Tuesday, March 24, 2020

పంచాంగ శ్రవణాల తీరు-తెన్ను! ..... వనం జ్వాలా నరసింహారావు


పంచాంగ శ్రవణాల తీరు-తెన్ను!
వనం జ్వాలా నరసింహారావు
మన తెలంగాణ దినపత్రిక (25-03-2020) 
ఇది శ్రీ శార్వరి నామ ఉగాది. ఉగాది, యుగాది అనే రెండు పదాలూ నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తాయి. యుగాది అనేది సంస్కృత పదం. ఇదే కాలక్రమంలో ఉగాదిగా మారిందని అంటారు. ఉగము అంటే నక్షత్రగమనం అని అర్థం. నక్షత్ర గమనానికి ప్రారంభపు రోజు, అంటే ఈ రోజు నుంచి నూతన కాలగణన ప్రారంభమవుతుంది కాబట్టి ఈ రోజుకు ఉగాది అనే పేరు వచ్చింది. ఉత్తరాయణ, దక్షిణాయన కాలప్రమాణాలున్న సంపూర్ణ సంవత్సరానికి ఇది తొలిరోజు కాబట్టి ఈ రోజును ఉగాది అని పిలిచారు. భూమిపై వసంతం వికసించిన తొలిరోజు ఉగాది అని అందరికీ తెలిసిందే. మిగిలిన పండగలకన్నా ఉగాది ఎంతో ప్రత్యేకమైంది. ఉగాది కాలానికి సంకేతం. మానవ జీవనానికి, కాలానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకునే ఆనందవేళ ఉగాది. ఉగాది మనిషి జీవనంలో కీలకంగా, మూలకంగా ఆవిర్భవించింది.

 ఉగాదినాడు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ పోయినా పంచాంగ శ్రవణాలే. కరోనా పుణ్యమా అని ఈ ఏడాది ప్రసార మాధ్యమాల ద్వారానే వినాలి. కాకపోతే, ఏ ఉగాది పంచాంగ శ్రవణం విన్నా అవే మాటలు, అదే ధోరణి, అదే ముఖ స్తుతిమాటలు. అంతా చర్విత చరణమే. వింటున్నవారిని ఏదో విధంగా సంతుష్టి పరచాలన్న తపన తప్ప మరేదీ పంచాంగ శ్రవణం చేసే పండితుడికి వున్నట్లు అనిపించదు. సాధారణంగా పంచాంగ శ్రవణం సరస్వతీ మాతకు సాష్టాంగ ప్రణామాలు చేస్తూ, స్వస్తి శ్రీ ఫలానా నామ సంవత్సరంలో (ఉదాహరణకు ఈ సంవత్సరం శ్రీ శార్వరి నామ) మనం అడుగు పెడుతున్నామని  మొదలవుతుంది. ఇక అక్కడనుండి ముఖస్తుతి మాటలు ఆరంభమవుతాయి. ఏ పార్టీకి చెందిన సభాస్తలిలో ఆ పార్టీ నాయకుడిని స్తుతిస్తూ శ్రవణం వుంటుంది. రాశి ఫలాలు ఎలా వున్నా అందరికీ నాలుగు మంచి మాటలే పంచుతాడు శాస్త్రి.   

