Thursday, December 20, 2018

వాగ్దానాల అమలుకు కేసీఆర్ శ్రీకారం : వనం జ్వాలా నరసింహారావు


వాగ్దానాల అమలుకు కేసీఆర్ శ్రీకారం
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (21-12-2018)
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి మహోన్నతమైన ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసి, ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించి, అఖండ ప్రజావాణిని కాశ్మీరం నుండి కన్యాకుమారిదాకా ఆబాలగోపాలానికి వినిపించి, దేశవ్యాప్తంగా 36 పార్టీలను తన వాదనకు అనుకూలంగా మల్చుకుని, అలనాడు అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి, ప్రతిపక్షంలో వున్న బీజేపీని కూడా ఒప్పించి,  రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీకే, బ్రహ్మాండమైన భారీ మెజారిటీతో, మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాన్ని కల్పించారు విజ్ఞతకల తెలంగాణ ప్రజలు-ఓటర్లు.

ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై రాష్ట్ర ప్రజలు అచంచల విశ్వాసం ప్రకటించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, కేసీఆర్ మరోమారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం తన మలి దశ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఎన్నికల్లో చేసిన ఒక్కొక్క వాగ్దానాన్ని పటిష్టంగా అమలు చేయడానికి అధికారంలోకి వచ్చిన తక్షణమే కేసీఆర్ నాయకత్వంలోని టీఆరెస్ ప్రభుత్వం ప్రణాలికలు రూపొందించడం ఆరంభించింది. వీటికి తోడుగా ప్రజల అవసరాలకు, అభివృద్ధికి, ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ ఇతర కార్యక్రమాల, పథకాల రూపకల్పనలో సీఎం నిమగ్నమయ్యారు. తదనుగుణంగా వరుస సమీక్షా సమావేశాలు సీఎం అధ్యక్షతన జరిగాయి.

తక్షణ ప్రాధాన్యతాంశాలుగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం సత్వర పూర్తి, గ్రామాభివృద్ధి, పంచాయతీరాజ్ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, రాష్ట్రంలోని ప్రతీ గ్రామ పంచాయితీకి గ్రామ కార్యదర్శుల నియామకం, పచ్చదనం, పరిశుభ్రత, 57 ఏళ్లు నిండిన వృద్ధులకు పెన్షన్లు, పంచాయతీరాజ్ అవగాహన సదస్సు, కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ, బతుకమ్మ చీరల పంపిణీ, ఎమ్మెల్యేల ద్వారా కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ చెక్కులు, మార్చి 31 నాటికి మిషన్ భగీరథ ద్వారా  ప్రతీ ఇంటికి నల్లాల ద్వారా నీళ్ళివ్వడం లాంటివి వున్నాయి.

రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేసి కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యం దిశగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులకు ఆదేశాలిచ్చి అప్రమత్తం చేశారు. సీతారామ, శ్రీరామ సాగర్ పునరుజ్జీవం పథకం పనులతో సహా అన్ని పనులనూ అలసత్వం, జాప్యం లేకుండా యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం అధికారులకు చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరించిన భూములకు సంబంధించిన పరిహారం వెంటనే చెల్లించాలని కూడా ఆయన ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని స్వయంగా పరిశీలించేందుకు, తానే స్వయంగా, రెండు రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజిలను, పంపుహౌజులను, ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం కింద చేపట్టిన పనులను, ఇతర నిర్మాణ ప్రాంతాలను సందర్శించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

తెలంగాణలో ఎక్కువ భూభాగానికి నీరందించే కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం పెరగాలనీ, వచ్చే జూన్, జూలై నాటికి నీరందించాలనీ, మేడిగడ్డ బ్యారేజి నిర్మాణం మరింత వేగవంతం చేయాలనీ, మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజిలు, పంపుహౌజుల నిర్మాణాల్లో వేగం పెరగాలనీ ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. కాళేశ్వరం పనుల్లో జాప్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని కూడా ఆయన హెచ్చరించారు. సీతారామ ఎత్తిపోతల పథకంతో పాటు, శ్రీరామసాగర్ పునరుజ్జీవ పథకం, దేవాదుల ప్రాజెక్టు పనులలో కూడా వేగం పెంచాలనీ, పనుల్లో ఏమాత్రం జాప్యం, నిర్లక్ష్యం వహించవద్దని సిఎం అన్నారు.
 
గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని, కాబట్టి గ్రామాభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చెప్పారు. కొత్తగా రూపొందించిన పంచాయతీరాజ్ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి గ్రామాల రూపురేఖలు మార్చాలని అన్నారు. గ్రామ పంచాయతీఎన్నికల నిర్వహణ పూర్తి కాగానే, గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచే కార్యక్రమాలను ఉధృతంగా నిర్వహించాలని చెప్పారు. రాష్ట్రంలోని 12,751 గ్రామాలకు గాను, ప్రతీ గ్రామంలో ఒక గ్రామ కార్యదర్శిని నియమించడం కోసం కొత్తగా 9355 మంది గ్రామ కార్యదర్శుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. కొత్త జోనల్ వ్యవస్థ ద్వారా చేపట్టిన మొదటి నియామక ప్రక్రియ కూడా ఇదే. నియామక ప్రక్రియ కూడా ముగిసింది.  నియామక ఉత్తర్వులు జారీ చేయాలని కలెక్టర్లను ఆదేశిస్తూ రూపొందించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. కొత్త గ్రామ కార్యదర్శుల నియామకంతో గ్రామాలన్నింటికీ అధికారులు వుండడంతో వీరి ద్వారా గ్రామాభివృద్ధి, పచ్చదనం, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడం తేలికవుతుంది.


కొత్తగా నియామకమైన గ్రామ కార్యదర్శులు, ఇప్పటికే ఉన్న పంచాయతీకార్యదర్శులతో కలిసి మొత్తం 12,751 వేల మంది గ్రామ కార్యదర్శులు, ఎంపిడివోలు, ఇవోపిఆర్డిలు, డిపిఓలు, డిఎల్పీఓలతో కలిపి ఈ నెల 27న ఎల్.బి. స్టేడియంలో నిర్వహించే అవగాహన సదస్సులో గ్రామాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరుగుతుంది.  

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లు నిండిన వారికి వృద్దాప్య పెన్షన్ వచ్చే ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ మాసం నుంచి ఇవ్వాలనీ, దీనికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేయాలని, అర్హులను ఎంపిక చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలిచ్చారు ముఖ్యమంత్రి.

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు  చేయాలని ముఖ్యమంత్రి రెవెన్యూ ముఖ్యకార్యదర్శిని ఆదేశించారు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినట్లయింది. వీటితో పాటు కోరుట్ల కొత్త రెవెన్యూ డివిజన్ను, మరికొన్ని కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలిచ్చారు.

బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేయడానికి సిద్ధం చేసిన చీరలను ఈ నెల 19 నుంచి పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించడం, అది అమలు కావడం మొదలైంది. బతుకమ్మ పండుగ సందర్భంగానే పంచడానికి ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదు వల్ల పంపిణీ ఆగిపోయింది. ప్రస్తుతం క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్లకు పంచే దుస్తులతో పాటు బతుకమ్మ చీరలను కూడా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ చెక్కులను తిరిగి ఎమ్మెల్యేల ద్వారానే పంపిణీ చేయాలని నిర్ణయం జరిగింది. ఎన్నికల కోడ్ కారణంగా కొద్ది రోజుల పాటు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించి, ఇప్పుడు తిరిగి పాత పద్దతిలోనే ఎమ్మెల్యేల ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

2019 మార్చి 31 నాటికి మిషన్ భగీరథ ద్వారా  ప్రతీ ఇంటిలో నల్లా బిగించి, పరిశుభ్రమైన మంచినీరు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో ఏ ఒక్క మనిషి కూడా మంచినీళ్ల కోసం బిందె పట్టుకుని బయట కనిపించవద్దని చెప్పారు. కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలనే తేడా లేకుండా రాష్ర్ట్రంలోని అన్ని ఆవాస ప్రాంతాలకు మిషన్ భగీరథ పథకం ద్వారానే మంచినీళ్లు అందివ్వాలని, ఖర్చుకు వెనుకాడవద్దని సిఎం స్పష్టం చేశారు. దళిత వాడలు, ఆదివాసీ గూడేలు, శివారు ప్రాంతాలు, మారుమూల పల్లెలు అన్నింటికీ మిషన్ భగీరథ ద్వారానే శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయడం ప్రభుత్వ లక్ష్యం. షెడ్యూల్డ్ జిల్లాల్లోని మారుమూలలో ఉన్న చిన్న పల్లెలకు, ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న ఆవాస ప్రాంతాలకు కూడా కష్టమైనా సరే, ఆర్థికంగా భారమైనా సరే మిషన్ భగీరథ ద్వారా మంచినీరు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 10లోగా అన్ని ఆవాస ప్రాంతాలకు మంచినీళ్లు చేరుకోవాలని గడువు విధించారు సీఎం.

