Sunday, January 22, 2017

హిందూ సంప్రదాయంలో బారసాల : వనం జ్వాలా నరసింహారావు

హిందూ సంప్రదాయంలో బారసాల
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక (22-01-2017)

బారసాలని అసలు "బాల సారె" అంటారు. అది వాడుకలోకి వచ్చే సరికి "బారసాల" అయింది. అసలు బారసాల అంటే పేరు పెట్టడం లేదా నామకరణం చేయటం అని అర్థం. ఈ వేడుకను పుట్టిన పాపాయికి (బాబు అయితే బాబుకు) పేరు పెట్టటానికి చేస్తారు. వాడుకలో వున్న పద్ధతి ప్రకారం, పుట్టిన 21వ రోజు నుండి 27 వ రోజు లోపల చేస్తారు. ఈ రోజులలో 21, 23, 25, 27 రోజులలో చాలా మంది చేస్తారు. అలానే బేసి సంఖ్యలు వచ్చే ఏ రోజైనా మంచిరోజు చూసుకొని చేసుకోవచ్చు. నెలలోపల చేసుకునే వీలు లేకపోతే, మూడో నెల వచ్చిన తర్వాత చేసుకుంటారు. పూజ చేయించేందుకు తగిన బ్రాహ్మణుడిని వెతుకుతారు. బ్రాహ్మణుడి సూచన మేరకు కావాల్సిన వస్తువులను సేకరిస్తారు. బారసాల-నామకరణం-సత్యనారాయణ వ్రతానికి కావలసిన వస్తువులు: పసుపు, కుంకుమ, తమలపాకులు, పోకచెక్కలు, ఖర్జూరపు పండ్లు, అగరు వత్తులు, హారతి కర్పూరం, అరటి పండ్లు, పూలు, కొబ్బరికాయలు-ఇవి పగులగొట్టే సౌకర్యం, ఎండు కొబ్బరి చిప్పలు, కొత్త తుండు గుడ్డ, కొత్త రవికె గుడ్డ, తేనె, పెరుగు, పాలు, నెయ్యి, పంచదారల మిశ్రమమైన పంచామృతం, సత్యనారాయణ స్వామి ఫొటో, తగు మోతాదులో కేసరి ప్రసాదం, బియ్యపు రవ్వ-అందులో కలిపేందుకు పంచదార, వేలకులు, జీడి పప్పు, కిస్‌మిస్ పండ్లు, దీపారాధనకు కావాల్సిన (దూది, నూనె, అగ్గిపెట్టె) సామాగ్రి, కొబ్బరి కాయనుంచే వీలున్న వెండి-రాగి-సిల్వర్ పాత్ర (చెంబు), పావలా బిళ్లలు (సెంట్లు), రెండు-మూడు కిలోల బియ్యం.

          తెలుగు వారి ప్రత్యేకత-ఆ మాటకొస్తే భారతీయులందరి ప్రత్యేకత, వారి పేరులోనే వుంటుందనాలి. అదేంటోగాని, చాలామంది విషయంలో, తెలుగు వారి-భారతీయుల పేర్లు, వారి పేరును పట్టి, కొత్తగా పరిచయమైన వారు, సర్వసాధారణంగా ఒక అవగాహనకు వచ్చే విధంగా వుంటాయి. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఆ పేరును వారు పుట్టిన 21 వ రోజున, తల్లి పక్కనుండగా, బంధు-మిత్రుల సమక్షంలో, శాస్త్రోక్తంగా జరుపుకునే ఒక వేడుకలో, తండ్రి పెడ్తాడు. పేరును ఆనవాయితీగా ఆచరిస్తున్న పద్ధతుల ప్రకారం, బారసాల జరుపుకొని, "నామకరణం" ప్రక్రియ పూర్తిచేయని తెలుగు వారు గానీ, భారతీయులు గానీ వుండరు. అదో ఆచారం-వేడుక-సరదా-సామాజిక కలయిక. పేరు వ్యక్తులను గుర్తించేందుకు ఉపయోగించే ఒక నామ వాచకము. వ్యక్తులను ప్రత్యేకంగా గుర్తించడానికి లేదా వారి పూర్వీకుల గురించి తెలుసుకోవటానికి పేరుతో పాటు ఇంటి పేరు కూడా ఉంటుంది.

