Wednesday, February 16, 2011

ముబారక్ నిష్క్రమణం-నియంతృత్వంపై ప్రజాస్వామ్యం అఖండ విజయం: వనం జ్వాలా నరసింహారావు


నియంతృత్వానికి వ్యతిరేకంగా, ఈజిప్ట్ ప్రజల-అందునా యువకుల, పద్దెనిమిది రోజుల సుదీర్ఘ ప్రజాస్వామ్య పోరాటం, ఆ దేశాధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేసింది. ముప్పై సంవత్సరాల హోస్నీ ముబారక్ పాలనకు చరమ గీతం పాడిన దేశ పౌరులకు, వారి చిరకాల వాంఛైన ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటు సాధ్యపడే విషయమా, లేక, మరికొంత కాలం సైనిక పాలనే కొనసాగనున్నదా అనేది ఇప్పట్లో చెప్పడం కష్టమే. తిరుగుబాటు అనంతరం పాలనను చేపట్టిన ఈజిప్ట్ మిలిటరీ నాయకులు, త్వరలోనే రాజ్యాంగాన్ని సవరించి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపించుతామని, ప్రజల న్యాయమైన హక్కులకు భంగం వాటిల్లకుండా చూస్తామని, ముబారక్ కాలం నుండి అమల్లో వున్న "అత్యవసర చట్టాన్ని" తొలగించుతామని బహిరంగంగా ప్రకటించారు. పౌర పాలన స్థాపనకు శ్రీకారం చుట్టి, ప్రజలెన్నుకున్న నాయకుల కింద పనిచేసేందుకు సైన్యం అంగీకరించుతుందా, లేక, మరో మిలిటరీ నియంత పాలనకు దోహదపడుతుందా తెలియదు.

ఏళ్ల తరబడి బ్రిటీష్ వలస రాజ్యంగా వున్న ఈజిప్ట్, 1952 లో జనరల్ మొహమ్మద్ నెగ్యుబ్ నాయకత్వంలో రాచరిక పాలన నుండి విముక్తి పొందడానికి ముందు, కొంత కాలం పాక్షికంగా-నామ మాత్రపు పార్లమెంటరీ తరహా ప్రాతినిధ్య పాలనలో కొనసాగింది. అలనాటి విప్లవం అనంతరం, జూన్ 18, 1953 న దేశాధ్యక్ష పదవిని చేపట్టిన నెగ్యుబ్ ఎక్కువకాలం పదవిలో కొనసాగలేదు. 1952 విప్లవ అసలు సిసలు వ్యూహకర్త-నాయకుడు గమాల్‌ అబ్దుల్‌ నాజర్‌, 1954 లో నెగ్యుబ్ ను గద్దె దింపి, జూన్ 18, 1956 నాటికల్లా, దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చినట్లు ప్రకటించాడు. ఇక నాటి నుంచి, మొన్న ముబారక్ దిగిపోయేంతవరకు, ముగ్గురు విభిన్న నాయకుల పాలనలో, ఆటుపోట్ల మధ్య, ఒడిదుడుకుల మధ్య, ఆరోహణ-అవరోహణల మధ్య ఈజిప్ట్ ప్రస్థానం సాగింది. భవిష్యత్ ఇదమిద్ధంగా ఇలా వుండబోతుంది అని చెప్పలేని పరిస్థితికి వచ్చిందిప్పుడు.