మొదట్లో, మనం వుంటున్న యుగారంభం గురించిన ప్రస్తావన వుంటుంది. కలియుగం 4 లక్షల 32 వేల సంవత్సరాలనీ, అందులో ప్రథమ పాదం ఒక లక్షా 8 వేల సంవత్సరాలనీ,  అందులో ప్రభవాది 60 సంవత్సరాలలో ఇప్పుడు ప్రవేశిస్తున్న సంవత్సరం ఫలానా సంఖ్యా (శార్వరి-34) సంవత్సరంగా మనముందుకు వచ్చిందనీ పేర్కొంటారు శాస్త్రి గారు. ఇక అక్కడి నుండి ఆ సంవత్సరానికి వున్న పేరు, వివిదార్థాలను, విశేషాలను వర్ణిస్తారు. ఆ సంవత్సరానికి వున్న పర్యాయ పదాలను, వాటి వివిధ అర్థాలను విడమర్చి తమదైన శైలిలో చెప్పి, భగవంతుడు ఆ సంవత్సరములో అందరికీ సర్వ దిగ్విజయం ఇచ్చుగాక అని ఆ సంవత్సర అధి దేవతకు నమస్కారం చేస్తున్నాం అని చెప్తారు. దానికి అనువుగా ఒకటి-రెండు ధ్యాన శ్లోకాలను చెపుతూ పురాణాల్లో ఆ నామ సంవత్సరములో ఏఏ విశేషాలు జరిగాయో కొంత విడమర్చి చెప్పడం జరుగుతుంది.  

ఆ తరువాత ఆ సంవత్సరం యొక్క ఫలితం చెప్పడం ప్రారంభిస్తూ, రాజులు (ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రధాని లేదా ముఖ్యమంత్రి) సక్రమమైనటువంటి పరిపాలన కావిస్తారనీ, అందులో ఎటువంటి సందేహము లేదనీ నొక్కి వక్కాణిస్టారు. కొన్ని చోట్ల రాజకీయ కల్లోలం ఉండే ఆస్కారం ఉందనొ, లేదనో, చోరులు, దుర్మార్గులు పెరుగుతారనో, లేదనో, పెరిగినా దైవానుగ్రహం వల్ల వారి ఆటలను భగవంతుడు సాగనివ్వడనీ అంటారు. అదే విధంగా ధాన్యాదుల ధరలు అటు-ఇటు కాకుండా సమానంగా వుండవచ్చనీ, వర్షాపాతం చక్కగా ఆ సంవత్సరము కూడా ఆనందదాయకంగా ఉంటుందనీ, బలే మంచిగా భరోసా ఇస్తారు.

ఆ తరువాత సాధారణంగా చెప్పేది నవనాయకుల వ్యవహారాన్ని. కాలచక్ర పరిభ్రమణం ఆధారంగా నవనాయకుల నిర్ణయం జరుగుతుంది. ఆ విశేషాలను జ్యోతిషశాస్త్రం తెలియజేస్తుంది. ప్రతి సంవత్సరానికీ రాజు, మంత్రి, సేనాధిపతి, సస్యాధిపతి, ధాన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి, రసాధిపతి, నీరసాధిపతి అని తొమ్మిదిమంది నాయకులు ఉంటారు. వీరినే నవనాయకులు అంటారు. నవనాయకులను బట్టి సంవత్సర ఫలితాలను అంచనా వేస్తారు పంచాగకర్తలు. రాజు, మంత్రి, సేనాధిపతి పరిపాలనను నిర్ణయిస్తారు.


నవనాయకులలో  కొంతమందికి శుభాధిపత్యం వచ్చిందనీ, మరికొందరికి రాలేదని అదేంటో వివరించకుండా, అర్థం కాకుండా  విషయం చెప్తారు. అందులో కొందరికి పాప గ్రహాల ఆధిపత్యం వచ్చిందని ఇంకేదో అర్థంకాని మాట అంటారు. మొత్తం మీద మెజార్టీ పాజిటివ్ గా ఉందనే ఒక మంచి మాట చెప్తారు. అవీ-ఇవీ చెప్పి సంవత్సరమంతా శుభాధిపత్యమే అనీ, అంతా చక్కగా ఉంటుందనీ మరో మంచి మాట అంటారు.  ఆ తదనంతరం ఉప నాయకుల ప్రస్తావన తెచ్చి, అందులో ఎందరికి శుభాగ్రహాల ఆధిపత్యం వచ్చింది, ఎందరికి పాపగ్రహాల ఆధిపత్యం వచ్చింది చెప్తారు. ఎవరికేమి వచ్చిందని చెప్పినప్పటికీ, విశ్లేషణనగా చూస్తే  శుభగ్రహాధిపత్యమే సాధరణంగా అధికంగా కనిపిస్తుందని నమ్మ పలుకుతారు.  

