Friday, September 1, 2023

కూలుతున్న కులవృత్తులు (‘కులవృత్తికి సాటి లేదు గువ్వల చెన్నా’ : ఇది ఇంకా నిజమేనా?) : వనం జ్వాలా నరసింహారావు

 కూలుతున్న కులవృత్తులు

(‘కులవృత్తికి సాటి లేదు గువ్వల చెన్నా’ : ఇది ఇంకా నిజమేనా?)

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక (02-09-2023)

హైదరాబాద్ నగరంలో, ఆమాటకొస్తే చిన్నా, చితకా పట్టణాలతో సహా అనేక నగరాలలో, పట్టణాలలో లెక్కకు మించి బంగారు, వెండి దుకాణాలున్నాయి. కాకపోతే, ఈ దుకాణాలను నడుపుతున్నదీ, అమ్మకాల ద్వారా లాభాలను ఆర్జిస్తున్నదీ, అనాదిగా కులవృత్తులను నమ్ముకుని జీవనాధారం సాగిస్తున్న ‘కంసాలీలు’ కాదు. బడా వ్యాపారవేత్తల దగ్గర వారిలో కొందరు ప్రత్యక్షంగా-పరోక్షంగా పనిచేస్తుంటారనీ, వారి చేతుల్లో కులవృత్తులు వున్నాయనేది రహస్యమేమీ కాదు. అక్కడక్కడా ఒకరిద్దరో కంసాలీలు స్వయంగా వెండి, బంగారు నగల తయారీమీద ఆధారపడి జీవనం వెళ్లదీస్తున్నప్పటికీ, అంతంత మాత్రమే సంపాదన వున్న అలాంటివారు ఎంతమంది వున్నారో లెక్కలు లేక పోవచ్చు. ఆ ప్రయత్నం జరుగుతే మంచిదేమో!

60-70 సంవత్సరాల క్రితంనాటి మాచిన్నతనంలో, ప్రతిగ్రామంలో, కంసాలి, వడ్రంగి, వ్యాపారం చేసుకునే (కోమటి కొట్టు) వైశ్యుడు, వెనుకబడిన వర్గాలతో సహా వ్యవసాయం చేసుకునే వివిధ కులాల వారు, పూజారి, సాలె, కమ్మరి, కుమ్మరి, మోచీ, గాజులు అమ్మేవారి లాంటి ఎందరో వారివారి కులవృత్తులమీద ఆధారపడి జీవించేవారు. గ్రామీణుల అవసరాలను వారే తీర్చేవారు. కాలానుగుణంగా వస్తున్న శీఘ్ర మార్పుల ప్రభావం వీరిమీద తీవ్రంగా పడడంతో, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిననాటి నుండి, యుద్ధప్రాతిపదికన, ఎంతగా, ఎన్నిరకాల ఆర్ధిక సహాయం, ఇతర రకాల వనరుల సహాయం వారికి అందిస్తున్నప్పటికీ, పథకాలు అమలు చేస్తున్నప్పటికీ, ఎక్కువ శాతం మంది వారసత్వంగా లభించిన కులవృత్తుల మీద ఆధారపడి పల్లెల్లో నివసిస్తూ జీవనం సాగించలేక నగరాలకు, పట్టణాలకు వలసపోతున్నారు. తప్పు మార్పుదా? పోటీ ప్రపంచానిదా? కులవృత్తుల మీద ఆసక్తి తగ్గిందా? సీరియస్ గా అధ్యయనం చేయాల్సిన అంశం.  

ఇలారాయడానికి సందర్భం వున్నది. హిందూ సంప్రదాయంలో, పెళ్లైన అమ్మాయిలు మెళ్లో మంగళసూత్రం, కాలికి మెట్టెలు నిరంతరం ధరించే సంప్రదాయ వుంది. కొన్ని సందర్భాలలో, ఉదాహరణకు, శస్త్రచికిత్స చేయించుకునే ముందర, లేదా ఎక్స్ రే తీసే ముందర వీటిని కొంతకాలం తీయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇలాంటి అవసరం మా శ్రీమతికి కలగడంతో, తీసిన మెట్టెలు, పాదాల వెండిపట్టీలు మెరుగుపెట్టించి ధరించడానికి హైదరాబాద్ అమీర్ పేటలోని ఒక వెండి షాపుకు ఇటీవల ఒకనాడు వెళ్లాం. దాని యజమాని తన షాపు ముందర, చిన్న సొరుగుల బల్లలో సామాగ్రిని పెట్టుకుని, పనిచేసుకుంటున్న వ్యక్తికి ఆపని అప్పచెప్పడం, అతడు రు. 150 లకే ఆపనిని పూర్తిచేసి, ధరించడానికి కూడా సహాయం చేసి,కులవృత్తికి సాటి లేదు గువ్వల చెన్నా’ అన్న నానుడి తరహాలో, తాను ‘కంసాలిని అని, సగర్వంగా, సంతోషంగా చెప్పాడు. సంపాదన ఎంత అంటే చిరునవ్వే సమాధానం.

