Thursday, June 13, 2019

మానవ నిర్మిత అత్యద్భుతం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం : వనం జ్వాలా నరసింహారావు


మానవ నిర్మిత అత్యద్భుతం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (14-06-2019)
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు ఈ (జూన్, 2019) నెల 21న ప్రారంభోత్సవం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించాలని కెసిఆర్ నిశ్చయించారు. దేవేంద్ర ఫడ్నవీస్ తో సిఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు.  కేసీఆర్ ఆహ్వానాన్ని మన్నించిన దేవేంద్ర ఫడ్నవీస్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరు కావడానికి అంగీకరించారు. త్వరలోనే స్యయంగా ముంబై వెళ్ళి దేవేంద్ర ఫడ్నవీస్ ను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అలాగే, త్వరలోనే విజయవాడకు స్వయంగా వెళ్లి జగన్ ను కెసిఆర్ ఆహ్వానిస్తారు.

తెలంగాణ భూభాగంలోని దాదాపు 70 శాతం జిల్లాలకు సాగుకు, తాగుకు, పరిశ్రమలకు నీరు అందించడానికి ప్రతిపాదించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి అంగరంగ వైభోగంగా సిద్ధమయింది. దేశ నీటి పారుదల రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా జులై నెల నుంచే నీటి పంపింగ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మానవ నిర్మిత మహాద్భుతంగా నిలుస్తుందని కేంద్ర జలవనరుల సంఘం అధికారుల నుంచి మొదలుకుని వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, నీటి పారుదల నిపుణులు మెచ్చిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే శరవేగంగా నిర్మితమైన భారీ ఎత్తిపోతల పథకం. మేడిగడ్డ వద్ద సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తులో గోదావరి నీళ్లను ఆరు దశల్లో ఎత్తిపోసి, 618 మీటర్ల ఎత్తులో ఉండే కొండపోచమ్మ సాగర్ కు తరలిస్తారు. అంటే గోదావరి నది నీళ్లను అరకిలోమీటరుకు పైగా ఎత్తుకు లిఫ్టు చేస్తారు. ఈ ఏడాది ప్రతీ రోజు రెండు టి.ఎం.సి.లను ఎత్తిపోయడానికి అనువుగా పంపుహౌజులు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రతీ రోజు మూడు టిఎంసిల చొప్పున ఎత్తిపోయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున నీటిని లిప్టు చేయడానికి దేశంలో గతంలో ఎన్నడూ వాడనంత పెద్ద సైజు పంపులను వాడుతున్నారు.

ఈ ప్రాజెక్ట్ నేపధ్యం చాలా ఆసక్తికరంగా సాగింది.
2016 మార్చి 8న దశాబ్దాల తరబడి కొనసాగిన వివాదాలకు స్వస్తి పలుకుతూ, మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నది. దీని ఫలితంగా మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమయింది. 2016 మే 2న కన్నెపల్లి వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.   మూడేళ్ళ స్వల్ప వ్యవధి లోనే కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన భాగమైన బ్యారేజిలు, పంపుహౌజుల నిర్మాణం పూర్తయింది. రిజర్వాయర్ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బ్యారేజిలు నిర్మించారు. ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులను కూడా ఈ నీటితోనే నింపుతారు. దీంతో తెలంగాణలో మొత్తంగా 199 కిలోమీటర్ల మేర గోదావరి నది సజీవంగా ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్తగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, యాదాద్రి, నల్లగొండ, సంగారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్, మేడ్చల్, పెద్దపల్లి నియోజకవర్గాల్లోని దాదాపు 20 లక్షల ఎకరాలకు నీరందుతుంది.

కాళేశ్వరం నీటి ద్వారానే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకం చేపట్టారు. నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టులకు కూడా నీరందివ్వనున్నారు. దీంతో కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సంగారెడ్డి, నిజమాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్, మేడ్చల్, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, జనగామ, సూర్యాపేట జిల్లాల్లో మరో 20 లక్షల ఎకరాలు స్థిరీకరించబడతాయి. అంటే మొత్తంగా తెలంగాణలోని 40 లక్షల ఎకరాలకు ప్రతీ ఏడాది రెండు పంటలకు నీరందుతుంది. ఏటా 80 లక్షల ఎకరాల్లో పంటలు పండుతాయి. అందుకే తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రదాయనిగా నిలవబోతున్నది.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది రోజుకు రెండు టిఎంసిల నీరు ఎత్తిపోయడానికి 4,992.47 మెగావాట్ల విద్యుత్తు అవసరం పడుతుంది. మూడు టిఎంసిల నీటిని ఎత్తిపోయడానికి 7,152 మెగావాట్ల విద్యుత్తు అవసరం పడుతుందని అంచనా వేశారు. దీనికి తగినట్టుగానే ఏర్పాట్లు చేశారు.  చరిత్రలో మొదటిసారిగా తెలంగాణ విద్యుత్ సంస్థలు కాళేశ్వరం ప్రాజెక్టులో 139 మెగావాట్ల పంపులు (ప్యాకేజీ 8 – రామగుడు) వాడుతున్నారు. భారతదేశంలో ఇంత భారీ సామర్థ్యంతో ఎక్కడా ఎవరూ పంపులు వాడలేదు.


కాళేశ్వరం ప్రాజెక్టులో ముఖ్యాంశాలు: 
·       నీటిని సరఫరా చేసే మార్గం పొడవు          1,832 కిలోమీటర్లు కాగా గ్రావిటీ కెనాల్ పొడవు 1,531 కిలోమీటర్లు. సొరంగ మార్గాలు 203 కిలోమీటర్లు, ప్రెషర్ మెయిన్స్/డెలివరీ మెయిన్స్ 98 కిలోమీటర్లు.
·       లిఫ్టులు 20, పంపు హౌజ్ లు 19, అవసరమయ్యే విద్యుత్తు       4,992.47 మెగావాట్లు, జలాశయాలు     19, జలాశయాల నిల్వ సామర్థ్యం 141 టి.ఎం.సి.లు.

కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రతిపాదిత జలాశయాలు:
క్ర.సం              జలాశయం                                                నీటి నిల్వ సామర్థ్యం టి ఎం సి
1       100 మీ ఎఫ్ ఆర్ ఎల్ తో మేడి గడ్డ బ్యారేజీ                                    16.17
2       119 మీ ఎఫ్ ఆర్ ఎల్ తో అన్నారం బ్యారేజీ                                    10.87
3       130 మీ ఎఫ్ ఆర్ ఎల్ తో సుందిళ్ళ బ్యారేజీ                                    8.83
4       మేడారం జలాశయం                                                       0.78
5       అనంతగిరి జలాశయం                                                     3.50
6       శ్రీ రంగనాయక సాగార్ జలాశయం(ఇమాంబాద్)                        3.00
7       శ్రీ కొమురవెల్లి మల్లన్న సాగర్ జలాశయమ (తడ్కపెల్లి)              50.00
8       మల్కపేట జలాశయం                                                      3.00
9       618 ఎఫ్. ఆర్. ఎల్. తో కొండ పోచమ్మ సాగర్ (పాములపర్తి)          15.00
10     గంధమల్ల జలాశయం                                                     9.87
11      బస్వాపురం జలాశయం                                                    11.39
12      భూంపల్లి జలాశయం                                                       0.09
13      కొండెం చెరువు                                                             3.50
14      తిమ్మక్కపల్లి జలాశయం                                                   1.50
15      దంతెపల్లి జలాశయం                                                       1.00
16      ధర్మారావు పేట చెరువు                                                    0.50
17      ముద్దిజివాడి చెరువు                                                       0.50
18      కాటేవాడి చెరువు                                                           0.50
19      మోతే జలాశయం                                                          1.00
                  మొత్తం                                                              141.00

         రాత్రింబవళ్లూ చకచకా ప్రాజెక్టు నిర్మాణం : కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసేందుకు రాత్రింబవళ్లూ నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 141 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 20 లిఫ్టులను నిర్మిస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన 12 బ్లాకుల్లో 1531 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వలు, 203 కిలోమీటర్ల మేర సొరంగాల పనులు రాత్రింబవళ్లూ సాగుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు 4 వేల మందికి పైగా కార్మికులు నిరంతరం షిఫ్టుల వారీగా పనిచేస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ పంపులు: భారతదేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ విద్యుత్ సంస్థలు రాష్ట్రంలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలకు అత్యధిక విద్యుత్ సరఫరా అందించడానికి రికార్డు స్థాయి ఏర్పాట్లు చేశాయి. ప్రాజెక్టును విజయవంతంగా నిర్వహించడంలో విద్యుత్ శాఖకున్న ప్రాధాన్యాన్ని మొదట్లోనే గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు అనుగుణంగా విద్యుత్ అధికారులను అప్రమత్తం చేశారు. విద్యుత్ శాఖ చరిత్రలోనే మొదటి సారిగా ట్రాన్స్ కో లో ఎత్తిపోతల పథకాలకు ప్రత్యేక డైరెక్టర్ (సూర్యప్రకాశ్)ను నియమించారు. జెన్ కో- ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో విద్యుత్, నీటి పారుదల శాఖ అధికారులు ప్రతీ వారం క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించారు. ఆస్ట్రియా తదితర దేశాలు పర్యటించి పంపుల సామర్థ్యాన్ని మదింపు చేశారు. బిహెచ్ఇఎల్ తో ఒప్పందం చేసుకుని వివిధ ప్లాంట్లలో సమాంతరంగా ప్రత్యేక పంపులను తయారు చేయించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నెరిపిన దౌత్యం వల్ల మహారాష్ట్ర ప్రభుత్వంతో దశాబ్దాలుగా ఉన్న నీటి వైరం పరిష్కారమైంది. గోదావరి నదీ జలాలు వాడుకునే విషయంలో, ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో పరస్పర అంగీకారం కుదిరింది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మూడు సార్లు, నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఐదు సార్లు మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో చర్చలు జరిపారు. ఫలితంగా గోదావరి, ప్రాణహిత, పెన్ గంగ నదులపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టుల విషయంలో స్పష్టత వచ్చింది. 2016 మార్చి 8న మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రక అవగాహన కుదుర్చుకుని వచ్చారు. రెండు రాష్ట్రాల్లోని ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై వచ్చే సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకునేందుకు అంగీకారం కుదిరింది. ఫలితంగా ఉమ్మడి అంతర్ రాష్ట్రీయ బోర్డు ఏర్పాటయింది. గోదావరిపై మేడిగడ్డ, ప్రాణహితపై తమ్మిడిహట్టి, పెన్ గంగపై రాజాపేట, చనఖా- కొరాటా, పింపరాడ్ బ్యారేజీల నిర్మిణానికి మార్గం సుగమం అయింది.  గోదావరి నదిపై మూడు బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవీస్ 2016 ఆగస్టు 23న ముంబైలో చారిత్రక మహా ఒప్పందం చేసుకుని, ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. తాజా  ఒప్పందాలతో గోదావరిలో హక్కుగా ఉన్న 954 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం లభించింది.
(సీఎం పీఆర్వో గటిక విజయ్ కుమార్ సౌజన్యంతో)

No comments:

Post a Comment