Sunday, April 18, 2021

భార్యలకు పాయసాన్ని పంచి ఇచ్చిన దశరథుడు .... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-53 : వనం జ్వాలా నరసింహారావు

 భార్యలకు పాయసాన్ని పంచి ఇచ్చిన దశరథుడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-53

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (19-04-2021)

(ప్రాజాపత్య పురుషుడిచ్చింది క్షీరసాగరమధనంలో ఉద్భవించిన ఇంద్రుడి స్వాధీనంలో వున్నటువంటి అమృతం కాదు. భగవంతుడి తేజస్సు మనుష్య స్త్రీ గర్భంలో ప్రవేశించేందుకు మంత్రవంతమైన హవిస్సులాంటి - నిమిత్తమాత్రమైన పదార్థం ఒకటి కావాలి. అదే, భగవత్తేజః పూరితమైన పాయసాన్నం. అదే అమృతమైతే, తాగిన స్త్రీలకు మరణం రాదు కదా! అందుకే, శ్రీరామాది జననములు "రేతస్సర్గం" కారణం కాదనీ-వారి దేహాలు అప్రాకృతాలనీ తెలుసుకోవాలి. అదే దశరథుడు కనుక తాగుంటే, వచ్చిన గర్భాలకు రేతస్సంబంధం కలపొచ్చు. అలాంటిది జరగలేదు. శుక్ల రక్త సంయోగాలవలన ఏర్పడే దేహాలకు స్త్రీ గర్భవసతి అవశ్యంకాని, దివ్య తేజస్సుతో ఏర్పడేవాటికి స్త్ర్రీ గర్భవసతితో పనిలేదు. దీనికి ఉదాహరణలుగా, మాంధాతృ జననం, కుంభజులైన అగస్త్య-వశిష్ఠ-ద్రోణాచార్య జననం, ధృష్ట్యద్యుమ్న-ద్రౌపది జననం చెప్పుకోవాలి. ఇందు క్షేత్రం ప్రధానం కాదు-గర్భస్థజీవుడే తన తపోబలంతో, స్వేచ్ఛాత్తశరీరుడవుతాడు. వీరి దేహాలు తల్లి తినే ఆహారంతో కాని-తల్లి సంకల్పంతో కాని సంబంధం లేదు. అంటే, తల్లితండ్రుల జాతికి, బిడ్డలజాతికి సంబంధం లేదిక్కడ. కట్టెల్లో పుట్టిన అగ్నిహోత్రుడిది ఏజాతి? తాను లోగడ ఇచ్చిన వరం తీర్చేందుకు-కౌసల్యా దశరథులకు పుత్రమోహం కలిగించేందుకు, భగవంతుడు పన్నిన పన్నాగమే ఇది. అందుకే, ఈ రహస్యాన్ని తెలిసిన విశ్వామిత్రుడు శ్రీరాముడిని సంబోధిస్తూ, "దశరథ పుత్రా" అని కాని-"కౌసల్యా పుత్రా" అనికాని అనకుండా, "కౌసల్యా సుప్రజారామ" అన్నాడు. స్వేచ్చానుసారం-స్వతంత్రంగా-కారణాంతరాలవల్ల, తపోబలంతో కారణజన్ములైన మహాత్ముల జన్మలకు, పామరుల జన్మలకు పోలికేలేదు. వాల్మీకి చెప్పినట్లు, శ్రీరాముడిని "సాక్షాత్తు విష్ణువు" అని మునులందరు నమస్కరించారు కాని, క్షత్రియుడని జాతి వివక్షత చూపినట్లైతే నమస్కరించక పోయేవారు).

తాను తెచ్చిన పాయసం గురించి చెప్తూ దశరథుడు కౌసల్యతో:" ఇది పుత్రోత్పత్తికి కారణమై-జన్మాన్ని పావనం చేసేదై-అమృతంతో సమానమైన పాయసం. దీన్ని పూజించు. ఇది నువ్వు తీసుకుంటే కొడుకు కలుగుతాడు" అని ప్రేమతో అంటాడు. సూర్యవంశంలో జన్మించి, నీతిమంతుడుగా పేరొందిన దశరథుడు, ప్రాజాపత్యపురుషుడిచ్చిన పాయసంలో సగం మొదలే కౌసల్యకిచ్చాడు. ఆమె దాన్ని తాగింది. మిగిలిన సగంలో సగం (పాతిక భాగం) రెండో భార్యైన సుమిత్రకు ఇచ్చాడు. తక్కిన పాతిక భాగం ఎవరికిస్తారో చూద్దామనుకున్నది సుమిత్ర. ఆమె అభిప్రాయం గ్రహించిన దశరథుడు, సుమిత్రతో సమానంగా కైకకు ఇవ్వడం ధర్మంకాదనుకొని, మిగిలిన పాతిక భాగాన్ని రెండు భాగాలు చేసి, ఒకభాగం కైకకు, మరో భాగం తిరిగి సుమిత్రకు ఇచ్చాడు. కైక తనకిచ్చిన పావులో సగభాగాన్ని-సుమిత్ర తనకు రెండు సార్లు ఇచ్చిన రెండు భాగాల్ని(వేరు-వేరుగా) తాగారు.