          బారసాల నాడు పెట్టిన పేరే ఆ మనిషి పేరులా చెలామణి అవుతుంది. తమ పేర్లు రాసుకునేటప్పుడైనా, చెప్పేటప్పుడైనా భారతీయులందరూ ఒకేవిధంగా వ్యవహరించరు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన  సంప్రదాయాన్ని పాటిస్తారు. బారసాల నాడు పెట్టిన పేరు మొదట, ఇంటి పేరు తరువాత వచ్చేలా కొన్ని ప్రాంతాల వారు, ఇంటి పేరు మొదట, తరువాత బారసాల నాడు పెట్టిన పేరు వచ్చేలా మరికొన్ని ప్రాంతాల వారు పాటిస్తారు. సాధారణంగా ఏ ప్రాంతం వారికైనా ఇంటి పేరు తరతరాలుగా మారకుండా వుండి, వారి యొక్క వంశ నామంగా వుంటుంది. తెలుగు వారు సంప్రదాయం ప్రకారం బారసాల నాడు పెట్టిన పేరు ముందర ఇంటి పేరు తగిలించకుండా తమ పేరు చెప్పుకోరు. ఈ మధ్య కాలంలో తెలుగు వారి ఇంటి పేరు సంప్రదాయం, క్రమ క్రమంగా మార్పుకు యువతరం నాంది పలుకుతుంది అనుకోవచ్చు. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న తెలుగు వారు, "ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా..." అన్న నా నుడిని పేరు చెప్పుకునే విషయంలో కొంచెం సడలించి, "బి ఎ రోమన్ వైల్ ఇన్ రోమ్" సంప్రదాయాన్ని పాటించడం నేర్చుకున్నారు. అమెరికా దరఖాస్తు పత్రాలలో  ఫస్ట్ నేమ్ అని, మిడిల్ నేమ్ అని, లాస్ట్ నేమ్ అని, పుంఖాను పుంఖంగా ప్రశ్నలు ఉంటాయి. ఒక్కోసారి సర్ నేమ్ ఏమిటని మరో ప్రశ్న వేస్తారు. ఈ బాధలు తప్పించుకోవడానికి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న తెలుగు వారందరు కూడా వారి పద్ధతినే అనుకరిస్తున్నారు. తప్పదు కదా మరి !. దేశ-కాల మాన పరిస్థితులను బట్టి మారడం మంచిదే కదా !


       మంత్రోచ్ఛారణల మధ్య, పురోహితుడుగా-పూజారిగా బారసాల-నామకరణం జరిపించడానికొచ్చిన బ్రాహ్మణుడు మొదట విఘ్నేశ్వరుడి పూజ చేయిస్తాడు. విఘ్నేశ్వరుడి పూజకంటే ముందు, పురుడు అయిపోయిన వెంటనే, శాస్త్రం ప్రకారం జీర్ణ యజ్ఞోపవీతాన్ని తీసివేసి-దాని స్థానంలో నూతన యజ్ఞోపవీతాన్ని పాపాయి తండ్రితో ధరింప చేసే కార్యక్రమాన్ని జరిపించాలి. తరువాత పుణ్యాహవాచనం (శుద్ధి) కార్యక్రమం వుంటుంది. తరువాత నామకరణం చేయించుతారు. పేరు అనేది ఎవరైనా జన్మ నక్షత్రం ఆధారంగా పెట్తారు. అయితే, అదనంగా, వ్యవహారిక నామంగా, తమకు ఇష్టమైన పేరు పెడతారు. కాని నక్షత్రం ప్రకారం పెడితేనే మంచిది. ఏ నక్షత్రానికి ఏ అక్షరాలు అనేవి శాస్త్రంలో చెప్పబడే వున్నాయి.

