Thursday, October 21, 2010

ప్రభుత్వ నిర్ణయాల అమలు బాధ్యత అధికారులదా? మంత్రులదా?: వనం జ్వాలా నరసింహారావు


సూర్య దిన పత్రిక (23-10-2010)
వనం జ్వాలా నరసింహారావు

ప్రభుత్వాలు మారినప్పుడల్లా వివిధ స్థాయిలలో సమీక్షా సమావేశాలు నిర్వహించడం, ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షించడం, కొత్త పథకాలకు రూపకల్పన చేయాలని నిర్ణయించడం, వున్న పథకాలకు పేర్లు మార్చడం, సంస్కరణలంటూ "ఇల్లు పీకి పంది రేసే" ప్రయత్నాలు చేయడం, ఒక వైపు నిధులకు కొరత లేదంటూ ప్రకటనలు గుప్పించడం-మరో వైపు నిధుల కొరతంటూ ప్రజోపయోగమైన కార్యక్రమాలకు కోత విధించడం, ఆ తరువాత అంతా మరచిపోవడం, ప్రతిపక్షాల విమర్శలకు ఎదురు దాడి చేయడం, ఒక తంతుగా-ప్రజాస్వామ్యాన్ని పరిహాసంచేసే ప్రహసనంగా మారిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చాకనే ఇలా జరుగుతుందా అని ప్రశ్నించుకుంటే, జవాబు అవునని చెప్పాల్సి వచ్చినా, ఏ ప్రభుత్వంలోనైనా జరుగుతున్నదిదే అనక తప్పదు. సమావేశాలలో-సమీక్షా సమావేశాలలో తీసుకున్న నిర్ణయాల అమలు బాధ్యత అధికారులదా? అమలు చేయించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులదా? సమన్వయంతో ఇద్దరూ కలిసి చేస్తేనే మంచిదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు అమలు కాకపోతే ఫలితం శూన్యం! అసలు ప్రభుత్వం అమలు చేద్దామనుకున్న, చేయవలసిన వివిధ పధకాల అమలు తీరుతెన్నులపై ముఖ్యమంత్రి స్థాయి వరకు ఖచ్చితమైన సమాచారం పాలనా యంత్రాంగం ఆయనకు అందింస్తున్నదా అన్న అనుమానం కూడా కలుగుతోంది పలువురికి.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్న రోజుల్లో అప్పటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం అమలు జరుపుతున్న కార్యక్రమాల లొసుగులకు సంబంధించిన సమాచారం, ఆయన ఎలా సేకరించేవారోకాని, పలువురు జిల్లా కలెక్టర్లతో సహా అనేకమంది అధికారులు, ఆయన ఎప్పుడేమడుగుతారోనని అప్రమత్తంగా వ్యవహరించేవారు. అసలా రోజుల్లో కొందరు జిల్లా కలెక్టర్లు రాజశేఖర రెడ్డికే జవాబుదారీగా పనిచేస్తున్నారేమోనన్న అనుమానంకూడా అప్పుడప్పుడు కలిగేది. సమాచార సేకరణకు ఇప్పుడున్నంత యంత్రాంగం ప్రతిపక్షనేతగా అప్పుడు లేకపోయినా, ఆయన దగ్గర ఖచ్చితమైన గణాంక వివరాలు ఉన్నాయని అధికారులు భయపడి పనిచేసేవారు. అయన వున్నప్పుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందితో సహా యావత్ రాష్ట్ర పాలనా యంత్రాంగం, గ్రామస్థాయి వరకూ ప్రభుత్వం కనుసన్నల్లోనే పనిచేస్తుంది. అయినప్పటికీ ముఖ్యమంత్రికి అందుతున్న సమాచారంలో తప్పులు దొర్లుతున్నాయనే సంగతి ఇటీవల కాలంలో కొన్ని కొన్ని విషయాల్లో స్పష్టంగా బయటపడింది.

రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు సంబంధించిన ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో కాని, బయ్యారం గనుల విషయంలో కాని, సోంపేట కాల్పులకు సంబంధించి కాని, వైద్య-ఆరోగ్య సంబంధిత వివరాల గురించి కాని సరైన సమాచారం చేరవలసిన స్థాయికి (ముఖ్యమంత్రి స్థాయికి) చేరడంలేదే మో అనిపిస్తోంది. బాధ్యతాయుతమైన అఖిల భారత సర్వీసులకు చెందిన కొందరు అధికారులు, వివాదాస్పదమైన సమాచారాన్ని మాత్రమే అందించడం ఎంతవరకు సబబన్నది నిబద్ధతతో పనిచేస్తున్న ఇతర అధికారుల్లో చర్చనీయాంశమైంది. ఇలాంటివి జరగకుండా జాగ్రత్తపడడం, అఖిల భారత సర్వీసులకు చెందిన ప్రత్యేకత సంతరించుకున్న ’ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్’ అధికారుల పనితీరుకే ఒక సవాలనుకోవాలి. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో వివాదాల్లో చిక్కుకోవడం, రాజకీయ ప్రభావాలకు లోను కావడం, మంత్రులకు వంతపాడటం, పక్షపాత వైఖరితో ఉద్యోగ ధర్మాన్ని విస్మరించడం, నైతిక విలువలను పాటించకపోవడం కొందరికి అలవాటుగా మారిందన్న సంకేతాలొస్తున్నాయి. స్వర్గీయ ఎస్. ఆర్. శంకరన్ లాగా పనిచేస్తున్నారని అనిపించుకోవాలనో, ఒక వి. చంద్రమౌళిలాగా వ్యవహరించాలనో, ఒక పి.వి.అర్.కె. ప్రసాద్ లా పనిచేయాలనో, ఒక జయప్రకాష్ నారాయణ లా పేరు తెచ్చుకోవాలనో అనుకునేవారు అరుదుగా కనిపిస్తున్నారు. అత్యంత బాధ్యతతో కూడుకున్న పదవులు చిన్న వయసులోనే చేపట్టినందువల్లనో, మారుతున్న రాజకీయ పరిస్థితుల ప్రభావంవల్లనో, సంప్రదాయాలను పాటించనందువల్లనో, సివిల్ సర్వీసులలో సంస్కరణలు అమలు చేయకపోవడంవల్లనో ఇలాంటివి జరుగుతుండవచ్చు. ఇందుకు ప్రభుత్వాలు కూడా బాధ్యత వహించాలి.

ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐ.ఎ.ఎస్)ను సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి ’ఉక్కు వ్యవస్థ’గా అభివర్ణించారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రభుత్వ నిర్ణయాలను కట్టుదిట్టంగా అమలుపర్చేందుకు, చేయూతనందించేందుకు, పటిష్టమైన పాలన యంత్రాంగం అవసరమైన నేపధ్యంలో అది ఆవిర్భవించింది. అంతకుముందు ఆంగ్లేయుల పాలనలో పరిపాలన బాధ్యతలు నిర్వహించిన ’ఇండియన్ సివిల్ సర్వీస్’కు విప్లవాత్మకమైన మార్పులు చేర్పులు చేసి, ఆ నమూనాలోనే ఈ వ్యవస్థను రూపొందించారు. ఈ సర్వీస్కుీ ఎంపికైన వ్యక్తులు పౌర పరిపాలనలోనూ, విధాన నిర్ణయాలలోనూ, ఆంతరంగిక విదేశీ సంస్కరణలను చాకచక్యంగా నివారించడంలోనూ కీలకమైన పాత్ర పోషిస్తుంటారు. సాహిత్యం నుంచి వైద్యశాస్త్రం వరకు విభిన్న విద్యల్లో తమదంటూ ఒక ప్రత్యేకత ఉందని నిరూపించుకున్న తెలివైన, బాధ్యతాయుతమైన, సమర్ధులైన వ్యక్తులను ఓ పద్దతి ప్రకారం విస్తృతమైన, కఠినమైన పరీక్షా విధానం ద్వారా ఈ సర్వీసుకు ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైన ఐ.ఎ.ఎస్ అధికారుల ఉద్యోగాలకు రాజ్యాంగపరమైన భద్రత ఉంటుంది. కార్య నిర్వహణ అధికారాల విషయంలో భయపడాల్సిన అవసరం కాని ఒత్తిడులకు లోను కావాల్సిన అవసరం కానీ వారికి ఎంత మాత్రంలేదు. దేశ సమగ్రతకు ఈ వ్యవస్థ అత్యంత అవసరమైందని సర్దార్ పటేల్ అనేవారు.

