Friday, November 9, 2012

శ్రీరామచంద్రుడు సాక్షాత్తు దేవుడే!: వనం జ్వాలా నరసింహారావు


శ్రీరామచంద్రుడు సాక్షాత్తు దేవుడే!
వనం జ్వాలా నరసింహారావు

రాముడు చెడ్డవాడంటూ ఇటీవల కాలంలో కొందరు కొన్ని వితండవాదాలు లేవదీస్తున్నారు. రాముడే కాదు లక్ష్మణుడూ అలాంటివాడే నని కూడా దబాయిస్త్రున్నారు. రాముడు మంచివాడైతే సీతా దేవిని అడవులకెందుకు పంపించాడని ప్రశ్న కూడా వేస్తున్నారు. వాటన్నిటికీ సమాధానమే ఈ ప్రయత్నం.

వాల్మీకిని రామాయణం రాయమని ప్రోత్సహించడానికి వస్తాడు నారదుడు. అలా వచ్చిన నారదుడిని, "గుణవంతుడు, అతివీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యశీలుడు, సమర్థుడు, నిశ్చలసంకల్పుడు, సదాచారం మీరనివాడు, సమస్త ప్రాణులకు మేలు చేయాలన్న కోరికున్నవాడు, విద్వాంసుడు, ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, కోపాన్ని స్వాధీనంలో వుంచుకున్నవాడు, ఆశ్చర్యకరమైన కాంతిగల వాడు, అసూయ లేనివాడు, రణరంగంలో దేవదానవులను గడ-గడలాడించ గలవాడు ఎవరైనా వున్నారా ఈ భూలోకంలో?" అని పదహారు ప్రశ్నలు వేస్తాడు వాల్మీకి. నారదుడు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తాడు. బాల్యంలోనే శ్రీరాముడు గుహుడు లాంటి (నీచ) జాతి వారితో సహవాసం చేయడంతో, ఆయన "గుణవంతుడు" అయ్యాడు. తాటకాది రాక్షసులను చంపి "వీర్యవంతుడు" అయ్యాడు. గురువాజ్ఞ మీరక పోవడం-జనకాజ్ఞ జవదాటక పోవడం-పరశురాముడిని చంపక పోవడం లాంటివి ఆయన "ధర్మజ్ఞుడు" అని తెలుపుతాయి. అయోధ్య కాండ వృత్తాంతమంతా శ్రీరాముడిని సత్యవాదిగా-దృఢవ్రతుడిగా-సచ్చరిత్రుడుగా తెలుపుతుంది. విద్వాంసుడు-సమర్థుడు అనే విషయాలను కిష్కింధ కాండలో హనుమంతుడితో జరిపిన సంభాషణ-వాలి వధల ద్వారా అర్థమవుతుంది. కాకాసుర రక్షణ శ్రీరాముడి సచ్చరిత్రను-సర్వ భూత హితాన్ని అరణ్య కాండ ద్వారా తెలుపుతుంది. సుందర కాండలో హనుమంతుడి రామ సౌందర్య వర్ణన ఆయనెంత ప్రియ దర్శనుడనేది తెలుపుతుంది. విభీషణ శరణాగతి ద్వారా రాముడి ఆత్మవంతుడి లక్షణాన్ని బయటపెడుతుంది. ఇంద్రజిత్తుపై కోపించక పోవడం, చేజిక్కిన రావణుడిని విడిచిపెట్టడం, రాముడి జితక్రోధత్వాన్ని తెలుపుతుంది. విరోధైన రావణుడిని మెచ్చుకోవడమంటే రాముడికి అసూయ లేదనే కదా. ఇలానే రాముడు కాంతియుక్తుడనీ-భయంకరుడనీ పలు సందర్భాల్లో అర్థమవుతుంది.

