Friday, December 19, 2025

నాలుగు దిక్సూచులు: వనం జ్వాల నరసింహరావు

 నాలుగు దిక్సూచులు

(ఆంధ్రజ్యోతి దినపత్రిక నవ్య పేజీ: 19, డిసెంబర్, 2025)

వనం జ్వాల నరసింహరావు

మనిషిని గొప్ప వ్యక్తిగా నిలబెట్టేది అతని ప్రతిభ, విద్య, అధికారం మాత్రమే కాదు. వినయం, విధేయత, కృతజ్ఞత, చిన్నా పెద్దా తేడా లేకుండా ఇతరుల్ని గుర్తించి గౌరవించే హృదయం, నడవడి ప్రతి వ్యక్తికీ చాలా అవసరం. అవి మనిషి వ్యక్తిత్వానికి బలం, గౌరవం, ఆత్మగౌరవం ఇస్తాయి. వ్యక్తిగత సంబంధాల్లోకానీ, ప్రజా జీవితంలోకానీ, వ్యక్తిత్వ వికాసంలో కానీ మన ప్రవర్తన, సంభాషణలు, సంబంధాలు, విలువలు అనేవి నాలుగు సులువైన, ఆణిముత్యాల్లాంటి పదాలతో ప్రారంభమవుతాయి.

అవి ‘దయచేసి’ (ప్లీజ్‌), ‘ధన్యవాదాలు’ (థాంక్యూ), ‘క్షమించండి’ (అయామ్‌ సారీ), ‘మీకు స్వాగతం’ (యు ఆర్‌ వెల్కమ్‌) అనే ఆ నాలుగూ నాలుగు సముద్రాలు, నాలుగు దిక్కులు మన నలుగురు సహోదరులు. వాటిని అర్థం చేసుకొని, ఆస్వాదిస్తే, అవి మన జీవనయానంతో మనతో చెట్టాపట్టాలు వేసుకొని పయనిస్తాయి. అవి కేవలం మాటలు కాదు. మహత్తర దార్శనిక విలువలు, మన నీతి దిక్సూచులు.

శక్తి సామర్థ్యాలున్న ప్రాంగణాల్లో, పటిష్టంగా నడిచే గదుల్లో, జ్ఞానం నివసించే-వికసించే  గృహాలలో, విజ్ఞానం వృద్ధి చెందే సంస్థలలో, వుండే అనేకానేక అల్పప్రముఖులు, తమకు అన్నీ ఉన్నాయన్న భ్రమల్లో కూరుకుపోయి, దాన్లోనే కొట్టుమిట్టాడుతూ, ఒక మృదువైన, నిశ్శబ్ద సత్యం పట్టించుకోకుండా, భవిష్యత్తును చెడగొట్టుకోవడం, సమాజంలో సహజంగా తరచు జరిగే విషయమే. గొప్పతనం, గొప్పతనమే! దాన్ని ఎవరూ కాదనరు.

కృతజ్ఞత లేకపోవడం అంటే...

స్వభావాన్ని నిర్మించే ఈ నాలుగు పదాలు అసాధారణ శక్తిని కలిగి ఉంటాయి. ‘దయచేసి’ అనే పదం వినయానికి ప్రతీక. మనం కోరుకోవడమే తప్ప డిమాండ్‌ చేయడం కాదనే స్వభావ భావన కలిగినది. ‘ధన్యవాదాలు’ అనేది కృతజ్ఞతకు అద్దం. ‘క్షమించండి’ అనేది ఆత్మ సత్యానికి సూచిక. తప్పులను అంగీకరించే ధైర్యాన్ని, సరైన మార్గంలో నడిచే విలువను చూపుతుంది. ‘స్వాగతం’ అనేది ఔదార్యాన్ని వ్యక్తపరుస్తుంది. ప్రత్యేకించి అధికార స్థానాలకు, అందునా ప్రభుత్వాధికార ఉన్నత స్థానాలకు అలవోకగా చేరినవారు ఈ పదాలలోని బలాలను అర్థం చేసుకోవాలి. ఇవి ప్రభావాన్నే కాదు, నమ్మకాన్ని కూడా నిర్మిస్తాయి. ఎవరూ అధికారాన్ని ప్రకటించాల్సిన, ప్రదర్శించాల్సిన అవసరం ఉండకూడదు. ప్రజలు స్వయంగా ఇవ్వగలరు, లాక్కోనూ గలరు.

