Thursday, May 30, 2024

దైవమే మిన్న : వనం జ్వాలా నరసింహారావు

 దైవమే మిన్న

వనం జ్వాలా నరసింహారావు

భక్తి మాసపత్రిక (జూన్ నెల, 2024)

శ్రీ రామాయణం రసరమ్యం. అందులో ప్రతి అంశమూ తరచి చూడవలసిందే. ప్రతి పలుకూ పరవశింప చేసేదే. ప్రతి పాత్ర మనల్ని ఆలోచింప చేస్తుంది. శ్రీరాముడు వనవాసానికి వెళ్లేముందు రామలక్ష్మణులకు మధ్య జరిగిన సంవాదంలో, పురుష ప్రయత్నం గొప్పదా? దైవం గొప్పదా? అనే చర్చ కనిపిస్తుంది. ఇది మన ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి పనికొచ్చే సన్నివేశం. 

శ్రీరాముడుని అడవులకు పంపాలని, ఆయన స్థానంలో తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం చేయాలని కైక దశరథుడిని కోరడం, దశరథుడి పక్షాన కైక అజ్ఞానుసారం వనవాసానికి పోవడానికి సిద్ధపడి వెళ్లే పూర్వరంగంలో, తల్లి కౌసల్య అనుమతి, ఆశీర్వాదం కొరకు ఆమె దగ్గరకు పోవడం నేపధ్యంలో ధర్మం, అధర్మం, నీతి, న్యాయం, దైవం లాంటి అనేక విషయాలమీద శ్రీరాముడు ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు.

తాను వనవాసానికి వెళుతున్నట్లు శ్రీరాముడు చెప్పాడు. ఆ నిర్ణయానికి నిరసనగా, లక్ష్మణుడు తనలో పెల్లుబుకుతున్న కోపాన్ని, దుఃఖాన్ని మనసులోనే అణచిపెట్టుకునే ప్రయత్నం చేశాడు. పద్నాలుగేండ్లు రాముడిని చూడకుండా ఎలా ప్రాణాలు బిగపట్టుకుని వుండగలనని ఏడుస్తున్న కొసల్యను చూడగానే లక్ష్మణుడు కోపాన్ని ఆపుకోలేక పోయాడు. ‘ఒక స్త్రీ మాటకు   అనవసరమైన విలువ ఇచ్చి, రాజ భోగాలను, పౌరుషాన్ని విడిచి, అడవికి పోవడం అవివేకమని వాదించాడు. వనవాస విషయం బయటకు పొక్కక ముందే, ఇరువురం కలిసి భూమినంతా రాముడి మహా శాసనానికి లోబడేట్లు చేయడమే ‘ధర్మ శాస్త్రం’ అని అన్నాడు. 

  లక్ష్మణుడిని రాముడు సముదాయించాడు. తండ్రి మాట కాని, తల్లి మాట కాని, బ్రాహ్మణ వాక్యం కాని, గురువుల మాట కాని, ముందుగా తాను పాతిస్తానన్నాడు. మాట తప్పడం ధర్మాత్ముల లక్షణం కాదని చెప్పాడు. ధర్మాన్ని మించిన దైవం వున్నాడని, కైక మోసం చేసిందని ఆమె మీద కోప్పడ కూడదని, అందులో ఆమె తప్పేమీ లేదని అంటాడు. ‘నాకు పట్టాభిషేకం చేయాలని ప్రయత్నం చేసినవాడు దశరథుడు కాదు. దానికి విఘ్నం కలిగించింది కైక కాదు. నేను అడవుల పాలవడానికి నా దోషం ఏదీ లేదు. ఇవన్నీ దైవ కృత్యాలే! ఇంత దురాలోచన దైవ ప్రేరణవల్లనే కలిగింది. ఇదంతా విధి చేష్టకాకుండా ఇతరుల చేష్ట ఎలా అవుతుంది? ఇతరులకు ఇది సాధ్యం కూడా కాదు’ అని వివరించాడు శ్రీరాముడు.


