పిబరే రామరసం!
వనం జ్వాలా
నరసింహారావు
నమస్తే తెలంగాణ (31-01-2017)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు, భద్రాచల దేవాలయ నిర్మాణానికి
కారకుడు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామ వాస్తవ్యుడు, ఒకనాటి కంచర్ల గోపన్న నామధేయుడు, భక్త రామదాసుగా
ఆబాలగోపాలానికి చిరపరిచితుడైన మహనీయుడి జయంతిని పురస్కరించుకుని, కేవలం జయంతి ఉత్సవాలు
మాత్రమే ప్రభుత్వ పరంగా జరిపించి సరిపుచ్చుకోకుండా, ఆయన పేరుమీద అత్యంత వేగంగా నిర్మించిన "భక్తరామదాసు
నీటిపారుదల ప్రాజెక్టు" కు పాలేరు దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల
చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ప్రారంభించడం...జాతికి అంకితం చేయడం, యావత్ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఖమ్మం జిల్లా
వాసులకు గర్వకారణం అనాలి.
భక్త రామదాసుగా ప్రసిద్ధికెక్కిన కంచర్ల గోపన్న పుట్టిన నేలకొండపల్లి గ్రామం ఖమ్మం పట్టణానికి 23 కిలోమీటర్ల దూరంలో ఖమ్మం
కోదాడ రహదారిపై ఉంటుంది. తండ్రి లింగన మంత్రి, తల్లి కామాంబ. ఆత్రేయస గోత్రీకులు.....ఆరువేల నియోగి బ్రాహ్మణులు. బార్య కమల, కుమారుడు రఘురాముడు. నేలకొండపల్లిలోని
వేణుగోపాలస్వామి వారి వరప్రసాదంగా పుట్టారని భావించిన తల్లిదండ్రులు, గోపన్నగా నామకరణం చేశారు. నేటికి ఆ వూళ్లో వేణుగోపాలస్వామి దేవాలయం వైభవంగా భక్తులను
ఆకర్షిస్తూనే వుంది. రామదాసు జన్మతిధి గురించి కొన్ని భిన్నవాదనలు ప్రచారంలో
ఉన్నవి. అనేక చారిత్రక పరిశోధకుల అధ్యయనాల ఆధారంగా రామదాసు 1620లో జన్మించి వుండవచ్చని కొందరంటుంటే, మరికొందరు 1633 లో జన్మించారని నమ్ముతారు.
ఏదేమైనా ఆయన జన్మ తిథి మాఘశుద్ధ తదియ...జన్మనక్షత్రం పూర్వాభాధ్ర అని నిర్థారణ
జరిగింది. ఈ ఏడాది ఇది జనవరి 31 న వచ్చింది. ఇదే విధంగా ఆయన ఆరాధనోత్సవాలు వైశాఖ
మాసం మొదట్లో, అంటే, సాధారణంగా ఏప్రిల్ నెలలో జరుపుకుంటారు.
జగమెరిగిన పాత్రికేయులు స్వర్గీయ జీ కృష్ణ రాసిన "ప్రముఖ
వాగ్గేయకారులు" పుస్తకంలో భక్త రామదాసు గురించి అనేక విషయాలు తెలుస్తాయి.
