Friday, May 31, 2024

రాజనీతిజ్ఞుడికి అపజయమే లేదు : వనం జ్వాలా నరసింహ రావు

 రాజనీతిజ్ఞుడికి అపజయమే లేదు

వనం జ్వాలా నరసింహ రావు

నమస్తే తెలంగాణ దినపత్రిక, వేదిక కాలమ్ (31-05-2024)

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను గతేడాది జూన్ 2 న ప్రారంభించి, 21 రోజుల పాటు ద్విగ్విజయంగా నిర్వహించారు. ఆ ఉత్సవాలకు కొనసాగింపుగానో, లేదా వాటికి సంబంధం లేకుండానో, రాష్ట్రం ఏర్పాటై పదేండ్లు పూర్తి కావస్తున్న సంసర్భంగా, ఈ ఏడాది జూన్ 2 న, దశాబ్ది ఉత్సవాలు జరపాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం బృహత్తర ప్రణాళికను రూపొందించింది. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీని ఆహ్వానించాలని కాబినెట్ నిర్ణయించింది. దీంతో నిమిత్తం లేకుండా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, బిఆర్ఎస్ పార్టీ మూడు రోజుల పాటు ‘ఉత్సవాల ముగింపు వేడుకలను’ నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తున్నది.

1956 నుండి అప్రతిహతంగా సాగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం చారిత్రాత్మకమైన ఒక ఎడతెగని అవిశ్రాంత, నిరంతర పోరాటం. ఏఒక్క వ్యక్తి కానీ, ఒక్క గ్రూపు కానీ, ఒక్క రాజకీయ పార్టీ కానీ, ఒకరిద్దరు మేధావులు కానీ, ఒకరిద్దరి రచనలు-పాటలు కానీ, కొందరి ఎలెక్ట్రానిక్ మీడియా విశ్లేషణలు కానీ, పత్రికా వ్యాసాలూ కానీ కాకుండా, వీరందరితో సహా ఆబాల తెలంగాణ గోపాలం, అనేక మంది ‘మరువబడ్డ, మరుగునబడ్డ’ వీరుల పోరాట కారణానే జూన్ 2, 2014 న ‘ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. ఈ మహానీయులందరి గురించి, సమకాలీన వర్తమాన తెలంగాణ చరిత్రలో, అదెప్పుడు నిష్పాక్షికంగా రాస్తే, అప్పుడే, సువర్ణాక్షరాలతో లిఖించడం సమంజసం కాని, ఎంపిక చేసిన ఏ ఒకరిద్దరినో ప్రభుత్వ పరంగానో, కొన్ని ప్రభుత్వేతర సంస్థల పరంగానో సన్మానించడం బహుశా అంతగా సబబు కాదేమో!

అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఇంతమంది ఎన్నివిదాలుగా రాష్ట్రసాధనకు కారణభూతులైనప్పటికీ, అత్యున్నత నాయకత్వ స్థాయికి చెందిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ‘తుదిదశ’ ఉద్యమంలో తనదైన అరుదైన శైలిలో, ‘మహాత్మా గాంధీ సంపూర్ణ శాంతియుత పోరాట నమూనాలో’, ఆ మార్గంలో, రాష్ట్ర సాధన ఉద్యమానికి సారధ్యం వహించి, అందరినీ ఏకతాటిమీద నడిపించి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మద్దతు పొందే దిశగా, దేశవ్యాప్తంగా వున్న 36 రాజకీయ పార్టీలను వ్యూహాత్మకంగా ఒప్పించి, అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీకి, రాష్ట్ర ఏర్పాటు చేయడం మినహా గత్యంతరం, ప్రత్యామ్నాయం లేకుండా చేశారు. అందువల్ల, కేసీఆర్ పేరు, లిఖించబోయే సమకాలీన వర్తమాన తెలంగాణ చరిత్రలో, ముఖ్యంగా ‘తెలంగాణ ఆవిర్భావ, తెలంగాణ అభివృద్ధి’ అధ్యాయాలలో, అగ్రభాగాన, సవివరంగా వుండడం అత్యంత సమంజసం.

రాష్ట్ర ఏర్పాటు తరువాత ప్రజల అభీష్టం మేరకు, తొలి, మలి ముఖ్యమంత్రిగా ఎన్నికై, తొమ్మిదిన్నర సంవత్సరాలు పదవిలో ఉన్న కేసీఆర్, జార్జ్ బెర్నార్డ్ షా ఒకానొక ప్రబోధానికీ ప్రతిరూపంగా ఉన్నాడని చెప్పవచ్చు. ‘సాధారణ ప్రజలు ప్రపంచానికి అనుగుణంగా మారుతారు. అసాధారణ వ్యక్తి ప్రపంచాన్నే తనకు అనుగుణంగా మార్చడానికి ప్రయత్నిస్తాడు. ప్రపంచ పురోగతి, బహుళార్థ అభివృద్ధి, వైవిధ్యభరితమైన మార్పు  అసాధారణ వ్యక్తుల ద్వారా మాత్రమే జరుగుతుంది’ అని బెర్నార్డ్ చెప్పిన వాక్యాలు, కేసీఆర్ విషయంలో అక్షర సత్యాలు. అటువంటి అసాధారణ వ్యక్తైన కేసీఆర్, తన పదేళ్ల పదవీకాలంలో తన ‘వినూత్న ఆలోచనలతో {ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్} పకడ్బందీ వ్యూహాలతో, సమస్యలకు పరిష్కారాలు సృజనాత్మకతతో కనుగొనడంతో, పాలనలో అద్భుతమైన కనీ వినని మార్పు తీసుకువచ్చాడు. సంక్షేమం, అభివృద్ధి అంటే ‘ఇదీ అని సోదాహరణంగా, త్రికరణశుద్ధిగా చేసి చూపించాడు. ‘తినబోయే పదార్ధం రుచి తినడంలోనే వుంది అన్న నానుడి ప్రకారం, పది సంవత్సరాల్లో, విజయవంతంగా ‘కేసీఆర్ తరహా తెలంగాణ అభివృద్ధి నమూనా’ ను యావత్ భారత దేశం ముందు సగర్వంగా ఉంచారు. దేశ చరిత్రలోనే ఈ నమూనా ఒక చెరిగిపోని, చెరపలేని ముద్రను వేసింది.

