Thursday, January 9, 2014

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) రామాయణంలో ఛందః ప్రయోగాలు-అయోధ్యా కాండ -9:వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి
రామాయణంలో ఛందః ప్రయోగాలు
అయోధ్యా కాండ -9
వనం జ్వాలా నరసింహారావు

శ్రీరామ లక్ష్మణులు సీతతో గూడి అడవులకు బయల్దేరుతారు. వెంట వస్తున్న పురజనుల కంటబడకుండా వారిని ఏమరిచి ఉత్తరాభిముఖంగా ప్రయాణమై పోతారు. అలా వెళ్తూ, ఉత్తర కోసలదేశాన్ని దాటి పోతారు. మార్గమధ్యంలో కనిపించిన వేదశ్రుతి నదిని, గోమతి అనే నదిని దాటుతారు. ఆ తర్వాత గంగానది కనిపిస్తుంది. గంగను వర్ణిస్తూ "లయగ్రాహి" వృత్తంలో ఒక పద్యాన్ని రాసారు ఈ విధంగా:

లయగ్రాహి:
అంగుగ దినేశకుల పుంగవుఁ డు మోద మలరంగను గనుంగొనె నభంగతరభంగో
త్సంగను శివాంబుచయ రంగను మహాఋషినిషంగను శుభాశ్రమచ యాంగను సురీవ్యా
సంగనుత సుందరవిహంగకుల  రాజిత తరంగకజలాశయవిభంగను సరౌఘో
త్తుంగభవభీహనన చంగను నభంగురశుభాంగను దరంగముఖరంగ నలగంగన్ - 29

ఛందస్సు:      లయగ్రాహికి భ-జ-స-న-భ-జ-స-న-భ-య గణాలుంటాయి. తొమ్మిదో అక్షరం ప్రాసయతి. ఇలాంటివి పాదానికి నాలుగుండాలి.


తాత్పర్యం:     పెద్ద-పెద్ద అలలు గలదైన, స్వఛ్చమైన జలాలు గలదైన, మహర్షుల సంభంధం కలదైన, పుణ్య కార్యాలు చేయాల్సిన ఆశ్రమాలను తనతీరంలో కలదైన, స్నానం చేసే దేవతాస్త్రీలు గలదైన, పొగడదగిన అందమైన పక్షిజాతులతో ప్రకాశించే అలలుగల మడుగులను అక్కడక్కడా కలదైన, మనుష్య సమూహాల అతిశయమైన జనన-మరణాలనే భయాన్ని పోగట్టే సామర్థ్యం కలదైన, అధిక శుభాన్నిచ్చే అవయవాలు కలదైన గంగ అనే పేరున్న ప్రసిద్ధ నదిని శ్రీరాముడు సంతోషంతో చూసాడు. 

No comments:

Post a Comment