Sunday, April 26, 2026

మా ఇంట్లో బంధుమిత్రుల సమక్షంలో శ్రీరామ పట్టాభిషేకం >>>>> డాక్టర్ చిలకపాటి విజయరాఘవాచార్యుల ఆధ్వర్యంలో >>>>> శనివారం (ఏప్రిల్ 25, 2026) సాయంకాలం నాలుగు గంటలపాటు : వనం జ్వాలా నరసింహారావు

 మా ఇంట్లో బంధుమిత్రుల సమక్షంలో శ్రీరామ పట్టాభిషేకం

డాక్టర్ చిలకపాటి విజయరాఘవాచార్యుల ఆధ్వర్యంలో  

శనివారం (ఏప్రిల్ 25, 2026) సాయంకాలం నాలుగు గంటలపాటు

వనం జ్వాలా నరసింహారావు

వాల్మీకి మహర్షి సంస్కృత శ్రీరామాయణంలో, ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు) యథావాల్మీకంలో, అత్యద్భుతమైన ఘట్టం శ్రీరామ పట్టాభిషేకం. రావణుడి వధ, విభీషణుడి పట్టాభిషేకం, సీతాదేవి అగ్నిప్రవేశం, సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరాముడు అయోధ్య సమీపానికి రావడం, తదనంతర అంశాలు ఆసక్తికరమైనవే కాకుండా, అవశ్య పఠనీయం. శ్రీరామ పట్టాభిషేకం ఎప్పుడు, ఎక్కడ జరిగినా, ఆనాడు మరీముఖ్యంగా చదవాల్సిన సన్నివేశాల సమాహారం. అందుకే మనతరం ‘వావిలికొలను వాల్మీకి చిలకపాటి విజయరాఘవాచార్యులు’ మార్గదర్శకత్త్వంలో, ఆద్వర్యంలో, మా 57వ వివాహరోజు (ఏప్రిల్ 30, 2026) పూర్వరంగంలో, శనివారం ఏప్రిల్ 25, 2026నాడు మా ఇంట్లో శ్రీరామ పట్టాభిషేకం బంధుమిత్రుల సమక్షంలో, వారి ఆత్మీయ ఆదరాభిమానాల మధ్య జరుపుకోవడం పూర్వజన్మ సుకృతం.

ముముక్షుజన మహాపీఠాదిపతులు, శ్రీశ్రీశ్రీ లక్ష్మణ యతీంద్ర గురుదేవుల వద్ద సమాశ్రయణ భాగ్యం పొందగలిగిన, తెలుగునాట జీయర్ స్వాముల అనుగ్రహ పాత్రుడైన, నా పూర్వ సహాద్యోగి, ప్రజా పరిపాలన, విద్య, ధార్మిక సేవా రంగాలలో విశేషానుభవం కలిగిన ప్రతిభాశాలి, అనుపమాన విద్యార్హతలు కలిగి, పబ్లిక్ పాలసీలో పీహెచ్‌డీతో పాటు రాజకీయ శాస్త్రం, ప్రజా పరిపాలనలో మాస్టర్స్ డిగ్రీలను, అదనంగా బిఎడ్, సంస్కృతంలో పీజీ డిప్లొమా సాధించిన విజ్ఞానఖని, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డులు పొందిన విశిష్ట వశిష్టుడు ‘శ్రీమాన్ వావిలికొలను వాల్మీకి చిలకపాటి విజయరాఘవాచార్యులు.’

మూడువారాల క్రితం, మా భాగ్యవశాన విజయరాఘవాచార్యులు, మా ఆహ్వానం మేరకు, రామభక్త విజయ రాఘవ దాసు జోగేష్ తో కలిసి మా ఇంటికి విచ్చేసిన సందర్భంలో, మూడుగంటల ‘విజ్ఞాన సర్వస్వ సమాన విషయ పరిజ్ఞానం’ లో భాగంగా, మా శ్రీమతి అభ్యర్ధన మేరకు, సమీప భవిష్యత్తులో మా ఇంట్లో శ్రీరామ పట్టాభిషేకాన్ని విజయరాఘవాచార్యులు స్వయంగా నిర్వహించడానికి అంగీకరించారు. పట్టాభిషేక పూర్వరంగంలో చేపట్టాల్సిన కొన్ని కార్యక్రమాలను కుదించి, సరళీకరించారు. ఒక వారం రోజుల అనంతరం నిన్నటి (శనివారం, ఏప్రిల్ 25న) నిర్వహించాలని ఆత్మీయంగా ఆదేశించారు చిలకపాటి మహాశయులు.   