వాల్మీకి శ్లాఘించిన గుణాలు అసమానమైనవి. ఒక్కో గుణంలో అంతర్లీనంగా ఇంకొన్ని వుండడంతో అవి అనేకమయ్యాయి. మనుష్యమాత్రులందు ఇవి కనపడవు. ఇట్టి సుగుణ సంపత్తికలవాడు, ఇక్ష్వాకుల మహారాజు వంశంలో, రామా రామా రామా, అని లోకులు పొగిడే రామచంద్రమూర్తి అనే పేరుగలాయన మాత్రమే. అతివీర్యవంతుడాయన. అసమానమైన-వివిధమైన-విచిత్రమైన శక్తిగలవాడు. స్వయంగా ప్రకాశించగలడు. అతిశయం లేని ఆనందంగలవాడు. ఇంద్రియాలను-సకల భూతాలను వశపర్చుకున్నాడు. సర్వం తెలిసినవాడు. నీతే ప్రధానం ఆయనకు. పరులకు హితమైన, ప్రియమైన మాటలు చెప్తాడు. శ్రీమంతుడు. ఎవరిపై శత్రు భావం లేకపోయినా, తనను ఆశ్రయించిన వారిని ద్వేషిస్తే, వారిని నాశనం చేసే వాడు. ఎత్తైన మూపురాలున్నవాడు. బలిసిన చెక్కిళ్లవాడు.

శంఖంలాగా మూడు రేఖలున్న కంఠముందాయనకు. విశాలమైన వక్షస్థలమున్నవాడు. గొప్పదైన విల్లు ధరిస్తాడు. ఆశ్రిత పాపాలనే శత్రు సమూహాలకు ప్రళయకాల యముడిలాంటి వాడు. యుద్ధంలో భయంకరుడు. శ్రీరామచంద్రమూర్తి చేతులు మోకాళ్లకు తగిలేంత పొడుగ్గా వుంటాయి. అందమైన వక్షం, అసమాన సౌందర్యమున్న నొసలు, చూసేవారిని మైమరిపించే నడక గలవాడు. అందంగా-శాస్త్రంలో చెప్పినట్లుగా, పరిమాణంలో ఒకదానికొకటి సరిపోయే అవయవాలున్నాయి. ప్రకాశించే దేహ కాంతి, భయంకరమైన శత్రువులకు సహించలేని ప్రతాపం, మనోహరమై-బలిసిన మంచి వక్షం వున్నవాడు. కీర్తించదగిన నిడివి, వెడల్పాటి కళ్లు, ఎదుటివారు మెచ్చుకునే వేషం, శ్లాఘ్యమైన శుభ చిహ్నాలు, శుభం కలిగించే ఆకారం, మంచి గుణాల మనోహరుడాయన. కనుబొమలు, ముక్కు పుటాలు, కళ్లు, చెవులు, పెదాలు, చను ముక్కులు, మోచేతులు, మణికట్టు, మోకాళ్లు, వృషణాలు, పిరుదులు, చేతులు, కాళ్లు, పిక్కలు, ఎవరికి సమానంగా వుంటాయో వారు భూమిని ఏలుతారని సాముద్రిక శాస్త్రంలో వుంది. జంట-జంటగా వుండే ఈ అవయవాలలో, జంటలోని రెండు, ఒకదానికొకటి సమానంగా వుండడమే కాకుండా ఆకారం సరిగా వుండాలి. ఇవన్నీ రాముడికున్నాయని భావన.

