Sunday, October 20, 2013

డాక్టర్ యలమంచిలి ఆదర్శ వివాహ పౌరోహిత్యం: వనం జ్వాలా నరసింహారావు

(మాజీ రాజ్య సభ సభ్యుడు, ప్రజా వైద్యుడు, 
ప్రముఖ సిపిఎం నాయకుడు 

డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి 
అక్టోబర్ 19, 2013 న మరణించిన నేపధ్యంలో...)

డాక్టర్ యలమంచిలి ఆదర్శ వివాహ పౌరోహిత్యం

స్వసంఘ పౌరోహిత్యం

నమస్తే తెలంగాణ (22-10-2013)
వనం జ్వాలా నరసింహారావు
మాజీ రాజ్యసభ సభ్యుడు, సిపిఎం రాష్ట్ర-జాతీయ స్థాయి నాయకుడు, సామాజిక కార్యకర్త, ప్రజా వైద్యుడు, నిరీశ్వరవాది, సాహిత్యాభిలాషి, తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచే విప్లవ భావాలను అలవరచుకున్న వ్యక్తి, పౌరహక్కుల నేత, ఖమ్మం జిల్లాలో స్థిర నివాసం ఏర్పరచుకున్న "సీమాంధ్ర తెలంగాణ వాసి", డాక్టర్ యలమంచిలి రాధా కృష్ణమూర్తి గారు సరిగ్గా తన 86 వ పుట్టిన రోజైన అక్టోబర్ 19, 2013 న హైదరాబాద్ కేర్ బంజారా ఆసుపత్రిలో మరణించారు. వివిధ కోణాలలో డాక్టర్ గారి వ్యక్తిత్వాన్ని విశ్లేషించవచ్చు. అందులో ఒకటి ఆయన వంట్లో ఓపికున్నంతకాలం నిర్వహించిన "స్వసంఘ పౌరోహిత్యం". అదే ఆయనను చాలా మంది కమ్యూనిస్టులకు, ఆదర్శ వివాహాలు చేసుకోదల్చిన కమ్యూనిస్టే తరులకు దగ్గరి వాడిని చేసింది. 

రాధాకృష్ణమూర్తిగారి తండ్రి పౌరోహిత్యం చేసేవారు. ఒక రెండు సంవత్సరాల పాటు పూర్తికాలపు పూజారిగా ఘంటసాల లోని ప్రసిద్ధ శివాలయంలో పనిచేశారు. అందుకే ఆయనను కమ్మ బ్రాహ్మణుడు" గా పిలిచేవారు. "స్వసంఘ పౌరోహిత్యం" అనేది ఆ నాటి (1930s-1950s) ఒక సంస్కరణ ఉద్యమం. దాని మూలాలు బ్రాహ్మణాధిక్యత వ్యతిరేకతలో వున్నాయి. తమిళ నాడులో రామస్వామి నాయకర్ గారు, ఆంధ్ర దేశంలో కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరిగారు ఆ ఉద్యమానికి స్ఫూర్తి అని డాక్టర్ గారనే వారు. దయానంద సరస్వతి గారి ప్రభావం కూడా వుండొచ్చునంటారు ఆయన. వీరి ఇంట్లో ఆయన రాసిన "సత్యార్థ ప్రకాశిక" వుండేది. డాక్టర్గాఆరి ఉద్దేశంలో, స్వసంఘ పౌరోహిత్యం అంటే, ఏ కులం వారు, ఆ కుల పురోహితులతోనే కర్మలను నిర్వహించవచ్చు. (సీమంతం నుండి అన్న ప్రాశన, విద్యారంభం, వివాహం, శోభనం, అంత్యేష్టి...ఇలా షోడశ దశ-అంటే పదహారు కర్మలను అనుసరించి, ప్రతి దానికి బ్రాహ్మణ పురోహితుని ఆధ్వర్యం వహిస్తారు). 

