Monday, July 4, 2011

రాజీనామాలతో వేగం కానున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ : వనం జ్వాలా నరసింహారావు

రాజీనామాలతో వేగం కానున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ

రాజీనామాలతో ఏం జరుగబోతోంది ?

సూర్య దిన పత్రిక (05-07-2011)

వనం జ్వాలా నరసింహారావు

ఊపందుకున్న ఉద్యమం, రాజీనామాలతో రాజకీయ సంక్షోభం, ఇరు ప్రాతాల నేతల్ని కించపరచే వ్యాఖ్యలు, రాజీనామా రాజకీయాల్లో తెదేపా పోటీ, మీమాంసలో పడ్డ కాంగ్రెస్‌ అధిష్ఠానం…..

అనుకున్నంతా అయింది. అందరు కాకపోయినా, కొందరైనా, ఇప్పటికైనా, చెప్పింది చేసి చూపిస్తున్నారు. ఏ వుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖర రావు జానారెడ్డి ఇంటికి వెళ్లారో, ఏ వుద్దేశంతో వై ఎస్ జగన్మోహన రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తాను కూల్చకుండా పడి పోవాలని కోరుకున్నాడో, ఏ వుద్దేశంతో తెలుగు దేశం అధినేత తన పార్టీలోని తెలంగాణ వాదుల నిర్ణయాన్ని ఆప దల్చుకోలేదో, ఏ వుద్దేశంతో కాంగ్రెస్ అధినేత్రి మౌనంగా జరుగుతున్న పరిణామాలను నిస్సహాయంగా-బింకంగా-మొండి ధైర్యంతో గమనిస్తోందో కాని, రాష్ట్ర శాసన సభలోని మూడింట రెండు వంతుల సభ్యులు తమ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికైన లోక్ సభ సభ్యులలో ముగ్గురు మినహా అందరూ రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యుడు కేశవ రావు కూడా రాజీనామా ఇచ్చారు. పదిహేను మందికి పైగా ఎమ్మెల్సీలు సహితం వీరి బాటలోనే నడిచారు. ఎవరు ముందు-ఎవరు వెనుక అనేది పక్కన పెడితే, మొత్తం మీద రాజీనామా చేసిన వారిలో, పార్టీల కతీతంగా-లాయల్టీలకు అతీతంగా, ప్రాంతాభిమానంతో, కాంగ్రెస్-టిడిపి-వై ఎస్ ఆర్ టీంకు చెందిన వారున్నారు. కాంగ్రెస్ వారిలో, అందరి కంటే ముందే రాజీనామా చేసింది జగన్ వర్గానికి చెందిన కొండా సురేఖ కావడం గమనార్హం. అలానే అటూ-ఇటూ తిరుగుతున్న పలువురు కూడా వున్నారు. ప్రత్యక్షంగానో-పరోక్షంగా నో, రాజకీయ-రాజ్యాంగ సంక్షోభం చోటు చేసుకునే దిశగా, వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

కేవలం ఎమ్మెల్యే పదవులకే కాకుండా మంత్రి పదవులకు కూడా రాజీనామా చేస్తున్నామని పదకొండు మంది మంత్రులు ప్రకటించారు. జూపల్లి కృష్ణారావు యాత్రను అడ్డుకున్న డికె అరుణ, సందిగ్ధంగా వున్న సబితా ఇంద్రా రెడ్డి, కూడా రాజీనామా చేసిన వారిలో వుండడం విశేషం. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలున్నందు వల్ల, వాటి ఆమోదం అంత కష్టం కాకూడదు. వాస్తవానికి స్పీకర్ లేదని వాటి ఆమోదం ఆపాల్సిన అవసరం కూడా లేదు. స్పీకర్ కు సమాచారం అందించి, డిప్యూటీ స్పీకర్ కూడా ఆమోదించ వచ్చు. సమస్య ఇంతటితో ఆగి పోలేదు. రాజీనామా చేయని వారి సంగతి తేల్చు కుంటాం అన్న దాకా వ్యవహారం పోతోంది. రాజీనామా చేసిన కొందరు, రాష్ట్రపతి పాలన విధించినా సమ్మతమే అన్నట్లు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిలో, తమ రాజీనామాలతో ఢిల్లీ దిగి రావాలని కొందరు, తెలంగాణ సాధనకు అనుకూలంగా రాజీనామా చేసిన తాము ఇక ముందు సామాన్య కార్యకర్తలుగా మిగిలి పోతామని ఇంకొందరు, తమది ధిక్కార ధోరణి కానే కాదని మరి కొందరు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడమే రాజీనామాలకు కారణమని ఇతరులు ప్రకటనలు చేస్తున్నారు. తమ వాహనాలకు ఎమ్మెల్యే అన్న స్టిక్కర్ తీసేసి "రాజీనామా చేసిన ఎమ్మెల్యే" అని పెట్టుకుంటామని అంటున్నారు పలువురు.

