Saturday, September 17, 2016

అన్యాయానికి సజీవ సాక్ష్యం నాగార్జునసాగర్ : వనం జ్వాలా నరసింహారావు

అన్యాయానికి సజీవ సాక్ష్యం నాగార్జునసాగర్
వనం జ్వాలా నరసింహారావు
నమస్తేతెలంగాణ దినపత్రిక (18-09-2016)

          సరిగ్గా ఐదు దశాబ్దాల క్రితం ఆగస్టు 3, 1966 న ప్రప్రధమంగా నాగార్జున సాగర్ డ్యామ్ ద్వారా రైతులకు వ్యవసాయానికి ఉపయోగపడే సాగు నీటిని విడుదల చేయడం జరిగింది. నందికొండగా మొదట్లో వెలుగులోకొచ్చిన ఈ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా నది మీద నిర్మించారు. యావత్ ప్రపంచంలో రాతి-ఇటుక-ఇతర భవన నిర్మాణ సామగ్రితో కట్టబడిన అతి పెద్ద ఆనకట్టగా, భారీ బహులార్థ సాథక నదీ లోయ ప్రాజెక్టుగా దీనికి పేరుంది.

            ఈ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దులకు ఆనుకుని, కృష్ణా నదిపై ఒక భారీ ఆనకట్టతో సహా, రెండు ప్రధాన కాలువలను నదికి ఇరువైపులా నిర్మించటం జరిగింది. వీటినే నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువగా, నాగార్జున సాగర్ ఎడమ ప్రధాన కాలువలుగా పిలుస్తున్నారు. కుడి కాలువ ద్వారా పారే నీటితో ఆంధ్రప్రదేశ్ కు చెందిన గుంటూరు, ప్రకాశం జిల్లాలలో రమారమి 4.75 లక్షల హెక్టారులు (11.74 లక్షల ఎకరాలు), ఎడమ కాలువ ద్వారా తెలంగాణ జిల్లాలైన నల్గొండ, ఖమ్మం ప్రాంతాలకు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన కృష్ణా జిల్లాల లోని కొన్ని ప్రాంతాలకు చెందిన రమారమి 4.20 లక్షల హెక్టారులు (10.40 లక్షల ఎకరాలు) సాగులోకి తేవాలన్నది ప్రణాళిక. తెలంగాణకు సంబంధించినంతవరకు ప్రాజెక్టు ప్రణాళిక ప్రకారం నల్గొండ జిల్లాలో 3.73 లక్షల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 2.29 లక్షల ఎకరాలు సాగులోకి తేవాలి. కాకపోతే, గత ఏబై సంవత్సరాల రికార్డులను, గణాంకాలను నిశితంగా పరిశీలించి చూస్తే, రెండు జిల్లాలలో కలిపిఆరు లక్షల ఎకరాలు సాగుబడిలోకి రావాల్సి వుండగా, కేవలం 3.5 లక్షల ఎకరాలకు మాత్రమే సాగు నీరు లభ్యమైంది.

            నందికొండ ఆనకట్టను మాచర్ల వద్ద కృష్ణా నదిపై నిర్మించాలన్న నిర్ణయం ప్రధమ పంచవర్ష ప్రణాళికలో రూపుదిద్దుకున్న ఆలోచన. ఫిబ్రవరి 24, 1955న కొత్త ఢిల్లీలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో తదనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ సమావేశంలో ప్రణాళికా సంఘం సభ్యులతో సహా, ఆంధ్ర, హైదరాబాద్ ప్రభుత్వాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. నాటి ఆంధ్ర గవర్నర్ త్రివేది, హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామ కృష్ణారావుల సమక్షంలో నిర్ణయించటం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే.