కానీ ఇతరులను గుర్తించడాన్ని, గౌరవించడాన్ని బలహీనతగా, క్షమాపణను ఓటమిగా, కృతజ్ఞత తెలపడం కూడా ఒక పనిగా భావించేవారు సామ్రాజ్యాలను నిర్మించినా చివరకు ఒంటరితనమే మిగులుతుంది. కనీసం ఒక సామాన్యుడి మద్దతైనా లేకుండా... బలహీనంగా, ఏకాకిగా అయిపోతారు. విజయం ఎంత ఉన్నతమైనా తాత్కాలికమే. కానీ వినయం, కృతజ్ఞత శాశ్వతమైనవి. ‘నేనొక్కడినే సాధించాను’ అనే భావన నిజానికి మనిషిని బలహీనుడిగా చేస్తుంది. ఎందుకంటే గొప్పతనం అనేది ఎవరికీ పూర్తిగా స్వయంకృతం కాదు. విత్తనం వృక్షం కావడానికి నేల, నీరు, గాలి, వెలుగు అవసరమైనట్టే... వ్యక్తుల ఎదుగుదలకు కూడా ఉపకారం, సహకారం, మార్గదర్శకత్వం, అవకాశాలు అవసరం. కొంతమంది సహాయాన్ని ఒప్పుకోవడం బలహీనతగా భావిస్తారు. కానీ చేసిన సాయాన్ని గుర్తించడం వల్ల గొప్పతనం తగ్గదు, పెరుగుతుంది. కృతజ్ఞత లేకపోవడం అంటే... సహాయాన్ని మరచిపోవడం కాదు, గుర్తుంచుకొని బహిర్గతం చేయకపోవడం.

అది మహత్తర విజయం...

ఎవరైనా ఎత్తుకు ఎదిగితే ప్రపంచం చప్పట్లు కొడుతుంది. కానీ తమను ఆ ఎత్తుకు తీసుకువెళ్ళినవారిని మరచిపోతే... ఆ చప్పట్లు నెమ్మదిగా నిశ్శబ్దం అవుతాయి. గొప్పతనం అంటే కేవలం స్థానం, సంపద, గుర్తింపు కాదు. అది వినయం, కృతజ్ఞత, మానవత్వాలను నిలుపుకోవడంలో ఉంటుంది. సహాయం పొందినవారు మరచిపోతే అది బాధ కలిగిస్తుంది... కృతజ్ఞత ఆశించినందుకు కాదు, వారు ఆ ప్రస్తావన తేకపోవడం వల్ల సంబంధాల విలువ తగ్గిందని. వినయం, కృతజ్ఞత ఎప్పుడూ ఐచ్ఛికాలు కావు... అవి వ్యక్తిత్వ పరిమళం. పదవులు మారిపోతాయి. బిరుదులు చెదిరిపోతాయి. జనసందోహం చరిత్రలో కలిసిపోతుంది. కానీ కృతజ్ఞతతో గడిపిన జీవితపు స్మృతి... మనం చూడకపోయినా మనకోసం భద్రంగా ఉంటుంది. ఎంత ఎత్తు ఎక్కేమనేది కాదు, ఎంత వినమ్రంగా వెనక్కి చూసి ధన్యవాదాలు చెప్పగలిగామనేదే మహత్తర విజయం.