విజయరాఘవాచార్యులు తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మప్రచార పరిషత్ కార్యదర్శిగా, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ కార్యదర్శిగా చిరపరితులు. వాల్మీకి రామాయణంలోని 24 వేల సంస్కృత శ్లోకాలు ఆయనకు కంఠస్థం. ఆ శ్లోకాలకు తెలుగు, ఆంగ్లం, సంస్కృత భాషల్లో సులభంగా, ప్రతిపదార్థ తాత్పర్య భాష్యం చెప్పగల అపూర్వ, అసమానమైన ప్రావీణ్యం, సమర్థత ఆయన స్వంతం. ఈ విశిష్ట ప్రతిభ ఆయన ఆధ్యాత్మిక పాండిత్యాన్ని, అపారమైన, అనంతమైన, భారతీయ సాంస్కృతిక వారసత్వంపై ఆయనకున్న లోతైన అవగాహనను ప్రతిబింబిస్తుంది. భారత, భాగవత, కావ్యాలకు తోడూ, ఆధునిక రాజనీతి శాస్త్రాల నుండి కూడా అనర్గళంగా, అలవోకగా ఎలాంటి సందర్భాన్నైనా అప్పటికప్పుడు చెప్పగల ధారణా మహనీయుడు. ప్రస్తుతం  ‘పుణ్యం, పురుషార్థం అన్న చందాన కొండాపూర్ (హైదరాబాద్) శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ట్రస్టీ, కార్యదర్శిగా సేవలందిస్తూ సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇంతటి, అంతటి మహానుభావుడు మా ఇంట్లో శ్రీరామ పట్టాభిషేకం జరిపిస్తానంటే అంతకంటే మహద్భాగ్యం ఏముంటుంది? యుద్ధ ప్రాతిపదికన నిర్వహణ ప్రయత్నాలు ప్రారంభించాం. ఎవరెవరిని తప్పక పిలవాల్నో నిర్ణయం చేసుకున్నాం. పట్టాభిషేకం అనంతరం ఆహుతులకు భోజనంలో ‘ప్రసాదంగా పెట్టాల్సిన పదార్థాలను చిలకపాటివారు సూచించారు. ఇంటి భోజనం తరహాలో ఎప్పుడూ అడిగిందే తడవుగా పంపించే కిషోర్ అద్భుతంగా, ఆ విధంగానే సరైన సమయానికి అందించారు. ఈ నేపధ్యంలో, నిన్న (శనివారం) సాయంకాలం 5-6 గంటల సమయంలో ఆరంభించి, 8-9 గంటల మధ్య కార్యక్రమం పూర్తి చేయాలనీ, తద్వారా వచ్చినవారంతా ప్రసాదం తీసుకుని వెళ్లే వీలుకలగాలనీ నిర్ణయించుకున్నాం. అలాగే జరిగిపోయాయి.

పట్టాభిషేక మహోత్సవంలో, భండారు రామచంద్రరావు, విమల, సుభాష్, హేమ, శ్రీనివాసరావు, నిషా, జీవిక, రావులపాటి సీతారాంరావు, శారద, దీప, రవి, విజయ, దేవులపల్లి ప్రభాకర్ రావు దంపతులు, ఒద్దిరాజు రాధ, ఆమెగారి చెల్లెలు, వనం రంగారావు, గీత, కొనికి శ్రీహరి రావు, లక్ష్మీ సుందరి. అయితరాజు వేణు మనోహర్ రావు, భరత్, కరుణ, మిహిర అత్తగారు సుధ, మిహిర అమ్మమ్మగారు, బుంటి (ప్రేమ) స్నేహితులు గీతు, రతన్, అర్చన, గోపాల్, తుర్లపాటి సత్యనారాయణ రుక్మిణి, జ్యోతి, చిలకపాటివారి స్నేహితులు లక్ష్మీనారాయణ, రత్నమాల, జోగేష్, మా ఇరుగు పొరుగువారు, మా కుటుంబ సభ్యులు (మా దంపతులం, కూతురు ప్రేమ (బుంటి), అల్లుడు మండపాక విజయ్ గోపాల్, మాకెప్పుడూ చేదోడువాదోడుగాగా వుండే అనిత, కీర్తి, తదితరులు పాల్గొన్నారు. నెదర్లాండ్, అమెరికాలో వుంటున్న మా ఆదిత్య, పారుల్, కనక్, ఇరా, మిహిర, యాగ్నిక్, కిన్నెర, కిషన్, యశ్విన్, మేధా, అన్ష్ వీడియో ద్వారా వీక్షించారు.