కేసీఆర్ లో గాంధీయ విలువలు, నెల్సన్ మండేలా విధానం, విన్‌స్టన్ చర్చిల్ వ్యూహం, జవహర్‌లాల్ నెహ్రూ సిద్ధాంతం, లీ కువాన్ యూ నిబద్ధత, పివి నరసింహా రావు ప్రగతిశీల సంస్కరణలు, డాక్టర్ ఎం చెన్నారెడ్డి ఉద్యమ స్ఫూర్తి ప్రస్ఫుటంగా దర్శనమిస్తాయి. ఉదాహరణకు, తన మొట్టమొదటి విదేశీ పర్యటనలో సింగపూర్ సందర్శించినప్పుడు, అక్కడి అసాధారణమైన, అద్భుతమైన అభివృద్ధిని చూసి, ఆశ్చర్యపోయి, తెలంగాణ అభివృద్ధి విషయంలో అప్పటికే ఒక స్థిరాభిప్రాయానికి వచ్చిన కేసీఆర్, సింగపూర్ అభివృద్ధిని కూడా ఆదర్శంగా తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. సింగపూర్ మొదటి ప్రధాని లీ కువాన్ యూ లాగా, కేసీఆర్ కూడా ‘తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం’ పై తదేక దృష్టి సారించారు. ‘సింగపూర్ జాతిపిత’ గా పిల్చుకున్న లీ కువాన్ యూ, ఆ దేశాన్ని ధనిక దేశంగా, ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మార్చినట్లే, కేసీఆర్ కూడా ‘తెలంగాణ రాష్ట్ర పిత’గా అభిమానుల ఆదరాభిమానాలు పొంది, రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధిలో, తలసరి ఆదాయం పెరుగుదలలో, గణనీయమైన ఫలితాలు సాధించాడు. దేశానికే ఆదర్శంగా తెలంగాణాను నిలిపాడు. కేసీఆర్ ఎల్లప్పుడూ లీ కువాన్ పుస్తకం 'సింగపూర్: ఫ్రం థర్డ్ వరల్డ్ టు ఫస్ట్' గురించి మాట్లాడేవాడు.

భారతదేశం ప్రప్రధమ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూకు, కేసీఆర్ కు కొన్ని ప్రాముఖ్యతాంశాలలో, ముఖ్యంగా పంచాయతీ రాజ్ సంస్థలను బలోపేతం చేసే అంశంలో సమీప సారూప్యత వున్నది. అనేక సందర్భాలలో నెహ్రూ, ‘ఎస్ కె డే’ ల ప్రధమ కలయిక జరిగిన నేపధ్యం, దరిమిలా ఆ అపురూప కలయిక భారతదేశంలో గ్రామీణాభివృద్ధి దిశగా, పంచాయితీ రాజ్ స్థానిక సంస్థల, సహకార సంస్థల ఆవిర్భావానికి, కమ్యూనిటీ అభివృద్ధికి ఎలా తోడ్పడిందో వివరించేవారు కేసీఆర్.

వాస్తవానికి నెహ్రూ ప్రధాని అయిన కొత్తలో, ప్రధమ పంచ వర్ష ప్రణాళిక రూపుదిద్దుకునే దశలో, ఒక పర్యాయం యుఎస్ఎ పర్యటనలో వుండగా, అధ్యక్షుడు ఐసెన్ హోవర్ సూచనపై, ఆయనకు సలహాదారుడిగా అప్పట్లో పనిచేస్తున్న ఎస్ కె డేను కలవడం జరిగింది. తొలుత స్వదేశానికి రమ్మని నెహ్రూ ఆహ్వానించినప్పుడు, సున్నితంగా తిరస్కరించిన డే, భారత దేశంలో నెహ్రూ నాయకత్వంలో జరుగుతున్న మార్పులను గమనించి, అమెరికాలో పెద్ద ఉద్యోగాన్ని వదిలి, భారతదేశానికి వచ్చి, పంచాయతీ రాజ్, సహకార సంస్థల, కమ్యూనిటీ అభివృద్ధికి చేసిన కృషి, నెహ్రూకు అందించిన సహకారాన్ని కేసీఆర్ స్ఫూర్తిగా తీసుకునేవారు.

నెహ్రూ ఆలోచనా సరళిలోనే, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం కొరకు ఒక ఆదర్శ వేదికగా అభివృద్ధి చేసారు. ప్రతి గ్రామాన్ని, సుసంపన్నంగా, దేనికి దాన్నే ఒక ఆదర్శ గ్రామంగా, పచ్చదనంతో, పరిశుభ్రతతో నిండిన చోటుగా, స్థానిక స్వపరిపాలన పటిష్టంగా సాగే దిశగా మార్చడానికి ఉద్దేశించిన పంచాయతీ రాజ్ చట్టం దేశానికే ఒక నమూనా చట్టం. దీని రూప కల్పనలో అలనాటి నెహ్రూ నిబద్ధత కేసీఆర్ లో ప్రతిబింబిస్తుంది. భూ రికార్డుల ప్రక్షాళన, సమగ్ర సర్వే, ధరణి పోర్టల్ రూపకల్పన చేపట్టినప్పుడు, కేసీఆర్ ను పీవీ నరసింహా రావుతో పోల్చి, ఆయన ‘భూసంస్కరణల పునఃప్రారంభ మార్గదర్శకుడు’ గా పలువురి మన్నలను పొందాడు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి స్ఫూర్తి నింపుకుని, మలి దశ రాష్ట్ర మహోద్యమాన్ని విజయవంతంగా నడిపించారు.

మరో విషయంలో కూడా నెహ్రూతో కేసీఆర్ ను దగ్గరగా పోల్చవచ్చేమో! ఏ విధంగానైతే గ్రామీణాభివృద్ధిలో నిపుణుడైన ఎస్ కే డే, అమెరికాలో ఉన్నత ఉద్యోగంలో పనిచేస్తున్నప్పుడు భారతదేశానికి ఆహ్వానించి, కీలకమైన బాధ్యతలు అప్పగించి, దేశాబివృద్ధికి నెహ్రూ బాటలు వేశాడో, అదే విధంగా, కేసీఆర్ సహితం రాష్ట్రానికి వెలుపల కీలక పదవులలో బాధ్యతలు నిర్వర్తిసున్న వివిధరంగాల నిపుణులను, తెలంగాణ అభివృద్ధి కోసం వారి విలువైన సేవలను అందించడానికి స్వయంగా ఆహ్వానించారు. ఉదాహరణకు ఒకరిద్దరి పేర్లు చెప్పుకోవాలంటే,  ప్రపంచ బ్యాంక్ కన్సల్టెంట్ గా సేవలందించిన ఆర్ధికరంగ నిపుణుడు డాక్టర్ జి ఆర్ రెడ్డిని రాష్ట్ర ఆర్ధిక సలహాదారుడిగా నియమించారు, ‘కోల్ ఇండియా చైర్మన్’ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఏస్ అధికారి, ఒక ‘నడిచే విజ్ఞాన సర్వస్వం అని చెప్పాల్సిన ఎస్ నర్సింగ్ రావును, సిఎ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. వారిద్దరి సహకారం గణనీయమైనది.

