Wednesday, February 2, 2011

"అతిరాత్రం"-ఏప్రిల్ లో కేరళలో జరుగనున్న అత్యంత ప్రాచీన వైదిక పుణ్య యజ్ఞం:వనం జ్వాలా నరసింహారావు

సుమారు నాలుగు వేల సంవత్సరాల పూర్వం నుండి ఆచరించబడుతూ, ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన-అత్యంత ఆకర్షణీయమైన వైదిక సాంప్రదాయ కర్మకాండ-పుణ్య యజ్ఞం "అతిరాత్రం", ముప్పై సంవత్సరాల విరామం తర్వాత మరొక్క పర్యాయం నిర్వహించడానికి రంగం సిద్ధమౌతోంది. రాబోయే ఏప్రిల్ నెలలో, కేరళ రాష్ట్రంలోని పంజాల్ గ్రామంలో, వైదిక సాంప్రదాయ క్రమానుగతిని అనుసరించి, పన్నెండు దినాలు నిర్విరామంగా నిర్వహించనున్న అపురూపమైన “అతిరాత్రం” విన్యాసాన్ని కన్నుల పండుగగా వీక్షించడానికి పలువురు విదేశీ ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. అత్యంత మౌలికమైన ప్రమాణాలుగా పేర్కొన బడే వేదాలు భగవంతుడి ద్వారా తెలుపబడినవని, మానవుల రచనలు కావని సాంప్రదాయుల విశ్వాసం. వేదాలను వ్యాస మహర్షి ఒక క్రమం ప్రకారం నాలుగు వేదాలుగా విభజించి, వాటికి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని పేర్లు పెట్టాడని, అందుకే ఆయన వేదవ్యాసుడు అయ్యాడనీ చెబుతారు. అలా అనాదిగా వస్తున్న వేదాలకు సంబంధించిన మూల గ్రంథాల్లో పేర్కొనబడిన ఒకానొక అతి ప్రాచీనమైన సాంప్రదాయ కర్మకాండే "అతిరాత్రం". పన్నెండు రోజులు, తెల్లవార్లూ-రాత్రంతా అగ్ని హోమంతో నిర్వహించే "అతిరాత్రం", వైదిక కర్మకాండలన్నింటిలో కి అత్యంత సంక్లిష్టమైనది-మహోన్నత మైనదని, కేరళ రాష్ట్రానికి చెందిన అతిరాత్రం నిర్వాహక సంస్థ "వర్తాతె" సభ్యుడు డాక్టర్ శివశంకరన్ నంబూద్రి అంటున్నారు.

అతిరాత్రం ఆచారాన్ని ప్రాచుర్యంలో తేవడానికి రూపొందించిన అధికారిక వెబ్ సైట్, వైదిక సాంప్రదాయిక పుణ్య యజ్ఞాలను గురించి ప్రస్తావిస్తూ, ఆ సాంప్రదాయాలన్నీ మానవ సమాజం ఆచరణలో పెట్టడానికి రెండు రకాల పద్ధతులను సూచించాయని రాసింది. వాటిలో మొదటిది "గ్రహ్య", రెండోది "శ్రుత". వ్యక్తిగతంగా, సాంప్రదాయానికి కట్టుబడిన వారు పాటించాల్సిన ఆచార వ్యవహారాలైన ఉపనయనం, వివాహం లాంటి విషయాలు మొదటి పద్దతికి చెందినవి. సంస్కార పూర్వ కంగా-అత్యంత ఉన్నత స్థాయిలో, శ్రుతి సాహిత్యంలో నేర్చుకున్న దాని ఆధారంగా, మౌఖిక సాంప్రదాయ బద్ధంగా, ఋగ్వేద-యజుర్వేద-సామవేదాలలో చెప్పిన దాని ప్రకారం తూచ తప్పకుండా ఆచరించేదే రెండో పద్ధతి. ఉపనయన, వివాహ సంప్రదాయాలను భారత దేశమంతా చాలామంది ఆచరణలో పెట్తున్నప్పటికీ, కీలకమైన వైదికాచారాలను మాత్రం, ఎవరో కొద్దిమంది బ్రాహ్మణులు, అక్కడో-ఇక్కడో అడపాదడపా పాటించడం జరుగుతోంది. అలా పాటిస్తున్న వారిలో నంబూద్రి బ్రాహ్మణులు ముందు వరుసలో వున్నారు.