తెలంగాణా కాంగ్రెస్‌ నేతల రాజీనామా ప్రకటన, తదనంతర పరిణామాలు, నేరుగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని తీవ్ర ఆగ్రహానికి గురి చేసిందని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించే వారంటుంటే, ఆమె ఆంతరంగాన్ని తమకు పరోక్షంగా ఆవిష్కరించిన రీతిలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు బల్ల గుద్ది మరీ చెప్తున్నారు. అదే నిజమేనేమో అనిపిస్తుందిప్పుడు. ఇంత కాలం ఓపిక పట్టిన సదరు తెలంగాణ నాయకులు, గతంలో అధిష్టానం దూతలు ఎన్ని వాయిదాలు వేసినా నిశ్శబ్దం పాటించిన వారందరూ, ఇంత ధైర్యంగా అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధ పడ్డారంటే, ఈ మొత్తం వ్యవహారంలో ఏదో ఒక తిరకాసు వుందేమో అనిపిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలను అధికారికంగా చూసేది తడవకొకరైతే (ఇప్పటి ఆజాద్ లాగా), అనధికారికంగా, అర డజన్ మందికి పైగా (గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, ఆస్కార్ ఫెర్నాండెజ్, ప్రణబ్ కుమార్ ముఖర్జీ, ఆంటోనీ.. వగైరా...వగైరా) ఎల్లప్పుడూ చూస్తూనే వుంటారు. అందుకేనేమో, రాష్ట్ర వ్యవహారాల మీద మరింత నిశితంగా దృష్టి పెట్టిన అధినేత్రి, ఎవరిని ఎంతవరకు నమ్మాలో అర్థం కాని స్థితిలో, తన ఆంతరంగిక రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ ని నేరుగా రంగంలోకి దింపింది. ఈ యోధాను యోధులందరూ, కలివిడిగా-విడి విడిగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తమ శక్తివంచన లేకుండా, జటిలం చేయడంతో పాటు, తరతరాలుగా కలిసిమెలిసి వుంటున్న తెలుగు జాతిని-తెలుగు ప్రజలను, భౌగోళికంగా విడిపోయినా-పోక పోయినా, శాశ్వతంగా ఒకరికొకరు దూరమయ్యే స్థితికి చేరుస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు తమ రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించిన సమయంలో, హైదరాబాద్ నగరంలో రాచ కార్యాలు చక్కదిద్దేందుకొచ్చిన గులాం నబీ ఆజాద్, అర గంట వ్యవధిలో, ఒక వైపు తెలంగాణ వారిని-మరో వైపు సీమాంధ్ర నాయకులను కించ పరిచే విధంగా చేసిన వ్యాఖ్యల వెనుక కూడా సోనియా హస్తముండొచ్చని కొందరు విశ్లేషకులంటున్నారు. ఆజాద్ వ్యాఖ్యలపై కేశవరావు తీవ్రస్థాయిలో మండిపడి, ఆగ్రహం వ్యక్తం చేశారు. "ముఖ్యమంత్రి సిగ్గుపడాలి. తెలంగాణ కోసం 600 మంది విద్యార్థులు చనిపోతే అసెంబ్లీలో ఏనాడూ మాట్లాడలేదు. ఆయన ఏం మనిషి?'' అని కూడా కిరణ్ కుమార్ రెడ్డినుద్దేశించి కేకే వ్యాఖ్యానించారు. ఆజాద్ చెప్పిందంతా నాన్‌సెన్స్ అని, ఒక్క రోజులో తెలంగాణను ఇవ్వాలని తాము అడగలేదని, ప్రక్రియను ప్రారంభించాలనే అడుగుతున్నామని స్పష్టం చేశారు. మాటల తూటాలు వాడి-వేడిగా బయటికొస్తున్నాయి.

రాజీనామాల నిర్ణయాన్ని తొందరపాటు చర్యగా వర్ణించిన ఆజాద్, అధిష్ఠానం పరిశీలనలో ఈ అంశం వుండగానే ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం సమస్య పరిష్కారానికి దోహద పడదన్న రీతిలో మాట్లాడడం తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులను కించపరిచినట్లు మాట్లాడడమే. ఆ సమయం ఇంకా రాలేదా? అని ప్రశ్నించిన విలేకరులతో, తెలంగాణపై నిర్ణయం అనేది ఒక్క నిమిషంలోనో... ఒక్క రోజులోనో తీసుకునే ది కాదనడం, సమస్యను మరి కొంతకాలం లాగడానికే తప్ప మరేమీ కాదు. ఆ తర్వాత కలిసిన సీమాంధ్ర ప్రతినిధులను ఢిల్లీకి రావద్దని ఆజాద్ సూచించినట్లు వార్తలొచ్చాయి. అంతవరకూ బాగానే వుంది...ఢిల్లీకి తిరగడానికి ధనం వృధా చేసే కన్నా, ఆ మొత్తాన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి విరాళంగా ఇవ్వమని సూచించినట్లు కూడా వార్తలొచ్చాయి. అంటే, సీమాంధ్రులను కూడా ఒక విధంగా కించపరచడమే.

హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో, జులై ఒకటో తేదీన, తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధుల భేటీ జరుగుతున్న సందర్భంలో-ఆ భేటీ కొన సాగుతుండగానే,... ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు-రాజ్య సభ సభ్యుడు, మేధావి కె.కేశవరావు సమావేశం మధ్యలో బయటికి వెళ్లి, తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు కోదండ రామ్, తెలంగాణ ఎన్ జీవో సంఘం నాయకుడు స్వామి గౌడ్, తెలంగాణ న్యాయవాదుల సంఘం నేతలతో భేటీ కావడం, తిరిగి సమావేశానికి వచ్చిన ఇరవై నిమిషాల్లోనే... రాజీనామాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం వెనుక ఏదైనా మతలబున్నదా అని కొందరు ఆలోచనలో పడ్డారు. ఆ మాటకొస్తే, రాజీనామా ప్రకటన నాటికి రెండు రోజుల ముందరే, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, రాష్ట్ర మంత్రి-తెలంగాణ వాది జానారెడ్డిని కలవడం వెనుక కూడా కొంత పకడ్బందీ వ్యూహం వుందని కూడా అంటున్నారు. ఇవేమీ కాదు...వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఎప్పుడా-ఎప్పుడా అని ఎదురు చూసిన సందర్భం, ఆయన పరోక్ష ప్రమేయంతోనే ఆసన్నమైందని మరి కొందరంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వారి రాజీనామా నిర్ణయం వెనుక పావులు వ్యూహాత్మకంగా కదిపిన కేశవరావు, జానారెడ్డిలు ఎటువంటి పరిస్థితుల్లోను వెనుకంజ వేయనీయకుండా చక్రం తిప్పుతున్న వ్యక్తులను ఎవరికి వారే తమకు తోచినవారిని వూహించుకుంటున్నారు.

కాంగ్రెస్ నాయకుల రాజీనామా ప్రకటన తెలుగుదేశంలోని తెలంగాణ వాదులలో కూడా వేడి పుట్టించింది. తామూ రాజీనామాలకు సిద్ధం అన్నారు. రాజీనామా రాజకీయాలు రాజ్యాంగ సంక్షోభం కలిగించవని-కేవలం, ఎక్కువలో ఎక్కువగా "రాష్ట్రపతి పాలనకు" దారితీయవచ్చునేమో నని వెటకారం చేస్తున్నవారూ లేకపోలేదు. రాష్ట్రపతి పాలన అంటే రాజ్యాంగ సంక్షోభం కాక మరేమవుతుందో ఆ వెటకారాలకే తెలియాలి! మరో వైపు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో కీలకపాత్ర నిర్వహిస్తున్న అధినాయకుల్లో కూడా తెలంగాణ నాయకుల రాజీనామా అంశం విభజనకు దోహదపడవచ్చని మరి కొందరి భావన. ఇక సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులలో ముఖ్యులైన మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి వంటి నేతలు రాజీనామాలు చేయబోమని చెబుతున్నారు. ఇలా సాగింది తొలి రెండు రోజుల డ్రామా. ఇక అక్కడినుంచి ఎంపీల సీను ఢిల్లీకి మారితే, ఎమ్మెల్యేల సీను హైదరాబాద్ కు పరిమితమైంది. రాజీనామా చేయడానికి కొన్ని గంటల ముందు, కాంగ్రెస్ అధిష్టానం నుంచి, హైదరాబాద్ లో వున్న కొందరు కీలక నాయకులకు ఢిల్లీకి రమ్మని పిలుపొచ్చిందన్న వార్తలు గుప్పుమన్నాయి.

రాజీనామాల విషయంపై వెనక్కి తగ్గ లేనంతగా ముందుకు వెళ్లిన ఎంపీలు సాధ్యమైనంత ఎక్కువ మందితో ఆ పని చేయించాలన్న భావనతో ఢిల్లీకి చేరుకున్న వెంటనే తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని కలిశారు. ఆయనను ఆ క్షణంలో, రాజీనామాకు ఒప్పించ లేకపోయినా, తమకు అనుకూలంగా సంఘీభావం ప్రకటించే దాకా ఆయనలో కదలిక తేగలిగారు. వారక్కడున్న సమయంలోనే-ఎంపీల సమక్షంలోనే, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్‌లు జైపాల్ రెడ్డితో వేర్వేరుగా మాట్లాడినట్లు సమాచారం. రాజీనామాల నిర్ణయాన్ని మార్చుకోమని చెప్పాలని అడిగారు వారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేస్తే తప్ప ఎంపీలు రాజీనామాలపై నిర్ణయం మార్చుకునే పరిస్థితి లేదని వారితో జైపాల్ స్పష్టం చేశారట. కాంగ్రెస్-టిడిపి సభ్యుల రాజీనామా లింకా కాగితం మీదకు రాక ముందే, ఒక అడుగు ముందుకు వేశారు బహిష్కృత-అసమ్మతి తెలుగు దేశం ఎమ్మెల్యేలు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా..తమ శాసనసభ్యత్వాలకు నాగం జనార్దనరెడ్డి, వేణుగోపాలాచారి, హరీశ్వర్‌రెడ్డి, జోగు రామన్న రాజీనామా చేశారు. నాగం చేపట్టిన 'తెలంగాణ ఐక్యత దీక్ష' వేదిక నుంచే ఆదివారం వీరు రాజీనామాలు చేశారు.

తెలుగు దేశం పార్టీకి చెందిన వారు తమ నాయకుడి ఆదేశం మేరకే రాజీనామా చేశామని చెప్పడం విశేషమా? లేక, కాంగ్రెస్ వారు, తమ నాయకురాలి ఆదేశం లేకుండానే రాజీనామా చేశామని చెప్పడం గొప్పా? ప్రజలే తేల్చాలి. ఇక ముందెలాంటి పరిణామాలు జరుగనున్న యో కాని, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం తన కోర్టులో పడిన బంతిని ఎలా బయట పడెయ్యాలా అన్న మీమాంసలో పడిపోయింది. నిమిషం కూడ ఆలశ్యం చేయకుండా కీలకమైన వ్యక్తులను ఢిల్లీకి పిలిపించే ప్రయత్నంలో మునిగింది. ఏదేమైనా, రాజీనామాలు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తాయా? లేక, మరింత వెనుకబడే ట్లు చేస్తాయా? ఇవేమీ కాకుండా, ఇరు ప్రాంతాల మధ్య వైషమ్యాలు మరింత పెరగడానికి నాంది పలుకుతాయా? ఇప్పుడిప్పుడే చెప్పడం కష్ట మేమో!

3 comments:

  1. తెలంగాణా ఉద్యమంలో ఇది నిజంగా చారిత్రాత్మక ఘట్టం.
    మనది నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్తే అయితే ఇప్పటికైనా వెంటనే తెలంగాణా ప్రజల ఆకాంక్షను
    కేంద్ర ప్రభుత్వం గుర్తించి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలి.
    ఇక తెలుగు దేశం ఎం ఎల్ ఎ లు తమ ఎం ఎల్ ఎ పదవులకే కాకుండా
    తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు విషయంలో దొంగ నాటకాలు ఆడుతున్న టీ డీ పీ పార్టీకి కూడా
    రాజీనామా చేసిఉంటే వారి నిజాయితీ కి ప్రజలు జేజేలు పట్టేవారు.
    ఇప్పటికీ వారి పట్ల ప్రజలకు విశ్వాసం కలగడం లేదు

    ReplyDelete
  2. సోనియా గాంధీ ఈ సమస్యని 2014 వరకు లాగడానికి ప్రయత్నిస్తే కాంగ్రెస్ తెలంగాణాలో మట్టికరుస్తుంది. తెలంగాణా రాకపోతే కాంగ్రెస్‌కి చాలా నష్టమే.

    ReplyDelete
  3. Thank you to both of you for the observations.
    Jwala

    ReplyDelete