Wednesday, August 19, 2015

డాక్టర్ రొనాల్డ్ రాస్ – జ్ఞాపకాలు : వనం జ్వాలా నరసింహారావు

డాక్టర్ రొనాల్డ్ రాస్ – జ్ఞాపకాలు
వనం జ్వాలా నరసింహారావు
మన తెలంగాణ (20-08-2015)

సికిందరాబాద్ రాణీ గంజ్ లోంచి బేగంపేట విమానాశ్రయం వరకూ పోయే రహదారిని రొనాల్డ్ రాస్ రోడ్డు అనేవారు. ఐతే అది అన్ని రోడ్ల లాంటిది మాత్రం కాదు. దానికి అందరూ తెలుసుకోవాల్సిన చరిత్ర కొంత వుంది. ఆ రోడ్డులోని పెద్ద ఆవరణలో వున్న (వుండే) భవనంలో, ప్రపంచ ప్రసిద్ధి కన్న ఒక శాస్త్రజ్ఞుడు నివసించేవాడని, ఆయన అక్కడే చేసిన పరిశోధనకు గుర్తింపుగా, ఫిజియాలజీ-వైద్య శాస్తాలలో నోబెల్ బహుమానం వచ్చిందని, బహుశా చాలా మందికి తెలిసుండదు. ఆ శాస్త్రజ్ఞుడు పేరు మీద "సర్ రొనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్" అని హైదరాబాద్ నగరంలోని ఫీవర్ దవాఖానాను పిలుస్తున్నారు.

వివరాల్లోకి పోతే, ఆ ఆవరణలోని భవనంలో నివసించిన వ్యక్తి పేరు సర్ రొనాల్డ్ రాస్. పంతొమ్మిదవ శతాబ్దపు కడపటి దశాబ్దంలో, వైద్యాధికారిగా పనిచేస్తుండే రాస్, అదే భవనంలో చిరకాలం పరిశోధనలు చేసి, ఆగస్టు 20, 1897 న మలేరియాకు కారణ భూతమైన దోమ విషాన్ని కనిపెట్టాడు. అంటే ఇప్పటికి సుమారు 130 సంవత్సరాల క్రితం అన్న మాట. దోమలతో మలేరియా కారకమైన అంటువ్యాధి క్రిములు ఎలా వృద్ధి చెందుతూ ఉంటాయో, అవి ఏ విధంగా దోమలలో చేరుకుని, ఎట్లా మనుషులకు సంక్రమిస్తాయో శోధించి తెలుసుకున్నాడు రొనాల్డ్ రాస్. రాస్ ఈ పరిశోధనా ఫలితాలను 1895-1897 మధ్య కాలంలో సాధించాడు. అంత చిన్న దోమ కడుపులో, మానవాళిని ధ్వంసం చేయగల శక్తి ఎంత ఘాటుగా ఇమిడి వుందో రాస్ తేల్చి చెప్పాడు. ఆయన పరిశోధనా ఫలితాలు ఆ తరువాతి కాలంలో వైద్య-ఔషధ పరిశోధకులకు అవసరమైన విజ్ఞానాన్ని ప్రసాదించాయి. వాటి మూలాన ప్రపంచమంతా మలేరియా నిర్మూలన కార్యక్రమాలు సులభమయ్యాయి. మలేరియా భూతం మనిషి చేజిక్కింది.