ఆశ్రితులు అనుభవించేందుకు అనువైన-యోగ్యమైన దివ్య మంగళ విగ్రహానికి తోడు, ఆశ్రితులను రక్షించేందుకు అనువైన గుణాలు కూడా వున్నాయి. శ్రీరామచంద్రుడు ప్రశస్తమైన ధర్మజ్ఞానంగలవాడు. క్షత్రియులకు ప్రశస్త ధర్మమైన శరణాగత రక్షణను ముఖ్య వ్రతంగా ఆచరించేవాడు. చేసిన ప్రతిజ్ఞ తప్పనివాడు. సమస్త భూ జనులకు మేలైన కార్యాలనే చేసేందుకు ఆసక్తి చూపేవాడు. దానధర్మాలు, స్వాశ్రితరక్షణ వల్ల లభించిన యశస్సు, శత్రువులను అణచినందున వచ్చిన కీర్తిగలవాడు. సర్వ విషయాలు తెలిసినవాడు. బ్రహ్మ జ్ఞాన సంపన్నుడు. మిక్కిలి పరిశుద్ధుడు. ఋజుస్వభావం గలవాడు. ఆశ్రిత రక్షకుడు. ఆత్మతత్వం ఎరిగినవాడు. ఆశ్రితులకు, మాత, పిత, ఆచార్యులకు, వృద్ధులకు వశ పడినవాడు. విష్ణువుతో సమానుడు. శ్రీమంతుడు. లోకాలను పాలించ సమర్థుడు. ఆశ్రిత శత్రువులను, తన శత్రువులనూ అణచగలిగినవాడు. ఎల్ల ప్రాణికోటిని రక్షించాలన్న కోరికున్నవాడు. ధర్మాన్ని తానాచరిస్తూ, ఇతరులతో ఆచరింపచేసేవాడు. స్వధర్మ పరిపాలకుడు. స్వజనరక్షకుడు. వేద వేదాంగాలను రహస్యార్థాలతో ఎరిగినవాడు. కోదండ దీక్షాపరుడు. సర్వ శాస్త్రాల అర్థాన్ని నిర్ణయించగల నేర్పరి. జ్ఞాపకశక్తిగలవాడు. విశేషప్రతిభగలవాడు. సమస్త ప్రపంచానికి ప్రియం చేసేవాడు. సాధువు. గంభీర ప్రకృతిగలవాడు. అన్ని విషయాలను చక్కగా బోధించగలవాడు. నదులన్నీ సముద్రానికి పారినట్లే ఎల్లప్పుడూ ఆర్యుల పొందుగోరేవాడు. అందరిమీద సమానంగా వారి, వారి యోగ్యత కొద్దీ ప్రవర్తించేవాడు. గొప్పగుణాలున్నవాడు. ఎప్పుడూ, ఏకవిధంగా, మనోహరంగా దర్శనమిచ్చేవాడు. సమస్తభూతకోటికి పూజ్యుడు. అన్నింటా గుణ శ్రేష్ఠుడు. కౌసల్య ఆనందాన్ని అభివృద్ధి చేస్తూ, కౌసల్యా నందనుడని పేరు తెచ్చుకున్నాడు. గాంభీర్యంలో సముద్రుడంతటివాడు. ధైర్యంలో హిమవత్పర్వత సమానుడు. వీర్యాధిక్యంలో విష్ణు సమానుడు. చంద్రుడిలా చూసేందుకు ప్రియమైన వాడు. కోపంలో ప్రళయకాలాగ్ని. ఓర్పులో భూదేవంతటివాడు. దానంలో కుబేరుడు. అసమాన సత్యసంధుడు. ధర్మానికి మారుపేరు. ఇటువంటి పురుషోత్తముడికి సరితూగేవారు లోకంలో ఎవరూ లేరు. శ్రీరామచంద్రమూర్తి సామాన్య రాజని తలచడం సరైంది కాదు.  