ఐ.ఎ.ఎస్‍కు చెందిన అధికారులకు సబ్ కలెక్టర్ స్థాయినుంచి, రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు, కేంద్రంలో కేబినెట్ సెక్రటరీ స్థాయి వరకు వివిధ శ్రేణి ఉద్యోగాల్లో పనిచేసే అవకాశం కలుగుతుంది. వారి వారి సామర్ధ్యాన్నిబట్టి, కార్య నిర్వహణ పద్ధతులను బట్టి వారిని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులుగా నియమించడం, పదోన్నతులు కల్పించడం జరుగుతుంది. అయితే గత కొంత కాలంగా, పలు సందర్భాల్లో ఇవేవీ అర్హతలు కాకుండా, పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులతో వీరికున్న చనువు ఆధారంగా పదవులు దొరుకుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. కొంతమందైతే ఏ పార్టీకి చెందిన ప్రభుత్వం అధికారంలో ఉన్నా సమర్ధత ప్రాతిపదికగా కాకుండా "చొరవ", "పలుకుబడి” ప్రాతిపదికగా ప్రాధాన్యతగల పోస్టులు దక్కించుకుంటున్నారు. తరచూ ఇలాంటి వారే ఏ ఎండకాగొడుగు పడుతూ మంత్రుల అవసరాలకు, ఆదేశాలకు అనుగుణంగా నడచు కొంటూ తాత్కాలిక లబ్ది పొందుతున్నారు. ఇలాంటి వారి సంఖ్య తక్కువే అయినా వారిని ప్రభుత్వంలోని కొందరు పలుకుబడి కలిగిన మంత్రులు ప్రోత్సహిస్తున్నారు. ఇది సంప్రదాయం కాకూడదు. ఇలాంటి వారి కారణంగానే ఎన్నో మంచి కార్యక్రమాలను నీరుగార్చడము, పేరు మార్చడము జరుగుతున్నది.

ఐ.ఏ.ఎస్ కు ఎంపికైన వారు ఏడాదిపాటు ముస్సోరీలో, ఏడాదిపాటు వారికి కేటాయించిన రాష్ట్రంలో అసిస్టెంట్ కలెక్టర్ శిక్షణ పొందిన తరువాత లభించే మొదటి ఉద్యోగం సబ్ కలెక్టర్. ఈ హోదాలో పనిచేసిన తరువాత సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారిగా, జాయింట్ కలక్టర్ గా పదోన్నతులు పొంది డిప్యూటీ సెక్రటరీ - జాయింట్ సెక్రటరీ స్థాయి హోదాలో (కొన్ని సందర్భాల్లో సెక్రటరీ స్థాయి) ఒక జిల్లా కలక్టర్ గా నియమితులవుతారు. దురదృష్ట వంతులైన కొందరికి ఈ అవకాశం రాకుండాపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ పదవుల కుండే హోదా, మెజిస్టీరియల్ అధికారాల దృష్ట్యా, ప్రతి ఐ.ఎ.ఎస్ అధికారీ ఈ బాధ్యతలు నిర్వహించాలనే కోరుకుంటారు.