కంచర్ల గోపన్న కుత్బ్ షాహీల కాలంలో, తాసీల్దారుగా, భద్రాచలం సమీపంలోని పాల్వంచలో పనిచేసేవాడు. రామ
భక్తుడైనందున వైష్ణవ మతాన్ని స్వీకరించాడు. నేలకొండపల్లి సమీపంలో నాయకులగూడెం అనే
వూళ్లో రఘునాధ భట్టరు అనే వైష్ణవ స్వామి గోపన్నను వైష్ణవ మతంలో చేర్చాడు. అన్నమయ్య
కూడా ఇలానే స్వీకరించాడని అంటారు. వైష్ణవ మతం స్వీకరించిన నాటి నుంచి ఆయన పేరు
రామదాసుగా మారింది. ప్రభుత్వంలో కొలువు చేస్తూనే, తరచూ భద్రాచలం వెళ్తుండేవాడు. ఆవేశం కొద్దీ కీర్తనలు తానే
రాసి పాడేవాడు. ఆయన తదనంతరం కొందరు పండితుల పుణ్యామా అని ఆయన కీర్తనలు
ఏర్చి-కూర్చి కొన్ని సంకలనం చేయడం జరిగింది. రామదాసు గోల్కొండ మంత్రులైన
అక్కన్న-మాదన్నలకు మేనల్లుడు. రాముడి మీద వున్న భక్తితో ప్రభుత్వ ధనంతో గుడి
కట్టించారనీ, దానికి కోపగించిన అబుల్ హసన్ తానీషా ఆయనను జైలులో పెట్టించారనీ, స్వయంగా శ్రీరాముడే వచ్చి
తానీషాకు కనిపించి రామదాసును విడుదల చేయించాడనీ అంటారు. దానికి తగిని ఆధారాలు కూడా
వున్నాయి కాబట్టి నమ్మాలి.
భక్త రామదాసుకు సంస్కృతం, తెలుగు...రెండింటిలోనూ పాండిత్యం వుంది. రెండు భాషల్లోనూ కవిత్వం రాశారు.
వీటిని శతక ప్రక్రియకు చెందిన "దాశరధి శతకం", నిబంధ పద రచనకు చెందిన
"తెలుగు సంస్కృత కీర్తనలు", వృత్త పదానికి చెందిన "పాహిరామ ప్రభో" అనే దీర్ఘ వృత్తం, అనిబంధ కవిత్వానికి చెందిన ఒక "సంస్కృత చూర్ణిక"
శీర్షికలతో నాలుగు భాగాలుగా విభజించవచ్చని దాశరథుల బాలయ్య గారు రాసిన ఎంఫిల్
సిద్ధాంత వ్యాసంలో పేర్కొనడం జరిగింది. బహుళ ప్రచారం పొందిన 103 పద్యాల దాశరధి
శతకంలో మకుటం "దాశరధీ కరుణాపయోనిధీ". ఇక "పాహిరామ ప్రభో"
వృత్త పదం "పాహిరామ ప్రభో పాహిరామ ప్రభో...పాహి భద్రాద్రి వైదేహి
రామప్రభో!" అంటూ ప్రారంభమై, "పాహిశ్రీరామ నీ పాద పద్మాశ్రయుడ....పాలింపుమా భద్రశైల రామప్రభో!" అంటూ
ముగుస్తుంది. కీర్తనలలో "అదిగో భద్రాద్రీ గౌతమి", అబ్బబ్బ దెబ్బలకు తాళ
లేరా", "ఇక్ష్వాకు వంశ తిలక ఇకనైన పలుకవె", "ఏ తీరుగ నను దయ జూచెదవో", "తక్కువేమి మనకు", "నను బ్రోవమని చెప్పవే", "పలుకే బంగారమాయెనా", "రామాచంద్రులు నాపై చలము
చేసినారు-సీతమ్మ! చెప్పవమ్మా" లాంటివి అందరూ పాడుకునే అపురూప కీర్తనలు.
