Saturday, August 22, 2015

వ్యయం లేని సాయం ... కావాలి వ్యవసాయం : వనం జ్వాలా నరసింహారావు

వ్యయం లేని సాయం ... కావాలి వ్యవసాయం
వనం జ్వాలా నరసింహారావు
వ్యయం లేని వ్యవసాయం కావాలి
నమస్తే తెలంగాణ దినపత్రిక (23-08-2015)
భారత దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో, వ్యవసాయానికి వేల సంవత్సరాల చరిత్ర వుంది. అనునిత్యం అభివృద్ధి చెందుతున్న సాంకేతిక ప్రగతికి, విస్తరిస్తున్న ప్రపంచ మార్కెట్లకు, ప్రతిస్పందనగా, గత శతాబ్ది కాలంగా వ్యవసాయం గణనీయమైన మార్పులకు-చేర్పులకు గురవుతోంది. మానవ-సహజ వనరుల స్థానంలో యంత్రాలు, సింథటిక్ ఎరువులు, క్రిమిసంహారక మందులు చోటుచేసుకుంటున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం కారణాన పంట దిగుబడులు పెరిగినప్పటికీ, వాతావరణ సమతుల్యం దెబ్బ తినడం, ఆరోగ్యానికి హానికరమైన పరిస్థితులు నెలకొనడం కూడా జరిగింది.
తెలంగాణ రాష్ట్రం గుండా రెండు ప్రధానమైన జీవ నదులు-కృష్ణా, గోదావరి-ప్రవహిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదలకు అవసరమైన ప్రధాన ప్రాజెక్టులు వీటి మీద నిర్మించాల్సిందే. ఈ నదులే కాకుండా, తుంగభద్ర, భీమా, దిండి, కిన్నెరసాని, మంజీరా, మానేరు, పెన్ గంగ, ప్రాణహిత, పెద్ద వాగు, తాలిపేరు లాంటి మరికొన్ని చిన్నా-పెద్దా నదులు కూడా తెలంగాణలో పారుతున్నాయి. రాష్ట్రంలో వాతావరణం సమశీతోష్ణ స్థితి అనవచ్చు. మార్చ్ నెలలో మొదలయ్యే వేసవి, మే నెలలో తీవ్రంగా వుంటుంది. నైరుతీ రుతుపవనాల కారణంగా జూన్ నెలలో వర్షాలు కురవడం మొదలై సెప్టెంబర్ వరకూ కొనసాగుతాయి. ఈ వర్షాలకు తోడు తుఫాన్ల మూలంగా కూడా వానలు పడుతుంటాయి. రాష్ట్రంలో రకరకాల పంటలకు అనుకూలంగా వుండే భూములున్నాయి. ఇక ముఖ్యమైన పంట వరి. రెండో ప్రధాన పంట జొన్నలు. కందులు కూడా పండుతాయి. ప్రాజెక్టులు, నదులు, కాలువలు ఉన్న ప్రాంతాలలో వరి అధికంగా పండుతుంది. ఇవి కాక పెసర పంట, మొక్కజొన్న, నూనెగింజల ఉత్పత్తి, చెరుకు ఉత్పత్తి, మిరప పంట, పత్తి ఉత్పత్తి, పొగాకు, ఉల్లి సాగు కూడా రాష్ట్రంలో విస్తారంగా వుంది.
వ్యవసాయం మీద క్రమేపీ శ్రద్ధ తగ్గుతుండడంతో ఆ రంగం సంక్షోభం దిశగా పోతోంది. సేద్యానికి, దానికి అనుబంధంగా వుండే అనేక పనులను చేయడానికి కావాల్సిన వ్యక్తుల కొరత రోజు-రోజుకూ పెరిగిపోతోంది. వ్యవసాయ కూలీలు జీవనోపాధికి ఇతర ప్రాంతాలకు వలసపోవడం వల్ల, వ్యవసాయేతర పనులపై ఎక్కువ ఆసక్తి కనబరచడం వల్ల సంక్షోభం మరింత తీవ్రతరమైందనవచ్చు. సాంకేతికంగా అభివృద్ధి గణనీయంగా జరుగుతుండడం వల్ల, యువత మొత్తం అధిక ఆదాయం లభించే ప్రభుత్వ-ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు చూసుకుంటున్నారు. వీరంతా వ్యవసాయం లాభసాటి కాదనే అభిప్రాయంలో పడిపోయారు. మహబూబ్‌నగర్, కరీంనగర్, నల్గొండ లాంటి జిల్లాల నుంచి పలువురు ఉపాధి కొరకు మధ్య ఆసియా దేశాలకు వెళ్తున్నారు. అలా వెళ్లగా మిగిలిన కొందరు మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు. మిగిలిన అన్ని రంగాలకంటే వ్యవసాయం ముందుంటుందని గ్రామీణ యువతకు నచ్చ చెప్పాల్సిన అవసరం వుంది. సేద్యానికి కావాల్సిన కొన్ని పనులను (ఉదాహరణకు వరి నాట్లు వేయడం) నైపుణ్యంతో చేసే కొందరు క్రమేపీ ఆ పనులనుంచి తప్పుకుంటే, రాబోయే తరాలలో వారి స్థానంలో వ్యక్తులు దొరకడం కూడా కష్టం కావచ్చు.
ఈ నేపధ్యంలో సంక్షోభంలో కూరుకుపోతున్న వ్యవసాయ రంగానికి పూర్వ వైభవం తేవాలని, ఈ ప్రక్రియలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయం, వ్యవసాయ శాఖ ఉమ్మడిగా కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. 70 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నారని, వ్యవసాయంతోనే గ్రామీణ జీవితం ముడిపడి వుందని, పట్టణాల అవసరాలు కూడా వ్యవసాయం ద్వారానే తీరాలని ముఖ్యమంత్రి అన్నారు. ఇంత గొప్ప పాత్ర ఉన్న వ్యవసాయ రంగం అనుకున్న రీతిగా అభివృద్ది చెందడం లేదని, వ్యవసాయ శాఖ అటు రైతులను బాగుపరచడంతో పాటు రాష్ట్రం ఆహార ఉత్పత్తుల విషయంలో స్వయం సమృద్ధి సాధించే విధంగా సరైన ప్రణాళికతో ముందుకు పోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. వ్యవసాయంలో పనిచేయడానికి ప్రస్తుతం మనుషుల కొరత ఉందని, భవిష్యత్తులో ఇది మరింత ఎక్కువ అవుతుందని సిఎం అన్నారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయంలో యాంత్రీకరణ, ఆధునీకరణ అవసరంపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి అన్నారు. సూక్ష్మ సేద్యం పై కూడా అవగాహన పెంచాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులపై కొత్తగా నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మాణం జరుగబోతున్నందున అదనంగా సాగు నీరు అందుబాటులోకి రాబోతోంది. తెలంగాణలో రెండు పంటలు పండే కాలం వస్తుంది...ఇది రైతులకు మరింత లాభం చేకూరుస్తుంది. లభించబోయే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. సంప్రదాయ వ్యవసాయమే కాకుండా మార్కెట్ అవసరాలకు తగిన విధంగా వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు రావాలి.


