Tuesday, October 26, 2010

సమష్ఠి బాధ్యతా రాహిత్యంతో నానాటికి కొరవడుతున్న విశ్వాసం : వనం జ్వాలా నరసింహారావు

సమష్ఠి బాధ్యతా రాహిత్యంతో నానాటికి కొరవడుతున్న విశ్వాసం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్ర ప్రభ దిన పత్రిక (28-10-2010)

కొందరు మంత్రులు తమ శాఖలను పట్టించుకోవడం లేదని, విధాన నిర్ణయాల విషయంలో పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని, ముఖ్యమంత్రి ఆదేశాలనే బే ఖాతరు చేస్తున్నారని, స్వీయ నిర్ణయాలు తీసుకోవడానికి జంకి ముఖ్యమంత్రిపై భారం మోపుతున్నారని వార్తలొస్తున్నాయి. సంస్కరణల పేరుతో మంత్రులకు తెలియకుండా-ముఖ్యమంత్రి దృష్టికి పోనీ కుండా కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలను గురించి సీఎం ను అడిగితే ఆయన అమాయకంగా స్పందిస్తున్నట్లు, సంబంధిత శాఖ మంత్రిని వివరణ అడుగుతే తనకూ తెలియదని జవాబిస్తున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. దీనికి తోడు మంత్రి వర్గ నిర్ణయాలు సమిష్టి బాధ్యతగా భావించడం ఏ మంత్రీ పాటించడం లేదని, మంత్రులకు అధికారులకు మధ్య విధాన నిర్ణయాల విషయంలోను-పథకాల అమలు విషయంలోను-రాజశేఖర రెడ్డి హయాంలో ప్రవేశ పెట్టిన పథకాలను తిరగ తోడే విషయంలోను, అవగాహనా రాహిత్యం పూర్తి స్థాయిలో చోటుచేసుకుంటున్నదని కూడా వార్తలొస్తున్నాయి.

చాలా మంది మంత్రులు తనకు గుదిబండలుగా పరిణమించినట్లు, సగానికి పైగా మంత్రులు క్రియాశీల రాహిత్యంగా-నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్నట్లు, సచివులు మొక్కుబడి కోసం పనిచేస్తున్నారే తప్ప ప్రభుత్వ ప్రతిష్ఠను కాపాడే ఉద్దేశంతో కానట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆయనలోని అసహనం హద్దులు దాటి, మీడియా వీటికి సంబంధించిన అంశాలపై పరోక్షంగా ప్రశ్నలు గుప్పిస్తుంటే, "పొరపాటునో గ్రహపాటునో సీఎం అయినంత మాత్రాన అన్ని విషయాలూ ఫింగర్‌ టిప్స్ పైన ఉంటాయా?'' అని అన్నట్లు పత్రికలు రాశాయి. అలానే, ఒకానొక అతి ముఖ్యమైన విషయంలో ముఖ్యమంత్రి సంబంధిత ఫైలు మీద సంతకం పెట్టి విధి విధానాలను రూపొందించమని మంత్రికి సూచించినప్పటికీ, ఆ విషయంలో ఆయన మీడియాకు బాధ్యతా రాహిత్యంగా సమాధానాలు ఇచ్చినట్లు కూడా వార్తలొచ్చాయి. ఒకే విషయాన్ని తనను, ముఖ్యమంత్రిని అడగడమంటే, ఇద్దరి మధ్య పుల్లలు పెట్టే ప్రయత్నంగా ఆ మంత్రి అనడం, సమిష్టి బాధ్యతా రాహిత్యానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ఇదిలా వుండగా, వరదల్లో వైఫల్యం, విత్తనాల పంపిణీ, గిరిజన ప్రాంతాల్లో అనారోగ్యం, నిత్యావసర ధరలు, నకిలీ విత్తనాలు, ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు డిమాండ్లు, తెలంగాణ న్యాయవాదుల పోరాటం, సోంపేటలో రైతులపై కాల్పులు, బయ్యారం గనులు, ఆరోగ్య సేవలు, మైక్రో ఫైనాన్స్ ఆగడాల లాంటి పలు సమస్యలకు సంబంధించి అధికారుల నుంచి సరైన సమాచారం ముఖ్య మంత్రి స్థాయిలో ప్రభుత్వానికి చేరుతున్నట్లు కూడా కనిపించడం లేదు.