నిజాం పాలకుల మీద తెలంగాణ ప్రాంతానికి ఏమీ చేయలేదనీ, వారు నిరంకుశులనీ, నేటి తరానికి కావాల్సిన పనులేవీ చేయలేదనీ, అపవాదుంది. అది అర్థరహితమని చెప్పడానికి, నిజాం మెహబూబ్ అలీఖాన్, ఆయన తరువాత పాలకుడిగా వున్న మీర్ ఉస్మాన్ అలీఖాన్ చేపట్టిన అనేక జలవనరుల-ఇతర ప్రణాళికలను ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. కాకతీయ రాజులు చేపట్టిన అనేక మంచిపనులను వారి హయాంలో కూడా కొనసాగించారు. నిజాం దగ్గర ప్రధానిగా పనిచేసిన సాలార్జంగ్ సంస్కరణలు చాలావరకు నేటికీ అజరామరంగా వున్నాయి. వాటి ప్రేరకులు కూడా నిజాంలే కదా! మహబూబ్ అలీ పాషాను దాన ధర్మాలు చేయడంలో "ఎముకలేని రాజు" అని అనేవారు. ఆయన హిందూ ముస్లింలను సమానంగా చూసుకునేవారనడానికి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి విరాళం ఇవ్వమని ఆయనను కోరినప్పుడు తనకు హిందూ ముస్లింలు సమానమే అని అంటూ వారికివ్వడంతో పాటు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి కూడా విరాళం ఇచ్చాడట.

వరదలకు మూలమైన కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలొ రిజర్వాయర్ల నిర్మాణానికి నిజాం పాలకుల హయాంలోనే కృషి జరిగింది. హాలియా, మూసీ, పాలేరు, వైరా రిజర్వాయర్లు ఆ విధంగా రూపుదిద్దుకున్నవే. అలానే చారిత్రక ఆధారాలను పరిశీలించినట్లయితే, నాటి నిజాముల ఆలోచనా ధోరణికి అనుగుణంగానే నందికొండ డ్యామ్ తొలుత రూపుదిద్దుకున్నది. అక్కడున్న నంది’, ‘కొండఅనే రెండు గ్రామాలు రిజర్వాయరు ద్వారా ముంపుకు కాబోతుండడమే "నందికొండ" గా నామకరణం చేయడానికి కారణం. అలనాటి ఆ ఆలోచనే భవిష్యత్ లో నాగార్జున సాగర్ ప్రాజెక్టుగా అవతరించడానికి దోహదపడింది. ఒక నాటి హైదరాబాద్ నిజాం హయాంలో 1903 సంవత్సరంలోనే బ్రిటిష్ ఇంజనీర్లను నియమించి తెలంగాణ సాగునీటి అవసరాలకు రిజర్వాయర్ల నిర్మాణపు ఆలోచన కూడా జరిగింది. అయితే అవసరాల మేరకు నిధులు సమకూరక పోవటం వల్ల పనులు ముందుకు సాగలేదు. అప్పట్లోనే నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ ఆనాటి ఛీఫ్ ఇంజనీర్ గా హైదరాబాద్ నిజామ్ హయాంలో పగ్గాలు చేపట్టి ముఖ్యమైన సాగునీటి పనులను సమీక్షించటంతో పాటుగా, బిల్డింగులు, బ్రిడ్జిల నిర్మాణాలను, హైదరాబాదు రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. వీటిలో ఉస్మాన్ సాగర్, నిజామ్ సాగర్, హిమాయత్ సాగర్, నిజామాబాద్ జిల్లాలోని అలీ సాగర్ రిజర్వాయర్ ప్రధానంగా పేర్కొనాలి. అలాగే హైదరాబాద్ రాష్ట్రంలో నందికొండ ప్రాజెక్టు గురించిన తొలి సర్వే ఆయన ద్వారా నిర్వహించటం కూడా జరిగింది. అప్పట్లోనే నాటి మద్రాస్ ప్రభుత్వం, నాటి హైదరాబాద్ ప్రభుత్వాల మధ్య కృష్ణా నదీ జలాల పంపకాల విషయంలో, నందికొండ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో, నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఒప్పందం కూడా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జన్మదినం జులై 11వ తీదీని "తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవంగా" జరుపుకుంటున్నది.