చైనాలో ‘వర్ల్డ్ ఎకనామిక్ ఫోరం ఆద్వర్యంలో నిర్వహించిన ‘ఎమర్జింగ్ మార్కెట్స్ ఎట్ క్రాస్ రోడ్స్’ అనే అంశంపై క్లుప్తసుందరంగా కేసీఆర్ చేసిన ప్రసంగం, ఆయనలో ఒక రాజనీతిజ్ఞుడిని, మహా పాలనా దక్షుడిని, సంపూర్ణ భారతీయుడిని ఆవిష్కరించి, సర్వత్రా ప్రశంసలు అందుకున్నది. ఆర్థిక వ్యవస్థలపై సంపూర్ణ అవగాహనతో, దేశాభివృద్ధి ప్రణాళికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై చక్కని ఆలోచనతో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో పారిశ్రామిక, సమగ్రాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు వివరిస్తూనే ప్రపంచ దేశాలకు భారతదేశం మార్గదర్శకంగా నిలుస్తున్నదనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. దేశంపైన, ప్రపంచంపైన తనకున్న అభిప్రాయాలు చెప్పే క్రమంలోనే ఎక్కడా తొట్రుపాటుకు కానీ, మొహమాటానికీ కానీ పోలేదు. ఆ సదస్సుతో కేసీఆర్ మహోన్నత వ్యక్తిత్వం గురించి ప్రపంచానికి తెలిసింది. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, రాష్ట్ర సాధకుడిగా మాత్రమే తెలిసిన కేసీఆర్ వీటన్నిటిని మించి గొప్ప దేశభక్తుడని, విశాల భావాలున్నపౌరుడని, ప్రపంచ పౌరుడిగా, భవిష్యత్ (భారత) జాతీయ నాయకుడని రుజువైంది.

సర్ విన్స్టన్ చర్చిల్ తో కూడా పోల్చ తగ్గ వ్యక్తి కేసీఆర్. ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిగా, రచయితగా, వక్తగా, నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సర్ విన్‌స్టన్ చర్చిల్ ప్రణాలికా సరళి, నిర్ణయ శైలి, వ్యక్తిత్వం, గెలుపు-ఓటములు, ప్రాధాన్యత సంతరించుకున్న అంశాలనాలి. రెండవ ప్రపంచ యుద్ధం తీవ్రతరమైనప్పుడు, 1940 వ సంవత్సరం, మే నెలలో బ్రిటన్ ప్రధానమంత్రిగా నెవిల్ చాంబర్లెయిన్ రాజీనామా చేసినప్పుడు, ఆయన స్థానంలో చర్చిల్ నియామకం జరిగింది. బ్రిటన్ ప్రధానిగా ‘బిగ్ త్రీ’ (బ్రిటన్, రష్యా, యునైటెడ్ స్టేట్స్) సఖ్యతను బలోపేతం చేయడం ఆయన వ్యూహంలో అతి ముఖ్యమైనది. ఆయన వ్యూహం ఫలించి, హిట్లర్ నాజీ జర్మనీ పరాజయంతో, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. ప్రపంచంలోని అత్యంత ప్రముఖ రాజనీతిజ్ఞుడిగా, ప్రభావితం చేసే వ్యక్తిగా విన్‌స్టన్ చర్చిల్ కు అరుదైన గుర్తింపు వచ్చింది.

అయినప్పటికీ, ఇంత జరిగినా, బ్రిటన్ ఓటర్లు ఆయన్ను కేవలం ‘యుద్ధ కాల ప్రధాని గా మాత్రమే ‘ఆ సమయానికి అంగీకరించారు. ఫలితంగా, యుద్ధానంతరం 1945 ఎన్నికల్లో, చర్చిల్ ఘోర పరాజయం పొందారు. ఆరేళ్ల విరామం తరువాత తిరిగి 1951 లో చర్చిల్ విజయం సాధించి రెండవ పర్యాయం ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అందుకు భిన్నంగా కేసీఆర్ రాష్ట్ర సాధన ఉద్యమంలో, ఆ తరువాత జరిగిన ఎన్నికలలోనూ విజయం సాధించారు.

సమస్యలను వినూత్న, విభిన్న, తనదైన శైలిలో కేసీఆర్ పరిష్కరించేవారు. రాష్ట్ర ప్రజల సమగ్ర సంక్షేమం, రాష్ట్రా సర్వతోముఖాభివృద్ధి కేసీఆర్ కు ప్రధానాంశం. రాజకీయాలను ‘ఒక వికృత క్రీడలా’ చూసే వెకిలి మనస్తత్వం కాదాయనది. ఆయనకదొక ‘టాస్క్, పవిత్రమైన కార్యం.’ తాను సాధించిన తెలంగాణ రాష్ట్ర విషయంలో, రాష్ట్ర సమస్యలకు సంబంధించినంతవరకు పొరుగు రాష్ట్రాల విషయంలో, కేంద్ర దృక్ఫదం విషయంలో సుస్పష్టమైన, బలీయమైన అవగాహన, ఆలోచన వున్నాయి. వీటన్నింటిలో తన స్వరాష్ట్ర ప్రాధాన్యతే ఆయనకు సర్వస్వం. తెలంగాణ స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక అవసరాల కోసం కఠినంగా ఉండాల్సినప్పుడు, కఠినంగా, మెత్తపడాల్సిన, వెనక్కు తగ్గాల్సిన సందర్భంలో వెనక్కి తగ్గేలా ఆయన వ్యవహరించేవారు, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమం కోసం, అవసరమైతే, ‘ఒక అదనపు మైలు నడవడం’ ఆయన నిబద్ధతకు, ప్రత్యేకతకు ప్రబల తార్కాణం.

ఎమ్మెల్యే నుండి కేంద్ర మంత్రి పదవి వరకుమ్ పనిచేసిన కేసీఆర్ కు అపారమైన అనుభవం వున్నది. పాలనాపరమైన అనుభవంతో, ఉద్యమం నేర్పిన పాఠాలతో, రాష్ట్ర అవసరాలను క్షుణ్ణంగా అర్థం చేసుకున్న కేసీఆర్, ముఖ్యమంత్రిగా, పలు సమీక్షా సమావేశాలలో, అధికారుల అనుభవాన్ని, విజ్ఞానాన్ని, పరిగణలోకి తీసుకున్నారు. వారి విలువైన ఆలోచనలను గౌరవించారు. అవసరమైన సమయంలో మార్గనిర్దేశనం చేశారు.  అంతేగాని, తన ఆలోచనలను వారిమీద బలవంతంగా రుద్దేవారు కాదు. పథకాల అమలు బాధ్యత మాత్రం అధికారులదే.  