పంచవటిలో సీతారామ లక్ష్మణులున్నప్పుడు, రామ లక్ష్మణులిద్దరూ లేని సమయంలో ఒంటరిగా వున్న సీతను అపహరించుకుని పోతాడు రావణుడు. సీతను విడిపించే ప్రయత్నంలో రావణాసురుడి చేతుల్లో దెబ్బతిని, చనిపోవడానికి సిద్ధంగా వున్న జటాయువును చూసి, ఆయన ద్వారా తన భార్యాపహరణం గురించి విని ఎంతో బాధపడ్తాడు రాముడు. తన తండ్రికి ఎలాచేయాల్నో అదే రీతిలో, చనిపోయిన జటాయువుకు దహనసంస్కారాలు చేశాడు రాముడు. తనవల్ల కదా జటాయువుకింత దుఃఖం కలిగిందని బాధపడి విలపిస్తాడు. రామచంద్రమూర్తి విష్ణువు అవతారమైనందున ఆయనకు ఇతర మానవులవలె శోక మోహాలుంటాయా అన్న సందేహం కలగొచ్చు. మనుష్యులకెలాంటి శోక మోహాలు ప్రాప్తిస్తాయో, అలానే రాముడికి ప్రాప్తించాయని భావించరాదు.   మనిషికి శోక మోహాలు కలగడానికి కారణం కామ-క్రోధాలే. ప్రకృతి పరిణామమే దేహం. ప్రకృతి గుణమే రజస్సు. రజో గుణాలవల్ల జన్మించినవే కామ-క్రోధాలు. కామం విఘ్నమైతే కోపంగా మారుతుంది. ఇష్టపడే వస్తువు దొరక్కపోయినా-పోగొట్టుకున్నా శోకం కలుగుతుంది. మోహానికీ కారణం కోపమే. ప్రకృతి పరిణామమైన దేహం, ప్రకృతి గుణాలైన సత్వ-రజస్సు-తమస్సులను కలదై వుంటుందనీ, కొద్దో-గొప్పో ఈ మూడు గుణాలు లేకుండా దేహి వుండడనీ, రజస్సు కారణాన శోక-మోహాలు కలుగుతాయని, ఇవన్నీ పూర్వ జన్మలో చేసిన పాపాల మూలాన ఈ జన్మలో ఫలితం అనుభవించాల్సివస్తుందనీ శాస్త్రం చెప్తుంది.

అంటే, ప్రకృతి బద్ధుడైన పురుషుడు, ప్రకృతి గుణాలైన శోక-మోహాల వలన పీడించ బడుతాడని అనుకోవాలి. అలాంటప్పుడు ప్రకృతికి అతీతుడైన విష్ణువు, ప్రకృతి గుణాల మూలాన ఎలా పీడించబడుతాడన్న సందేహం కలగొచ్చు. అవతార దశలో ప్రకృతికి విష్ణువు కూడా బద్ధుడనే సమాధానం చెప్పుకోవాలా? రామావతారం పూర్ణావతారమే. అంటే ప్రకృతి సంసర్గం లేదు. శరీరం అప్రాకృతం. ప్రకృతి గుణాలు ఆయన్ను బాధించవు. రామచంద్రమూర్తి శోకించాడని వాల్మీకి రాసిందీ అసత్యం కాదు. నిజంగానే శోకం కలిగిందాయనకు. అయితే శోకం కలిగింది తనకొచ్చిన కష్టానికి కాదు. తమకు దుఃఖాలొచ్చాయని మనుష్యులు దుఃఖిస్తారు. తనకై, తన ఆప్తులకు దుఃఖం కలిగిందికదానని, తన మూలాన వీరికింత దుఃఖం ప్రాప్తించిందికదానని, వారి దుఃఖాన్ని ఆపాల్సిన తానే వారి దుఃఖానికి కారణమయ్యానేనని మాత్రమే రాముడు శోకించాడు. అలానే, సీతాదేవి విషయంలోనూ దుఃఖించాడు శ్రీరాముడు. తనను నమ్మి అడవులకు వచ్చిన సీతను, రాక్షసుడు ఎత్తుకుపోతే, తనను వదిలిన బాధతో, అమెకెంత దుఃఖం కలిగిందోనని రామచంద్రమూర్తి దుఃఖించాడు. వియోగంవల్ల తమకు కలిగిన నష్టానికి దుఃఖించే వాళ్లు మనుష్యులు. జీవులకు కలిగిన నష్టానికి దుఃఖించేవాడు భగవంతుడు.

