Wednesday, November 28, 2012

గవర్నర్‍ వ్యవస్థను విమర్శించడం ఎంతవరకు సబబు?: వనం జ్వాలా నరసింహారావు


గవర్నర్‍ వ్యవస్థను విమర్శించడం 
ఎంతవరకు సబబు?
    వనం జ్వాలా నరసింహారావు
రాజ్యాంగ వ్యవస్థలపై రాజకీయాలు వద్దు ! 
నమస్తే తెలంగాణ (4-12-2012)                     

రాష్ట్ర గవర్నర్‌ను కలవడానికి తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు మూడు రోజుల నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆయన సమయం ఇవ్వడం లేదని, ధర్మాన కేసు లో తమ పార్టీ నాయకుల విజ్ఞప్తిని వివరించడానికి అవకాశం కల్పించడం లేదని, గవర్నర్ రాజ్యాంగ రక్షకునిగా వ్యవహరించాలి కాని, సోనియా ఏజెంటుగా వ్యవహరిస్తే తాము గవర్నర్ల వ్యవస్థపైనే పోరాడాల్సి ఉంటుందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగానే పరిగణించాలి. గవర్నర్ రవీంద్ర భారతికి వెళ్లినా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నా తమకు అభ్యంతరం లేదని, ఢిల్లీ యాత్రలు చేసినా పరవాలేదని, రాజ్యాంగబద్ధంగా గవర్నర్ చేయాల్సిన పని చేయాలని, చేయకపోతే తమ పార్టీ నిలదీయడం ఖాయమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా, గతంలో రహస్య గూఢచారి ఉద్యోగం చేసిన నరసింహన్ ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో కూడా అదే పని చేస్తున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి. గవర్నర్ ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని, రాష్ట్రపతులను కలవడంలో తప్పు లేదు కాని, సోనియాను ఎలా కలుస్తారని ప్రశ్నించారు. రాజ్‌భవన్‌ను గాంధీ భవన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో ఒక సారి, నలుగురు రాష్ట్ర మంత్రుల, ఇద్దరు పార్లమెంట్ సభ్యుల సమక్షంలో, కొందరు గ్రామ సర్పంచులను ఉద్దేశించి మాట్లాడిన గవర్నర్ నరసింహన్, తనను తాను "చెడ్డ గవర్నర్" గా అభివర్ణించుకున్నారు. అంతటితో ఆగకుండా, ఇక ముందు ఎక్కువ కాలం తను రాజ్‌భవన్ లో గడపనని, ప్రజల మధ్య గడుపుతానని, వారి కష్ట సుఖాలను విచారిస్తానని హామీ కూడా ఇచ్చారు. గవర్నర్ తరచూ ఢిల్లీకి వెళ్లి నివేదికలు ఇస్తున్నారన్న విమర్శలూ వున్నాయి. పాలనలో జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శా వుంది. ధర్మాన కేసును ఆయన ఏ విధంగా పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే! కొన్ని కొన్ని విషయాలలో ఆయన నిర్ణయం ఎలా వుంటుందో నని ఎదురు చూడని పార్టీ రాష్ట్రంలో లేదు. ఆయన నిర్ణయాలు ఒక్కోసారి ఒక్కో పార్టీకి సంతోషకరం గా వుంటున్నాయి. మరి కొందరికి ఇబ్బందులు కలగ చేస్తున్నాయి. 



