క్షయమాసం: ఖగోళ గణితం,
వైదిక పునాది, ధార్మిక ఆచరణలు
వనం జ్వాలా నరసింహారావు
(దర్శనమ్ శర్మ సౌజన్యంతో: దర్శనమ్ అక్టోబర్, 2026)
దశాబ్దాల అనంతరం రాబోయే కీలక నామ (2028-29)
సంవత్సరంలో అరుదుగా సంభవించనున్న క్షయమాసంపై ఉభయ తెలుగు రాష్ట్రాల ఆత్మీయుడు, ప్రముఖ ఆధ్యాత్మిక తత్త్వవేత్త, దర్శనమ్ మరుమాముల వెంకటరమణ
శర్మ అద్ద్వర్యంలో ఆదివారం, ఆగస్ట్ 30, 2026 వ తేదీన
హైదరాబాద్ నగరంలో, తెలంగాణ విద్వత్సభ అపురూపమైన ప్రత్యేక విద్వద్గోష్ఠిని
నిర్వహించింది. స్థానిక గాంధీనగర్‌లో, సీమాక్ సంస్థ కార్యాలయంలో సంస్థ యజమాని
చెరువు రాంబాబు కార్యాలయంలో సుమారు నాలుగు గంటలపాటు జరిగిన ఈ గోష్ఠిలో ప్రముఖ
పంచాంగకర్తలు,
సిద్ధాంతులు, ధర్మశాస్త్ర పండితులు
పాల్గొన్నారు. వారు చర్చలో సమర్పించిన ప్రసంగ వ్యాసాలు, ఈ అంశానికి సంబంధించి
పరిశోధనకు అందనంత లోతైన విషయ పరిజ్ఞానమంటే అతిశయోక్తి కాదు.
క్షయమాసం ఏ విధంగా సంభవిస్తుంది, పంచాంగ గణితంలో దానిని ఎలా నిర్ధారించాలి, క్షయమాసంతో సంబంధం ఉన్న
అధికమాసాలను ఎలా గణించాలి,
ధర్మశాస్త్రపరంగా అనుసరించాల్సిన విధానాలు ఏమిటి అనే
అంశాలపై వివిధ శాస్త్రగ్రంథాల ప్రమాణాలతో సుదీర్ఘంగా సిద్ధాంతులు చర్చించారు.
గణితపరమైన పరిశీలనలు, సంక్రాంతుల స్థితి, చాంద్ర–సౌర మాస సమన్వయం
తదితర అంశాలను విశ్లేషించిన అనంతరం రాబోయే కీలక నామ సంవత్సరంలో సంసర్ప కార్తిక
మాసం అధికమాసంగా,
మార్గశిర-పుష్య యుగళీభూత అంహస్పతి మాసం క్షయమాసంగా
సంభవిస్తుందని సిద్ధాంతులందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఈ విద్వద్గోష్ఠి విశ్లేషించి చూస్తే, యువ
సిద్ధాంతులకు పంచాంగ గణితం,
ధర్మశాస్త్ర ప్రమాణాలు, క్షయమాస నిర్ధారణపై లోతైన
అవగాహన కలిగించిందని భావించాలి. అరుదైన క్షయమాస అంశంపై ప్రత్యేకంగా విద్వద్గోష్ఠి
నిర్వహించి ఏకగ్రీవ నిర్ణయానికి రావడం విశేషమని అనాలి. భారతీయ కాలగణన కేవలం ఒక
లౌకిక కాలనిర్ణయ పట్టిక కాదు. అది సూర్యచంద్రుల గమన చక్రాన్ని, ప్రకృతి ఋతువులను, మానవ ధర్మ జీవనాన్ని పరస్పరం అనుసంధానించే అత్యంత
సూక్ష్మమైన శాస్త్రీయ వ్యవస్థ. విశ్వంలో నిరంతరం సంభవించే ఖగోళ మార్పులను
క్రమబద్ధీకరించి,
నిత్య నైమిత్తిక కర్మలకు అనుగుణంగా మార్చడంలో భారతీయ పంచాంగ
గణితం అద్వితీయమైన పాత్రను పోషిస్తోంది.
సాధారణంగా చాంద్ర సౌర మానాల మధ్య
ఏర్పడే వ్యత్యాసాన్ని సవరించడానికి 'అధికమాసం' పరిచయమైనప్పటికీ,
అంతకంటే అత్యంత అరుదుగా, సూక్ష్మంగా సంభవించే
కాలగణన ప్రక్రియే
'క్షయమాసం'.