రాధాకృష్ణమూర్తిగారి నాన్న గారితో పాటు, ఆయన మిత్రుడు-సహాధ్యాయి, పాలడుగు శేషాచార్యులు, ఆ రోజుల్లో ఈ ఉద్యమానికి ప్రతినిధులు. వారు గుంటూరు జిల్లాలోని ఒక స్వర్ణకార పండితుని వద్ద శిష్యరికం చేసి, ఈ పౌరోహిత్య కార్యక్రమానికి సంబంధించిన మంత్రాలు క్షుణ్ణంగా నేర్చుకుని వచ్చినట్లు చెప్పేవారు. బ్రాహ్మణ పురోహితులు, వారి ఇండ్లలో చేయించినట్లు, పూర్తి వైదిక పద్ధతిలో శూద్రుల ఇళ్లలో చేయించడం లేదని వీరి మరొక ఆరోపణ. "క్షుణ్ణంగా" అనడంలో కారణం కూడా చెప్పారు డాక్టర్ గారు. చాలా సందర్భాలలో వీరు బ్రాహ్మణ పురోహితుల పద్ధతిలో లోపాలను ఎత్తి చూపేవారు. సవాలు కూడా చేసేవారు!


ఇన్ని కార్య క్రమాలు "శాస్త్ర యుక్తంగా" చేయించే డాక్టర్గావరి నాన్న, వాళ్ల ఇంట్లో ఏ పూజలు చేసేవారు కాదు. ఆయనకు దేవుడు మీద కూడా పెద్దగా నమ్మకం వుండేది కాదన్నారు డాక్టర్ గారు. అదేంటో తరువాత తెలిసింది వీరికి. ఇది "పూర్వ మీమాంస కుల" ధోరణి అని. చిత్రం ఏమిటంటే, వీళ్లు ఆ కాలంలోనే అస్పృశ్యతను వ్యతిరేకించేవారు. కులాంతర వివాహాలు, విధవా వివాహాలు చేయించేవారు. పౌరోహిత్యంలో చాలా "ఫ్లెక్సిబుల్" గా వుండేవారు. పెళ్లిళ్లలో మాత్రం, పక్కాగా మంత్రాలు చదివి, తిరిగి తెలుగులో అనువదించేవారు. "వివాహ విధి" అని వారి పాఠ్యగ్రంథం వుండేది. అయితే ఎవరైనా "స్టేజి వివాహం" కావాలంటే, రామస్వామి చౌదరిగారు, సరళమైన పద్యాలలో రాసిన వివాహ విధి సాయంతో, అరగంటలో పూర్తి చేసేవారు. 

గుంటూరు జిల్లాలో 1940 దశకం నుండి హేతువాద ఉద్యమం వుండేది. వారు దైవ ప్రసక్తి లేకుండా స్టేజి పెళ్లిళ్లు చేయించేవారు. అదే కాలంలో, కమ్యూనిస్ట్ ఉద్యమం ఆంధ్ర దేశంలో ప్రబలంగా వుండేది. వారు మంత్ర-తంత్రాలు లేకుండా, తెలుగు మాటల్లో, "దండల పెళ్లిళ్లు" చేయించేవారు. అలా పెళ్లి కార్యక్రమాలు చాలా సరళీకృతంగా చేయబడుతూ వుండేవి. రాధాకృష్ణమూర్తిగారు వైద్య వృత్తి రీత్యా ఖమ్మం వచ్చాక, నిరీశ్వరవాది ఈశ్వర ప్రసాద్ గారు చేయించిన పెళ్ళి చూశారాయన. విజయవాడలో హేతువాదులు చేయించిన రెండు పెళ్లిళ్లు కూడా చూశారు. యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యు.టి.ఎఫ్) నాయకులు శ్రీ నరహరిగారు చేయించిన ఒకటి-రెండు పెళ్లిళ్లు, తాపీ ధర్మారావుగారు చేయించిన ఒక పెళ్లి చూశారు. తాపీ ధర్మారావుగారి ప్రామాణిక గ్రంధం "పెళ్లి-పుట్టు పూర్వోత్తరాలు", "దేవాలయాలపై బూతుబొమ్మలు", ప్రముఖ హేతువాది రావి పూడి వెంకటాద్రిగారి "వివాహ పద్ధతి" చదివారు. ఈ మొత్తం నేపధ్యంలో డాక్టర్గాతరు ఒక పద్ధతిని రూపొందించారు. వధూవరులను-వారి తల్లి తండ్రులను వేదిక మీదకు ఆహ్వానించిన తరువాత, ఒకరు వారి-వారి కుటుంబ వివరాలు, వధూవరుల ఉద్యోగ-విద్యా సంబంధిత వివరాలు చెబుతారు. వివాహ ప్రమాణ పత్రం కాపీలు కొన్ని తయారుగా వుంటాయి. పూల దండలు వుంటాయి. ఆచార్యుడు, ప్రధానంగా సంప్రదాయ పద్ధతికి భిన్నంగా, ఈ దండల-ప్రమాణాల పెళ్లి ఎందుకు ఎంచుకున్నారో వివరిస్తారు. ప్రమాణ పత్రం ఇద్దరితో చెప్పిస్తారు. దండలు మార్పిస్తారు. శుభాకాంక్షలు చెప్పి, పత్రాలపై సంతకాలు చేయించి, ఇద్దరు-ముగ్గురు పెద్దలను ఆశీర్వదించడానికి పిలుస్తారు. 