శ్రీరామచంద్రుడు చెప్పిన వాదానికి అంగీకరించని లక్ష్మణుడు, ‘అన్నా! రామచంద్రా! నువ్వేదో దైవాన్ని గొప్పదిగా భ్రమపడుతున్నావు. నువ్వే చెయ్యాలనుకుంటే, చేయదల్చుకుంటే, నీకు అసాధ్యమైన పని ఏదన్నా వుందా? అన్నింటిలో సమర్థుడవైనప్పటికీ, ఏ సామర్థ్యం లేని దైవాన్ని ఎంతో పెద్ద చేసి చెప్పావు. ఇది సమర్థుడి లక్షణమా? దేనికీ కొరగాని దైవాన్ని ధీరుడవు, సమర్థుడవు, చిత్త విభ్రాంతి లేని వాడివైన నువ్వు పామరుడిలాగా పొగుడుతున్నావు. ఇది నీకు తగునా?’ అని ప్రశ్నించాడు.

         అప్పుడు విధి చేష్ట ఎలా వుంటుందో సోదాహరణంగా తెలియచేశాడు రాముడు. ‘కైకకు నిన్నటి దాకా నామీద తక్కువ ప్రేమ కానీ, విరోధ భావం కానీ లేదు. ఇంతటి ప్రేమ, విరోధంగా మారడానికి కారణం దైవమే. ఏ అపరాధం చేయని నన్ను, అడవులకు పొమ్మని కైక అనడం అంటే, ఇదంతా విధి చేష్టకాకుండా ఇతరుల చేష్ట ఎలా అవుతుంది? ఆమె స్వభావ రీత్యా దుష్టురాలు. ఆ దుష్ట స్వభావమే ఇప్పుడామెను ప్రేరేపించింది. దైవం ఆవేశించకుంటే ఇలా చేయగలిగేదా? సహజమైతే ఇన్నాళ్లు ఎందుకు చేయలేదు? కాబట్టి ఇంత మహిమగలది, ఊహించలేనిది, అసాధ్యమైన ప్రభావం కలదైన దైవం ఎలాంటివారికైనా అందలేనిదే. దానికి ఎదురులేదు. ఆమెకు ఆ దుర్భుద్ధి పుట్టడానికి, నాకు దారిద్ర్యం రావడానికి దైవమే కారణం. ఆ దైవమే ఇంత పని చేసింది. ఇతరులకు ఇది సాధ్యం కూడా కాదు.’     

దైవాన్ని గురించి శ్రీరాముడు

         ‘దైవం వుందనడానికి ప్రమాణం ఏంటి? దైవాన్ని ఎదిరించి ఇలాంటివి జరగకుండా మనం పురుషకారం (పురుష ప్రయత్నం) చేయలేమా? ఒక పని మనం చేస్తున్నప్పుడు దైవం అనేదొకటున్నదని, అదేంటో చేస్తున్నదని, మనకు తెలియదు. ఫలితం కలిగేటప్పుడు మాత్రం ఆ దైవం కనపడి అదెలా చేయదల్చుకున్నదో, అలానే చేస్తుంది. ఫలితంలో మాత్రం కనిపించి, వేరే విధంగా కనిపించక, ఆ కారణం వల్ల దానిని జయించలేక సతమతమయ్యే మనం దైవంతో పోరాడగలమా? అది ఏ రూపంలో, ఎలా, ఏం చేస్తున్నదో మనకు తెలియనప్పుడు దానితో పోరాటం చేయగలమా? ఎలా చేస్తాం? ఫలానా సమయంలో, ఫలానా కార్యం సాధించేందుకు, ఫలానా సాధనాలను (దైవం) సిద్ధం చేసుకుని వుందని మనకు ముందే తెలుస్తే కదా, మనం ప్రతీకారం చేయగలం? కార్యస్వరూపంలో కనిపించకుండా, ఫలితం స్వరూపంలో కనిపించేదే దైవం. కాబట్టి దైవం వుందనడానికి అనుమానమే ప్రమాణం. బుద్ధి బలంతో మాత్రమే దానిని ఊహించగలం. మన సంతోషానికి, సౌఖ్యానికి, వ్యసనానికి, శాంతికి, రోషానికి, లాభనష్టాలకు, జననమరణాలకు, మూలకారణం దైవమే.’