ఇదంతా గతం....ఇక వర్తమానానికి వస్తే....భక్త రామదాసును మరువలేని ఆయన పుట్టిన
గ్రామస్తులు సుమారు 55 సంవత్సరాల క్రితం (1955-1961) నేలకొండపల్లిలో, రామదాసు నివసించిన స్థలంలో
ఆనాటి గ్రామ సర్పంచ్ స్వర్గీయ పెండ్యాల సత్యనారాయణ రావు నేతృత్వం లో భక్తరామదాసు ధ్యాన మందిరం
నిర్మించారు. రామదాసు వాడిన బావికుడా నేటికి ఆ స్థలంలోనే వుంది. అయితే, కారణాలు ఏవైనా, ఆ మందిరం చాలా కాలం ఖాళీగా
వుండిపోయి, సామాజిక అవసరాలకు ఊపయోగించారు. దరిమిలా, పెండ్యాల సత్యనారాయణ రావు మరికొందరు గ్రామస్తులు కలిసి రామదాసు స్మారక కమిటిని
ఏపాటు చేసి, 1974 సంవత్సరం నుంచి భక్తరామదాసు స్మారక
ఉత్సవాలను జరిపించ సాగారు. నాల్గవ వార్షికోత్సవం లో, అంటే 1977 వ సంవత్సరంలో, శ్రీ సీతారామ చంద్ర లక్ష్మణ స్వామి వారి శిలా విగ్రహాలను, రామదాసు శిలా విగ్రహాన్ని ప్రతిష్టించారు. ధూప-దీప నైవేద్యాది కైంకర్యాలు
కూడా ఏర్పాటు చేశారు. తొమ్మిదేళ్ల తరువాత 1986 లో స్వర్గీయ భీకంసింగ్, స్వర్గీయ రావులపాటి రంగారావు, స్వర్గీయ గండికోట శేషభూషణ రావు, స్వర్గీయ గండికోట
రాజేశ్వరరావు, పెండ్యాల రాంమోహన్ రావు, మరికొందరు భక్తులు కలిసి "శ్రీ భక్త రామదాసు విద్వత్ కళాపీఠం" అనే
సంస్థను స్థాపించి, ఆరాదనోత్స్తవాలను, చేయడం ప్రారంభించారు. అదే సంస్థ ఈ నాటికీ మాఘశుద్ధ తదియ రోజున రామదాసు జయంతిని, వైశాఖ మాసం ప్రారంభంలో
ఆరాధనోత్సవాలను నిర్వహిస్తున్నారు. అప్పుడప్పుడూ కొన్ని ఆద్యాత్మిక కార్యక్రమాలను కూడా
నిర్వహిస్తున్నారు.
2000 సంవత్సరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రోత్సాహంతో, నాటి ఖమ్మం జిల్లా కలెక్టర్
ఎ గిరిదర్, పోలీసు సూపరిండెంట్ పి సీతారామాంజనేయులు చొరవతో ద్యాన మందిరం ఆధునీకరించబడి, ప్రఖ్యాత సంగీత విద్యాంసులు
స్వర్గీయ బాలమురలీకృష్ణ చేతులమీదుగా పునః ప్రారంబించబడింది. 2007 సంవత్సరంలో భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి
దేవస్తానం దీన్ని దత్తత తీసుకొని నిర్వహిస్తున్నారు. ఒక అర్చకుని నియమించి జీతం, పడితరాన్ని ఇస్తూ నిత్య పూజలు, దూప, దీప, నైవేద్యాది కైంకర్యాలు
జరిగేటట్లు చూస్తున్నారు. శ్రీరామనవమి, దసరా, ధనుర్మాస ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్నారు. కాకపోతే ఇవన్నీ జరగాల్సిన మోతాదులో జరగడం లేదని
గ్రామస్తులంటున్నారు. ఏదో మొక్కుబడిగా జరుగుతున్నాయని వారి అభిప్రాయంగా అర్థమవుతోంది.
చేయాల్సిన పనులెన్నో వున్నాయని, నేలకొండపల్లి లోని భక్త రామదాసు ద్యాన మందిరాన్ని
ఆకర్షనీయంగా తీర్చిదిద్దాలని, భక్తులను, పర్యాటకులను అక్కడికి వచ్చేట్లుగా చేయాలని, మందిరాన్ని పూర్తి స్థాయి దేవాలయంగా అభివృద్ధి చేయాలని
గ్రామస్తులు కోరుతున్నారు. లోగడ ఒకసారి రామాలయ నిర్మాణానికి ప్రయత్నం కూడా జరిగింది. ఈ విషయాన్ని కూలంకుషంగా
పరిశీలన జరిపి పెద్దలు, పండితులు సలహా మేరకు తగు నిర్ణయం తీసుకోవాలంటున్నారు. సంగీత, సాహిత్య, భక్తి కార్యక్రమాల నిర్వహణకు
అనుగుణంగా ఉండే అధునాతన సౌకర్యాలతో కూడిన సమావేశమందిరాన్ని నిర్మించాలనీ, అతిధులు, భక్తులు, కళాకారుల సౌకర్యం కోసం