ఈ నూతన పద్ధతిని ఎంచుకోవడానికి కారణాలను ఇలా వివరించారు డాక్టర్ గారు:

1. పురోహితుడి మంత్రాలు ఎవరికీ తెలియని సంస్కృతంలోనే ఎందుకుండాలి? చెప్పదల్చుకున్నదేదో తేట తెలుగులో చెప్పవచ్చు గదా? 2. కాళ్లకు నీళ్లిస్తాం. మంచి నీరిస్తాం. పానకం ఇస్తాం. ఇవన్నీ అనడానికి, "పాద్యం కరిష్యే", "ఆచమనం కరిష్యే", శుద్ధాచమనం కరిష్యే" లాంటి మంత్రాలు అవసరమా? ఫలానా వూరిలో పెళ్లి జరుగుతుందనడానికి "జంబూ ద్వీపే,  భరత ఖండే, భారత వర్షే, మేరూర్ పర్వత దక్షిణ దిగ్భాగే, కృష్ణా-గోదావరి మధ్య స్థలే...వగైరా...వగైరా" లు ఎందుకు? ఫలానా వారి అబ్బాయి, ఫలానా వారి అమ్మాయి అనడానికి కూడా పెద్ద సంస్కృత శ్లోకం పఠించాలా? 3. ఆధునిక ఆలోచనలో స్త్రీ పురుషుల సమానత్వం ఒక ముఖ్యమైన విషయం. యుక్త వయస్సు వచ్చిన వారు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ చట్టం ఇస్తున్నది. అలాంటి కాలంలో, కన్యాదానం లాంటి ఘట్టాలెందుకు? కన్యాదానంతో బ్రహ్మలోక ప్రాప్తి లభిస్తుందని నిజంగా ఈ రోజుల్లో ఎవరన్నా నమ్ముతున్నారా? 4. మంగళ సూత్రం అన్న దానికి నిజంగా అంత పవిత్రత, "శరదశ్శతం" బ్రతికించే శక్తి వుందా? అసలు ఈ మంగళ సూత్రం అన్ని మతాలలో, అన్ని కులాల లోనూ లేదే? అన్ని ప్రాంతాల లోనూ లేదే? మన దేశంలో కూడా అన్ని కాలాలలోనూ వున్నట్లు ఆధారాలు లేవే! 5. "సప్త పది" పేరుతో ఏడడగులు వేయించడం కేవలం లాంఛనం కదా? అప్పుడు చెప్పే మంత్రాలు: "ఓం యిషే ఏక పదీ భవ...వగైరా..." కొంత అర్థవంతమైనవే. అదే విషయాలు ప్రమాణ పత్రాలలో చెప్పించవచ్చు కదా? 6. పెళ్లి ఒక మత ప్రక్రియ కాదు. కుటుంబ సంబంధమైన సంగతి. వేడుక కూడా. అందుకనే బంధుమిత్రులను పిలుస్తున్నాం. కుటుంబ స్నేహితుల్లో అన్ని మతాల వారుండవచ్చు. కనుక దీన్ని దైవ ప్రసక్తి - మత ప్రసక్తి లేకుండా, ఒక లౌకిక ప్రక్రియగా చేయడం సబబు కదా! 

ఇలాంటి సంగతుల్నే, అనేక ఉదాహరణలతో - ప్రామాణిక రుజువులతో వివరించవచ్చు. కొన్ని ముఖ్యమైన మంత్రాలు కూడా కంఠస్థం చేసి, అర్థం చెప్పి పైన పేర్కొన్న అంశాలకు బలం చేకూర్చితే, కొంత ప్రామాణికత - వాస్తవికత కూడా వస్తుంది. మొత్తం కార్యక్రమం గంటలోనో, అర్థ గంటలోనో పూర్తి చేయవచ్చు. పనిలో పనిగా, కుటుంబ వ్యవస్థ గురించి, ఏంగిల్స్ లాంటి మేధావులు చెప్పిన మాటలను కూడా జోడించవచ్చు. వర కట్నాలు, ఆడంబరాలు లాంటి అవాంఛనీయ ఆచారాలపై విమర్శ పెట్టవచ్చు. సమయాన్ని - సందర్భాన్ని బట్టి, ఇలాంటి వివరాలలోకి పోవచ్చు. 