ఇటీవల లభించిన పరిశోధనా పత్రాలు, శాస్త్ర గ్రంథాల ఆధారంగా రానున్న 2028-2029 కీలక నామ సంవత్సరంలో అత్యంత అరుదైన పుష్య క్షయమాస పరిస్థితి ఏర్పడుతోందని సిద్ధాంతకర్తలు స్పష్టం చేస్తున్నారు. భారతీయ కాలగణన చంద్రసౌర (Luni-Solar) పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. సూర్యసిద్ధాంత యుగప్రమాణాల ప్రకారం ఒక సగటు సౌర
సంవత్సరం
365.258756 రోజులు కాగా, పన్నెండు చాంద్రమాసాల మొత్తం 354.367055 రోజులు మాత్రమే ఉంటుంది. దీనివల్ల ప్రతి సంవత్సరం సౌర, చాంద్ర మానాల మధ్య సుమారు 10.891701 రోజుల వ్యత్యాసం పేరుకుపోతుంది. ఈ తేడా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకమారు సుమారు ఒక నెల కాలానికి
చేరుకున్నప్పుడు,
దానిని సవరించడానికి సంక్రాంతి లేని 'అధికమాసం'
ఏర్పడుతుంది.
మరోవైపు, ఒకే చాంద్రమాసంలో (అనగా ఒక అమావాస్య నుండి తదుపరి అమావాస్య లోపల) సూర్యుడు
రెండు రాశి సరిహద్దులను దాటితే, అంటే రెండు సంక్రాంతులు
సంభవిస్తే దానిని
'క్షయమాసం' లేదా 'ద్వి సంక్రాంతిమాసం'
అని పిలుస్తారు. సిద్ధాంత శిరోమణిలో భాస్కరాచార్యులు దీనిని
స్పష్టంగా నిర్వచించారు. ఇక్కడ క్షయమంటే ముప్పై రోజులు కాలం నశించిపోవడం కాదు. ఒక
చాంద్రమాస సంజ్ఞకు స్వతంత్ర అమావాస్య-అమావాస్య విభాగం లభించకపోవడమే మాసక్షయం. క్షయమాస
భావన కేవలం తరువాతి కాలపు జ్యోతిష్య కల్పన కాదు, దీనికి బలమైన వైదిక పునాది ఉంది. తైత్తిరీయ సంహితలోని మంత్రం పదమూడవ మాస వ్యవస్థను, యజ్ఞవేదికపై దాని
ప్రాధాన్యతను ప్రతిష్ఠించింది.
శాస్త్రవ్యాఖ్యాన సంప్రదాయం ప్రకారం, ఒకే సంవత్సరంలో రెండు అసంక్రాంత మాసాలు (సంక్రాంతి లేని నెలలు), మధ్యలో ఒక ద్విసంక్రాంత మాసం (రెండు సంక్రాంతులు ఉన్న నెల) వచ్చినప్పుడు
వాటిని శాస్త్రీయంగా విభజిస్తారు. క్షయమాసానికి ముందు వచ్చే సంక్రాంతిరహిత మాసం కాలక్రమంలో
సక్రమంగా ముందుకు సాగుతుంది కనుక దీనిని ‘సంసర్పమని’ అంటారు. ఒకే చాంద్రమాసంలో
రెండు సూర్య సంక్రమణలు జరిగిన ద్విసంక్రాంత క్షయమాసానికి ‘అంహస్పతి’ అని వేదసంజ్ఞ. క్షయమాసానికి తరువాత వచ్చే సంక్రాంతిరహిత మాసాన్ని ‘అధికమాసం’ అంటారు. మహాభారత విరాటపర్వంలో భీష్ముడు పాండవుల అజ్ఞాతవాస
కాలనిర్ణయాన్ని లెక్కించే సందర్భంలో దీని ప్రస్తావన వున్నది. శ్రీమద్భాగవతం కూడా
సూర్యుని మంద,
శీఘ్ర, సమ గతుల గురించి
వివరిస్తూ ఈ ఖగోళ యాంత్రికతకు పునాది వేసింది
ఆధునిక ఖగోళశాస్త్రం, అలాగే, కెప్లర్ కక్ష్యాగతి నియమాల ప్రకారం భూమి సూర్యుని చుట్టూ
దీర్ఘవృత్త (Elliptical)
కక్ష్యలో పరిభ్రమిస్తుంది. భూమి సూర్యుడికి అత్యంత సమీపంగా
వచ్చే
పెరిహీలియన్ (Perihelion) స్థితిలో (సాధారణంగా జనవరి ప్రారంభంలో) కక్ష్యా వేగం పెరుగుతుంది. దీనివల్ల
భూకేంద్ర దృష్టిలో సూర్యుడి దృశ్యగతి వేగవంతమై, శీతాకాలంలో (ధనుస్సు, మకర రాశులలో) సౌరమాసాల కాలవ్యవధి తగ్గుతుంది. క్షయమాసం సంభవించడానికి
ప్రధానంగా మూడు భౌతిక పరిస్థితులు కలవాలని సిద్ధాంతులు చెప్తారు.
