Wednesday, February 5, 2014

తిలక్ జ్ఞాపకాల నేపధ్యం:వనం జ్వాలా నరసింహారావు

తిలక్ జ్ఞాపకాల నేపధ్యం
వనం జ్వాలా నరసింహారావు

దశాబ్దంన్నర క్రితం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా శ్రీమతి కుముద్‌బెన్‌జోషి పదవిలో ఉన్న రోజుల్లో, నేను రాజ భవన్‌కు చెందిన చేతన అనే స్వచ్చంద సంస్థలో పనిచేస్తున్నప్పుడు, మొట్టమొదటి సారిగా శ్రీ కె. బి. తిలక్‌ గారితో పరిచయం కాగానే, ఆయనో 'పిచ్చి మనిషి'గా అనిపించాడు. అయితే నా భావన అప్పుడూ, ఇప్పుడూ కూడా తప్పని నేనను కోవటం లేదు. తను అనుకున్నది సాధించేటంత వరకు శ్రీ తిలక్ ఓ పిచ్చివానిలాగా వ్యవహరించడం, నాటి నుండి నేటి వరకు నేనెరుగుదుఅది 'గాంధీ' సినిమా విషయంలోనూ, రాజభవన్ ప్రాంగణంలో 'డోమ్' ఇల్లు నిర్మాణం విషయంలోనూ, సినీరంగంలో పనిచేసే కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ విషయంలోనూ, సినీనటుడు కృష్ణ రాజకీయరంగ ప్రవేశం విషయంలోనూ, ఇండో-పాక్‌ మైత్రి సంబంధమైన కార్యక్రమ నిర్వహణ విషయంలోనూ.. ఇలా... ఏ విషయంలోనైనా కార్య దక్షత ఆయన సుగుణం.

అనుపమ చలన చిత్ర దర్శక నిర్మాతగా, స్వాతంత్ర్య సమరయోధునిగా, సామాజిక సేవకుడిగా శ్రీ  తిలక్ గారు చాలామందికి సుపరిచితులే. ఆయన్ను గురించి మరింత తెలుసుకోవాలని, ఓ రోజు ఉదయం 'మార్నింగ్ వాక్'లో మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన్ను కదిలించగా బయటపడ్డ విషయాలను పాఠకులతో పంచుకోవాలన్న ఉద్దేశ్యంతో ఆయన నోటి నుండి విన్న ఆసక్తికరమైన సంఘటనల్లో కొన్ని   పాఠకుల ముందుంచుతున్నాను

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు అనే కుగ్రామంలో 'పెద్దింటివారు' అని పిలువబడే కుటుంబంలో జన్మించిన శ్రీ తిలక్ తండ్రి పేరు వెంకటాద్రిగారు. రైతు గానూ, స్వాతంత్ర్య సమరయోధుని గానూ మాత్రమే వెంకటాద్రిగారు ఆ చుట్టు ప్రక్కల గ్రామాల వారికి పరిచయం. పాఠశాల విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే స్వాతంత్ర్య సమరం ఉద్యమంవైపు ఆకర్షితుడైన శ్రీ తిలక్‌కు 1942 నాటి 'క్విట్ ఇండియా' మరింత స్పూర్తి వచ్చింది. రైలు పట్టాలను తొలగించటం, టెలిఫోన్ తీగెలను కత్తిరించటం, రైళ్లను ఆపు చేయటం లాంటి బ్రిటీషు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న శ్రీ తిలక్‌ను భీమడోల్‌లో 1942 ఆగస్టు/ సెప్టెంబర్ ప్రాంతంలో అరెస్టు చేసి ఏలూరు సబ్‌ జైలుకు పంపారు. ఆ తరువాత శిక్ష పడి, అది అనుభవించటానికి రాజమండ్రి సెంట్రల్ జైలుకు కదిలించారు ఆయన్ను.

జైలులో తన అనుభవాలను గురించి చెప్తునప్పుడు ఆయన చలించిపోయారు, దానికి కారణం ఆయన పడ్డ బాధలు కాదు, ఇతరుల బాధలు చూడలేని పరిస్థితులో తామున్నందుకు. స్వాతంత్ర్య సమరయోధునిగా తిలక్‌ను, ఆయన సహచరులను వుంచిన సెల్, "సింపుల్ ఇంప్రిజన్‌మెంట్‌ సెల్" గా వ్యవహరించగా, వెనుక వున్న మరో దానిని "కండెమ్డ్స్ ఇంప్రిజనర్స్ సెల్" గా పిలిచేవారట. ఆ సెల్‌లో వున్న వారందరూ అచిర కాలంలో వురిశిక్షకు గురి కాబోయే పరిస్థితిని తలచుకొని భోరున విలపించటం - అందునా రాత్రిళ్లు మరీ ఎక్కువగా విలపించటం తలచుకొని శ్రీ తిలక్ వాపోయారు.


