పితృదేవతలకు చాలా ఇష్టమైనదని, శ్రాద్ధాన్ని మాంసం ప్రధాన ద్రవ్యంగా సాగించాలని అంటారని, చంపకపోతే మాంసం దొరకడం ఎట్లాగని ధర్మరాజు సందేహం వెలిబుచ్చాడు. మాంసభోజనం వదలటం అశ్వమేధయాగంకంటే కూడా పూజనీయం అని, చంపటం, చంపించటం పాపాలన్నింటికంటె గొప్పపాపమని, శ్రాద్ధాలలో, యజ్ఞాలలో వేదం తెలిపిన హింసవలన దోషం కలుగబోదని, మాంసపు రుచి మరగి తినడానికై ప్రాణులను చంపటంవలన పాపం కలుగుతుందని స్పష్టం చేశాడు భీష్ముడు. మాంసం తనను నమిలినవాడిని నమలుతుందని ఆగమాలు అంటున్నాయని, వేదార్థం చక్కగా తెలిసిన జ్ఞానసంపన్నులు దానం, ధర్మం, తపస్సు, యజ్ఞనిష్ట అనే ఉత్తమ క్రియలన్నీ అహింసకు తక్కువ కాని కార్యాలే అని, నూరేళ్లు చేయనలవి కాని తపస్సు చేయడం, మాంసం మానేయడం వల్ల కలిగే పుణ్యం సమానమని వేదవేత్తలు చెప్పారని అన్నాడు. మాంసాహారం మానటం తపస్సుతో సమానమని మహర్షులు కూడా చెప్పారని, దానం, ధర్మం, తపస్సు, యజ్ఞం, పరిశుద్ధత, మంత్రం, అనుష్ఠానం, సత్యం, ఇవన్నీ అహింసారూపాలే కాబట్టి అహింస ఉంటే సంపదలన్నీఉన్నట్లే అని అన్నాడు భీష్ముడు. 

యుద్ధంలో చచ్చినవారు ఎక్కడికి పోతారో తెలుపమని కోరాడు ధర్మరాజు. కురుక్షేత్రంలో అద్భుతభయంకర యుద్ధంలో దేహాలు వదలిన రాజులకు అనంత సుఖాలు గల గతులు కలగటంలో అనుమానం లేదని, వారందరూ ఉత్తమలోకాలను పొందినవారే అని అంటూ, కీటకానికి వేదవ్యాసుడికీ జరిగిన సంవాదాన్ని వినిపించాడు భీష్ముడు.

‘భయంతో పరుగెత్తుతున్న ఒక కీటకాన్ని అలా ఎందుకు చేస్తున్నావని వేదవ్యాసుడు ప్రశ్నించగా బతుకు ఎంతో సుఖమైనదని, చావు మిక్కిలి దుఃఖాన్ని కలిగిస్తుందని, తనకు అలాంటి భయం వేసి, గుండెల్లో గుబులు పుట్టి పరుగెత్తుతున్నానని జవాబిచ్చింది కీటకం. ప్రాణభీతి ప్రాణికి తక్కువది కాదుకదా అంటుంది. పురుగులకు ఇంద్రియ సుఖాలు పొందే వీలు అంతగాలేదని, దుఃఖాలకు తావైన ఈ దేహం దానికెందుకని, దానికి చావే సుఖం కలిగిస్తుందని, ఆ పద్ధతి ఆలోచించమని వ్యాసుడు సలహా ఇచ్చాడు. పురుగులు కూడా తమ-తమ దారులలో సుఖాలను అనుభవిస్తాయని, అలాగే చావు భయానికి కారణం అవుతుందని, తన గత జన్మ గురించి చెప్పిందా కీటకం. కీటకంతో మరికొంత సేపు సంభాషించి దానిమీద దయ పూని వ్యాసుడు అమృతధారలాంటి చూపును ఆ పురుగు దేహం మీద సారించాడు. అంతా ఆ మహర్షిని పొగిడారు. ఆ పురుగు భక్తితో వ్యాసుడు పాదాల మీద పడి ప్రాణాలు వదిలింది. చనిపోయిన ఆ పురుగు వ్యాసుడి కృపవల్ల అనేక జన్మలు ఎత్తి, ఒక జన్మలో రాజుగా పుట్టింది. దేవేంద్ర వైభవంతో వ్యాసుడి ఆశ్రమానికి పోయింది. వచ్చిన రాజుకు తగిన మర్యాదలు చేసి, ఆవుల కొరకు కాని, బ్రాహ్మణుల కొరకు కాని గొప్ప యుద్ధ నైపుణ్యం వెలువడ చేసి ప్రాణాలు వదలమని చెప్పాడు వ్యాసుడు. అలానే చేసిన రాజు ఆ తరువాత బ్రాహ్మణ జన్మ ఎత్తాడు. ఆ జన్మలో ఎన్నో పుణ్యకార్యాలు చేసి పరలోక సుఖం పొందాడు’.   