కొందరు గవర్నర్లు ఇలా వ్యవహరించడం ఈ దేశంలో, ప్రత్యేకించి మన రాష్ట్రంలో కొత్తే మీ కాదు. 1977-78 మధ్య కాలంలో రాష్ట్ర గవర్నర్ గా పదిహేను నెలలు పనిచేసిన శారదా ముఖర్జీ, 1985-90 మధ్య కాలంలో నాలుగు సంవత్సరాలకు పైగా పనిచేసిన కుముద్ బెన్ జోషి, భిన్న రీతుల్లో వ్యవహరించినప్పటికీ, ప్రస్తుత గవర్నర్ తో పోల్చదగిన వారని అనాలి. దివి సీమను అతలాకుతలం చేసిన భీకరమైన తుఫాను నేపధ్యంలో, స్వచ్చంద సంస్థల పనితీరుకు మార్గదర్శకంగా-ధీటుగా పనిచేసే తరహాలో "చేతన" సంస్థను స్థాపించి, సహాయ పునరావాస కార్యక్రమాలను చేపట్టి, రాష్ట్ర ప్రజల-పాలకుల అభినందనలు అందుకున్నారు శారదా ముఖర్జీ. చేతన సంస్థకు, గవర్నర్ అధ్యక్షులుగా, ముఖ్యమంత్రి ఉపాధ్యక్షులుగా వ్యవహరించే పద్ధతిలో సంస్థ నియమ నిబంధనలను అప్పటి గవర్నర్ కార్యదర్శి మోహన్ కందా తోడ్పాటుతో రూపొందించారా మె. దరిమిలా మోహన్ కందా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. శారదా ముఖర్జీ గుజరాత్ గవర్నర్‍గా వెళ్లిపోయిన తర్వాత చేతన కార్యకలాపాలు అనతి కాలంలోనే ఆగిపోయాయి. ఏడేళ్ల తర్వాత గవర్నర్ గా వచ్చిన కుముద్ బెన్ జోషి, చేతన సంస్థను పునరుద్ధరించడంతో పాటు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ (నీసా) అనే మరో స్వచ్చంద సంస్థను స్థాపించి, పలు ప్రజోపయోగమైన కార్యక్రమాలను చేపట్టారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో అనేక సందర్భాల్లో విభేదించిందన్నపేరు తెచ్చుకున్న కుముద్ బెన్ జోషి, ఆ రెండు సంస్థల కార్య కలాపాల విషయంలో ఆయన సలహా సంప్రదింపులను "కూడా" తీసుకునేవారు. జోగినిల దురాచారం రూపుమాపే దిశగా రాజ్ భవన్ దర్బార్ హాలులో ఆ అభాగినులకు వివాహం జరిపించడం, రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ చర్యలు, కుముద్ బెన్ జోషి ఆధ్వర్యంలోని స్వచ్చంద సంస్థలు చేపట్టిన కొన్ని ముఖ్య కార్యక్రమాలు.

2009 సెప్టెంబర్ నెలలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి, కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు రోశయ్య ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత, ఆ తరువాత ఆయన వారసుడిగా కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తదుపరి, సహేతుకమైనా-కాకపోయినా, స్వపక్షాల-విపక్షాల విమర్శలకు దారితీసే పద్ధతిలో ప్రభుత్వ పాలన సాగుతోంది. దానికి బాధ్యుడు అలనాటి ముఖ్యమంత్రి రోశయ్యా? నేటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డా? అయిష్టంగా ఆయన మంత్రివర్గంలో కొనసాగుతున్న కొందరు మంత్రులా?ముఖ్యమంత్రి కావాలన్న కోరిక తీరని రాజశేఖర రెడ్డి కొడుకు వైఎస్సార్సీపి నాయకుడు జగనా? ఆయనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతిచ్చి ముఖ్యమంత్రిని ఇరుకున పెడుతున్న కొందరు కాంగ్రెస్ నాయకులా? తెలంగాణా వాదులా? సహకరించని ప్రకృతా? ఆర్థిక ఇబ్బందులా? కిరణ్ కుమార్ రెడ్డికి సంపూర్ణ అధికారాలు ఇవ్వని కాంగ్రెస్ అధిష్టానమా?. కారణాలు ఏమైనా వీటికి సంబంధం లేని ప్రజలై తే ఇబ్బందులకు లోనవుతున్న మాట వాస్తవం.

పలు సందర్భాలలో-వేరు, వేరు సందర్భాలలో, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, సంబంధిత గవర్నర్ వ్యవహారం నచ్చనప్పుడు, గవర్నర్ పాత్రను విమర్శించడంతో సరిపుచ్చుకోకుండా, గవర్నర్ వ్యవస్థనే రద్దుచేయమని కోరడం అందరికీ తెలిసిన విషయమే. సాధారణంగా, అధికారంలో లేనప్పుడు ప్రతి పార్టీ చేసిన పని అదే. గవర్నర్లు తప్పుచేయలేదని కాదు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన గవర్నర్లు లేరనీ కాదు. అంత మాత్రాన ఆ వ్యవస్థనే రద్దు చేయాలని కోరడం సమంజసం కాదు. రాజ్యాంగ స్ఫూర్తికి-ప్రకరణాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్న గవర్నర్లను పదవినుంచి తొలగించమని అడిగే హక్కుందికాని, వ్యవస్థనే ప్రశ్నించే విధంగా రాజకీయ నాయకులు ప్రకటనలు ఇవ్వడం తగదు. రాజ్యాంగపరంగా ఏర్పడ్డ రాష్ట్రపతి, గవర్నర్ పదవులు ఎల్లవేళలా "అలంకారప్రాయమైనవేనని" భావించడం తప్పు. ఎన్టీ రామారావును 1984 లో నాటి గవర్నర్ రామ్ లాల్ తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్యంపై దెబ్బతీశారని అభియోగం మోపుతూ, న్యాయం కావాలని కోరుతూ తెలుగుదేశం నాయకత్వం రాష్ట్రపతి వద్దకు పోయింది గాని, ప్రధాన మంత్రి వద్దకు కాదే ! గవర్నర్ ను, గవర్నర్ వ్యవస్థను విమర్శించడానికి, సొంత కోణం నుంచి చూడకుండా, రాజ్యాంగ కోణం నుంచి చూడడం మంచిది. ప్రధాన మంత్రి వద్దకు కాకుండా, న్యాయం కొరకు రాష్ట్రపతి వద్దకు పోవడానికి కారణం, ఆయన రాజ్యాంగాన్ని పరిరక్షించే వాడు కాబట్టే.