ప్రాచీన భారతీయ సంప్రదాయాలలోను, జ్ఞాన సంపదలోనూ, ఆధునిక నాయకత్వ సూత్రాల శాస్త్రంలోనూ, కృతజ్ఞత వ్యక్తీకరణను, మర్యాద కనపర్చడాన్ని, పరుల గౌరవాన్ని గుర్తించడాన్ని, అత్యున్నత ధర్మాలుగా గుర్తించబడ్డాయి, గుణాలుగా పరిగణించబడ్డాయి. వర్తమానకాలం ఆశయ ప్రధానమైన, ఆశయాధారిత ప్రపంచంలో, ప్రత్యేకంగా ప్రభావం పెరుగుతున్నంత మేరకు, కొంతమంది వ్యక్తులు ఇవి మరచిపోతారు. అజ్ఞానంతో కాదు. పదవీ, ధన అహంకారంతో. మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం కేవలం ఎంపికగా మారుతున్నది, కృతజ్ఞత అరుదైనదై పోతుంది, సంబంధాలు లావాదేవీలుగా మారుతున్నాయి. తత్సంబంధిత వ్యక్తులు యాదృచ్ఛికంగా, పరిస్థితుల నేపధ్యం ద్వారా, సమయానుకూలతల తోడ్పాటుతో ఎదుగుతారు. వారికి తమ ఎదుగుదల మూలాలు కనిపించవు. ఫలితంగా భవిష్యత్తులో గౌరవం లేకుండా సమాజంలో మిగిలిపోతారు.

వ్యవస్థలను నిర్మించే శక్తి ఉన్నవారికి, మనసులను ప్రభావితం చేయగలవారికి, జీవితాలను ముద్రించగలవారికి తగిన సందేశం, ఆలోచన ప్రధానం. వారి నడమంత్రపు విజయమే ఇతరులకు వారివ్వాల్సిన మర్యాదను కనుమరుగు చేసిందేమో లోతుగా ఆలోచించాలి. స్వభావాన్ని నిర్మించే ఆ నాలుగు ఆణిముత్యపు పదాలు అసాధారణ శక్తిని కలిగి ఉంటాయి. అవి హృదయ కవాటాలను తెరుస్తాయి, గాయాలను మాన్పుతాయి, సంబంధాలను ఉన్నతం చేస్తాయి. అవి అలంకార పదాలు, కార్యక్రమ పదాలు కావు. అవి ఆధారాత్మకమైనవి.

కొంతమంది నాయకుల నాయకత్త్వ జీవనయానం, ప్రేరణాత్మకంగా స్ఫూర్తిదాయకంగా కనిపించవచ్చు. కాకపోతే, వారు ఆ స్థాయికి చేరడానికి మద్దతునిచ్చి కారకులైన ఆచార్యుడిని, వారికి మార్గాదర్శకత్త్వాన్నిచ్చిన సహాయకుడిని, స్నేహితుడిని, బలంగా నమ్మకాన్ని నాటిన వ్యక్తిని, విశ్వసించి ఇచ్చిన నిశ్శబ్ద ఆశీర్వాదాలను మర్చిపోతారు. ఎందుకంటే ఆశయం పెరిగిన కొద్దీ, కృతజ్ఞత తగ్గిపోవడం, గుర్తించడం మసకబారడం, ఒక మానవీయ బలహీనత. అలాంటివారు సంపాదించుకునేది గౌరవాన్ని కానే కాదు. ఖ్యాతిని కావచ్చు. సంపదా కావచ్చు. బిరుదులను పొందినా, విలువలను కోల్పోతారు.