ప్రతీ ఊరికి నీళ్లు పంపి, ప్రతీ ఇంటికి నల్లా ద్వారా మంచినీళ్లు ఇవ్వడంతోనే బాధ్యత తీరిపోదనీ, ఆ తర్వాత కూడా ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా మంచినీటి సరఫరా జరగాలనీ ముఖ్యమంత్రి అభిప్రాయం.  ఒకసారి మిషన్ భగీరథ ద్వారా శుద్ది చేసిన మంచినీరు తాగిన తర్వాత ప్రజలు మరో రకం నీళ్లు తాగలేరనీ, ఏ ఒక్క రోజు మంచినీరు అందకున్నా తీవ్ర అసౌకర్యానికి గురవుతారనీ, కాబట్టి మిషన్ భగీరథ ప్రాజెక్టును పూర్తి చేయడం ఎంత ముఖ్యమో దాన్ని ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా నిర్వహించడం కూడా అంతే ముఖ్యం అనీ సీఎం స్పష్టం చేశారు. అధికారులు, ఇంజనీర్లు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ అద్భుతమైన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, వేల కిలోమీటర్ల పైపులైన్లు వేసినందుకు, నదీ జలాలను ప్రతీ ఊరికి తరలిస్తున్నందుకు, ప్రతీ ఇంటికి మంచినీళ్లు అందిస్తున్నందుకు వారిని సీఎం అభినందించారు.

దేశంలో మరెవ్వరూ చేయని అద్భుతాన్ని తెలంగాణ రాష్ట్రం చేసి చూపెడుతున్నది. దేశానికి ఇది ఆదర్శంగా నిలిచింది. అనేక రాష్ట్రాలు మిషన్ భగీరథ లాంటి పథకాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందించాయి. తెలంగాణ ప్రభుత్వ సహకారం కూడా కోరుతున్నాయి. ఆయా రాష్ట్రాలకు అవసరమైన సహకారం అందించడానికి సీఎం సంసిద్ధత వ్యక్తం చేశాం. మిషన్ భగీరథ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా, దేశానికి ఆదర్శంగా నిలిచింది.

ఇలా....రెండోసారి అధికార బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనపై పరిపూర్ణమైన దృష్టి పెట్టారు. సెప్టెంబర్ 6, 2018 న అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత, మూడు నెలల పాటు అంతా ఎన్నికల హడావుడే. ఎన్నికల ఫలితాలు వెలువడి, తెరాస గెలిచి, సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తక్షణమే, అంటే, మూడు నెలల విరామం తర్వాత, వివిధ శాఖల్లో ప్రస్తుతమున్న పరిస్థితులను సిఎం మదింపు చేస్తున్నారు. నీటి పారుదల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసే పని చేపట్టారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు సరైన ప్రణాళిక సిద్దం చేయడానికి శ్రీకారం చుట్టారు. మిషన్ భగీరథను వెంటనే పూర్తి చేయడానికి, కొత్త పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక రచించడానికి, ఇతర కార్యక్రమాల అమలుకు నడుం బిగించారు.

ఎన్నికల హామీల నేపధ్యంలో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరిగ్గా అంచనా వేసి, భవిష్యత్ ప్రణాళికలు సిద్దం చేయాల్సి ఉంది. వనరుల సమీకరణకు వ్యూహం రూపొందించాల్సి ఉంది. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాల్సి ఉన్నందున నిబద్ధత, పనితీరు ఆధారంగానే ముఖ్యమైన శాఖలకు అధికారులను నియమించే అవకాశం వుంది.

ఏదేమైనా....ఎన్నికల వాగ్దానాల అమలు దిశగా సీఎం కేసీఆర్ ఆయన ప్రభుత్వం వడి-వడిగా అడుగులు వేస్తున్నది. బంగారు తెలంగాణ యజ్ఞం పరిపూర్ణంగా, విజయవంతంగా జరగడానికి సీఎం అహర్నిశలూ కృషి చేస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాడు, ఆ మర్నాడు తెరాస పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడి హోదాలో కార్యకర్తలతో తన అభిప్రాయాలను పంచుకున్న సీఎం ఆ తరువాత అధికారులతో-అనదికారులతో వరుస సమీక్షలు జరిపారు.

No comments:

Post a Comment