మార్పు తేవడం, మార్పులకు అనుగుణంగా పథకాల రూపకల్పన చేయడం, వాటిని అమలు పరచడం, కేసీఆర్ విశిష్టత. ఎన్ని చేసినా, ఎంత చేసినా ప్రజలు మార్పు కోరుకున్నారు. అతి స్వల్ప తేడాతో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఓటమి పాలైంది. రాజకీయనాయకుడికి గెలుపే ప్రధానం. కానీ, రాజనీతిజ్ఞుడికి జయాపజయాలు రెండూ రెండు సహజ పరిణామాలే. అలెగ్జాండ్ర్ డ్యూమాస్ చెప్పినట్లు ‘విజయాన్ని మించిన విజయం లేదు అనేది వందశాతం సరైనది కాదేమో! బహుశా ‘వైఫల్యాలు భవిష్యత్ విజయాలకు మూల స్థంబాలు కావచ్చేమో! వాస్తవానికి ‘అపజయం అనేది తాత్కాలికంగా రద్దు అయిన విజయమే!!! అందుకే కేసీఆర్ నాయకత్వానికి అపజయం లేదనేది అసలిసిసలు వాస్తవం.

(తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు పురస్కరించుకుని)

 

Thursday, May 30, 2024

దైవమే మిన్న : వనం జ్వాలా నరసింహారావు

 దైవమే మిన్న

వనం జ్వాలా నరసింహారావు

భక్తి మాసపత్రిక (జూన్ నెల, 2024)

శ్రీ రామాయణం రసరమ్యం. అందులో ప్రతి అంశమూ తరచి చూడవలసిందే. ప్రతి పలుకూ పరవశింప చేసేదే. ప్రతి పాత్ర మనల్ని ఆలోచింప చేస్తుంది. శ్రీరాముడు వనవాసానికి వెళ్లేముందు రామలక్ష్మణులకు మధ్య జరిగిన సంవాదంలో, పురుష ప్రయత్నం గొప్పదా? దైవం గొప్పదా? అనే చర్చ కనిపిస్తుంది. ఇది మన ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి పనికొచ్చే సన్నివేశం. 

శ్రీరాముడుని అడవులకు పంపాలని, ఆయన స్థానంలో తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం చేయాలని కైక దశరథుడిని కోరడం, దశరథుడి పక్షాన కైక అజ్ఞానుసారం వనవాసానికి పోవడానికి సిద్ధపడి వెళ్లే పూర్వరంగంలో, తల్లి కౌసల్య అనుమతి, ఆశీర్వాదం కొరకు ఆమె దగ్గరకు పోవడం నేపధ్యంలో ధర్మం, అధర్మం, నీతి, న్యాయం, దైవం లాంటి అనేక విషయాలమీద శ్రీరాముడు ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు.

తాను వనవాసానికి వెళుతున్నట్లు శ్రీరాముడు చెప్పాడు. ఆ నిర్ణయానికి నిరసనగా, లక్ష్మణుడు తనలో పెల్లుబుకుతున్న కోపాన్ని, దుఃఖాన్ని మనసులోనే అణచిపెట్టుకునే ప్రయత్నం చేశాడు. పద్నాలుగేండ్లు రాముడిని చూడకుండా ఎలా ప్రాణాలు బిగపట్టుకుని వుండగలనని ఏడుస్తున్న కొసల్యను చూడగానే లక్ష్మణుడు కోపాన్ని ఆపుకోలేక పోయాడు. ‘ఒక స్త్రీ మాటకు   అనవసరమైన విలువ ఇచ్చి, రాజ భోగాలను, పౌరుషాన్ని విడిచి, అడవికి పోవడం అవివేకమని వాదించాడు. వనవాస విషయం బయటకు పొక్కక ముందే, ఇరువురం కలిసి భూమినంతా రాముడి మహా శాసనానికి లోబడేట్లు చేయడమే ‘ధర్మ శాస్త్రం’ అని అన్నాడు. 

  లక్ష్మణుడిని రాముడు సముదాయించాడు. తండ్రి మాట కాని, తల్లి మాట కాని, బ్రాహ్మణ వాక్యం కాని, గురువుల మాట కాని, ముందుగా తాను పాతిస్తానన్నాడు. మాట తప్పడం ధర్మాత్ముల లక్షణం కాదని చెప్పాడు. ధర్మాన్ని మించిన దైవం వున్నాడని, కైక మోసం చేసిందని ఆమె మీద కోప్పడ కూడదని, అందులో ఆమె తప్పేమీ లేదని అంటాడు. ‘నాకు పట్టాభిషేకం చేయాలని ప్రయత్నం చేసినవాడు దశరథుడు కాదు. దానికి విఘ్నం కలిగించింది కైక కాదు. నేను అడవుల పాలవడానికి నా దోషం ఏదీ లేదు. ఇవన్నీ దైవ కృత్యాలే! ఇంత దురాలోచన దైవ ప్రేరణవల్లనే కలిగింది. ఇదంతా విధి చేష్టకాకుండా ఇతరుల చేష్ట ఎలా అవుతుంది? ఇతరులకు ఇది సాధ్యం కూడా కాదు’ అని వివరించాడు శ్రీరాముడు.


శ్రీరామచంద్రుడు చెప్పిన వాదానికి అంగీకరించని లక్ష్మణుడు, ‘అన్నా! రామచంద్రా! నువ్వేదో దైవాన్ని గొప్పదిగా భ్రమపడుతున్నావు. నువ్వే చెయ్యాలనుకుంటే, చేయదల్చుకుంటే, నీకు అసాధ్యమైన పని ఏదన్నా వుందా? అన్నింటిలో సమర్థుడవైనప్పటికీ, ఏ సామర్థ్యం లేని దైవాన్ని ఎంతో పెద్ద చేసి చెప్పావు. ఇది సమర్థుడి లక్షణమా? దేనికీ కొరగాని దైవాన్ని ధీరుడవు, సమర్థుడవు, చిత్త విభ్రాంతి లేని వాడివైన నువ్వు పామరుడిలాగా పొగుడుతున్నావు. ఇది నీకు తగునా?’ అని ప్రశ్నించాడు.

         అప్పుడు విధి చేష్ట ఎలా వుంటుందో సోదాహరణంగా తెలియచేశాడు రాముడు. ‘కైకకు నిన్నటి దాకా నామీద తక్కువ ప్రేమ కానీ, విరోధ భావం కానీ లేదు. ఇంతటి ప్రేమ, విరోధంగా మారడానికి కారణం దైవమే. ఏ అపరాధం చేయని నన్ను, అడవులకు పొమ్మని కైక అనడం అంటే, ఇదంతా విధి చేష్టకాకుండా ఇతరుల చేష్ట ఎలా అవుతుంది? ఆమె స్వభావ రీత్యా దుష్టురాలు. ఆ దుష్ట స్వభావమే ఇప్పుడామెను ప్రేరేపించింది. దైవం ఆవేశించకుంటే ఇలా చేయగలిగేదా? సహజమైతే ఇన్నాళ్లు ఎందుకు చేయలేదు? కాబట్టి ఇంత మహిమగలది, ఊహించలేనిది, అసాధ్యమైన ప్రభావం కలదైన దైవం ఎలాంటివారికైనా అందలేనిదే. దానికి ఎదురులేదు. ఆమెకు ఆ దుర్భుద్ధి పుట్టడానికి, నాకు దారిద్ర్యం రావడానికి దైవమే కారణం. ఆ దైవమే ఇంత పని చేసింది. ఇతరులకు ఇది సాధ్యం కూడా కాదు.’     