రాస్ జన్మతః భారతీయుడనవచ్చేమో! ఆయన తండ్రి భారత్ దేశంలో సైనికోద్యోగిగా పనిచేసేవాడు. నాటి ఉత్తర ప్రదేశ్-నేటి ఉత్తరా ఖండ్ లోని అల్మోరాలో పుట్టిన రాస్, 1857 లో వైద్య విద్యనభ్యసించాడు. భారత వైద్యాధికార వ్యవస్థలో చేరాడు. ఆ రూపేణా సికిందరాబాద్‌కు రావడం జరిగింది. 1899 లో భారతదేశం నుంచి ఇంగ్లాండుకు వెళ్లేంతవరకూ ఇండియన్ మెడికల్ సర్వీస్‌లో వుద్యోగం చేశాడు. 42 సంవత్సరాల వయస్సులో బ్రిటన్‌లోని లివర్పూల్‍లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్‌లో చేరి, ఉష్ణ మండల వ్యాధులపై పరిశోధనలు జరిపాడు. రాస్ పరిశోధనలకు 1902 లో ప్రతిష్టాత్మక నొబెల్ పురస్కారం లభించింది. 1911 లో "సర్" బిరుదు అందుకున్నాడు. సెప్టెంబర్ 1932 లో, లండన్‌లో ఆయన చనిపోయారు. రాస్ కు వైద్యంతో పాటు అనేక ఇతర విషయాలపై ఆసక్తి తో పాటు, వాటిని ఆయన తన కాలక్షేపానికి కూడా ఉపయోగించుకునేవాడు. ఆయన అభిమాన కాలక్షేపం గణిత శాస్త్రం. దానికి సంబంధించిన అనేక విషయాలపై వివిధ పత్రికలలో వ్యాసాలు రాస్తుండేవారు. మంచి నవలా రచయిత కూడా. చక్కటి కథలు రాసేవాడు. సంగీతం అంటే చెవికోసుకునేవాడట. స్వయంగా సంగీత శాస్త్రవేత్త. ఇవన్నీ కాకుండా, షార్ట్ హాండ్ రాతలో నూతన పద్దతులను కూడా రాస్ కనిపెట్టాడు. బహుశా ఉపయోగకరమైన పరిపాలకుడుగా తయారు కావాలంటే, అదనంగా-తోడుగా, ఏదో ఒక కళాబిజ్ఞత, ఒక రసికానందం ఉండాలనుకున్నాడే మో రాస్. ఇవి లేని వాడు ఒక ఎండు కట్టె అవుతాడు కదా!

ఇక ఇప్పుడు మిగిలింది రాస్ స్మృతి చిహ్నంగా మిగిలిన ఒక రోడ్డు, పెంకుటిల్లు లాంటి ఆయన నివసించిన గృహం. ఆ పెంకుటిల్లు సుమారు 12000 చదరపు అడుగుల విస్తీర్ణం వున్న స్థలంలో ఇప్పటికీ కనిపిస్తుంది. 1986 లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ గా శ్రీమతి కుముద్ బెన్ జోషి వున్న రోజుల్లో, నిర్మానుష్య-నిశ్శబ్ద భవనం వున్న ఆ ప్రదేశం, భారత రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ కంట బడింది. నేను ఆ రోజుల్లో గవర్నర్ అధ్యక్షతన పనిచేస్తుండే ఒక గ్రామీణాభివృద్ధి సంస్థకు పాలనాధికారిగా పనిచేస్తుండేవాడిని. రాష్ట్ర శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న డాక్టర్ ఎ. పి. రంగారావు, గవర్నర్ కార్యదర్శిగా పనిచేస్తున్న డాక్టర్ వి. చంద్రమౌళి ఆ భవనం కథ యావత్తు సేకరించి, రాష్ట్ర శాఖ అధ్యక్షురాలైన గవర్నర్ కుముద్ బెన్ జోషికి తెలియచేశారు. ఇంకేముంది... అ భవనాన్ని రాస్ స్మృతి కార్యాచరణకు కేంద్రంగా ఉపయోగించుకోవడానికి ఏర్పాట్లు జరిగాయి. భారత ప్రభుత్వం శాసనం ద్వారా గుర్తించిన ఏకైక సేవా సంస్థ రెడ్ క్రాస్ సొసైటీ చేతుల్లోకి భవనం పోవడం కన్న కావాల్సిందేమిటి?

