Thursday, October 17, 2013

"కాళోజీ గొడవ మా అందరి గొడవ" : వనం జ్వాలా నరసింహారావు

కాళోజీ శత జయంతి వేడుకలు జరుపుకుంటున్న నేపధ్యంలో

"కాళోజీ గొడవ మా అందరి గొడవ"
వనం జ్వాలా నరసింహారావు

          కాళోజీ నారాయణరావు గారిని మొట్ట మొదటిసారి ప్రముఖ పాత్రికేయుడు స్వర్గీయ జి. కృష్ణ గారితో కలిసి నిజాం వైద్య విజ్ఞాన సంస్థలో ఆయనో పర్యాయం చికిత్స కొరకు ఆసుపత్రిలో చేరిన సందర్భంలో కలిసినట్లు జ్ఞాపకం. అంతకు ముందు, ఆయనతో పరిచయం లేకపోయినా, తెలంగాణ ఉద్యమం సందర్భంగా రెండు-మూడు సభల్లో ఆయన ప్రసంగం విన్నాను. ఆయన్ను కలిసిన రోజున నాతో పాటు డాక్టర్ ఏ. పి. రంగారావు, భండారు శ్రీనివాసరావు కూడా వున్నారు. మమ్మల్ని, ఆయనతో పాటు స్వాతంత్ర్య ఉద్యమం రోజుల్లో జైలులో గడిపిన స్వర్గీయ అయిత రాజు రాం రావు గారి బంధువులుగా (నాకు మామ గారు, రంగారావుకు తండ్రి గారు, శ్రీనివాసరావుకు బావ గారు) పరిచయం చేశారు కృష్ణ గారు. ఆ రోజున కాళోజీతో మాట్లాడుతున్నప్పుడు, శారీరకంగా కొంత బలహీనంగా కనిపించినప్పటికీ, కులాసా కబుర్లు చెప్పడంలో మాత్రం ఆయనలో నాకే అలసట కనిపించలేదు. ఆ రోజున ఆయన చెప్పిన విషయం ఒకటి నాకింకా జ్ఞాపకం వుంది. పీవీ నరసింహారావు సమీప బంధువు ఒకావిడను గురించి విడమర్చి చెప్పి, ఆమె అనుభవిస్తున్న దారిద్ర్యాన్ని విశదీకరించి, ఆమెను ఆదుకోవడానికి పీవీ చేసిన ప్రయత్నాలు కూడా చెప్పి, అవేవీ ఫలించకపోవడానికి ఏవో కొన్ని కారణాలను కూడా వివరించారు. అంత అనారోగ్యంలోను మద్యం గురించిన సంభాషణ కూడా కొంత చేశారు. ఇక ఆయనకు, కృష్ణ గారికి మధ్య జరిగిన సంభాషణంతా సాహిత్యం మీదే! ఆ తరువాత కాళోజీని చాలా సార్లు కలవడం జరిగింది. కలిసి మద్యం సేవించిన సందర్భాలు కూడా చాలా వున్నాయి. ఆయనతో కలిసి కూర్చుని, ఆయన చెప్పే కబుర్లు వింటుంటే, కాలం అలా గడిచి పోయేది. ఎమర్జెన్సీ రోజుల్లో ఆయనతో కలిసిన సందర్భాలు మరీ బాగుండేది. ఆయన ప్లహ్లాద చరిత్ర ఆయన నోటి వెంట వింటుంటే ఒళ్లు పులకరించేది. నాకు ఆయన పరిచయమయ్యేవరకు ఆయన రాసిన "నా గొడవ" కవితల గురించి తెలియదు. ఆయన దగ్గర నుంచే ఆ పుస్తకాన్ని తీసుకుని చదివి, ఇప్పటికీ నా దగ్గరే అట్టి పెట్టుకున్నాను.