శంకరాచార్యుడు నంబూద్రి బ్రాహ్మణ శాఖకు చెందినవాడు. నంబూద్రీలు కేరళ బ్రాహ్మణులు. వీరి గురించి ఆసక్తికరమైన సమాచారం ఉంది. శాతవాహనుల తరువాత ప్రసిద్ధి చెందిన రాజవంశం కాదంబ వంశం. కాదంబులలో ప్రసిద్ధుడైన రాజు మయూర శర్మ కేరళ ప్రాంతాన్ని పాలించాడు. ఆయన తన స్వస్థలమైన కోనసీమ (తూర్పు గోదావరి) నుండి ఆంధ్ర బ్రాహ్మణ కుటుంబాలను కేరళకు తీసుకు వెళ్ళాడు. ఆ కుటుంబాల వారే తరువాత నంబూద్రీ బ్రాహ్మణులుగా పేరు పొందారు. ఈ విషయం బ్రహ్మ వైవర్త పురాణంలోను, మద్రాసు ప్రభుత్వం ప్రకటించిన తెలుగు గ్రంథం సంపుటాలలోను లభిస్తుంది. శంకరుడు తెలుగువాడు ఐనప్పటికీ వల్లభుడు, నింబార్కుడు, త్యాగరాజు, మొదలైన అనేకమంది మహాపురుషుల లాగే ఆయనకు తెలుగు కంటే ఇతర ప్రాంతాల్లోనే ఆదరణ, ప్రసిద్ధి కలిగిందని చెప్పడంలో సందేహం లేదు.

వైదిక ఆచారాలు అంతరించి పోకుండా, కేరళ నంబూద్రీ బ్రాహ్మణులు, ఇప్పటికీ కాపాడుకుంటూ వస్తున్నారు. పన్నెండు రోజులు, అహోరాత్రులు, ఆరిపోకుండా అగ్నిహోత్రం వుంచడమనే ప్రక్రియ, నంబూద్రీ బ్రాహ్మణులకు అత్యంత ఆకర్షణీయమైన విజ్ఞాన-వినోద దృశ్యం లాంటిది. సనాతన సంప్రదాయాన్ని ముమ్మూర్తులా ప్రతిబింబించే "అతిరాత్రం", భారతీయ మతాచారాలకు-నాగరికతకు అసలు-సిసలైన రూపురేఖగా నంబూద్రీలు భావిస్తారు. కాకపోతే, భారత దేశంలో ఆవిర్భవించిన హిందు, జైన, బౌద్ధ మతాలపై "అతిరాత్రం" ప్రభావం ఏ మేరకు పడిందోనన్న అంశాన్ని అంచనా వేయడం అంత తేలికైన విషయం కాదు. "అతిరాత్రం" నిర్వహణ శారీరక శ్రమతో కూడుకున్నది. క్రీస్తు పూర్వం పదవ శతాబ్దిలో మొదలైన ఈ ఆచారం, ఆరవ శతాబ్దం వరకూ కొనసాగింది. ఆ తర్వాత కాలంలో, ఎందరో-ఎన్ని విధాలుగానో దానిని పునరుద్ధరించే ప్రయత్నాలు చేశారు. గుప్తుల, చోళుల కాలంలో పునరుద్ధరణకు నోచుకున్న అతిరాత్రాన్ని, పదకొండవ శతాబ్దం వచ్చే సరి కల్లా, కేరళ నంబూద్రీ బ్రాహ్మణులు సజీవంగా కొనసాగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అదే ప్రక్రియ నేటికీ సాగుతోంది.