మన పెద్దలు పెళ్లిని ఒక మంత్ర క్రతువుగా మార్చి, పూజా పునస్కారాలతో మిళితం చేశారు. ఒక కేసులో స్పష్టమైన తీర్పు ఇస్తూ, ఢిల్లీ హైకోర్టు, హిందూ వివాహ ప్రక్రియ మత క్రతువు కాదని, అదొక సామాజిక సంబంధమైనదని చెప్పింది. అసలీ తంతు అంతా ఉభయ కుటుంబాల బంధుమిత్రుల సంతోషం-సంబరం కోసం చేసే ఒక వేడుక. ఒక ప్రసిద్ధ సినీగేయకవి, ఎంతో చక్కగా మూడు ముక్కల్లో-అర్థవంతంగా చెప్పినట్లు: "మాటె మంత్రమా..మనసే బంధమా...ఈ మమతే, ఈ సమతే మంగళవాద్యమా...ఇది కళ్యాణం, కమనీయం, జీవితం". ఇది అత్యాధునిక చట్టబద్ద ప్రక్రియ. ఇక వివాహానికి సంబంధించి రెండో పార్శ్వం కూడా వుంది. పెళ్ళి పెద్దలు కుదిర్చిందా? లేక ఇద్దరూ ఇష్టపడి నిర్ణయించుకున్నదా? వీటి మంచి చెడ్దల గురించి సమకాలీనంగా సమాజంలోనూ, మీడియాలోనూ విస్తృతంగా చర్చ నడుస్తోంది.

దీనిపై మోర్గాన్ తన "ఏన్షియంట్ సొసైటీ" లోనూ, ఏంగిల్స్ తన "కుటుంబం, వ్యక్తిగత ఆస్తి" అన్న ప్రసిద్ధ గ్రంధంలోనూ చాలా చర్చించారు. ఆగస్ట్ బె బెల్ 150 సంవత్సరాల క్రితం ఆయన రాసిన "స్త్రీలు-సోషలిజం" ప్రసిద్ధ గ్రంధంలో ( పేజీలో), పెట్టుబడిదారీ సమాజంలో పెళ్లి కూడా వ్యాపార స్థాయికి దిగజారి పోయిందని వాపోతాడు. ఆయన మార్క్స్, ఏంగెల్స్ సమకాలికుడు. ఈ నిర్ణయం ఈ నాటికి ఎలా నూరు శాతం వాస్తవంగా వుందో చూస్తుంటే, బె బెల్ కు చేయెత్తి నమస్కరించాలనిపిస్తుంది.

ఈ పద్దతి చాలా మందికి - ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ కార్య కర్తలను నచ్చినట్లుందని, ఈ తరహా పెళ్లి చేయించుకోవడానికి వారు ముందుకొస్తున్నారని, ఈ పద్దతినే మాజీ శాసన సభ సభ్యుడు, ప్రముఖ సిపిఎం నాయకుడు, స్వర్గీయ బోడేపూడి వెంకటేశ్వర రావు గారు కూడా మొదలు పెట్టారని అంటూ, ఒక దశలో వారిద్దరికీ డిమాండ్ పెరిగిందని అనేవారు డాక్టర్గా్రు. అయితే దీని వెంట ఒక ఇబ్బంది కూడా వచ్చింది. ముఖ్యమైన పార్టీ కార్యక్రమాలకు ఇవి అడ్డు వచ్చేవి. కొంతమంది ఫలానా వారు ఆచార్యత్వం వహిస్తేనే ఈ తరహా పెళ్ళికి అంగీకరిస్తామని చెప్పడంతో, పద్దతి కంటే వ్యక్తికి ప్రాధాన్యత కావడం మొదలైంది. కొన్ని సందర్భాలలో, పెద్ద వారి ఇళ్ళకే వెళ్తారా? సామాన్యుల ఇళ్లకు రారా? అనే వరకూ వెళ్లింది. కనుక నెమ్మదిగా తమను పిలవకుండా వుండేలా "డిస్కరేజ్‌" చేయాల్సి వచ్చిందన్నారు. కాలం మారుతోందనీ, పోస్ట్ మోడర్నిజం వచ్చినట్లే, తిరిగి సమాజం తిరోగమనం బాట పడుతోందని, పాత పద్దతుల మీద - ఆడంబరాల మీద మోజు పెరుగుతోందని ఆవేదన కూడా వ్యక్తం చేశారు డాక్టర్గానరు. 