ఈజిప్ట్ ప్రజలపైన, సంస్కృతీ-సాంప్రదాయాలపైన, రాజకీయాలపైన, యావత్ అరబ్ ప్రపంచంపైన, గమాల్‌ అబ్దుల్‌ నాజర్‌ ప్రభావం, చెరగని ముద్ర వలె, ఆయన మరణించి నలభై సంవత్సరాలైనప్పటికీ, కొనసాగుతోంది. అధికారం చేపట్టిన అనతి కాలంలోనే, పౌర సంస్థలను నియంత్రించడంతో పాటు, రాజకీయ పార్టీలన్నింటినీ నిషేధించి, సామ్యవాదానికి అనుకూలమని చెప్పుకునే ఏక పార్టీని నెలకొల్పాడు నాజర్. నాజర్ వ్యక్తిగత-ఏక పక్ష పాలనకు ఎదురు చెప్పలేని స్థితికి ఈజిప్ట్ పౌర వ్యవస్థ లోనైంది. అయినా, దేశంలోపలా-వెలుపలా నాజర్ ప్రజాదరణ గల నాయకుడుగానే ఎదగ సాగాడు. అంతర్జాతీయంగా ఖ్యాతి పొంద సాగాడు. ప్రపంచ వ్యాప్తంగా, ఆయనకు లభించిన గౌరవానికి ప్రధానమైన నిదర్శనంగా, ఏ రాజ్యకూటమికీ చెందని అలీనోద్యమ ఆవిర్భావానికి నాజర్ నాయకుడుగా గుర్తింపు తెచ్చుకోవడమే. సామ్రాజ్యవాద వ్యతిరేకతకు ఈజిప్టును కేంద్ర బిందువుగా నాజర్ చేయగలిగాడనడానికి ఉదాహరణగా, సూయజ్‌ కాలువ జాతీయం చేయడం చెప్పుకోవాలి. భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, యుగోస్లేవియా ప్రధమ అధ్యక్షుడు మార్షల్ టి టో, ఇండొనేషియా మొదటి అధ్యక్షుడు సుకర్ణో లతో సమానంగా, అలీనోద్యమ నిర్మాతగా నాజర్ ప్రసిద్ధికెక్కాడు. అగ్రరాజ్యాల మధ్య రగులుతున్న "ప్రచ్ఛన్న యుద్ధం" లో తలదూర్చకుండా, మధ్యేమార్గంలో పయనించడానికి అలీన దేశాలను సిద్ధపర్చిన నలుగురు ప్రముఖుల్లో నాజర్ ఒకరు. అలనాటి ప్రపంచ నాయకులైన చౌ-ఎన్-లై, మావో, ఎన్ కృమా, కెన్నెత్ కవుందా, జాన్ కెన్నెడీ, లిండన్ జాన్సన్, ఇందిరా గాంధీ, ఛార్లెస్ డిగాలే, నికితా కృశ్చేవ్, అలెక్స్ కొసిగిన్ లాంటి ప్రపంచ నాయకుల సరసన, వారితో సమానంగా నాజర్ ను గుర్తించింది ప్రపంచం.

అప్పట్లో నెలకొన్న అంతర్జాతీయ స్థితిగతులను కూలంకషంగా ఆకళింపు చేసుకున్న నాజర్, వాటిని, ప్రత్యేకించి అరబ్ ప్రపంచానికి, గాజా ప్రాంతంపై ఇజ్రాయిల్ దాడులకు అన్వయించుకుని, తనకు అనుకూలంగా మలచుకుంటూ, అరబ్బీల తిరుగులేని నాయకుడుగా ఎదగ సాగాడు. ఒక వైపు అలీనోద్యమం బోధిస్తూనే, తన దేశ రక్షణ విషయంలో, ఆయుధాలను సమకూర్చుకోవడానికి, పాశ్చాత్య అగ్రరాజ్యంవైపు పోకుండా, కమ్యూనిస్టుల సహాయంపై దృష్టి సారించాడు. మరో వైపు, తనకు అనుకూలమైన నూతన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని, ఏక పార్టీ అయిన "నేషనల్ యూనియన్" ఏకైక అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగి, ఈజిప్ట్ అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. ఆయన దేశీయ-విదేశాంగ విధానాలు, నాజర్ ను అమెరికన్లకు దూరం చేశాయి. నైలు నదిపై కడుతున్న వంతెన నిర్మాణానికి అమెరికా-బ్రిటన్ల ఆర్థిక సహాయం ఆగిపోవడంతో, ప్రతీకారంతో, సూయజ్‌ కాలువను జాతీయం చేసి, అరబ్బీల "హీరో" గా ఖ్యాతికెక్కాడు. ఇదిలా వుండగా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ దేశాల మధ్య కుదిరిన రహస్య ఒప్పందం నేపధ్యంలో, అంతవరకు నాజర్ కు అనుకూలంగా లేని అమెరికా అధ్యక్షుడు ఐసన్ హూవర్, అక్టోబర్ 1956 లో ఈజిప్ట్ పై ఇజ్రాయెల్ చేసిన దాడిని బహిరంగంగా ఖండించాడు. తాత్కాలికంగా యుద్ధం ఆగిపోయింది. మూసేసిన సూయజ్‌ కాలువ తిరిగి తెరిచింది ఈజిప్ట్ ప్రభుత్వం. అంతర్జాతీయంగా నాజర్ పరపతి పెరిగింది.