                కృష్ణా నది రాయలసీమ ప్రాంతంలోని కర్నూల్ దగ్గర తుంగభద్రతో కలిసి తెలంగాణలో ప్రవేశిస్తుంది. అక్కడనుండి బయలుదేరిన కృష్ణా నదికి దక్షిణాన వరదల తాకిడి తగిలే అవకాశం లేదు. ఉత్తరాన అవకాశాలున్నందు వల్ల వాటిని అధిగమించేందుకు ప్రణాళికలు తయారు చేయాల్సిందిగా ఇంజనీర్లను నాటి నిజాం కోరడం జరిగింది. కృష్ణా నదిని, అందులోని వరదను అంచనావేసి, శ్రీశైలం, నందికొండ రిజర్వాయర్లకు ప్రణాలికలను నిజాం ప్రభుత్వమే తయారు చేయించింది. నందికొండ అనే స్థలంలో నిర్మించాలని నిజాం నియమించిన ఇంజనీర్లు సూచించారు. అయితే నేటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అప్పట్లో మద్రాస్ రాష్ట్రంలో ఉమ్మడిగా వున్నందువల్ల ఆ ప్రభుత్వంతో రిజర్వాయర్ల నిర్మాణానికి అనుమతి లభించలేదు. వాస్తవానికి, ప్రకాశం బారేజీ నిర్మాణ నేపధ్యంలో, నిజాం ప్రతిపాదించిన  నందికొండ ప్రాజెక్టు ప్రస్తావన వచ్చినప్పుడు, ఆనాటి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొందరు "నందికొండ"ను "పందికొండ"గా వ్యాఖ్యానించారని, ప్రముఖ రాజనీతి శాస్త్ర ఆచార్యుడు, అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ మాజీ రిగిస్ట్రార్, ఎనిమిది పదుల వయసున్న ప్రొఎసర్ డాక్టర్ మారంరాజు సత్యనారాయణరావు అలనాటి విషయాలను గుర్తు చేసుకుంటూ అన్నారు. ఆనాటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కాని, నాయకులకు కానీ, కృష్ణా జలాల వినియోగ సాధ్యాసాధ్యాలు తెలియవు. నిజాం రాష్ట్ర అధికారులు నందికొండ ప్రాజెక్టుకు సర్వే చేయడానికి ప్రయత్నిస్తుండగా అసలు నందికొండ ఎక్కడున్నదని కూడా వారు ప్రశ్నించారని అంటారు మారంరాజు గారు. దరిమిలా అప్పటి ఆంధ్ర ప్రభుత్వం మేల్కొని ఈ ప్రాజెక్టు ఉభయ రాష్ట్రాలకూ ఉపయోగపడేదిగా నిర్మించే ప్రతిపాదనలను ముందుకు తీసుకు రావటం జరిగింది.

       ఆ తరువాత రోజుల్లో, కృష్ణా జలాల సమగ్ర, సమర్ధవంతమైన వినియోగానికి సంబంధించిన ప్రతిపాదనలను రూపొందించాల్సిందిగా ప్రణాళికా సంఘం ఖోస్లా కమిటీని ఏర్పాటు చేసి కోరడం జరిగింది. ఖోస్లా కమిటీ ఆ ప్రాంతాలను పరిశీలించి, ప్రాజెక్టును నిర్మించడానికి అనువైన-అనుకూల ప్రాంతాన్ని గుర్తించింది. ఖోస్లా కమిటి నివేదికలను ప్రణాళికా సంఘం 1952 డిసెంబర్ మాసంలో ఆమోదించటం జరిగింది. నందికొండ డ్యామ్ ను కృష్ణా నదిపై నిర్మించాలనీ, నదికి ఇరువైపులా కాలువల నిర్మాణం జరగాలనీ నిర్ణయం తీసుకోవడం జరిగింది…281 టియంసిల నీటిని ఈ ప్రాజెక్టుకు కేటాయించింది.