ఈ కథ చెప్పిన భీష్ముడు, కురుక్షేత్ర యుద్ధంలో దేహాలు వదిలిన రాజులకు అనంత సుఖాలుగల గతులు కలగడంలో అనుమానం లేదని, ధర్మరాజు బంధువులంతా ఉత్తమ లోకాలను పొందినవారేనని, అందులో అనుమానం లేదని స్పష్టంగా చెప్పాడు. 

విద్య, తపస్సు, దానం అనే వాటిలో ఏది గొప్పదని పితామహుడిని ప్రశ్నించాడు ధర్మరాజు. వ్యాసమైత్రేయ సంవాదం వింటే ధర్మరాజు ప్రశ్నకు సరైన సమాధానం దొరుకుతుందని, దానిని వినమని అన్నాడు భీష్ముడు. ‘ఒకనాడు వ్యాసుడు కాశీ నగరానికి వెళ్లాడు. అక్కడ అంతకు ముందే వున్న మైత్రేయ మహర్షి వ్యాసుడిని గుర్తుపట్టి భోజనం పెట్టి సంతుష్టిపరచాడు. వ్యాసుడు పరమానందంతో “తపస్సు, విద్య మొదలైన ధర్మాలన్నింటిలో దానం గొప్పది. దానాలలో అన్నదానం గొప్పది. ప్రాణాలూ, దేహమూ, దాని బలమూ అన్నం స్వరూపాలే. తపస్సు మనస్సులోని మాలిన్యాల నన్నింటిని తొలగించి వేస్తుంది. విద్యకు అవకాశం కలిగిస్తుంది.  ఆ తపసి చేసిన గొప్పదానం వలన విద్య పెంపొందుతుంది. ఆ విద్య తపస్సును వృద్ధి చేస్తుంది. కాబట్టి తపస్సూ, విద్యాదానం మహిమచేత పెంపొందుతాయి. విద్య వ్రతనిష్టాపరుడికి పరమాత్మను చూపించే దీపం వంటిది.  కాబట్టి అన్నదానం చేత పరమానందం కలుగుతుంది” అని అన్నాడు’.

