Thursday, March 27, 2025

ఎక్కడికి పోతుందీ విలేఖరిత్వం? ఏదీ సంయమనం : వనం జ్వాలా నరసింహారావు

 ఎక్కడికి పోతుందీ విలేఖరిత్వం? ఏదీ సంయమనం

వనం జ్వాలా నరసింహారావు 

మనతెలంగాణ దినపత్రిక ఎడిట్ పేజీ (28-03-2025)

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రసంగానికి కృతజ్ఞతా తీర్మానం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసన సభలో రెండున్నర గంటల పాటు సుదీర్ఘంగా, వ్యూహాత్మకంగా, స్పష్టంగా సమాధానం ఇచ్చారు. ప్రధానంగా మీడియా బాధ్యతారాహిత్యంపై ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా, చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియా వృద్ధితో అసలు పాత్రికేయత అంటే ఏమిటనే ప్రశ్న తలెత్తిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా, అభ్యంతరకరమైన భాషను వాడుతున్న డిజిటల్ మీడియా ప్రవర్తనపై ఆయన విమర్శించలు చేశారు. మీడియా నియంత్రణకు అవసరమైన స్పష్టతపై చర్చ జరగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ‘మనతెలంగాణ’ లాంటి సామాజిక స్పృహ కలిగిన పత్రికలు (ప్రస్తుతానికి ఇదొక్కటే!) ఈ అంశంమీద పలురంగ ప్రముఖుల అభిప్రాయాలను సేకరించి ప్రచురిస్తున్నది. 

ఇద్దరు మహిళా యూట్యూబ్ జర్నలిస్టుల వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తూ, వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అధికారాన్ని విమర్శించొచ్చుగానీ, వ్యక్తిగత దూషణలకు పాల్పడటం అనాగరికమన్నారు. ఆ ఇద్దరు మహిళల ప్రవర్తనను ఉద్దేశించి, వారి అసభ్యకరమైన కంటెంట్‌పై చర్య తీసుకున్న ప్రభుత్వం, ప్రభుత్వం మీద చేసే విమర్శల విషయంలో జీరో టాలరెన్స్ పాలసీ పాటిస్తుందని, వ్యక్తిగత విమర్శలు చేస్తే అవసరమైన చర్య కూడా తీసుకుంటుందని సీఎం హెచ్చరించారు. మీడియా స్వేచ్ఛకు అనుగుణంగా విలేఖరుల తీరు బాధ్యతాయుతంగా ఉండాలని, వ్యక్తిగత దూషణలు సహించబోమని స్పష్టంగా తెలియజేశారు. చర్చల ద్వారా అసలు ‘పాత్రికేయ వృత్తి’ అంటే ఏమిటనే దానిపై శాసనసభలో స్పష్టత తీసుకురావాలని, అసలు-సిసలైన పాత్రికేయిల జాబితా  రూపొందించాలనీ ముఖ్యమంత్రి సూచించారు.

శాసనసభలో ఈ సందర్భంగా ‘ముసుగును తొలగించి, బట్టలు ఊడదీసి కొడతామని, ప్రజల ముందు ఊరేగిస్తాం’ అని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఆందోళనకరంగా అనిపించాయి. శబ్దతీవ్రత ఆయనకు పూర్తిగా మద్దతు ఇస్తున్నవారికీ షాక్ ఇచ్చాయి. విమర్శించేవారికి చురకలంటించడం రాజకీయాల్లో కొత్తేమీ కాదు. కానీ వ్యక్తిగత స్థాయికి తగ్గి చేసిన విమర్శలకు బదులుగా న్యాయపరంగా ముందుకు వెళ్లాల్సింది. "అంటురోగ కారకమైన దోమను చంపేందుకు ఇంటినే కాల్చేస్తారా?" అన్న చందంగా ఈ వ్యవహారం మారిపోయిందని విశ్లేషకుల భావన. దూషణలను ఖండించాల్సిన వ్యక్తే ఘాటైన భాషను ఉపయోగించటం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న లేచింది. మీడియా బాధ్యతగా వ్యవహరించాలనే నిబద్ధత ఉంటే, అసెంబ్లీ, ప్రభుత్వాలకూ వాక్చాతుర్యంతో స్పందించే సంయమనం అవసరమేమిటో ఈ ఉదంతం ఆలోచింపజేస్తోంది.

ఇదిలా వుండగా, రాజకీయ నాయకులే తాము చెప్పే మాటలకు గౌరవం కల్పించుకోకపోతే, మీడియాను బాధ్యతాయుతంగా ఉండమని ఎలా చెప్పగాలుగుతారనే ప్రశ్న కూడా ఉత్పన్నమౌతున్నది. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి ‘స్ట్రెచర్ నుంచి మార్చురీకి పంపిస్తా’ అన్న వ్యాఖ్యలు, అసలు రాజకీయ సంస్కృతి ఏమవుతోందన్న అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. రాజకీయ మైదానమే ఒక కామెడీ స్టేజ్‌లా మారితే, మీడియా కూడా అంతే రీతిలో వ్యవహరించకతప్పదనే భావనకు దారితీసే ప్రమాదం వున్నది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దీనిని మీడియాపై దాడిగా అభివర్ణించగా, రేవంత్ రెడ్డి మాత్రం పాత్రికేయ ధర్మాన్ని నిర్వచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇరువురి అబిప్రాయాలు కూడా చర్చనీయాంశమే. సోషల్ మీడియా స్వేచ్ఛ ఏమిటి? మర్యాదారహితమైన వ్యాఖ్యలు చేసే జర్నలిస్టులను ఏ విధంగా నియంత్రించాలి? ఈ ప్రశ్నలు సామాజికంగా చర్చించాల్సినవే.