          ఈ దరిమిలా 1954 సంవత్సరంలో ప్రాజెక్టు నిర్మాణం గురించి ప్రకటన విడుదల అయింది. డిసెంబరు 10, 1955న జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా శంఖుస్థాపన చేయటం జరిగింది. అక్కడ నిర్మాణ పనులకు వచ్చిన ఒకానొక వృద్ధ కార్మికుడి చేతుల మీదుగా తొలి మట్టి బుట్టను నెహ్రూ తీసుకుని పనులకు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాటి భారత ప్రధాని నెహ్రూ ‘‘ భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగటానికి ఇది తొలి మెట్టు అనీ, ఆధునిక దేవాలయాల నిర్మాణ క్రమంలో ఇది ఆరంభం" అని పేర్కొన్నారు. శంఖుస్థాపన జరిగిన తరువాత ఒక కొత్త వాదన లేవదీయడం జరిగింది. రిజర్వాయర్ ప్రతిపాదించిన స్థలంలో చారిత్రక కట్టడాలున్న నాగార్జునకొండ మునిగిపోతున్నదని, ప్రత్యామ్నాయంగా వేరే స్థలం చూడాలనీ దాని సారాంశం. ఆ విధంగా నందికొండ పేరు మారి నాగార్జునసాగర్ అయింది. ఇది డాక్టర్ కే ఎల్ రావుగారి ఆలోచన....అంగీకరించింది నెహ్రూ గారు! అలానే ప్రాజెక్టు స్థలాన్ని మార్చడం వల్ల తూర్పు కాలువలకు మాత్రమే తూముల ద్వారా నీళ్లు వెళ్లే సదుపాయం కలిగింది. తెలంగాణ వైపున్న ఎడమకాలువకు తూముల్లేవు. నీటి ప్రవాహం పెరిగాక, భూగర్భ టన్నెల్ ద్వారా మాత్రమే నీరు లభ్యమౌతుంది.  

            525 అడుగుల ఎత్తున నందికొండ ప్రాజెక్టు నిర్మాణం 1956 న ప్రారంభం కాగా పూర్తి అయ్యింది మాత్రం 1969లో. గేట్ల ఏర్పాటు, స్పిల్ వే ఏర్పాటు 1974 నాటికి పూర్తి చేయటం జరిగింది. నీటిని ఎడమ కాల్వ ద్వారా నల్గొండ, ఖమ్మం జిల్లాలకే పరిమితం చేయాల్సి వుండగా, తమ ప్రాంతానికి లాభం జరిగేందుకు ఆనాటి ఆంధ్రా ఇంజనీర్లు, నాయకులు కలిసి, కోదాడ దగ్గరనుంచి ఎడమ కాలువ నీళ్లను కృష్ణా జిల్లాకు మరలించారు. న్యాయంగా తెలంగాణ ప్రాంతాలకు చేరాల్సిన నీరు ఆంధ్రా ప్రాంతాలకు తరలించటం జరిగింది ఆ విధంగా. 


            ఇరువైపులా ఏర్పాటు చేయాల్సిన హెడ్ రెగ్యులేటర్ల విషయంలో కూడా అన్యాయం జరిగింది. కుడి కాలువ వైపు ఎక్కువ సామర్ధ్యంతో వెలువడే విధంగా ఎడమ వైపు తక్కువ సామర్ధ్యంతో నీరు విడుదలయ్యే విధంగా ఏర్పాటు చేయటం జరిగింది. పాలేరు రిజర్వాయరు వద్ద కూడా 17 అడుగుల లోపలికి కాలువ స్థాయిని తగ్గించి నీరు కృష్ణా జిల్లాలకు తరలించడం జరిగింది. ఎడమ కాలువ కేవలం తెలంగాణ అవసరాల మాత్రమే వుంటే బాగుండేది. సాగర్ కుడి-ఎడమ కాలువల మీద లిఫ్టులున్నాయి. కుడి కాలవ మీద వున్న లిఫ్టులను పూర్తి స్థాయిలో ప్రభుత్వమే నిర్వహించి కరెంటు బిల్లులను కూడా చెల్లించేది ఉమ్మడి రాష్ట్రంలో. చాలా కాలం వరకు ఎడమ కాలువల మీద వుండే లిఫ్టులకు మాత్రం తెలంగాణ రైతాంగం మీద వేసే వివక్ష కొనసాగేది. ఇవన్నీ తెలిసి జరిగిన వివక్షలు....తెలియకుండా ఇంకెన్నో? End

No comments:

Post a Comment