Sunday, April 18, 2021

రావణుడు సిగ్గుతో యుద్ధభూమిని విడిచిపోయాడా? : వనం జ్వాలానరసింహారావు

 రావణుడు సిగ్గుతో యుద్ధభూమిని విడిచిపోయాడా?

వనం జ్వాలానరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆదివారం (18-04-2021) ప్రసారం  

నాగపాశాలతో రామలక్ష్మణులను కట్టేసానని, కాళ్లు-చేతులు కదిలించలేకుండా పడిపోయారని, చనిపోయారని ఇంద్రజిత్తు చెప్పగానే అమితంగా సంతోషించాడు రావణుడు. రామలక్ష్మణుల వల్ల తనకింత వరకూ కలిగిన భయం పోగొట్టుకున్న రావణుడు సంతోషంగా కొడుకును పొగిడాడు. అయితే రావణుడి సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. యుద్ధభూమిలో తిరుగుతున్న రామలక్ష్మణులను చూసిన రాక్షసుల సర్వం రావణుడికి ఇలా చెప్పారు. ఇంద్రజిత్తు బాణాలతో కట్టబడి కదలక-మెదలక పడివున్న రామలక్ష్మణులు తమ్ము కట్టిన తాళ్ళను తెంచుకుని ప్రకాశిస్తున్నారని చెప్పారు.

         ఇలా రాక్షసులు చెప్పగా రావణుడు ఏం చేయాల్నా, చేసినదంతా వ్యర్థమైపోయింది కదా! అని విషాదపడ్డాడు. బ్రహ్మ వరంతో సంపాదించిన తన కుమారుడి మహాస్త్రాలు ఎప్పుడూ వ్యర్థం కావే? అలాంటి బాణాలను కూడా రామలక్ష్మణులు విడిపించుకున్నారే? ఇది ఆశ్చర్యమైన విషయం అనుకున్నాడు. ఈ ప్రకారం అనుకుని, ధూమ్రాక్షుడిని చూసి, రాముడి మీదకు యుద్ధానికి పొమ్మంటాడు. వాడు సైన్యంతో కలిసి సింహనాదాలు చేస్తూ యుద్ధానికి సాగారు.

         ధూమ్రాక్షుడు హనుమంతుడున్న పశ్చిమ ద్వారం చేరబోతుంటే ఎదురైన అపశకునాలను చూసి తన చావు తధ్యమని అనుకుని బాధపడ్డాడు. వానర-రాక్షసులు దొమ్మి యుద్ధం చేశారు. ధూమ్రాక్షుడు తన పరాక్రమంతో వానరుల పరాక్రమాన్ని అణిచి వేశాడు. ధూమ్రాక్షుడు మీద హనుమంతుడు వంద బాణాలను వేసి, ఒక పర్వత శిఖరాన్ని వాడి నడినెత్తిమీద వేశాడు. దాంతో వాడు చచ్చాడు. ఇది చూసి రాక్షసులు లంక దారి పట్టారు. ధూమ్రాక్షుడు చనిపోయాడని విన్న రావణుడు వజ్రదంష్ట్రుడనేవాడిని యుద్ధానికి పోయి రామలక్ష్మణులను సంహరించమని చెప్పాడు. వాడలాగేనని యుద్ధ కాంక్షతో రణరంగానికి బయల్దేరాడు. వజ్రదంష్ట్రుడు అంగదుడు వున్న పడమటి ద్వారానికి బయల్దేరాడు. వాడిని చూసిన అంగదుడు మండిపడుతూ చేతిలో ఒక పెద్ద చెట్టు తీసుకుని వజ్రదంష్ట్రుడిని సమీపించాడు. వజ్రదంష్ట్రుడి మీదికి దూకి వాడిని ఒక గుద్దు గుద్దాడు. ప్రతీకారంగా వజ్రదంష్ట్రుడు, అంగదుడి దేహాన్ని నెత్తురుతో తడిసేట్లు చేశాడు. అంగద వజ్రదంష్ట్రులు పలుమార్లు ఒకరినొకరు కొట్టుకున్నారు. అప్పుడు తటాలున అంగదుడు రాక్షసుడి మీదకు దూకి వాడి శిరస్సును తన కత్తితో నరికాడు.