మన రాష్ట్రంలో మంత్రులకు-మంత్రులకు మధ్య, మంత్రులకు-ముఖ్య మంత్రికి మధ్య, మంత్రులకు, ముఖ్యమంత్రికి-సంబంధిత శాఖ అధికారులకు మధ్య అగాధం నానాటికి పెరిగిపోతోంది.. పాలనాపరమైన విధాన నిర్ణయాల్లో మంత్రికి రాజ్యాంగ పరంగా ఎంత బాధ్యత ఉందో, సివిల్ సర్వెంట్లకూ అంతే బాధ్యతే ఉంటుంది.. అధికారికీ, మంత్రికీ మధ్య ఆంతరంగికత, పరస్పర విశ్వసనీయత నెల కొన్నప్పుడే ప్రభుత్వ పనితీరు, దక్షత, నైపుణ్యం, సామర్ధ్యం మెరుగుపడతాయి... అనుభవజ్ఞులైన మంత్రులు అధికారులతో ఎలా పనిచేయించుకోగలుగుతారో, అలానే అనుభవం లేని మంత్రులను కొందరు అధికారులు బురిడీ కొట్టించగలుగుతారు. సంస్కరణల పేరిట పాత పథకాలకు పేర్లు మార్చడమో, నీరు కార్చడమో చేసి సంబంధిత శాఖ మంత్రికి, ముఖ్య మంత్రికి విషయం తెలిసే లోపున ప్రభుత్వానికి అప్రతిష్ట తెస్తారు. ఇటీవల కాలంలో ఇవన్నీ మామూలై పోయాయి.

కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలు దాటినా, ఆయన మంత్రివర్గంలోని చాలామందికి తమ శాఖకు చెందిన ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి, శాఖాధిపతులతో నేటికీ సత్సంబంధాలు ఏర్పడలేదు. అఖిల భారత సర్వీసులకు చెందిన కొందరు సీనియర్ అధికారులు సంబంధిత మంత్రి నుంచి కాకుండా ఇతర మంత్రులనుంచి ఆదేశాలు తీసుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. నేరుగా ముఖ్యమంత్రికి మాత్రమే తాము జవాబుదారీ అనే ధోరణి కూడా కొంతమంది అధికారుల్లో కనిపిస్తోంది.

ఇలాంటి పరిణామాల నేపధ్యంలో, సివిల్ సర్వెంట్లకు-మంత్రులకు మధ్య ఎలాంటి సంబంధాలు ఉండాలన్న చర్చ మొదలైంది. మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ. బ్రిటిష్ సంప్రదాయాలనే చాలావరకు మనం అనుకరిస్తున్నాం, అన్వయించుకుంటున్నాం. ఆచరణలోకి వచ్చేటప్పటికి, కొన్ని సందర్భాల్లో మనదైన శైలిలో నడుస్తున్నాం. మంత్రులకూ-సివిల్ సర్వెంట్లకూ మధ్య ఉండాల్సిన సంబంధాల విషయంలో ఇరువురూ ఎవరికి తోచిన సంప్రదాయాలను వారు పాటిస్తున్నారు. మంత్రులకూ-సివిల్ సర్వెంట్లకు మధ్య ఉండాల్సిన సంబంధాలను, సివిల్ సర్వెంట్ల కర్తవ్యాలు-బాధ్యతలను, బ్రిటన్ లో రూపొందించిన" ఆర్మ్ స్ట్రాంగ్ మెమొరాండం" లో వివరించారు. పదేళ్ల క్రితం ఆ మెమొరాండానికి కొన్ని సవరణలు చేశారు. వాటిని పరిగణనలోకి తీసుకొని, ప్రస్తుతం మన రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను సమీక్షించడం సబబు. మెమొరాండంలో పేర్కొన్నట్లు రాజ్యాంగ పరంగా ఆలోచిస్తే మంత్రులు చట్టసభలకు జవాబుదారీ అయినట్లే, సివిల్ సర్వెంట్లు (అధికారులు) మంత్రులకు జవాబుదారీగా ఉండాలి. మంత్రులకు అంటే, ప్రజాతీర్పు ద్వారా ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలని అర్ధం చేసుకోవాలి. ఏ రాజకీయ పార్టీకి చెందిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఏ ముఖ్య మంత్రి పదవిలో వున్నా, రాజకీయాలతో ఏ మాత్రం నిమిత్తం లేకుండా ప్రభుత్వానికి సేవలందించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. తమ శాఖను నిర్వహిస్తున్న మంత్రి విశ్వాసాన్ని చూరగొనడం వారి ప్రధమ కర్తవ్యం. ప్రభుత్వాలు మారినా వారి ఈ కర్తవ్యం మారదు. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి-అంటే సంబంధిత మంత్రికి-వారు అవసరమైన సూచనలు ఇస్తూ, పాలనాపరమైన విధాన నిర్ణయాల్లో సహకరిస్తూండాలి. తమ ఇష్టాయిష్టాలకు అతీతంగా నిర్ణయాల అమల్లో తోడ్పడుతూ, ఎన్నికల్లో చేసిన వాగ్దానాల అమల్లో ప్రభుత్వానికి అండదండగా ఉండాలి. విదేశాల్లో నేర్చుకున్న పాఠాలను, భారత దేశ పరిస్థితులకు అన్వయించకుండా, యధా తధంగా అప్ప చెప్పడం మానుకోవాలి. అక్కడ విన్నవీ-కన్నవీ, ఆ విషయాలంతగా తెలియని మంత్రులకు చెప్పి, వారు అర్థం చేసుకోకుండా ఒప్పించి, అప్పటివరకూ ప్రజోపయోగంగా వున్న పథకాలను నిష్ప్రయోజనం చేయకూడదు.