ఆయుధాల కొరకు కమ్యూనిస్టు దేశాలను ఆశ్రయించినప్పటికీ, ఎప్పుడైతే, సిరియా దేశం కమ్యూనిస్ట్ ప్రాబల్యంలోకి రాబోతున్నదని భావించాడో, తక్షణమే, "యునైటెడ్ అరబ్ రిపబ్లిక్" ను స్థాపించి, సిరియాను ఈజిప్టులో విలీనం చేసి, ఫిబ్రవరి 1958 లో, యు.ఏ.ఆర్ అధ్యక్షుడుగా ప్రకటించుకున్నాడు నాజర్. అరబ్ ప్రపంచంలో నాజర్ కమ్యూనిజానికి వ్యతిరేకంగా వ్యవహరించేవాడు. ఆ పార్టీ కార్యకలాపాలను నిషేధించాడు కూడా. పార్టీపై నిషేధాన్ని ఎత్తి వేయాలని కృశ్చేవ్ చేసిన అభ్యర్థనను మన్నించని నాజర్, ఆ విషయం తమ అంతర్గత వ్యవహారం అంటూ కొట్టి పారేశాడు. చివరకు, సెప్టెంబర్ 1961లో, సిరియన్ సైన్యం స్వతంత్రం ప్రకటించుకోవడంతో, యు.ఏ.ఆర్ ఉనికి కోల్పోయింది. ఆ మనస్థాపంతో, దానికి ప్రధాన బాధ్యత వహించిన నాజర్ ఆరోగ్యం క్షీణించసాగింది. సిరియన్ పరిస్థితులు ఈజిప్ట్ లో తలఎత్తకుండా జాగ్రత్త పడ్డాడు నాజర్. సామ్యవాద ఎజెండాతో ప్రజలను ఆకర్షించుకోవాలనుకున్నాడు. "నేషనల్ యూనియన్" పార్టీ పేరు మార్చి, "అరబ్ సోషలిస్ట్ యూనియన్" అని పిలవ సాగాడు. అంతర్గతంగా నెలకొన్న అసంతృప్తిని అణచేందుకు, తనను తానే "సాయుధ బలగాల ప్రధాన అధికారి" గా ప్రకటించుకున్నాడు. రాజ్యాంగాన్నితిరగ రాశాడు. ప్రజోపయోగమైన విధానాలను ప్రకటించాడు. సహ-విద్య లాంటి సంస్కరణలను అమలు చేశాడు. విడాకుల చట్టాన్ని సవరించాడు.

