Friday, March 27, 2020

భద్రాద్రీశుడు రామచంద్రుడే....వనం జ్వాలా నరసింహారావు


భద్రాద్రీశుడు రామచంద్రుడే
 (భద్రాచల శ్రీరామ-రామనారాయణ వివాదం)
వనం జ్వాలా నరసింహారావు
దర్శనమ్ ఆధ్యాత్మిక మాసపత్రిక, ఏప్రియల్ 2020
వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండ దండం కరే
చక్రంచోర్థ్వ కరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే
విఘ్రాణం జలజాతపత్ర నయనం భద్రాద్రి మూర్తిస్థితం
కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రి యుక్తం భజే

శ్రీరాముడు లేని రామాయణాన్ని ఎలా వూహించలేమో అలాగే శ్రీరాముడు లేని భద్రాచల క్షేత్రాన్ని వూహించలేం. భద్రాచలంలో వున్నది ఏ దేవాలయం అని అడుగుతే, ఆసేతు హిమాచలం, చిన్న పిల్లవాడితో సహా, అక్షర-నిరక్షరాస్యులు అందరూ, రామాలయం అనే జవాబిస్తారు. అక్కడ వున్నది రామనారాయణుడి గుడి అని ఒక్కడంటే ఒక్కడు కూడా చెప్పడు. అలాంటప్పుడు కుహనా పండితులకు ఆ మాత్రం అవగాహన, విజ్ఞానం లేకపోవడం విడ్డూరంగా ఉందనాలి. దేవాలయంలో వెలసిన రాముడు శంఖ-చక్రాలు, దనుర్భాణాలు, నాలుగు చేతులు ధరించి ఉన్నంత మాత్రాన, ఆయన సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు  కాదని వాదిస్తూ, ఆ విగ్రహం రామనారాయణుడిదని ఒక వింత వాదన లేవతీస్తున్నారు కొందరు.

ఏ చరిత్ర అయినా జరిగే కాలంలో అందరికీ తెలుస్తుంది.  ఆ తరువాత వారికి కొంత మాత్రమే తెలుస్తుంది. ఓ వంద సంవత్సరాలు గడిస్తే అది అవునో, కాదో  అనిపిస్తూ వుంటుంది. అలాంటిది వేల, లక్షల సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక చరిత్రను యథాతథంగా అంగీకరించడం కొంత కష్టమే. అయినా కొన్ని వాస్తవాలు అంగీకరించక తప్పదు. శ్రీరాముడు పుట్టక ముందు విష్ణువు. అవతారం అయిపోయాక తిరిగి శ్రీ మహావిష్ణువు అయ్యాడు. మధ్యలో సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్రుడే! రామావతారం పూర్ణావతారమే. ఆ అవతారంలో ఆయన శ్రీరాముడే.... రామనారాయణుడు కాదు.

దేవతల ప్రార్థన ప్రకారం దశరథ పుత్రుడై వున్నప్పుడు, దైవం లాగా వుండాల్నా, మనుష్యరూపంలో వుండాల్నా అన్న ప్రశ్నను దేవతలనే అడిగాడు నారాయణుడు. వారు చెప్పబోయేది తాను అప్పటికే నిశ్చయించుకున్నప్పటికీ, ఎదుటివారి గౌరవార్థం, వారి మనస్సును పరీక్షించేందుకు, ఆవిధంగా ప్రశ్నించడం రామావతారంలో ఒక విశేష గుణం. అవతార పరిసమాప్తి వరకూ ఆయనది మనుష్య రూపమే. దేవతల క్షేమం కోరి శ్రీమహావిష్ణువు భూలోకంలో జన్మించేందుకు సంకల్పించాడు శ్రీరాముడిగా, ఒక మానవుడిగా. రామనారాయణ రూపంలో కాదు.    
   