పెరిహీలియన్ వద్ద సూర్యుని గతి వేగంగా
ఉండటం (చిన్న సౌరమాస కాలం). చంద్రుడు అపోజీ (Apogee) వద్ద ఉన్నప్పుడు గతి వేగం తగ్గి, అమావాస్యల మధ్య కాలం
పెరగడం (పొడవైన చాంద్ర సంయోగమాసం). మొదటి అమావాస్య మొదటి సంక్రాంతికి కొద్దిగా
ముందే, రెండవ అమావాస్య తదుపరి సంక్రాంతికి కొద్దిగా తర్వాతే సంభవించడం (సరిహద్దు
సామీప్యం). ఈ మూడు పరిస్థితులు కలిసినప్పుడు, సూర్యుడు 60 డిగ్రీలు ప్రయాణించకపోయినా, కేవలం 30 డిగ్రీల కంటే కొద్దిగా ఎక్కువ ప్రయాణంలోనే రెండు రాశి
సరిహద్దులను దాటడం వల్ల ఒకే చాంద్రమాసంలో రెండు సంక్రాంతులు నమోదవుతాయి.
ప్రముఖ సిద్ధాంతుల పరిశోధనల ప్రకారం, వివరణల ప్రకారం, రానున్న కీలక నామ
సంవత్సరంలో సూర్యసిద్ధాంత గణిత
రీత్యా అరుదైన క్షయమాసం ఏర్పడుతోంది. ఈ గణితాన్ని స్పష్టమైన విలువల ద్వారా
నిరూపించడం కూడా జరిగింది. డిసెంబర్ 16, 2028 తేదీన ప్రథమ అమావాస్య సంయోగం జరిగినప్పుడు సూర్యుని స్ఫుట దీర్ఘాంశంగా వుంటుంది.
అమావాస్య ముగిసిన వెంటనే సూర్యుడు దానిని దాటి
ధనుస్సంక్రాంతి లోకి ప్రవేశిస్తాడు. తదుపరి
అమావాస్య పూర్తికావడానికి ముందే సూర్యుడు మరింత అధిగమించి మకరసంక్రాంతి పూర్తి చేస్తాడు. మరుసటి అమావాస్య సంయోగం జనవరి 14, 2029 తేదీన జరుగనున్నది.
ఈ విధంగా రెండు అమావాస్యల మధ్య సూర్యుడి
మొత్తం ప్రయాణం కేవలం
30°17′42.01″ అయినప్పటికీ,
ఆయన 240°, 270° అనే రెండు రాశి సరిహద్దులను విజయవంతంగా దాటుతారు. ఒకే చాంద్రమాసంలో ధనుస్సు, మకర అనే రెండు సంక్రాంతులు సంభవించడం వల్ల మార్గశిర-పుష్య యుగళీభూత క్షయమాస పరిస్థితి ఏర్పడి, పుష్యమాసం క్షయమవుతోంది. ఆ వెంటనే సూర్యసిద్ధాంత
నియమం ప్రకారం
మార్చ్ 15, 2029 నుండి ఏప్రిల్ 14, 2029
మధ్య 'అధిక చైత్రమాసం' కూడా ఏర్పడుతోంది. సిద్ధాంత శిరోమణిలో క్షయమాసాల పునరావృత్తిని తెలపడానికి
ప్రాచీన భూతసంఖ్యా పద్ధతిని ఉపయోగించారని సిదాంతులు తెలియచేస్తున్నారు.