శ్రీమద్భాగవతంలోని విరాట్పురుషుడి సృష్టి రహస్యం జ్ఞప్తికివచ్చింది. స్వర్గం, భూమి, ఆకాశం ఎలా ఏర్పడ్డాయో, వేదాలు ఎలా పుట్టాయో లాంటి విషయాలు, వేదకాలంనాడు చేసిన గుణకర్మల విభజన స్ఫురణకు వచ్చాయి.. వేదాధ్యయనం చేయడానికి బ్రాహ్మణులని, రక్షణ కొరకు క్షత్రియులని, వ్యవసాయం, గోపరిరక్షణ, వ్యాపారం చేయడానికి వైశ్యులని, కులవృత్తులు చేసుకునే వారిని వెనుకబడిన వర్గాల వారని చేసిన విభజన అది. దీన్నే శ్రీకృష్ణ భగవానుడి (భగవద్గీత) మాటల్లో చెప్పుకోవాలంటే, ‘చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః ; తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్’. (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే నాలుగు వర్ణాలవారు గుణకర్మల విభాగాన్ని అనుసరించి ‘నా చేత సృష్టించబడ్డారు’). ఆ విభజనలోని హేతుబద్ధత, అసంబద్ధత, వివాదాస్పదత, చర్చనీయాంశం కావచ్చు. అది వేరే విషయం.

ఒక్క విషయం మాత్రం చెప్పుకోవాలి. జాతులు పెరుగుతూ తరుగుతూ వస్తున్నప్పటికీ, వర్ణాలు మాత్రం నాలుగు గానే వుండిపోయాయి. చాతుర్వర్ణ వ్యవస్థను, అది వేదకాలం నాడో, మరెప్పుడో, ఎవరు, ఎప్పుడు, ఏకారణాన సృష్టించినప్పటికీ, ఎలా రూపాంతరం చెందినప్పటికీ, ఒక సామాజిక అవసరాన్ని, బాధ్యతను మాత్రం చాలాకాలం నిర్విఘ్నంగా నిర్వహించింది. ఎవరు కూడా తాము ఫలానా కులంలో పుట్టామని గర్వ పడాల్సిన, లేదా, బాధ పడాల్సిన అవసరం లేకుండా చేసింది. ఒక కులంలో పుట్టినందుకు వేరే కులం వారిని తక్కువగా కాని, ఎక్కువగా కాని చూడాల్సిన అవసరమూ కలగలేదు.

కాలం మారింది. ఆచార వ్యవహారాలు మారిపోయాయి. ఇప్పుడు వేదాధ్యయనం కేవలం బ్రాహ్మణులే కాకుండా, అర్హత, సామర్థ్యం వున్నవారెవరైనా చేయవచ్చు, నేర్పనూవచ్చు. వేదాలమీద భాష్యం రాసినవారిలో బ్రాహ్మణేతర ప్రముఖులు చాలామంది వున్నారు. రక్షణ సేవల్లో చేరడానికి క్షత్రియ కులంవారే కావాలని నిబంధన లేదు. క్షత్రియేతరులు ఎందరో ఉన్నత రక్షణ స్థానాల్లో పనిచేశారు, చేస్తున్నారు. వ్యవసాయం, గోపరిరక్షణ, వ్యాపారం లాంటివి చేయడానికి అందరూ అర్హులే. వీటి లాభనష్టాలు ఏమిటో కాని,  సర్వ సాధారణంగా కులవృత్తులు చేసుకునే వెనుకబడిన వర్గాల వారిమీద ఈ ప్రభావం బాగా పడింది. ప్రభుత్వం ఎన్నివిదాలుగా, ఎంత సహకారం చేసినా, పోటీకి తట్టుకుని నిలబడే పరిస్థితి లేదు. ఎవరి కులవృత్తి వారే చేసుకోవడం గిట్టు బాటు కాకపోవడంతో, తమతమ కులవృత్తిలో కొనసాగుదామని అనుకున్నా, అందుకు తగిన సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు లేకపోవడం వల్ల నిరుత్సాహపడి, వేరే పనులవైపు మళ్ళిపోతున్నారు. దీన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి మెరుగుపర్చాలి.