అనేక నెలల ముందస్తు సన్నాహాలు తప్పనిసరిగా అవసరమయ్యే "అతిరాత్రం" అగ్నిహోత్ర విన్యాసాన్ని నిర్వాహకులు తప్ప ఇతరులకు వీక్షించే అవకాశం వుండేది కాదు ఒకప్పుడు. అయితే, ముప్పై ఐదు సంవత్సరాల క్రితం, 1975 లో కేరళ రాష్ట్రం పంజాల్ గ్రామంలో, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఇండాలజిస్ట్ డాక్టర్ ఫ్రిట్స్ స్టాల్, రాబర్ట్ గార్డినర్ ప్రేరణతో, నంబూద్రీ బ్రాహ్మణులు పన్నెండు రోజుల పాటు నిర్వహించిన "అతిరాత్రం" కార్యక్రమాన్ని బయటి వారు చూసే అవకాశం కూడా లభించింది. జైమినీ సామ వేదంలో దిట్ట, ఘనాపాఠి బ్రహ్మ శ్రీ ముట్టతుకట్టు మమ్మున్ను ఇట్టి రవి, ఋగ్వేదం-యజుర్వేదం ఆచారాలను-సాంప్రదాయాలను ఔపోసన పట్టిన బ్రహ్మ శ్రీ చెరు ముక్కు వైదికన్ వల్లభన్ సోమయాజిపాడ్ అనే వైదిక పండితులిద్దరు 1975 లో జరిగిన అతిరాత్రాన్ని నిరాటంకంగా జరిపించారు. స్టాల్, గార్డినర్ లకు అనేక మంది అంతర్జాతీయ సంస్థలు-వ్యక్తులు సహకరించారప్పుడు. తత్వ శాస్త్రంలో ఆచార్యుడుగా ఇప్పటికీ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న స్టాల్, హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి లభించిన నిధులతో, "అతిరాత్రం" ఆచారానికి సంబంధించిన అనేక విషయాలను యధాతధంగా రికార్డు చేసి, భావితరాల వారికొరకు భద్రపరిచారు. ఒక భారతీయుడు చేయాల్సిన పనిని విదేశీయుడు చేయడమంటే, నిజంగా, ఆయనను అభినందించాల్సిందే.

అతిరాత్రం ఆచారం ఒక రకమైన అద్భుత విన్యాసం. ఆ విన్యాసంలో ప్రధాన భాగమైన అగ్ని హోమం ప్రక్రియను నిర్వహించడానికి 17 మంది ఋత్విక్కులు (పూజారులు) వుంటారు. పన్నెండు రోజులపాటు జరిగే కార్యక్రమంలో మొదటి రోజున హోమం చేసే "యజమాని", ప్రత్యేకంగా తయారుచేసిన మూడు కుండలలో, పవిత్రమైన అగ్నిని నింపుకుని యజ్ఞ వాటికలో ప్రవేశిస్తాడు. "బంకమట్టి" తో తయారు చేసిన ప్రత్యేకమైన కుండలవి. నామ మాత్రంగా-లాంఛన ప్రాయంగా, వాయుదేవుడికి జంతు బలి జరిపించుతారు. ఐదుగురు ప్రధాన పూజారుల ఎంపిక జరుగుతుందప్పుడు. ఆ తర్వాత రాపిడి ద్వారా నిప్పు వెలిగించుతారు. యజమాని శిరస్సుకు తలపాగా లాంటిది కట్టుతారు. ఇక ఆ క్షణం నుంచీ, యజమానిని ప్రత్యేక రక్షణలో వుంచుతారు ఆ పన్నెండు రోజులు. పిడికిలి బిగించిన చేతులతో, మౌనంగా ఆ పన్నెండు రోజులు యజమాని యజ్ఞాన్ని చేయాలి. కాకపోతే, ఆయన చేయాల్సిన మంత్రోచ్ఛారణలకు మౌనం వీడవచ్చు. అలానే, స్నానం చేసేటప్పుడు పిడికిలి సడలించవచ్చు. అగ్నితో నింపిన ప్రధాన కుండను తీసుకుని, మూడడుగులు నడవాలి యజమాని ఆ తర్వాత.