త్రేతా యుగాంతంలో శ్రీ మహా లక్ష్మీదేవితోనూ, ఇతర భాగవతోత్తములతోనూ శ్రీ మన్నారాయణుడు, వైకుంఠంలో శిష్ట రక్షణ-దుష్ట శిక్షణ చేసేదెలా అని చర్చించడానికి కారణం రావణాసురుడనే రాక్షసుడు. శ్రీ మన్నారాయణుడు, పూర్వ జన్మలో తనను ఆరాధించి, తన దగ్గర నుండి వరం పొందిన దశరథుడి కోరిక తీర్చడానికి, ఆయన కుమారులుగా, శ్రీరామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్న అనే పేర్లతో అవతరించాడు. ఇది భగవత్ సంకల్పం. అలా పుట్టడంతోనే ఆయన నారాయణ అవతారం నుండి రామవతారానికి మారాడు. ఇక అప్పటినుండీ ఆయన శ్రీరాముడే. రామనారాయణుడు కాదు. వాస్తవానికి శ్రీరామావతారం అనుష్టానావతారం.

భద్రాచలం దేవాలయంలో వున్నది శ్రీరాముడా, లేక, రామనారాయణుడా? అనే వివాదం ఎప్పటికప్పుడు తెరపైకి వస్తూనే వుంది. ఈ అంశంపై ఆ ప్రాంతంలో పలు విమర్శలు, ప్రతి విమర్శలు తీవ్రస్థాయిలో వున్నాయి. అక్కడ కొలువై ఉన్నది సాక్షాత్తు శ్రీరామచంద్రుడేనని రామ భక్తులు అంటుంటే, వెలసిన దేవుడు శంఖుచక్రాలు, ధనుర్బాణాలతో ఉన్న స్వామి కాబట్టి ఆయన ముమ్మాటికీ రామనారాయణుడేనని మరో భక్తివర్గం వారంటున్నారు.  స్వామివారికి నిర్వహించే నిత్య కల్యాణాల్లో ప్రవర చదివే సమయంలో “రామచంద్ర స్వామినే వరాయ” అని చెప్పాల్సి ఉండగా, “రామనారాయణ స్వామినే వరాయ” అని మార్చడం ద్వారా అర్చకులు అపచారం చేస్తున్నారనేది రామ భక్తుల విమర్శ.  

భద్రాద్రి దేవస్థానంవారు చెప్పడం మాత్రం, భద్రాదిల్రో వెలసిన శ్రీరామచంద్రుడిని కోదండ రాముడుగా, భద్రాద్రి రాముడుగా, వైకుంఠ రాముడుగా, ఓంకార రాముడుగా, రామనారాయణుడుగా కొలవడం జరుగుతున్నదని. భద్రాచలంలో కొలువై ఉన్నది శ్రీరామచంద్రుడేనని, జరగాల్సింది సీతారాముల కల్యాణమేనని అందరూ దీనిని సమర్థించి, దైవాపచారాన్ని ఖండించాలని కోరుతూ భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి పేరుతో ప్రత్యేక బ్లాగ్‌ ఏర్పాటు చేసి, దాని ద్వారా ఓటింగ్‌ నిర్వహిస్తోంది ఒక వర్గం. భద్రాద్రిలో కొలువై ఉన్నది రాముడా, రామనారాయణుడా అనే అంశంపై బహిరంగ చర్చను నిర్వహించనున్నట్లు కూడా సమితి తెలిపింది.