స్త్రీల సమాచారం వినగోరుతున్నానని ధర్మరాజు అనగా, భీష్ముడు కైకేయీ శాండిలీ సంవాదం గురించి చెప్పాడు. ‘కేకయరాజపుత్రి సుమన అమరావతిలో శాండిలిని చూచి ఇంత శ్రేష్ఠమైన దేవలోక నివాసం ఆమెకు ఏ నడవడివలన కలిగిందని అడిగింది. జవాబుగా శాండిలి తాను అత్తమామలకు ఎదురు చెప్పనని, దేవపూజలు శ్రాద్ధాలు, అతిథి సపర్యలు చేయటంలో ఎడమొగం పెట్టనని, మంచి నడవడితో ఉంటానని, వీథి వాకిలి దాటనని, పకపకా నవ్వనని, విద్య గలవారికి నిర్మలబుద్దితో భిక్ష పెట్టుతూ తక్కిన పనులు చూసుకుంటూ వుంటానని, భర్త ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళకు నీళ్ళు ఇవ్వటం మొదలైన సపర్యలు అనుకూలభావంతో చేస్తానని, బిడ్డలను అలసట లేకుండా తీర్చిదిద్దుతానని, భర్త ఇష్టపడే వంటలు చేస్తానని, ధాన్యాన్నీ, అన్నాన్నీ వ్యర్థపరచనని, బంధువులను తగిన విధంగా గౌరవిస్తానని, ఆవులు మొదలైన పాడిపశువుల సుఖజీవనాన్ని పరీక్షించి సాగిస్తానని, భర్తహృదయం కలతపడకుండా జాగ్రత్త పడుతానని, భర్త నిత్యాగ్నిహోత్రాన్ని ఓపికతో కాపాడుతానని, గర్భిణిగా వున్నప్పుడు బిడ్డకేవి మేలు చేస్తాయో వాటినే భుజిస్తానని చెప్పింది. ఈ విధంగా ప్రవర్తించిన ఉత్తమ వనిత ఇహపరలోకాలు రెండింటిలో శాశ్వతసుఖం పొందుతుంది. ఆ ఇల్లాలు అరుంధతివలె ప్రశంస కెక్కుతుంది’ అని అన్నాడు భీష్ముడు.  

‘సర్వశాస్త్రసారం, సర్వశ్రేష్ఠం అయిన ఆచరణ’ ఏదని తాతగారిని ప్రశ్నించాడు ధర్మరాజు. సమాధానంగా ‘నారద పుండరీక సంవాదం' చెప్పాడు భీష్ముడు. పుండరీకుడు అనే మహర్షి నారదుడుని ఇదే ప్రశ్న అడిగాడని, జవాబుగా నారదుడు ఇట్లా చెప్పాడని అన్నాడు.

‘బ్రహ్మ చెప్పిన పరమ ధర్మం ఒకటి ఉన్నది. ప్రకృతి అనే 24 వ తత్త్వం తరువాత తత్త్వ జీవాత్మ. అతడు సర్వభూతాల స్వరూపం అయినవాడు. అతడి వ్యవహార నామం “నరుడు”. అతడివలన ఏర్పడిన తక్కిన తత్త్వాలన్నీ నారములు. అతడు నారములు స్థానంగా కలవాడు కాబట్టి నారాయణుడు అన్నారు. ఆ ప్రభువు విశ్వాన్ని సృష్టిస్తూ మరల తనలోనే లీనం చేసికొంటూ “విభుడు” అవుతున్నాడు. ఆ నారాయణుడే పరబ్రహ్మం, పరతత్వం, పరమపదం, ఈశ్వరుడు, విష్ణువు అనే పేర్లతో పిలువబడుతూ ఉంటాడు. అతడే వాసుదేవుడు. ఆత్మ అనే పేర్లతో ఉపనిషత్తులు పిలుస్తాయి. ఈ పేర్లు నరుడికి కూడా వర్తిస్తాయి. సర్వశాస్త్రాల వాక్యాలను పరిశీలించి నిర్ణయించిన తాత్పర్యమిది. కాబట్టి ఎల్లవేళలా నారాయణుడిని స్మరించాలి. మరణకాలంలో “నమో నారాయణాయ” అనే మంత్రాన్ని పలికితే నరులు ప్రణవానికి అర్థమైన పరమపదాన్ని పొందుతారు’.