శాస్త్రం ఆధారంగా, సిద్ధాంతుల వివరణల ప్రకారం, 'కువేదేందు'
అనగా 141 సంవత్సరాలు, 'గోకు'
అనగా 19 సంవత్సరాల అంతరాలలో
క్షయమాసాలు సంభవిస్తాయని తెలుస్తున్నది. గతంలో 1963 (శోభకృత్), 1983
(దుందుభి) సంవత్సరాలలో 19 ఏళ్ల అంతరంలో
పుష్య క్షయమాసం వచ్చిన విషయాన్ని వీరు విద్వత్సభలో గుర్తుచేశారు. సూర్యసిద్ధాంత
దీర్ఘకాలిక పట్టికల ప్రకారం శక సంవత్సరాలు 1963, 1982, 2028, 2047 క్షయమాసాలుగా నమోదయ్యాయి. గ్రహగతుల అస్థిరత వల్ల దీనికి నిర్దిష్టమైన చక్రం
లేదు, ప్రతిసారీ స్పష్టమైన పంచాంగ గణన ద్వారానే దీనిని నిర్ధారించాలి.
క్షయమాసం సంభవించినప్పుడు సమాజంలో
కొన్ని తప్పుడు అపోహలు,
భయాలు వ్యక్తమవడం సహజం. అయితే శాస్త్ర దృష్టిలో ఇది దోష సూచకం కానేకాదు అనేది సిద్ధాంతుల అభిప్రాయంగా భావించవచ్చు. కాలగణనను సవరించే ఒక శాస్త్రీయ యంత్రాంగం మాత్రమే. ధర్మశాస్త్ర నిబంధనల ప్రకారం కొన్ని నియమాలను పాటించడం బహుశా మంచిదని
మాత్రమే శాస్త్రం చెప్తున్నది. ఈ విషయంలో ఎవరి ఇష్టాఇష్టాలు వారివే. జాతక బలం
వుంటే అన్నీ సక్రమమే. వివాహాలు, ఉపనయనాలు, నూతన గృహప్రవేశాలు,
యజ్ఞాలు, కొత్త వ్రతాల ప్రారంభం వంటి శుభకార్యాలను ఈ కాలంలో
వర్జించడం, వీలైనంత మేరకు మంచిది. నిత్య సంధ్యావందనం, దేవతా పూజలు,
జపాలు, పురాణ పారాయణాలు, దానాలు, నిత్య శ్రాద్ధ కర్మలు యథావిధిగా చేయడం ధర్మం.
క్షయమాసంలో జన్మించిన లేదా మరణించిన
వారి జాతక, వర్ధంతి, ప్రత్యాబ్దిక శ్రాద్ధ కర్మల విషయంలో తిథిని రెండు భాగాలుగా విభజించి
(పూర్వార్థం ఒక మాసం,
ఉత్తరార్థం మరో మాసం) నిర్ణయించాలని శాస్త్ర ప్రమాణాలను
ఉటంకిస్తూ సిద్ధాంతులు పేర్కొన్నారు. క్షయమాస ప్రక్రియ భారతీయ ఋషుల, ఖగోళ
శాస్త్రవేత్తల మేధోసంపత్తికి నిలువెత్తు నిదర్శనం. వేల సంవత్సరాల క్రితమే
సూర్యచంద్రుల సూక్ష్మ గతులను లెక్కగట్టి, కాలాన్ని ధర్మంతో
ముడిపెట్టిన మహోన్నత భారతీయ గణిత విధానం అత్యద్భుతమైనది. భారతీయల అపారమైన మేధో
సంపత్తికి ఇది నిలువెత్తు నిదర్శనం. క్షయమాసం కాలక్షయం కాదు. అది భారతీయ చంద్రసౌర కాలమాన ఖచ్చితత్వానికి ఒక మహత్తర చిహ్నం.
పంచాంగాలను లెక్కించడానికి వేర్వేరు
ప్రాచీన పద్ధతులు ఉన్నాయి. వాటిలో సూర్యసిద్ధాంతం, భాస్కరాచార్యుల సిద్ధాంత
శిరోమణి అత్యంత ముఖ్యమైనవి. ఈ రెండు గ్రంథాలు ఒకే నెలలో రెండు సంక్రాంతులు వస్తే 'క్షయమాసం' అనాలని ఒప్పుకున్నప్పటికీ,
వాటిని లెక్కించే సూక్ష్మ పద్ధతుల్లో (గణితంలో) సూక్ష్మమైన తేడాలు చూపుతున్నాయి.