పంపా తీరంలోని వనంలో హనుమంతుడిని చూసి, ఆయన మాటపై గౌరవం వుంచి, సుగ్రీవుడితో స్నేహంచేసాడు రాముడు. తనకథ, సీత వృత్తాంతం మొత్తం ఆయనకు చెప్పాడు. చెప్పిన తర్వాత, సుగ్రీవుడు రాముడితో అగ్ని సాక్షిగా స్నేహితులయ్యారు. రాముడు వానరుడితో స్నేహం చేశాడంటే అది అతడి సౌశీల్యాతిశయం గురించి చెప్పడమే. గుహుడు హీనజాతివాడైనా, పురుషుడైనందున అతనితో స్నేహం చేసినందువల్ల రాముడి సౌశీల్యం చెప్పడం జరిగింది. హీన స్త్రీ అయిన శబరితో స్నేహం చేయడంవల్ల రాముడు మిక్కిలి సౌశీల్యవంతుడయ్యాడు. వానరుడైన సుగ్రీవుడితో స్నేహమంటే మీదుమిక్కిలి సౌశీల్యం చూపడం జరిగింది.

శ్రీరామచంద్రుడు వానర సేనలతో సముద్రం దాటి, లంకలో నిర్భయంగా ప్రవేశించి, యుద్ధభూమిలో రావణుడిని చంపి, సీతాదేవిని చూసి, ఇన్నాళ్ళూ పగవాడింట్లో వున్న ఆడదానిని ఎట్లా స్వీకరించాలా అని సిగ్గుపడి, సీతాదేవిని కఠినోక్తులాడుతాడు. పతివ్రతైన సీత, తన పాతివ్రత్య మహిమను లోకానికంతా తెలపాలని తలచి, లక్ష్మణుడు పేర్చిన చితిలో మండుటెండలో ప్రవేశిస్తుంది. అప్పుడు అగ్నిహోత్రుడు సీతను బిడ్డలాగా ఎత్తు కొచ్చి, సీతాదేవి వంటి పతివ్రతలు లోకంలో లేరనీ, ఆమెలో ఎట్టి లోపించలేదని, ఆమెను గ్రహించమని శ్రీరామచంద్రమూర్తికి అప్పగిస్తాడు. శ్రీరాముడామెను మరల స్వీకరించి, బ్రహ్మ రుద్రాదిదేవతలందరు మెచ్చుకుంటుంటే సంతోషిస్తాడు.

దేవతా సమూహాల గౌరవం పొందిన శ్రీరామచంద్రమూర్తి, తను చేసిన పని, లోకోపకారం-లోక సమ్మతమైన పనైనందున, సంతోషపడ్తాడు. సీతామహాలక్ష్మి తోడుండగా, శ్రీరామచంద్రమూర్తి రాజ్యలక్ష్మిని తిరిగి యదార్థంగా పొందడంతో ముల్లోకాలు మిక్కిలి సంతోషించాయి. శ్రీరామచంద్రుడు రాజ్యం చేసేటప్పుడు లోకాలన్నీ సంతోషించాయి. సంతోషాతిశయంతో కలిగిన గగుర్పాటుతో సాదువులు, ధర్మాత్ములు బలపడ్డారు. శ్రీ రామరాజ్యంలో సాదువులు చేసే శ్రీరామ సేవకు విరోధమైన మనోవేదనలుకాని, రోగబాధలుకాని, యీతిబాధలుకాని లేవు. పుత్రశోకం ఏ తల్లితండ్రులకు కలగలేదు. స్త్రీలు పాతివ్రత్యాన్ని విడవలేదు. వారికి వైధవ్య దుఃఖం లేదు. ఎక్కడా అగ్నిభయంలేదు. శ్రీ రామరాజ్యంలో నీళ్లలో పడి చనిపోయినవారు లేరు. పెద్దగాడ్పులతో ప్రజలు పీడించబడలేదు. దొంగలు లేరు. ఆకలికి-జ్వరానికి తపించినవారు లేరు. నగరాలలో, గ్రామాలలో, నివసించే జనులు ధన-ధాన్యాలు విస్తారంగా కలిగి, భోగభాగ్యాలతో కృతయుగంలో లాగా మిక్కిలి సుఖమనుభవించారు. శ్రీరాముడు అనేక అశ్వమేధ యాగాలను, యజ్ఞాలను చేసి, బ్రాహ్మణులకు లెక్కపెట్ట లేనన్ని ఆవులను, ధనాన్ని దానమిచ్చి, తన సుఖాన్ని వదులు కోనైనా ప్రజలకు సుఖం కలిగేటట్లు ధర్మ పద్ధతిలో రాజ్యపాలన గావించి, వైకుంఠ లోకానికి పోయాడు. శ్రీరామచంద్రమూర్తి, రాజ్య హీనులై నానా దేశాలలో తిరుగుతున్న పూర్వ రాజుల వంశాల వారిని పిలిపించి, వారి పెద్దల రాజ్యాన్ని వారికిచ్చి, వారంతా స్వధర్మాన్ని వీడకుండా కాపాడాడు. బ్రాహ్మణ-క్షత్రియ-వైశ్య-శూద్రులనే నాలుగు వర్ణాల వారిని చక్కగా పరిపాలించాడు. స్వధర్మానుష్ఠానమే మోక్షకారణమనీ, పరధర్మానుష్ఠానం పతనకారణమనీ తెలియచేశాడు. పదకొండువేల సంవత్సరాలు ఇలా రాజ్యాన్ని పాలించి విష్ణు లోకానికి చేరుకుంటాడు శ్రీరామచంద్రమూర్తి.