ఉదాహరణకు అనుభవంలోని ఒక వాస్తవిక జీవిత కథ తెలుసుకుందాం. బాగా చదువుకుని, రాజకీయ కుటుంబ నేపధ్యం కలిగిన నేనెరిగిన ఒక వ్యక్తి, అంతగా తనకు గుర్తింపు లేనినాడు, గుర్తించేవారు దొరకనినాడు, తన రక్తసంబంధీకుల ద్వారా పరిచయమై, కొంత రాజకీయ పలుకుబడి వున్న ఒక పెద్దమనిషిని (వయసులో కూడా) తన రాజకీయ ఎదుగుల అవకాశాల కోసం తలుపు ఒకటికి పదిసార్లు తలుపు తట్టాడు. అతడు ఒంటరిగా పొలేదు. అతని మనసులో ఆశ (అత్యాశ), ఆత్మవిశ్వాసం, కలుస్తున్న వ్యక్తిమీద ఆధారపడటం, అనుకున్న పని సాధించి తీరాలన్న పట్టుదల, నిండు నిబిడీకృతంగా ఉన్నాయి. ఆ పెద్దమనిషి తనదగ్గరికి వచ్చిన వ్యక్తికి సహాయం చేశాడు. ఆ సహాయం తన వ్యక్తిగత ప్రయోజనానికి కాదు, కుటుంబ నేపధ్య స్నేహం వల్ల కలిగిన సత్సంకల్పంతో. సలహాలు, పరిచయాలు, సహకారం, తోడ్పాటు, అన్నింటినీ చేతనైనంత మేరకు ఇచ్చాడు.

ఆ వ్యక్తి స్వయం శక్తి కూడా  తోడై, ప్రాధమిక రాజకీయ విజయంతో ఆరంబమై, అంచెలంచలుగా ఎదిగి, ఒక సమున్నత రాజకీయ స్థాయికి చేరుకున్నాడు. విజయాలు పెరిగిన కొద్దీ అతడి స్థాయి కూడాపెరిగింది. ఎదిగిన కొద్దీ, ఒదగకుండా కొంతమంది నిశ్శబ్దంగా మారిపోతారు. అది వినయంతో కాదు. ఉద్దేశపూర్వక మౌనం. అలాగే ఈ వ్యక్తి భావనలో, ఆచరణలో కూడా నిశ్శబ్దం పెరిగింది. విజయ కిరీటం ధరించాడు, కానీ కృతజ్ఞత అడుగుల జాడలను ఎక్కడో మార్గంమధ్యంలో వదిలేశాడు. ‘నేనొక్కడినే సాధించాను’ అనే గర్వభావన, నిజానికి మనిషిని బలహీనుడిగా చేస్తుంది. ఎందుకంటే గొప్పతనం అనేది ఎవరికీ పూర్తిగా స్వయంకృతం కాదు. విత్తనం వృక్షం కావడానికి, నేల, నీరు, గాలి, వెలుగు అవసరమైనట్టే, వ్యక్తుల ఎదుగుదలకు, ఉపకారం, సహకారం, మార్గదర్శకత్వం, విశ్వాసం, అవకాశాలు అవసరం. స్వయంకృత ప్రవేశపత్రం అనేవి కారణాలవుతాయి.

ఈ పరిణామం జీవితంలోని ఎన్నో రంగాల్లో కనిపిస్తుంది. కృతజ్ఞతాలేమి బాహాటంగా, పెద్ద ధ్వనిలాగా కానరాదు. అది నిశ్శబ్దంగా, ఉద్దేశపూర్వకంగా, ముసుగులో కానరాకుండా ఉంటుంది. అది మాటల్లో కనిపించకపోవచ్చు, కానీ మాటల లేమిలో స్పష్టమవుతుంది. ఇవన్నీ సంకేతాలు. కొంతమంది సహాయం ఒప్పుకోవడం అంటే బలహీనత అని భావిస్తారు. కానీ, చేసిన సహాయం గుర్తించడం వల్ల గొప్పతనం తగ్గదు. అది పెరుగుతుంది. కృతజ్ఞతాలేమి సహాయం మరచిపోవడమే కాదు. గుర్తుంచుకుని బహిర్గతం చేయకపోవడం.