ఇజ్రాయెల్ పై పోరు కొనసాగించడానికి వీలుగా, "అరబ్ లీగ్ శిఖరాగ్ర సభ" ను నిర్వహించి, ఉమ్మడి అరబ్ కమాండును ఏర్పాటు చేశాడు నాజర్. పాలస్తీనా విమోచన కొరకు పోరాటం చేస్తున్న వివిధ ముఠాలను ఐక్యం చేసి, ఒకే గొడుగు కిందకు తేవడానికి 1964, "పాలస్తీనా విమోచన సంస్థ" ను నెలకొల్పిన నాజర్, అదే సంవత్సరం అలీన ఉద్యమం అధ్యక్షుడుగా ఎన్నికైనాడు. ఏడాది తర్వాత, మరో ఐదేళ్ల పాటు కొనసాగేందుకు వీలుగా, ఈజిప్ట్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యాడు. 1967 ఈజిప్ట్ కు కష్టాలు మొదలయ్యాయి. ఈజిప్ట్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు ఆరంభించి, కేవల మూడు రోజుల్లోనే, సినాయ్-గాజా భాగాలను గెలుచుకుంది. ఓటమిని బహిరంగంగా ఒప్పుకున్నాడు నాజర్. జోర్డాన్ లోని వెస్ట్ బాంక్, సిరియాలోని గోలాన్ హైట్స్ కూడా ఆక్రమించుకుంది ఇజ్రాయెల్. జూన్ 10, 1967 న నాజర్ చేసిన రాజీనామాను, ఒక్క గొంతుతో, యావత్ ఈజిప్ట్ ప్రజానీకం తిరస్కరించింది. "గమాల్..మేమంతా నీ సైనికులం" అని ఎలుగెత్తి చాటుకుంటూ, వీధుల్లోకి వచ్చిన ఈజిప్ట్ ప్రజల ఆదరాభిమానాలకు స్పందించిన నాజర్, రాజీనామాను ఉపసంహరించుకున్నాడు. సోవియట్ యూనియన్ నాజర్ కు అండగా నిలిచింది. ఇజ్రాయెల్ తో దౌత్య సంబంధాలను తెంచుకుంది. అమెరికాతో నాజర్ అదే పని చేశాడు. ఈజిప్ట్ పునరుద్ధరణలో భాగంగా, నాజర్ మరింత నియంతగా మారాడు. ఆక్రమిత ఈజిప్ట్ ప్రాంతాల నుండి ఇజ్రాయెల్ వైదొలగాలని ఐక్య రాజ్య సమితి తీర్మానం చేసింది. దరిమిలా ఇజ్రాయెల్ పై యుద్ధానికి నాయకత్వ బాధ్యతను పాలస్తీనా విమోచన సంస్థ అధ్యక్షుడు యాసర్ అరాఫత్ కు అప్పగించాడు. ఇంతలో, జోర్డాన్ రాజు హుస్సేన్ కు, యాసర్ అరాఫత్ కు మధ్య తల ఎత్తిన విభేదాలను పరిష్కరించడానికి, సెప్టెంబర్ 1970 లో అరబ్ లీగ్ శిఖరాగ్ర సభను ఏర్పాటు చేశాడు. సమావేశం రాజీ మార్గంలో ముగిసింది.

సెప్టెంబర్ 28, 1970 న శిఖరాగ్ర సభ ముగిసిన కొద్ది సేపటికే, తీవ్రమైన గుండె పోటు రావడంతో నాజర్ మరణించాడు. అక్టోబర్ మొదటి తేదీన జరిగినా నాజర్ అంతిమ యాత్ర చరిత్రలో మరపురాని సంఘటనగా పేర్కొనవచ్చు. పది కిలో మీటర్ల అంతిమ యాత్రలో, నాజర్ శవ పేటిక, అందులో పాల్గొన్న ఏబై లక్షల మంది ప్రజల భుజాల మీదుగా కదిలిందట. అరబ్ దేశాధి నేతలందరితో పాటు, సోవియట్ ప్రధాని కొసిగిన్, ఇతోపియా రాజు సెలాస్సీ పాల్గొన్న వారిలో వున్నారు.