అఖిల భారత సర్వీసుల్లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కు ప్రత్యేకత ఉంటే అందులో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న పదవి జిల్లా కలెక్టర్. పలు అభివృద్ధి సంక్షేమ పధకాల అమలులో, పర్యవేక్షణలో కలెక్టర్ బాధ్యత అంచనాలను మించిపోతున్నది. జిల్లా స్థాయిలో లెక్కకు మించిన శాఖలకు కలెక్టరే అధిపతి. సుమారు వందకు పైగా కమిటీలకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఎప్పుడేపని చేస్తుండేదీ గుర్తుంచుకోలేని స్థాయికి కలెక్టర్ చేరుకున్నారు. ఇలా కలెక్టర్లకు అధికారాలు, బాధ్యతలు పెంచడమే కాకుండా అడపా దడపా పరిపాలనా నియమావళులనూ మార్చేస్తున్నారు. కాని, అవి తు.చ. తప్పకుండా అమలు జరగాలంటే ఆ పదవి నిర్వహిస్తున్న వారికి వయస్సు రీత్యాగాని, అనుభవం రీత్యాగాని ఉన్న అవగాహన స్థాయి, పరిపక్వత, అలోచనా సరళి ఏమిటనే సంగతిని ఎవరన్నా పట్టించుకుంటున్నారా అనేది అనుమానమే. ఒకప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి ప్రజల కోరికలు, డిమాండ్లు పాతకాలంలో లాగా లేవు. అందుకే అప్పటి-ఇప్పటి పరిస్థితులను అర్ధం చేసుకున్న కొందరినన్నా కొన్ని జిల్లాలకు కలెక్టర్లుగా పంపితే, కనీసం ప్రయోగాత్మకంగానన్నా ఈ పరిస్థితిని అమలు చేస్తే ఎలా ఉంటుందో చూడాలి. ఒక ఐ.ఎ.ఎస్ అధికారి జిల్లా కలెక్టర్ గా పనిచేసి, పదోన్నతి పొంది రాజధానికి చేరి, సచివాలయంలో అధికారిగానో, శాఖాధిపతిగానో పనిచేయడం ప్రారంభించిన తరువాత మళ్ళీ జిల్లాలకు పోవడం అరుదుగా జరుగుతుంది. ఐ.ఎ.ఎస్ అయిన మొదటి పది-పదిహేను సంవత్సరాలు జిల్లాలో ఉన్న తరువాత మిగిలిన సర్వీసంతా ’అట్టడుగు స్థాయి’ సేవలకు దాదాపు దూరమయినట్లే. ఇంకో విధంగా చెప్పాలంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానో లేక కేబినెట్ కార్యదర్శిగానో అయ్యే అవకాశం వచ్చేంతవరకు అసలు-సిసలైన అధికారానికి కూడా నోచుకోనట్లే. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా పెరుగుతున్న బాధ్యతల దృష్ట్యా, ఈ వ్యవస్థలో కొంత మార్పు తేవడం అవసరం.

రాష్ట్రంలోని కనీసం మూడోవంతు జిల్లా కలెక్టర్లుగా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులనే నియమించాలి. వారి పాలనానుభువం ప్రజలకు, ప్రభుత్వానికి ఉపయోగించబడటంతోపాటు అట్టడుగు స్థాయి ప్రజల సమస్యలను ఆకళింపు చేసుకొనే అవకాశం వీరికి మరో మారు లభిస్తుంది. గ్రామీణ భారతాన్ని తెలుసుకునే వీలు కలుగుతుంది. అలాంటివి ఇప్పుడు లేకపోతే కొత్తగా ఏర్పాటు చేయాలి. రాష్ట్రానికి, ప్రజా సమస్యలకు, గ్రామస్థాయి పధకాల అమలుకు దూరంగా పనిచేస్తున్న అధికారులను సీనియారిటీ పేరుమీద నో, ’మరే కారణంగానో’ అత్యున్నతమైన పదవులకు ఎంపిక చేయడం సమంజసం కాదు. అలా జరిగితే అనుభవం లేని మంత్రులకు అవగాహన లేని అధికారులు తోడవు తారు. ఆ పాలన ఎలా ఉంటుందో మనం అనుభవంలో చూస్తున్నాం కదా!

3 comments:

  1. అమలు బాధ్యత అధికారులది - పర్యవేక్షణ(supervision) మంత్రులది. దారుణమైన విషయమేంటంటే ఇద్దరూ ఫెయిల్ అయ్యారు

    ReplyDelete
  2. అద్భుతమైన విశ్లేషణ అందించారు సర్. చాలా సూచనలు పాటించదగ్గవే. అడ్మినిస్ట్రేటివ్ రిఫా ర్మ్ స్ కమీషన్ నివేదికలని వీలయినంత త్వరగా అమలు చేయ గలిగితే బావుంటుంది. అయితే.. ఇటువంటి పనులకి రాజకీయ పరమైన ప్రయోజనాలు లేక పోవదంతో బాగా ఆలస్యమవుతున్నట్టుంది.

    ఈ మొత్తం సమస్యలో ఇంకో కోణం ఏంటంటే, మీరన్నట్టు ఇప్పటి పరిపాలనా వ్యవస్థ కొంచెం క్లిష్ట మైనది. బహుశా స్థానిక సంస్థలను బలో పేతం చేయదం, స్థానిక సంస్థల కోసం ప్రత్యేకమైన సర్వీసుల్న్ని నెలకొల్పడం జరిగితే తప్ప సరళ మైన పాలానా పద్దతులు రాలేవు అనిపిస్తుంది. ఏమంటారు?

    ReplyDelete