రామాయణం పరిశుద్ధంగా చదివేవారికి, వినేవారికి మూడు విధాలైన సమస్త పాపాలు హరించి పోయి, ఏమాత్రం ఆలస్యం లేకుండా మోక్ష ఫలం కలుగుతుంది. అంతశక్తి దీనికుండటానికి కారణం, ఇది వేద స్వరూపమై, వేదార్థాన్నే బోధిస్తుంది కాబట్టి. అంతేకాదు, సంసార సాగరాన్ని తరింపచేస్తుంది కూడా. ఇది వినేవారు-చదివేవారు, అంతమాత్రాన సన్యాసులు కానవసరం లేదు. ఆయుస్సు పెరిగి, కొడుకులు-కూతుళ్లతో, మనుమలు-ఇష్ట బంధువులతో అనుభవించి, మరణించిన తర్వాత మోక్షాన్ని-బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది. పరిమితి చెప్పనలవికాని మహత్త్వమున్న యీ రామాయణ గ్రంథాన్ని శాస్త్ర ప్రకారం చదివినా, ఇతరులు చదవగా విన్నా, అర్థ విచారం చేసినా, బ్రాహ్మణుడికి వేద వేదాంగాలు అధ్యయనం చేస్తే ఎలాంటి ఫలం కలుగుతుందో అలాంటిదే కలుగుతుంది. క్షత్రియుడికి సర్వాధిపత్యం కలుగుతుంది. వైశ్యుడికి వ్యాపార లాభం కలుగుతుంది. శూద్రుడికి అపారమైన గొప్పతనం లభిస్తుంది. కాబట్టి నాలుగువర్ణాలవారు, స్త్రీ-పురుషులు, దీన్ని చదవాలి-వినాలి. విషయ చింతన చేయాలి. వినేవారుంటే చదివి వినిపించాలి. చదివేవారుంటే వినాలి. ఈ రెండూ జరగని కాలముంటే, విన్నదానిని-కన్నదానిని, విశేషంగా మననం చేయాలి. ఏదోవిధంగా మనస్సు దీనిపై నిలపాలి.

అందుకే-ఇందుకే రాముడు దేవుడయ్యాడు. మూఢత్వంతో చిన్న విషయాలను, గోరంతను కొండంతగా చేసినట్లు చేసి, తమ అజ్ఞానాన్ని ప్రదర్శించి, తామేదో గొప్పవారిమన్న భావనకు రావడం మంచిది కాదు.