ఐతే అంతకు ముందు కూడా కొంత కథ నడిచింది. వివరాల్లోకి పోతే....రాస్ స్మృతిని ప్రచారంలోకి తేవడానికి డాక్టర్ గోపాల రావు, ఆచార్య ఎస్. ఎన్. సింగ్ అనే ఇద్దరు పెద్ద మనుషులు, రొనాల్డ్ రాస్ సొసైటీ పేరుతో ఒక సంస్థను స్థాపించారు కొన్నేళ్ల కిందట. ఆ సంస్థ ప్రధానోద్దేశం రాస్ పరిశోధనలను, ముఖ్యంగా మలేరియాకు కారణ భూతమైన దోమ విషాన్ని కనిపెట్టడాన్ని ప్రచారంలోకి తేవడమే. దాని కొరకు ఆ సంస్థను వ్యవస్థీకరించాలనుకున్నారు వారు. కాకపోతే దానికి నిధులు కావాలి. అప్పటి వరకు, ఆ భవనం ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఆధీనంలో వుండేది. దానిలో ఎయిర్ కండిషనింగ్ లాంటివి కూడా చేశారు వాళ్ళు. అంతకు ముందు, 1935 లో సికిందరాబాద్ కంటోన్మెంట్ అధికారులు రాస్ స్మృతిని సంక్షిప్తంగా వివరిస్తూ ఒక శిలాఫలకాన్ని భవనం గోడలో అమర్చారు. సొసైటీ వారు ధనాభావం మూలాన, ఉస్మానియా విశ్వవిద్యాలయం జంతుశాస్త్ర విభాగం నుంచి కొంత మేరకు సాయం పొంది చేతనైనంత పనిచేయగలిగారు. కాపలాదారుడిని కూడా పెట్టారు. అతడప్పటివరకు రాస్ స్మృతి చిహ్నానికి కాపలా కాస్తూ కాలక్షేపం చేశాడు.

ఒక విధంగా మూతపడిన ఆ భవనం ఆగస్టు 15, 1986 స్వాతంత్ర్య దినాన రెడ్ క్రాస్ వారి ఆధీనంలోకి పోయింది. భవనానికి కావాల్సిన అత్యవసర మరమ్మతులు కూడా చేయించారు. స్టేట్ బాంక్ సహాయంతో మాజీ సైనికులకు రెడ్ క్రాస్ రక్షక సంస్థ ఏర్పాటు జరిగింది. అదనంగా సెంట్ జాన్స్ అంబులెన్స్ సేవలు, ప్రాధమిక చికిత్సా కేంద్రం, రవాణా రాకపోకల శిక్షణా సంస్థ, ఉష్ణ మండల వైద్య పరిశోధనకు ఏర్పాట్లు జరిగిపోయాయి. అక్కడే జాతీయ ఆరోగ్య కార్యక్రమాల ప్రచార సంస్థను, వైద్య సహాయక శిక్షణాలయాన్ని ఏర్పాటు చేసే ఆలోచన కూడా జరిగింది. మలేరియా పరిశోధనా కేంద్రాన్ని కూడా స్థాపించాలని, ఒక మ్యూజియం పెంపొందించాలనీ ఆలోచనలు జరిగాయి. కార్యరూపం దాల్చలేదు. కొంతకాలం పాటు తలపెట్టిన కార్యక్రమాలన్నీ సజావుగానే సాగాయి. క్రమేపీ మరుగున పడిపోయాయి. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు. రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యదర్శిని అడుగుతే ప్రస్తుతం ఏం జరగడం లేదన్న సమాధానం వచ్చింది.


విచారించగా తెలిసిన విషయం...ఆ భవనం ప్రస్తుతానికి ఉస్మానియా విశ్వ విద్యాలయం జంతు శాస్త్ర విభాగం వారి ఆధీనంలో వుందని, భవనానికి ఒక కాపలాదారుడిని వారే నియమించారని, అడపదడప ఏవో కార్యక్రమాలు అక్కడ చేపడుతుంటారని అర్థమైంది. మలేరియాకు కారణ భూతమైన దోమ విషాన్ని కనిపెట్టిన ఆగస్టు 20 న ప్రతి ఏటా ఒక సెమినార్ లాంటిది వారే నిర్వహిస్తుంటారని కూడా తెలుస్తోంది.End

No comments:

Post a Comment