వాల్మీకి రామాయణం బాల కాండలో, 14 వ సర్గలో, అశ్వమేధ యాగం ప్రస్తావనలో అతిరాత్రం గురించి పేర్కొనడం జరిగింది. అశ్వమేధయాగంలో భాగంగా, చివరి రోజైన మూడో దినాన, "అతిరాత్రం" ప్రక్రియ వుంటుంది. కేరళలో జరగుతున్న దానికి, దీనికి కొంత తేడా వున్నప్పటికీ, రెండింటి భావం ఒక్కటే. ప్రక్రియ కూడా ఒకే తరహాలో వుంది. రెండింటి లోను, 17 మంది ఋత్విక్కులే వుంటారు.

రెండో రోజున బంక మట్టితో మరొక ప్రత్యేకమైన కుండను తయారు చేస్తారు. మూడో రోజున నైవేద్యం కొరకు ప్రత్యేకంగా ఒక స్తంభాన్ని తయారు చేస్తారు. "మహావేది" గా పిలువబడే యజ్ఞ వాటిక కొలతల ప్రకారం, లాంఛనప్రాయంగా బలి ఇవ్వడానికి, పక్షి ఆకారంలో బలిపీఠం నమూనాను తయారు చేస్తారు అదే రోజున. నాలుగో రోజున దేవతల రాజైన ఇంద్రుడిని యాగానికి ఆహ్వానించే కార్యక్రమం జరుగుతుంది. మహావేది వున్న ప్రదేశాన్ని నాగలితో దున్ని, అందులో విత్తనాలు చల్లి, మొదటి రోజు నాటి ప్రధాన కుండను భూమిలో పాతిపెట్టు తారు. పక్షి ఆకారంలో బలిపీఠం నిర్మాణం ఆరంభమవుతుంది అదే రోజున. ఐదు, ఆరు, ఏడు దినాల్లో, బలి పీఠం నిర్మాణాన్ని అంచెలంచలుగా కొనసాగిస్తూ, రాత్రివేళల అగ్నిహోత్రం పనిని యథావిధిగా నిర్వహించడం జరుగుతుంది. ఎనిమిదో రోజున, బలి పీఠంలో మరొక అంతస్తు వేయడంతో పాటు, దానికి ఉపయోగించిన ఇటుకలను గోవులుగా మారాలని యజమాని ప్రార్థన చేస్తాడు. రుద్ర పూజ కూడా జరిపించుతారు పూజారులు. అంతవరకూ ఉపయోగించిన పనిముట్లను, పూర్తి చేయబడిన బలి పీఠంలో, మానవ ఆకారంలో పేర్చుతారు తొమ్మిదో రోజున. ఆ ప్రదేశంలో మళ్లీ అగ్నిని వుంచడం జరుగుతుంది. మంత్రోచ్ఛారణల మధ్య అగ్ని హోమంలో నెయ్యి పోసుకుంటూ అతిరాత్రం కొనసాగుతుంది. లాంఛనప్రాయంగా-నామ మాత్రంగా జంతు బలి ఇవ్వడం ఆ తర్వాత ప్రక్రియ.

చివరి మూడు రోజులు రాత్రింబగళ్ళు యాగం కొనసాగుతూనే వుంటుంది. బలిపీఠం చుట్టూ, పదవ రోజున, యజమాని కొందరు పూజారులతో కలిసి, పాములలాగా తిరగాలి. నామ మాత్రంగా (వాస్తవంగా కాదు) పదకొండు జంతువులను బలి ఇవ్వడం జరుగుతుంది. పన్నెండో రోజున యజమాని భార్యా సమేతంగా "అవభ్రత స్నానం" చేసి, మేక బలిని (వాస్తవంగా కాదు) ఇచ్చి, ఇంటికి తిరిగొచ్చి మూడు చోట్ల అగ్నిని పేర్చి, ఆ అగ్నిహోత్రాన్ని జీవితాంతం చేస్తూ పోతుండాలి. పన్నెండు రోజులు ఒకే రకమైన కర్మ కాండలుండవు. అగ్నిలో ప్రధానంగా సోమ రసం ఉపయోగించుతారు. వైదిక గ్రంధాల్లో చెప్పిన ప్రకారం రెండు రకాల కట్టెలను రాపిడి చేసి నిప్పు పుట్టిస్తారు.