శ్రీ తిలక్ జైల్లో వున్నప్పుడు ఆయనతో శిక్ష అనుభవించిన వారిలో ఇప్పటికీ గుర్తున్న వ్యక్తుల పేర్లను ఎన్నో చెప్పారాయన. గద్దె విష్ణుమూర్తి గారి విషయం చెప్తూ, ఆయన వినాయక చవితి నాడు మట్టితో గణేశ్‌ విగ్రహం తయారు చేసిన సంగతి గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఆయన స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెసు పార్టీ పక్షాన ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభ సభ్యుడు అయ్యారు.

శ్రీ తిలక్ స్వగ్రామం దెందులూరు‌. "పెద్దింటివారు" గా పిలువబడే ఆయన కుటుంబం గురించీ, తాను చిన్నతనంలో గడిపిన నాటి పరిస్థితులను గురించీ, తల్చుకొని తిలక్ బాధపడ్డారు. గ్రామ పెద్దలు కొందరు, తమ స్వలాభం కొరకు, స్వార్థం కొరకు, బ్రిటిషువారి "విభజించి-పాలించు" అనే నీతిని అమలుపర్చిన తీరు ఆయనింకా మర్చి పోలేరు. హరిజనులుగా మహాత్మా గాంధీచే పిలువబడిన, తమ గ్రామంలోని కొందరిని, మాలలుగా, మాదిగలుగా విభజించి గ్రామ పెద్దలు తమ పబ్బం ఎలా గడుపుకొందీ తిలక్ వివరించారు. దుర్భరమైన జైలు జీవితంలో మరపురాని సంఘటనలు కూడా కొన్ని వున్నాయని అన్నారు శ్రీ తిలక్. తమ మూత్రాన్ని తామే కుండల్లో పట్టుకుని, జైలర్ అనుమతి ఇచ్చినప్పుడు బయట పారబోయటం, తాము తినటానికి జైలులో పెట్టేది తిన దగ్గ వస్తువుగా ఏమాత్రం అనిపించుకోని విషయం, ప్రక్క నున్న సెల్లో వారి ఆక్రందనాలు.. దుర్భరమైన సంఘటనలుగా పేర్కొన్నారు ఆయన. అయితే, తనతోపాటు జైలులో వున్న తన గ్రామానికి చెందిన హరిజనులు, తాను "పెద్దింటివారి" అబ్బాయిని అయినందున మర్యాదగా, గౌరవంగా వారు త్రాగే బీడీలను జైలువార్డెన్‌కు అమ్మి, ఆ డబ్బుతో తనకు రొట్టెలు (తిన తగినవి) తెప్పించిన విషయం చెప్పినప్పుడు శ్రీ తిలక్ కళ్లు చెమ్మగిల్లాయి. కాకపోతే, తానూ అందరి లాగానే కష్టాలు అనుభవిస్తానని, తనకి ప్రత్యేక మర్యాద వద్దనీ వారికి చెప్పానని అన్నారాయన. తాను జైల్లో వున్నప్పుడు తన తండ్రిగారి ఆస్తిని దెందులూరులో జప్తు చేయించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం ఆ రోజుల్లో.

రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలయిన తర్వాత, జేబులో చిల్లిగవ్వ కూడా లేని తిలక్‌ గారు, కాలినడకన తన స్వగ్రామమైన దెందులూరు వెళ్లారు. ఆ తర్వాత "ఉషా మెహతా" స్వతంత్ర రేడియో ఉద్యమంలో పాల్గొని పేపర్ డిస్ట్రిబ్యూషన్ బోయ్‌గా స్వాతంత్ర్య ఉద్యమ స్పూర్తిని ప్రచారం చేసారు శ్రీ తిలక్. ముదిగొండ జగ్గన్న శాస్త్రిగారి ప్రోద్భలంతో, సహకారంతో, ప్రజా నాట్య మండలి వైపు ఆకర్షితుడైన శ్రీ తిలక్ అతివాద పంథా కళాకారుల ఉద్యమాలతో చేతులు కలిపారు. నాటకాలు వేయడం వేయించడంతో పాటు, డప్పులు మ్రోగించుతూ ప్రజా నాట్య మండలి విప్లవ గీతాలని ఆలపించుతూ గ్రామ గ్రామాన తిరిగేవారు. "పెద్దింటివాళ్ళము... తప్ప త్రాగి వచ్చి డప్పు కొట్తున్నాము... తప్పుకోండి... తప్పుకోండి" అంటూ తమ బృందం ఆ రోజుల్లో కొంటెగా ఆలపించిన జానపధాన్ని గుర్తుచేసుకుని... ఆ రోజుల్లో ప్రజల స్పందనను మననం చేసుకున్నారాయన.