దైవాన్ని గురించి శ్రీరాముడు

         ‘దైవం వుందనడానికి ప్రమాణం ఏంటి? దైవాన్ని ఎదిరించి ఇలాంటివి జరగకుండా మనం పురుషకారం (పురుష ప్రయత్నం) చేయలేమా? ఒక పని మనం చేస్తున్నప్పుడు దైవం అనేదొకటున్నదని, అదేంటో చేస్తున్నదని, మనకు తెలియదు. ఫలితం కలిగేటప్పుడు మాత్రం ఆ దైవం కనపడి అదెలా చేయదల్చుకున్నదో, అలానే చేస్తుంది. ఫలితంలో మాత్రం కనిపించి, వేరే విధంగా కనిపించక, ఆ కారణం వల్ల దానిని జయించలేక సతమతమయ్యే మనం దైవంతో పోరాడగలమా? అది ఏ రూపంలో, ఎలా, ఏం చేస్తున్నదో మనకు తెలియనప్పుడు దానితో పోరాటం చేయగలమా? ఎలా చేస్తాం? ఫలానా సమయంలో, ఫలానా కార్యం సాధించేందుకు, ఫలానా సాధనాలను (దైవం) సిద్ధం చేసుకుని వుందని మనకు ముందే తెలుస్తే కదా, మనం ప్రతీకారం చేయగలం? కార్యస్వరూపంలో కనిపించకుండా, ఫలితం స్వరూపంలో కనిపించేదే దైవం. కాబట్టి దైవం వుందనడానికి అనుమానమే ప్రమాణం. బుద్ధి బలంతో మాత్రమే దానిని ఊహించగలం. మన సంతోషానికి, సౌఖ్యానికి, వ్యసనానికి, శాంతికి, రోషానికి, లాభనష్టాలకు, జననమరణాలకు, మూలకారణం దైవమే.’

         ‘ఘోరమైన తపస్సుచేసి, ఎంతో జ్ఞానాన్ని, మహిమను సంపాదించి, నిత్యనియమవ్రతులై, శాంతులై, నిష్కాములై, అడవిలో నివసించే మునులు కూడా దైవాన్ని ఎదిరించి ఏమీ చేయలేరు. కొందరు హటాత్తుగా కామానికి, కోపానికి లోబడి, దీర్ఘకాలంగా అభ్యసిస్తున్న నియమనిష్ఠలను నీటిపాలుచేసి, మర్యాద తప్పి, భ్రష్టులై పోవడం దైవచేష్టే. విశ్వామిత్రుడంతటి వాడే నిమిషంలో కామానికి, క్రోధానికి వశుడై చెడి పోయాడు. ఎప్పుడు కూడా ఇదిలా జరుగవచ్చని ఊహించని పనులు తటాలున వున్నట్లుండి అయిపోవడం, అందరూ తప్పక అవుతుందనుకున్న కార్యం విఘ్నం కావడం లాంటివన్నీ దైవ చేష్టలే! ఇది దైవ కృత్యమని, దీనిలో మన దోషం లేదని, కైక నిమిత్త మాత్రమేనని, ఆమె దైవానికి సాధనం అయిందని, సాధించేది దైవం మాత్రమేనని, నాకు అర్థమైంది. దానివల్ల నాకు వ్యసనం, బాధ కలగలేదు. లక్ష్మి పోయింది, దారిద్ర్యం వచ్చింది అని దుఃఖించవద్దు. రాజభోగం సుఖరూపక దుఃఖం; వనవాసం దుఃఖరూపక సుఖం. రాజ భోగాలు, అరణ్యవాసం, రెండూ ధర్మ కార్యాలే.’

స్వాతంత్ర్యం – పరాధీనత

         శ్రీరాముడు చెప్పినదానికి లక్ష్మణుడు విభేదించి ఇలా అంటాడు. ‘కైకేయీ దశరథుల ఆలోచనను నువ్వు దైవ తంత్రంగా పోల్చావు. అలాంటి దైవం నాకిష్టం లేదు. కుట్రలు ప్రేరేపించు దైవం ఎలా దైవం అవుతుంది? ఎలా పూజ్యనీయమవుతుంది? బలం లేనివారు, అల్ప తేజస్సు కలవారు దైవ బలం అంటారు. ఎందుకు? వాళ్లకు కార్యసాధనకు కావాల్సిన బలం, తెలివితేటలు లేకపోవడం వల్ల, నింద తమ మీద వేసుకోకుండా దైవం మీద పెడతారు. ఇక బలవంతులు, కీర్తిని కోరేవారు, దైవం అనేదొకటున్నదని కలలో కూడా అనుకోరు. పురుషకారంతో స్వకార్యాన్ని సాధించి కీర్తిని పొందుతారు. అలాంటివారిని దైవం ఏం చేస్తుంది? బలం గల గొప్పవాడు పౌరుష బలంతో దైవాన్ని దగ్గరకు రాకుండా తరిమికొట్టి, చివరకు, దైవం వల్ల ఏ బాధ పడకుండా, సమర్థతతో తన పని తాను చేసుకుంటాడు. నువ్వు దైవ బలం ఎక్కువ అంటున్నావు. నేను పురుష బలం ఎక్కువ అంటున్నాను.’

         దైవం అప్రతిహతమని, అలాంటి దైవంతో ఎవరు పోరగలరని, రాముడు సమాధానం చెప్పాడు. బదులుగా లక్ష్మణుడు, రాముడు చెప్పింది సరైంది కాదని, దైవం పరాధీనమైందని, అది స్వతంత్రించి ఏ పనీ చేయలేదని, అలాంటి దాన్ని నమ్ముకుని, దైవం ఇస్తుందని పురుష ప్రయత్నం చేయకుండా వుండడం సరికాదని అంటాడు. దైవం కంటే పౌరుషమే శ్రేష్టమని లక్ష్మణుడు వాదించాడు.