హైదరాబాద్ నగరం త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న ప్రపంచ దేశాల్లో ఒకటి. హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో సుమారు ఒక కోటి నలబై లక్షల జనాభా నివసిస్తున్నారు. ఏటేటా జనాభా పెరగడం కాకుండా, తాత్కాలికంగా అనునిత్యం వచ్చి-పోయే వారి సంఖ్య కూడా లక్షల్లో వుంటుంది. నగరానికి పెద్ద మొత్తంలో అవసరమైన కూరగాయలలో కేవలం పది శాతం మాత్రమే పక్కనున్న మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల నుంచి సరఫరా అవుతున్నాయి. మిగిలిన తొంబై శాతం ఇతర రాష్ట్రాల నుండి రావాల్సిందే. నగర ప్రజల అవసరాలకు సరిపడా కూరగాయలను పక్కనున్న జిల్లాలలోని నగర సమీప గ్రామాలలో పండించేందుకు, కూరగాయల సాగుకు రైతులను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి అంటున్నారు. ఈ గ్రామాలన్నింటా కూరగాయల సాగుకు అనువైన భూములున్నాయి. పండించిన కూరగాయలను నగరానికి చేర్చి అమ్ముకోవడానికి రవాణా సౌకర్యాలు పుష్కలంగా వున్నాయి. కూరగాయల ఉత్పత్తి గణనీయంగా పెరిగేట్లు చేయడానికి, జయశంకర్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయం, ఒక కార్యాచరణ పథకాన్ని రూపొందించాలని, హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రం మొత్తం కూరగాయల అవసరం ఎంత వుందో అంచనాలు వేసి, దానికి అనుగుణంగానే ఉత్పత్తి జరగడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
ముఖ్యమంత్రి సూచించినట్లు, వ్యవసాయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కార్యకలాపాలు బాగా పెరగాలి. మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో, అన్ని నేలలపై యూనివర్సిటీకి సంపూర్ణ సమాచారం, అవగాహన ఉండాలి. అప్పుడే ఎక్కడ ఏ పంట వేయాలి? ఎక్కడ ఎలాంటి వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహించాలి? అనే విషయంపై అంచనాలు రూపొందించడం సాధ్యమవుతుంది. వివిధ రకాల ఆహార ఉత్పత్తుల విషయంలో శాస్త్రీయమైన అంచనా రూపొందించుకుని, దానికి అనుగుణంగా వ్యవసాయం చేసి, తెలంగాణ రాష్ట్రం ఆహార ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతులు చేసే స్థితికి ఎదగాలి. తెలంగాణలో వ్యవసాయానికి అనుకూలమైన వాతావరణం, వైవిధ్యం కలిగిన నేలలు, మంచి వర్షపాతం ఉన్నాయి. వీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చవచ్చు. తెలంగాణలో వివిధ రకాల స్వభావాలున్న నేలలు ఉన్నాయని, వీటిని క్రాప్‌ కాలనీలుగా మార్చి విత్తనోత్పత్తిని ప్రోత్సహించాలని సిఎం అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే విత్తనోత్పత్తికి అత్యంత అనువైన ప్రాంతమైన తెలంగాణ రాష్ట్రాన్ని సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా మార్చే కార్యక్రమంలో రైతులందరు భాగస్వాములు కావాలి. ఈ దిశగా, ఏ ప్రాంతంలో, ఏ నేలలో, ఏ రకం పంట వేయాలో అధికారులు నిర్ణయించి రైతులకు చెప్పాలని, సాగు పద్దతులపై కూడా ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వాలని సిఎం కోరారు.