కొంతమంది వ్యక్తులు విజయంతో స్పష్టతను కాకుండా కేవలం ప్రదర్శనాత్మక అనుభూతిని పొందుతారు. ఆశయం దిశని ఇస్తుంది, కానీ ప్రతిబింబాన్ని కాదు. వారు ఎదుగుతారు, కానీ ఎదగడానికి ఎవరు వారికి సహాయం ఎవరు చేశారో అర్థం చేసుకోరు. వారు ఎత్తుగా నిలుస్తారు, కానీ ఆ ఎత్తుకు నేలవంటి పునాది వేసినవారి విలువను గుర్తించరు. సంబంధాలను మెట్లు అనుకుంటారు. అధిరోహించిన తరువాత, ఆ మెట్లను మరచిపోతారు. తాము ‘స్వయంకృతులం’ అని గర్వపడతారు. తాము ఉత్సవ విగ్రహాలమే కానీ, స్వయంభులాగా వెలసిన దేవుళ్లము కామన్న సంగతి అవగతం కాని మూర్ఖత్త్వం వారిది. వాస్తవానికి, ఈ ప్రపంచంలో ఎవరూ పూర్తిగా స్వయంకృతులు కారు. అలాంటి వారు అర్థం చేసుకోవాల్సింది, కృతజ్ఞతలేని నాయకత్వం అంటే, శ్రేయస్సు లేని అధికారం మాత్రమే అన్న నగ్న సత్యం. గొప్ప నాయకులు గౌరవాన్ని డిమాండ్ చేయరు. వారు సంపాదిస్తారు. వారి మర్యాదే వారి గౌరవానికి ముద్ర.

సహాయం పొందిన వారు తర్వాత మరచిపోతే, అది బాధకరం. కృతజ్ఞత ఆశించినందుకే కాదు, కానీ నిశ్శబ్దం సంబంధాల విలువను తగ్గించిందనే బాధ. గొప్పతనం స్వయంకృతం కాదు. వినయం, కృతజ్ఞతలు ఎప్పుడూ ఐచ్ఛికాలు కావు. వ్యక్తిత్వ పరిమళం. పదవులు మారిపోతాయి, బిరుదులు చెదిరిపోతాయి, జనసందోహం చరిత్రలో కలిసిపోతుంది. కానీ కృతజ్ఞతతో గడిపిన జీవితపు స్మృతి, మనం చూడకపోయినా, అది మనకోసం శుభ్రంగా సంరక్షింపబడుతుంది. మహత్తర విజయం అంటే, ఎంత ఎత్తు ఎక్కామో కాదు, ఎంత వినమ్రంగా వెనక్కి చూసి, ‘ధన్యవాదాలు’ చెప్పగలిగామో.

కృతజ్ఞత వ్యక్తీకరణ, మర్యాద కనబరచడం, పరుల గౌరవాన్ని గుర్తించడం అనేవి ప్రాచీన భారతీయ సంప్రదాయాల్లో, ఆధునిక నీతి సూత్రాల్లో అత్యున్నత ధర్మాలుగా, గుణాలుగా పరిగణన పొందాయి. వర్తమాన కాలంలో కొంతమంది వ్యక్తులు వీటిని మరచిపోతున్నారు. అజ్ఞానంతో కాదు, పదవీ, ధన అహంకారంతో. మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం కేవలం ఎంపికగా మారుతోంది. కృతజ్ఞత అరుదైపోతోంది. సంబంధాలు లావాదేవీలుగా మారుతున్నాయి. సంబంధిత వ్యక్తులకు తమ ఎదుగుదల మూలాలు కనిపించవు. ఫలితంగా భవిష్యత్తులో గౌరవం లేకుండా మిగిలిపోతారు. వారి నడమంత్రపు విజయమే ఇతరులకు వారు ఇవ్వాల్సిన మర్యాదను కనుమరుగు చేసిందేమో లోతుగా ఆలోచించాలి.

 

No comments:

Post a Comment