శూర్ఫణఖ ఆగ్రహం వెనుక రాజధర్మ బోధ!
వనం జ్వాలా నరసింహారావు
ప్రజాతంత్ర దినపత్రిక (జూన్ నెల 21, 2026)
{{‘నాయకత్వం, పరిపాలన, వ్యక్తిత్వ వికాసంపై
వాల్మీకి నిర్దేశంగా పేర్కొనదగిన రామాయణ ఆదికావ్య బృహత్తర గ్రంథం, ఒక విజయవంతమైన నాయకుడిని 'దూరదృష్టి గలవాడు'గా, 'మిత్రుడిని, శత్రువును వేరు చేయగల' మేధో స్పష్టతను, రాజనీతి వ్యవహారాలను స్వయంగా
పర్యవేక్షించగల పరిపాలనా పటిమను కలిగినవాడిగా వర్ణిస్తుంది. తన సొంత కోరికలను, అహంకారాన్ని జయించడంలో
విఫలమైన నాయకుడు, పరిపాలించే
నైతిక హక్కును అప్పటికే వదులుకున్నట్లేనని,
ఇది అనివార్యమైన పతనానికి పునాది వేస్తుందని వాల్మీకి
సూచిస్తారు..’
‘ప్రజాస్వామ్యంలో, నాయకులు ప్రజా
విశ్వాసాన్ని వ్యక్తిగత ఆస్తిగా భావించినప్పుడు, వారు నైతిక పతనాన్ని
ఎదుర్కొంటారు. దీని సందేశం: సంయమనం లేని బలం వేగంగా నిరుపయోగమవుతుంది. శూర్ఫణఖ మాటలు, గాయపడిన
భావోద్వేగం నుండి పుట్టినప్పటికీ, ఒక శాశ్వతమైన రాజకీయ సత్యాన్ని స్పృజిస్తాయి. నాయకుడు
తాత్కాలిక అధికారాన్ని శాశ్వత రక్షణగా పొరబడిన క్షణం నుండే పరిపాలన క్షీణించడం
మొదలవుతుంది. వాల్మీకి ఆదికావ్యం ఒక శాశ్వతమైన నాయకత్త్వ పటిమకు, సుపరిపాలనకు, వ్యక్తిత్త్వ
వికాసానికి అద్దంలా పనిచేస్తుంది..’}} – సంపాదకుడి క్లుప్త వ్యాఖ్య
వాల్మీకి
సంస్కృత రామాయణంలో కనిపించేంతటి లోతైన మనోవిశ్లేషణ పరిపాలనాపర మైన దూరదృష్టి
కలిగిన రచనలు ప్రపంచ విస్తృత సాహిత్యంలో చాలా తక్కువ. 'ఆదికావ్యం'గా గౌరవించబడే
ఈ గ్రంథం గొప్పతనం కేవలం దైవత్వాన్ని కవితాత్మకంగా వర్ణించడంలోనే లేదు.
దైవత్వం, మానవ స్వభావం
అధికార సంబంధాల గురించి ఇది ధైర్యంగా అందించిన విశ్లేషణలో, సాటిలేని మేధో
సంపద దాగి ఉంది. ఈ ఆదికావ్యంలో వాల్మీకి ఆవిష్కరించిన నాయకత్వం, పరిపాలన, వ్యక్తిత్వ
వికాసాలకు సంబంధించిన అంశాలు నిజంగా అద్భుతమైనవి.