ధర్మవిరుద్ధం కాకూడదు

లోకం దైవాన్ని ఆలంబనంగా తీసుకుని పురుష ప్రయత్నంలో ఉదాసీనులు కాకూడదు. మనుష్యుడు చేయాల్సిన కర్మం చేయకుండా దైవమే ఇస్తాడని భావించకూడదు. ఇలాంటి మాటలు చూస్తుంటే, దైవం కంటే పౌరుషం బలమని అనిపిస్తుంది. రాముడు దైవమే బలిష్టమని అన్నాడు. దైవ-పౌరుషాలకు పరస్పర విరోధం కనిపిస్తున్నది. ఇదెలా అంటే, పురుషకారం లేకుండా దైవం ఏ కార్యం చేయలేదు. అలానే, దైవ సహాయం లేకుండా ఏ కార్యం ఫలించదు. కాబట్టి ఏదైనా ఫలితం కావాలంటే రెండూ అవసరమే!

అయితే, రామచంద్రమూర్తి ఎందుకు పురుషకారానికి అనమతి ఇవ్వలేదు? ఆయన అభిప్రాయం ప్రకారం పురుష ప్రయత్నం వ్యర్థం. దైవమే కార్యసాదకం. నిజంగా అలాంటి అభిప్రాయమే ఆయనకుంటే, సీతకొరకై పురుషకారం చేసి వుండేవాడు కాదు. దైవమే సీతను తెచ్చి ఇస్తుందని వూరకే వుండేవాడు. ధర్మ విరుద్ధ పురుషకారం శ్రీరాముడికి సమ్మతం కాదు. లక్ష్మణుడి పురుషకారానికి ప్రధమ కబళం దశరథుడు. రాజ్యం కోసం తండ్రిని పీడించిన వాడవుతాడు. అందుకే రాముడొప్పుకోలేదు. రాముడు పురుషకార విరోధి కాదు. అలానే, అన్న అరణ్యాలకు పోయి కష్టపడడం ఇష్టం లేక, ఎలాగైనా అయోధ్యలోనే ఆయన వుండేట్లు చేయడానికి సద్భావంతో లక్ష్మణుడు రాముడితో వాదించాడే కాని ఆయన దైవ విరోధి కాదు. అలాంటప్పుడు లక్ష్మణ వాదన సాధువాదమా? దుర్వాదమా? అని విచారించాలి.

కర్మయందు నిష్ఠ వుండాలి

రామాయణంలో సీతారామలక్ష్మణుల చరిత్ర వల్ల, బోధ పడేదేంటంటే, పౌరుషం కంటే దైవమే ప్రబలం కాబట్టి, దైవాన్నే సేవించాలి. భారతంలో కూడా ఇదే కనిపిస్తుంది. అంతమాత్రం చేత మనుష్యులు దైవాన్ని ధిక్కరించి పౌరుషాన్నే ఆశ్రయించకూడదు. దైవాన్ని ఆశ్రయించి, యథాశక్తి, యథాశాస్త్రం ప్రకారం, నిష్కాములై స్వకర్మలు చేయాలి. రామాయణంలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం ఇదే. భగవద్గీత ఉపదేశించింది కూడా ఇదే. రాముడు చెప్పిన ప్రతి మాట అందరికీ అన్ని వేళలా వర్తిస్తుందనడంలో సందేహం లేదు.

శ్రీరాముడు వనవాసం చేయడానికి నిశ్చయించుకున్నాడని తెలిసి, ఆయనను పోవద్దని చెప్పడం వృధా అని భావించి, తనను కూడా అడవికి తీసుకొని పొమ్మని కౌసల్య అడుగుతుంది రాముడిని. భర్తను విడిచి తన వెంట రావడం సరైంది కాదని తల్లికి నచ్చ చెప్పాడు రాముడు. అలా శ్రీరాముడు తనతో వనవాసానికి వస్తానన్న కౌసల్యను వద్దన్నాడు.

‘నీలో నేను సగం. నీ సగం దేహం ఇంట్లో పెట్టి, మిగిలిన సగం దేహంతో అడవికి పొమ్మని నీకు రాజు చెప్పాడా? అని ప్రశ్నించిన సీతను కాదనలేకపోయాడు. ఆమెను బాధపడవద్దని, తనతో తీసుకొని పోతానని చెప్పాడు శ్రీరాముడు. లక్ష్మణుడు కూడా అన్న వెంట అడవికి పయనమయ్యాడు.

(ఆంధ్ర వాల్మీకి వాసుదాసుగారి రామాయణం మందరం ఆధారంగా)

 

Wednesday, May 29, 2024

ప్రదానమంత్రులు - పాత్రికేయ సమావేశాలు : వనం జ్వాలా నరసింహారావు

 ప్రదానమంత్రులు - పాత్రికేయ సమావేశాలు

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (30-05-2024)

{ఒకప్పుడున్న పద్ధతులు, విలువలు, నిబద్ధతలు, ఎల్లప్పుడూ వుండాలని లేదుగా? అందుకే జవహర్లాల్ నెహ్రూ తన పద్ధతిలో పత్రికా సమావేశాలు నిర్వహించడం ఏవిధంగా వంద శాతం సరైనదో, అలాగే నరేంద్ర మోదీ తనదైన పద్ధతిలో 'పత్రికలు, న్యూస్ ఛానల్స్, న్యూస్ ఏజెన్సీలకు' విడివిడిగా తన ఇష్టమొచ్చినప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా వందకు పైగా శాతం సరైనదేమో} – సంపాదకుడి సంక్షిప్త వ్యాఖ్య  

సాధారణ ఎన్నికలు ముగియబోతున్నాయి. ఎవరికివారే అధికారంలోకి వస్తామన్న బింకంతో ధీమాగా పైకి కనిపిస్తున్నారు. అంచనాలు తారుమారు కావచ్చని, నిజమూ కావచ్చని, అంతా ఓటర్ల దయని, వైరాగ్యంతో వున్న నాయకులూ లేకపోలేదు. గెలవడానికి అనుసరించిన అనేకానేక ‘వ్యూహాలలో పాత్రికేయులను మంచి చేసుకోవడం కూడా ప్రధానమైనదే. అలా మీడియాను, ఎన్నికలప్పుడు, ఎన్నికలు లేనప్పుడు మంచి చేసుకోవడానికి అధికార, ప్రతిపక్ష నాయకులు అవలంభించే దారులు విభిన్నంగా వుంటాయి.