         వజ్రదంష్ట్రుడు మరణించాడని విన్న రావణుడు ప్రహస్తుడితో యుద్ధానికి అకంపనుడిని పంపమని చెప్పాడు. అలా అనగానే ప్రహస్తుడు గొప్ప సేనను యుద్ధానికి సిద్ధం చేసి అకంపనుడి స్వాధీనం చేశాడు. అతడు యుద్ధానికి బయల్దేరి పోయాడు. అకంపనుడు యుద్ధానికి పోతున్నప్పుడు కూడా అపశకునాలు కనిపించాయి. రాక్షస సైన్యం సింహనాదాలు చేసింది. ఇరు పక్షాల సేనలకు భయంకర యుద్ధం జరిగింది. రాక్షసుల ధాటికి వెనక్కు పోతున్న వానరులను చూసిన హనుమంతుడు అకంపనుడిని ఎదుర్కున్నాడు. హనుమంతుడి మీదకు అకంపనుడు బాణాలను ప్రయోగించినా ఫలితం కనపడలేదు. వాడు బాణాలు వేస్తున్నా లక్ష్యపెట్టని హనుమంతుడు ఒక పెద్ద  చెట్టును పీకి తిప్పుతూ అకంపునుడి తల పగిలేట్లు కొట్టగా వాడు ఆ దెబ్బకు నేలమీద పడి చచ్చాడు.

         యుద్ధంలో అకంపనుడు చనిపోయిన వార్త విన్న రావణుడు ప్రహస్తుడిని చూసి, కావాల్సినంత సైన్యం తీసుకుని యుద్ధానికి పొమ్మన్నాడు. ఇలా రావణుడు చెప్పగానే ప్రహస్తుడు, ఆయన ఆజ్ఞానుసారం రథం ఎక్కి యుద్ధానికి బయల్దేరి పోయాడు. బయల్దేరుతూ సింహనాదం చేశాడు. ప్రహస్తుడు ముందుకు వేగంగా సాగుతుంటే, వానరులు కేకలు వేశారు. ఇరుపక్షాల వారు ఒకరినొకరు పౌరుషంతో చూస్తూ యుద్ధానికి దిగారు. ప్రహస్తుడు స్వయంగా యుద్ధానికి దిగాడు. యముడితో సమానులైన సమున్నతుడు, నరాంతకుడు, మహానాథుడు, కుంభహనుడు తమమీదకు వస్తున్న వానరులను నిలువరించారు. అప్పుడు ద్వివిదుడు ఒక కొండను వేయడంతో నరాంతకుడు చచ్చాడు. దుర్ముఖుడు వేసిన పెద్ద చెట్టు తగిలి సమున్నతుడు చచ్చాడు. జాంబవంతుడి చేతిలో మహానాథుడు చచ్చాడు. తారుడు విసిరిన చెట్టుకు కుంభహనుడు కొండలాగా నేలకూలాడు.

ఇంతలో యుద్ధం చేస్తున్న ప్రహస్తుడిని చూసి నీలుడు కళ్లెర్ర చేశాడు. ప్రహస్తుడిని అడ్డగించాడు. ప్రహస్తుడు అప్పుడు శూరుడై తన ప్రతాపాన్ని చూపించసాగాడు. వారిద్దరి మధ్యా యుద్ధం కొనసాగింది. అలా జరుగుతుండగా నీలుడు ఒక గుండు తీసుకుని గురి చూసి ప్రహస్తుడిని కొట్టాడు. ఆ రాతి దెబ్బకు ప్రహస్తుడి తల తునకలైపోయి చనిపోయాడు.

         ప్రహస్తుడి వృత్తాంతమంతా రాక్షసులు రావణుడికి తెలపగా అతడు బాధపడి, ఇంతవరకు ఈ అల్ప కార్యానికి తానే పోవాల్నా అని ఉపేక్షించి వున్నాననీ,  ఇక ఉపేక్షించరాదనీ, తానెలాంటి వాడినో చూపిస్తాననీ, కోతి గుంపును కూలుస్తాననీ, రామలక్ష్మణులను శుష్కింప చేస్తాననీ, రాక్షసులతో అంటూ, రథం ఎక్కి యుద్ధానికి బయల్దేరాడు. యుద్ధానికి పోయిన రావణుడు భయంకరమైన వానర సేనను చూశాడు. రావణుడి సైన్యాన్ని చూసి రామచంద్రమూర్తి విభీషణుడితో ఆ సేన గురించి వివరించమని అడిగాడు.

         జవాబుగా విభీషణుడు, రావణాసురుడి కొడుకు అకంపనుడు గురించీ, ఇంద్రజిత్తు గురించీ, అతికాయుడు గురించీ,  మహోదరుడనే వాడిని గురించీ, రాక్షసుడు. పిశాచుడు గురించీ,  త్రిశిరుడు గురించీ, కుంభుడు గురించీ, నికుంభుడు గురించీ, నరాంతకుడు గురించీ వివరంగా చెప్పాడు. యుద్ధానికి వచ్చిన రాక్షసరాజు రావణాసురుడుని చూపించి వాడే రావణుడు అని చెప్పాడు. శ్రీరాముడు రావణుడిని చూసి ఇలా సీతాదేవిని వీడు అపహరించిన కోపమంతా వీడిమీద చూపుతాను అని అంటూ, విల్లు తీసుకుని ఎక్కుపెట్టి, తీక్షణమైన బాణాలను పొదినుండి బయటకు తీసి, యుద్ధం మీద మనస్సుతో లక్ష్మణుడితో సహా నిలబడ్డాడు.