మాజీ మంత్రి కీర్తిశేషులు పరకాల శేషావతారంతో పనిచేస్తూ ఆనాటి యూత్ లీగ్ కార్యకలాపాల్లో తాను, తన సహచరులు ఏ విధంగా చురుకుగా పాల్గొన్నదీ వివరించారాయన. ఇదంతా ఒక ఎత్తైతే.. ఇక అక్కడి నుండి బొంబాయి (నేటి ముంబాయి) కి, సినీ పరిశ్రమలో చేరేందుకు దారితీసిన పరిస్థితులను కూడా ఆయన నెమరువేసుకున్నారు.

విశ్వ విఖ్యాత చలన చిత్ర దర్శక, నిర్మాత స్వర్గీయ శ్రీ ఎల్.వి.ప్రసాద్‌గారికి శ్రీ తిలక్ స్వయానా మేనల్లుడు. ఆయన ఆ రోజుల్లో బొంబాయిలో వుంటుండే వారు. తిలక్‌గారి మేనత్త ఒకావిడ, ఈయన్ను వెంటేసుకుని బొంబాయికి ప్రయాణం కట్టింది. దారిలో విజయవాడ (నాటి బెజవాడ) లో రైలు మారవలసి వుంది. ఏలూరు నుండి విజయవాడ చేరుకోగానే, బొంబాయికి వెళ్లాల్సిన రైలు బయలుదేరటానికి ఇంకా కొంత ఆలస్యమున్నందున, అ కాస్త సమయం ఎందుకు వృధా చేయాలన్న ధ్యాస తిలక్‌లోని అతివాద మనస్తత్వానికి కలిగింది. వెంటనే అత్తకు చెప్పా-పెట్టకుండా, మొగల్రాజపురంలో వుంటున్న స్వర్గీయ కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావుగారి ఇంటికి పరుగెత్తారు శ్రీ తిలక్. గడ్డం గీసుకుంటున్న ఆయనతో కాసేపు కబుర్లు చెప్పి, అయన వద్ద నుండి బొంబాయిలోని స్వర్గీయ శ్రీపాద అమృతడాంగె గారికి తిలక్‌ను పరిచయం చేస్తూ వ్రాసిన ఓ ఉత్తరాన్ని సంపాదించుకున్నారు తిలక్. వెంటనే రాజేశ్వరరావుగారి వద్ద శెలవు తీసుకుని రైలు కదిలే సమయానికి స్టేషన్‌కు చేరుకుని, తాను రైలెక్కిన సంగతి తన మేనత్తకు తెలియకుండానే బొంబాయి చేరుకున్నారాయన. బొంబాయి రైలు స్టేషన్లో తిరిగి కలుసుకున్నారు వారిరువురూ.

బొంబాయి సినీ పరిశ్రమలో  అడుగిడిన  శ్రీ తిలక్‌లోని స్వతంత్ర సమరాభిలాష అక్కడా కొనసాగింది. ఆ నగరంలోని నాటి "పీపుల్స్ థియేటర్" లో చేరి, ప్రముఖులు బల్‌ రాజ్‌ సహానీ, రమేష్ తాపర్‌లతో సాన్నిహిత్యం సంపాదించుకున్నారప్పట్లో.


ఓ రెండేళ్ల్లు బొంబాయిలో గడిపిన అనంతరం (1943-1945) మద్రాసు (నేటి చెన్నై) కు "గృహ ప్రవేశం" అనే చలనచిత్రానికి దర్శకత్వం వహించేందుకు బయలు దేరిన ఎల్.వి.ప్రసాద్ గారితో అక్కడికి చేరుకున్నారు శ్రీ తిలక్ 1945 ప్రాంతంలో. (ఇంకా వుంది)

No comments:

Post a Comment