ప్రభుత్వమంటే, సమష్టి బాధ్యతతో వివిధ శాఖలను నిర్వహిస్తున్న పూర్తి మంత్రి మండలి. దాని అధినేత ముఖ్యమంత్రి. సంబంధిత శాఖకు చెందిన పాలన విధానాన్ని నిర్ణయించేది ఆ శాఖ మంత్రే అయినా, అది యావత్ మంత్రి మండలి సమష్టి నిర్ణయమే. ఏ ఒక్క మంత్రి తప్పు చేసినా, దానికి అందరూ బాధ్యత వహించాలి అని రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. అసలీ విషయం గురించిన ఆలోచనే ఇటీవలి కాలంలో మంత్రులకు రావడం లేదు. పైగా తోటి మంత్రి చేసిన దాన్ని తప్పు పట్టడం, బాహాటంగా మరో మంత్రిని విమర్శించడం, వీలుంటే ముఖ్య మంత్రినే విమర్శించడం, తన పార్టీకి చెందిన వాడే ముఖ్య మంత్రిగా వున్నప్పటికీ మరో వ్యక్తి ఆ పీఠంలోకి వస్తే బాగుంటదని వ్యాఖ్యలు చేయడం, సంబంధిత శాఖ మంత్రికి తాను తీసుకున్న నిర్ణయంపై అవగాహన లేకపోవడం సర్వసాధారణ విషయాలవుతున్నాయి. పాలనాపరమైన విధాన నిర్ణయాల్లో మంత్రికి రాజ్యాంగపరంగా ఏ విధమైన బాధ్యత ఉందో, సివిల్ సర్వెంట్లకూ అలాంటి బాధ్యతే ఉంటుంది. పాలనాపరమైన విధాన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో సంబంధిత శాఖ మంత్రికి ఆ శాఖ ముఖ్య అధికారి పూర్తిగా తోడ్పడాలి. తనకు తెలిసిన సమస్త సమాచారంతోపాటు తన అనుభవాన్నంతా రంగరించి, నిజాయితీగా, నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకు అతీతంగా సలహాలు ఇవ్వాలి. మంత్రి ఆలోచన సరళికి భిన్నమైన దైనా, ఇవ్వవలసిన శ్రేష్టమైన సలహా ఇచ్చి తీరాలి.