         రావణుడిని చూసి కోపంతో సుగ్రీవుడు వాడితో యుద్ధానికి దిగాడు. రావణుడు సుగ్రీవుడిని చంపాలన్న కోరికతో ఒక బాణాన్ని అతడి రొమ్ములో నాటుకునేట్లు వేశాడు. ఆ బాణం వల్ల కలిగిన బాధతో సుగ్రీవుడు కేక వేసి నేలపడ్డాడు. ఇది చూసి, శ్రీరాముడు విల్లు తీసుకుని రావణుడి మీదికి పోతుండగా లక్ష్మణుడు వాడిని తాను చంపాలనుకుంటున్నాననీ,  తనకు ఆజ్ఞ ఇవ్వమని అడిగాడు.  శ్రీరాముడు అనుజ్ఞ ఇవ్వగానే, యుద్ధానికి బయల్దేరాడు. రావణుడిని చూశాడు.

         లక్ష్మణుడు యుద్ధానికి రావడం చూసిన హనుమంతుడు, రావణుడికి, లక్ష్మణుడికి మధ్య అడ్డంగా దూకి, రావణుడు వేసే బాణాలను తన తోకతో తనను తాకకుండా చెదరగొట్టాడు. అమితమైన కోపంతో రావణుడి రథం మీదకు దూకి వేగంగా తన కుడి చేతిని ఎత్తి, రావణుడు బెదిరేట్లు క్రూరపు చూపులతో అతడిని చూస్తూ “ఓరీ! ఇదిగో నా కుడి చేయి చూడు. ఐదు వేళ్లతో కూడినది. ఇన్ని రోజులుగా నువ్వు నీ దేహంలో కాపాడుకుంటున్న ప్రాణాలను ఇప్పుడే చెదరగొట్టుతా. ధీరుడవై చలించకుండా నిలువు” అన్నాడు.

అప్పుడు రావణుడు హనుమంతుడిని గట్టిగా అర చేత్తో కొట్టి అతడిని అమితంగా బాధకు గురిచేశాడు. అర నిమిషం ముందు-వెనుకలకు చాలా సార్లు ఊగి మరల తెప్పరిల్లి, గాండ్రిస్తూ, రావణుడిని ఒక్క గుద్దు గుద్దాడు. హనుమంతుడు చేతి దెబ్బకు ఎంతగానో బాధపడ్డ రావణుడిని చూసి వానరులు, దేవతలు, మునులు మిక్కిలి సంతోషించారు. దెబ్బతిన్న రావణుడు కాసేపటికి తెప్పరిల్లుకున్నాడు. హనుమంతుడి శౌర్యానికి మెచ్చుకున్నాడు.

రావణుడి మెచ్చుకోలుకు స్పందనగా హనుమంతుడు “నీ భుజబలం కొద్దీ నువ్వు నన్ను గుద్దు. ఆ తరువాత నా భుజబలం కొద్దీ నేను గుద్దుతాను. అప్పుడు నా పోటు శక్తి నువ్వు చూడవచ్చు. నువ్వు చావకుండా వుండవు” అన్నాడు. ఇలా చెప్పగానే రావణుడు కోపంతో కళ్లెర్రచేసి మండిపడుతూ తన శక్తి అంతా పూని హనుమంతుడి రొమ్మును కుడి చేతి పిడికిటితో కొట్టాడు. ఆ దెబ్బకు హనుమంతుడు తబ్బిబ్బులాడుతుంటే, తెప్పరిల్లితే ఆంజనేయుడు తనను చంపుతాడని భయపడి వేగంగా నీలుడి మీదికి పోయాడు.

         ఆ తరువాత, నీలుడికి, రావణుడికి మధ్య యుద్ధం కొనసాగింది. నీలుడు రావణుడిని చాలా రకాల ఇబ్బంది పెట్టాడు. నీలుడి వేగానికి, యుద్ధ చాతుర్యానికి, రామలక్ష్మణులు, హనుమంతుడు ఆశ్చర్యపోయారు. రావణుడు నీలుడి మీదికి ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. ఆ అస్త్రానికి నీలుడు తెలివి తప్పి పడిపోయినప్పటికీ, తండ్రి మహిమ వల్ల, తన బలం తేజస్సు వల్ల చావలేదు. అప్పుడు రావణుడు  అహంకారంతో లక్ష్మణుడి మీదికి పోయాడు. రావణ లక్ష్మణుల మధ్య యుద్ధం మొదలైంది. ఒకరినొకరు స్మృతి తప్పేట్లు బాణాలతో కొట్టుకున్నారు. చివరకు రావణుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన ఆయుధాన్ని లక్ష్మణుడి మీదికి విసిరాడు. రావణుడు వేసిన బాణం లక్ష్మణుడి రొమ్ములో నాటుకోగా లక్ష్మణుడు సొమ్మసిల్లి, నేలకూలాడు.