భద్రాచల క్షేత్రానికి ఒక పవిత్రమైన భక్తి గాధ ఆధారం. అలాగే, రామాలయాలలో భద్రాద్రి రామాలయానికి ప్రత్యేకస్థానం వుంది. భద్రాద్రి రాముడిని చూస్తుంటే అలనాటి రామాయణ గాథ మన కళ్లకు కట్టినట్లు అనిపిస్తుంది. చరిత్ర తెలిసిన ప్రతివారికీ ఈ దేవాలయంలో వున్నది శ్రీరామచంద్రుడే అన్న విషయం స్పష్టంగా అవగతమౌతుంది. శ్రీరామచంద్రుడు వనవాసం చేసేటప్పుడు పర్వాతాకారంలో వున్న భద్రుడి శిలమీద కూర్చున్నాడు. ఆ సమయంలో మునివేషంలో వచ్చిన భద్రుడి కోరికమేరకు ఆయనకు శంఖ-చక్రాలు, దనుర్భాణాలు, నాలుగు చేతులు ధరించి, సీతాలక్ష్మణ సమేతుడై దర్శనం ఇచ్చాడని పురాణ గాధ.  ఆ తరువాత, శ్రీరాముడు తన స్వస్వరూపంలో అక్కడే దేవతామూర్తిగా వుండి భక్తులకు దర్శనం ఇవ్వడానికి అంగీకరించాడు. వెంటనే రాముడు నిల్చిన శిల శ్రీ సీతారామ లక్ష్మణ మూర్తులుగా రూపొందింది. పావన గోదావరీ నదీ తీరాన భద్రుడి కొండమీద స్వయంభుగా ఉద్భవించిన మూర్తులే భద్రాచల శ్రీ సీతారామచంద్ర మూర్తులు. సందేహం లేదు.  

ఆ విగ్రహాలను సీతారామలక్ష్మణ విగ్రహాలుగా బావించి, దర్శించి, పూజించిన వారిలో జగద్గురువు శంకరాచార్య స్వాములవారు కూడా వున్నారు. సీతారామలక్ష్మణులను సేవించిన జగద్గురువు “వామాంకస్థిత జానకీ...” శ్లోకం రచించారని చాలామంది అంటారు. అలా ఆ మూర్తిత్రయాన్ని యధాతథంగా వర్ణిస్తూ ఆయన రచించిన ఆ శ్లోకం ఇప్పటికీ భద్రాచలంలో నిత్యాను సంధానంగా చదువుతున్నారు.

ఇక ఆ తరువాత దమ్మక్కకు కలలో రాముడు కనిపించడం, తన విగ్రహాలకు పూజాపునస్కారాలు చేయమని చెప్పడం, ఆమె కోరిక మేరకు గ్రామస్థులు అక్కడే ఒక కుటీరం నిర్మించడం, పూజలు చేసి నైవేద్యం సమర్పించడం, ఆ విగ్రహాలకే భక్త రామదాసు గుడి కట్టించడం అందరికీ తెలిసిన విషయమే. అసలా మాటకొస్తే దేవాలయాన్ని కట్టినవాడు, కట్టించుకున్నవాడు ఎవరని ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానం, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే భక్తులను అనుగ్రహించడానికి ఈ దేవాలయాన్ని కట్టించుకున్నాడని. ఆ విధంగా అయోధ్యలో పుట్టిన శ్రీరామచంద్రుడు వనవాసం చేసి, లంకకు పోయి రావణాది రాక్షసులను చంపడానికి ముందే తెలుగునాట వెలిశాడంటే అది తెలుగువారి అదృష్టమనే అనాలి.   