కొండాపూర్ (హైదరాబాద్) శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు వోలేటి శేషాచార్యులు (శేషు స్వామి), పట్టాభిషేక నిర్వహణకు తప్పనిసరైన శ్రీసీతారామ లక్ష్మణ విగ్రహాలను, ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తూ, రామసేవకు అంకితమైన తులసి అనే యువకుడి తోడ్పాటుతో, సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో, మా ఇంటికి చేరుకున్నారు. విగ్రాహాల అలంకరణ, తదితర ఏర్పాట్లన్నీ చకచకా అయిపోయినాయి. వాటికి అవసరమైన మౌలిక సామాగ్రి తయారుగా వుంచం. ఆరు గంటల శుభ సాయంత్రం వేళ, శేషు స్వామి లాంఛనంగా దీపారాధన, సంకల్పం చెప్పడం లాంటివాటికి శ్రీకారం చుట్టారు.

‘ఆపదామపహర్తారం, దాతారం సర్వసంపదామ్; లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్’ అని చదువుతూ, ఆహుతులతో చదివిస్తూ, పట్టాభిషేక పూర్వరంగ కథనం మొదలు పెట్టారు ‘శ్రీమాన్ వావిలికొలను వాల్మీకి చిలకపాటి విజయరాఘవాచార్యులు.’ వాల్మీకి, తమసాతీరంలో తిరుగుతూ, క్రౌంచమిధునాన్ని చూడడం, బోయవాడి బాణానికి మగపక్షి చనిపోవడం, ఆడ పక్షి ఏడుపు విని బోయవాడిని శపిస్తూ సమాక్షరాలైన నాలుగు పాదాల శ్లోకం చెప్పడం, ఆశ్రమానికి రాగానే అక్కడికి వచ్చిన బ్రహ్మదేవుడు రామాయణం రాయమని ఉపదేశించి సర్వం ఆయనకు తెలిసేట్లు వరమిచ్చి పోవడం, సంక్షిప్తంగా నారదుడు చెప్పిన రామ చరిత్రను వాల్మీకి వివరంగా చెప్పాలనుకోవడం, అంశాలతో అనర్గళంగా ప్రారంభించి, కాండకు, కాండకు మధ్య దొరికే (హారతి ఇవ్వడానికి) కొన్ని క్షణాల సమయం మినహాయించి, ఆసాంతం అదే రీతిలో సుమారు మూడు గంటలపాటు అనర్గళంగా సాగింది చిలకపాటివారి ఆధ్యాత్మిక వాగ్ధాటి.

ముందుగా వాల్మీకి నారదుడిని అడిగిన ప్రశ్నకు జవాబుగా రాముడి గుణగణాల వర్ణన వివరించారు. రామాయణ రచనకు పూనుకున్న వాల్మీకి మహర్షి, భగవద్విషయాన్ని బోధించే యోగ్యతలున్న గురువు దొరకలేదనే నిర్వేదంతో వున్నా సమయంలో వచ్చిన నారదుడికి సాష్టాంగ నమస్కారం చేసి: గుణవంతుడు, అతివీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యశీలుడు, సమర్థుడు, నిశ్చలసంకల్పుడు, సదాచారం మీరనివాడు, సమస్త ప్రాణులకు మేలు చేయాలన్న కోరికున్నవాడు, విద్వాంసుడు, ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, కోపాన్ని స్వాధీనంలో వుంచుకున్నవాడు, ఆశ్చర్యకరమైన కాంతిగల వాడు, అసూయ లేనివాడు, రణరంగంలో దేవదానవులను గడ-గడలాడించ గలవాడు ఎవరైనా వున్నారా ఈ భూలోకంలో? అని పదహారు ప్రశ్నలు వేసిన విషయాన్ని, అవన్నీ వున్నవాడు  శ్రీరామచంద్రుడే! అన్న ఆయన సమాధానాన్ని వివరించారు.

రామాయణం ఆదికావ్యమని, ఇది ధ్వని-అర్ధ ప్రతిపాదిత మహామంత్రపూతమని, గాయత్రీ బీజ సంయుతమని, ఔపనిషతత్వసారమని, స్మరణ-పారాయణ మాత్రంగా అంతఃకరణం శుధ్ధి అవుతుందని ఉదాహరణలతో విశదీకరించారు. రామాయణార్థాన్ని ప్రస్ఫుటం చేసే శ్లోకం ఎలా ఆదికవి నోటి వెంట వచ్చిందో అలాగే అపర వాల్మీకిలా వినిపించారు విజయరాఘవాచార్యులు. ఆ శ్లోకం ఇలా సాగింది: ‘మానిషాద ప్రతిష్ఠాం త్వ! మగ మ శ్శాశ్వతీ స్సమాః యత్క్రౌంచ మిథునాదేక! మవధీః కామమోహితం.’ బ్రహ్మ వరం మేరకు ‘రామ చరిత్రనంతా యోగ దృష్టితో చూసిన వాల్మీకి’ లాగానే, అపర బ్రహ్మ చిలకపాటివారు మా అందరికీ యోగదృష్టి కలిగించి సంక్షిప్తంగా, క్లుప్త సుందరంగా వాల్మీకి రామాయణ గాథ కళ్లకు కట్టినట్లు చెప్పారు. ఆ వివరాలు:

శ్రీరాముడి జననం, బాల్యంలోనే రాముడి పరాక్రమం, సుబాహుడు, తాటకల వధ,  ప్రజలపై రాముడికున్న ప్రేమ, రాముడి సత్యవాదిత్వం, విశ్వామిత్రుడు చెప్పిన కథలు, శివదనుర్భంగం, సీతా కల్యాణం, పరశురాముడితో వివాదం, శ్రీరాముడి యౌవరాజ్య పట్టాభిషేకానికి ప్రయత్నం, కైక వ్యవహారం, పట్టాభిషేకం విఘ్నం, రామచంద్రమూర్తి అడవులకు ప్రయాణం, దశరథుడి మరణం, గుహుడిని కలవడం, భరద్వాజ దర్శనం, చిత్రకూటాన్ని చేరడం, పర్ణశాలను నిర్మించుకుని అక్కడ నివసించడం చెప్పారు చిలకపాటి.

అడవికి భరతుడి రాక, జాబాలి వ్యవహారం, పాదుకా పట్టాభిషేకం, రామచంద్రమూర్తి చిత్రకూటం విడిచి దండకారణ్యం చేరడం, అనసూయ సీతాదేవికి గంధ లేపనం ఇవ్వడం, అగస్త్య దర్శనం, జటాయువుతో సంభాషణ, పంచవటి నిర్మాణ నివాసం, లక్ష్మణుడిని శ్రీరాముడు పొగిడిన విధానం, శూర్పణఖ ముక్కు చెవులు లక్ష్మణుడు కోయడం, మాయ లేడి రూపంలోని మారీచుడి హతం, సీతాపహరణం, రాముడి విలాపం, సీతకు సహాయపడుతూ రావణుడి చేతిలో జటాయువు ప్రాణాలను కోల్పోవడం, శబరి ఆతిధ్యం, రామ హనుమల సంభాషణలకు చెందిన సంఘటనలను వివరించారు విజయరాఘవాచార్యులు.

రాముడు ఋష్యమూకం చేరడం, సుగ్రీవుడితో స్నేహం, వాలి వధ, సుగ్రీవుడి పట్టాభిషేకం, నలుదిక్కులకు వానర సేన వెళ్లడం, హనుమంతుడికి రామ ముద్రికను రాముడివ్వడం, సీతాదేవి లంకలో వున్నా సమాచారం సంపాతి చెప్పడం, వానరులు మహేంద్రగిరెక్కడం, హనుమంతుడు సముద్రాన్ని దాటడం, మైనాకుడు, సురస, సింహిక వ్యవహారం, సముద్రాన్ని దాటి హనుమంతుడు లంకలో ప్రవేశించడం, సీతను వెతకడం, నిద్రిస్తున్న రావణుడిని, పుష్పక విమానాన్ని హనుమంతుడు చూడడం, అశోక వనంలో సీతను చూడడం, హనుమంతుడు సీతకు రామ ముద్రికనివ్వడం, త్రిజట స్వప్న వృత్తాంతం, సీతా దేవి హనుమంతుడికి చూడామణినివ్వడం, అశోక వనాన్ని హనుమంతుడు నాశనం చేయడం గురించి చెప్పారు.

ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి హనుమంతుడు వశ పడడం, రావణుడితో హనుమంతుడి సంభాషణ, లంకా దహనం, తిరుగు ప్రయాణంలో హనుమంతుడు లంకను దాటడం, వానర మిత్రులకు జరిగినది వివరించడం, మధు వనంలో కోతులు తేనె తాగడం, హనుమంతుడు శ్రీరాముడిని ఓదార్చి చూడామణిని ఇవ్వడం, సేతువు కట్టడం, రాముడు సేనలతో సముద్రాన్ని దాటి లంక చేరడం, విభీషణుడు శరణు కోరడం, యుద్ధంలో లక్ష్మణుడు ఇంద్రజిత్తును చంపడం, రాముడు కుంభకర్ణుడిని, రావణుడిని వధించడం, సీత అగ్నిప్రవేశం, బ్రహ్మాది దేవతలు రాముడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువే అని చెప్పడం, విభీషణుడి పట్టాభిషేకం, సీతారామ లక్ష్మణులు పుష్పక విమానాన్ని ఎక్కి అయోధ్యకు ప్రయాణం కావడం చెప్పారు విజయరాఘవాచార్యులు.

ఇక ఆ తరువాత పట్టాభిషేక పూర్వరంగ ఘట్టాన్ని, పట్టాభిషేక వివరాలను, ఫలశ్రుతిని వివరించడం జరిగింది.