ఇదిలా వుండగా, హనుమంతుడు పరుగెత్తుకుంటూ వచ్చి, వజ్రంతో సమానమైన తన పిడికిటితో తన శక్తికొలదీ రావణుడి రొమ్ము మీద గుద్దగా అతడు దిక్కు తెలియక కాళ్ళు-చేతులు కదిలించడం ఆపి, తన రథంలో కూలబడి పోయాడు. హనుమంతుడు పాత కసి అలా తీర్చుకున్నాడు. రావణుడు అలా మూర్ఛపోవడం చూసిన దేవతలు సంతోషంతో కేకలు వేశారు. లక్ష్మణుడిని హనుమంతుడు తన చేతుల మీదుగా ఎత్తుకుని పోయి రాముడి దగ్గర వుంచాడు. లక్ష్మణుడి మీద రావణుడు వేసిన బ్రహ్మశరం అనే బాణం లక్ష్మణుడిని జయించడం తనకు సాధ్యం కాదని భావించి రావణుడి రథం దగ్గరికి పోయింది. బాణం పోగానే లక్ష్మణుడి మూర్ఛ వదిలింది. తెప్పరిల్లుకున్నాడు. ఇంతలో రావణుడు లేచి విల్లు-బాణాలు ధరించి యుద్ధానికి సిద్దమయ్యాడు మళ్లీ.

          తన సైనికులు పడిపోవడం, మిగిలిన వానరులు రావణుడిని చూసి పరుగెత్తిపోవడం చూసిన రామచంద్రమూర్తి, కోపగించి, ఇక ఆలశ్యం చేయకూడదని భావించి, హనుమంతుడి వీపుమీద కూర్చుని రావణుడిమీదికి యుద్ధానికి పోయాడు. రామబాణ సమూహం రావణుడి సారథితో సహా ఆయన్నూ ఇబ్బందికి గురిచేసింది. ఒక బాణం రావణుడి విశాల వక్షంలో నాటుకుపోయింది. వాడప్పుడు విల-విల బోయి చేష్టలుడిగాడు. రామబాణంతో విలపించాడు. అప్పుడు ఒక ఆలోచనచేశాడు రావణుడు. రాముడు విల్లుచేతిలో లేని శత్రువును చంపడని భావించి నేలమీద తన విల్లుని విడిచాడు. వెంటనే యుద్ధ ధర్మాన్ని అనుసరించి రాముడు గొప్ప మనస్సుతో రావణుడి కిరీటాన్ని నేలపడగొట్టాడు. దాన్ని పడగొట్టిన బాణాన్ని కంఠానికి గురిపెట్టినయితే తల ఎగిరిపోయేది. వాస్తవానికి కిరీటం పోయింది అంటే ప్రభుత్వం పోయినట్లేకదా! కిరీటం పోయి, బడలికతో వున్న, కాంతిహీనుడైన రావణుడిని చూసి రామచంద్రమూర్తి వాడితో ఇలా అన్నాడు.

"నిశాచర రాజా! నిన్ను చంపడానికి సమ్మతించను. రాముడు నిరాయుధుడైన వాడిని, ఆయుధం వున్నా కాళ్లు-చేతులు కదిలించలేని వాడిని చంపడు సుమా! ఆ కారణాన నిన్ను కొట్టను. ఇప్పడు నువ్వేం చేయాలంటావా? నీకు అనుజ్ఞ ఇస్తున్నాను. నిర్భయంగా లంకకుపో. పోయి అలసట తీర్చుకుని మళ్లీ విల్లు బాణాలు తీసుకుని రథం మీద కూర్చుని నీ దగ్గర వున్న అస్త్రాలన్నీ  తీసుకునిరా. అప్పుడు నువ్వు నీ రథం మీదనుండి నా శౌర్యం చూస్తావు".

ఇలా చెప్పగా రావణుడు గర్వం పోయి సంతోషహీనుడయ్యాడు. విల్లు విరిగిపోగా, సూతుడు చావగా, గుర్రాలు మరణించగా, క్రూరమైన బాణాల దెబ్బలకు నొప్పులు పుట్టిన శరీరంతో, ప్రతాపం క్షయించగా రావణుడు లంకకు పోయాడు. రావణుడు సిగ్గుతో యుద్ధభూమిని విడిచిపోగా దేవతలు, అసురులు, భూతాలు, జలచరాలు, ఋషులు, సర్పాలు, దిక్పాలకులు అంతా మిక్కిలి సంతోషించారు.

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

No comments:

Post a Comment