ముఖ్యమంత్రి చెప్పినట్లు గతంలో వ్యవసాయ యూనివర్సిటీకి ఎంతో ప్రాముఖ్యత ఉండేది. రైతులు యూనివర్సిటీకి క్యూ కట్టి మరీ విత్తనాలు తీసుకుపోయేవారు. రైతులకు, వ్యవసాయ శాఖ అధికారులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై గతంలో మాదిరిగానే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. రైతులు, యూనివర్సిటీల మధ్య మళ్లీ సమన్వయం చోటు చేసుకోవాలి. యూనివర్సిటీలలో పరిశోధనలు పెరగాలి. ప్రొఫెసర్లు, విద్యార్థులు అన్ని జిల్లాల్లో పర్యటించి పరిశోధనలు చేయాలి. తెలంగాణ వ్యాప్తంగా సాయిల్‌ టెస్టింగ్‌ జరిపి దానికి అనుగుణంగా ఎక్కడ ఏ పంటలు వేయాలో రైతులకు యూనివర్సిటీ సూచించాలి. వ్యవసాయ శాఖలో పూర్తిగా నిలిచిపోయిన విస్తరణ కార్యక్రమాలు తిరిగి పునరుద్ధరించబడాలి. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు వ్యవసాయ విస్తరణ అధికారులను కూడా మండల స్థాయిలో నియమించుకోవాలని సీఎం చెప్పారు. వ్యవసాయ శాఖలో అవసరమైన మేరకు ఆగ్రానమిస్టులను కూడా నియమించుకోవాలని ఆయన సూచించారు. ఒక్కో ప్రదేశంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, భూసారం పరిగణలోకి తీసుకుని, ఫలానా పంట వేస్తే దిగుబడి బాగుంటుందని రైతులకు నచ్చ చెప్పాలి. ఉదాహరణకు, "ఇమాం పసందు" అనే మామిడి పంటకు తెలంగాణ రాష్ట్రం ప్రసిద్ధి. అవి తెలంగాణలో తప్ప మరెక్కడా పండవు. ఇది అవకాశంగా తీసుకుని, ఆ పంటపై గుత్తాధిపత్యం రాష్ట్రానికే వుండే విధంగా వ్యూహం పన్నాలి. 
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న లాటరైట్‌ నేలలు పండ్ల తోటల పెంపకానికి ఎంతో దోహదపడతాయి. రైతులను చైతన్య పరిచి పండ్ల తోటలు పెంచాలని సిఎం సూచించారు. నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌ రైతుల తరహాలో సరైన మార్కెటింగ్‌ వ్యూహం ఉంటే రైతులు లాభం పొందుతారన్నారు సిఎం. ఏ పంట ఎక్కడ పండించాలి అనే విషయం ఎంత ముఖ్యమో పండిన పంటను ఎక్కడ మార్కెట్‌ చేయాలి, అనేది కూడా గుర్తించడం ముఖ్యం. మార్క్ ఫెడ్‌ను కూడా ఇంకా బాగా వినియోగించు కోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. రైతులు కేవలం పంటలు పండించి అమ్ముకోవడమే కాకుండా, ఆ ఉత్పత్తులకు మరింత బాగా మార్కెట్‌ చేసుకునేందుకు అవసరమైన వాల్యూ అడిషన్‌ పద్దతులు కూడా నేర్పాలని అధికారులను కోరారు. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాల ఉత్పత్తి కూడా పెరగాలని, తెలంగాణ రాష్ట్రానికి అవసరమయ్యే పాలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, ఆ పరిస్థితి మారాలని ఆయన చెప్పారు.

మొత్తంగా తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన విధానాన్ని రూపొందించాలని, ప్రతి గ్రామంలో రైతులతో వ్యవసాయ శాఖ ప్రత్యక్ష అనుబంధం కలిగి వుండాలని, ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతూ తెలంగాణలో వ్యవసాయానికి పూర్వ వైభవం తీసుకురావాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ దిశగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, వ్యవసాయ శాఖ, చేతిలో చేయి వేసి, ఉమ్మడిగా పకడ్బందీ వ్యూహ రచన చేసి, ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా పనిచేయాలి. అప్పుడే వ్యయం లేని సాయం అవుతుంది వ్యవసాయం! End

No comments:

Post a Comment