Monday, December 2, 2024

కర్దమ, దక్ష ప్రజాపతుల సంతతి ....... శ్రీ మహాభాగవత కథ-13 : వనం జ్వాలా నరసింహారావు

 కర్దమ, దక్ష ప్రజాపతుల సంతతి

శ్రీ మహాభాగవత కథ-13

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (02-12-2024)  

కంII చదివెడిది భాగవతమిది, 

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

చదివినను ముక్తి కలుగును, 

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై 

స్వాయంభవ మనువు తన మూడవ కూతురైన ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. వీరి సంతానంతో ముల్లోకాలు నిండిపోయాయి. (మనువు రెండవ కూతురు) దేవహూతి, కర్దమ దంపతుల పుత్రికలందరూ బ్రహ్మర్షుల భార్యలు. అందులో మరీచుడి, కర్దమ కూతురైన కళ అనే భార్య వల్ల, కశ్యపుడు అనే కొడుకు, పూర్ణిమ అనే కూతురు పుట్టారు. వారి సంతానంతో భువనాలన్నీ నిండిపోయాయి. అత్రి మహామునికి సతి అనసూయాదేవి వల్ల బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశతో ముగ్గురు కొడుకులు పుట్టారు. ఆ దంపతులకు బ్రహ్మ అంశతో చంద్రుడు, విష్ణుమూర్తి అంశతో దత్తాత్రేయుడు, ఈశ్వరుడి అంశతో దుర్వాసుడు జన్మించారు. అంగిరసుడనే మునికి తన భార్యైన శ్రద్ధ యందు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు జన్మించారు. పులస్త్య ప్రజాపతికి, ఆయన భార్య హవిర్భుక్కు అనే ఆవిడకు అగస్త్యుడు పుట్టాడు. పులస్త్యుడికి విశ్రవసుడు అనే మరొక కొడుకు కూడా కలిగాడు. అతడికి, ఇలబిలకి కలిగిన సంతానమే కుబేరుడు. అలాగే అతడికి, కైకసికి జన్మించారు రావణ, కుంభకర్ణ, విభీషణులు. 

కర్దమ ప్రజాపతి కూతురు గతికి, పులహుడికి ముగ్గురు కొడుకులు పుట్టారు. మరొక కుమార్తె క్రియకు వాలఖిల్యులు అనే పేరుగల అరవై వేలమంది మహర్షులు పుట్టారు. వశిష్టుడికి తన భార్య ఊర్జ యందు ఒక సప్తర్షి బృందం పుట్టింది. మరొక భార్యకు శక్తి మొదలైన సంతానం కలిగారు. అధర్వుడికి, చిత్తికి దధ్వంచుడు పుట్టాడు. భృగు మహర్షికి, ఖ్యాతికి దాత, విధాత అనే ఇద్దరు కొడుకులు, శ్రీ అనే కూతురు పుట్టారు. భృగు పరంపరలోనే మార్కండేయుడు పుట్టాడు. ఇలా కర్దముడి కుమార్తెల వల్ల కలిగిన సంతాన పరంపరతో అన్ని లోకాలు నిండిపోయాయి. 

దక్ష ప్రజాపతికి, స్వాయంభవ మనువు కూతురైన ప్రసూతికి పదహారు మంది కూతుళ్లు పుట్టారు. వారిలో పదమూడు మందిని ధర్ముడు అనే రాజుకిచ్చి వివాహం చేశాడు దక్షుడు. అలాగే అగ్నిదేవుడికి ఒక కుమార్తెను, పితృదేవతలకు ఒక కుమార్తెను, ఈశ్వరుడికి ఒక కుమార్తెను ఇచ్చి వివాహం చేశాడు, ధర్ముడి భార్యలలో ఆయనకు మూర్తి అనే ఆమె వల్ల “నరనారాయణులు” అనే ఇద్దరు ఋషులు జన్మించారు. వారు పుట్టిన సమయంలో విశ్వమంతా ప్రకాశించింది. బ్రహ్మాది దేవతలు నరనారాయణుల దగ్గరికి వచ్చి స్తుతించారు. ఆ తరువాత వారందరిని దీవించి, నరనారాయణులు గంధమాదన పర్వతానికి వెళ్లిపోయారు. భూమాత భారాన్ని తొలగించడం కోసం నరనారాయణులే అర్జునుడు, కృష్ణుడు అనే పేర్లతో జన్మించారు. 