          నేను హైదరాబాద్ చిక్కడపల్లి-అశోక్ నగర్ లో కేశిరాజు చలపతిరావు గారింట్లో వుంటున్నప్పుడు (1978-1984 మధ్య కాలంలో) ఒక నాడు రాత్రి పూట మా ఇంటికి భోజనానికి వచ్చారు కాళోజీ. భోజనంలో మా శ్రీమతి "పచ్చి పులుసు" వడ్డించింది. అంతవరకు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్న కాళోజీ గొంతు ఒక్క సారి మారిపోయింది. దుఃఖం రావడం మొదలైంది. దానికి కారణం ఒకటి చాలాకాలం తరువాత "పచ్చి పులుసు" తో భోజనం చేయడం అయితే, మరొకటి అదే పచ్చి పులుసుతో చెరబండరాజు ఇంట్లో భోజనం చేసిన సంగతి గుర్తుకు రావడం. అదే రోజున ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను కాళోజీ కలిసి పరామర్శించి రావడం, ఆయన ఆరోగ్య పరిస్థితి అంత బాగా లేకపోవడం కాళోజీ దుఃఖానికి మరో కారణం. చివరిసారి కాళోజీని కలవడం ఆయన 88 వ పుట్టిన రోజు సందర్భంగా, ఉదయం (సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అనుకుంటా) జరిగిన సభలోను, సాయంత్రం తెలంగాణ ప్రభాకర్ ఇంట్లోను జరిగింది. సాయంత్రం కలిసినప్పుడు ఆయన స్వయంగా "నా గొడవ...కాళోజీ కవితల సంపూర్ణ సంకలనం" పుస్తకంపై "జ్వాలా...అగ్గి పిడుగు" అని రాసి సంతకం పెట్టి నా చేతికివ్వడం ఇంకా గుర్తుంది. నవంబర్ 13, 2002 కాళోజీ మరణించిన వార్త విని ఆయన అంతిమ దర్శనం కొరకు ప్రభాకర్ ఇంటికి వెళ్లి వచ్చాను.


పీవీ నరసింహారావు, కాళోజీ నారయణరావు, సదాశివరావు

కాళోజీ 88 వ పుట్టిన రోజు సందర్భంగా జరిగిన సభ నాకింకా బాగా గుర్తుంది. ఆ రోజున ముఖ్య అతిధిగా వచ్చిన మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు చేసిన ప్రసంగం నేను యధాతధంగా రాసుకున్నాను. "జగతికి శాపములు ఇచ్చుచు శత సంవత్సరములు బ్రతుకుము" అని అప్పటికి 28 సంవత్సరాల క్రితం కాళోజీ షష్టి పూర్తి సందర్భంగా తాను అన్న మాటలనే తిరిగి చెప్తున్నానంటూ తన ఉపన్యాసాన్ని మొదలు పెట్టారు పీవీ. కాళోజీ మాట్లాడితే వినాలని, తిడితే పడాలని, అనుకోని వారు బహుశా ఎవరూ వుండరని అంటూ, తనకంటే ఐదేళ్లు పెద్దవాడైన కాళోజీతో తన పరిచయాన్ని, తరువాత క్రమేపీ తమ మధ్య పెన వేసుకుపోయిన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు పీవీ. కాళోజీ ప్రభావం తనపై ఎంతో గాఢంగా పడిందనీ, ఆ కారణాన, తాను ఏదైనా నిర్ణయం తీసుకున్న ప్రతిసారి కాళోజీ లాంటి విమర్శకుడు ఆ నిర్ణయం విషయంలో ఎలా స్పందిస్తారోనని ఆలోచనలో పడిపోతాననీ, ఆ విధంగా కాళోజీ తన ఆత్మగా మారి కూర్చున్నాడనీ చెప్పారు. వయసులో చిన్నవాడినైన తనకు, తనకంటే పెద్దవాడైన కాళోజీని ఆశీర్వదించాలని వుందనీ, ఆయనింకా పది కాలాల పాటు నడవాలి అని అనాలని వుందని, ఆయన అవసరం ఎంతో వుందని అడుగుతున్నానని, "నువ్వు మాట్లాడితే వినాలని...తిడితే పడాలని" ఆశగా వుందని అంటారు పీవీ. ఆ నాడు పీవీ సుమారు అరగంట పాటు ఏకధాటిగా ప్రసంగించి, "రెండు యుద్ధాల మధ్య సాగిన తమ జీవన యానం" గురించి పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. ఆయన మాటల్లోనే....ఆ ఉపన్యాసంలోని ఆసక్తికరమైన అంశాలు... కొన్ని:

"కాళోజీ గారూ...కాదు సార్...గౌరవ వాచకం తీసేస్తాను. కాళోజీ అనే సంబోధిస్తాను...ఇంత అమూల్య సన్నివేశం నా జీవితంలో వస్తుందని నేనే నాడు ఊహించలేదు. ఇది అపూర్వం కాదు. అమూల్యం. ఒక్క సారి గతంలోకి దృష్టి సారించాను. ఇంతకు ముందు కూడా ఒక సారి ఒకే వేదికపై కలిశాం. అది ఆయన షష్టిపూర్తి సంబరం. వరంగల్‌లో జరిగింది. అదో లొల్లి బృందం. ఆయన కప్పుడు అభినందనలు చెప్తూ...’జగతికి శాపములు ఇచ్చుచు శత సంవత్సరములు బ్రతుకుము’ అన్నాను. కాళోజీ కోప్పడతాడు, ఏడుస్తాడు. ఇదంతా ఆయన గొడవకు సంబంధించిన వైనా మా అందరి గొడవే! అలనాటి మా ఇద్దరి స్మృతులు, మా జంట జీవితాలలోని కొన్ని ఘట్టాలను చెప్తాను...కబీర్, దాదూదయాళ్, వేమనల పరంపరలో కాళోజీ చివరివాడేమో! లోప భూయిష్టమైన ఈ ప్రపంచంలో తప్పులు సరిదిద్దేవారు ఎప్పుడూ ఉంటూనే వుంటారు. ఇది జరగని నాడు జగత్తే అంతమవుతుంది. కాళోజీకి వేమనకు, కాళోజీకి దాదూదయాళ్‍కు, కాళోజీకి కబీర్‌కు వ్యత్యాసం కూడా వుంది. వాళ్ళు సాక్షులు. ఈయన సాక్షి-భాగస్వామి. తాను పాల్గొంటూ, పొరపాట్లను సరి దిద్దుకుంటూ, ఇతరుల పొరపాట్లను బయటపెడుతూ, జంకు-గొంకు లేకుండా చెప్తాడు".

"వరంగల్‌లో నేను కాళోజీకి జూనియర్‌ను. ఆయన టాప్. మధ్యలో నేను. ఆయన క్లాస్ మేట్స్ తర్వాత నాకూ క్లాస్ మేట్సే. నా చదువు పూర్తయ్యే నాటికి కాళోజీ వకీలు ఘట్టం మొదలైంది. నేనప్పుడే చదువు వదిలేసి వచ్చాను. కాళోజీని గమనిస్తే...ఈయన వృత్తికి, ప్రవృత్తికి కలిసినట్లు లేదనిపించింది. అదో సంధికాలం. ఈ నాటి యువకులు ఆనాటి సంగతులు తెలుసుకోవాల్సిన కాలం. బ్రిటీష్ వాళ్లతో ఎంతో కాలం పోరాడాలనీ, ఉద్యమం దీర్ఘకాలం సాగుతుందని, అనుకుంటున్న రోజుల్లోనే, స్వతంత్ర భారతం చేరువల్లోకి వచ్చే రోజులు వచ్చాయి 1942-1945 మధ్య కాలంలో. ’ప్లీజ్ లీవ్ ఇండియా టు గాడ్ అండ్ ఖెయాస్’ అని బ్రిటీష్ వారిని కోరారు గాంధీ. వీళ్లను తుపాకిలతో ఎట్లా అదుపులో పెట్టాలో అర్థంకాని బ్రిటీష్ వారు ఇక్కడి నుంచి నిష్క్రమించాలని మానసికంగా ఓ నిర్ణయానికొచ్చారు. అదో సంధికాలం. పరీక్షా సమయం. మేం 20-30 సంవత్సరాల వెనుకైనా పుట్టలేదే అన్న భావన. తల్లితండ్రులకేమో మేం ఉద్యోగంలో స్థిరపడితే మంచిదని అభిప్రాయం వుండేది. మేం కాంగ్రెస్ అని తిరిగేది. జీవితంలో ఏం చెయ్యాలన్న నిర్ణయం తీసుకునే ప్రయత్నంలో నేనున్నాను. ఐతే అప్పటికే కాళోజీ నిర్ణయం తీసుకున్నట్లే వుంది. ఇంతలో నేను వకీలు వృత్తిలో బూర్గుల దగ్గర జూనియర్‌గా చేరాను".