చురుమురి’ అనే పేరుతో ఒక ట్విట్టర్ అకౌంట్ పోస్ట్ చేసిన ఆసక్తికర సమాచారాన్ని అనుసరించి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాతి 30 రోజుల్లో పత్రికలు, న్యూస్ ఛానల్స్, న్యూస్ ఏజెన్సీలకు విడివిడిగా కనీసం 26 సార్లు ఇంటర్వ్యూలు ఇచ్చారట. సార్వత్రక ఎన్నికలలో బీజేపీకి అనుకూలంగా ఉండే మీడియా కవరేజీ ప్రాధాన్యతను ఇది స్పష్టం చేస్తున్నదనేది ఒక విశ్లేషణ. ఇలాంటి ఇంటర్వ్యూల పరంపర నెలరోజుల తరువాత కూడా అంతో ఇంతో మోతాదులో కొనసాగింది. వాస్తవానికి, 2019 సాధారణ ఎన్నిలప్పుడు సైతం ప్రధాని మోదీ అప్పట్లో తన ఇంటర్వ్యూల పరంపరలో తాను భావించిన న్యాయమైన సమయ భాగాన్ని, కేవలం 20 రోజుల వ్యవధిలో, పది ప్రింట్ మీడియా, నాలుగు టెలివిజన్ మీడియాలకు మాత్రమే ఇచ్చారు. ఇందులో ఏమీ తప్పుపట్టడానికేమీ లేదేమో!

ప్రతి ప్రధానమంత్రికి తనదైన, బహుశా అరుదైన 'మీడియా దృక్పథ శైలి' ఉంటుంది. వాస్తవానికి అలా వుండాలేమో! కాకపోతే, ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన పద్ధతి ప్రవచించేది మాత్రం, ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ఉన్నత స్థానాలలోని నాయకులు తరచుగా ‘మీడియాతో ముఖాముఖి' సమావేశమవ్వాలని. అది 'వ్యక్తిగత లేదా గ్రూప్ ఇంటర్వ్యూలు' గాని లేదా 'ప్రెస్ మీట్స్ (పత్రికా సమావేశాలు)' తో చాలా మంది లేదా ఎంపిక చేసిన కొద్దిమంది పత్రికా ప్రతినిధులతో గాని కావచ్చు. మాజీ ప్రధాన మంత్రుల, అదే విధంగా ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీల మీడియా సమావేశాల వ్యక్తిగత అభిరుచులు భిన్నంగా వున్నప్పటికీ, ఒకరిది తప్పనో, వేరొకరిది ఒప్పనో ఖచ్చితంగా చెప్పలేము.

ఉదాహరణకు, నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా తన 'మొట్ట మొదటి, ఆ మాటకొస్తే ఏకైక ప్రెస్ కాన్ఫరెన్స్' ను మే 2019 లో నిర్వహించారు. కాకపోతే, వింతగా, ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వలేదు, బదులుగా నాటి సహచర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆయన తరపున ఆ పని పూర్తి చేశారు. ఆ ప్రెస్ మీట్ కు సంబంధించినంతవరకు ఇది 'సరైనదా కాదా' అనే విషయాన్ని పక్కన పెడితే, అందుబాటులో వున్న సమాచారం ఆధారంగా, నరేంద్ర మోదీ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనూ పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. విదేశాల్లో, 2015లో ఇంగ్లాండ్ సందర్శన సందర్భంలో ఒక పర్యాయం, 2023లో అమెరికా దేశం పర్యటన సందర్భంలో మరొక పర్యాయం మాత్రమే ఆయన పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. వాస్తవానికి, వైట్ హౌస్‌లో జరిగిన సమావేశంలో, పాత్రికేయులు అడిగిన రెండే రెండు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ప్రపంచ వ్యాప్త కరోనా మహమ్మారి సమయంలో కూడా, మోదీ ఎలాంటి మీడియా సమావేశాలలో పాల్గొనలేదు. 'నరేంద్ర మోదీకి ప్రెస్ కాన్ఫరెన్స్‌ల విషయంలో ఒక విధమైన శాశ్వత విరోధం, ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం, నిరాసక్తతలు వున్నాయని కూడా వ్యాఖ్యలు వున్నాయి.

నరేంద్ర మోదీకి ముందు ప్రధానిగా ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ మీడియాకు సన్నిహితంగా, సులభంగా అందుబాటులో ఉండేవారని అనుకునేవారు. తరచుగా మీడియా సమావేశాలను కూడా నిర్వహించేవారు. ఆయన ప్రతి విదేశీ పర్యటన సందర్భంగా తిరుగు ప్రయాణంలో మీడియా సమావేశాలు నిర్వహించేవారు. అయినప్పటికీ, మన్మోహన్సింగ్ ను మౌన మునిగా అభివర్ణిస్తూ, తరచుగా ఆయన మీడియాకు సమాధానం ఇవ్వరని బీజేపీ విమర్శించేది. ఆయన ప్రత్యేకతకు ప్రబల నిదర్శనంగా, మన్మోహన్ సింగ్ పదవీ బాధ్యతలు స్వీకరించి 100 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు ఆయన పదవీ కాలం ఒక సంవత్సరం లోపునే 1991లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన తరువాత, 13 సంవత్సరాల విరామం వరకు, ఏ ప్రధానమంత్రి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించని రికార్డును సమం చేశారు.

2014 జనవరి 3, ఒక భారత ప్రధానమంత్రి (మన్మోహన్ సింగ్) భారతదేశంలో నిర్వహించిన చిట్ట చివరి ప్రెస్ మీట్ లో '100 మంది పాత్రికేయుల నుండి 62 ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, మన్మోహన్ సమాచార సలహాదారుడిగా పనిచేసిన పంకజ్ పచౌరి ట్విట్టర్ (X) పోస్ట్‌లో తెలియచేశారు. దాన్ని ‘షేర్’ చేసిన కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ, మన్మోహన్ తన 10 సంవత్సరాల పదవీ కాలంలో 117 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించారని చెప్పారు!!! ఈ రకంగా చూస్తే, మోదీకి, మన్మోహన్ కు ఎంత విస్మయకరమైన వ్యత్యాసం వున్నదో!!! 2004 సెప్టెంబర్‌లో సింగ్ మీడియా సమావేశం నిర్వహించడం ద్వారా, వాస్తవానికి, 'నెహ్రు కాలం' నాటి తత్సంప్రదాయాన్ని కూడా పునరుద్ధరించారు.