సివిల్ సర్వెంట్లు మంత్రికి అవసరమైన సమాచారాన్ని ఇవ్వకపోయినా, తాను అత్యంత శ్రేష్టమని నమ్మిన సలహాకు బదులు వేరే సలహా ఇచ్చినా, మంత్రి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని జాప్యం చేసే ప్రయత్నం చేసినా, అది పూర్తి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమవుతుంది. ఇదంతా జరిగిన తరువాత మంత్రి తీసుకునే నిర్ణయం ఏదైనా, దానిపై తనకెన్ని సందేహాలున్నా, అభిప్రాయభేదాలున్నా, అమలు విషయం వచ్చేసరికి ఎటువంటి అరమరికలు లేకుండా చిత్తశుద్ధితో, ద్విగుణీకృతమైన పట్టుదలతో పనిచేయాలని ఆర్మ్ స్ట్రాంగ్ మెమొరాండంలో స్పష్టం చేశారు. అధికారికీ-మంత్రికీ మధ్య ఆంతరంగికత, పరస్పర విశ్వసనీయత నెల కొన్నప్పుడే ప్రభుత్వ పనితీరు, దక్షత, నైపుణ్యం, సామర్ధ్యం పెరుగుతాయి. అధికారులు సరైన సలహాను సరైన సమయంలో ఇవ్వకపోయినా, తప్పు జరగడానికి ఆస్కారమున్న సలహా ఇచ్చినా, మంత్రులను మభ్యపెట్టినా, మంత్రులకు తెలియకుండా రహస్య సమాచారాన్ని అధికారికంగా బహిర్గతం చేసినా, ఆ దుష్ప్రభావం సంబంధిత మంత్రులపైనా, యావత్ మంత్రి మండలిపైనా, ప్రభుత్వంపైనా పడుతుంది. పర్యవసానం ఏదైనా, తప్పొప్పులకు బాధ్యుడు మాత్రం మంత్రే. సివిల్ సర్వెంటులమీద రాజకీయ ఒత్తిడుల ప్రభావం పని చేస్తుందన్న విషయం కూడా ఆలోచించాలి. రాజకీయ లబ్దికోసమో, వ్యక్తిగత ప్రయోజనాలకోసమో, తమ ఆలోచనా సరళికి అనువుగా ఉండే సలహాని మాత్రమే పొందే విధంగా సివిల్ సర్వెంటులపైనా ఒత్తిళ్లు రావచ్చు. మన దేశంలో ఇలాంటి ఒత్తిడులు వచ్చే అవకాశాలే ఎక్కువ. వృత్తి ధర్మానికి విరుద్ధంగా సివిల్ సర్వెంట్లతో తప్పు చేయించే ధైర్యం ఎంతమంది మంత్రులకు ఉంటుందనేది కూడా ప్రశ్నార్ధకమే. ఒకవేళ మంత్రి ప్రోద్భలం లేకపోయినా అలాంటి తప్పులు స్వతహాగా అధికారులు చేయొచ్చా? జీతభత్యాల విషయంలో కానీ, కెరీర్ విషయంలో కానీ మంత్రుల ప్రత్యక్ష ప్రమేయం ఉండదని తెలిసినా, అఖిల భారత సర్వీసులకు చెందిన సివిల్ సర్వెంట్లకన్నా ఎందుకు మరింత మెరుగ్గా పనిచేయకూడదు? తమను వేలెత్తిచూపు చూపే రీతిలో కొందరు ఎందుకు ప్రవర్తిస్తున్నారు?

ఏదైనా పాలనాపరమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు కానీ,జనా కర్షక పధకంపై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు కానీ, అధికారులు మంత్రుల ఆలోచనా విధానానికి అనుగుణంగా స్పందించాల్సిన అవసరమొస్తే అలాంటి స్పందనను ఒత్తిడి అనలేం. మంత్రుల అభిప్రాయాన్ని, అభిమతాన్ని తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. అలాంటప్పుడు ఆంతరంగికత, పరస్పర విశ్వసనీయత అతి ముఖ్యం. సలహా అడిగిన మంత్రికీ, ఇచ్చిన అధికారికీ మధ్యన గట్టి విశ్వాసం ఉండాలి. అనుభవజ్ఞులైన మంత్రులు అధికారులతో ఎలా పని చేయించుకోగలుగుతారో, అలానే అనుభవం లేని మంత్రులను కొందరు అధికారులు బురిడీ కొట్టించగలుగుతారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే మాతృకైన బ్రిటన్లో అమలవుతున్న సత్ సంప్రదాయాలను ఇక్కడా ఆచరణలో పెట్టి పనిచేయడం మంత్రులకూ, అధికారులకూ మంచిది.

3 comments:

  1. మంచి వ్యాసం రాశారు. సమిష్టి బాధ్యత కొరవడింది. దానికి తోడు, అవగాహనా రహిత్యం కొంత.

