Saturday, March 28, 2026

భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం, సందర్భోచితంగా వాల్మీకి ప్రస్తావన >>>>> భవిష్యత్తులో ఆంధ్రవాల్మీకి వర్ణన వినిపించాల్సిన ఆవశ్యకత : వనం జ్వాలా నరసింహారావు

 

భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం, 

సందర్భోచితంగా వాల్మీకి ప్రస్తావన

భవిష్యత్తులో ఆంధ్రవాల్మీకి వర్ణన 

వినిపించాల్సిన ఆవశ్యకత

వనం జ్వాలా నరసింహారావు

‘విదియనాడు కనిపించని చంద్రుడు, తదియనాడు తానే కనిపిస్తాడు’ అనేది తెలుగు సామెత. అమావాస్య తర్వాత వచ్చే విదియ నాడు చంద్రుడు సన్నగా ఉండడంవల్ల, ఆ రోజు కనిపించకపోయినా, తరువాతి తదియ రోజున తప్పక దర్శనమిస్తాడని తెలిసిన విషయమే. అమావాస్య రోజున చంద్రుడు పూర్తిగా కనిపించడు. పాడ్యమి నాడు కూడా తక్కువగా ఉంటాడు. విదియ నాడు కూడా అలాగే కావచ్చు. మబ్బుల వల్ల ఆకాశంలో కనిపించకపోవచ్చు కూడా. అకారణంగా కొంతకాలం పాటు ఏదైనా విషయం పక్కదారి పట్టినా, మరుగునపడ్డా, కాలక్రమేణా అది ఖచ్చితంగా వెలుగులోకి వస్తుందని సామెత తెలియజేస్తుంది. అలాగే అనుకున్నది సాధించలేకపోవడం సహితం తాత్కాలికమని, మంచి రోజులు వస్తాయని దీని అర్థం. సామెతను సందర్భానుసారంగా ఉపయోగించుకోవడం అనేది, ఆయా అంశాల మీద ఆధారపడి వుంటుంది.

మార్చ్ 27, 2026 శుక్రవారం శ్రీరామనవమినాడు, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర దేవస్థాన అధికారులు, విశిష్ట వశిష్ట అర్చక మహాశయులు, గత 14 సంవత్సరాలుగా (శ్రీరాముడి వనవాసం కూడా 14 సంవత్సరాలే!) నిర్వహించిన మాదిరిగానే, కన్నులపండుగగా, అంగరంగ వైభోగంగా, సీతారాముల కళ్యాణ సందర్భంగా, సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపుడిని, శ్రీమహాలక్ష్మీదేవిని, ఆబాలగోపాలం దర్శించుకునే (ప్రవర, గోత్రాల మాద్యమం ద్వారా!) మహద్భాగ్యం కలిగించింది. అయితే విదియనాడు కనిపించని చంద్రుడు, తదియనాడు తానే కనిపిస్తాడన్న సామెత ప్రకారం, మరుసటిరోజు, శనివారం నాడు, అద్భుతమైన రీతిలో, సందర్భోచితంగా వాల్మీకి రామాయణంలోని పట్టాభిషేకం ఘట్టాన్ని ఒకింత ఉటంకిస్తూ, రామచంద్రమూర్తిని, సీతాదేవిని, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమాన్, సుగ్రీవ, విభీషణ తదితరుల ప్రస్తావన తెచ్చారు అర్చక మహాశయులు. అభినందనలు. నమస్సులు. కాళిదాసు రఘువంశం కావ్యాన్ని కూడా పేర్కొన్నారు. ఒక అడుగు ముందుకు, వెనక్కు వేసి, ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు ప్రస్తావన తెస్తే, బాగుండేది.   

వాల్మీకి మహర్షి రామాయణాన్ని అనుగ్రహించారు. 24 గాయత్రీ మంత్రాక్షరాలను భద్రంగా నిక్షిప్తం చేసారు. మహా మహానుభావులూ, మహావిద్వాంసులూ, శ్రీమాన్ వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు గారు) వాల్మీకి రామాయణాన్ని యధాతధంగా మంత్రమయం చేస్తూ, ఛంధః యతులను ఆయా స్థానాలలో నిల్పి, వాల్మీకాన్ని తెనిగించారు. వాల్మీకి రామాయణానికి తుల్యమైన స్థాయినీ, పారమ్యాన్నీ, ఆంధ్ర వాల్మీకి రామాయణానికి అందించి, ‘మందరం’ అని దానికి ప్రాచుర్యాన్ని కలిగించారు.

