Friday, July 5, 2013

స్థానిక గ్రామ పంచాయితీ రాజకీయాలతో అనుబంధం: వనం జ్వాలా నరసింహారావు

స్థానిక గ్రామ పంచాయితీ రాజకీయాలతో అనుబంధం
వనం జ్వాలా నరసింహారావు

          1966 మార్చ్-ఏప్రిల్ నేలలో డిగ్రీ పరీక్షలు అసంపూర్తిగా రాయడం, ఎలాగూ ఫెయిల్ కాబోతుండడం, తక్షణం హైదరాబాద్‌లో చేయాల్సిన పనేమీ లేకపోవడం, నా మకాం హైదరాబాద్ నుంచి మా గ్రామం వనం వారి కృష్ణా పురంకు మార్చడానికి దారితీసింది. అంతకుముందు చిన్నతనం నుండీ మా గ్రామంలో వుంటున్నప్పటికీ, రాజకీయాల జోలికి పెద్దగా పోలేదు. కాని డిగ్రీ చదువు పూర్తైన తరువాత గ్రామానికి పోవడంతో, ఎందుకో, నాలో కొంత మార్పొచ్చింది. రాజకీయాలంటే ఆసక్తి కలగడం మొదలైంది. అంతకు రెండేళ్ల క్రితం (1964 లో), మా పక్క గ్రామం కమలాపురం సర్పంచ్‌గా, కాలేజీలో నా సీనియర్ సహచరుడు, బాబాయి వనం నర్సింగరావు, కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యాడు. అలానే సమీపంలోని గ్రామాలైన బాణాపురం, గంధసిరి, మండవ, బుద్ధారం, చెర్వు మాధారం, అమ్మపేట, వల్లాపురం, చిరు మర్రి, ముదిగొండ, వల్లభి, నేలకొండపల్లి, ...తదితర గ్రామాలకు కూడా మా సమీప బంధువులో, లేక వారి ప్రతినిధులో సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. బాణా పురానికి గండ్లూరి కిషన్ రావు (నాకు మామయ్య), గందసిరికి గండ్ర వీర భద్రా రెడ్డి, మండవకు అయితరాజు పట్టాభిరాం రావు (మా సమీప బంధువు), బుద్ధారానికి వెంకటేశ్వర రావు (నాకు మామయ్య), చెర్వు మాధారానికి కొరుప్రోలు చిన వెంకటేశ్వర రావు (నాకు మామయ్య), అమ్మపేట-వల్లాపురానికి కోయ వెంకట రావు (మా పెదనాన్న-నాన్న సూచించిన మనిషి), ముదిగొండకు రావులపాటి సత్యనారాయణ రావు (మా బంధువు) గారి మనిషి, వల్లభికి మా మామగారు అయితరాజు రాం రావు గారు, నేలకొండపల్లికి పెండ్యాల సత్యనారాయణ రావు గారు...ఇలా మా బంధువులో, స్నేహితులో, వారి దగ్గరి వారో దాదాపు అన్ని గ్రామాలకు సర్పంచులుగా వుండేవారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ శీలం సిద్దారెడ్డి వర్గంగా, జలగం వెంగళరావు వర్గంగా చీలిపోయి, గ్రామ-గ్రామాన, ఒకరిపై మరొకరు కత్తులు దూసుకునే స్థితిలో వున్న రోజులవి. శీలం వర్గానికి కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన సి. పి. ఎం పక్షం, జలగం వర్గానికి సి. పి. ఐ మద్దతుగా వుండేవి. సమితి అధ్యక్షుడుగా జలగం వర్గానికి చెందిన మేడేపల్లి (మా మేనమామ స్వర్గీయ కంకిపాటి రాజేశ్వర రావు గారు పట్వారీగా వున్న గ్రామం) గ్రామ వాసి సామినేని ఉపేంద్రయ్య వుండేవాడు.