    అధికారులు పాలనా పరంగానూ, సాంకేతికంగానూ వివిధ ప్రత్యమ్నాయాలని ప్రతిపాదిస్తే, అందులో అవసరమైన మార్పులు చేసి ప్రజామోద యోగ్యంగా చేసే బాధ్యత మంత్రులది. అటువంటి టీం వర్క్ లేకపోవడం దురదృష్టకరం.

    జవాబుదారీతనం లేకపోవడం కూడా ఈ సమస్యలోని ఒక ముఖ్య కోణం అనిపిస్తుందండీ. ఎందుకంటే, మన మీడియా గానీ సమాజం గానీ కేవలం ముఖ్యమంత్రినే జవాబుదారిగా చూస్తున్నాం గానీ అధికారులనీ, మంత్రులనీ వాళ్ళ వాళ్ళ నిర్ణయాలకు బాధ్యుల్ని చేసే పరిణతి అలవర్చుకోవాలి. మనలో అటువంటి పరిణతీ, వ్యవస్థలో పారదర్శకతా వస్తే తప్ప మీరన్నట్టు మంచి సంప్రదాయాలు నెలకొల్పబడవు.

    సమాజంలోని చదువుకున్న మధ్యతరగతి ప్రజలు రాజకీయ అవగాహన పెంచుకోవడం, పరిపాలనలో పార్టిసిపేట్ చెయ్యడం ద్వారా కొంత మార్పు వస్తుంది. కాకపోతే, ప్రస్తుతానికి మన మధ్య తరగతి రాజకీయాలపట్ల పూర్తి నిరాశావహ దృక్పధం లో ఉండడం కొంచెం ఆందోళన కలిగించే అంశం.

    ఎక్కడిదాకో ఎందుకు, మీ వ్యాసాల్లో ఉన్నవిధంగా అసలు విషయాల మీద కనీస చర్చ ఏ చానల్లో అయినా జరుగుతుందా? అసలు ప్రజల్లో చర్చే మొదలవ్వకపోతే.. జవాబుదరీ తనం గానీ, పారదర్శకత గానీ, మంచి సంప్రదాయాలుగానీ రావడం కొంచెం కష్టమే అని పిస్తుంది.

    ప్రయత్నం చెయ్యాలి.. ఎవరికి చేతనైనంతలో వాళ్ళు.. మార్పు వస్తుందని ఆశిద్దాం. Please keep writing...

    ReplyDelete
  2. మన ముఖ్యమంత్రి గారు ఎంతోమంది కాబినెట్‌లలో ఆర్థికశాఖామంత్రి గా చేశారు. ఈమధ్య రిజర్వుబాంక్ గవర్నర్‌గారికి 5రూ నాణెం మీద క్రిష్న దేవరాయలు బొమ్మ ముద్రించమని వ్రాయయడం , దువ్వూరు సుబ్బారావు గారు నాణెములను RBI ముద్రించదనే చిన్న విషయం CM లకు తెలియకపోవడం శోచనీయం అని అనడం పత్రికల్లో చదివి ఆశ్చర్యపోయాను . ( నాణాలను మింట్ లో ముద్రిస్తారు). ఈయనకు తెలియదు సరే ఉత్తరం వ్రాసినవాడు ఏ IAS అయిఉంటాడు గదా . వాడి జ్ఞానం ఏమయి పోయింది .వివిధ రకాల సమస్యలతో ప్రతినిధి బ్రుందాలు కలసినప్పుడు , ముఖ్యమంత్రి గారు ఆ విషయం మీద నాకవగాహన లేదు అని జవాబిచ్చినట్లు కూడా చదివినతర్వాత నాకనిపించేది ఇంత తక్కువ నాణ్యత కలిగిన మంత్రి వర్గాన్ని మనమెప్పుడూ చూడలేదని . వ్యవస్థలను నాశనం చేస్తే , అవినీతిపరులను, అనర్హులను అందలాలెక్కిస్తే కలిగే దుష్ఫలితాలివి .(ఉదా : ధర్మారెడ్డి,బ్రహ్మారెడ్డి , క్రిష్టఫర్, యాదవ్, శ్రీ లక్ష్మి , ఆచార్య, మొ:) .

    ReplyDelete