ఆ వివరాలు:

అయోధ్య సమీపానికి చేరుకున్న తనకు నమస్కారం చేసిన భరతుడిని ప్రేమగా, ఆనంద భాష్పాలు రాలుతుంటే కౌగలించుకుని, ఆయన క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నాడు శ్రీరామచంద్రుడు.  భరతుడు సీతాదేవికి నమస్కారం చేసి, లక్ష్మణుడిని, సుగ్రీవుడిని, జాంబవంతుడిని, అంగదుడిని, మైంద, ద్వివిదులను, గంధమాదనుడిని, ఇతర వానర వీరులను ప్రేమగా కౌగలించుకున్నాడు. ఆపత్కాలంలో సహాయం చేసిన సుగ్రీవుడిని ప్రత్యేకంగా ప్రశంసించాడు. తమ నలుగురు సోదరులలో సుగ్రీవుడిని కూడా కలుపుకుని మొత్తం ఐదుగురమని అన్నాడు. విభీషణుడు సహాయం వల్లే అసాధ్యకార్యం సాధించగలిగామని గౌరవంగా చెప్పాడు. శత్రుఘ్నుడు కూడా సీతారామలక్ష్మణులకు అభివాదం చేశాడు.

         శ్రీరామచంద్రుడు తల్లి కౌసల్యకు సాష్టాంగ నమస్కారం చేశాడు. సుమిత్రకు, కైకకు, వశిష్టుడికి మొక్కాడు. పురజనులు రాముడికి స్వాగతం పల్కారు. భరతుడు తన దగ్గరున్న ‘బంగారు పాదుకలను’ రాముడి పాదాలకు తొడిగి, చేతులు జోడించి, రాజ్యమంతా ఆయనదేనని, ఆయన లేని కారణాన రక్షణగా వుండి, అప్పగిస్తున్నానని, ధనాగారం, ధాన్యాగారం పరీక్షించమని, తన సామర్థ్యం వల్ల కాకుండా, రాముడి తేజస్సు వల్ల అవన్నీ పదింతలై పెరిగాయని, సర్వం గ్రహించమని, అన్నాడు. భరతుడితో కలిసి శ్రీరాముడు నందిగ్రామంలోని అతడి ఆశ్రమానికి పోయాడు. వశిష్టుడి పాదాలను తాకి, వేర్వేరు పీటలమీద కూర్చున్నారు.

         రాముడికి ఆయన రాజ్యమంతా అప్పచెప్తున్నానని, రాజ్యభారం మోయలేనని, రాజ్యాన్ని రాముడే పాలించ సమర్ధుడని, రాముడినిలోని సౌశీల్య, సౌలభ్య, వాత్సల్య, కారుణ్య, పరమోదారత్వ, మధురభావ గుణాలను చూసి ప్రజలు సంతోషిస్తారని భరతుడు అంటాడు. భూమ్యాకాశాలు, నక్షత్ర మండలం వున్నంతదాకా రాముడి ప్రభుత్వం వర్ధిల్లుతుందని అన్న భరతుడి మాటలకు సరే అన్నాడు రామభద్రుడు.

         స్నానానంతరం, శ్రీరాముడు వెలగల వస్త్రాలను ధరించి, అలంకరించుకుని, త్రిలోకాభిరాముడై వుండగా, రామలక్ష్మణులకు శత్రుఘ్నుడు ఆభరణాలు తొడిగాడు. సీతాదేవిని స్వయంగా, అత్తగార్లే మనోహరంగా అలంకరించారు. సుమంత్రుడు దివ్యరథాన్ని సిద్ధం చేసి తీసుకురాగానే, రామచంద్రమూర్తి దాన్ని ఎక్కి అయోధ్యకు పయనించాడు. వెంట సుగ్రీవుడు, హనుమంతుడు, సుగ్రీవుడి భార్యలు, పరిచారికలు బయల్దేరారు. శ్రీరామాదులు ప్రయాణ సన్నాహంలో వుండగానే మంత్రులు అశోకుడు, సుమంత్రుడు, విజయుడు అయోధ్యకు పోయి వసిష్టుడితో, పట్టాభిషేకానికి అన్నీ సిద్ధం చేసుకొమ్మని చెప్పారు.