          మా గ్రామ సర్పంచ్‌గా పర్చూరి వీరభద్రయ్య గారుండేవారు. ఆయన మనసులో-భావాలలో కమ్యూనిస్ట్ అయినప్పటికీ, గ్రామ సర్పంచ్‌గా కావడం మటుకు కాంగ్రెస్ వారి ఆశీస్సులతోనే! జిల్లాలోని ఇతర గ్రామాలలో వున్న ఆయన సమీప బంధువులంతా కమ్యూనిస్ట్ పార్టీ వారే. మా వూరు ప్రజల్లో చాలా భాగం కమ్యూనిస్ట్ అభిమానులైనప్పటికీ, గ్రామ పెత్తందార్ల దాష్టీకం కింద భయంతో, గ్రామ రాజకీయాలలో తలదూర్చడానికి భయపడేవారు. వాళ్లను కూడగట్టి ఒక గొడుగు కిందకు చేర్చే వాళ్లు అప్పట్లో లేనందున, నోరు మూసుకుని, గ్రామ కాంగ్రెస్ పెద్దలు చెప్పిన మాటకు తల వంచి, వాళ్ళు సూచించిన అభ్యర్థినే ఏకగ్రీవంగా సర్పంచ్‌గా అంగీకరించే వారు. గ్రామంలో పోలీసు పటేల్ తుల్లూరి రామయ్య, మాలీ పటేల్ నీరు కొండ వెంకయ్య, వాళ్ల అనుయాయులైన చాగంటి వారి కుటుంబాలు, వారి మాట జవదాటని శివారు గ్రామ పెద్దలు వాడపల్లి రాజేశ్వర రావు గారు, పెత్తనం చెలాయించేవారు. మా నాన్న గారిని కూడా వారితో కలుపుకుపోయేవారు. నాన్న సమీపంలోని అమ్మపేట గ్రామ పట్వారీ అయినప్పటికీ, మా గ్రామంలోను పెద్ద మనిషి కిందే లెక్క. పంచాయితీ ఎన్నికల తేదీ ప్రకటించగానే, వీరంతా కలిసి (సాధారణంగా) మా ఇంట్లో సమావేశమయ్యేవారు. అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా పర్చూరి వీరభద్రయ్య గారి పేరును సర్పంచ్‌గా ప్రతిపాదించి, గ్రామంలోని రచ్చ బండ దగ్గర ఆ పేరే ప్రకటించి, ఆయననే ఏకగ్రీవంగా ఎన్నుకునేవారు. ఎవరూ పోటీకి దిగే సాహసం చేయక పోయేవారు. అలా అప్పటికి మూడు-నాలుగు పర్యాయాలు జరిగింది. గ్రామంలో పటేల్ మీద, వాళ్ల మనుషుల మీద వ్యతిరేకత నివురుగప్పిన నిప్పులా వుండేది. సరిగ్గా ఆ రోజుల్లోనే నేను మా గ్రామం చేరుకున్నాను.