ఒకానొక రోజుల్లో ఇన్ని వెండి-బంగారం దుకాణాలు వుండేవి కావు. ప్రతి గ్రామంలో, నగరం, పట్టణంలో వున్న కంసాలీలతోనే వెండి, బంగారం ఆభరణాలన్నీ, ప్రత్యేకించి వివాహాల సమయంలో, తయారు చేయించేవారు. నగరాలలో ఒక అర డజన్ వెండి బంగారు దుకాణాలు వున్నప్పటికీ అవన్నీ కంసాలివారివే. కావాల్సిన వస్తువులన్నీ వారే నైపుణ్యంతో, కల్తీ లేకుండా తయారు చేసి ఇచ్చేవారు. అప్పట్లో ‘మంగళ సూత్రం, ‘మెట్టెలు కంసాలి తయారు చేసి తనదగ్గరే భద్రంగా వుంచుకుని, నమ్మకంగా వివాహానికి కొన్ని గంటల ముందర తెచ్చి ఇచ్చేవాడు. పెళ్లికి ముందర పెళ్లివారి ఇంట్లో ఒక రాత్రి వుండ కూడదనేది ఒక ఆచారం. ఇప్పుడు అంతా అసహజమై, యాంత్రీకమై, వెండి, బంగారు ఆభరణాలు చేసేది కంసాలీలేనా? వారికి ఉపాధి వున్నదా లేదా? సంపాదన ఎంత? అనే అనుమానం కలుగుతున్నది.

ఇది ఒక్క కంసాలీల విషయంలోనే కాదు. గ్రామాలలో నివసించే ఒకరిద్దరు వడ్రంగి కులస్తులు వ్యవసాయ పనిముట్లయిన ‘అరకలు’, ‘నాగళ్లు’, ‘బురద నాగళ్లు’, ‘దంతెలు’, ‘బండి రోజాలు’ లాంటివి తయారు చేస్తుంటే బలే ముచ్చటగా వుండేది. బండి చక్రాలకు రోజాలను అమర్చడం కష్టతరమైన పని. ఇనుముతో తయారు చేసిన రోజాను కొలిమిలో కాల్చి, అది ఎర్రగా వున్నప్పుడు, చక్రానికి తొడిగేవారు. అలానే బండి ‘ఇరుసు’ తయారు చేసే విధానం కూడా చాలా కష్టమైంది. ఇప్పుడు వ్యవసాయం మొత్తం యాంత్రీకమైపోయింది. ట్రాక్టర్లు వచ్చిన కొత్తలో వింతగా వుండేది. సర్దుకునే లోపునే నాటు మిషన్లు, కోత మిషన్లు, తూర్పారబట్టే మిషన్లు, ఇలా ఎన్నో వచ్చాయి. వడ్రంగులకు ఉపాధి లేకుండా పోయింది. పల్లెలనుండి వలసపోయిన అలాంటివారు వేరే వృత్తుల్లో వున్నారా? లేరా? లెక్కలు లేవు!!!

ఒక పరిచయస్తుడు తన స్వానుభవంగా చెప్పిన విషయం ఆసక్తికరంగా వున్నది. అతడు 1977 లో 10 వ తరగతి తప్పి కులవృత్తి వడ్రంగం పనిలో చేరానని, రెండేళ్లకు సొంతంగా ‘దాయి’ అని పిలవబడే, అరకల, నాగళ్ల కార్ఖానాను (కొలిమికొట్టం) ఏర్పాటు చేసుకుని, నాలుగేళ్లలో రెండెకరాల భూమి కొని ఇద్దరు చెళ్లెల్ల వివాహాలు చేసానని, 1984 లో అతడి గ్రామంలో తొలి ట్రాక్టర్ వ్యవసాయం మొదలవడం వల్ల, కొద్దికాలంలోనే యెడ్లు, దున్నలతో పొలం దున్నేవాడే లేకుండా పోయాడని చెప్పాడు. దాదాపు 5-6 మందితో పనులు చేయించుకునే తాను, తనకే పనిలేక, పొట్ట చేతపట్టుకుని హైదారాబాదు వచ్చానని, అన్నాడు. హైదరాబాద్ పరిస్థితి గురించి చెప్తూ, బైట రాష్ట్రాలవారి తాకిడితో ఇక్కడా పనిలేకుండా పోయిందనీ, ఈ కారణాన కొత్తగా వృత్తులు నేర్చుకునే యువత లేరని కూడా అన్నాడు.