(పాయసం పంచడంలో దశరథుడు, భార్యలలో పెద్ద-పిన్న తరం ఆలోచించాడు. అందరికన్నా పెద్దభార్య-పట్టపుదేవి కౌసల్య. రెండోది సుమిత్ర. మూడవ భార్య కైకేయి. కాబట్టి పాయసంలో సగభాగం కౌసల్యకిచ్చాడు మొదలే. తక్కిన సగభాగంలో రెండవ భార్య సుమిత్రకు సగం తొలుత ఇచ్చాడు. ఇంకో సగం కైకేయికిస్తే, సుమిత్రను-కైకేయిని సమానంగా చూసినట్లవుతుందనీ-అది ధర్మంకాదనీ, నయజ్ఞుడైన దశరథుడు ఆలోచించి, మిగిలిన పాతిక భాగంలో సగం కైకేయికి-సగం తిరిగి సుమిత్రకు ఇచ్చాడు. కైకేయి అందరికన్నా చిన్నదైనందున "పరక" పాలిచ్చాడు. ఆవిధంగా, సగం కౌసల్యకు-పాతిక ఒకసారి, పరక ఒకసారి సుమిత్రకు-పరక కైకేయికి ఇచ్చాడు. కైకేయి సంభోగ విషయంలో ప్రియురాలు కాని న్యాయంగా భాగంలో కాదు దశరథుడికి. ఇలా తారతమ్యం లేకపోయినట్లైతే, పెద్ద-చిన్న గౌరవం పాటించనట్లు అవుతుంది. ధర్మదృష్టి చేసిన భాగ పరిష్కారం కనుకనే, రాజపత్నులు సమ్మతితో స్వీకరించారు. దశరథుడికి ధర్మాత్ముడని పేరొచ్చింది అందుకే. ఇకపోతే: రామచంద్రమూర్తి విష్ణువు అర్థాంశం. లక్ష్మణుడు పాదాంశం. భరత-శత్రుఘ్నులు ఇరువురుకలసి పాదాంశం. తనకు న్యాయంగా రావలసిన భాగం దశరథుడు తనకీయగానే కౌసల్య పాయసాన్ని తాగింది-ఆకారణం వల్ల ఆమె కొడుకు తొలుత జన్మించి జ్యేష్ఠడయ్యాడు. సుమిత్ర తాగకుండా మొదలు ఊరుకుంది. తనకు న్యాయంగా భాగమొచ్చిందనుకున్న కైకేయి కూడా వెంటనే తాగడంతో, ఆమె కొడుకు రెండవవాడు గా పుట్టాడు. పాతిక-పరక వేర్వేరుగా ఆఖరున తాగిన సుమిత్రకు కవలలు చివరలో జన్మించారు).

కొడుకులు కలిగేందుకు దశరథుడు ధర్మమార్గాన్ననుసరించి, పెద్ద-పిన్న గౌరవం ఆలోచించి, పాయసం పంచుతే, రాజపత్నులు సంతోషించారు. అలా సంతోషంతో పాయసం తాగిన తర్వాత కౌసల్య-సుమిత్ర-కైకేయిలు దుస్సహములైన సూర్యాగ్ని తేజస్సుతో-దేవతల క్షేమానికి కారణం కాగల-రావణాసురుడి చెరసాలలో బంధించబడిన దేవతా స్త్రీల కాలి సంకెళ్ళను తొలగించగల సామర్థ్యమున్న గర్భాలను ధరించారు. ఆ ఉత్తమ స్త్రీ రత్నాలను చూసిన కమల బాంధవుడైన సూర్యతేజస్సువంటి తేజస్సుకలవాడు-శత్రువులను సంహరించడంలో సమర్థుడు-ఇంతకాలం కొడుకులు పుట్తారా అని వ్యాకులపడ్తున్నదశరథుడు, ఇనుమడించిన సంతోషంతో, సిద్ధులు-దేవతలు పూజించే ఇంద్రుడిలాగా వెలిగాడు.

No comments:

Post a Comment