  రామచంద్రమూర్తి  ఆకుపచ్చ గుర్రాలు కట్టిన రథం మీద ఎక్కి అయోధ్యా పురంలో రాచబాటల వెంట పయనించసాగాడు. భరతుడు రథానికి సారథ్యం చేశాడు. ఉత్తమ శ్వేతఛ్చత్రం శత్రుఘ్నుడు పట్టుకున్నాడు. లక్ష్మణుడు రామచంద్రమూర్తి శిరస్సుమీద విసనకర్రతో కుడి చేత్తో విసురుకుంటూ నిలబడ్డాడు. ఎడమ చేత్తో లక్ష్మణుడు వింజామర పట్టుకున్నాడు. సుగ్రీవుడు శత్రుంజయమనే ఏనుగునెక్కి బయల్దేరి వచ్చాడు. వానర శ్రేష్ఠులు మనుష్యుల ఆకారంలో ఏనుగులమీద బయల్దేరారు. నగారా ధ్వనులు, శంఖాల మోతలు, వీణెల ధ్వనులు మోగుతుంటే రామచంద్రమూర్తి మేడలు, మిద్దెలు చూసుకుంటూ పోయాడు. రామచంద్రమూర్తిని అమాత్యులు, పురజనులు, బ్రాహ్మణులు సేవిస్తూ వుంటే, విశేషంగా ప్రకాశించాడు. మంగళవాద్యాలు మోగసాగాయి. పచ్చటి అక్షింతలు తీసుకుని బ్రాహ్మణులు, కన్యకలు, ఆవులు ముందు పోయారు.

         అయోధ్య చేరిన శ్రీరాముడు ఇక్ష్వాకువంశరాజుల నివాసమైన దశరథుడి ఇంట్లోకి ప్రవేశించాడు. ముగ్గురు తల్లులకు సాష్టాంగనమస్కారం చేసి, సుగ్రీవుడికి తన ఇంట్లోనే విడిది ఏర్పాటు చేయమని  భరతుడికి చెప్పాడు. హనుమంతుడు, వేగదర్శి, జాంబవంతుడు, ఋషభుడిని పిలిచి, నాలుగు బిందెలు ఇచ్చి, నాలుగు సముద్రాల నుండి నీళ్ళు తీసుకుని ఉదయంలోపు రావాలని ఆదేశించాడు సుగ్రీవుడు. వారు తక్షణమే, దివ్య నదీ తీర్థాలతో నిండిన బిందెలు తెచ్చారు. మరికొందరు ఐదొందల నదుల తీర్థాలు తెచ్చారు. తూర్పు, దక్షిణ, పడమటి, ఉత్తర సముద్రాల నుండి సుషేణుడు, మరో ఋషభుడు, గవయుడు, నలుడు బంగారు బిందెలలో సముద్ర జలాలను తెచ్చారు.

శ్రీ సీతారామ పట్టాభిషేక మహోత్సవ ఘట్టం

         శాంతచిత్తుడు, బ్రాహ్మణ శ్రేష్టులతో కూడిన వసిష్టుడు, రామచంద్రమూర్తిని, సీతాదేవిని రత్నపీఠం మీద కూర్చోబెట్టాడు. వసిష్టుడు, కాత్యాయనుడు, జాబాలి, కాశ్యపుడు, విజయుడు, గౌతముడు, వామదేవుడు, సుయజ్ఞుడు మొదలైన ఎనిమిదిమంది బ్రాహ్మణ శ్రేష్ఠులు పరిమళాలు ఘుమ్మని వీస్తున్న  జలాలతో వారిని అభిషేకించారు. ఋత్విజులు, బ్రాహ్మణులు, కన్యకలు, మంత్రులు, యోధులు, వైశ్యులు దివ్యమైన గొప్ప మూలికల రసంతో ఆకాశాన గుంపులుగా చేరి చూస్తున్న దేవతల, నలుగురు దిక్పాలకుల సమక్షంలో అభిషేక కార్యక్రమం అంతా జరిపించారు.

బ్రహ్మ నిర్మితమై, అనేక రత్నాలతో, తేజస్సుతో ప్రకాశిస్తూ, మనువు పూర్వం అభిషిక్తుడైన సమయంలో ధరించినదై, అది మొదలు వంశపారంపర్యంగా పట్టాభిషేక సమయంలో ధరించేదైన, వెలలేని మణులతో ప్రకాశిస్తున్న కిరీటాన్ని రత్న పీఠంమీద కూచున్న రామవిభుడి అంగీకారంతో వేదాధ్యయనపరులైన ఋత్విజులతో కలిసి వసిష్టుడు అలంకరించాడు. శత్రుఘ్నుడు శ్వేతఛ్చత్రం పట్టాడు. తెల్లటి చామరాన్ని సుగ్రీవుడు, మరొక చామరాన్ని విభీషణుడు వీచారు. వాయుదేవుడు బంగారు సరాన్ని, సమస్త రత్నాలతో కూడిన మంచి ముత్యాల మనోహరమైన సరాన్ని అర్పించాడు. గంధర్వులు దివిలో ఆడారు, పాడారు.

శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేక ఉత్సవం జరగగా పచ్చిటి పైరులు భూమంతా నిండాయి. చెట్లన్నీ పరిమళాలతో పూచాయి, కాచాయి. రామచంద్రమూర్తి విరివిగా బ్రాహ్మణులకు, తక్కిన వారికి వస్త్రాలు, ఇతర దానాలు ఇచ్చాడు. బంగారు హారాన్ని ప్రీతిగా సుగ్రీవుడికి ఇచ్చాడు. వజ్ర వైడూర్యాలతో చిత్రించబడ్డ విశేష కాంతికల భుజకీర్తులను అంగదుడికి ఇచ్చాడు. రత్న శ్రేష్టాలతో కూడినదైన, మనోహరమైన, ఉత్తమోత్తమమైన, ఆణిముత్యాలతో కూడిన శ్రేష్టమైన హారాన్ని ప్రేమతో సీతాదేవికి ఇచ్చాడు రామచంద్రమూర్తి.

         పరిశుభ్రమైన దువ్వలువలు, బంగారు భూషణాలు, తన మెడలో వున్న ఒక అందమైన హారాన్ని, సీతాదేవి భర్త అనుమతితో ఆంజనేయుడికి ఇచ్చింది. వాస్తవానికి హారాన్ని ఎవరికీ ఇస్తే బాగుంటుందని భర్తను అడిగినప్పుడు, ఎవరు తన గుణాలతో ఆమెను మెప్పించాడో, ఎవరిలో మంచి బుద్ధి పరాక్రమాలు కలవో అలాంటివాడికి ఇవ్వమని అన్నాడు. అది ధరించి హనుమంతుడు కాంతితో ప్రకాశించాడు. ఆ తరువాత మైందుడికి, ద్వివిదుడికి, నీలుడికి వారికిష్టమైన బహుమానాలు రాముడిచ్చాడు. అలా వానరనాథులందరికీ ఇచ్చాడు. విభీషణ, సుగ్రీవ, జాంబవంత తదితర వానరులంతా వారివారికి తగిన బహుమానాలు, గౌరవాలు తృప్తితీరా పొంది రామచంద్రుడి ఆజ్ఞ తీసుకుని తమతమ ప్రదేశాలకు వెళ్లిపోయారు.

ఫల శ్రుతి

         నారద మహర్షి వాల్మీకికి రామాయణాన్ని ఉపదేశించినప్పుడు ముందు భూతకాలం చెప్పి, తరువాత భవిష్యత్కాలం చెప్పాడు, వాల్మీకి ప్రశ్న వేయడానికి ముందే ‘ఎవ్వడీ ధారుణిని యీకాలంలో’ అనే ప్రశ్నించాడు కాని, గడిచినవారి గురించి కాని, రాబోయేవారిని గురించి కానీ ప్రశ్నించలేదు. అవతారానికి ముందే రామాయణం రచించినట్లయితే కొంత భూతార్థకంలో, కొంత వర్తమానార్థకంలో, కొంత భవిష్యత్ అర్థకంలో చెప్పాల్సిన పనిలేదు. అవతారానికి ముందే రామాయణం రచించడం జరిగిందని అంటే చాలా విరోధాలు వస్తాయి. అలా చెప్పడానికి ఒక్క ఆధారమైన రామాయణంలో లేదు. రామాయణం వేదంలాగా స్వతఃప్రమాణం. దానిలోని విషయాలను ఋజువు చేయడానికి ఇతర ప్రమాణాలు లేవు.

         రామాయణమే ఆదికావ్యం. వేదార్థం ఇందులో విస్తరించి చెప్పడం జరిగింది. వాల్మీకి మహర్షి దీన్ని అశ్వమేధయాగం చేయడానికి పూర్వం రచించి బహిర్గతం చేశాడు. ఇది పుణ్యం కలిగించి ఆయువును వృద్ధి చేస్తుంది. ఇది మిక్కిలి కీర్తికరం. రాజులకు గెలుపు కలిగిస్తుంది. దీన్ని చదువుతే సకల పాపాలు తొలగిపోతాయి. కొడుకులు కావాలనుకున్నవారికి కొడుకులు, ధనం కోరినవారికి ధనం లభిస్తుంది. రామాభిషేక విధానం విన్న రాజు శత్రువులను గెలిచి రాజ్యం పాలిస్తాడు. ప్రజలు వింటే, ఆయువు వృద్ధి అవుతుంది. వేదార్థం విస్తరించిన, వాల్మీకి మహర్షి చెప్పిన రామాయణాన్ని చదివేవాడు సమస్త దుఃఖాలను దాటుతాడు. మరణించిన తరువాత మోక్ష సుఖం కలుగుతుంది. జీవించిన కాలంలో శ్రీరామ కటాక్షం వల్ల వాడి కోరికలన్నీ నెరవేరుతాయి. ఇది సత్యం సత్యం అని స్వానుభవం వల్ల వాసుదాసు గారు పేర్కొన్నారు.