అయితే ఈ తరహా పెళ్లిళ్లపై విమర్శ కూడా లేకపోలేదనేవారాయన. అందులో కొన్ని సహేతుకమైనవి కూడా. మొదటిది: ఇది స్పీడ్ యుగం. సంప్రదాయ వివాహ పద్దతిలో, ఆహుతులు కుదురుగా కూర్చోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా వచ్చి-ఎప్పుడైనా వెళ్లి పోవచ్చు. లేదా "లగ్న" సమయానికే సరిగ్గా వచ్చి, అక్షింతలు వేసి వెళ్ళవచ్చు. కొత్త పద్దతిలో, ఒక గంట సేపు కుదురుగా కూర్చోవాల్సి వస్తుంది. గంట సేపు ఉపన్యాసాల లాంటివి వినాలి. ఇప్పటికే ఎన్నికల స్టేజీ ఉపన్యాసాలు, రాజకీయ పార్టీ నాయకుల ఉపన్యాసాలు వినీ-వినీ విసిగిపోతున్న వారికి ఇక్కడ కూడా ఈ "శిక్ష" ఎందుకు? అనిపిస్తుంది. రెండోది: సంప్రదాయ పద్దతిలో వున్న అనేక ఘట్టాలు కాస్తంత సరదాగా వుంటాయి. మంత్రాలు అర్థాలు తెలియకపోతేనేం? అదంతా బ్రాహ్మణుడి గొడవ! ఉదాహరణకు: బ్రహ్మ ముడి వేసుకుని ఏడడగులు నడవడం, మంగళ సూత్రం కట్టడం, అన్నింటి కన్నా ఎక్కువగా, తలంబ్రాలు పోటీ పడి మరీ పోసుకోవడం, వాళ్లకే కాకుండా, చూసే వాళ్లకు ముచ్చట గాను-ఆహ్లాదకరంగానూ వుంటుంది. ఇక ఈ కొత్త పద్దతిలో, ఏ సరదా కనిపించదు. సాదా-సీదాగా, చప్పగా, మరీ చెప్పాలంటే విసుగుగా - మీటింగులా వుంటుంది!

ఇప్పడు చాలా పెళ్లిళ్లు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఇది అవసరమే కాకుండా, తప్పనిసరి కూడా కావచ్చు. కనుక, దండల పెళ్ళి, లేక, స్టేజి పెళ్ళి, లేక, ప్రమాణాల పెళ్ళి - పేరు ఏదైనా కావచ్చు - దీన్ని కూడా మరింత ఆకర్షణీయంగా, సరదాగా కూడా చేసే విషయం ఆలోచించాల్సిన విషయమంటారు డాక్టర్ గారు. నిజానికి, ఇవేవీ లేకుండా, వధూవరులు - వారి తల్లితండ్రులు - దగ్గర బంధువులు పదిమంది కలిసి, రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లి, ముద్ర వేయించుకుని, దారిలో ఏదైనా రెస్టారెంటులో టీ నో -కాఫీ నో తాగి, లేదా ఏదైనా తిని, ఇళ్లకు వెళ్లిపోవడం ఆదర్శవంతమైన పని. కొన్ని దేశాలలో, పెళ్ళి ప్రసక్తి లేకుండానే, కలిసి జీవించే పద్దతి వస్తున్నది. దాన్ని చట్టం కూడా ఆమోదిస్తున్నది. కాలం మారుతోంది కదా! మనకూ ఆ పద్దతి వస్తుందేమో నని, అప్పుడు ఈ చర్చ అంతా వృధానే మో నని చమత్కరించారు డాక్టర్ గారు. 

(నేను రాసిన డాక్టర్ గారి జీవిత చరిత్ర "అనుభవాలే అధ్యాయాలు" నుంచి సేకరణ)

No comments:

Post a Comment