భారత దేశానికి-విదేశాలకు చెందిన కొందరు ప్రముఖులు ఒక బృందంగా ఏర్పాటై, "వార్తాతె ట్రస్టు" పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి, అతిరాత్రం ఆచారాన్ని పునరుద్ధరించి, ఆ అద్భుత అపురూపమైన సనాతన సాంప్రదాయిక విన్యాసాన్ని మరో రెండు నెలలలో ప్రదర్శించబోతున్నారు. కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాలో వున్న ఒట్టపాలెం కేంద్రంగా ట్రస్టు పనిచేస్తుంది. ఏప్రిల్ 4-15, 2011 మధ్య నిర్వహించనున్న అతిరాత్రం రిహార్సల్లు మొదలయ్యాయి. పంజాల్ గ్రామంలో జరుగనున్న ఈ కార్యక్రమానికి, ఈ సారి యజమానిగా పుటిల్లట్టు రామానజన్ సోమయాజి వుండనున్నారు. నాలుగువేల ఏళ్ల క్రితం ఎలా జరిగిందో, అచ్చు అలానే ఏప్రిల్ లో జరపడానికి అన్ని జాగ్రత్తలు ట్రస్టు తీసుకుంటున్నది. పనిముట్లన్నీ ఆ ప్రాంతంలో లభ్యమయ్యే కట్టెతోనే తయారు కానున్నాయి. ఏ రకమైన లోహ సామగ్రిని ఉపయోంచడ జరగదు. బలి పీఠానికి వాడే ఇటుకలు కూడా కట్టెతో తయారుచేసినవే. అవన్నీ అక్కడే తయారవుతున్నాయి. అతిరాత్రంలో పన్నెండు రోజులు కూచోగల సామర్థ్యం యజమానికి కలగడానికి చర్యలు చేపట్టారు. పుణ్య యజ్ఞంలో అతి భారమైన యజుర్వేద పఠన బాధ్యతను కాప్రా కుటుంబీకులు తమ భుజాలపై మోపుకున్నారు. ఋగ్వేదం నిర్వహణను నారాస్ కుటుంబీకులు, సామవేదాన్ని తోట్టం కుటుంబీకులు చేపట్టుతున్నారు.

శుఖాపురం దేవాలయ అధికారుల అనుమతితో కార్యక్రమం ఏప్రిల్ నెలలో నిర్విఘ్నంగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. భౌగోళిక-వాస్తు పరమైన సిద్ధాంతాల ప్రాతిపదికగా యజ్ఞ వాటికను ఏర్పాటు చేస్తున్నారు. అన్ని రకాల యాగాలకు-యజ్ఞాలకు కేంద్ర స్థానమైన పంజాల్ గ్రామం అద్భుత విన్యాసానికి ముస్తాబవుతోంది. అంతా బాగానే వుంది... సరిగ్గా నాలుగువేల సంవత్సరాల క్రితం జరిగిన విధంగానే...ఏప్రిల్ నెలలో కూడా...అచ్చు.. అలానే "అతిరాత్రం" జరిగిందని ఇదమిద్ధంగా చెప్పగల ధైర్యం ఎవరికన్నా వుందా? అయితే జరిగిందనడానికి... శాస్త్ర ప్రకారం కొన్ని దాఖలాలు వున్నాయి. యజ్ఞం పూర్తవగానే, యజ్ఞ శాలపై ఆకాశంలో ఒకే ఒక గద్ద ఎగురుతూ కనిపించితే, ఆ క్షణంలో ఆకాశం మేఘావృతమై వర్షం కురిస్తే, దేవతలు సంతోషించారనడానికి నిదర్శనం అని అతిరాత్రం గట్టిగా విశ్వసించే ఒక నంబూద్రీ బ్రాహ్మణుడు అంటున్నారు. వాస్తవానికి 1975 లో అతిరాత్రం పూర్తవగానే కుంభ వృష్టి జరిగిందని ఆయన అంటున్నారు.