 భక్త రామదాసు రచించి, స్వయంగా పాడిన అనేక కీర్తనలో “దాశరథీ” అనో, లేక “కోదండరామా” అనో, శ్రీరాముడి గుణగణాలను ప్రశంసించాడు కాని “రామనారాయణుడు” అని ఎక్కడా ప్రస్తుతించ లేదు. జైలులో వున్నప్పుడు పాడిన ప్రతి కీర్తనలోను ఆయన కీర్తనల నాయకుడు శ్రీరామచంద్రమూర్తే కాని రామనారాయణుడు కానే కాదు. “రామ, ఇదేమిరా?...”; “కలికుతురాయి నీకు పొలుపుగ చేయిస్తి రామచంద్రా, నీవు కులుకుచు తిరిగెద వేవరబ్బ సొమ్మని రామచంద్రా”; “అబ్బ తిట్టితినని ఆయాసపడబోకు రామచంద్రా, ఈ దెబ్బలకోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్రా”; “ఆశించియుండిన దాసుని శ్రీరాములూ, నీకు పోషించే భారము లేదా శ్రీరాములూ”; “రామచంద్రులు నాపై చలము చేసినారు, సీతమ్మ చెప్పవమ్మ”; “ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవే రామచంద్రా! రక్షకులెవరింక రామచంద్రా!”  లాంటి ఆ కీర్తనలన్నిటిలోనూ రామదాసు వేడుకున్నది, ప్రార్థించినది శ్రీరాముడినేకాని, రామనారాయణుడుని కాదు. తన ఏకైక కుమారుడు గంజిలో పడి మరణించినప్పుడు భక్తరామదాసు వాడిని బతికించమని ప్రార్థించింది కూడా శ్రీరామచంద్రుడినే. “కోదండరామ, కోదండరామ, , కోదండరామ, , కోదండరామ, నీదండ నాకు నీవెందు పోకు వాడేలా నీకు వద్దు పరాకు....భద్రాద్రి రామ” అని ప్రార్థించాడు. అలా ఈ నాటికీ రామదాసు భక్తిగీతాలు భద్రాద్రిలో ప్రతిధ్వనిస్తున్నాయి.        
గుంటూరు వాస్తవ్యుడైన తూము లక్ష్మీనరసింహదాసు, మద్రాసు వాస్తవ్యుడైన వరదరామదాసు ఒకానొక సందర్భంలో భద్రాచల ఆలయ పునరుద్ధరణకు పూనుకున్నప్పుడు, అప్పటి నిజాం మంత్రి చందూలాల్ జారీ చేసిన ఫర్మానాలో ఆలయ ఆస్తి అంతా శ్రీరాముడి పేరున వుండే ఏర్పాటు చేశాడు. రామనారాయణుడి ప్రస్తావనే లేదు. ఆ తరువాత వరదరామదాసు, శ్రీరాముడి మొహరుతో పూర్వ పూజా విధానం అంతా పునరుద్ధరించాలని ఆదేశాలు ఇచ్చాడు. బహుశా ఆ ఆజ్ఞాపత్రం ఇప్పటికీ దేవాలయంలో వుండే వుంటుంది. నరసింహదాసు విజ్ఞప్తి మేరకు భద్రాచలం వచ్చిన త్యాగరాజస్వామి శ్రీరామ దివ్య సందర్శనంతో మైమరచి, దేవాలయ ప్రాంగణంలో “మోహనరామ” అనే కీర్తనను గానం చేశాడని అంటారు. త్యాగరాజులవారు ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలోనే సన్యాసాశ్రమం స్వీకరించారని కూడా అంటారు. నరసింహ, వరద రామదాసుల మరణానంతరం దేవాలయ వ్యయాన్ని భరించడానికి సంవత్సరానికి రు. 18,500 మంజూరీ చేస్తూ, శ్రీరాముడి పేరుమీదే సనద్ ఇచ్చాడని చెప్పడానికి అనేక చారిత్రిక ఆధారాలున్నాయి. 

ఇదిలా వుండగా ఇటీవలి కాలంలో, భద్రాచలంలో జరుగుతున్న జగత్ప్రసిద్ధి గాంచిన సీతారామ కళ్యాణోత్సవంలో అనూచానంగా చెప్పుకు వస్తున్న శ్రీరాముడి దశరథ ఆరంభ ప్రవరను, సీతాదేవి ప్రవరను మార్చివేయడం పలువురిని ఆశ్చర్యపరుస్తున్నది. అలాగే రామచంద్రమూర్తి పేరు మార్చి రామనారాయణ అని, ప్రవరను మార్చి సీతారాములను లక్ష్మీనారాయణులుగా కల్యాణం జరిపించడం విడ్డూరంగా కనిపిస్తున్నది. నాలుగు చేతులున్నాయి కదా అని ఆయన్ను రామనారాయణుడు అనడం అంతకంటే విడ్డూరం. యావత్ దేశంలోని అన్ని రామాలయాలలో శ్రీ సీతారామ కల్యాణంలో శ్రీరాముడి ప్రవర చదివేటప్పుడు వసిష్ట సగోత్రులైన అజ, రఘు, దశరథులను, సీతాదేవి ప్రవర చెప్పేటప్పుడు గౌతమ సగోత్రులైన నిమి, విదేహ, జనకరాజులను చెప్పి కన్యాదానం జరిపిస్తారు. అదేమి విడ్డూరమో కాని, భద్రాచలంలో మాత్రం (పూర్వంలా కాకుండా) ఇటీవలి కాలంలో రాముడిని రామనారాయణుడుగా సంభోదిస్తూ ఆయన గోత్రం అచ్యుత అని చెప్తున్నారు. అలాగే సీతాదేవికి బదులుగా సీతామహాలక్ష్మి అని చెప్పి సౌభాగ్య సగోత్రాన్ని ఆపాదిస్తున్నారు. ఒకవైపు సీతారాముల కల్యాణం అంటూనే, మరోవైపు ప్రవర చెప్పేటప్పుడు రామనారాయణ, సీతామహాలక్ష్మి అని చెప్పడం పరస్పర విరుద్ధం. దీని సారాంశం, భద్రాద్రిలో ఇటీవలి కాలంలో, శ్రీ సీతారామ కల్యాణం జరగడం లేదు. లక్ష్మీనారాయణ కల్యాణం జరుగుతున్నది. ఇది లోక విరుద్ధం. భక్తులను మోసం చేయడమే! గోత్ర ప్రవరాలే కల్యాణానికి ప్రధానం.

