Sunday, December 9, 2018

వాసుదాసస్వామి సుందరకాండ ముగింపు పలుకులు .... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


వాసుదాసస్వామి సుందరకాండ ముగింపు పలుకులు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (10-12-2018)
ఇలా సుందరకాండ "త" కారంతో మొదలై, "త" కారంతో ముగుస్తుంది. "తరువాత రావణాసుర" అనే పద్యంతో మొదలై, "శ్రీరామవహించే శాంతి సీత" అనే పద్యంతో ముగుస్తుంది.

(ఇదీ సుందర మందర మకరందం! చదివాం మనమందరం.....మన మందరం! ఆంధ్రవాల్మీకి అనుగ్రహ ప్రసాదం!)

"ఓమ్", "తత్", "సత్" అనేమూడు పదాలు శ్రుత్యర్ధ రహస్యాన్ని బోధిస్తున్నాయి.

"ఓమ్"......ఇంతవరకు పఠించినవారికి పూర్వకాండలలో చెప్పిన ప్రణవార్ధానికి అనుష్టానం ఆకాండలలో స్పష్టంగా గోచరిస్తుంది. దానిని వివరించడానికి, ఇందులో అష్టాక్షరి మంత్రానికి అన్వయముంది. సుందర కాండలో సూచించిన పద్ధతిలో మూలగ్రంథం సమన్వయం చేసుకునేవారికి, ఈ విషయం సులభంగా అర్థమవుతుంది.

ఇక రెండవదైన "తత్".......అనేదానికీ, దాని అర్ధానికీ, అన్వయం ఈ కాండ బోధిస్తున్నది. "తరువాత రావణాసుర" అని ఈ కాండ, "త" కారంతో ప్రారంభమై, "శ్రీరామవహించే శాంతి సీత", అని "త" కారంతోనే ముగించడం జరిగింది. భగవత్ గీతావాక్యాలలో "తత్" అనేదానికి చెప్పిన అర్థానికీ, ఇందులో అన్వయం కనిపిస్తుంది. అందువల్ల, సుందరకాండ మోక్షకాములకు అవశ్యపఠనీయమని చెప్పాలి.

మూడవదైన "సత్"..... అనేదాన్ని మొదటి పద్యంలోని "సీత" అనే పదం, కడపటి పద్యంలోని "సీత" అనే పద్యం సూచిస్తున్నది. "సత్" పదానికి అర్థాన్ని గీతావాక్యమే వివరించింది. దానికీ అన్వయం సీతా చర్యలో చూడవచ్చు.

ఈవిధంగా, ముముక్షువు అయిన వాడి భావమెట్లా వుండాలి? చర్య ఎలా వుండాలి? వాడు తెలుసుకోవాల్సిన విషయమేంటి? అనే అంశాలు కూడా సుందరకాండలో స్పష్టంగా వున్నాయి. సుందరకాండ ముముక్షువులకు, బుభుక్షువులకు, నిష్కాములకు, సకాములకు, స్త్రీలకు, పురుషులకు, సేవ్యమై, సార్ధకనామం సంతరించుకున్నది. సీతారామానుగ్రహం వలన, ఆంజనేయుడు సముద్రాన్ని దాటి, రామకైంకర్యం పూర్తి చేసినట్లే, శ్రీసీతారామాంజనేయ అనుగ్రహం వల్ల, ఈ వ్యాఖ్యాత (వాసుదాసస్వామి), ఈ కాండను పూర్వపుణ్యం వల్ల పూర్తిచేయగలిగాడు.


సుందరకాండ ముగింపు పద్యాలు
"యతి మానస బి సజలాయ! యత మాన జనార్ధ నిర్వహణ సు సమర్ధా!
నత సర్వభూతచయ! యిం, గిత విజ్జనవర్య! విబుధ కీర్తిత చర్యా!"
(ఇలా చెప్పడంవల్ల, ఈ గ్రంథకర్త అభిప్రాయం తెలుసుకుని దానిని నెరవేర్చాడని అర్థం).
పద్మనాభవృత్తం:
"రామా! నతాంహోవిరామా! మునీంద్రాత్మరామా! దయాసత్యధామా! నిశాట
స్తోమావలీ భీ మసంగ్రామ సీమా! విధూ మత్రిధా మాభ తేజస్సుధామా!
రామాంబు ముగ్ధామ! నీలోత్పల శ్యామ రాకేందుకా మాభ సౌందర్య ధామా!
సోమాది ముఖ్యామరారాధ్యనామా! విసుద్ధాత్మ భక్తావనోద్దామ కామా!"
అంబురహ వృత్తం:
"క్ష్మా రమణీ శరజాబ్జ భవానన సార సాహిత పద్య సం
వార సుశంసి నిజార్ధి మహాద్భుత జాఢ ధైర్య పరాక్రమా
భూరి పయోనిధి తారణ కారణ భూత నిర్జర యానవ
చ్చారుతురాత్మ సమాఖ్య నిజాశ్రిత సర్వ సౌఖ్య విధాయకా!"
సీii "జానకీ రఘురామ చరణ సేవాసక్త, చిత్తుడై తత్కృపాసత్తికతన
వామలూరూద్భవు పాదముల్ దలదాల్చి, ప్రత్యక్ష బ్రహ్మాత్మ భవున కెరగి
యభి వాదనము సల్పి యాచార్యులకునెల్ల, వ్యాఖ్యాతలకును సాష్టాంగ మెరగి
పరమభక్తులును బ్రపన్నులు ముదమొంద స్వాంద్ర వాల్మీకి రామాయణమున
గీ!!     ఘన మహార్ధంబు సుందరకాండమునకు,
వాసుదాసుండు రచియించి వ్యాఖ్యదీని
           మందరమనంగ శ్రీరామచంద్ర విభున,
కర్పణము చేసె జన్మంబు సార్ధకముగ.
సుందరకాండలో నేర్చుకోవాల్సిన విషయాలు:
         జీవాత్మ పరమాత్మల సంబంధమెలాంటిది?
జీవాత్మ తరణోపాయమెలాంటిది
జీవాత్ములకు సేవ్యుడు నిర్విశిష్టారాముడా?
సీతావిశిష్ట శ్రీరాముడా?
శిష్యాచార్య లక్షణాలు
ఆత్మావలోకనపరుడైన యోగి లక్షణం
బధ్ధజీవ తారతమ్యం
యోగికి, భక్తప్రపన్నుడికి భేదం
సీత ఉపాయమా? ఉపేయమా?
నమోస్తు రామాయ సలక్ష్మణాయ,
నమోస్తు దేవ్యై జనకాత్మజాయై
నమోస్తు వాతాత్ముభువే వరాయ,
నమోస్తు వల్మీకభ వాయ తస్మై.

No comments:

Post a Comment