8 comments:

  1. గుణం,శీలం,సత్ప్రవర్తన,సత్యం,ధర్మం వీటి మీద సదభిప్రాయమే లేనివారికి ఇదంతా చెడ్డగా కనపడటం వింత కాదు. రాముణ్ణి తిట్టినా, రామాయణం వారికి తోచినట్లు తిరగరాసినా కొద్ది మంది తప్పించి ఈ దేశంలో ఎక్కువగా మాట్లేడేవారు లేరు. భారత సంస్కృతి పూర్తి స్థాయి ప్రజాస్వామికం, జాబాలి చేసిన నాస్తికవాదాన్ని యధాతధం గా వాల్మీకి అందించాడు, నచ్చలేదని వదిలేయలేదు.నాస్తిక వదం ఎందుకు పనికిరాదో చెపేడు రాముడు. అర్ధం చేసుకోలేని చిన్న బుర్రలని చూసి జాలి పడాలి. తిట్టే నోళ్ళు మూత పడతాయి, కాలం కలసిరావాలి. ఇటువంటి వాళ్ళెందరో కాలం లో కలిసిపోయారు, రామాయణం, రాముడు, సీత అలా వెలుగొందుతూనే ఉన్నారు, ఉంటారు కూడా. మీకు ధన్యవాదాలు.

    ReplyDelete
  2. సూర్యుడి ముందు దీపం వెలిగించి, నా దీపమే గొప్పదని గర్వంతో విర్రవీగే వారిని చూసి ఏమనాలి? జాలి పడడం తప్ప? వెలిగించిన వాడూ శాశ్వతం కాదు, దీపం శాశ్వతం కాదు. కాని సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు. రాముడు దేవుడై వెలుగొందుతూనే ఉంటాడు.. రామాయణం అజరామరంగా ఉంటుంది.. కాదని వాదించే మూడ బుద్దుల వారిని ఎలా మార్చగలం? సమయాను సారంగా మంచి విషయాన్ని అందించారు... ధన్యవాదాలు...

    ReplyDelete

  3. శ్రీరామ రామ రామేతి రమే రామే మనో రమే
    సహస్ర నామ తత్ తుల్యం రామ నామ వరాననే !!

    జై శ్రీరామ !!

    ReplyDelete
  4. వచ్చిన గొడవేమిటి అంటే, ఇలా రామాయణాన్ని వ్యతిరేకించే వాళ్ళు నాస్తికులు కాదు. ఇతర మతస్తులూ కాదు. అలా చేసేది, కమ్యూనిస్టు "భక్తులు". వాళ్ళు ఇజం అని పిలుచుకునే "మతాన్ని" పొరబాటున ఎవరన్నా చర్చ చేస్తూ విమర్శించినా సరే ఇంతెత్తున లేచి, వాళ్ళకు మాత్రమే తెలిసిన కొన్ని పడికట్టు మాటలతో పిడి వాదన చేస్తూ. ఆవతలి వాళ్ళను దుమ్మెత్తిపోస్తూ, బూర్జువాలు,అభివృధ్ధి నిరోధకులు వంటి మాటలు యెధేచ్చగా వాడేస్తారు. నిన్నగాక మొన్న పుట్టి, గట్టిగా వందేళ్ళు నిలవలేని ఇజమే గొప్ప అనుకోవటమే అభ్యుదయవాదమైతే, వేల సంవత్సరాలనుండీ ప్రజల మనస్సులో ఉండి, కోట్లమందికి మార్గదర్శనం చేస్తున్న రామాయణాన్ని తిట్టటం వాళ్ళ సంకుచిత్వం అని వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోలేని అజ్ఞానంలో పడి ఉన్నారు అని నా అభిప్రాయం. కమ్యూనిజానికి, ఆ ఇజం ప్రచారం చేస్తున్నామనుకుంటూ తెలిసీ తెలియనితనంతో అవాకులూ చెవాకులూ తెగ వ్రాసే వాళ్ళే ఎక్కువ ప్రమాదకారులు. వాళ్ళవల్లే ఆ ఇజం అంటె ప్రజల మనస్సుల్లో చీదర, అసహ్యం పుట్టేది. ఈ విషయం వాళ్ళను ఇలా వ్రాయటానికి నియమమించినవాళ్ళు గమనించుకుంటె ఎంతైనా మంచిది.