ఈ కావ్యంలోని అత్యంత ఆసక్తికరమైన, కానీ తరచుగా
విస్మరించే మేధో సంపదలలో ఒకటి: లక్ష్మణుడి ద్వారా అవమానానికి గురైన శూర్పణఖ తన
సోదరుడైన రావణుడితో మాట్లాడిన మాటలు! లక్ష్మణుడి చేతిలో విరూపితమైన తర్వాత కలిగిన
ఆక్రోశంతో శూర్పణఖ లంకా నగరంలోని రాజ ఆస్థానానికి చేరుకుంటుంది. అక్కడ రావణుడు, తెల్లని
చామరాలు, రాజసం ఉట్టిపడే
తెల్లని ఛత్రం, కాంతివంతమైన
రత్నాలు పొదిగిన మెరిసే బంగారు కుండలాలు, విశాలమైన ముఖం, ధవళ వర్ణపు
దంతాలతో, దోషరహితమైన రత్నంలా ప్రకాశిస్తూ, మంత్రుల మధ్య బంగారు
సింహాసనంపై ఆసీనుడై ఉంటాడు.
శూర్పణఖకు అది కేవలం తన ప్రతీకార విన్నపం
మాత్రమే కాదు. అది రావణుడి క్షీణిస్తున్న పాలనపై ఒక తీవ్రమైన విమర్శ. ఆమె ధర్మాగ్రహం
ద్వారా, వాల్మీకి
రాజధర్మం అనే ఒక శాశ్వత తత్వాన్ని, అంటే 'పాలకుని
ధర్మయుద్ధాన్ని' సుపరిపాలనకు
పునాదిగా నిలిచే భారతీయ నమూనాగా వివరిస్తారు. ఇది వ్యక్తిగత అధికారం కంటే నైతిక
ప్రవర్తన, చట్టబద్ధమైన
పాలన, ప్రజా
సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తుంది. నాయకుడి వ్యక్తిగత స్వభావమే రాజ్య
స్థిరత్వానికి ప్రధాన నిర్ణాయకమని ఈ గ్రంథం స్పష్టం చేస్తుంది.
'నాయకత్వం, పరిపాలన, వ్యక్తిత్వ వికాసంపై వాల్మీకి నిర్దేశంగా పేర్కొనదగిన ఈ
గ్రంథం, ఒక విజయవంతమైన
నాయకుడిని 'దూరదృష్టి
గలవాడు'గా, 'మిత్రుడిని, శత్రువును వేరు
చేయగల' మేధో స్పష్టతను, రాజనీతి
వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షించగల పరిపాలనా పటిమను కలిగినవాడిగా వర్ణిస్తుంది.
తన సొంత కోరికలను, అహంకారాన్ని
జయించడంలో విఫలమైన నాయకుడు, పరిపాలించే నైతిక హక్కును అప్పటికే వదులుకున్నట్లేనని, ఇది
అనివార్యమైన పతనానికి పునాది వేస్తుందని వాల్మీకి సూచిస్తారు.
ఒక నిర్దేశిత ఆదేశం ప్రకారం, నాయకుడు రాజభవన
(పాలనాధికార భవన౦ గోడలకు ఆవల చూడటానికి విస్తృతమైన రాయబారుల నెట్‌వర్క్‌ను సమర్థవంతంగా
ఉపయోగించగలగాలి. తద్వారా, 'పాలనకు సంబంధం లేని, స్వార్థపరులైన వ్యక్తుల' వడపోసిన
పొగడ్తలపై కాకుండా, క్షేత్రస్థాయి
వాస్తవికత ఆధారంగా నిర్ణయాలు తీసుకునేలా నిర్ధారించుకోవాలి. 'అంతరంగ గదులలో' దాగి ఉండి, ఎంపికచేసిన
కొందరిని మాత్రమే కలుస్తూ, అమాత్యులకు గుడ్డిగా అధికారాన్ని అప్పగించే పాలకుడు, తప్పనిసరిగా తన
రాజ్యం భవిష్యత్తును ఇతరులకు అప్పగించినట్లే.
