Sunday, December 2, 2012

వామ పక్ష ఐక్యత అత్యంత అవశ్యం: వనం జ్వాలా నరసింహారావు



వామపక్ష ఐక్యత మిధ్యేనా?
సూర్య దినపత్రిక 
(14-12-2012) and (16-12-2012)
వనం జ్వాలా నరసింహారావు

భారత కమ్యూనిస్ట్ పార్టీ అతివాద, మితవాద వర్గాలుగా, తర్వాత నక్సలైట్లుగా-మావోఇస్టులుగా, మధ్యలో మితవాద వర్గం వారు డాంగే యులుగా-మొహిత్ సేన్ పక్షం వారిగా, చీలిపోవడానికి సైద్ధాంతిక విభేదాలతో సహా అనేక కారణాలున్నాయి. ఇరవయ్యో శతాబ్దపు మలి దశాబ్దంలో, భారత దేశంలో కార్మికవర్గ ఉద్యమాలు ఊపందుకుని, పలువురిని కమ్యూనిజం వైపు మళ్లడానికి ఊతమిచ్చాయి. ఎం ఎన్ రాయ్ పట్ల సోవియట్ కమ్యూనిస్ట్ నాయకుడు లెనిన్ కు ఏర్పడ్డ విశ్వాసం, 1920 లో, తాష్కెంటులో భారత కమ్యూనిస్ట్ పార్టీ స్థాపనకు దోహదపడింది. భారత దేశానికి మరి కొద్ది రోజుల్లో స్వతంత్రం రాబోతుండగా, భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులలో, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పట్ల-జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వం పట్ల అనుసరించాల్సిన విధానంలో భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. దరిమిలా, మూడు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా జరిగిన వీరోచిత తెలంగాణా సాయుధ ప్రతిఘటన సమస్యపై కమ్యూనిస్ట్ పార్టీ నాయకులలో పరస్పర విరుద్ధమైన తీవ్ర అబిప్రాయ భేదాలు తలెత్తడంతో, భారత కమ్యూనిస్ట్ పార్టీ భవిష్యత్ చీలికకు పునాదులు పడ్డాయి. పార్టీలోని విధానపరమైన అభిప్రాయ భేదాలు, భారత-చైనా యుద్ధం జరిగినప్పుడు బహిర్గతమయ్యాయి. చైనా ఏకపక్షంగా యుద్ధ విరమణ చేసిన తర్వాత, రాజీ మార్గంలో నడిచిన కమ్యూనిస్ట్ నాయకత్వం, మితవాద వర్గానికి చెందిన డాంగేను పార్టీ చైర్మన్ గా, మితవాద-అతివాద వర్గాలకు సమాన దూరంలో వున్న ఇ.ఎం.ఎస్ నంబూద్రిపాద్ ను సెక్రెటరీ జనరల్ గా నియమించింది. యుద్ధం నేపధ్యంలో, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన "చైనా అనుకూల వాదులు" గా భావించబడిన పలువురిని దేశవ్యాప్తంగా పీడీ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది.

క్రమేపీ సంభవించిన పరిణామాల మూలంగా పార్టీలో చీలిక అనివార్యమయింది. ఏప్రిల్ 11, 1964 న నంబూద్రిపాద్, జ్యోతిబసులతో సహా ముప్పై రెండు మంది డాంగే విధానాలను వ్యతిరేకిస్తూ, జాతీయ కౌన్సిల్ సమావేశాలనుంచి నిష్క్రమించడంతో, వారందరినీ పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది పార్టీ. దరిమిలా ఆంధ్ర ప్రదేశ్ లోని తెనాలిలో బహిష్కృత అతివాద వర్గం సమావేశమవడం, కలకత్తాలో జాతీయ కౌన్సిల్ సమావేశం జరపాలని తీర్మానించడం జరిగింది. అక్టోబర్-నవంబర్ 1964 లో కలకత్తా కాంగ్రెస్ పేరుతో అతివాద వర్గం, సమాంతరంగా బాంబేలో డాంగే నాయకత్వంలోని మితవాద వర్గం సమావేశాలు జరుపుకున్నాయి. కలకత్తాలో సమావేశమైన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) గా అవతరించగా, బాంబేలో సమావేశమైన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీ గా వుండిపోయారు.

కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా-ఆ తరువాత పన్నెండు గా చీలిపోవడంతో, కమ్యూనిస్ట్ ఉద్యమం బలపడిందా, లేదా, అందరికీ తెలిసిన విషయమే. కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలకు మాత్రమే కమ్యూనిస్టుల ప్రాబల్యం పరిమితమై పోయింది. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించి, ఆంధ్ర ప్రదేశ్ లో భాగమైన "తెలంగాణా సాయుధ పోరాటానికి" నాయకత్వం వహించిన ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ సొంతంగా మనుగడ సాగించే స్థితిలో లేదిప్పుడు. పార్టీ ఎదుగుదలకు కష్టపడిన పలువురు పార్టీని వదిలిపెట్టడమో, పార్టీ వారిని వదిలించుకోవడమో జరిగింది. 1981 లో, భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన డాంగేను, పార్టీ నుంచి బహిష్కరించారు. డాంగేను ఆయన కూతురు సారధ్యంలో ఆవిర్భవించిన "అఖిల భారత కమ్యూనిస్ట్ పార్టీకి" ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు ఆ తర్వాత. ఆ పార్టీకి రాజకీయంగా ఎదుగుదల సాధ్య పడకపోవడంతో, మోహిత్ సేన్ నాయకత్వంలో పనిచేస్తున్న "ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ" తో కలిసిపోయి "యునైటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ" గా విలీనమయింది. మరోవైపు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) పరిస్థితీ అంతే అనాలిఆంధ్ర ప్రదేశ్ లో వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఓంకార్ కూడా పార్టీని వదిలి వేరే కమ్యూనిస్ట్ పార్టీని నెలకొల్పారు. అదే విధంగా నల్గొండకు చెందిన మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, తెలంగాణా సాయుధ పోరాట వీరుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి కూడా పార్టీని వీడి మరో పార్టీ పెట్టారు. అఖిల భారత స్థాయిలో సోమనాథ్ ఛటర్జీ స్థాయి నాయకులనుంచి, ఆంధ్ర ప్రదేశ్ లోని ఖమ్మం జిల్లాలో పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్ట బడ్డ పలువురిని పార్టీ వదిలించుకుంది. మరోవైపు ఆ పార్టీ నుంచి నక్సల్‍బరీ ఉద్యమ ఫలితంగా విడిపోయిన తీవ్రవాదులు, మావోయిస్టులుగా సాయుధ పోరాటమే మార్గమని నమ్ముతున్నారింకా.


ఇందిరా గాంధికి, సోనియా గాంధికి అవసరమైనప్పుడల్లా, కాంగ్రెస్ పార్టీకి (ఉభయ) కమ్యూనిస్టులు అండగా నిలుస్తూ వస్తున్నారు. అసలా మాటకొస్తే, ప్రపంచంలోనే ప్రప్రధమంగా విప్లవం ద్వారా అధికారంలోకి వచ్చిన సోవియట్ యూనియన్ 1989 లో అధికారం కోల్పోయింది. 1949  లో అధికారంలో కొచ్చిన చైనా పార్టీలోను మార్పులు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో భవిష్యత్ లో భారత కమ్యూనిస్ట్ పార్టీల వ్యూహం ఎలా వుంటుందో చూడాలి.

కేరళలో ప్రభుత్వాలు మారినా కమ్యూనిస్టులకు, కాంగ్రెస్ పార్టీకి, ఓటింగ్ శాతంలో పెద్దగా మార్పుండదు. కేవలం రెండు శాతం తేడాతో అటు కాంగ్రెస్ కాని, ఇటు సిపిఎం సారధ్యంలోని వామపక్ష కూటమి కాని పాలన సాగిస్తోంది. ఇక పశ్చిమ బెంగాల్ విషయానికొస్తే, ఇప్పటికీ 40% ఓట్లు సిపిఎం ఖాతాలో వున్నాయి. మరెందుకు సిపిఎం అక్కడ ఓడిందంటే దానికి కారణాలు అనేకం వున్నాయి. ప్రధాన కారణం రాజకీయమే! ఒకప్పుడు పశ్చిమ బెంగాల్‌లో సిపిఎం, కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ నెలకొని వుండేది. 1977 నుంచి మొన్న ఓడి పోయేంతవరకూ అదే పరిస్థితి కొనసాగింది. ఆ నేపధ్యంలో తనకున్న బలంతో సిపిఎం సులువుగా గెలవడం సాధ్యపడింది. మొట్టమొదటి సారిగా, 2011 లో జరిగిన ఎన్నికలలో, కాంగ్రెస్-తృణమూల్ కాంగ్రెస్-కొన్ని ముస్లిం సంస్థలు-మావోయిస్టుల ఐక్య సంఘటనతో పోటీ చేసి ఓటమిపాలైంది సిపిఎం. అందరూ ఆ పార్టీ ఓటమికి కృషి చేశారు. ఆ పార్టీలలో ఏ ఒక్క దాన్నైనా బహుశా సిపిఎం అవలీలగా ఓడించి వుండేదేమో! ఎందుకు అన్ని పార్టీలు సిపిఎం కు వ్యతిరేకంగా అలా ఐక్యం అయ్యాయి? కారణాలు అనేకం.

పశ్చిమ బెంగాల్‌లో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతుంటే, తృణమూల్ కాంగ్రెస్ బలపడ సాగింది. ఆ పరిస్థితుల్లో కొంత రాజీ మార్గాన్ని అనుసరించి తృణమూల్ కాంగ్రెస్ తో సంధి కుదుర్చుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆ బాధ్యత నెత్తి నేసుకుని విజయం సాధించింది ప్రణబ్ ముఖర్జీ. మరి ముస్లింలకు ఎందుకు దూరమైంది సిపిఎం సారధ్యంలోని వామపక్ష ఐక్య సంఘటన? నందిగ్రాం కాల్పుల సంఘటనలో ముస్లింల మరణం వారిని సిపిఎంకు దూరం చేసింది. నందిగ్రాం సిపిఐ స్థానం. దానికి తోడు రాష్ట్రంలో అక్కడక్కడ చోటు చేసుకున్న మత కలహాలు కూడా ముస్లింలను వామపక్షాలకు దూరం చేసింది. సచార్ కమిటీ నివేదిక కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపింది. రాష్ట్రంలో ముస్లింల వెనుకబాటు తనాన్ని ఉదహరించింది. ఒక విధంగా ఆ నివేదిక సిపిఎం కళ్లు తెరిపించింది. సిపిఎంకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సచార్ కమిటీ నివేదికను ఉపయోగించుకున్నాయి. వాస్తవానికి సిపిఎం సారధ్యంలోని వామపక్ష ప్రభుత్వంలో ముస్లింలకు సామాజికంగా-రాజకీయంగా పెద్ద ఎత్తున లాభం చేకూరింది. అది వేరే విషయం.

ఇదిలా వుండగా పశ్చిమ బెంగాల్ లో అంతో-ఇంతో ప్రాబల్యం వున్న మావోఇస్టులు సిపిఎం పట్ల వున్న వ్యతిరేకతతో, వాళ్లకు పూర్తి ఆధిక్యం వున్న లాల్ గఢ్ లాంటి ప్రాంతాలలో గట్టి పోటే  ఇవ్వడంతో, వామపక్షాలకు అదనంగా నష్టం వాటిల్లింది. పార్టీకి చెందిన కొందరు మేధావులు మావోఇస్టులపై చర్యలు తీసుకోవడానికి వ్యతిరేకత చూపించడంతో, సిపిఎం నాయకత్వాన వున్న ప్రభుత్వం కొంత వారిపట్ల సంయమనం పాటించాల్సి వచ్చింది. ఆ కారణంగా వారు బలపడి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా తయారయ్యారు. వారు ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ కు సిపిఎంకు వ్యతిరేకంగా మద్దతు ఇచ్చినప్పటికీ, దరిమిలా, ప్రభుత్వానికి వ్యతిరేకమయ్యారు. వామపక్ష ఓటమికి మరో కారణం వారిలోని అనైక్యత కూడా. పశ్చిమ బెంగాల్ వామపక్ష కూటమిలో తలెత్తిన అభిప్రాయ భేదాలు, సిపిఎంపై ధిక్కార ధోరణి, కాంగ్రెస్ పార్టీపై స్థిరంగా పోరాడటానికి అవరోధాలయ్యాయి. పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలు కాకుండా త్రిపురలో కూడా వామపక్షాలు, ముఖ్యంగా సిపిఎం బలంగా వున్నాయి. ఈ మూడు రాష్ట్రాలు మినహాయిస్తే దేశంలో ఎక్కడా అవి నామ మాత్రపు పోటీ కూడా ఇచ్చే స్థితిలో లేవని అనవచ్చు.

ఇక ఆంధ్ర ప్రదేశ్ విషయానికొస్తే, 1964 చీలిక తరువాత, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలలో మాదిరి కాకుండా, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ పూర్తిగా చీలిపోయి, సిపిఎం-సిపిఐ లు దాదాపు చెరి సమానంగా పార్టీ కాడర్ ను పంచుకున్నాయి. కాకపోతే, నాయకత్వం చాలా మటుకు సిపిఐ వైపు మొగ్గితే, సభ్యుల పరంగా, పరపతి పరంగా-పలుకుబడి పరంగా సిపిఎం వైపుకు మళ్లింది. ఆస్తులు, వార్తా పత్రిక, కార్యాలయాలు దాదాపు మొత్తంగా సిపిఐకి దక్కాయి. ఇతర రాష్ట్రాల కంటే, సరి సమానంగా వున్న ఆంధ్ర ప్రదేశ్ లో రెండు పార్టీల మధ్య పోరాటం ప్రారంభమైంది. ఈ పోరాటానికి ప్రధాన కేంద్రం ఖమ్మం జిల్లా కావడం విశేషం. దీనికి కారణం లేకపోలేదు. జిల్లాలో సిపిఐ కాడర్ రీత్యా బలహీనంగా వున్నప్పటికీ, నల్లమల గిరిప్రసాద్ లాంటి రాష్ట్ర స్థాయి నాయకులు ఆ జిల్లాలో వుండడం జరిగింది. ఐనప్పటికీ, ఖమ్మం జిల్లాకు చెందిన నాయకులలో చాలా మంది (చిర్రావూరి, మంచికంటి, బోడేపూడి, డాక్టర్ వై.ఆర్.కె, పర్సా, కె ఎల్), కాడర్ లో 90% మంది, సిపిఎంతో వుండి పోయారు. పక్కనే వున్న కమ్యూనిస్ట్ లకు బలమైన మరో జిల్లా నల్గొండలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఆ జిల్లాలో మూడింట రెండు వంతుల మంది సిపిఎంతో, ఒక వంతు మంది సిపిఐతో వుండి పోయారు. జిల్లా నాయకత్వం సరి సమానంగా చీలిపోయిందనవచ్చు. భీమిరెడ్డి, మల్లు స్వరాజ్యం లాంటి వారు సిపిఎంతో, ధర్మ భిక్షం, ఆరుట్ల దంపతులు సిపిఐతో వుండి పోయారు. వ్యక్తిగతంగా ధర్మ భిక్షం, ఆరుట్ల దంపతులు బహుళ జనాదరణ పొందిన నాయకులు. అలానే సిపిఎం పక్షాన వున్న వారు కూడా. ఈ కారణాన ఆంధ్ర ప్రదేశ్ లో సరి సమాన బలంతో వున్న సిపిఐ, సిపిఎంల మధ్య తరచూ ఘర్షణలు తలెత్తడం మొదలైంది. ఖమ్మం, నల్గొండ జిల్లాలలో అవి ఎక్కువ మోతాదులో జరిగేవి. ఇరు వైపులా హత్యా రాజకీయాలకు బలైన వారూ లేకపోలేదు. ఖమ్మం ఎమ్మెల్యేగా-సుజాత నగర్ ఎమ్మెల్యేగా దీర్ఘకాలం వున్న రజబ్ అలీ ఎప్పుడైతే సిపిఎంను వదిలి వెళ్లాడో, అప్పుడే పార్టీ కొంత బలహీన పడే పరిస్థితులు ఎదురయ్యాయి జిల్లాలో. కారణం అతడికి పార్టీ కాడర్ ఆదరణ వుండడమే. ఆయనో మాస్ లీడర్ కావడమే. ఈ కారణాల వల్ల ఖమ్మం జిల్లాలో ఏ ఘర్షణ తలెత్తినా, సిపిఎం, సిపిఐ చెరో పక్కన మద్దతు ఇవ్వడం ప్రారంభమైంది. అస్తిత్వం కోసం, గుర్తింపు కోసం సిపిఐ పోరాడుతుంటే, వున్న పట్టును బిగింపు చేయడం కోసం, మరింత ఆధిపత్యం కోసం సిపిఎం పోరాడ సాగింది. ప్రతి చిన్న విషయం సీరియస్ గా తీసుకోవడంతో ఘర్షణలు హత్యా రాజకీయాలుగా మారిపోయాయి. ఇరువైపులా చాలా మంది చనిపోయారు. సిపిఎం పక్షాన వున్న వారు అధికంగా మంది హత్యకు గురయ్యారు.

ఖమ్మం జిల్లా పోరాట ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పడసాగింది. రాష్ట్ర స్థాయిలో ఇరు పార్టీల మధ్య వివాదాలకు-విభేదాలకు మరింతగా దారి తీసింది. పర్యవసానంగా ఎన్నికల రాజకీయాలపై ఆ ప్రభావం పడింది. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం తరువాత కూడా, రాష్ట్రం మొత్తం మీద ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదిరినా ఖమ్మం జిల్లాలో కుదర లేని పరిస్థితి తలెత్తింది. 1975 లో ఎమర్జెన్సీ విధించినప్పుడు ఖమ్మం జిల్లా సిపిఎం నాయకత్వం మొత్తం అరెస్టుకు గురి కావడంతో, లేక, అజ్ఞాతవాసానికి పోవడంతో, సిపిఐ రాజకీయంగా లబ్ది పొందడానికి ప్రయత్నించింది. అప్పట్లో సిపిఐ ఎమర్జెన్సీకి, ఇందిరా గాంధీకి మద్దతిచ్చింది. ఇందిరా గాంధీ ఇరవై సూత్రాల ఆర్థిక కార్యక్రమానికి మద్దతిచ్చింది. ఆ తరువాత ఎమర్జెన్సీ అనంతరం 1977 లో జరిగిన ఎన్నికలలో, ఖమ్మంలో ఇరువురూ, ఒకరి మీద మరొకరు పోటీ చేశారు. ఆ ఎన్నికలలో సిపిఐని దాదాపు ఓటర్లు తిరస్కరించారు ఆ జిల్లాలో. సిపిఎంకు ఆధిక్యత వచ్చింది. దరిమిలా భటిండాలో జరిగిన సిపిఐ మహా సభలో, ఎమర్జెన్సీకి, ఇందిరా గాంధీకి మద్దతిచ్చినందుకు పశ్చాత్తాపం వెలిబుచ్చుతూ తీర్మానం చేశారు. కేరళలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తప్పని ఒప్పుకున్నారు. సిపిఎంకు స్నేహ హస్తం అందించారు. కేరళలో కాంగ్రెస్ పార్టీతో తెగతెంపులు చేసుకుని, వామపక్ష ఐక్యత అంటూ నినాదం అందుకుంది సిపిఐ. 1980 లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో, దేశం మొత్తం మీద సిపిఐ-సిపిఎంలు ఎన్నికల అవగాహన కొచ్చాయి. సిపిఐ తన పంథా మార్చుకుంది. ఖమ్మంలో మళ్లీ విచిత్రమైన పరిస్థితి తలెత్తింది. రెండు పార్టీలు ఒకరి మీద ఇంకొకరు పోటీ చేసుకున్నాయి. కలిసి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు మెండుగా వున్న నేపధ్యంలో సిపిఐ అడ్డు పుల్ల వేసింది. జనతా పార్టీ అభ్యర్థికి మద్దతిచ్చింది. జలగం కాంగ్రెస్ తో చేతులు కలిపింది. రాష్ట్రం మొత్తం మీద ఐక్యత వాతావరణం చెడిపోవడానికి ఖమ్మం కేంద్రమైంది. ఖమ్మం జిల్లా కీచులాటలు రాష్ట్రం మొత్తం మీద పడ్డాయి మరో మారు. ఆ తరువాత 1984 ఎన్నికలలో సిపిఐ, సిపిఎంలు రెండూ పోటీ చేశాయి ఖమ్మంలో. తెలుగు దేశం పార్టీ నాయకుడు ఎన్టీ ఆర్ సిపిఎంకు మద్దతు ప్రకటించినా, స్థానిక కాడర్ కొందరు ఉపేంద్రయ్య ప్రేరణతో లోపాయకారీగా-బహిరంగంగా సిపిఐకి ప్రచారం చేయడంతో ఓట్లు చీలి పోయి జలగం వెంగళ్ రావు గెలిచారు. 1989 లో సిపిఐ బహిరంగంగా సిపిఎంకు మద్దతిచ్చినా, లోపాయకారీగా వ్యతిరేకించడంతో మళ్లీ జలగం గెలువగలిగారు. అదే పరిస్థితి 1991 లో కూడా. 1996 లో తెలుగు దేశం మద్దతుతో సిపిఎం అభ్యర్థి తమ్మినేని వీరభద్రం గెలిచాడు. 1998, 1999 2004, 2009 ఎన్నికలలో పరిస్థితిలో మార్పు లేదు. కమ్యూనిస్టులు గెలవలేక పోయారు.

వామపక్ష ఐక్యత దెబ్బతినడానికి, ఒక విధంగా చెప్పుకోవాలంటే, ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ రాజకీయాలే ప్రధాన కారణం. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. 1967 లో సిపిఎంలో చీలిక వచ్చి నక్సలైట్లు విడిపోయారు. విడిపోవడానికి కొన్ని రోజుల ముందర పాలకొల్లులో సిపిఎం సమావేశమైంది. ఆ సమావేశంలో అధిక సంఖ్యాక సభ్యులు నక్సలైట్ ఉద్యమానికి మద్దతు పలికారు. మరో విధంగా చెప్పుకోవాలంటే పుచ్చలపల్లి సుందరయ్య, బసవ పున్నయ్య, మోటూరి మినహా సిపిఎం రాష్ట్ర స్థాయి అగ్ర నాయకత్వంలో చాలా మంది ఉద్యమానికే తమ మద్దతన్నారు. అలా మద్దతిచ్చిన తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వర రావు, కొల్లా వెంకయ్య ప్రభృతులంతా అగ్ర శ్రేణి నాయకులే. మోటూరు హనుమంతరావు సతీమణి ఉదయం కూడా వారి పక్షానే మాట్లాడింది. సుందరయ్య గారిని ఆ సమావేశంలో దాదాపు మాట్లాడనివ్వలేదు. మొత్తం మీద నక్సలైట్ చీలిక సిపిఎంకు రాష్ట్ర స్థాయిలో పెద్ద నష్టమే మిగిల్చింది. కాకపోతే ఖమ్మంలో అంతగా ప్రభావం పడలేదు. సాయుధ పోరాటమే పరమావధిగా భావించిన నక్సలైట్లతో వామపక్ష ఐక్యతనేది సాధ్య పడేది కాని విషయం. ఇక సిపిఐ, సిపిఎం విభేదాలు అధికమవుకుంటూ, సంచిత ప్రభావం చూపడంతో, వారిరువురి మధ్య కూడా ఐక్యత పొసగడం కష్టమై పోయింది. వీటికి తోడు "వ్యక్తిగత అహం", ఒకరిని మరొకరు దెబ్బతీయాలనే బలీయమైన భావన ఐక్యతకు అడ్డు పడ్డాయి. ఉదాహరణకు 1999 లో జరిగిన ఎన్నికలలో ఖమ్మం నియోజక వర్గం పోటీ తీసుకుందాం. అధికారికంగా ఆ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వర రావుకు సిపిఎం పార్టీ మద్దతు ప్రకటించింది. కాని జిల్లా నాయకత్వం పువ్వాడను ఓడించే ప్రయత్నం చేశారు. ఓడించారు కూడా. చివరకు రాష్ట్ర స్థాయి అగ్రనాయకత్వానికి కూడా అందులో అంతో ఇంతో భాగం వుందనే విషయం అప్పుడు బహిర్గతమైంది కూడా.

ఇప్పుడున్న పరిస్థితులలో వామపక్షాలు కలిసి పనిచేయకపోతే వాటి మనుగడ ప్రశ్నార్థకమే! ఎందుకని ఐక్యత అత్యవసరం అన్న ప్రశ్న కూడా వేసుకోవాలి. కమ్యూనిస్ట్ పార్టీలు క్రమేపీ బలహీన పడడానికి అనైక్యత కూడా ఒక కారణం కాదా? అని ప్రశ్నించుకోవాలి. అలాంటప్పుడు ఐక్యతకు ఏం చేయాలి? అన్నింటికన్నా ఉత్తమమైంది విలీనం కావడం. కాని అది ఇప్పుడు సాధ్యపడదే! "రెండు కత్తులు ఒక ఒరలోఇమడడం" సాధ్యమా? మరేం చేయాలి? గతంలో చేసిన కొన్ని తప్పులను పునరావృతం కాకుండా చూసుకోవడం ఇరు పార్టీల ప్రధమ కర్తవ్యం. ఉదాహరణకు 2009 సార్వత్రిక ఎన్నికలనే తీసుకుందాం. సిపిఎం పార్టీలో అంతర్గతంగా, ప్రజారాజ్యం పార్టీతో కలిసి పోటీ చేయాలా? వద్దా? అన్న చర్చ వచ్చింది. పార్టీ సచివాలయ సభ్యులలో మెజారిటీ మంది పీ ఆర్ పీతో పోవాలని తీర్మానించారు. కాని జరిగిందేమిటి? పోలిట్ బ్యూరో చెప్పిందని అంటూ, మహా కూటమితో కలిసి పోటీ చేశారు. అది పెద్ద తప్పు. అలాంటి ఎన్నికల పొత్తు తప్పులు గతంలో కూడా చేసారు. సిపిఐ అదే పొరపాటు చేసింది. ఇద్దరూ ఒకే కూటమిలో వున్నా ఐక్యత లేదనే అనాలి. అదే విధంగా 2004 లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసి తప్పు చేశాయి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు. దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీతో పోటీ చేస్తూ, ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లో కలిసి పోటీ చేయడం ఎంతవరకు సబబు? బషీర్ బాగ్ కాల్పుల నేపధ్యంలో, ఏదో విధంగా తెలుగు దేశాన్ని ఓడించాలనుకున్నారే కాని, భవిష్యత్ లో జరగనున్న పరిణామాలను ఊహించలేకపోయారు. అలాగే, 2009 లో ముదిగొండ కాల్పుల నేపధ్యంలో కాంగ్రెస్ ఓటమే ధ్యేయంగా మహా కూటమితో చేతులు కలిపారు. తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖర రావు సిపిఎం కార్యాలయానికి రావడం, ఆయనను వెళ్లేటప్పుడు కారు వరకూ నాయకులు సాగనంపడం మీడియాలో చూశాం. అలానే ప్రజా రాజ్యాన్ని కాదనడం జరిగింది. బర్ధన్ తో చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లడానికి నిరాకరించిన సిపిఐ నాయకుడు నారాయణ, చివరకు జాతీయ నాయకత్వం సూచనతో తెలుగుదేశం వున్న మహా కూటమిలో చేరడానికి అంగీకరించాడు.

వామపక్ష పార్టీలు దెబ్బతినడానికి రాష్ట్రీయ, జాతీయ కారణాలతో పాటు అంతర్జాతీయ కారణాలు కూడా లేకపోలేదు. సోవియట్ యూనియన్ లో కమ్యూనిస్ట్ పతనం పెద్ద దెబ్బే తీసింది. ఆ దేశం నుంచి వచ్చే కమ్యూనిస్ట్ భౌతిక, మేధో సామగ్రి ఆగిపోయింది. నైతికత దెబ్బ తినింది. ఇదొక పెద్ద కారణంగా భావించవచ్చు. అదే విధంగా 1978 తరువాత చైనా అవలంబిస్తున్న నూతన ఆర్థిక విధానం కూడా కొంత కారణం అనాలి. చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా బలంగా వున్నప్పటికీ, అలనాటి మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనా విధానంలో కొంత మార్పు కొట్టొచ్చినట్లు కనపడ సాగింది. సామ్యవాదం చివరి మెట్టు అనేది, నూతన ప్రజాస్వామ్యం మధ్యే విడత అన్న నినాదంతో ఆర్థిక విధానంలో మార్పులు తెచ్చింది చైనా ప్రభుత్వం. "సామ్యవాద మార్కెట్ ఎకానమీ" అన్న నినాదం కూడా తెచ్చారు. దీంతో, చైనా పెట్టుబడిదారీ విధానం వైపు దృష్టి సారిస్తున్నదన్న పేరు వచ్చింది. సామ్యవాదం విఫలమవుతున్న దని, దానికి ఇక భవిష్యత్ లేదని భావించే స్థితికి చాలా మంది వచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీది బూజుపట్టిన సిద్ధాంతం అనే ప్రచార వాతావరణం నెలకొంది. కమ్యూనిజాన్ని వీడడం వల్లనే చైనా విజయాలను సాధిస్తోందని కూడా అనడం మొదలైంది. ఇదిలా వుండగా, మరో పక్క అమెరికా తిరుగులేని శక్తిగా ప్రపంచంలో ఎదగ సాగింది. ఈ నేపధ్యంలో భారత దేశంలోని వామపక్ష ఉద్యమం కూడా కొంత దెబ్బ తినింది

వామ పక్ష ఉద్యమం ఇబ్బందులకు లోను కావడానికి మరో కారణం, 1991 తరువాత భారత దేశంలో అమల్లోకి వచ్చిన నూతన ఆర్థిక విధానం అని చెప్పుకోవచ్చు. దేశంలో పేదరికం ఒకవైపు వుండగా, ఒక సంపన్న మధ్యతరగతి పెరుగుతున్నది. అది నోరున్న వర్గం. దానికి అన్ని ప్రచార వనరులు వున్నాయి. జనం నూతన ఆర్థిక విధానాలవైపు మళ్లించగల వనరులవి. ఆ వర్గాలను ఎలా ప్రభావితులను చేయాలో ఇంకా వామ పక్షాలకు తెలియడం లేదు. ఆ విధానాన్ని అర్థం చేసుకోవడంలో వామ పక్షాలు కొంత అవగాహనా లోపానికి గురయ్యాయి. ఫలితంగా వామ పక్షాలు బలహీన పడసాగాయి. వీటన్నింటికీ వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత వామపక్షాలపైన వుంది. అది విడి-విడి పోరాటాలతో కుదరదు. తదనుగుణమైన ప్రజా ఉద్యమాలను నిర్మించాల్సిన పాత్ర కూడా వుంది. చీలిపోయిన వామ పక్షాలకు ఇది సాధ్యపడని విషయం. సైద్ధాంతిక పరంగా, ఆర్థిక అంశాల పరంగా ఎదుర్కోవాలి. అదే విధంగా ప్రస్తుతం నెలకొన్న పోటీ తత్వానికి వ్యతిరేకంగా పోరాడాలన్నా, నైతికంగా ఆ శక్తిగలది ఒక్క వామపక్షానికే. బీదరికానికి వ్యతిరేకంగా పోరాడాలన్నా వామ పక్షాలకే చేతనవుతుంది. అందుకే ఐక్యత అత్యంత అవసరం. విలీనమా ఎలాగూ సాధ్య పడదు. కనీసం కలిసి మెలిసి ఐక్యంగా పోరాటమన్నా చేయాలి. తప్పదు.

అలాంటప్పుడు వామ పక్ష ఐక్యతకున్న అవరోధాలేంటి? మొదటిది-ముఖ్యమైంది, "వ్యక్తిగత అహం". రెండోది, ఇరు పార్టీలకున్న"ఆస్తులు". మూడోది, "గుర్తింపు". ఎవరి చైతన్య వేదికలు వారికే వున్నాయి. ఎవరి విద్యార్థి యూనిట్లు వారికే వున్నాయి. ఎవరి రైతు సంఘాలు వారికే వున్నాయి. ఎవరి ప్రజా సంఘాలు వారికే వున్నాయి. అలానే మిగాతావి. పార్లమెంటులో పని చేయడానికే, నాలుగు ప్రధాన వామ పక్షాల మధ్య సరైన అవగాహన లేదింతవరకు. ఉదాహరణకు అణు బిల్లే తీసుకోవచ్చు. ఎవరి దారి వారిదే ఐందప్పుడు. అంతెందుకు...సిపిఎం సభ్యులలో-నాయకత్వంలో భేదాభిప్రాయాలు పొడచూపాయి. సాక్షాత్తు సోమనాథ్ ఛటర్జీలాంటి వారే బయటకు పోవాల్సి వచ్చింది. సిపిఎం అలనాటి యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న తరువాత మూడో ఫ్రంట్ స్థాపించడానికి సిద్ధపడ్డాడు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్. ఆ విషయంలో ఏకాభిప్రాయం లేకపోవడంతో, వామ పక్ష ఐక్యత దెబ్బ తినింది. అలాంటి అవరోధాలెన్నో! ఆంధ్ర ప్రదేశ్ విషయానికొస్తే, ఉదాహరణలుగా పోలవరం ప్రాజెక్ట్, తెలంగాణ ఉద్యమం తీసుకోవచ్చు. అటు సిపిఐ ఒకటి చెప్తే, మరో వైపు సిపిఎం ఇంకోటి చెప్తుంది. పరిష్కారానికి చెరో మార్గం సూచిస్తారు నాయకులు. ఉద్యమించడానికి చెరో జండా పట్టుకుని బయల్దేరుతారు. కలిసి ఎందుకు పోకూడదు? ఇలాంటి పలు సమస్యల విషయంలో, సిపిఐ, సిపిఎం పార్టీలు ఒక ఏకాభిప్రాయానికి రాలేవా? ఒకే విధానం అవలంభించడం అంత కష్టమైన పనా? ఇలాంటి వాటి మీద మాట్లాడకుండా ఐక్యత ఎలా సాధ్యం?

ఎవరికైనా తమ సిద్ధాంతాలపైన, తమ పార్టీ పైన, అమితమైన విశ్వాసం వుండడం సహజం. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, స్థూలంగా సామ్యవాదానికి అనుకూలమైన వ్యక్తులు-సంస్థలు కూడా కాలానుగుణంగా తమ విధానాలను మార్చుకోవడం జరుగుతున్నది. మెరుగులు దిద్దుకోవడం కూడా గమనిస్తూనే వున్నాం. 19-20 శతాబ్దాలకు చెందిన ఒక సిద్ధాంతంగా మార్క్సిజం చాలా గొప్పది. ఆ సిద్ధాంతం అజేయం. దానిని ఒక  మౌలిక సిద్ధాంతంగా అంగీకరిస్తూనే, చైనా, క్యూబా, వియత్నాం లాంటి చాలా దేశాలలో, అక్కడ నెలకొన్న దేశకాల పరిస్థితులను బట్టి తమ విధానాలను, ఎత్తుగడలను మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. కొందరు మార్క్సిస్టు మేధావుల ఇటీవలి రచనలు కూడా ఇలాంటి మార్పులనే సూచిస్తున్నాయి. మార్క్సిస్టు పార్టీ కూడా 1964 లో తనకు తానే రచించుకున్న కార్యక్రమంలోని ఐదారు సూత్రీకరణలను 2000 సంవత్సరంలో సవరించుకుంది. అలాంటి సవరణలు, మార్పులు అనివార్యం-అవసరం-ఆహ్వానించదగ్గది.

కాక పోతే, కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలలో ఇటీవల దురదృష్టవశాత్తు ఒక అధికార స్వామ్య ధోరణి బలపడి పోతుంది. తాము చెప్పిందే వేదం అన్న భావన నుండి బయట పడలేక పోతున్నారు. మరింత మంది మిత్రులను సంపాదించుకోవడమెలా? ప్రజలను అధికంగా ఆకట్టుకోవడం ఎలా? అన్న దానికి భిన్నంగా, శత్రువులను పెంచుకుంటూ పోయే ధోరణి, మిత్రులను కూడా శత్రువులుగా మార్చుకునే ధోరణి పెరుగుతుంది. తమతో నూటికి నూరు శాతం ఏకీభవించిన వారే మిత్రులుగా, ఒక్క శాతం విబేధించినా శత్రువులుగా పరిగణిస్తున్నారు. తమ చుట్టూ తామే కాంక్రీటు గోడలు కట్టుకునో, లేక, వెనుకటి సుశ్రోత్రియులలగా మడి కట్టుకునో వుంటున్నారు. విమర్శలు సహృదయంతో స్వీకరించడం తగ్గిపోతుంది. వారి ఉపన్యాసాలలో, వ్యాసాలలో పార్టీ వ్యతిరేకులు-ద్రోహుల లాంటి పదాలు పుష్కలంగా దొర్లుతుంటాయి. వారితో కలిసి కూర్చోవడం, మాట్లాడడం కూడా అసభ్యం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఒక్కసారి వెనుతిరిగి చూసుకునే ఓపిక, సహనం వుంటే అది విదితమవుతుంది. ఒక నాడు విమర్శించిన-విమర్శలకు గురైన వారితోనే, తొమ్మిది పార్టీలని, పదకొండు పార్టీలని ఐక్య వేదికలని గర్వంగా చెప్పుకోవడం ఎలా వుంటుంది? అలాగే, తమతో విభేదించే వారిపై సామాజిక వెలి చేయించే వరకూ వెళ్తోంది. పార్టీలో వుంటూ అనేక త్యాగాలు చేసిన వారు ఈ నాడు ఏ కారణంగానైనా విభేదిస్తే, బహిష్కృతులై ఇతర పార్టీలలోకి వెళ్తే, వారు చచ్చినా, వారింట శుభ కార్యం జరిగినా, వెళ్ల రాదంటూ ఆంక్షలు, ఆజ్ఞలు జారీ చేసే వరకు వీరి జాడ్యం ముదురుతున్నది. ఇవి చిన్న విషయాలుగానే కనిపించవచ్చు. ఈ ధోరణి విశాల వామ పక్ష ఐక్య వేదిక నిర్మాణానికి దీర్ఘకాలికంగా దాటలేని అడ్డంకులుగా మారుతాయి. పార్టీల నాయకత్వాలు, కాడర్ కూడా, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అంశాలివి.

ఐనా వామ పక్ష ఐక్యత అత్యంత అవశ్యం!

7 comments:

  1. జ్వాలా గారూ,
    చాలా రోజుల తర్వాత మళ్లీ వామపక్ష ఐక్యత గురించి పెద్దవ్యాసం ప్రచురించారు. చాలా సంతోషం. కాని మీరు ఈ సుదీర్ఘ వ్యాసంలో పొందుపర్చిన అంశాలు చూశాక వామపక్ష ఐక్యత అనే భావనే తప్పుగా కనబడుతోంది నాకు. పైగా వ్యక్తిగత అహాలు, అధికార స్వామ్యమే వామపక్షాలకు పెనుజాడ్యంగా తయారయిందనుకుంటే అవి పూర్తిగా నిర్మూలన కాకుండా ఏ ప్రాతిపదికన ఐక్యత సాధ్యమవుతుందనుకుంటున్నారు? సైద్ధాంతిక విభేదాల మాటేమిటి? వాటిని తడమకుండానే మీరు ఐక్యత అనే మహదాశయాన్ని వెలికి తెచ్చారు. ప్రపంచాన్ని మార్చడం కంటే ప్రపంచాన్ని వ్యాఖ్యానించడం, నచ్చనివారిని వెలి వేయడం, భిన్నాభిప్రాయం ప్రకటించినవారిని ౨౦ఏళ్లు పార్టీలో ఉన్నా మనుషులుగా కూడా గుర్తించకుండా వెలివేయడం హిట్లర్ పార్టీలో మాత్రమే అమలైన ప్రవర్తనలను అలవర్చుకోవడం ఇవీ మన దేశీయ కమ్యూనిజపు ౭౫ ఏళ్ల గొప్పతనం. ఈ ఘనమైన వారసత్వాన్ని భారతదేశం భరించలేకపోతోంది లెండి. కాబట్టి నానా రకాల పీఠాధిపతులను ఇలాగే ఉండనీయండి. పూర్తిగా శంకరగిరి మాన్యాలు పట్టిపోయేంతవరకు ఇలాగే కొనసాగనివ్వండి. దేశానికి పోయేదేమీ లేదు. మీ ఘనమైన హితబోధను విని అర్థం చేసుకునేంత సమయం మనవాళ్లెవరికీ లేదు లేండి మీరు మరీ ఎక్కువగా బాధపడుతున్నారేమో అనిపిస్తోంది. అవతల రామచంద్ర గుహ ఇంగ్లీష్ పత్రికలలో మొత్తుకుంటూనే ఉన్నారు. దేశభక్తిని, జాతీయభావాన్ని మత ఛాందసవాదుల చేతికి అప్పనంగా అప్పగించేయడమే భారతీయ కమ్యూనిజం ఓటమికి మూల కారణం అని తెగ బాధపడిపోతున్నారాయన. మనం కూడా పాట పాడుకుందాం. ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు అనుకుంటూ...
    మీ ఆవేదనకు సానుభూతి. కాని మీ ఆధార రహిత ఆశావాదానికి నా తిరస్కృతి.
    ఇంతకు మించి మరేమీ చెప్పలేను.

    ReplyDelete
    Replies
    1. రాజుగారూ,

      1962లో ఎప్పుడైతే చైనా భారత్ మీద దురాక్రమణ చేసిందో, దేశంలో ఉన్న కమ్యూనిటులు మిన్నకుండా ఎందుకు ఉన్నారో, అప్పుడే కమ్యూనిస్ట్ పార్టీ నాశనమైపోయింది. ప్రజలు ఆ పార్టీని నమ్మే అవకాశం లేకుండాపోయింది. తమ తండ్రి దేశాన్ని విమర్శించలేని వారికి దేశభక్తి ఉంటుందని ఎవరన్నా అనుకోగలరా! అదేదో కమ్యూనిస్టుల సొత్తైనట్టుగా ఫలానావారికి దేశభక్తిని, జాతీయభావాన్ని అప్పగించేశారని వగచటం, ఇంగ్లీషు మీడియాలో చోటు నింపే వ్యాసాలే తప్ప మరేమీ కాదు అని నా ఉద్దేశ్యం.

      ఫలానావారిది మత చాందసం అనుకుంటే, వీరిది ఏమిటి! పార్టీ చాందసం, ఆ పార్టీ పేరుతో ఆవేశంతో ఊగిపోతూ ఏమి చెయ్యటానికైనా వెనుకాడకుండా తయారయ్యితే అదీ చాందసమే. మతం అనేది వేల ఏళ్ళబట్టి ఉన్నది. ఈ పార్టీ అనేది ఒక వందేళ్ళయ్యింది. అంతే తేడా.

      దేశంలో ముక్క పార్టీలు లేకుండా రెండే పార్టీలు ఉంటే ఎవరు అధికారంలోకి వస్తారో కూడా ఒక వ్యాసం వ్రాస్తే ఎంతయినా బాగుంటుంది.

      Delete
  2. నిజానికి West Bengal లో ఓడిపోయింది మతం పేరుచెప్పుకుని డబ్బులు దంచుకున్నట్టు Communist రంగు వేసుకుని దంచుకోవడమే కాబట్టి. దాని ఇంత పెద్ద వ్యాసాలు అక్కర్లేదు.

    ReplyDelete
  3. ఇది వ్యాపార రాజకీయాల యుగం ... బాబు చెప్పినట్టు కంయునిస్తులకు కలం చెల్లింది

    ReplyDelete
  4. peddalandarikii manavi...kaalam chellindi anukunna vaati gurinchi mee kaalam vrudha chesukokandi. kaalam chellayanukunnave mana kalam marusthayi...bhavishyathu kamyunijam lo ne vundi!!

    ReplyDelete
  5. ఫ్రెండ్స్,

    బాలగోపాల్ గారు సంధించిన ప్రశ్నలలొ ప్రధానమైనది...

    "కాలక్రమంలో వర్గ వైరుధ్యాలు పెరగక పోగా , కార్మికులలో ఒక్కొక్క శ్రేణి తమ ఆదాయాన్ని పెంచుకుంటూ పైకి వెళ్లారు, అలాంటప్పుడు ఆ కార్మికులతో వర్గపోరాటం తద్వారా సోషలిజం సాధ్యమేనా" అని అడుగుతారు బాలగోపాల్.

    కార్మికులు ఆదాయాన్ని పెంచుకుంటూ పైకి వెళ్లారు అనేది ప్రస్తుతం కళ్ళకు కనపడుతున్న సత్యం.

    ఇప్పటికయినా మనం ప్రపంచాన్ని చూడాల్సిందే.
    ఈ రోజున ఈ ఇండియా లో ప్రతిరోజూ 10 వేల చిన్నకార్లు అమ్ముడవుతున్నాయి. చైనాలో నెలకి 25 లక్షల కార్లు తయారవుతున్నాయి. ప్రపంచంలో సంవత్సరానికి 7 కోట్ల కార్లు తయారు అవుతున్నాయి. ఇండియాలో 2015-2018 మద్య 3 సంవత్సరాలలో 1 కోటి హోండా activa స్కూటర్స్ అమ్ముడయినాయి.
    ఇవన్నీ పెట్టుబడిదారులే వాడుకుంటున్నారా?

    అసలు "పెట్టుబడిదారీ వ్యవస్థ పురోగమనంలో వర్గాల మధ్య వైరుధ్యం పెరుగుతుంది" అనే మార్క్సిస్టు మూల సూత్రమే తప్పు.
    ఈ మూలసూత్రం తప్పు అనడానికి సరిపోయే శాస్త్రీయమైన ఆధారాలు నాదగ్గర ఉన్నాయి.

    అదనపు శ్రమ లేదా లాభం లేదా శ్రమదోపిడీ ఏ పేరైనా పెట్టండి అది పెట్టుబడి వలన అనివార్యంగా వచ్చేది కాదు. లాభాన్ని సాంప్రదాయక నిరపేక్ష భావంతో చూడకూడదు. అలా చూడటం వలనే పెట్టుబడిదారీ వ్యవస్థ పురోగమనం లో వర్గవైరుధ్యాలు తీవ్రమవుతాయి అనే తప్పు సూత్రాన్ని కార్ల్ మర్క్స్ ప్రతిపాదించారు.

    ఉత్పత్తి క్రమంలో వాడే యంత్రాల స్థాయిని బట్టే లాభం యొక్క స్థాయి ఉంటుంది. యంత్రాలు అభివృద్ధి చెందుతుంటే లాభం స్థాయి తగ్గిపోతుంది. పెట్టుబడిదారులు వారు పొందాలనుకొనే లాభం స్థాయి వాళ్ళ ఇష్టాఇష్టాల మీద ఆదరపడదు. యంత్రాల స్థాయిని బట్టి మారిపోయే లాభం స్థాయి సాపేక్షమైనది. నిరపేక్షమైనది కాదు. ఇది మోడరన్ ఎకనామిక్స్. దీనికి శాస్త్రీయమైన ఆధారాలు ఉన్నాయి.
    ఇంకా వర్గ వైరుధ్యాలే లేనప్పుడు వర్గపోరాటం ఎక్కడినుండి వస్తుంది.

    కాబట్టి, ఉత్పత్తి యంత్రాల అభివృద్ధి ఒక నిర్దిష్ట స్థాయికి చేరుకొనేసరికి లాభానికి స్థానం లేక వ్యవస్థ దానంతట అదే సోషలిజం లోనికి క్రమంగా మార్పు చెందుతుంది.
    దీనికోసం వర్గపోరాటం అవసరం లేదు.సాయుధ పోరాటం తో అసలే పనిలేదు.

    ఉత్పాదక యంత్రాలు ఒక నిర్ధిష్ట స్థాయికి అభివృద్ధి చెందకుండా కేవలం పంపిణీ వ్యవస్థను మార్చడం ద్వారా సోషలిస్టు వ్యవస్థను నెలకొల్పడం ఆనేది సాధ్యపడనిది.ఆ ఆలోచన సరైనది కాదు. అట్టి ప్రయత్నం వృధా, పైపెచ్చు విపరీతమైన హింసతో కూడుకున్నది.

    ఉత్పాదకత యంత్రాలు ఒక నిర్దిష్ట స్థాయికి అభివృద్ధి చెందిన తరువాత అసమాన పంపిణీకి అవకాశం ఉండదు. సంపద కొరత లేనప్పుడు అసమాన పంపిణీకి అర్థమే ఉండదు.

    ఇదీ బాలగోపాల్ గారు వేసిన ప్రశ్న కు సరైన సమాధానం.

    ఉత్పత్తి యంత్రాలు ఒక నిర్దిష్టస్థాయికి అభివృద్ధి చెందనంతవరకు సమాజంలో వస్తువులకు కొరత ఉంటుంది. ఆ కొరత ఉన్నంత వరకూ సోషలిస్టు సమాజ మనుగడ సాధ్యం కాదు. దీనికి మానవ ప్రవృత్తే కారణం. అందుకనే 20 వ శతాబ్దం లో సోషలిస్టు వ్యవస్థలు కూలిపోయాయి. ఎన్నికారణాలైన చెప్పండి సోషలిస్టు వ్యవస్థని నిలబెట్టే స్థాయికి యంత్రాలు అభివృద్ధి చెందలేదు అనేదే అసలైన కారణం.

    కాబట్టి, యంత్రాల అభివృద్దికంటే ముందే పరుగెత్తి పోరాటం ద్వారా సాధించుకున్న అధికారం మూణ్నాళ్ల ముచ్చటే.వృధాప్రయాస. బాలగోపాల్ గారు ప్రశ్నించిన మరో అంశం ఇది.

    కాబట్టి, పై రెండు విషయాల ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే..

    సోషలిస్టు సమాజ స్థాపన కోసం సాయుధపోరాటం అవసరంలేకపోగా అది వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది.
    మిత్రులారా సాయుధపోరాటాన్ని విడవండి. పోరాడకపోతే దక్కకుండా పోయేది ఏదీలేదు.

    బాలగోపాల్ ఒక గొప్ప సహసి , నమ్మిన సిద్ధాంతాన్ని పట్టుకుని సమాజమనే ప్రయోగశాలలో శ్రమించారు, ఒక గొప్ప యోధుడు. పుస్తకాలలో కాదు ప్రయోగశాల లో తేలిందే సిద్ధాంతామనే వాస్తవికవది.

    మావోలు సాయుధపోరాటం విడవండి.ప్రభుతం తక్షణం ఎన్కౌంటర్లు ఆపివేయాలి.

    మిత్రులారా పై విషయం లో శాస్త్రీయమైన ఋజువుల గురించి ఏదయినా చర్చించాలంటే కాంటాక్ట్ చేయండి.
    స్టాలిన్ బాబు, 9963998538.

    ReplyDelete