కష్ట కాలంలో ఎన్నికైన ప్రజా ప్రతినిధి (ప్రధాన మంత్రి స్థాయి వారైనా సరే) కంటే, రాజ్యాంగానికి బద్ధుడైన అధినేత (రాష్ట్ర పతి, గవర్నర్) అవసరమని, న్యాయం కోసం, ముఖ్యమంత్రి స్థాయి వాడే, ఎన్నికైన ప్రజా ప్రతినిధి-ప్రధాన మంత్రి వద్దకు పోలే దో, అలానే, రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అవసరమైనప్పుడు-న్యాయం జరగలేదని భావించినప్పుడు, గవర్నర్ వైపు దృష్టి సారించడం తప్పు కాదు. వారు గవర్నర్ దగ్గరకు పోయినా, లేక, గవర్నరే వారి దగ్గరకు వచ్చినా, ఉద్దేశం ఒకటే. కష్ట కాలంలో, గవర్నర్ నుంచి సహాయం కోరుకునే వారు, కేవలం ఎన్నికైన ప్రజా ప్రతినిధులే కావాలని లేదు. సామాన్య ప్రజానీకం కూడా కావచ్చు. బహుశా రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలను, రాజ్యాంగ అధినేతగా, తరచూ కేంద్రానికి-ప్రధానికి-రాష్ట్రపతికి తెలియచేయడం మంచిదని గవర్నర్ నరసింహన్ భావిస్తుండవచ్చు. ఆయన చర్యలను ఆక్షేపించడం గాని, వాటికి దురుద్దేశం ఆపాదించడం కాని, అపార్థాలు వెతకడం గాని చేయడం భావ్యం కాదు. భారత దేశంలో రాజకీయ పార్టీలు కోకొల్లలు. ఒక్కో పార్టీకి, ఒక్కో అవసరానికి, ఒక్కో రకమైన సిద్ధాంతం వుంటుంది. ప్రాంతీయ పరమైన, భాషా పరమైన, కుల-మత పరమైన పార్టీలెన్నో వున్నాయి. ఆ పార్టీల పక్షాన ఎన్నికై అధికారంలోకి వచ్చినవారు-ప్రతిపక్షంలో కూర్చున్న వారు, వారి-వారి పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా వ్యవహరించే ఆస్కారం లేదు. మత విద్వేషాన్ని, భాషా దురభిమానాన్ని, ఒక ప్రాంతం వారు మరో ప్రాంతం వారిని దోపిడీకి గురి చేయడాన్ని రెచ్చగొట్టినప్పుడు, కలిగే దుష్ఫలితాలను అదుపులో పెట్టడంలో ప్రజా ప్రతినిధులు (ముఖ్యమంత్రి-మంత్రి వర్గ స్థాయి వారితో సహా) విఫలమైతే, రాజ్యాంగానికి కట్టుబడ్డ గవర్నర్ పరిస్థితిని చక్కదిద్దడానికి, నెలకో-వారానికో ఢిల్లీకి వెళ్లి వస్తే తప్పేంటి?