సూర్యసిద్ధాంత నమూనా ప్రకారం గ్రహాల గమనాన్ని చాలా దీర్ఘకాలిక యుగ ప్రమాణాల
ఆధారంగా లెక్కిస్తారు. సూర్యుడు, చంద్రుడు తమ కక్ష్యలలో
తిరిగేటప్పుడు వాటి వేగంలో వచ్చే మార్పులను ఈ పద్ధతి చాలా స్థిరంగా లెక్కిస్తుంది.
దీని ప్రకారం, వచ్చే క్షయమాసం పూర్తిగా సూర్యసిద్ధాంత గణితం ప్రకారం
లెక్కించబడింది.
ఇక్కడ ఒకే నెలలో ధనుస్సు, మకర సంక్రాంతులు రావడం వల్ల పుష్యమాసం లెక్కలో లేకుండా పోయి,
అది క్షయమాసంగా మారింది. ఇకపోతే, సిద్ధాంత
శిరోమణి నమూనా ప్రకారం, భాస్కరాచార్యుల వారు కాలక్రమేణా
ఆకాశంలో గ్రహాల స్థితిలో వచ్చే మార్పులను మరింత సూక్ష్మంగా గమనించి కొన్ని సవరణలు
చేశారు. దీని ప్రకారం క్షయమాసాలు సాధారణంగా 141 సంవత్సరాలకు
ఒకసారి లేదా కొన్నిసార్లు 19 సంవత్సరాల అంతరంలో వస్తాయని
చెప్పారు. 1963, 1983 లలో వచ్చిన
క్షయమాసాలు దీనికి ఉదాహరణలు. సులభంగా చెప్పాలంటే, సంక్రాంతి లేదా అమావాస్య ఘడియలు
ముగిసే సమయాల్లో కొన్ని నిమిషాలు లేదా సెకన్ల తేడా వస్తుంది. ఈ తేడా వల్ల ఒక
పద్ధతిలో క్షయమాసంగా మారిన నెల, మరొక పద్ధతిలో సాధారణ నెలగా
కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే, ఆయా ప్రాంతాల సిద్ధాంతులు
నిర్ణయించిన పంచాంగాన్నే ప్రజలు ప్రామాణికంగా తీసుకోవాలి.
డిసెంబర్ 16, 2028 నుండి జనవరి 14, 2029 మధ్య కాలం క్షయమాసం (పుష్య క్షయమై
మార్గశిరంతో కలిసిపోయింది). దీనివల్ల ఈ రెండు నెలల్లో (మార్గశిర, పుష్య మాసాలు) పండుగలను
ఎలా చేయాలో పంచాంగకర్తలు స్పష్టంగా నిర్ణయిస్తారు. సాధారణంగా మార్గశిర లేదా పుష్య
మాసాల్లో వచ్చే ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) అద్భుతమైన పర్వదినాన్ని
క్షయమాసంలో వచ్చే తిథి వ్యాప్తిని బట్టి జరుపుకోవాలి. రెండు మాసాలు కలిసిపోయినందున,
వైకుంఠ ద్వార దర్శనం ఏ రోజున చేయాలో సిద్ధాంతులు నిర్ణయించిన తేదీనే
భక్తులు అనుసరించాలి. డిసెంబర్ 16, 2028న ధనుస్సంక్రాంతి, జనవరి 14, 2029న మకరసంక్రాంతి ఒకే చాంద్రమాసంలో వచ్చేస్తాయి. కాబట్టి భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు యథావిధిగా జనవరి 14 పరిసరాల్లోనే వస్తాయి, కానీ ఆ నెలలో పుష్యమాసానికి
విడిగా ప్రాధాన్యత ఉండదనేది సిద్ధాంతుల నిర్ణయం.