1952 విప్లవం రోజుల నాటి నాజర్ సహచరుడు, ఆయనకు అత్యంత నమ్మకస్తుడైన అన్వర్ సాదత్, ఈజిప్ట్ మూడవ అధ్యక్షుడయ్యాడు. ఆయన పదకొండేళ్ల పాలన, ఏక పార్టీ స్థానంలో, బహుళ పార్టీల ఏర్పాటుకు దోహద పడింది. 1973 లో ఇజ్రాయెల్ పై జరిగిన యుద్ధంలో, ఈజిప్ట్ సాధించిన విజయం, దరిమిలా ఇరు దేశాల మధ్య కుదిరిన "ఈజిప్ట్-ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం", సాదత్ ను ఆయన దేశంలో "హీరో" చేయడమే కాకుండా, ఆయనకు నోబెల్ శాంతి బహుమానం రావడానికి కూడా కారణమైంది. కాకపోతే, అదే కారణాన, అరబ్ ప్రపంచంలో ఆయన కొంత అనాదరణకు కూడా గురయ్యాడు. అరబ్ లీగ్ లో సభ్యత్వం కోల్పోయింది ఈజిప్ట్. శాంతి ఒప్పందం పూర్వ రంగంలో, నవంబర్ 19, 1977 న ఇజ్రాయెల్ సందర్శించిన అన్వర్ సాదత్, ఆ దేశ ప్రధాని మెనాకెమ్ బెగిన్ ను కలవడం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికరమైన పరిణామంగా భావించారు. అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ సమక్షంలో, వాషింగ్టన్ లో, మార్చ్ 26, 1979 న కుదిరిన శాంతి ఒప్పందం, పలువురు అరబ్బీలకు నచ్చలేదు. అరబ్ లీగ్ ప్రధాన కార్యాలయాన్ని, కైరో నుంచి, టునిసియా రాజధాని టునిస్ కు మార్చారు. "సంస్కరణ విప్లవం" పేరుతో ఆయన చేపట్టిన కార్యక్రమంలో భాగంగా, పలువురు నాజర్ మద్దతు దారులు, రాజకీయ నాయకులు జైళ్లపాలయ్యారు. అక్టోబర్ 6, 1981 న హత్యకు గురైన సాదత్ స్థానంలో, ఆయన ప్రభుత్వంలో ఉపాధ్యక్షుడుగా పనిచేస్తున్న హోస్నీ ముబారక్ ఎన్నికయ్యారు. 28 సంవత్సరాలు తిరుగులేని నాయకుడుగా పెత్తనం సాగించి, ప్రజల ఆగ్రహానికి గురై, దేశం వదలి పారిపోయాడు.

ఇజ్రాయెల్ కు ముబారక్ ఇచ్చిన మద్దతు వల్ల, ఆయనకు, అమెరికా అండ దండలు పుష్కలంగా లభించాయి. ఆయన పాలనలో, ముబారక్ ను విమర్శించిన ప్రతివారూ, జైలు పాలయ్యారు. వాక్ స్వాతంత్ర్యం అనేది లేనే లేదు. అమెరికా ఆలోచనలు అనుగుణంగా తీవ్ర వాదాన్ని ఎదుర్కోవడంలో తోడ్పడ్డాడు. దేశాన్ని అస్థిరం కాకుండా చూడగలిగాడు కాని, దాని కొరకు, ప్రజలు చెల్లించిన మూల్యం విలువ కట్ట లేనిది. సాదత్ హత్యకు గురైన అనంతరం ముబారక్ విధించిన అత్యయిక పరిస్థితి నిరవధికంగా కొనసాగుతూ వచ్చింది. అరబ్ లీగ్ లో తిరిగి సభ్యత్వం పొంది, ప్రధాన కార్యాలయాన్ని కైరోకు మార్పించ గలిగాడు.