పరిపాలన సార్థకంగా ఉండాలంటే, నాయకుడు ప్రజాపాలనకు, ప్రజల
సంక్షేమానికి, అభివృద్ధికి, ఖజానాకు, ప్రాథమిక
సంరక్షకుడిగా, విధానాలకు
అంతిమ నిర్ణేతగా ఉండాలి. ప్రతిఫలాలు, శిక్షలు నిష్పాక్షికమైన
న్యాయంతో పంపిణీ అయ్యేలా చూడాలి. వాల్మీకి దృష్టిలో, వ్యక్తిత్వ వికాసమే ఈ
పరిపాలనా యంత్రాంగాన్ని నడిపించే అంతర్గత చోదక శక్తి. ఈ గ్రంథం, 'అదుపులేని అహం' మేధస్సుపై చూపే
వినాశకరమైన ప్రభావాన్ని వివరిస్తూ, ఇంద్రియ సుఖాలలో మునిగిన
నాయకుడు సమీపిస్తున్న ప్రమాదాన్ని గ్రహించలేని అంధుడవుతాడని హెచ్చరిస్తుంది.
నాయకుడు దుష్టులను శిక్షించే, అదే సమయంలో
సజ్జనుల పట్ల కరుణ చూపే స్వభావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు వాల్మీకి
శూర్ఫణక మాటల్లో. ఈ మానసిక సమతుల్యత, అధికారం కేవలం భయం ద్వారా
కాకుండా గౌరవం ద్వారా నిలబడేలా చేస్తుంది. తమ తప్పులను గుర్తించి, సరిదిద్దుకునే
ధర్మబద్ధమైన నాయకుడు సంపద, సుఖాలలో వర్ధిల్లుతాడు. అలా కాకపొతే, ఒకప్పుడు తన
సింహాసనాన్ని నిలబెట్టిన బంధువులు, సేవకులే అహంకారపూరిత
నాయకుడిని విడిచిపెడతారు.
అంతిమంగా, అధికారం పతనం అంతర్గతంగానే
మొదలవుతుందనే సమగ్ర హెచ్చరికగా ఇది పనిచేస్తుంది. ఇది అపారమైన సామర్థ్యాన్ని
సూచించే భౌతిక వైభవానికి, అటువంటి బలాన్ని నిష్ప్రయోజనం చేసే నైతిక పతనానికి మధ్య
ఉన్న అంతరాన్ని పూరిస్తుంది. 'వినయం లేని అధికారం అంధత్వాన్ని కలిగిస్తుంది' అని నొక్కి
చెప్పడం ద్వారా, సమకాలీన
నాయకులు ఒదిగి ఉండటానికి వాల్మీకి ఒక శాశ్వతమైన మార్గదర్శకాన్ని అందిస్తారు. ఈ
పత్రం, రాజధర్మం ప్రాచీన నైతిక
ప్రమాణాలను, పారదర్శకత, దూరదృష్టి, నైతిక సంయమనం
వంటి ఆధునిక అవసరాలతో అనుసంధానించే వారధిగా పనిచేస్తూ, నాయకుడు ప్రజల
సేవకుడిగా ఉండేలా నిర్ధారిస్తుంది.
వాల్మీకి మహర్షి రావణుడి గురించి చేసిన వర్ణన
వైరుధ్యాల సమాహారం. అతను పది తలలు, ఇరవై చేతులు, దేవతలకు కూడా
అసూయ కలిగించే దేహదారుఢ్యం కలిగిన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. అయినప్పటికీ, శూర్పణక
అతనిలో ఒక లోతైన లోపాన్ని గుర్తించింది: ‘రావణుడు 'శారీరక శక్తి వల్ల కలిగే
అహంకారంతో మదించాడు,’ అని వ్యాఖ్యానిస్తుంది. ఆధునిక సందర్భంలో, దీనినే 'నాయకుడి ఉచ్చు' అని
చెప్పవచ్చు. ఒక నాయకుడు తాత్కాలిక ఆధిపత్యాన్ని శాశ్వత భద్రతగా
పొరబడినప్పుడు, వారు ఇతరుల మాట
వినడం మానేస్తారు.