         ‘ఘోరమైన తపస్సుచేసి, ఎంతో జ్ఞానాన్ని, మహిమను సంపాదించి, నిత్యనియమవ్రతులై, శాంతులై, నిష్కాములై, అడవిలో నివసించే మునులు కూడా దైవాన్ని ఎదిరించి ఏమీ చేయలేరు. కొందరు హటాత్తుగా కామానికి, కోపానికి లోబడి, దీర్ఘకాలంగా అభ్యసిస్తున్న నియమనిష్ఠలను నీటిపాలుచేసి, మర్యాద తప్పి, భ్రష్టులై పోవడం దైవచేష్టే. విశ్వామిత్రుడంతటి వాడే నిమిషంలో కామానికి, క్రోధానికి వశుడై చెడి పోయాడు. ఎప్పుడు కూడా ఇదిలా జరుగవచ్చని ఊహించని పనులు తటాలున వున్నట్లుండి అయిపోవడం, అందరూ తప్పక అవుతుందనుకున్న కార్యం విఘ్నం కావడం లాంటివన్నీ దైవ చేష్టలే! ఇది దైవ కృత్యమని, దీనిలో మన దోషం లేదని, కైక నిమిత్త మాత్రమేనని, ఆమె దైవానికి సాధనం అయిందని, సాధించేది దైవం మాత్రమేనని, నాకు అర్థమైంది. దానివల్ల నాకు వ్యసనం, బాధ కలగలేదు. లక్ష్మి పోయింది, దారిద్ర్యం వచ్చింది అని దుఃఖించవద్దు. రాజభోగం సుఖరూపక దుఃఖం; వనవాసం దుఃఖరూపక సుఖం. రాజ భోగాలు, అరణ్యవాసం, రెండూ ధర్మ కార్యాలే.’

స్వాతంత్ర్యం – పరాధీనత

         శ్రీరాముడు చెప్పినదానికి లక్ష్మణుడు విభేదించి ఇలా అంటాడు. ‘కైకేయీ దశరథుల ఆలోచనను నువ్వు దైవ తంత్రంగా పోల్చావు. అలాంటి దైవం నాకిష్టం లేదు. కుట్రలు ప్రేరేపించు దైవం ఎలా దైవం అవుతుంది? ఎలా పూజ్యనీయమవుతుంది? బలం లేనివారు, అల్ప తేజస్సు కలవారు దైవ బలం అంటారు. ఎందుకు? వాళ్లకు కార్యసాధనకు కావాల్సిన బలం, తెలివితేటలు లేకపోవడం వల్ల, నింద తమ మీద వేసుకోకుండా దైవం మీద పెడతారు. ఇక బలవంతులు, కీర్తిని కోరేవారు, దైవం అనేదొకటున్నదని కలలో కూడా అనుకోరు. పురుషకారంతో స్వకార్యాన్ని సాధించి కీర్తిని పొందుతారు. అలాంటివారిని దైవం ఏం చేస్తుంది? బలం గల గొప్పవాడు పౌరుష బలంతో దైవాన్ని దగ్గరకు రాకుండా తరిమికొట్టి, చివరకు, దైవం వల్ల ఏ బాధ పడకుండా, సమర్థతతో తన పని తాను చేసుకుంటాడు. నువ్వు దైవ బలం ఎక్కువ అంటున్నావు. నేను పురుష బలం ఎక్కువ అంటున్నాను.’

         దైవం అప్రతిహతమని, అలాంటి దైవంతో ఎవరు పోరగలరని, రాముడు సమాధానం చెప్పాడు. బదులుగా లక్ష్మణుడు, రాముడు చెప్పింది సరైంది కాదని, దైవం పరాధీనమైందని, అది స్వతంత్రించి ఏ పనీ చేయలేదని, అలాంటి దాన్ని నమ్ముకుని, దైవం ఇస్తుందని పురుష ప్రయత్నం చేయకుండా వుండడం సరికాదని అంటాడు. దైవం కంటే పౌరుషమే శ్రేష్టమని లక్ష్మణుడు వాదించాడు.