          పాపైనా-బాబైనా, పిల్లలకు పెట్టవలసిన పేర్లకు సంబంధించిన నియమాలను గృహ్య సూత్రాలు పేర్కొన్నాయి. పరాశర గృహ్య సూత్రాల ప్రకారం పేరు రెండు లేక నాలుగు అక్షరాల పొడవుండి హ్రస్వ అచ్చుతో కూడిన హల్లుతో మొదలై చివర్లో దీర్ఘం కానీ విసర్గం కానీ ఉండాలి. వేర్వేరు గృహ్య సూత్రాల్లో ఈ నియమాలు వేర్వేరుగా ఉన్నాయి. పేరు పెట్టడానికి నాలుగు పద్ధతులున్నాయి. మొదటిది: జన్మ నక్షత్రాన్ని బట్టి; రెండోది: పుట్టిన నెల/రాశ్యధిపతిని బట్టి; మూడోది: ఇలవేల్పుని బట్టి; నాలుగోది అందరూ పిలిచే పేరును బట్టి. చివరి పద్ధతి కుటుంబ సంప్రదాయాన్ని బట్టి, విద్యా స్థాయిని బట్టి ఉంటుంది. వెండి పళ్ళెంలో పోసిన బియ్యంపై తండ్రితో పేరు రాయించుతాడు బ్రాహ్మణుడు. నామకరణం తంతు ముగిసిన తర్వాత, కటి సూత్ర ధారణ అంటే మొలతాడు కట్టే కార్యక్రమం కూడా జరిపించాలి. పసుపు రంగు పులిమిన దారంతో తయారుచేసిన మొలతాడును పాపాయి మొలకు, బామ్మ గారితో కట్టించాలి. బంగారపు వుంగరాన్ని తేనెలో ముంచి, మొదలు తండ్రితో, తర్వాత తల్లితో, ఆ తర్వాత అమ్మమ్మ-బామ్మ-తాతయ్యలతో-ఇతర పెద్దలతో, పాపాయి నోట్లో వుంచే కార్యక్రమాన్ని కూడా జరిపించాలి.

          సాధారణంగా ఫలానా వారికి ఫలానా ఇంటి పేరుండడానికి ఏదో ఒక నేపధ్యం వుంటుందంటారు. వుండాలని లేదు కూడా. ఇంటి పేరు గ్రామనామమో, ఏదో ఒక శరీర అవయవమో, జంతువుల పేరో, పక్షుల పేరో, పూల పేరో, తిను పదార్థాల పేరో, వస్తువుల పేరో, వేదాల పేరో, వృత్తుల పేరో, ప్రకృతి సంబంధమైన పేరో, వృక్షాల పేరో, నదుల పేరో, ఇలాంటి మరింకేదో వుంటుంది. లోగడ కొందరు మాత్రమే ఇంటి పేరుగా వాడుకునే కులాలను, ఇటీవల కాలంలో "ఒక హక్కు" లాగా పలువురు ఉపయోగించుకుంటున్నారు. ఎవరెన్ని చెప్పినా, కుల-గోత్ర-నామాలు, ఎందరు ఒప్పుకున్నా-ఒప్పుకోక పోయినా మన సంస్కృతీ సంప్రదాయంలో చెరిపినా చెరగని అంతర్భాగాలు. తర-తరాల కుటుంబ నేపధ్యం, భావి తరాల వారికి తెలియచేయడానికి, మన గురించి మనం అర్థం చేసుకోవడానికి, ఈ కుల-గోత్ర-నామాలు వాడుకుంటే తప్పులేదు కాని, ఆ పేరుతో కులతత్వం-మతతత్వం-ప్రాంతీయ తత్వం, లేదా, మన సంస్కృతి గొప్ప-ఇతరుల సంస్కృతి తక్కువ అనే భావాలను రెచ్చగొడితే అంతకంటే ఘోరమైన పాపం మరింకోటి లేదు.

ఇంటి పేరుకు ఒకరకమైన నేపధ్యముంటే, వ్యవహారిక నామానికి కూడా మరో రకమైన నేపధ్యముంటుంది. ఒక తరంలో ఒక వ్యక్తికున్న పేరు, వారి మనుమల-మనుమరాళ్ల తరం వచ్చేసరికి ఎవరికో ఒకరికి పెట్టుకోవడం ఆనవాయితీ. తాతగారి పేరు మనుమడికి, అమ్మమ్మ-బామ్మ గార్ల పేర్లు మనుమరాళ్లకు కొన్నేళ్ళ క్రితం వరకు యథాతధంగా పెట్టుకునేవారు. ఇప్పటికీ ఆ ఆచారం కొనసాగుతున్నా, కొంచెం ఆధునీకరించి పెట్టుకుంటున్నారు. దీని మూలాలు మన గోత్రాల్లో-ఋషుల్లో వున్నాయంటారు.