'హద్దులు లేని క్రమశిక్షణా రాహిత్యంతో నిరంతరం కామ సుఖాలలో
మునిగిపోయిన' నాయకుడు 'నాశనాన్ని కూడా
గ్రహించలేని మూర్ఖుడు' అవుతాడని శూర్పణక చేసిన హెచ్చరిక, సంస్థాగత
సమగ్రత కంటే వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చే ఏ ఆధునిక అధికారికి అయినా
కడుపులో గుద్దినట్లు ఉంటుంది. సకల సౌకర్యాలను అనుభవిస్తూ, ముఖస్తుతి
చేసేవారిని తన చుట్టూ ఉంచుకున్న నాయకుడు ఒక ప్రతిధ్వని గదిని తనంతట తానే సృష్టిస్తాడు.
ఆ విధంగా వాస్తవికతకు
దూరమైన క్షణంలో, వారు ఎన్నికలలో
లేదా మార్కెట్ వాటాలో ఓడిపోక ముందే తమ పదవిని కోల్పోతారని వాల్మీకి మనకు
బోధిస్తారు.
వాల్మీకి రామాయణంలోనే ‘ఆధునిక పరిపాలన స్తంభాలు:
మేధస్సు- విచక్షణ’ అనేది మరో ముఖ్యమైన విషయం. శూర్పణఖ ఉపదేశం రాజనీతి మౌలిక
యంత్రాంగాలను స్పృశిస్తుంది. ఆమె 'దూరదృష్టి' గల నాయకుడిని, తన దూతల కళ్ళతో
చూసేవాడిగా నిర్వచించారు. 21వ శతాబ్దంలో, సమాచారం క్షేత్రస్థాయి
నిఘాకు ఇదే అత్యవసరం. కొందరు ఇష్టమైన సలహాదారుల శుద్ధి (Filtered) చేసిన
నివేదికల ఆధారంగా నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం వైఫల్యానికి గురికావడం ఖాయం.
శూర్పణక ద్వారా వాల్మీకి ఈ విషయాలను నొక్కి
చెబుతారు: ఒక నాయకుడు అధికారాన్ని గుడ్డిగా ఇతరులకు అప్పగించకూడదు. 'సునిశితమైన
ఆలోచన' లేకుండా
వ్యవహరించడం విఫలమవుతున్న రాజ్యానికి చిహ్నం. అంతఃపురానికే పరిమితమై
అవసరమైనప్పుడు ప్రజల ముందుకు రాని నాయకుడు పాలించే నైతిక హక్కును కోల్పోతాడు.
పరిపాలనను నాయకుడు వాస్తవికతను ప్రాథమికంగా విశ్లేషించేవాడుగా ఉండాలి.
బాహ్య ప్రపంచం ఒకరి అంతర్గత స్థితికి ప్రతిబింబం
అని రామాయణం చెబుతుంది. వాల్మీకి సంభాషణ, సంయమనం, స్వీయ-దిద్దుబాటు ఆవశ్యకతను
నొక్కి చెప్పడం ద్వారా వ్యక్తిత్వ వికాసాన్ని సున్నితంగా స్పృశిస్తుంది. 'సుఖాలలో
మితిమీరిన లీనత నాయకుడి మేధస్సు శక్తిని నాశనం చేస్తుంది' అని శూర్పణఖ
గమనిస్తుంది. ఇది ఒక శాశ్వతమైన మానసిక సత్యం. వ్యక్తిగత కోరికల కారణంగా నాయకుడు
మంచి చెడులను వివేచించే సామర్థ్యాన్ని కోల్పోయినప్పుడు, 'రాజరిక
బాధ్యతలు' అనివార్యంగా
క్షీణిస్తాయి.