ధర్మవిరుద్ధం కాకూడదు

లోకం దైవాన్ని ఆలంబనంగా తీసుకుని పురుష ప్రయత్నంలో ఉదాసీనులు కాకూడదు. మనుష్యుడు చేయాల్సిన కర్మం చేయకుండా దైవమే ఇస్తాడని భావించకూడదు. ఇలాంటి మాటలు చూస్తుంటే, దైవం కంటే పౌరుషం బలమని అనిపిస్తుంది. రాముడు దైవమే బలిష్టమని అన్నాడు. దైవ-పౌరుషాలకు పరస్పర విరోధం కనిపిస్తున్నది. ఇదెలా అంటే, పురుషకారం లేకుండా దైవం ఏ కార్యం చేయలేదు. అలానే, దైవ సహాయం లేకుండా ఏ కార్యం ఫలించదు. కాబట్టి ఏదైనా ఫలితం కావాలంటే రెండూ అవసరమే!

అయితే, రామచంద్రమూర్తి ఎందుకు పురుషకారానికి అనమతి ఇవ్వలేదు? ఆయన అభిప్రాయం ప్రకారం పురుష ప్రయత్నం వ్యర్థం. దైవమే కార్యసాదకం. నిజంగా అలాంటి అభిప్రాయమే ఆయనకుంటే, సీతకొరకై పురుషకారం చేసి వుండేవాడు కాదు. దైవమే సీతను తెచ్చి ఇస్తుందని వూరకే వుండేవాడు. ధర్మ విరుద్ధ పురుషకారం శ్రీరాముడికి సమ్మతం కాదు. లక్ష్మణుడి పురుషకారానికి ప్రధమ కబళం దశరథుడు. రాజ్యం కోసం తండ్రిని పీడించిన వాడవుతాడు. అందుకే రాముడొప్పుకోలేదు. రాముడు పురుషకార విరోధి కాదు. అలానే, అన్న అరణ్యాలకు పోయి కష్టపడడం ఇష్టం లేక, ఎలాగైనా అయోధ్యలోనే ఆయన వుండేట్లు చేయడానికి సద్భావంతో లక్ష్మణుడు రాముడితో వాదించాడే కాని ఆయన దైవ విరోధి కాదు. అలాంటప్పుడు లక్ష్మణ వాదన సాధువాదమా? దుర్వాదమా? అని విచారించాలి.

కర్మయందు నిష్ఠ వుండాలి

రామాయణంలో సీతారామలక్ష్మణుల చరిత్ర వల్ల, బోధ పడేదేంటంటే, పౌరుషం కంటే దైవమే ప్రబలం కాబట్టి, దైవాన్నే సేవించాలి. భారతంలో కూడా ఇదే కనిపిస్తుంది. అంతమాత్రం చేత మనుష్యులు దైవాన్ని ధిక్కరించి పౌరుషాన్నే ఆశ్రయించకూడదు. దైవాన్ని ఆశ్రయించి, యథాశక్తి, యథాశాస్త్రం ప్రకారం, నిష్కాములై స్వకర్మలు చేయాలి. రామాయణంలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం ఇదే. భగవద్గీత ఉపదేశించింది కూడా ఇదే. రాముడు చెప్పిన ప్రతి మాట అందరికీ అన్ని వేళలా వర్తిస్తుందనడంలో సందేహం లేదు.

శ్రీరాముడు వనవాసం చేయడానికి నిశ్చయించుకున్నాడని తెలిసి, ఆయనను పోవద్దని చెప్పడం వృధా అని భావించి, తనను కూడా అడవికి తీసుకొని పొమ్మని కౌసల్య అడుగుతుంది రాముడిని. భర్తను విడిచి తన వెంట రావడం సరైంది కాదని తల్లికి నచ్చ చెప్పాడు రాముడు. అలా శ్రీరాముడు తనతో వనవాసానికి వస్తానన్న కౌసల్యను వద్దన్నాడు.

‘నీలో నేను సగం. నీ సగం దేహం ఇంట్లో పెట్టి, మిగిలిన సగం దేహంతో అడవికి పొమ్మని నీకు రాజు చెప్పాడా? అని ప్రశ్నించిన సీతను కాదనలేకపోయాడు. ఆమెను బాధపడవద్దని, తనతో తీసుకొని పోతానని చెప్పాడు శ్రీరాముడు. లక్ష్మణుడు కూడా అన్న వెంట అడవికి పయనమయ్యాడు.

(ఆంధ్ర వాల్మీకి వాసుదాసుగారి రామాయణం మందరం ఆధారంగా)

 

No comments:

Post a Comment