          "సరిగ్గా అప్పుడే ’సాహిత్య జగత్తు’ అనే మాగజైన్ ఉదయించింది. కాళోజీ గారి సాహిత్య గురువు గార్లపాటి రాఘవరెడ్డి గారి ప్రోత్సాహం-ప్రోద్భలం వుంది దానికి. ఆయన రస సిద్ధి చాలా తక్కువ మందికి వుంటుంది. అనేక విభావ, అనుభవాల వేణు గోపాల శతకం ఆయన రమ్యంగా రాశారు. కాళోజీ నవీనత్వాన్ని, ప్రబంధ కావ్యాల పురాతనత్వాన్ని, అన్నింటినీ, ఆకళింపు చేసుకున్న ఆత్మగతం - మా గురువు ఆయన. ఆ రోజుల్లో, వరంగల్‌లో ఎక్కడ తినేదో, ఎక్కడ తిరిగేదో, ఎక్కడ వుండేదో....అంతా ఏదో విధంగా జరిగి పోయేది. కాళోజీకి ఆయన అన్న రామేశ్వర రావు గారి ఇల్లుండేది. నేను కూడా మధ్యమధ్యన అక్కడే తినేది. మరి మేమేమో ’ఆవారాలు’ కదా! ఇక మావాడు సదాశివ రావు కాకతీయ పత్రికకు ఎడిటర్. పత్రిక మొదలైతే పెట్టాం కాని అమ్మేవాడెవరన్న సందేహం వచ్చింది. నేను అమ్మేవాడిని. స్నేహంగా ఎవర్నైనా అడిగితే ఓ పది రూపాయలు చందా వచ్చేది. ఈ లోపల సదాశివరావు భూస్వాములను తిట్టుకుంటూ వ్యాసాలు రాసేవాడు. వాళ్లు నిరక్షరాస్యులు కాబట్టి కొనరు-చదవరు".


కాళోజీ గారితో నేను

          "కాళోజీ ఆదర్శప్రాయుడు. మా మార్గాలు వేరయ్యాయి. ఐనా, ’కాళోజీ భూతం’ నన్ను ఈ నాటికీ వెంటాడుతుంది. ఏ పని చేసినా, చేస్తున్నా, చేయబోతున్నా, కాళోజీ ఏమంటాడోనన్న భయం. అందుకే అనుకున్నాను..నేను నా జీవిత చరిత్ర రాయకూడదని. రాస్తే అబద్ధాలు రాయాల్సి వస్తుందేమోనని! ఆ సంధి కాలంలోనే, రెండు-మూడేళ్ల సాన్నిహిత్యం, సావాసం ఆయనను నాకు క్రిటిక్‌ను చేసింది. కాళోజీ ఒక ’ఫినామినన్’. బహుశా దానర్థం తెలుగులో లేదేమో! నా జీవితంలో కాళోజీ ఫినామినన్, కాళోజీ అనుభూతి నాలో చొరబడింది. 1942 లో ఈన రాసిన ఆవేదన, కొన్నాళ్ల క్రితం, 1999 లో ఓ సమావేశంలో చెప్పారు. అదో పెద్ద పారిశ్రామికవేత్తల సమావేశం. ఈ సందర్భంలో మా ప్రజాకవి చెప్పింది వినండన్నారు. చిన్ననాటి నుండి నన్ను వెంటాడి వేధిస్తున్న విషయం గ్రామీణ భారత దేశం. దాని విషయమే కాళోజీ చెప్పింది ఆంగ్లంలో చదివి వినిపించాను".