సంవత్సరాది (ఉగాది) ఏ వారం వస్తుందో చెప్పి, (ఉదాహరణకు శార్వరి బుధవారం వచ్చింది)  ఆ వారానికి అధిపతిని రాజుగా నిర్ణయిస్తారు. ఆ సంవత్సరానికి రాజు (శార్వరిలో బహుశా బుధుడు) ఫలానా వాడు అయ్యాడనీ, మంత్రి ఫలానా వాడు అయ్యాడనీ, సేనాధిపతి ఫలానా వాడు అయ్యాడనీ అంటారు. ఎవరు సస్యాధిపతి అయిందీ, ఎవరు ధాన్యాధిపతి అయిందీ, ఎవరు అర్గాధిపతి అయిందీ, ఎవరు మేఘాధిపతి అయిందీ, ఎవరు రసాధిపతి అయిందీ, ఎవరు నీరసాధిపతి అయిందీ, వర్ష లఘ్నం ఏమిటీ, జగలఘ్నం ఏమిటీ ఇత్యాది విషయాను ఉటంకిస్తారు.  ఫలానా వాడు రాజయ్యాడు కాబట్టి, ఆ అయినవాడు పండితుడు కాబట్టి, దాని ప్రకారం రాజుకు వివేకం, ప్రజ్ఞ, పాండిత్యము, యుక్త, యుక్త విచక్షణ, జ్ఞానం వుంటుందని చెప్పి దాన్ని ఎన్నికైన ప్రజాస్వామ్య ప్రభుత్వాధినేతకు అన్వయిస్తాడు పంచాంగ శ్రవణం చేసే పంతులు. ఇంకా కొనసాగిస్తూ, ఫలానావాడు రాజయ్యాడు కాబట్టి ఆ సంవత్సరము అతడి అంశ మన పరిపాలకుల్లో కూడా వచ్చి సంవత్సరమంతా నిరాఘాటంగా, ఆనందంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తారు అని సంతోషకరమైన మాటలు చెప్తారు. అలాగే ఫలానా వాడు రాజు అయ్యాడు కాబట్టి వర్షాలు చక్కగా కురుస్తాయని ప్రవచనం నమ్మకంగా చెప్తారు. వర్షాలు పడ్డాయా, లేదా, ఆ తరువాత గమనించిన వారెవరూ వుండరు. అదంతా చెప్పడం వరకే పరిమితం.

రాజు విషయం చెప్పి ఎవరు మంత్రి అయ్యారో చెప్తారు పంతులు గారు. అలా చెప్పి అతడి గుణగణాలను వర్తమాన మంత్రికి (సాధారణంగా అధికారంలో వున్న ఉన్నతోన్నత అధికారికి) అన్వయిస్తారు. ఉదాహరణకు శుక్రుడు మంత్రి అయ్యాడనుకోండి.....అప్పుడు శుక్రుడు అంటే విలాసానికి ప్రతీకనీ, దానివల్ల విలాసము, విందులు, ప్రజల్లో కాస్త వినోదం మీద ఆసక్తి పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తారు.

పంచాంగంలో చెప్పిన విషయాలను రాష్ట్రానికి, రాష్ట్ర స్థితి గతులకు అన్వయించే ప్రయత్నం జరుగుతుంది శాస్త్రిగారి మాటల్లో. భగవంతుడి దయ, మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతీ స్వరూపిణీ అయిన అమ్మవారి దయ, దైవానుగృహ స్థితిని బట్టి సరైనటువంటి సమయంలోనే వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని భరోసా ఇస్తూనే, అలవోకగా కొన్ని సూచనలు కూడా చేస్తారు. ఇది చేయాలి, అది చేయాలని అంటారు. ఉదాహరణకు బాగా వర్షాలు పడడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు పూనుకొని, ప్రతీ దేవాలయంలో వరుణజప సహితంగా విరాటపర్వం పారాయణం జరిపించి ప్రతీ ఆలయంలో వరుణజపాలు ముందస్తుగా చేయించడం ద్వారా ఇంకా చక్కటి వర్షాలు కురిసి చక్కగా చెరువులు, కుంటలు, తూములు అన్ని బాగా నిండి అద్భుతంగా ఫలిస్తుందని నమ్మ పలుకుతారు.  