          మా గ్రామంలో మల్లెల అనంతయ్య అనే నిబద్ధతగల ఒక కమ్యూనిస్ట్ కార్యకర్త వుండేవాడు. అతడొకరకమైన మనిషి. ఎవరికీ భయపడేవాడు కాదు. గ్రామ పెద్దలు చెప్పే ప్రతిమాటకూ ఎదురు చెప్పేవాడు. ఐనా ఎవరూ అతడిని పెద్దగా పట్టించుకోక పోయేవారు. పంచాయితీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా, పోటీ చేస్తానని ముందుకొచ్చేవాడు. అతడి ప్రయత్నాలకు గ్రామ పెద్దలు అడ్డుపడేవారు. ఆతడికి పెద్దగా ఆస్తి-పాస్తులు లేవు కాబట్టి, జనం ఆయన వెంట (పోవాలని వున్నా) పోవడానికి జంకేవారు. గ్రామ పెద్దలతో పంచాయితీ పెట్టుకుని గ్రామంలో మనుగడ సాగించడం కష్టమని వూళ్లో ప్రజల భావనగా వుండేది. నేను గ్రామానికి రావడంతోనే, ఆపాటికే, అంతో-ఇంతో కమ్యూనిస్ట్ భావాలను కలిగి వున్న నన్ను కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం చేపట్టాల్సిందిగా కోరాడు అనంతయ్య. దానికి కారణం లేకపోలేదు...ఒకటి నేను కమ్యూనిస్ట్ అభిమానిని కావడం...రెండోది నేను కూడా ఇతర గ్రామ పెద్దల లాగానే ఆస్తిపరుడిని కావడం. బహుశా నేను నాయకత్వం వహిస్తే కమ్యూనిస్ట్ అభిమానులు ధైర్యంగా నిలబడగలరని అనంతయ్య నమ్మకం కూడా కావచ్చు. నేను గ్రామానికి వచ్చిన మొదటి రోజుల్లోనే మా పొలం పక్క నుండి రోడ్డు వేసే విషయంలో నాకు, మా గ్రామ పటేల్‌కు కొంత వాదన అయింది. నా మాటకు విలువ ఇవ్వకుండా, తన పెత్తనం చెలాయించాడు పటేల్. నాకు కూడా అతడి మీద కొంచెం కోపం కలిగి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని వుండేది. కాకపోతే, మా నాన్న గారు, పటేల్ మంచి స్నేహితులు. మా ఇల్లు, వాళ్ల ఇల్లు ఎదురెదురుగా వుంటాయి. ప్రతి రోజు ఉదయం నాన్న గారు, పటేల్ రామయ్య కలవకుండా వుండక పోయేవారు. నాన్నకి కూడా వూళ్లో పెద్దలతో పంచాయితీకి దిగడం ఇష్టం లేక అందరితో మంచిగా వుండేవాడు. గ్రామ సర్పంచ్‌గా పర్చూరి వీరభద్రయ్య గారి పేరును నాన్నతోనే ప్రకటించేవారు. 

          ఇదిలా వుండగా, గ్రామ రాజకీయాలలో కొన్ని కీలకమైన ఘటనలు జరిగాయి. గ్రామంలో చాగంటి నారాయణ అనే ఒక వ్యక్తి తాగుడుకు బానిసై, వూళ్లో ఎవరినీ లెక్క చేయకుండా, ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం మొదలెట్టాడు. "చాగంటి" ఇంటి పేరుగల కుటుంబాలు మా గ్రామంలో పది-పదిహేను దాకా వుండేవి. అన్నీ మధ్యతరగతి కుటుంబాలే. గ్రామంలోని ఒక బజారుని "చాగంటి వారి వీధి" అని కూడా పిలిచేవారు. వాళ్లంతా కలిసి కట్టుగా వుంటూ, అవసరమైతే ఎవర్నైనా ఎదిరించడానికి, కొట్లాడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా వుండేవారు. చాగంటి నారాయణ, గ్రామ పటేల్ తుల్లూరి రామయ్యకు, సన్నిహితంగా మసలేవాడు చాలా కాలం వరకు. పటేల్ అండ చూసుకుని గ్రామంలో అందరిమీద పెత్తనం చేసేవాడు. తాగకపోతే అంత ఉత్తముడు ఎవరూ లేరన్నట్లుగా వ్యవహరించేవాడు. అతడిని తన గుప్పిట్లో పెట్టుకుని పెత్తనం చేసేవాడు పటేల్ (సినిమా ఫక్కీలో). చివరకు పటేల్‌కు ఎదురు తిరిగాడు నారాయణ. ఒకరినొకరు బెదిరించుకునే దాకా పోయింది వ్యవహారం. గ్రామంలో తనను ఎదిరించేవాడు వుండడం సహించలేని రామయ్య ఎలాగైనా చాగంటికి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. అదృష్టవశాత్తు అతడి ప్రమేయం లేకుండానే, ఒక దసరా పండుగ నాడు, గ్రామంలో వుండే బత్తుల రాజులు అనే యువకుడు, సైకిల్ చైన్‍తో చాగంటిని చితకబాదాడు. వారిద్దరికీ ఏదో విషయంలో తగాదా వచ్చి ఆ పని చేశాడు రాజులు. "శత్రువు శత్రువు మిత్రుడు" అన్న సామెత ప్రకారం ఆ సంఘటనలో రాజులుకు వత్తాసు పలికిన పటేల్ మొత్తం వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశాడు. చాగంటి వారి కుటుంబాలు కూడా ఆ రోజున నారాయణకు మద్దతుగా రాకపోవడానికి కారణం అతడికి ఏ విధంగానైనా కనువిప్పు కలగాలనే. మర్నాడు హూంకరించుకుంటూ పటేల్ ఇంటి మీదకు యుద్ధానికి వచ్చిన నారాయణను మరింత నిర్వీర్యం చేశాడు పటేల్. గ్రామంలో ఇక ముందెన్నడూ నారాయణను పెత్తనం చేయనివ్వనని స్పష్టం చేశాడు. పటేల్‌కు, చాగంటి నారాయణకు ఆ విధంగా పూర్తిగా బెడసి కొట్టింది.