క్షయమాసం ముగిసిన కొద్ది రోజులకే అంటే
మార్చి 15, 2029 నుండి ఏప్రిల్
14 వరకు 'అధిక చైత్రమాసం' వస్తుంది. దీనివల్ల ఆ సంవత్సరం ఉగాది, శ్రీరామనవమి పండుగలు సాధారణ రోజుల కంటే ఒక నెల
ఆలస్యంగా (నిజ చైత్రమాసంలో) వస్తాయి. అధిక చైత్రమాసంలో ఉగాది పచ్చడి తినడం కానీ,
శ్రీరామ కల్యాణాలు చేయడం కానీ జరపకూడదని సిద్ధాంతులు అంటున్నారు. జ్యోతిష్య
శాస్త్రం అంతగా చదువుకోని నాలాంటి సామాన్యులు గందరగోళానికి గురికావాల్సిన,
భయపడాల్సిన అవసరం లేదని, వీలుంటే, కొన్ని నియమాలు పాటిస్తే
మంచిదని సిద్ధాంతుల సూచన.
క్షయమాసం అంటే నెల 'నాశనం' అయిపోవడం కాదు. ఇది కేవలం
సూర్యుడు, చంద్రుల వేగాల వల్ల క్యాలెండర్‌లో జరిగే ఒక అరుదైన
సర్దుబాటు మాత్రమే. కాబట్టి ఇళ్లలో ఎలాంటి అరిష్టాలు జరుగుతాయని భయపడాల్సిన
పనిలేదు. ఇంట్లో చేసుకునే రోజువారీ పూజలు, దీపారాధనలు,
ప్రతి శనివారం లేదా కార్తీక మాసాల్లో చేసుకునే నోములు, నిత్య ఉపవాసాలు యథావిధిగా చేసుకోవచ్చు. పెద్ద శుభకార్యాలు మాత్రం ఈ
క్షయమాసం, అధికమాసం ఉన్న రోజుల్లో (అంటే డిసెంబర్ 2028 నుండి
ఏప్రిల్ 2029) ఆపాలని సిద్ధాంతుల సలహా.
అలాగే, కుటుంబంలో
ఎవరైనా గతంలో పుష్య మాసంలో కానీ లేదా మాఘ మాసంలో కానీ చనిపోయి ఉంటే, ఈ క్షయమాసంలో వారి తద్దినాలు (శ్రాద్ధ కర్మలు) ఏ రోజున పెట్టాలనేది సంబంధిత
పురోహితులను అడిగి తెలుసుకోవాలి. తిథి యొక్క సగ భాగాన్ని బట్టి దీనిని
నిర్ణయిస్తారు., ఏదేమైనా, మంచీ - చెడులు ఎప్పటికప్పుడు
తెలియచేసే సిద్ధాంతులు ఎప్పుడూ అందుబాటులో వుండే పవిత్ర కర్మభూమి మన భారతదేశం.
అంతా మంచే జరుగుతుంది. సామన్య ప్రజలకు కాలానుగుణంగా ధర్మబద్ధమైన జీవితాన్ని
గడపడానికి మన పంచాంగకర్తలు ఇచ్చే సూచనలే మనందరికీ శ్రీసీతారామరక్ష.
ఈ విద్వద్గోష్ఠిలో బ్రహ్మశ్రీ ఆకెళ్ల
జయకృష్ణశర్మ సిద్ధాంతి,
యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి, గాడిచర్ల నాగేశ్వరరావు సిద్ధాంతి, చికిలి వెంకటేశ్వరశర్మ
సిద్ధాంతి,
శాస్త్రుల కృష్ణమూర్తిశర్మ సిద్ధాంతి, శంకరమంచి రామకృష్ణశర్మ సిద్ధాంతి, బోర్పట్ల భాస్కరాచార్యులు
సిద్ధాంతి,
ముక్రాల లక్ష్మణమూర్తి సిద్ధాంతి, బోర్పట్ల రాఘవేంద్రాచార్యులు సిద్ధాంతి, పెండ్యాల హనుమంతరావు
సిద్ధాంతి,
గౌరీభట్ల రామకృష్ణశర్మ సిద్ధాంతి, శంకరమంచి శివశర్మ సిద్ధాంతి, వడిగేచర్ల వెంకటరమణ
సిద్ధాంతి,
ఉప్పల ప్రసాదశర్మ సిద్ధాంతి, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ విద్వత్సభ కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతి, కోశాధికారి,
దర్శనమ్ సంపాదకులు మరుమాముల వెంకటరమణశర్మ పాల్గొన్నారు. (ప్రసంగ
వ్యాసాల, చర్చల ఆధారంగా నా ఈ వ్యాసం)