    ReplyDelete
  5. Jwala garu,

    I read both the blogs with interest. I truly enjoyed reading them. You have very concisely put together the characteristics of Rama and Ravana very well. As Sudesh suggested, perhaps all that you wrote may not be from one source.

    You started off very well indicating that Narada asked Valmiki to write about a perfect character (as seen in those times) and Valmiki obliged and responded with a character which meet all requirements. After great narration, you have suddenly started writing about the benefits of reading Ramayana.

    రామాయణం పరిశుద్ధంగా చదివేవారికి, వినేవారికి మూడు విధాలైన సమస్త పాపాలు హరించి పోయి, ఏమాత్రం ఆలస్యం లేకుండా మోక్ష ఫలం కలుగుతుంది.

    I could not really understand this part. I am not questioning the greatness of the epic nor I belong to those who talk ill of Rama or Ramayana. The fact that Ramayana stayed in the minds of so many people for such a long time, it tells how much of impact it created on the psychs of many people even today. However, why suddenly move into the kind of rhetoric in the above paragraph? Of course, you can get acceptance from many believers that Rama is God and that is the only proof you gave. That did not seem fair from that point onward.

    Creation of a perfect character does not make one God. Or does it? James Bond movies show perfect MI6 agent who does not die or get hurt under any circumstances. I agree that all good characteristics cannot be in one person. Is that the way a God is defined? Definition of ideal nature varies with time. Of course, that does not mean Rama is bad or Ramayana is bad. We should not attribute current values to the epics written few thousand years back.

    In my opinion, though you did a wonderful job in bringing the characteristics of Rama and Ravana very well, your article does not provide enough support to say that Rama is God.

    Sai of Houston Sahiteelokam

    ReplyDelete
  6. Swami Paripoornananda said the other day 'Indian women feel that
    husband is a live-God and insulting Ramayanam is insulting Indian
    women and they do not forgive'. Praising them to harass them. The
    goals of this guy ware same as the goals of Ramayana a few thousand
    years ago. Ikke bra. All the women who have immense respect for
    Ramayanam should immediately stop nagging with their husbands. All the
    men who have immense respect for Ramayanam should never disagree with
    their dads or elder brothers. If not, it is not Ramayanam that they
    are impressed with, it is with our forefathers who created it. I hear
    sometimes that 'we should be thankful of mr.x for making Telugu people
    proud', even though no body outside AP notices who he is or what he
    did. Ramayanam is a similar concept.
    Ravireddy, Houston Sahiteelokam

    ReplyDelete
  7. Jwala garu,

    I read the blogs.
    The posting is very concise and nice.
    I did not read them for justifying and finding reasons to believe why Sri Ram is god incarnate.
    Reading these blogs gave me yet another opportunity to read Sri Ramayanam one more time completely, in a short time. Thanks for the effort Jwala garu.

    My comment on those who argue otherwise, like Jetmalani, Karunanudhi, Communists (as commented by Kappaganthula garu) is that such people existed even during the period of Sriramayanam. It is nothing new. They might continue to exist even in future. What we should do is not let ourselves influenced by such people and their silly arguments.

    The main reason Is due to Tamasic and Rajasic nature of beings, their cultural and societal background in which they are brought up. There is not much we can do Change their mind, nor can we do any thing to influence them. Satvik people who believe and worship Sriram will continue to exist also.


    Balamurali Krishna Goparaju, Houston Sahiteelokam

    ReplyDelete
  8. BLIND PEOPLE CAN NOT MAKE USE OF A MIRROR,JUST LIKE THAT PREJUDICED CAN NOT SEE THE LIGHT OF RAMAYANA. REPENTANCE COMES LATE. NO LESS IN THE CASE OF SO-CALLED OR UNCALLED FOR JURISTS LIKE JETHMALAANI.GOD SAVE THESE SOLITARY SOULS. VIJAYA RAGHAVACHARYULU Chilakapati

    ReplyDelete