అతిరాత్రం గురించి రాస్తూ ప్రొఫెసర్ స్టాల్ అన్న వాక్యాలు ఈ సందర్భంగా గుర్తుచేసుకోవడం మంచిది. "దేవాలయాలు, చర్చిలు, ఆకాశ హర్మ్యాలు నిర్మించడం, కాలం గడిచే కొద్దీ అవన్నీ శిథిలం కావడం తెలిసిందే. భాషలు-మతాలు పుట్టాయి, గిట్టాయి. ప్రపంచంలో అనేకానేక యుద్ధాలు జరిగాయి. అవన్నీ తాత్కాలికమే. వేదాలు, వైదిక సాంప్రదాయాలు-ఆచార వ్యవహారాలు, అనాదిగా మౌఖికంగా ఒకరి నుంచి మరొకరికి-గురువు నుంచి శిష్యుడికి-తండ్రి నుంచి కుమారుడికి, శాశ్వతంగా ప్రచారం-ప్రసారం అవుతున్నాయి. పదార్థం-భౌతిక శరీరాలకున్న హద్దులకు అతీతంగా మానవ స్ఫూర్తి సాధించిన విజయం అమోఘం!" 77 సంవత్సరాల వయసున్న స్టాల్, తన సహచర బృందంతో సహా, ఏప్రిల్ నెలలో పంజాల్ లో నిర్వహించనున్న అతిరాత్రం అద్భుతాన్ని వీక్షించడానికి రాబోతున్నారు.

8 comments:

  1. ఒక అద్భుత విన్యాసం, ఒక వైదిక యజ్ఞం అయిన అతిరాత్రం గురించి చాలా చక్కటి విషయాలు అందించారు. ధన్యవాదాలు

    ReplyDelete
  2. "శంకరుడు తెలుగువాడు ఐనప్పటికీ వల్లభుడు, నింబార్కుడు, త్యాగరాజు, మొదలైన అనేకమంది మహాపురుషుల లాగే ఆయనకు తెలుగు కంటే ఇతర ప్రాంతాల్లోనే ఆదరణ, ప్రసిద్ధి కలిగిందని చెప్పడంలో సందేహం లేదు."

    Excellent information. Please provide the official web site and add references or Notes section to your posts. That will be useful to the readers.

    I will Google and try to find it.

    ReplyDelete
  3. చాలా విలువైన సమాచారాన్నిచ్చారు . మనం కూడా వెళ్ళి చూడటానికి అవకాశం ఉంటుందా ?

    ReplyDelete
  4. For further information please visit:
    http://www.athirathram2011.com
    Jwala

    ReplyDelete
  5. Vanam garu, I always read your musings... your subject line for this mail should read as "Read this when you have time" not if.

    Very informative article and very good indeed.

    I would like to contest couple of your observations. Specially periods you have mentioned.

    First you said. Sankara is a Namboodri - Brahmana - which is correct. Then you said Kadamba Dynasty ruler Mayura Sarma brought Andhra Brahmanas from East Godavari to Kerala and who later became Namboodris. Which may be true, but Kadamba Dynasty had started with Mayura Sarma in 345 AD (as per Wiki) and Mayura Sarma ruled it from Banavasi which is in present day Uttara Kannada and not a ruler of Kerala and Mayura Sarma was a native of Talagunda which is now in Shimoga District of Karnataka - I could not find a reference to he hailing from East Godavari and that he was a telugu.

    Second, Mayura Saram time period was from 345 to 365 AD and Kadamba Dynasty ended around 525 AD. So by saying that Namboodris were Telugus brought over by Mayura Sarma - you have placed the origins of Namboodris to atleast 350 AD. But per Wikipedia the origins of Namboodri is even more ancient going back to Parasurama. But most importantly by fixing this you have also fixed and agreed to the date of Adi Sankara as that of 8th Century AD. But I personally feel and agree with Kanchi Sankarapeetam that Adi Sankara is few hundred year before Christ.