ఇదిలా ఉండగా, పూర్వం బ్రహ్మజ్ఞాన సంపన్నులైన బ్రహ్మలు చేసే సత్రయాగాన్ని చూడడానికి బ్రహ్మ, యోగులు, సర్వ దేవతలు, మునీంద్రులు, అగ్నిహోత్రుడు, ఋషులు, ప్రజాపతులు వచ్చారు. అక్కడికి దక్షుడు కూడా వచ్చాడు. ఆయన రాకను గమనించిన సభాసదులందరూ వెంటనే మర్యాద పూర్వకంగా లేచి నిల్చున్నారు. బ్రహ్మ, మహేశ్వరులు మాత్రం లేవలేదు. వచ్చిన దక్షుడు తనకు తండ్రైన బ్రహ్మకు నమస్కరించాడు. తనకు కేటాయించిన ఉచితాసనం మీద కూర్చున్నాడు. తనను చూసి సభ్యులంతా లేచి నిల్చున్నప్పటికీ, ఆసనం మీద నుండి దిగని శివుడి వైపు కోపంగా చూస్తూ, అక్కడున్న దేవతలను, ఇతరులను ఉద్దేశించి ఇలా అన్నాడు. 

‘ఈ శివుడు దిక్పాలకుల కీర్తికి హాని కలిగించేవాడు. ఇతడి వల్ల సజ్జనులు నడిచే మార్గం చెడిపోతుంది. సిగ్గులేని ఈ శివుడు నా కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అందువల్ల గొప్పవాడయ్యాడు. ఇతడు నాకు ఎదురుగా వచ్చి నమస్కారం చేసి గౌరవించ వద్దా? నన్ను చూసి కనీసం నోటితో పలకరిస్తే ఆయన గౌరవానికి ఏం లోపం వస్తుంది?’ అని అంటూ శివుడిని పరిపరి విధాల దూషించాడు. అభిమానహీనుడనీ, మర్యాదలేనివాడనీ, మత్తెక్కి తిరుగుతాడనీ, దిగంబరుడనీ, భూతప్రేత గణాలతో ఉంటాడనీ, బూడిద పూసుకుంటాడనీ, శుచిలేని వాడనీ, దుష్ట హృదయుడనీ, శ్మశానంలో కాపురం ఉంటాడనీ అని శివుడికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, అతడిని శపిస్తానని జలాన్ని స్వీకరించాడు. “ఈ శివుడు ఇంద్రుడు, విష్ణువు మొదలైన దేవతలతో పాటు యజ్ఞ సమయంలో హవిర్భాగాన్ని పొందకుండు గాక” అని శపించాడు. 

రుద్రుడికి శాపం ఇచ్చినందుకు సభలోని వాళ్లు అతడిని తప్పు చేశావని నిందించారు. అప్పుడు, కోపం పెరిగి దక్షుడు తన నివాసానికి వెళ్ళిపోయాడు. ఇదంతా గమనిస్తున్న నందికేశ్వరుడు, దక్షుడిని విమర్శించి, త్వరలోనే అతడు “గొర్రె తలవాడు” అవుతాడు అని శపించాడు. దక్షుడి మార్గాన్ని అనుసరించే బ్రాహ్మణుల మనస్సు క్షోభపడుతుంది అని అక్కడి బ్రాహ్మణులను శపించాడు. ఈ శాప వాక్కులను విన్న భృగు మహాముని మళ్లీ ఇలా శపించాడు. “ఎవరైతే శివ దీక్ష వహించి శివ దీక్షా పరాయణులవుతారో, వారిని ఎవరైతే అనుసరిస్తారో, వాళ్లు వేదశాస్త్ర విరోధులై పాషండులైపోదురు గాక!”. 

ఈ విధంగా నందీశ్వరుడు, భృగుమహర్షి పరస్పరం శపించుకున్నారు. ఇవన్నీ చూస్తున్న శివుడు దేనిమీదా మనస్సు పెట్టకుండా అనుచరులతో కలసి వెళ్ళిపోయాడు. అలా దక్షుడికి, ఆయన అల్లుడైన ఈశ్వరుడికీ పరస్పర విరోధం పెరుగుతుండగా చాలాకాలం గడిచింది.             

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా) 


No comments:

Post a Comment