కొన్ని విశ్రాంతి గదులను నిర్మించాలని, ఒక చక్కని పార్కుని అభివృద్ధి చేసి, దీనిలో రామాయణ కథలకు, రామదాసు జీవిత విశేషాలకు
సంబందించిన విగ్రహాలను ఏర్పాటు చేయాలని, ప్రముఖ చిత్రకారులతో రామదాసు జీవిత విశేషాలను, కొన్ని కీర్తనలకు అనుగుణంగా
వుండే చిత్రాలను వేయించి ఒక ప్రదర్శనశాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందనీ గ్రామస్తుల
అభిప్రాయం. రామదాసు కీర్తనలను, దాశరథి శతక పద్యాలనూ శిలఫలకాలపై చెక్కించి సమావేశ మందిరపు గోడలకు అతికింప
చేస్తే బాగుంటుంది కూడా. వివిధ గ్రంథాలయాలలో నిక్షిప్తమై వున్న రామదాసు సాహిత్యాన్ని, గ్రంథాలను వ్యాసాలను
సేకరించి ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఆ గ్రంథాలయం పాఠకులకు
పరిశోధకులకు ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం చేస్తున్నట్లే, ప్రతి సంవత్సరం మాఘశుద్ద తధియ రోజు నుండి మూడు రోజులు రామదాసు జయంతి ఉత్సవాలు, వైశాఖ మాస ప్రారంభంలో మూడు
రోజుల రామదాసు ఆరాధనోత్సవాలు, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్సవాలుగా నిర్వహించాలి. తద్వారా రామదాసు గారికి తగిన
నివాళి అర్పించినట్లు అవుతుంది.
రామదాసు కీర్తనలను భజన మండపంలో పాడేవారిని గుర్తించి వారిని ప్రోత్సహించాలి. సంగీత విద్వాంసులు, సంగీతాభిమానులతో కొన్ని
బృందాలు ఏర్పాటు చేసి అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాలు, గ్రామాలలో రామదాసు కీర్తనలను ప్రచారం చేయాలి. దేవాలయాల్లో, సాంప్రదాయ ఉత్సవాలలో రామదాసు కీర్తనలని అలపించేట్లుగా
చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఏ విధంగానైతే అన్నమయ్యకు విశేష ప్రాధాన్యాన్ని
కలిగిస్తున్నారో, ఏ విధంగా నైతే తమిళ ప్రజలు సంగీత విద్యాంసుడు త్యాగరాజుకు బ్రహ్మ రథం
పడుతున్నారో, అలాగే తెలంగాణ ప్రజలు రామదాసుకు తగిన గుర్తింపు ఇస్తే గ్రామస్తులు ప్రధానంగా
సంతోషిస్తారు. నేలకొండపల్లి లోని శ్రీ భక్త రామదాస ద్యాన మందిరాన్ని, బౌద్ధ స్థూపాన్ని కలిపి ఒక
మంచి పర్యాటక స్థలంగా, ఆద్యాత్మిక కేంద్రంగా తీర్చి దిద్దుతే మరీ మంచిది.
ధ్యాన మందిరాన్ని ఒక నెల క్రితం దర్శించి, గ్రామస్తుల ఆలోచనలను అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వ
సలహాదారు పాపారావు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, ఈ సంవత్సరం రామదాసు జయంతి
ఉత్సవాలను మూడు రోజులపాటు అధికారికంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. తెలంగాణ
రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, భద్రాచలం దేవస్థానం, శ్రీ భక్త రామదాసు విద్వత్ కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో
జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఖర్చుతో చేయించిన భక్త రామదాసు శిలా విగ్రహ
ప్రతిష్ట కూడా జరుగురుంది. రామదాసు నవరత్న కీర్తనల గోష్టి గానం, సంగీత విభావరి, భజనలు, కోలాటాలు, పేరిణి నృత్య రూపకం లాంటి
పలు కార్యక్రమాలు జరుగుతాయి. అచిరకాలంలోనే గ్రామస్తులు కోరుకుంటున్న స్థాయిలో
రామదాసు ధ్యాన మందిరం రూపుదిద్దుకుంటుందని ఆశించవచ్చు. End