ఆంధ్ర పాఠకలోకం అపారంగా మందరాన్ని అభిమానించింది. ఆదరించింది. శ్రీరామానుగ్రహ ప్రాప్తమయింది. కాలం గడచి పోతున్నది. వాసుదాసు గారు మారిపోతున్న తరాలకు గుర్తురావటం కూడా కష్టమై పోతున్నది. వ్యాస మహాభారతాన్ని తెనిగించిన నన్నయ ఆదికవైతే, వాల్మీకి రామాయణాన్ని యధా వాల్మీకంగా పూర్వకాండలతో సహా ఉత్తరకాండను కూడా మొట్ట మొదట తెనిగించిన శ్రీ వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు గారు) కూడా ఆదికవే కదా! నన్నయంతటి గొప్పవాడే కదా!

ఇక విషయానికి వస్తే: ‘అష్టాక్షరి’ మంత్రంలో ‘ప్రణవం, నమస్సు, నారాయణపదం’ వున్నాయి. ‘ప్రణవం’ అంటే జీవాత్మ పరమాత్మకే వుపయోగ పడాలనీ, ఆయన సేవకే వినియోగపడాలనీ అర్ధం. ‘నమస్సు’ అంటే స్వాతంత్ర్య రాహిత్యాన్నీ, పారతంత్రాన్నీ తెలుపుతుంది. ‘నారాయణపదం’ భగవత్ప్రియమైన భాగవత సేవను తెల్పుతుంది. ‘ప్రణవం లక్ష్మణుడు. యావజ్జీవితం అన్నకు శుశ్రూష చేసాడు. లక్ష్మణుడిని వాల్మీకి మహర్షి ‘లక్ష్మీవర్ధనుడు’ అని సంబోధిస్తాడు. లక్ష్మి అంటే ఇక్కడ సేవచేసే భాగ్యం అని పెద్దలు తేల్చేశారు. అతడు భగవదతారమైన శ్రీరాముడి సేవానిరతుడనీ, భగవత్ కైంకర్యాన్ని అవిఛ్చన్నంగా సాగించే కైంకర్య లక్ష్మీవర్ధనుడు.

‘నమస్సు’ భరతుడు. పరతంత్రుడై రాముడులేని అయోధ్యలో, వానప్రస్థుడి లాగా ఉన్నాడు. భగవంతుడికి చేసిన శరణాగతికి ముఖ్య ఫలం, భగవత్ సన్నిధానంలో చేరి, భగవంతుడికి సేవ చేయడమే. ఇతర ఫలాలన్నీ అనుషంగకాలని రామాయణం చెప్తుంది. ఇట్టి శరణాగతికి పురుషకారం అవశ్యం. పురుషకారానికి కావాల్సిన ముఖ్యగుణం శరణాగతుడిపట్ల దయ. ఈ గ్రంథంలో పురుషకారం ప్రధానమైంది. శరణాగతుని అనుష్టించు అధికారికి శేషత్వం పారతంత్ర్యం స్వరూపం. భరతుడి చర్యవలన పారతంత్ర్యం స్పష్టంగా కనిపిస్తుంది.

‘నారాయణపదం’ శత్రుఘ్నుడు. రామ పరతంత్రుడై, భాగవతుడైన భరతుడికి ప్రీతిగా ప్రవర్తించాడు. శత్రుఘ్నుడి చర్యలు భాగవత పారతంత్ర్యాన్ని తెలియచేస్తుంది. శరణాగతుడికి అర్థపంచకజ్ఞానం ఆవశ్యకం. అతడు అకించనుడు, అనన్య గతుడై వుండాలి. అతడు సదా జపం చేయాల్సింది రామాయణమే. అందుకే, ఇందుకే, శ్రీరామాయణం మహా మహా కావ్యం. ఈ విషయాలన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భాద్రాచలం శ్రీరామ పట్టాభిషేకం జరిగిన సందర్భంగా, వాల్మీకి సంస్కృత రామాయణం ఆధారంగా అద్భుతంగా వివరణ ఇచ్చినట్లు నా పరిమిత జ్ఞానానికి అవగతమైనది. అప్పుడనిపించింది, అదనంగా కొంచెం మాలాంటి వారికోసం ఆంధ్ర వాల్మీకి వాసుదాసుగారిని ప్రస్తావించి, ఆయన రాసిన పట్టాభిషేక ఘట్టం ఉదహరిస్తే బాగుండేదేమోనని.