వాల్మీకి రచనాచాతుర్యం ప్రకారం, తమ తప్పులను
గ్రహించి, 'వివేకవంతమైన
ఆలోచన'తో వాటిని
సరిదిద్దుకోలేని నాయకుడు సకల విధాల శ్రేయస్సును కోల్పోతాడు. దుర్మార్గుల
పట్ల కోపాన్ని ప్రదర్శిస్తూ, సజ్జనుల పట్ల కరుణ చూపేవాడు మాత్రమే న్యాయ సంస్కృతిని
సృష్టిస్తాడు. కారణం లేకుండా
కోపించి, ఇతరులను
భయపెట్టేవాడు తన సొంత బంధువుల చేతిలోనే నాశనమవుతాడు. ఒక ధర్మబద్ధమైన నాయకుడు తనకు
చేసిన మేలును, అలా చేసిన వ్యక్తులను ఎన్నడూ మరచిపోడు. విధేయతను బెదిరింపులతో
కొనలేరు, అది శీలంతో
సంపాదించుకోవాలి.
సాంకేతిక నైపుణ్యం, ‘హడావిడి (త్వరితగతి)
సంస్కృతి’ పట్ల వ్యామోహం ఉన్న ఈ యుగంలో, ‘నాయకత్వానికి శీలమే పునాది’
అని వాల్మీకి అంతర్దృష్టులు గుర్తుచేస్తాయి. ఒక నాయకుడికి అపారమైన బలం, విస్తారమైన
సంపద ఉండవచ్చు, కానీ వినయం, నైతిక సంయమనం
లేకపోతే, ఈ ఆస్తులే
ఆత్మవినాశానికి బీజాలుగా మారతాయి. ప్రతి నీతిబాహ్యమైన చర్య చివరికి హద్దులు, నైతిక నియమాల
ఉల్లంఘనకు ఒక రూపకంగా మారుతుంది.
ప్రజాస్వామ్యంలో, నాయకులు ప్రజా విశ్వాసాన్ని
వ్యక్తిగత ఆస్తిగా భావించినప్పుడు, వారు నైతిక పతనాన్ని
ఎదుర్కొంటారు. దీని సందేశం: సంయమనం లేని బలం వేగంగా నిరుపయోగమవుతుంది. శూర్ఫణఖ మాటలు, గాయపడిన
భావోద్వేగం నుండి పుట్టినప్పటికీ, ఒక శాశ్వతమైన రాజకీయ సత్యాన్ని స్పృజిస్తాయి. నాయకుడు
తాత్కాలిక అధికారాన్ని శాశ్వత రక్షణగా పొరబడిన క్షణం నుండే పరిపాలన క్షీణించడం
మొదలవుతుంది. నాయకత్త్వం కోల్పోయే లక్షణాలు ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. ఇలాంటి
విషయాలలో వాల్మీకి ఆదికావ్యం ఒక శాశ్వతమైన అద్దంలా పనిచేస్తుంది.
రామాయణం ప్రతి నాయకుడిని ఇలా ప్రశ్నించుకోమని
కోరుతుంది: ‘నేను అందరి మాటలు వింటున్నానా? కొందరివి మాత్రమే వింటున్నానా? ఏది సరైనదో, ఏది తప్పో వివేచనా
చేసేటంత పదును నా బుద్ధికి ఇంకా మిగిలి ఉందా?’ అలాగే, నాయకులు
‘సుపరిపాలన, నాయకత్వ’
పాఠాలను నేర్చుకోవడంలో విఫలమైతే, అది ఒక విషాదకరమైన పతనానికి
దారితీస్తుంది. ఎవరైతే న్యాయం, వినయం, దూరదృష్టితో సమదృష్టితో
ఆలోచన చేస్తారో, వారే నిజమైన
నాయకులు.
(నా ఆంగ్ల వ్యాసం Leadership and Governance: Valmiki’s Masterclass Manifesto ..... Valmiki provides a timeless blueprint For contemporary leaders to remain grounded కు ప్రజాతంత్ర పత్రిక స్వేచ్చానువాదం. సంపాదకులకు ధన్యవాదాలు)


No comments:
Post a Comment