          గోత్రం అంటే, వంశ పరంపరను తెలియచేసే రహస్యం లాంటిదనవచ్చు. బ్రాహ్మణుల్లో, పితృ-పితామహ-ప్రపితామహ...అంతకంటే తెలిసి నన్ని తరాల పూర్వీకులతో పాటు, వంశం ఎక్కడనుంచి ఆరంభమయిందో వారి గోత్రాన్ని బట్టి కొంతవరకు తెలుసుకోవచ్చు. ప్రతి గోత్రం ఒక మహర్షి పేరుతో వుంటుంది. వంశ పరంపర గురించి వివరించేటప్పుడు, మొదటగా ఏ మహర్షి పేరుమీద గోత్రం వుందో, ఆయన పేరు చెపుతారు. తర్వాత ప్రవర చెప్పాలి. ప్రవరంటే, గోత్రానికి ఆద్యుడైన ఋషి పేరు, ఆ ఋషి కుమారుడి పేరు, ఆయన కుమారుడి పేరు (కొంత మందికి ముగ్గురి తో ఆపగా, మరికొంతమంది ఏడుగురి వరకూ చెప్పాలి) చెప్పి, ఫలానా వాడి పౌత్రుడని, పుత్రుడని చెప్పుతారు. బ్రాహ్మణులు వివిధ వర్గాలుగా గుర్తింపు పొందడానికి బహుశా ఇదొక ఏర్పాటు కూడా కావచ్చు. మొట్ట మొదటిసారి గోత్రం అన్న పదాన్ని ఎప్పుడు వాడిందో ఇదమిద్ధంగా తెలవక పోయినా, క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దానికల్లా, అలనాటి మారుతున్న సామాజిక నియమ నిబంధనలు-చట్టాలు, గోత్రం చెప్పుకునే పద్ధతిని స్థిరపర్చాయని అంటారు. దరిమిలా ఆ వ్యవస్థ వేళ్లూనుకోసాగింది. గోత్రాల పుట్టుక సప్తర్షుల ఆవిర్భావంతో ముడిపడిందంటారు. అయితే ఆ సప్తర్షులు ఒక్కో మన్వంతరంలో, ఒక్కో పేర్లతో వ్యవహరిస్తుండవచ్చు. వైవస్వత మన్వంతరంలో బ్రహ్మ మానస పుత్రులైన మరీచి, అత్రి, అంగీరస, పులస్థియ, పులహ, క్రతు, వశిష్ట మహర్షులను సప్తర్షులనేవారట. అలానే, మరో నమ్మకం ప్రకారం, విశ్వామిత్ర, జమదగ్ని, భరద్వాజ, గౌతమ, అత్రి, వశిష్ట, కశ్యప, అగస్త్య అనే ఎనిమిదిమంది మహర్షుల సంతతిని-వంశ పరంపరను తెలిపే గోత్రాల పేర్లుగా పెట్టారంటారు.


          ఉదాహరణకు: "పరాశర" గోత్రం. ఋషులు "వశిష్ట-శక్తి-పరాశర". వశిష్ట మహర్షి హిందూ పురాణాలలో ఒక గొప్ప యోగి. బ్రహ్మ సంకల్ప బలంతో జన్మించాడు. అందరు మహర్షుల వలె ఈయన ఒంటరి వాడు కాదు. ఈయనకు పరమ పతివ్రత-పతిభక్తి పరాయణురాలైన అరుంధతితో వివాహమైంది. వీరికి కలిగిన చాలా మంది కుమారులలో "శక్తి" జేష్టుడు. పరాశరుడు వశిష్టుడి మనుమడు. శక్తి పుత్రుడు. ఇతని తల్లి అదృశ్యంతి. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న వారికి, వివాహ సమయంలో ఆచరించే సంప్రదాయాలలో మహా పతివ్రత అరుంధతి నక్షత్రాన్ని చూపించడం ఒకటి. పరాశరుడు తాతగారైన వశిష్టుడి దగ్గర పెరిగాడు. పరాశరుడు ఒకనాడు తీర్థ యాత్రకు పోతూ, యమునా నదిలో పడవ నడుపుతున్న మత్స్య గంధి-సత్యవతిని చూసి-మోహించి, ఆమెతో సంగమించాడు. అలా వారి సంగమం కారణంగా యమునా నదిలో ఒక ద్వీపంలో ఆమె సద్యోగర్భాన (కన్యాత్వం చెడకుండా) జన్మించిన కొడుకే కృష్ణ ద్వైపాయనుడు లేదా వ్యాసుడు. ఆ పరాశరుడి వంశ క్రమంలో వాళ్లే మా "వనం" వారు.

No comments:

Post a Comment