అదే రోజుల్లో, రకరకాల కారణాల వల్ల, గ్రామంలోని మరో మోతుబరి రైతు, బత్తుల సురేందర్ (తరువాత రోజుల్లో వాళ్ల అబ్బాయి ఆదినారాయణ గ్రామ సర్పంచ్‌గా చేశాడు) పటేల్ రామయ్య మీద పగ పెంచుకున్నాడు. ఇలా గ్రామంలో ఒకరి వెంట మరొకరు బహిరంగంగా-కొంత ధైర్యంగా పటేల్‌కు వ్యతిరేకంగా మాట్లాడడానికి ముందుకు రాసాగారు. నన్ను వాళ్లల్లో కలుకుని వ్యూహం పన్న సాగారు. నేను కూడా రాజకీయాలపై మక్కువతో కొంత, కమ్యూనిస్ట్ పార్టీపై అభిమానంతో కొంత వాళ్లకు అనుకూలంగా వుండసాగాను. దీనికి తోడు, పక్క గ్రామంలో వున్న బాబాయి నర్సింగరావు, బాణాపురం సర్పంచ్ గండ్లూరి కిషన్ రావు, వల్లాపురంలో వుండే పెదనాన్న వనం శ్రీ రాం రావు గారు, గోకినేపల్లి వాస్తవ్యుడు-జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ (సి. పి. ఎం) నాయకుడు రావెళ్ల సత్యం గారి ప్రోత్సాహం మాకు లభించింది. ఎన్నేళ్లగానో మా వూరిని కమ్యూనిస్ట్ పార్టీ పరం చేయాలని అనుకుంటుండే వాళ్లకు ఇదో మంచి అవకాశంగా దొరికింది. గ్రామానికి చెందిన పర్చూరు రఘుపతి, చేబ్రోలు సత్యం, పటేల్ మీద కోపంగా వున్న చాగంటి నారాయణ, వాళ్ల కజిన్ చాగంటి సత్యం, దమ్మాలపాటి వీరయ్య, దేవబత్తుల పుల్లయ్య, దళిత వాడల నాయకులు కొందరు మాతో చేతులు కలిపారు. వాస్తవానికి మా గ్రామంలో కమ్యూనిస్ట్ ఓటర్లే ఎక్కువగా వుండేవారు. బయటపడడానికి భయపడే వాళ్లు. మొత్తం మీద వీరందరినీ ఒక తాటిమీదకు తెచ్చే బాధ్యత నెత్తి నేసుకున్నాడు మల్లెల అనంతయ్య. అందరూ కలిశారు. కలిసి వుండాలని "పసుపు బియ్యాల" తో ప్రమాణం చేశారు. నాన్న గారికి నేనలా వారితో కలిసి పని చేయడం ఇష్టం లేదు. నన్ను చాలా సార్లు మందలించారు కూడా. ఇంతలో పంచాయితీ ఎన్నికలు రానే వచ్చాయి.