          "ఇన్నాళ్లుగా కాళోజీ నాలో కుదించుకుని కూర్చున్నాడు. ఈయనకు ’ఇజం’ లేదా? ఈయన కాంగ్రెస్ పార్టీ వాడు కాదా? 1952 లోక్ సభ ఎన్నికల్లో మేమిద్దరం జంట అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ తరఫున కరీంనగర్ నుంచి పోటీ చేసి, జంటగా ఓడాం. కాళోజీ 1400 ఓట్ల తేడాతో ఓడితే, నేను 80, 000 ఓట్ల తేడాతో ఓడాను. ఆయనప్పుడు ’నా మడికొండ ఓట్లతో ఓడాను’ అన్నాడు. ఎందుకంటే అది ఆయన గ్రామం. అక్కడున్న ఓట్లు సరిగ్గా 1400. ఆ తరువాత కాళోజీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ గెలిచి, అదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్య బట్టాడు. తనకు తోచింది తాను చేస్తాననేవాడే తప్ప ఎవరి మాట వినడు కాళోజీ. తరువాత పార్టీ రహితుడయ్యాడు. అతీతుడయ్యాడు. అప్పటికీ-ఇప్పటికీ ’ఇజం’ లేదంటాడు. ఐతే, ప్రవేశ ద్వారం వుంటుంది కదా! రావి నారాయణరెడ్డి, కాళోజీ నారాయణరావులు కాంగ్రెస్ సత్యాగ్రహులు. అంత మాత్రాన ఒక పార్టీని అంటి పెట్టుకుని ఎందుకు వుండాలి? ఈ ప్రపంచంలో జరిగేది, శాశ్వతమైనది ’మార్పు’ మాత్రమే! కాళోజీ లాంటి ’ఫినామినన్’ ఎప్పుడో యుగ-యుగాలకు ఒక మారు పుడ్తాడు. ఆయనింకా జగతికి శాపాలిస్తూనే వుంటారు. అలాంటి అద్వితీయుడు ఎక్కడా కనిపించడు. లోకంలో మంచి వాళ్లు వుంటారు-చెడ్డ వాళ్లు వుంటారు. కానీ, ’వెల్ రౌండెడ్ పర్సనాలిటీ’ అన్న అంశాలున్న పూర్ణత్వం కాళోజీ తప్ప మరెవరూ లేరనాలి".

          "ఇది మా అనుబంధం...దారులు వేరైనా, మా దృక్పథం, దృక్కోణం మారలేదు. కాళోజీ కూర్చున్న చోటే బాధ పడుతుంటే, నేను కీకారణ్యంలోకి పోతూ బాధ పట్తున్నాను. అంగీ చినిగినా, దేహం రక్తసిక్తమైనా, స్పిరిట్ పోని కాళోజీ ఆదర్శ ప్రాయుడు. వేదాంతి కూర్చున్న చోట ఆలోచిస్తే, శాస్త్రజ్ఞుడు పరిశోధనాశాలలో పని చేసి ఫలితాలను ఆనందిస్తాడు. ఇదే మా ఇద్దరి ’కామన్-అన్ కామన్’ క్షణాలు. ఈయనకు కొన్ని వందల సన్మానాలు జరిగాయి. ఈ సారే నేను ఎందుకు జ్ఞాపకం వచ్చానో? కేవలం మా బంధం మరోసారి విప్పి చెప్పుకునే అవకాశం కొరకేనేమో!".

మన దురదృష్టం...2001 సెప్టెంబర్‌లో తన 88 వ పుట్టిన రోజు జరుపుకున్న కాళోజీ గారు ఆ మరుసటి సంవత్సరమే, నవంబర్ 13, 2002 న మరణించారు. ఆయన మరణ వార్త విన్న పీవీ నరసింహారావు, ఆ రోజుతో తమ ఇద్దరి మధ్య కొనసాగిన 60 సంవత్సరాల అన్యోన్య స్నేహం, 70 సంవత్సరాల కాళోజీ సాహిత్య సేవ, ప్రజల వెంట వుండి చేస్తున్న కావ్య సేవ...ఇవన్నీ అంతరించి ఒక శకం పూర్తైనందుకు విషాదంగా వుందన్నారు. కాళోజీకి తెలిసిన అందరి లాగానే నేను కూడా ఆ మహానుభావుడిని చివరిసారి దర్శించుకున్నాను.


No comments:

Post a Comment