వాసుదాసుగారి ‘శ్రీ సీతారామ పట్టాభిషేక మహోత్సవ ఘట్టము పూర్వ రంగంలో, అయోధ్య చేరిన శ్రీరాముడు ఇక్ష్వాకువంశరాజుల నివాసమైన దశరథుడి ఇంట్లోకి ప్రవేశించాడు. ముగ్గురు తల్లులకు సాష్టాంగనమస్కారం చేసి, సుగ్రీవుడికి తన ఇంట్లోనే విడిది ఏర్పాటు చేయమని  భరతుడికి చెప్పాడు. హనుమంతుడు, వేగదర్శి, జాంబవంతుడు, ఋషభుడిని పిలిచి, నాలుగు బిందెలు ఇచ్చి, నాలుగు సముద్రాల నుండి నీళ్ళు తీసుకుని ఉదయంలోపు రావాలని ఆదేశించాడు సుగ్రీవుడు. వారు తక్షణమే, దివ్య నదీ తీర్థాలతో నిండిన బిందెలు తెచ్చారు. మరికొందరు ఐదొందల నదుల తీర్థాలు తెచ్చారు. తూర్పు, దక్షిణ, పడమటి, ఉత్తర సముద్రాల నుండి సుషేణుడు, మరో ఋషభుడు, గవయుడు, నలుడు బంగారు బిందెలలో సముద్ర జలాలను తెచ్చారు.

{{ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని ‘యుద్ధకాండ మందరం లో ప్రస్తావించారు వాసుదాసుగారు. ఆ మహానుభావుడు 108 మార్లు శ్రీమద్రామాయణము పారాయణం చేసి, ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వాములవారికి సామ్రాజ్య పట్టాభిషేకం చేసినప్పుడు ఆయన మిత్రులను పోయి, పట్టాభిషేకానికి ఉత్తర సముద్ర జలం తప్ప తక్కిన 500 తీర్థాలను తెచ్చి స్వామికి సమర్పించారు. అష్టోత్తర సహస్ర కలశాలతో వేలాది మంది ప్రజల సమక్షంలో శ్రీ సీతారాముల అభిషేకం చేశారు. హిరణ్మయ పాదుకలు స్వామికి వాసుదాసుగారు సమర్పించారు. స్వామి కైంకర్య సాధనభూత నారికేళ (టెంకాయ శతకం) బిక్షాపాత్రాన్ని సమర్పించారు}}.

శ్రీ సీతారామ పట్టాభిషేక మహోత్సవ ఘట్టం వివరణ మరో అద్భుతం. శాంతచిత్తుడు, బ్రాహ్మణ శ్రేష్టులతో కూడిన వసిష్టుడు, రామచంద్రమూర్తిని, సీతాదేవిని రత్నపీఠం మీద కూర్చోబెట్టాడు. వసిష్టుడు, కాత్యాయనుడు, జాబాలి, కాశ్యపుడు, విజయుడు, గౌతముడు, వామదేవుడు, సుయజ్ఞుడు మొదలైన ఎనిమిదిమంది బ్రాహ్మణ శ్రేష్ఠులు పరిమళాలు ఘుమ్మని వీస్తున్న  జలాలతో వారిని అభిషేకించారు. ఋత్విజులు, బ్రాహ్మణులు, కన్యకలు, మంత్రులు, యోధులు, వైశ్యులు దివ్యమైన గొప్ప మూలికల రసంతో ఆకాశాన గుంపులుగా చేరి చూస్తున్న దేవతల, నలుగురు దిక్పాలకుల సమక్షంలో అభిషేక కార్యక్రమం అంతా జరిపించారు.’ వాసుదాసుగారి వ్యాఖ్యానుసారం, ఈ పట్టాభిషేకం 24వ మహాయుగంలో, త్రేతాయుగంలో జరిగిందని హరివంశంలో వున్నట్లు రాశారు.


·      ఇక్కడ వాసుదాసుగారు రాసిన సీస పద్యం:

ఆవల వశిష్ట కాత్యాయన జాబాలి, కాశ్యప విజయులు గౌతముండు

వామదేవ సుయజ్ఞ వర్యులు వసువులు, శక్రుని నభిషిక్తు జలుపుభంగి

గమ్మని వలవుల ఘమ్మను నిర్మల, జలముల నభిషిక్తు జలిపి రెలమి

నవల ఋత్విక్ క్ష్మాసురాళి కన్యామంత్రి, యోధులతో నర్య యూద యుక్తి


దివ్యమౌ మహౌష ధీరసంబుల చేత, దివిని మూగియున్న దేవతతుల

తో దిశాధిపతి చతుష్కంబుతో నభి, షేక కార్యమెల్ల జేయ బిదప

****

ఇంకా ఇలా రాశారు: ‘బ్రహ్మ నిర్మితమై, అనేక రత్నాలతో, తేజస్సుతో ప్రకాశిస్తూ, మనువు పూర్వం అభిషిక్తుడైన సమయంలో ధరించినదై, అది మొదలు వంశపారంపర్యంగా పట్టాభిషేక సమయంలో ధరించేదైన, వెలలేని మణులతో ప్రకాశిస్తున్న కిరీటాన్ని రత్న పీఠంమీద కూచున్న రామవిభుడి అంగీకారంతో వేదాధ్యయనపరులైన ఋత్విజులతో కలిసి వసిష్టుడు అలంకరించాడు. శత్రుఘ్నుడు శ్వేతఛ్చత్రం పట్టాడు. తెల్లటి చామరాన్ని సుగ్రీవుడు, మరొక చామరాన్ని విభీషణుడు వీచారు. వాయుదేవుడు బంగారు సరాన్ని, సమస్త రత్నాలతో కూడిన మంచి ముత్యాల మనోహరమైన సరాన్ని అర్పించాడు. గంధర్వులు దివిలో ఆడారు, పాడారు.’

·      ఇక్కడ వాసుదాసుగారు రాసిన రెండు సీస పద్యాలు:


బ్రహ్మ నిర్మితమయి బహురత్న శోబిత, మై దీప్త తేజుడై యలరు మనువు

మున్నభిషిక్తుడై  చెన్ను మీరిన వేళ, దాల్చినయది యయి తరతరంబు

త ద్వంశ్యులెల్లరు దప్పక యభిషేకమున దాల్చునది యయి తనరుదాని

సకలమహాజన సంశోభితంబయి, కాంచన క్లుప్తంబు కమ్రతరము


బహువిదామూల్య మణిగణ భాసమాన, మైన సభయందు దేదీప్యమాన రత్న

పీఠమున శాస్త్రచోదిత విధిని నిల్పి, యర్చితము చేసి పదపడ హర్షమార


*****

శత్రుఘ్ను డన్నకు శస్తమంగళకర, పాండురచ్చత్రంబు బట్టె భక్తి

వెల్లనిచామర విసరె సుగ్రీవుండు వేరొండు  సంపూర్ణ విధునిభంబు

బట్టెను రాక్షస  ప్రభువు విభీషణు౦, డమరేంద్ర చోదితుం డగుచు బవను

డర్పించె శతకమ లాంచితం బయి ధగ, ద్దగిత తేజం బయి, తనరు కనక


మాలికయును సకల మణి సమాయుక్తంబు, దివ్యరత్న తరల దీప్యమాన

మౌక్తిక ప్రకాండ మంజుల హారంబు, గొంచు వచ్చి యిచ్చె గొమరుమిగుల

         రామచంద్రమూర్తి విరివిగా బ్రాహ్మణులకు, తక్కిన వారికి వస్త్రాలు, ఇతర దానాలు ఇచ్చాడు. బంగారు హారాన్ని ప్రీతిగా సుగ్రీవుడికి ఇచ్చాడు. వజ్ర వైడూర్యాలతో చిత్రించబడ్డ విశేష కాంతికల భుజకీర్తులను అంగదుడికి ఇచ్చాడు. రత్న శ్రేష్టాలతో కూడినదైన, మనోహరమైన, ఉత్తమోత్తమమైన, ఆణిముత్యాలతో కూడిన శ్రేష్టమైన హారాన్ని ప్రేమతో సీతాదేవికి ఇచ్చాడు రామచంద్రమూర్తి. పరిశుభ్రమైన దువ్వలువలు, బంగారు భూషణాలు, సీతాదేవి భర్త అనుమతితో ఆంజనేయుడికి ఇచ్చింది. ఇవన్నీ ఆంజనేయుడికి ఇచ్చి కూడా సంతృప్తి చెందలేదు సీత. తన మెడలో వున్న ఒక అందమైన హారాన్ని సంతోషంగా చేతిలో తీసుకుని ఎవరికీ ఇస్తే బాగుంటుంది అన్న విధంగా భర్తవైపు చూసింది.’