ఈ ఉదంతం కేవలం మీడియా స్వేచ్ఛకే పరిమితం కాదు. శాసనసభ లాంటి పవిత్రమైన వేదికమీద రాజకీయనేతలు అనుసరించాల్సిన పార్లమెంటరీ భాషాప్రయోగాలను తామే పాటించకుంటే, మీడియాను సంయమనంగా ఉండమని చెప్పగలమా? అసలు రాజకీయ నాయకులే విమర్శలు ఆహ్వానించాలి, కానీ ప్రతిసారి ప్రతిస్పందన జుగుప్సాకరంగా ఎందుకు మారుతోంది? ఎందుకు మారాలి? ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమే. అయితే, దూషణల స్థాయిని నిర్ణయించే బాధ్యత ఒక సమాజంగా అందరిమీదా ఉంది. 

అందుకే, ప్రశ్న ఏమిటంటే, మీడియా సంయమనం పాటించాలా? లేదా రాజకీయ నాయకులే తమ భాషను మెరుగుపరచుకోవాలా? విమర్శించదలిచినప్పుడు సంయమనంతో, అక్షరసత్యంగా, న్యాయపరంగా స్పందించడం రాజకీయ పరిపక్వత. హద్దులు దాటి స్పందిస్తే, సమస్యను పరిష్కరించాల్సింది పోయి మరింత పెంచినట్టే.  వాస్తవానికి, వాస్తవాలను తర్కబద్ధతతో స్పందిస్తే చాలని అనేక సందర్భాల్లో స్పష్టమైంది. కానీ, ఘాటైన పదజాలంతో సమస్యను మరింత పెంచుకోవటం, మరింత జటిలం చేయడం ఎంతవరకు అవసరమో? ప్రభుత్వాలకు ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టుకునే బాధ్యత ఉంది. అదే విధంగా, పాత్రికేయులు కూడా తమ బాధ్యతను నిర్వర్స్తిస్తూ, హద్దులు దాటకూడదని అహర్నిశం గుర్తుచేసుకోవాలి. మితిమీరిన విమర్శలు కూడా నాశనానికే దారితీస్తాయని ఈ సంఘటన మనకు నేర్పే గుణపాఠం!

సుమారు రెండు దశాబ్దాల క్రితం, ప్రస్తుతం ‘మనతెలంగాణ’ దినపత్రిక సంపాదకుడుగా పనిచేస్తున్న సీనియర్ పాత్రికేయుడు దేవులపల్లి అమర్, ప్రెస్ అకాడెమీ అధ్యక్షుడిగా వున్నప్పుడు, న్యూఢిల్లీ కేంద్రంగా డాక్టర్ ఎన్ భాస్కర్ రావు అధ్యక్షతన పనిచేస్తున్న ప్రముఖ మీడియా సంస్థ ‘సెంటర్ ఫర్ మీడియా స్టడీస్’- ప్రెస్ అకాడెమీ సంయుక్తంగా నిర్వహించిన ‘మీడియాకు లక్ష్మణరేఖ అవసరమా?’ అన్న అంశం మీద నిర్వహించిన సదస్సులో దేశవ్యాప్త మీడియా దిగ్గజాలు పాల్గొని తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించారు. వాటిని పుస్తక రూపంలో తెచ్చి అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో న్యూఢిల్లీలో ఆవిష్కరించడం జరిగింది. అక్షరలక్షలు చేసే ఆ ఉపన్యాసాల సారాన్ని వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకుని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ముందుకు సాగితే కొంత మేరకు పరిష్కార మార్గాన్ని కనుగొనవచ్చేమో! మీడియారంగ ప్రముఖులు ఈ దిశగా ఆలోచన చేయాలని విజ్ఞప్తి. 

చివరగా ఒక్క మాట. ‘కలం కూలీ’ స్వర్గీయ జి కృష్ణ గారు తన ‘విలేఖరి లోకం’ (దేవులపల్లి అమర్ సంపాదకుడుగా వున్నప్పటి ప్రజాతంత్ర వారపత్రికలో ప్రచురించిన ఆయన వ్యాసాల సంకలనం) పుస్తకానికి ‘అవ్యక్త కోలాహలం’ శీర్షికన ముందు మాట రాస్తూ, ‘నా విలేఖరిత్వం జారచోర భజనా? నా విలేఖరిత్వం దేశానికి సేవా? అని ప్రశ్నించుకుని, కోలాహలంగా నిలిచిన తన అనుభవాన్ని చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చిన అమర్ కు ధన్యవాదాలు చెప్పాడు. కృష్ణ గారి మాటల్లో ఏమైనా సందేశం వున్న్నదా? వుంటే ఆస్వాదించాలని మనవి.

No comments:

Post a Comment