దానం, ప్రియభాషణం అనే రెండింటిలో ఏది ఎక్కువ ప్రీతి కలిగిస్తుందని అడిగాడు ధర్మరాజు పితామహుడిని. రెండూ ప్రీతి కలిగించేవేనని, దానం ప్రీతికరమైనదని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదని,  ప్రియభాషణం కూడా ప్రీతికరమైనదనటానికి ఒక పురాతన కథ ఉన్నదని అంటూ దాన్ని వివరించాడు భీష్ముడు.

మాటకారి, బుద్ధిశాలి అయిన ఒక బ్రాహ్మణుడు జనసంచారంలేని అడవికి పోయాడు. ఒక రాక్షసుడు అతడి మాంసం తినగోరి అతడిని పట్టుకొన్నాడు. అతడు కలతపడకుండా ఆ రక్కసుడి మొగంవైపు చూస్తూ ఉండిపోయాడు. ఆ రక్కసుడు ఆశ్చర్యపోయి తన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పితే బ్రాహ్మణుడిని వదలుతానని ఇలా ప్రశ్నించాడు. “నా శరీరం కృశించిపోవటానికి, పాలిపోవటానికి కారణం ఏమిటి?” అని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు తొందరపడక నిబ్బరంగా, అనుకూలభావంతో ఇట్లా చెప్పాడు.

'చుట్టాలు నీ దుష్టస్వభావంతో విసిగి వదలి తరువాత బాధపడటం, దారిద్ర్యం కలిగినప్పుడు అపూర్వ గౌరవాలు కోరటం, ఇతరులు పెట్టిన బాధలను నీవు మొగమాటంవలన అనుభవించగా వారు జయించామని పొంగిపోవటం, జాలి తలచి నీవు మేలు చేయగా ఆ మేలు పొందినవాడు అది తన పరాక్రమమే అని చెప్పటం, బుద్ధి కలవారు నిన్ను పొగడుతూ ఉంటే సిగ్గుపడుతూ పండితుల మెప్పుకొరకు చూస్తూ ఉండటం, నీవు న్యాయంగా పలికిన దానిని జనసభ అంగీకరించకపోవటం, నీ తప్పు నీ భార్యకు తెలిసి ఆమె కుమిలిపోతూ ఉంటే ఆమెను నీవు సముదాయించ లేకపోవటం, నీ సొమ్మును కొట్టివేయాలని ఇతరులు కనిపెట్టుకొని ఉంటే దానికి ఏది దిక్కు అని నీవు ఆలోచిస్తూ ఉండటం, దుర్మార్గుడు చాటున నిన్ను గూర్చి చేసిన నిందలను నీ బంధువులు వినాలని భావించటం, నీవు గొప్ప పనులు చేస్తూ ఉంటే నీ స్నేహితులు నిన్ను మాయలవాడిగా భావించటం, నీ మనసులో ఉన్న వగపును బయట పెట్టుకోలేకపోవటం, భార్య, కొడుకు, అల్లుడు మంచి నడవడిలేనివారై తిప్పలు పెట్టటం, తండ్రి, తల్లి, అన్నదమ్ములు రోగాదులచేత కృశించటం, పూర్వజన్మలో బ్రాహ్మణుడి ఆవును చంపడం, పనికిమాలినవాడిని పనిలో పెట్టుకొని పేరు పాడుచేసికొనటం, ఎంతోకాలం ఎన్నో ప్రయత్నాలు చేసి ఒక కొలికికి తెచ్చిన పనిని నీచుడైన పగవాడు పాడుచేయటం, వీటిలో ఒకదానిచేత మానవుడు కృశిస్తాడు. పాలిపోతాడు’.

ఈ విధంగా ఆ బ్రాహ్మణుడు స్పష్టంగా చెప్పాడని, అది విని ఆరాక్షసుడు  మెచ్చుకొని అతడిని విడిచి పెట్టాడని, మంచి మాటల తీరు ఇలా వుంటుందని భీష్ముడు చెప్పాడు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఆనుశాసనిక పర్వం, చతుర్థాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

No comments:

Post a Comment