17 సంవత్సరాలపాటు ప్రధమ ప్రధానమంత్రిగా పనిచేసిన జవహర్లాల్ నెహ్రు తరచుగా పత్రికా సమావేశాలను నిర్వహించేవారు. ఆయనకు పాత్రికేయుల స్వాతంత్ర్యంమీద నిబద్ధత వుండేది. సాధారణంగా విజ్ఞాన్ భవన్ లో జరుగుతుండే 'మీట్-ది-ప్రెస్' గుర్తింపు పొందిన పాత్రికేయులకు, ఫోటో జర్నలిస్టులకు సదా తెరిచి ఉండేది. మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడగడానికి ముందు తమను గుర్తించడానికి ప్లకార్డులను చూపే సంప్రదాయం వుండేది. వాటిని అప్పట్లో 'మాసాంతం ప్రెస్ కాన్ఫరెన్స్‌లు' గా సంబోధించేవారు. ఇందిరాగాంధీ జీవిత చరిత్ర రచయిత, ప్రముఖ పాత్రికేయుడు ఇందర్ మల్హోత్రా పరిభాషలో ‘జవహర్లాల్ సాహసోపేతమైన పత్రికా సమావేశాలు' గా చెప్పుకునే వాటిలో లభ్యమయ్యే ‘సమాచారం, విద్య, వినోదాలను తాను మరలా ఎప్పుడూ చూడలేదంటారు. తనమీద వ్యంగ్య కార్టూన్లు వేసిన కే శంకర్ పిళ్ళై 'శంకర్ కార్టూన్స్' ను ఆస్వాదించేవారు నెహ్రూ. ఒకసారి వారిరువురు కలుసుకున్నప్పుడు, 'నన్ను కూడా విడిచిపెట్టొద్దు శంకర్' అని నెహ్రూ అనడమే కాదు, వాస్తవానికి శంకర్ ఆయనను ఎప్పుడూ విడిచిపెట్టలేదు!!!

ఇందిరాగాంధీ ప్రధానిగా భారతీయ పాత్రికేయులకు ఇచ్చిన ఇంటర్వ్యూలు ఎన్నో ఒక చేతి వేళ్లతోనే లెక్కించవచ్చని పత్రికా రంగంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత అరుణ్‌పురి అనేవారు. విదేశాలకు పర్యటించడానికి ముందు మాత్రం విధిగా ఇందిరాగాంధీ ఆ దేశానికి చెందిన పాత్రికేయుడికి ‘కర్టెన్ రైజింగ్ ఇంటర్వ్యూ’ ఇవ్వడం జరిగేదని అన్నారాయన. పశ్చిమ దేశాల పాత్రికేయులకు, ఆమె రక్షణలో ఉన్న పార్లమెంట్ హౌస్ లేదా సౌత్ బ్లాక్‌లో ఉన్న ఆమె క్వార్టర్స్‌లోకి వెళ్లడం చాలా సులువని ఆయన అభిప్రాయపడ్డారు. అదే భారతీయ పాత్రికేయుల విషయానికొస్తే, ఆమెను కలిసేందుకు సాధారణంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో మాత్రమే అవకాశం కలిగేది. అవి కూడా, తరువాత, అరుదైపోయాయి.

ఒక భారత ప్రధానమంత్రిగా ‘మొట్టమొదటి జాతీయంగా ప్రసారం చేయబడిన లైవ్ టీవీ ప్రెస్ కాన్ఫరెన్స్’ను రాజీవ్‌గాంధీ 1985 జూలై 7న నిర్వహించారు. గంటకు పైగా సాగిన దాంట్లో రాజీవ్ 30కి పైగా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అలాంటి టెలివిజన్ పత్రికా సమావేశాలను సాదాసీదా కార్యక్రమంగా, క్రమం తప్పకుండా నిర్వహించే ఆలోచన ఉన్నట్లు అప్పుడు రాజీవ్ అన్నారు. ఆయన తన పదవీకాలంలో 60కి పైగా ప్రెస్‌మీట్‌లు నిర్వహించారు. బోఫోర్స్ వివాదం వరకు అవి కొనసాగాయి. వి.పి. సింగ్ 1989లో కేవలం ఒకే ఒక్క పత్రికా సమావేశం నిర్వహించారు!

1994–2004 మధ్యకాలంలో ప్రధానమంత్రులుగా వున్న హెచ్.డి. దేవేగౌడ, ఐ.కె. గుజ్రాల్, అటల్ బిహారీ వాజపేయిలు, ఎలాంటి పత్రికా సమావేశాలను నిర్వహించలేదు. ‘మీడియాతో మాట్లాడటానికి అయిష్టత’ వ్యక్తం చేయడం అనే సంప్రదాయాన్ని, మోదీ కంటే చాలా ముందుగానే వీరు నెలకొల్పారని అనాలేమో. దేవేగౌడ, గుజ్రాల్ పదవీకాలం అతిస్వల్పమే. వారిరువురికీ మీడియా ముందు రావడానికి సమయం కూడా లేదు. వాజపేయి ప్రధానమంత్రిగా, ఢిల్లీలో అధికారిక పత్రికా సమావేశాన్ని, తన ఆరు సంవత్సరాల పదవీ కాలంలో ఒక్కసారి కూడా నిర్వహించలేదు. పాత్రికేయులతో ఆయన ముఖాముఖి సమావేశాల కలయికలు క్లుప్తంగా ముగిసేవి.

ఇదంతా పక్కన పెడితే, 75 సంవత్సరాలు నిండిన అతిపెద్ద ప్రజాస్వామ్య భారతావనిలో, నిరంతరం మార్పుకు గురవుతున్న నిజాయితీ రహిత, అసత్య, అనైతిక, వక్ర రాజకీయ, సామాజిక నీతి వ్యవస్థ నట్టనడుమ, అందులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాలుపంచుకుంటున్న మీడియా వ్యవస్థలు నిర్వహించే ఈ సమావేశాల ద్వారా ఏమైనా ఫలితం వున్నదా అని కొందరి విశ్లేషకుల అభిప్రాయం.

దురదృష్టవశాత్తు చాలా పత్రికా సమావేశాలలో కొందరు పక్షపాత పాత్రికేయులు వేసే ప్రశ్నలు సమావేశ అంశానికి భిన్నంగా, ప్రజా ప్రయోజనానికి విరుద్ధంగా, ‘ప్రజలకు ఆసక్తి కలిగించే’ లేదా ‘సెన్సేషనల్’ విషయాలకు సంబంధించినవే కావడం గమనార్హం. అలాంటప్పుడు సమావేశం నిర్వహించే వ్యక్తిని, అందునా ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తిని విసిగించే దిశగా ఇంటర్వ్యూ కొనసాగుతుంది ఒక్కొక్కసారి. బహుశా ఈ కారణంతోనే, ఒక్కొక్క ప్రధాని తమదైన శైలిలో పత్రికా ప్రతినిధులను కలుసుకోవడం జరుగుతుండవచ్చు. ఒకప్పుడున్న పద్ధతులు, విలువలు, నిబద్ధతలు, ఎల్లప్పుడూ వుండాలని లేదుగా? అందుకే జవహర్‌లాల్ నెహ్రూ తన పద్ధతిలో పత్రికా సమావేశాలు నిర్వహించడం ఏ విధంగా వంద శాతం సరైనదో, అలాగే నరేంద్ర మోదీ తనదైన పద్ధతిలో పత్రికలు, న్యూస్ ఛానల్స్, న్యూస్ ఏజెన్సీలకు విడివిడిగా తన ఇష్టమొచ్చినప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా సరైనదేమో.

ఎవరి దారి వారిదే. ఎవరికి వారే, యమునాతీరే!