చైత్ర శుద్ధ నవమి నాడు దశరథుడుకి కొడుకు పుట్టాడు. ఆ రోజునే భద్రాచలంలో కల్యాణం జరుగుతున్నదని అంటే, ఆ జరిగేది శ్రీరాముడికే కదా! అంటే దశరథ సుతుడికే కదా? అలాంటప్పుడు, దశరథుడుది, జనకుడిది గోత్రాలు, ప్రవర చెప్పడం న్యాయం కదా? మార్చాల్సిన అవసరం ఏమిటి? శ్రీరాముడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడే....విష్ణు మూర్తి అవతారమే. కాదని ఎవరూ అనరు. కాకపొతే, దశరథ పుత్రుడు ఎవరంటే, శ్రీరామచంద్రుడు అంటాం కాని, రామనారాయణుడు అనం కదా? సీతాదేవి భర్త ఎవరని అడిగితే ఆబాలగోపాలం ముక్తకంఠంతో శ్రీరాముడు అంటుంది కాని రామనారాయణుడు అని ఎవరూ అనరు కదా? మరో అసంబద్ధం ఏమిటంటే, క్షత్రియులైన సీతారాములను పూజారులు బ్రాహ్మణులుగా మార్చి వేశారు. రామనారాయణ పేరుతో అచ్యుత గోత్రం చదివి, పరబ్రహ్మ శర్మ, వ్యూహనారాయణ శర్మ, విభవవాసుదేవ శర్మ చెప్పుతున్నారు. సీతాదేవికి సౌభాగ్య గోత్రం చెప్పి, విశ్వంభర శర్మ, రత్నాకర శర్మ, క్షీరార్ణవ శర్మ అంటున్నారు. వీరి పూర్వీకులు శర్మలు అంటే వీరు బ్రాహ్మణులనే కదా? పెళ్లి బ్రాహ్మణులకు చేసి, పట్టాభిషేకం మాత్రం ఆ తరువాత రాజుకు చేస్తారట! ఇదెక్కడి న్యాయం?

నాలుగు చేతులతో దర్శనం ఇవ్వడం వల్ల రామనారాయణుడు అనే వాదన అసమంజసం. రాముడికి నాలుగు చేతులు వుండడాన్ని పాంచరాత్ర ఆగమమే చెప్పింది. దాని ప్రకారం నాలుగు చేతుల ధనుర్బాణాలు, శంఖ చక్రాలు కలిగింది శ్రీరామమూర్తే అని అర్థం. చతుర్భుజుడిగా కూడా రాముడు వుంటాడు. అంటే, ‘వామాంకితస్థిత జానకి’ పక్కన వున్నది సాక్షాత్తు శ్రీరామచంద్రుడే.  

ఇకనైనా, భవిష్యత్ లో భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణం, శ్రీరామ, సీతాదేవి అసలు ప్రవర, గోత్రాలతో చదవడం హర్షణీయం.

No comments:

Post a Comment