‘సమాధానంగా ఆయన “ఓ అలివేణీ! ఎవరు తన గుణాలతో నిన్ను మెప్పించాడో, ఎవరిలో మంచి బుద్ధి పరాక్రమాలు కలవో అలాంటివాడికి దీన్ని ఇవ్వు” అని అన్నాడు. భర్త అలా చెప్పగానే ఆ హారాన్ని సీతాదేవి హనుమంతుడికి ఇచ్చింది. అది ధరించి హనుమంతుడు కాంతితో ప్రకాశించాడు. ఆ తరువాత మైందుడికి, ద్వివిదుడికి, నీలుడికి వారికిష్టమైన బహుమానాలు రాముడిచ్చాడు. అలా వానరనాథులందరికీ ఇచ్చాడు. ఈ ప్రకారం విభీషణ, సుగ్రీవ, జాంబవంత తదితర వానరులంతా వారివారికి తగిన బహుమానాలు, గౌరవాలు తృప్తితీరా పొంది రామచంద్రుడి ఆజ్ఞ తీసుకుని తమతమ ప్రదేశాలకు వెళ్లిపోయారు. వానరనాథులంతా కిష్కింధకు పోయారు.’

‘రామచంద్రమూర్తి నీతి విధానం తప్పకుండా రాజ్యమంతా పరిపాలించాడు. రామచంద్రమూర్తి లక్ష్మణుడితో “ధర్మజ్ఞుడా! నువ్వు ధర్మాన్ని అనుసరించి నాతో పద్నాలుగు సంవత్సరాలు దుఃఖం అనుభవించావు. ఇక సుఖాలు కూడా అనుభవించాలి. కాబట్టి ఈ రాజ్యానికి నువ్వు యువరాజై నాతో సమానంగా అనుభవించు అని ఎన్నెన్నో విధాల చెప్పాడు. కాని, లక్ష్మణుడు దానికి అంగీకరించ లేదు. పరతంత్రుడైన భరతుడికి యౌవరాజ్యాన్ని ఇచ్చి, అశ్వమేధయాగం, పౌండరీకం, వాజపేయం లాంటి యజ్ఞాలను చేశాడు. రామచంద్రమూర్తి యుద్ధం లాంటి ఘోర కార్యాలు లేకుండా మనోహరంగా పదివేల సంవత్సరాలు భూమిని పాలించి నూరు అశ్వమేధ యాగాలు చేసి, తమ్ములతో, చుట్టాలతో, ఆప్తులతో, మిత్రులతో కలిసి అనేక విధాలైన యజ్ఞాలు చేశాడు.’

శ్రీరామచంద్రమూర్తి రాజ్యం ఏలుతున్నప్పుడు ప్రజలు మనోవేదనలు లేకుండా వున్నారు. ఒకరితో ఒకరు స్నేహభావంతో వుండేవారు. కలహించుకోలేదు. దొంగతనం అంటే తెలియదు. దారిద్ర్యం అసలే లేదు. రామా! రామా! అని రామచంద్రమూర్తిని సర్వ వేళల ధ్యానిస్తూ సమస్త జీవకోటి ధర్మ బుద్ధితో సంతోషంగా, సుఖంగా వుండేది. ఆయన రాజ్యం చేస్తున్నప్పుడు ఏనోట విన్నా రామశబ్దమే! ఏకథ విన్నా రాముడి కథే! ప్రపంచం అంతా రామమయం అయింది.

రామచంద్రమూర్తి రాజ్యం ఏలుతున్నప్పుడు వృక్షాలు, ఋతువులు, నియమం లేకుండా సర్వదా పుష్పాలతో, పండ్లతో, కొమ్మలతో కూడి వుండేవి. కరువు భయం లేనేలేదు. సకాలంలో వానలు పడేవి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వారివారి వర్ణాశ్రమ ధర్మాలను నియమం ప్రకారం పాటిస్తూ శుభలక్షణాలు కలిగి వుండేవారు. ఈ విధంగా శ్రీ రామచంద్రమహారాజు పదకొండు వేల సంవత్సరాలు తమ్ములతో శ్రీమంతుడై జగత్ప్రసిద్ధిగా ప్రపంచాన్ని పాలించాడు.

చాలా గొప్పగా, అద్భుతంగా, ఆనందభరితంగా, కోలాహలంగా కాకుండా జరిగిన భద్రాచల క్షేత్ర శ్రీరామనవమి మర్నాటి రామపట్టాభిషేక మహోత్సవంలో, కొంచెమైనా ఆంధ్రవాల్మీకి రామాయణం యుద్ధ కాండ మందరంలోని శ్రీరామ పట్టాభిషేకం అంశాలను, వారి పేరు ప్రస్తావిస్తూ చెప్పినట్లైతే బాగుండేదేమో!!

No comments:

Post a Comment