    And thirdly, you said this telugu origin of Namboodri is also mentioned in Brahma Vaivartata Puranam. That puranam is said to have been recited by Suka maharshi (Son of Veda Vyasa) in the land mass of present day Bengal.

    So, would you please clarify what I consider to be inconsistencies in the dates in your article.

    But, these inconsistencies in no way lessens the thoroughness of your article. Yes, Atiratram is mentioned in Valmiki Ramayanam as part of Aswamedha Yagnam. But the third day of the three day ritual is called Atiratram in Ramayanam as opposed to the 12 day present day Atiratram.

    Thanks sir, and I love reading your musings and waiting for your next visit to Houston.

    Thanks
    Sudesh

    ReplyDelete
  6. Dear Sudesh Garu,
    Let me thank you for evincing keen interest on this topic and offering your comments.
    I first came to know about this "World's oldest surviving 4000-year old fascinating Vedic ritual, Athirathram” through a journalist friend working in New York City. He quoted Mrs Surekha Pillai-a Delhi Based Journalist whom I contacted and developed my story line.
    While doing so, I thought whether I could bring in to that couple of new things and connected to Telugus and Ramayana. As far as Telugus is concerned I started searching for origin of Namboodiri Brahmins. There are many evidences and different evidences about them and what all you mentioned is "undisputed". The one I liked and thought to insert in my article is taken from an article on Shankaracharya appeared in Andhra Prabha which goes like.....

    ...."శంకరాచార్యుడు స్థాపించిన మఠాలలో దొరికే చారిత్రక ఆధారాలు శంకరుని సమకాలీనులైన ఇతర ప్రసిద్ధుల చరిత్రలు పోల్చితే ఆయన క్రీ.పూ. 5 వ శతాబ్ది వాడని చేస్తాయి. ఆయన నంబూద్రి బ్రహ్మణ శాఖకు చెందినవాడు. నంబూద్రీలు కేరళ బ్రాహ్మణులు వీరి గురించి ఆసక్తికరమైన సమాచారం ఉంది. శాతవాహనుల తరువాత ప్రసిద్ధి చెందిన రాజవంశం కాదంబ వంశం. కాదంబులలో ప్రసిద్ధుడైన రాజు మయూర శర్మ. ఈయన మయూర శర్మ కేరళ ప్రాంతాన్ని పాలించాడు. ఆయన తన స్వస్థలమైన కోనసీమ (తూర్పు గోదావరి) నుండి ఆంధ్ర బ్రాహ్మణ కుటుంబాలను కేరళకు తీసుకు వెళ్ళాడుట ఆ కుటుంబాలవారే తరువాత నంబూద్రీ బ్రాహ్మణులుగా పేరు పొందారు. ఈ విషయం బ్రహ్మవైవర్త పురాణంలోను, మద్రాసు ప్రభుత్వం ప్రకటించిన తెలుగు అనే గ్రంథం 5, 7 సంపుటాలలో లభిస్తుంది. శంకరుడు తెలుగువాడు అవడం మన అందరికీ గర్వకారణమే ఐనప్పటికీ వల్లభుడు నింబార్కుడు త్యాగరాజు మొదలైన అనేకమంది మహాపురుషులలాగే ఆయనకు తెలుగువారి కంటే ఇతర ప్రాంతాల్లోనే ఆదరణ, ప్రసిద్ధి కలిగిందని చెప్పడంలో సందేహం లేదు"....
    Full Text is available in the following link:

    http://www.andhraprabhaonline.com/life/article-111026

    Regarding Ramayana-Bala Kanda I my self remember about Ashwamedha Yagam and Atiratram. I only thought of linking and bringing similarities like the number of Priests and the name of Ritual.
    I have no intention to defend to say that all that I mentioned is totally correct...but... taken from one source.
    Anyway the intention of my article is to Highlight the Athirathram Ritual-the oldest vaidic one and considered to be one of the most complex and greatest rituals.
    Regards,
    Jwala

    ReplyDelete