చివరగా ఒక్కో రాశివారి (మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనుస్సు,  మకర, కుంభ, మీన) ఆదాయ వ్యయాలు, రాజ పూజ్యం, అవమానం, ఆ సంవత్సరం జరగబోయే ముఖ్యమైన కార్యకలాపాలు, ఏవైనా ఆకస్మిక భయాందోళనలు ఉన్నాయా?, గత సంవత్సరం కంటే వర్తమాన సంవత్సరంలో వివిధ రంగాలలో అవకాశాలు,  వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి, ఏ విధంగా వారు తలపెట్టిన పనులు నేరవేరనున్నాయి, ఇబ్బందులు వచ్చనప్పటికీ దైవానుగ్రహం వల్ల ఎలా ముందుకు వెళ్లగలరు, బాంధవ్యాలు, మిత్రులతో సంబంధాలు ఎలా వుంటాయి, ధన స్థానం ఏమిటి, ఆ రాశివారి గౌరవం ఎలా పెరుగుతుంది, ఆర్థికాభివృద్ధి ఎలా వుంటుంది, ఒడిదుడుకులు ఎలా వుండబోతున్నాయి, వారి అభివృద్ధికి ఆటంకాలు ఏమన్నా ఉన్నాయా, జరగబోయే శుభకార్యాలు, నూతన వ్యాపార అవకాశాలు, దైవ బలం ఎలా వుంది, ఆకస్మిక సంఘటనలు, మనశ్శా౦తి ఎలా వుంటుంది, ఏలిన ఆనతి సాని వుందా లేదా, తలపెట్టిన పనుల్లో ఆటంకం, ఇత్యాది విషయాలను పంచాంగ శ్రవణానికి హాజరైన అందరికీ నచ్చేలా-మెచ్చేలా చెప్తారు.

ముగించే ముందర చెప్పే విషయాల్లో కొత్తదనం ఏమీ వుండదు. అవే మాటలు ఏటేటా చెప్తుంటారు. పంచాంగ శ్రవణానికి ఎంచుకున్న సంవత్సరం అందరికీ చక్కగా వుంటుంది అని అంటారు. సంవత్సరమంతా చక్కగా, ఆనందంగా, శ్రేయోదాయకంగా, బ్రహ్మాండంగ ప్రకాశించుగాక అని శుభ వాక్యాలు పలుకుతారు.  కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువైనటువంటి వెంకటేశ్వరుడు, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి, ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి, వేములవాడ రాజేశ్వర స్వామి, భద్రాచల సీతారామచంద్ర స్వామి, ముత్తవరపు కోదండ రామస్వామి, చక్కటి ఆయురారోగ్య భోగభాగ్యాలను అందరికీ ప్రసాదించుగాక అంటారు. పంచాంగ అధి దేవత అయిన సూర్యనారాయణ భగవానుడిని ప్రార్థన చేస్తూ స్వస్తి వాక్యం పలుకుతారు పంతులుగారు.

లోకా సమస్తా సుఖినో భవంతు అనీ, ధర్మస్య విజయోస్తు అనీ, అధర్మస్య నాషోస్తు అనీ, ప్రాణిష సద్భావనా అస్తు అనీ, విష్వస్య కళ్యాణ మస్తు అనీ, ఇంకా ఏదేదో అస్తు అనీ అంటూ, మంగళకరమైన నాలుగు వాక్యాలతో పంచాంగ శ్రవణం ముగుస్తుంది. పంతులు గారికి శాలువా కప్పడం, జ్ఞాపిక ఇవ్వడం మామూలే!

No comments:

Post a Comment