గవర్నర్ పేరుపైన ప్రభుత్వ నిర్ణయాలు, ప్రకటనలు, ఉత్తర్వులు జారీ కావడం తెలిసిన విషయమే. రాజకీయ నాయకులు ఎన్ని చెప్పినప్పటికీ, గవర్నర్ పాత్రకు ప్రాధాన్యత వుందని, ఏ ఐఏఎస్ అధికారిని అడిగినా ఒప్పుకోవడానికి క్షణం కూడా ఆలోచించరు. గవర్నర్ కేవలం రాజ్యాంగంలో పొందుపరచిన వ్యక్తి మాత్రమే కాదు. "రబ్బర్ స్టాంపు" అసలే కాదు. పలు సాంఘిక-సంక్షేమ కార్యక్రమాలకు రాజ్యాంగ రీత్యా పర్యవేక్షకుడు. ఆయన ఆధ్వర్యంలో రెడ్ క్రాస్, హరిజన-గిరిజన సంక్షేమం, కుష్టువారి పునరావాసం, విలువ కట్టలేని తర-తరాల వారసత్వ సంపద పరిరక్షణ, విశ్వ విద్యాలయాల వ్యవహారాలు, రక-రకాల రాజ్యాంగం నిర్దేశించిన సహాయ కార్యక్రమాలు అమలు చేయాల్సి వుంటుంది. బడుగు వర్గాల అభ్యున్నతి ఆయన కనీస ధర్మం. రాష్ట్ర ప్రజల్లో ఐకమత్యానికి, సమగ్రతా భావాలకు, స్థిరత్వానికి కూడా గవర్నర్ బాధ్యుడు.

రాజ్యాంగం నిర్దేశించిన విధంగా, గవర్నర్ ముఖ్యమంత్రికి, మంత్రివర్గ సహచరులకు కష్ట-సుఖాలలో తోచిన సలహాలు ఇవ్వడం తప్పే మీ కాదు. ఆ మధ్యన ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యదర్శి స్థాయి అధికారులను రప్పించుకుని, శాఖాపరంగా తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకున్నారు గవర్నర్. దాన్నీ విమర్శించిన వారున్నారు. తన ప్రభుత్వ కార్య కలాపాలను తెలుసుకుంటున్నాడే తప్ప అందులో దురుద్దేశం ఏమీ లేదు కదా ! గవర్నర్ మంత్రివర్గం సభ్యులకు ఇచ్చిన సలహాలను వారెంతవరకు పాటించుతారనేది, గవర్నర్ ఇచ్చే విషయం పైన-మంత్రులు ఆ సలహాను ఏ కోణం నుంచి చూస్తారన్న అంశంపైన ఆధార పడి వుంటుంది. త్రివేది గవర్నర్ గా వున్నప్పుడు, దైనందిన పాలనా వ్యవహారాల్లో ఆయన మంత్రులకు సలహాలను ఇచ్చేవారని-వాటిని వారు మరో ఆలోచన లేకుండా తిరస్కరించే వారని చెప్పుకునేవారు. బహుశా ఆ నేపధ్యంలో, సలహాలను ఇచ్చే శైలిలో మార్పొచ్చిందేమో ! పట్టం థాను పిళ్లై గవర్నర్ గా వున్నప్పుడు, హరిజన వసతి గృహాల విషయంలో జోక్యం చేసుకుని, వాటి స్థితిగతుల విషయంలో శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆ సలహాను వారు పాటించారు. ప్రస్తుత గవర్నర్ నరసింహన్ ఒకసారి తన ఏలూరు పర్యటనలో భాగంగా, నిర్మల్ పురస్కారాలను అందుకున్న గ్రామాలకు కేంద్ర ప్రోత్సాహానికి అదనంగా మరో లక్ష రూపాయలను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ఆయన కోరికను వెంటనే అంగీకరించిన వ్యవసాయ మంత్రి రఘువీరా రెడ్డి దానికి సంబంధించిన ప్రకటన తక్షణమే చేశారు. ఏ విధానమైనా, ఆచరణలో పెట్టేవారి నిజాయితీని బట్టి సానుకూలమవుతుంది. వ్యక్తిగతమైన అభిమానాలకు-దురభిమానాలకు పాల్పడితే దేశ శ్రేయస్సు, రాష్ట్ర శ్రేయస్సు దెబ్బతింటుంది.

ఏదేమైనా, తొందరపడి గవర్నర్‌ను విమర్శించడం, వ్యవస్థనే కించపరచడం భావ్యం కాదు. రాజ్యాంగ బాధ్యతలు తెలియకుండా గవర్నర్ వ్యవహరిస్తాడని విమర్శించడం పొరపాటు.

2 comments:

  1. క్షమించాలి అసలు Governer మాట్లాడితే ఢిల్లీ వెళ్ళాసిన పని ఏమిటి ఆయన ప్రయాణ రుసుములు ఎవరివి?

    ReplyDelete
  2. Vijayaraghava Chilakapati
    Yesterday 8:12 PM
    People say that I resemble Governor Narasimhan. Seems true. Whom to meet, when to meet, when not to meet is one's discretion, not to speak of Governor. He is, further, not elected to be available to each and every one round the clock. Let us respect the people and their positions. CVR

    ReplyDelete