ప్రజలు ఆకాంక్షించే ప్రజాస్వామ్యాన్ని ఇవ్వని ముబారక్ పై ప్రజలు తిరుగుబాటు చేశారు. ఆయన్నైతే తొలగించగలిగారు కాని, ప్రజాస్వామ్యాన్ని ఇంతవరకూ పునరుద్ధరించుకోలేక పోయారు. అది జరిగిన నాడే, వారి తిరుగుబాటుకు సాఫల్యం అనుకోవాలి.

4 comments:

  1. తురకల దేశాలలొ షరియా లేని ప్రజాస్వామ్యము రావాలి. అమేరికా మరియు ఇండియాలలొ లాగా.

    ఉదాహరణకు, ఇండియాలొ ప్రజాస్వామ్యము వుంటునే, హిందు శాసనాలను అమలు చేస్తే, ఎంత మంది తురకలు+కిరస్తానీలు+కమ్యునిస్ట్లు దానిని సమర్దిస్తారు? ఎవ్వరు చేయరు.

    అలానే తురకల దేశాలలొ షరియా వుండకూడదు. షరియా వుంటే అది నిజమైన ప్రజాస్వామ్యము కాదు.

    ReplyDelete
  2. జ్వాలా గారూ,
    నాజర్ తో మొదలుపెట్టి ఈజిప్ట్ రాజకీయ చరిత్రను చాలా బాగా సమీక్షించారు. సూయెజ్ కెనాల్ సంక్షోభం సమయంలో నేను హైస్కూల్ లో ఉండేవాణ్ణి.. ఆ రోజుల్లోనే ఆలీనోద్యమం, అందులో నెహ్రూ, నాజర్, టిటో, సుకర్ణోల పేర్లు భారత దేశం అంతటా ప్రతీ రోజూ వినపడేవి. టీవీలూ, కంప్యూటర్ లో లేని ఆ రోజుల్లో కేవలం పత్రికలూ, రేడియో మాత్రమే అన్ని వార్తలకీ ఆధారం. ఇప్పటిలా కాకుండా ఆ రోజుల్లో ఏ వార్తనైనా చదివి, విని, చర్చించుకుని, జీర్ణించుకునే సమయం ఉండేది. మా స్కూల్లో జరిగే "ఐక్య రాజ్య సమితి" సమావేశాలలో నేను నెహ్రూ పాత్ర వేసి భారత దేశం వాదనలని వినిపింఛే వాణ్ణి. మీ మ్యూజింగ్స్ ధర్మమా అని, ఈ నాటి "రియాల్టీ షో" లాగా ఆ రోజుల్లో, మేము చర్చించిన అన్ని దేశాల భిన్నాభిప్రాయాలూ, సమర్ధనలూ,
    జ్ఞాపకం వచ్చాయి.

    ముబారక్ సుదీర్ఘ పరిపాలనలో జరిగిన ప్రధానమైన విషయాలూ, చారిత్రాత్మక తప్పిదాలూ, పదవీచ్యుతుడు కావడానికి దారి తీసిన ఘట్టాలపై మరింత కూలంకషమైన విశ్లేషణ త్వరలోనే అందిస్తారని ఆశిస్తున్నాను.

    వంగూరి చిట్టెన్ రాజు
    హ్యూస్టన్, టెక్సస్

    ReplyDelete
  3. ఒక ఆర్టికల్ రాసినప్పటికంటే-ప్రచురించినప్పటికంటే, అది ఫలానావారు చదివారని-చదివి విశ్లేషించారని తెలుసుకున్నప్పుడు, రచయితకు కలిగే ఆనందం వర్ణనాతీతం. అదే నేను, మీ వ్యాఖ్యానం చదివినప్పుడు అనుభవించాను. మీ లాగే నేను కూడా ఆలీనొద్యమ నిర్మాతలైన ఆ నలుగురికీ అభిమానిని. వారందరిలో మరీ అభిమానం సుకర్ణో అంటే వుండేది. "ఇండొనేషియన్ అప్ హీవెల్" అన్న చిన్ని పేపర్ బ్యాక్ పుస్తకాన్ని ఎప్పుడో ఏళ్ల క్రితం చదివినా ఇప్పటికీ అందులోని విషయాలు నా మదిలో మెదలుతుంటాయి. అలానే నాజర్ కూడా. అరబ్బీల చరిత్రనే మార్చిన మహనీయుడాయన. "తప్పటడగులు" వేశాడేమో కాని, "తప్పుటడుగులు" వేయని గొప్ప వ్యక్తి నాజర్. ఏరీ అలనాటి మహా నాయకులిప్పుడు? అదొక మహా నాయకుల కూడలి అప్పట్లో. ఇప్పుడెవరినన్నా అడుగుతే, ఠకీమని పదిమంది ప్రపంచ నాయకుల పేర్లు చెప్పగలుగుతారా? చెప్పటం కష్ఠం. ఎందుకంటే...అలాంటి పాత తరం కోవకు చెందిన వారు లేరు కనుక. నాజర్ చనిపోయినప్పుడు నేను ఎంఏ పొలిటికల్ సైన్స్-పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నాగ్ పూర్ లో చదువుతున్నాను. ఆయన అంతిమ యాత్ర వార్తలింకా నాకు గుర్తున్నాయి. వాస్తవానికి...నేను అంత వివరంగా రాయలేదు కాని... ఆయన శవ పేటిక అభిమానుల భుజాల మీదుగా పయనిస్తూ.. కొంత సేపు కనుమరుగైందట. నాజర్ వాజ్ గ్రేట్!

    ReplyDelete
  4. జ్వాలా గారూ,

    నేను మీకు గుర్తుంటానని అనుకో లేదు. ఎందుకంటే, మనం ఒక్క సారి ఆత్మీయుడు సుధేశ్ నాయకత్వంలో జరిగిన వెన్నెల కార్యక్రమంలో కలిశాం. అప్పుడు మీరు వావిలకొలను వారి రామాయణం మీద చాలా సాధికారికంగా, అద్భుతంగా ప్రసంగించారు.

    మరొక విషయం:

    రెండు రోజుల క్రితం టివీ నైన్ వారి న్యూస్ వాచ్ కార్యక్రమంలో అనేక అంశాలపై మీరు చేసిన విశ్లేషణలు చాలా లోతుగా, లాజికల్ గా ఉన్నాయి. ఉదాహరణకి, ఇప్పటి తెలంగాణా ఉద్యమానికీ, ఇదివరలో వస్తూ , పోతూ నిలబడని ఉద్యమాలకీ ఉన్న తేడా చాలా బాగా చెప్ఫారు. నేను ఆ కార్యక్రమం తరచూ చూస్తూ ఉంటాను....మీరు ఎప్పుడు పాల్గొన్నా నా ఆసక్తి పెరుగుతుంది.....ఆ రాజకీయ నాయకుల మధ్య మీరు కాకులలో హంస లాగా ఉంటారు.

    మీరు మళ్ళీ హ్యూస్టన్ లో మీ అమ్మాయి దగ్గరికి ఎప్పుడు వస్తారు?

    సాహితీ లోకం సభ్యులకి: నిన్ననో, మొన్ననో జ్వాలా గారు ఈజిప్ట్ లో ముబారక్ నిష్క్రమణ పై ఒక మంచి విశ్లేషణ తన బ్లాగ్ లో ప్రచురించారు. అది చదివి నేను పంపించిన స్పందనకి ఆయన దయతో ఇచ్చిన జవాబే ఈ క్రింది పేరా!


    భవదీయుడు,

    వంగూరి చిట్టెన్ రాజు
    వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
    హ్యూస్టన్, టెక్సస్.
    Phone: 832 594 9054
    URL: www.vangurifoundation.org
    Blog: www.vangurifoundation.blogspot.com

    ReplyDelete