మా చిన్నతనంలో ప్రతి గ్రామంలో ‘సాలె వారని వుండేవారు. గ్రామస్తులకు అవసరమైన దుప్పట్లు లాంటివి వారే నేసి ఇచ్చేవారు. ‘ఏడు మూరల దుప్పట్లు అని మా చిన్నతనంలో దొరికేవి. అవి చలి కాలంలో, వేసవి కాలంలో కూడా ఉపయోగపడేవి. ఇప్పుడు చాలా గ్రామాలలో అవి లభ్యం కావడం లేదు. ప్రతిగ్రామంలో బట్టలు కుట్టే దర్జీ వారుండేవారు.  రెడీమేడ్‌ బట్టలు విరివిగా రావడం వల్ల దర్జీల దగ్గర బట్టలు కుట్టించుకొనేవారు తక్కువయ్యారు. కుట్టడానికి అవసరమయ్యే సరంజామా ధరలు పెరగడం వారిని మరింత ఇబ్బందికి గురి చేసింది. దీనితో వీరి జీవన భృతికి ఆటంకం ఏర్పడి కుటుంబ పోషణ జరగడం కష్టంగా తయారైంది. ఇప్పుడు దుర్భిణీ వేసుకుని చూసినా దర్జీ కనపడడు.

అలాగే గ్రామీణుల పాదరక్షల అవసరాలను తీర్చే మోచీలు కూడా తమ జీవనోపాధి కోల్పోవడానికి కారణం వారి వృత్తిని వ్యాపారులు తమ లాభార్జన కోసం చేపట్టి వీరిని పోటీలో నిలబడకుండా చేయడమే. ఒకప్పుడు కేవలం నాయీ బ్రాహ్మణులే (గ్రామాల్లో మంగలి అని పిల్చేవారు) చేసే పనిని, నగరాలలో పార్లర్లని, సెలూన్లని, మసాజ్ లని, రకరకాల పేర్లతో అనేకమంది వ్యాపార ధోరణితో నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ సహాయం వల్ల గ్రామాలలో కొందరు ఆ వృత్తిని వదలకపోయినప్పటికీ, పలువురు నగరాలకు, పట్టణాలకు వలసపోయారు. అభివృద్ధి వల్ల జరుగుతున్నది మంచా? చెడా? మంచీచెడూల మిశ్రమమా?

మరో స్నేహితుడు ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. ఒకపుడు ‘గుర్రాలకు నాడాలు వేసే వృత్తి ఉండేదని, గుర్రాలు పోయి సైకిళ్లు, మోటారు సైకిళ్లు వచ్చాక పంక్చర్లు వేసే వృత్తి వచ్చిందని, ఇపుడు ట్యూబ్‌లెస్ టైర్లు వచ్చాయని, వాటికి పంక్చర్లు అరుదని, బైక్ మెకానికుల కడుపును ఎలక్ట్రిక్ బైకులు కొడతాయని, పెట్రోలు డిమాండు తగ్గితే కొన్ని బంకులు మూతబడి ఉద్యోగాలు ఊడతాయని, ఒకపుడు బిందెలకు, బకెట్లకు మాట్లు వేసి బతికేవారు ఇపుడు పాత సామానుకొంటామని తిరుగుతున్నారని చెప్పాడు.

గోరేటి వెంకన్న గారి పాట ‘పల్లె కన్నీరు పెడుతుందో’ లోని అక్షరం, అక్షరం గుర్తుకొస్తున్నది. వన్నె తగ్గి, చిన్నబోయిన కంసాలి వీధులు; దుమ్ము పేరిన కమ్మరి కొలిమి, మొద్దు బారిన పెద్దబాడిస; సడుగులిరిగిన సాలెల మగ్గం; చేతులిరిగిపోయిన చేతివృత్తులు; పనులెతుక్కుంటూ పట్నంపోయిర విశ్వ కర్మలు; మూలపొయ్యి సిలువెక్కిపోయిన మేరోళ్ళ సేతులకత్తెర; సప్పుడాగిన కుట్టు మిషన్లు; ‘పల్లెకు వృత్తులు కూలె, ఉపాధి పోయె, ప్రత్యామ్నాయం లేకనె పోయె’ ..... ఇలా ఎన్నో గుర్తుకొచ్చాయి. అంతా బడావ్యాపారుల ‘మాల్స్ మయమైన సమాజం కళ్లముందర కనిపిస్తుంటే భవిష్యత్తులో చిరు వ్యాపారులు ఏంకావాలి?

ఇదిలా వుంటే,కృత్రిమ మేధస్సు చెప్పినట్లు నడుచుకోవడమే భవిష్యత్తులో మన కర్తవ్యమ్ కానున్నదేమో? ఏమో, ఎవరికీ ఎరుక?  

 

No comments:

Post a Comment