          అప్పట్లో మూడంచెల పంచాయితీ వ్యవస్థ వుండేది. గ్రామంలో మొదలు ఎన్నికలు జరిగేవి. తొలుత "వార్డు సభ్యులను" ఎన్నుకునేవారు. ఓటింగ్ వార్డు వారీగా జరిగేది. అదే రోజు సాయంత్రం గెలిచిన వార్డు సభ్యులంతా సాధారణ మెజారిటీ పద్ధతిలో సర్పంచ్‌ను ఎన్నుకునేవారు. కొద్ది రోజుల తరువాత, సర్పంచ్ లంతా కలిసి సమితి అధ్యక్షుడిని ఎన్నుకునేవారు. ముందుగా సమితికి ఆరుగురు కో-ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకుని, అందరూ కలిసి సమితి అధ్యక్షుడిని రహస్య బాలెట్ ద్వారా ఎన్నుకునేవారు. వివిధ కారణాల వల్ల ఎన్నికల్లో పోటీ చేయని పార్టీ నాయకులను కో-ఆప్ట్ చేసుకుంటారు. కో-ఆప్ట్ చేసుకున్న సభ్యులకు కూడా సమితికి పోటీ చేసే అర్హత వుంటుంది. ఆ తరువాత సమితి అధ్యక్షులంతా కలిసి ఇదే ప్రక్రియలో జిల్లా పరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకునేవారు. అక్కడా కో-ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకునే పద్ధతి వుంటుంది. జడ్. పి. చైర్మన్ గా పిలువబడే ఆ వ్యక్తిది చాలా పవర్ ఫుల్ హోదా. మన రాష్ట్రంలో కాబినెట్ మంత్రులుగా వుంటూ రాజీనామా చేసి, కొందరు జిల్లా పరిషత్  అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భాలున్నాయి. జడ్. పి. చైర్మన్లకు, ఎంత పలుకుబడి-ప్రాబల్యం వుండేదంటే, వాస్తవానికి వాళ్ల అంగీకారం లేకుండా ముఖ్య మంత్రి కావడం కూడా కష్టంగా వుండేదారోజుల్లో. ఒకే ఒక్క గ్రామ సర్పంచ్ జిల్లా పరిషత్ ఎన్నికల భవితవ్యాన్ని కూడా మార్చగలిగే స్థితిలో వుండేవారు అప్పుడప్పుడూ. సమితిలో ఒక్క ఓటుతో అదృష్టం తారుమారయ్యేది. అదే ఒక్క ఓటు జడ్. పి. లో కీలకమయ్యేది. ఖమ్మం జడ్. పి. లో అలా జరిగింది కూడా.