         రామాయణ కావ్యం వినేవారి ఇండ్లలో దుష్టగ్రహాలు నిలవలేక పారిపోతాయి. రాజు వింటే భూమిని జయిస్తాడు. పరదేశంలో వున్నవాడు ఆపదలేక ప్రయాణం చేస్తాడు. స్త్రీ వింటే ఆమెకు ఉత్తమ గుణాలుకల కొడుకులు పుట్తారు. ఎవరైతే ఈ రామాయణాన్ని ఇష్టంగా పఠిస్తాడో వాడి పాపాలన్నీ హరిస్తాయి. శ్రీరాముడు ఏనాడో మరణించాడు కదా! అలాంటివాడు తనను సేవించినవారికి ఎలా సహాయం చేస్తాడు? అని ప్రశ్నించేవారికి సమాధానం రామాయణంలోనే వుంది.

రామచంద్రమూర్తి నారాయణుడు. సమస్త భూతాలకు స్థానమై సర్వం తానై వుండేవాడు. కాబట్టి ఆనాడున్నాడు, నేడు లేడని అనకూడదు. సమస్త ప్రపంచానికి ప్రభువైన రాముడు లేకపోతే లోకం అనాయకమౌతుంది. అవతారానికి ముందు కాని, తరువాత కాని రామచంద్రమూర్తి లేకపోలేదు. రామచంద్రమూర్తి లేడంటే భగవంతుడు లేడని అర్థం. ఎందుకంటే ఆయనే ఆదిమదేవుడైన హరి. బ్రహ్మరుద్రాదులు లేనికాలంలో ఆయన వుండి వీరందరి జన్మకారకుడైనాడు. ఆయనే ఒక కాలంలో లేడంటే ఇక వుండేది ఏమిటి? దీర్ఘబాహుడైన యితడు సాకారుడు కాని నిరాకారుడు కాదు. ఈయన లక్ష్మీపతి. ఒంటరివాడుకాదు. లక్ష్మీ విశిష్టుడు. నరసింహాతారంలో లాగా సర్వాంతర్యామి అయివుంటాడు. ఒక కాలంలో వుండి వేరే కాలంలో లేకుండా వుండడు. ఇలాంటివాడు శ్రీరామచంద్రమూర్తి.

శుభకరమైన ఈ కావ్యాన్ని వింటే ధనధాన్య వృద్ధి, సంతాన వృద్ధి కలుగుతుంది. సద్గుణాల స్త్రీ సాంగత్యం, ఉత్తమ సౌఖ్యం లభిస్తుంది. పరమార్థమైన మోక్షం ప్రాప్తిస్తుంది. క్షేమ పద్ధతిన ఆయువు, కీర్తి, ఆరోగ్యం లభిస్తాయి. ఇది సోదర స్నేహం, సౌఖ్యం, సాదుబుద్ధి, తేజస్సు కలిగిస్తుంది. పుణ్యలాభం కోరి దీన్ని వినే సత్పురుషులు నియమంగా చపలత లేని మనస్సుతో గ్రంథమంతా వినాలి. రామాయణ శ్రవణ పఠనం వల్ల దుష్ట రోగాలు మానుతాయి. ఇది ప్రమాణానుభవ సిద్ధం.

రామాయణం పురావృత్తమని చెప్పడం జరిగింది. పురావృత్తాలెన్నో వున్నాయి. అవి రామాయణానికి సరికావు. ఎందుకంటే, శ్రీమద్రామాయణం బ్రహ్మ అనుమతితో వాల్మీకి మహర్షి రచించాడు. ఈ కావ్యంలో అనృతం కొంచెమైనా వుండదని బ్రహ్మ వరం. ఇది వేద స్వరూపం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి యోగ్యత, మహాత్మ్యం, గాయత్రీ ప్రణవ మంత్రాది సంపుటీకరణ ఇతర గ్రంథాలలో లేవు. సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో వున్నప్పుడు రాసింది కాబట్టి ఇది పురాతన చరిత్ర అన్నారు. రామాయణ పఠనం వల్ల, రామ కథా శ్రవణం వల్ల సర్వ సుఖాలు కలుగుతాయి. ఈ విధంగా వేదార్థం తెలిపే ఈ రామాయణ కావ్యం పూర్వం వాల్మీకి మహర్షి లోకులకు ఉపకారం చేయడానికి దాన్ని సంహితగా రచించాడు.

ఆ తరువాత, భద్రాచలం నుండి ప్రత్యేకంగా డాక్టర్ ఎస్సెల్ కాంతారావు సహాయంతో తెప్పించిన శ్రీరామ మాడ నాణేలను ఆహుతులందరికీ ప్రేమపూర్వకంగా ఇవ్వడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. కృతజ్ఞతలు. విజయరాఘవాచార్యులు, శేషు స్వామి, తులసి, జోగేష్ లకు ప్రత్యేక ధన్యవాదాలు.

1 comment: