Thursday, July 28, 2011

మాట మార్చడమే చిదంబర రహస్యమా?: వనం జ్వాలా నరసింహారావు

వనం జ్వాలా నరసింహారావు

సూర్య దినపత్రిక (29-07-2011)

సమస్యల పరిష్కారానికి ధైర్యం చేయని కాంగ్రెస్‌...ఆజాద్‌ చర్చలకు ఒక అజెండా ఉందా?...ఆరోపణలపై స్పందించని కేంద్రం...ఏకాభిప్రాయం అంటే ఏమిటి?...ప్రతిపక్షాలను తప్పు పట్టడం హాస్యాస్పదం

ఊసరవెల్లికి రంగులు మార్చే నైజం వుందని విన్నాం - చూశాం. కాని, బాధ్యతాయుతమైన ఒక పదవిని, అందునా కీలకమైన హోం మంత్రిత్వ శాఖను-అది కూడా ఆయనకు ముందున్న వ్యక్తి సరిగ్గా నిర్వహించ లేదన్న ఆరోపణ దరిమిలా, చేపట్టిన చిదంబరం, మాటి-మాటికీ, చీటికి-మాటికీ మాట మారుస్తుంటే, ఆ నైజాన్ని ఏ "రకమైన వెల్లి" అని పిలవాలో అర్థం కావడం లేదు. చిదంబరం ఈ వింత ధోరణి పర్యవసానంగా, ఇటీవల గత కొద్ది కాలంగా, ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ముందు ఓ వింత సమస్య వచ్చిపడిందనాలి. రాష్ట్రం సమైక్యంగా వుండడమా? లేక, రెండు-మూడు రాష్ట్రాలుగా విడిపోవడమా? అనే సమస్య స్థానంలో, తమనీ స్థితిలోకి లాగుతున్న చిదంబరాన్ని, ఎలా ఒక దారికి తీసుకురావడం అన్న సమస్యతో అటు సీమాంధ్రులు, ఇటు తెలంగాణ వాదులు సతమతమౌతున్నారు అంటే సరిపోతుందేమో!

బహుశా మరే రాజకీయ నాయకుడూ మాట్లాడడానికి సాహసించని, ఒక విభిన్న శైలి ఆంగ్ల భాష ఉచ్ఛారణతో, ఒక్కొక్క పదాన్ని ఒకటికి పదిసార్లు మరీ-మరీ నొక్కి పలుకుతూ, చెప్పిందే పదిసార్లు చెప్తూ, వింటున్న వారందరినీ తాను ప్రభావితులను చేస్తున్నానన్న భ్రమతో, అసలు సమస్యను పక్కదారి పట్టించడం చిదంబరం ప్రత్యేకత. ఆ సమస్య ఒక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించింది మాత్రమే కావాలని లేదు. ఏలాంటి తీవ్ర వాదుల ఆకస్మిక ముంబాయి దాడుల నేపధ్యంలో ఆయనకు హో మంత్రిత్వ శాఖను కట్ట బెట్టారో, అలాంటి దాడులే వీరి హయాంలో జరిగినా కూడా, వాటిని తనకే మాత్రం ఇబ్బంది కలగని రీతిలో ఖండించ గలగడం ఆయన ప్రత్యేకత. రాందేవ్ బాబా లాంటి వారి నిరాహార దీక్ష విషయంలో, తన వాక్చాతుర్యంతో, సమస్యను పక్క దోవ పట్టించడం ఆయనకు తప్ప ఎవరికీ సాధ్య పడదు. ఈనగారికీ-సాక్షాత్తు ప్రధాన మంత్రికీ తెలవకుండా టు-జీ స్పెక్ట్రం స్కాం జరగలేదని, మాజీ కేంద్ర మంత్రి, ఆ స్కాంలో నిందితుడు రాజా, దేశ అత్యున్నత న్యాయ స్థానంలో, వాంగ్మూలం ఇస్తే ఎలా స్పందించాలో-ఎలా స్పందిస్తే సమయానుకూలంగా వుంటుందో, సరిగ్గా అలానే చేశారు చిదంబరం. మామూలు నేరాలలోనే (ఉదాహరణకు: ఇటీవల మత్తు మందుల సరఫరాకు సంబంధించి పట్టుబడిన బెంగుళూరుకు చెందిన వ్యక్తి సాక్ష్యం ఆధారంగా) పోలీసులకు దొరికిన ఒక నేరస్థుడు, మరో వ్యక్తి పేరు (కావాలని కూడా) చెప్పినప్పుడు-లేదా చెప్పించినప్పుడు, ఆ వ్యక్తిని కూడా విచారణ చేసే సాంప్రదాయం మన పోలీసు-న్యాయ వ్యవస్థలో వున్న సంగతి అందరికీ తెలిసిందే! అలాంటప్పుడు, అత్యున్నత న్యాయ స్థానంలో, అందునా, ఒక మాజీ మంత్రి-ఒక కీలకమైన కేసులో, మరో కీలకమైన వ్యక్తి పేరు చెప్పినప్పుడు, ఆ వ్యక్తి నేర పరిశోధనకు సంబంధించిన ప్రభుత్వ శాఖకు చెందిన వ్యక్తి ఐనప్పుడు, చట్టానికి లోబడి, విచారణకు సిద్ధం కావాలా? వద్దా?

మొన్నీ మధ్యనే, తాను చేసిన డిసెంబర్ తొమ్మిది (2009) ప్రకటనను, డిసెంబర్ ఇరవై మూడు ప్రకటనతో కలిపి చదవాలని, తన మాట మార్పిడిలో భాగంగా శల విచ్చిన చిదంబరం, మరో అడుగు ముందుకు వేసారీసారి. డిసెంబర్ తొమ్మిదిన-ఆ రోజున నెల కొన్న పరిస్థితుల నేపధ్యంలో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమౌతుందని తాను చేసిన ప్రకటనలో తప్పేమీ లేదని, అంటూనే, ఆ ప్రకటన వల్ల చెలరేగిన నిరసనలు-మూకుమ్మడి రాజీనామాలు, అస్తవ్యస్త పరిస్థితులు, ఉద్రిక్తతలు తనను మరో ప్రకటన (మొదటి దానికి పూర్తి విరుద్ధంగా) చేసేందుకు దారితీసిన మాట వాస్తవమేనని ఇప్పుడంటున్నారు చిదంబరం. మొదలు చేసిన ప్రకటన, ఆ తర్వాత (మాట మారుస్తూ) చేసిన ప్రకటన, తాను ప్రభుత్వ పరంగా చేసిన ప్రకటనలే గాని వ్యక్తిగతమైనవి కావని నమ్మించే ప్రయత్నం చేశారు హోం మంత్రి చిదంబరం. రెండు ప్రకటనలూ ఇలా రావడానికి కారణం ఆంధ్ర ప్రదేశ్‌లో నెల కొన్న పరిస్థితులే కారణం అని నింద మోపే ప్రయత్నం అతి చాకచక్యంగా చేయడానికి ఆయన ఏ మాత్రం సందేహించడం లేదు. పైగా తనను బాధ్యుడిని చేస్తూ, నిందించడం సరి కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. అంతటితో ఆగినా బాగుండేది. తాను-తన కాంగ్రెస్ పార్టీ ఏదో "పత్తిత్తు" ఐనట్లు, పాతివ్రత్యం తమకు తప్ప ఇతరులకు లేనట్లు, ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని రాజకీయ పార్టీలను తప్పుబట్టారు. తెలంగాణాపై నిర్ణయాన్ని ఏకపక్షంగా ప్రజలపై రుద్దలేమని అన్న చిదంబరం, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్నే ప్రకటిస్తాం అని, ముందుగా కాంగ్రెస్‌ పార్టీలో ఏకాభిప్రాయాన్ని తెస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో తనకు ప్రధాన ప్రత్యర్థైన తెలుగుదేశం పార్టీని నిందించడానికి ఇదే సరైన సమయం అన్న రీతిలో, ఆ పార్టీ కూడా ఏకాభిప్రాయాన్ని ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భారతీయ జనతా పార్టీని తిట్టీ తిట్టకుండా, చిచ్చు బెట్టారు. మొత్తం మీద తనది, తన పార్టీది, తన యుపిఎ ప్రభుత్వానిది, అమ్మ సోనియా గాంధీది, ఆ మాటకొస్తే తెలంగాణ-సమైక్యాంధ్ర సమస్యలను నానుస్తున్న తన కాంగ్రెస్ అధిష్టాన సహచరులది ఏ మాత్రం తప్పు లేదని ఇంచక్కా చెప్పారు తన ప్రత్యేక తరహా ఇంగ్లీష్ ఉచ్ఛారణతో. వాక్చాతుర్యానికి చిదంబరానికి చిదంబరమే సాటి!

చిదంబరానికి - ఆయన (అధిష్టానం-అమ్మ సోనియా గాంధి) అడుగు జాడల్లో చర్చల ప్రక్రియను మరో మారు ప్రారంభించి కొనసాగిస్తున్న గులాం నబీ ఆజాద్ కు, అటు సీమాంధ్రుల వాదనల లోని నిజా-నిజాలు, ఇటు తెలంగాణ కోరుకుంటున్న వారి వాదనల లోని వాస్తవాలు, ఆకళింపు చేసుకోవాలని కాని-చేసుకుని సమస్యకు (వారంటున్న విధంగా ఏకాభిప్రాయం సాధించడం ద్వారా) పరిష్కారం కనుక్కోవాలని కాని త్రి కరణ శుద్ధిగా వుంటే ఎవరికీ అభ్యంతరం వుండదు. త్రి కరణ శుద్ధి కాకపోయినా, కొంతలో కొంతైనా చిత్త శుద్ధి వున్నా పర్వాలేదు. వాళ్లకు తీరిక దొరికినప్పుడు, వారి దృష్టిలో ప్రాముఖ్యత సంతరించుకున్న ఏ జాతీయ-అంతర్జాతీయ సమస్యలు చర్చించాల్సిన రోజు కానప్పుడు, తెలుగు వారితో కాసేపు సరదాగా కూర్చొని కాలక్షేపం చేయాలని భావించినప్పుడు మాత్రమే ఈ సమస్య గుర్తొస్తుంది చిదంబరానికి-ఆజాద్ లాంటి వారికి. అసలు మాటి-మాటికీ మాట మారుస్తున్న వీరి దృష్టిలో ఏకాభిప్రాయమంటే అర్థం ఏమిటి? అదేమన్నా మార్కెట్లో దొరికే అమ్మకపు సరుకా? లేదా, కాంగ్రెస్ అధిష్టానం అనుకున్నప్పుడల్లా, వారి పార్టీ అధికారంలో వున్న రాష్ట్రాలలో ముఖ్య మంత్రులను మార్చదలుచుకుంటే, అప్పటికప్పుడు వారి అభీష్టం మేరకు లభ్యమయ్యే "వ్యక్తుల" లాంటి ఒక "జడ పదార్థమా? ఏకాభిప్రాయం అనేది ఒక ఎత్తుగడ తప్ప మరేమీకాదు. ఎటువంటి సమస్యైనా, కాంగ్రెస్ పార్టీ-అధిష్టానం-దాని సారధ్యంలోని యుపిఎ ప్రభుత్వం పరిష్కరించ వద్దనుకుంటే, తరచుగా వారు వాడె ఒక వూత పదం "ఏకాభిప్రాయం"!

కాంగ్రెస్ పార్టీ పరంగా - రాష్ట్రం లోని యావన్మంది తెలంగాణ ప్రాంత నాయకులు, పూర్తిగా మరిచిపోయిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ సమస్యను, తన రాజకీయ అవసరాల కొరకు-అలనాటి చంద్రబాబు నాయుడి ఆధిపత్యాన్ని, పలుకుబడిని ఎదుర్కొని, ఎన్నికలలో విజయం సాధించడానికి, 2004 శాసన సభ-లోక్ సభ ఎన్నికల్లో, తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తుపెట్టుకోవడం ద్వారా, మరో మారు జ్ఞప్తికి తెచ్చింది ఎవరో కాదు....గులాం నబీ ఆజాదులు, చిదంబరాలు, ప్రణబ్ ముఖర్జీలు, వారి అధినేత్రి సోనియా గాంధీ! ఆ పొత్తును దివంగత ముఖ్య మంత్రి-అప్పట్లో రాష్ట్రంలో తిరుగులేని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ససేమిరా ఇష్టపడలేదు. ఐనా, అల నాడు ఎన్నికల ప్రణాళికలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ సుముఖంగా వున్న అభిప్రాయం కలిగించారు ఇటువంటి చిదంబరాలు, ఆజాదులు. ఆనాడు ఏకాభిప్రాయంతోనే ఆ పని చేశారా? ఆ నాడు సీమాంధ్ర నాయకులను సంప్రదించే ఆ పని చేశాడా చిదంబరం-ఆజాద్? అప్పుడు గుర్తుకురాని ఏకాభిప్రాయం ఇప్పుడెందుకు గుర్తుకు రావాలి? తెలంగాణ ఇవ్వడం-ఇవ్వక పోవడం కాదిక్కడ ముఖ్యం. మాట మార్చే అలవాటే చిదంబరం నైజం అనడం ఇక్కడ ప్రధానం.

పోనీ, యుపిఎ ప్రభుత్వం రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశం ప్రస్తావించినప్పుడు ఏకాభిప్రాయం గుర్తుకు రాలేదా చిదంబరానికి? డిసెంబర్ తొమ్మిదిన ప్రకటన చేయడానికి ముందర కాని-దరిమిలా చేసిన ప్రకటనప్పుడు కాని ఏకాభిప్రాయం మంచిదన్న భావనే కలగలేదా? వాస్తవానికి, డిసెంబర్ తొమ్మిది ప్రకటనకు ముందు జరిగింది అన్ని పార్టీల ఏకాభిప్రాయం కాదా? ఒకనాడు శాసన సభలో చేసిన తీర్మానం ఏకాభిప్రాయం కాదా? ఒక రాష్ట్రంలోని ఒకటికి మించిన ప్రాంతాల ప్రజలు-ప్రజా ప్రతినిధులు నిలువుగా-అడ్డంగా-ఏటవాలు గా చీలిపోయినప్పుడు, ఎవరి సిద్ధాంతంతో వారు పట్టుదలగా వున్నప్పుడు, ఏకాభిప్రాయం నెపంతో, వారి మధ్య వైషమ్యాలు పెంపొందించడం కేవలం మాట మార్చేవారికి మాత్రమే సాధ్యపడుతుందని అనక తప్పదు. దొంగ... ఎదుటివారిని "దొంగ..దొంగా" అని అరిచి, తన దొంగతనం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినట్లే, తన పార్టీ మధ్యనే ఏకాభిప్రాయం సాధించలేని చిదంబరం, తెలుగుదేశం పార్టీని, దాని నాయకుడు చంద్రబాబు నాయుడునీ తప్పుబట్టడం మరీ హాస్యాస్పదం. ముందు తన తప్పు ఒప్పుకుని, ఇతరులు తప్పు చేశారంటే అర్థముంటుంది కాని, ఇతరులది తప్పు-తనది ఒప్పు అనడం ఎంతవరకు భావ్యం?

సరే.. తెలుగు వారికి..ఇలాంటి చిదంబరాలతో వేగక తప్పదను కుందాం. ఇక చిదంబరం దృష్టిలో, ఈ సమస్యను "ఏకాభిప్రాయ సాధన" ద్వారా పరిష్కరించే సత్తా వుందని భావిస్తున్న గులాం నబీ ఆజాద్ (అందుకే ఆయనకు ఆ బాధ్యత అప్పగించిన అర్థం స్ఫురించే రీతిలో) చిదంబరానికంటె ఒక ఆకు ఎక్కువే చదివాడు. ఒక పక్క సమస్య పరిష్కారానికి నిర్దిష్ట మార్గాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామంటూనే, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులతో తొలివిడత సంప్రదింపులు ముగిసిన వెంటనే, సమస్య పరిష్కారాన్ని మరో రెండు (ఎన్ని రెళ్లో?) నెలలు వాయిదా వేశారు ఆజాద్. ఆజాద్ చర్చలకు ఎజెండా వుంటే పర్వాలేదు...వుంటే ఆ ఎజెండా ఏంటో బహిరంగ పరచాలి...సమస్య కేవలం కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల ది మాత్రమే కాదని, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిందని అర్థం చేసుకోవాలి...ఆయన చేస్తున్నది పునఃసమీక్ష కానే కాదని, సమస్యను కనీసం శాశ్వత తాత్కాలిక ప్రాతిపదికగా పరిష్కరించుకోడానికి కట్టుబడి వున్నామని అధికారికంగా-ప్రభుత్వ పరంగా ప్రకటించాలి. అందరికీ ఆమోదయోగ్యమైనదయితే అంతకంటే మించిందే మీ లేదు. కానప్పుడు, ఇరు ప్రాంతాల వారికి వీలై నన్ని తక్కువ అభ్యంతరాలతో సమస్యను పరిష్కరించాలి. ఏకాభిప్రాయం పేరుతో, దీర్ఘకాలికంగా వాయిదా వేసుకుంటూ పోతే, దొరికే ది పరిష్కారం కాదు కదా...మరిన్ని సమస్యల తోరణాలు మాత్రమే!

No comments:

Post a Comment