          మా గ్రామ పంచాయితీలో అప్పట్లో తొమ్మిది వార్డులుండేవి. చాగంటి నారాయణను తాగుడు మానేయాలని నిబంధన విధించాం. అలా చేస్తే ఎన్నికల తరువాత అతడే సర్పంచ్ అని హామీ ఇచ్చాం. నేను పోటీ చేయాలంటే నాకింకా ఓటింగ్ వయసు రాలేదప్పటికి. కంకిపాటి హనుమంతరావు (అడ్వకేట్) ను బరిలో వుండమంటే అయన అంగీకరించలేదు. ఇంతలో బత్తుల సురేందర్ పసుపు బియ్యాల ప్రమాణం మరిచిపోయి మా వ్యతిరేక (పటేల్) కాంగ్రెస్ పార్టీ గ్రూప్‍లో చేరి పోయాడు. చాగంటి నారాయణ పోటీ చేసిన వార్డులోనే ఆయనా పోటీకి దిగాడు. ఆయన సోదరుడు, వూరంతటికీ మంచివాడని పేరున్న బత్తుల సత్యనారాయణ "రైతులందరు" వుండే వార్డులో పోటీకి దిగాడు పటేల్ పక్షాన. మల్లెల అనంతయ్య, చేబ్రోలు సత్యం, దమ్మాలపాటి వీరయ్య, దేవబత్తుల నాగేశ్వర రావు, తిరుపతయ్య...తదితరులు కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన (ఎన్నికలు పార్టీ రహితంగా జరిగేవి) వార్డు మెంబర్లుగా పోటీ చేసారు. ఒక్క బత్తుల సత్యనారాయణ పోటీ చేసిన వార్డు మినహా, మిగతావన్నీ మాకే దక్కాయి. చివరి క్షణం వరకూ మా వార్డు మెంబర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేసారు వాళ్లు. చివరకు చాగంటి నారాయణ సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. ఎన్నికలు జరగడానికి ఒక రోజు ముందు, మా ఇంటి మీద, నా పై దాడికి దిగారు ప్రత్యర్థులు. వాళ్లకు తెలియకుండా, కన్ను కప్పి, పక్క వూరు కమలాపురం పోయి, అక్కడ నుంచి, సహాయంగా కొందరిని తెచ్చుకోవాల్సి వచ్చింది.

          చాగంటి నారాయణను గ్రామంలో ఎన్నటికీ పెత్తనం చేయనీయనన్న పటేల్ మాట చెల్ల లేదు. కాకపోతే...దీనికి ముగింపు వేరే విధంగా జరిగింది. అచిర కాలంలోనే...తాగుడుకు మరోసారి బానిసైన నారాయణ మళ్లీ పటేల్ పక్షంలో చేరి పోయాడు. కమ్యూనిస్టులకు నిరాశే మిగిలింది. అదెలా జరిగిందంటే....మా గ్రామ పంచాయితీతో పాటే ఇతర గ్రామాలకు కూడా ఎన్నికలు జరిగాయి. పక్కనున్న వల్లాపురం-అమ్మపేట ఉమ్మడి గ్రామ పంచాయితీ ఎన్నిక మాత్రం వాయిదా పడింది. సగం గ్రామాలు కమ్యూనిస్ట్ (సి. పి. ఎం)-శీలం సిద్ధారెడ్డి కాంగ్రెస్ వర్గాలు గెలుచుకున్నాయి. సమితి దక్కించుకోవడానికి, ఇంకొక పంచాయితీ అవసరం, అటు శీలం వర్గానికి (సి. పి. ఎం మద్దతుతో), ఇటు జలగం వర్గానికి (సి. పి. ఐ మద్దతుతో) వుంది. వల్లాపురం ఎన్నిక కీలకమై పోయింది. ఖమ్మం సమితి ఎవరు గెలుస్తే, వారి పక్షమే జడ్. పి. గెలుచుకునే పరిస్థితి నెలకొంది. ఓ వారం రోజుల్లో వల్లాపురం ఎన్నిక జరిగింది. జిల్లాకు చెందిన అన్ని పార్టీల నాయకులు, అతిరథ-మహారథులు, అందరూ వల్లాపురం చేరుకున్నారు. మా పెదనాన్న సారధ్యంలో ఆ గ్రామ పంచాయితీకి, మరో పెదనాన్న కుమారుడు వనం వరదా రావు (సిద్ధారెడ్డి వర్గానికి చెందిన) ఎన్నికయ్యాడు. అప్పటికింకా సమితి ఎన్నిక ఐదారు రోజులే వుంది. వల్లాపురం ఎన్నిక కావడంతోనే జలగం, శీలం వర్గాలు తమ తమ సర్పంచ్‌లతో "క్యాంపులు" పెట్టే చర్యలు చేపట్టారు. ఆ క్యాంపుకు మా గ్రామ సర్పంచ్ చాగంటి నారాయణ కూడా వెళ్లాలి. అప్పుడే పేచీ పెట్టాడు వెళ్లనని. అప్పటికే మా గ్రామ పటేల్‌తో రహస్య ఒప్పందం కుదిరుండాలి! చివరికి బలవంతం మీద వెళ్లక తప్పలేదు. క్యాంపులోనే తాగుడికి అలవాటు పడ్డాడని కొందరంటారు.

          పద్ధతి ప్రకారం నిర్ధారించిన తేదీ నాడు ఖమ్మం సమితి అధ్యక్ష ఎన్నికకు సర్వం సిద్ధమైంది. తొలుత కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక జరగాలి. ఇరు పక్షాలకు, ఎవరి లెక్క ప్రకారం వారికి, ఒకే ఒక్క ఓటు మెజారిటీ. మా గ్రామ సర్పంచ్ చాగంటి నారాయణను, ఇరు వర్గాల వారు తమ ఓటు కింద వేసుకున్నారు. చాగంటి నారాయణ కూడా తెలివిగా వ్యవహరించడం మొదలెట్టాడు. మొదటి కో-ఆప్టెడ్ సభ్యుడిగా శీలం-సి. పి. ఎం అభ్యర్థి గెలిచాడు. రెండవ అభ్యర్థిగా గోకినేపల్లి గ్రామానికి చెందిన, ప్రముఖ సి. పి. ఎం నాయకుడు రావెళ్ల సత్యం, శీలం-సి. పి. ఎం పక్షాన పోటీలో వున్నాడు. చాగంటి అతడికి ఓటు వేయకపోవడంతో ఓడి పోయాడు. గెలిచినట్లయితే అతడే సమితి అధ్యక్ష అభ్యర్థి. తెలివిగా ఆయనను ఓడించారు ప్రత్యర్థులు. ఆ సమయంలో చాగంటికి వార్నింగ్ పోయింది. గీత దాటితే పరిస్థితులు తీవ్రంగా వుంటాయన్న హెచ్చరికలు పోయాయి. మొత్తం మీద, ఆ తరువాత నాలుగు కో-ఆప్టెడ్ సభ్యులుగా శీలం-సి. పి. ఎం గ్రూపు వారే ఎన్నికయ్యారు. వారిలో రాయల వీరయ్య ఒకరు. ఓటమికి గురి కాబోతున్న జలగం గ్రూపు అభ్యర్థి సామినేని ఉపేంద్రయ్య, శీలం గ్రూపు కాంగ్రెస్ వారిని తనకు మద్దతు ఇవ్వమని వేడుకున్నా ఫలితం లేకపోయింది. రాయల వీరయ్య సమితి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఉపేంద్రయ్య గ్రూపు ఆ తరువాత ఎన్నికను బాయ్ కాట్ చేయడంతో, బాణాపురం గ్రామ సర్పంచ్ గండ్లూరి కిషన్ రావు ఉపాధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తరువాత వీరయ్య ఎన్నికను కోర్టులో సవాలు చేశారు. తాత్కాలికంగా ఎన్నిక రద్దు అయింది. కిషన్ రావు ఇన్-ఛార్జ్ అధ్యక్షుడుగా చాలాకాలం పని చేశారు. ఆ సారి జడ్. పి. కూడా శీలం వర్గానికే దక్కింది.        

          తన పదవీ కాలం పూర్తిగా ముగియకుండానే, చాగంటి నారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన స్థానంలో ఉప సర్పంచ్ గా ఎన్నికైన కమ్యూనిస్ట్ మల్లెల అనంతయ్య సర్పంచ్ అయ్యాడు.
అదో అనుభవం....        


1 comment:

  1. Pavan Kondapalli: Aa ennikalu naaku baagaa gurtu sir.Upendraiah group cpm meeda daadulu aaennikala tarvaate praarambhamindi 10ellalo gandra veerabhadra reddy, Gandluri kishanrao gaari laanti anekamandi merikallanti cpm naayakulu kaaryakartalu hatyaku gurinaaru.

    ReplyDelete