Sunday, June 13, 2021

శ్రీరాముడిని పంపేందుకు నిరాకరించిన దశరథుడు ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-60 : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీరాముడిని పంపేందుకు నిరాకరించిన దశరథుడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-60

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (14-06-2021)

          ఒకవైపు రాముడిని పంపడం ఇష్టంలేదని చెప్తూనే, మరోవైపు యజ్ఞాన్ని విఘ్నం చేస్తున్న రాక్షసులగురించి తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నాడు దశరథుడు. విశ్వామిత్రుడి యజ్ఞాన్ని చెరపాలనుకొంటున్న రాక్షసులెవరనీ, వారెవరి కొడుకులనీ, ఎవరి ఆజ్ఞప్రకారం అలాచేస్తున్నారనీ, వారే విధంగా యుద్ధం చేస్తారనీ - అస్త్రాలతోనా - శస్త్రాలతోనా - ముఖాముఖిగా ఎదురుగావుండా - చాటునుండా, వారి బలమెంత, వారి ప్రమాణాలెంత, వారి పేర్లేంటి, వారి ప్రభువెవరు, శ్రీరాముడైనా - సేనలతో వచ్చిన తానైనా వారు చేసే క్రియకు ప్రతిక్రియ ఎట్లాచేయాలి అని అడుగుతాడు విశ్వామిత్రుడిని. జవాబుగా విశ్వామిత్రుడు: " దశరథా! నువ్వు కుబేరుడి తమ్ముడు - పులస్త్యుడిమనుమడు - విశ్రవసుడి కొడుకైన రావణుడి పేరు విన్నావుగా. వాడే బ్రహ్మవల్ల వరాలను పొందాడు - మిక్కిలి బలవంతుడు - పరాక్రమంకలవాడు - రాక్షససేనా సమూహాలతో కూడినవాడై మూడులోకాలను వణికిస్తూ, గడగడలాడిస్తున్నాడు. వాడు రాజైనందున అల్పకార్యాలను, అలక్ష్యంగా-స్వయంగా యజ్ఞాలను పాడుచేయడం లాంటివి చేయకూడదు. అవిచేసేందుకు వాడి మిత్రులను, సేవకులను పంపిస్తుంటాడు. అలా వాడి ఆజ్ఞప్రకారం తాటకకొడుకులైన ఇద్దరు రాక్షసులు వచ్చి యజ్ఞం కొనసాగకుండా విఘ్నం చేస్తున్నారు.

విశ్వామిత్రుడి నోట రావణుడి పేరు, తాటకీ పుత్రుల విషయం వినంగానే, దశరథుడు భయపడ్డాడు. విశ్వామిత్రుడు పాపరహితుడై, కళ్ళు తెరవని పసికందును - నోరెరుగని బాలుడిని, రాక్షసుల చేతిలో వేసే ఆలోచన ఎలాచేసాడని ప్రశ్నిస్తాడు. రాముడి సంగతటుంచి, ఆ పాపాత్ముల ఎదుట నిలువ బడడం తనలాంటి వాడికే సాధ్యంకాదే అంటాడు. తనపై దయతలిచి తన కుమారుడిని ఊపిరితో ఉండనివ్వమనీ, తనకిప్పుడు విశ్వామిత్రుడే దైవమనీ, తనకు బిడ్డలనిచ్చినవాడికంటే వారిని బ్రతకనిచ్చిన వాడే ప్రస్తుతం దైవ సమానుడని భావిస్తాననీ మరీ మరీ అంటాడు దశరథుడు. "మునీంద్రా! నువ్వే నా తండ్రివని - రక్షించమని నిన్నడుగుతున్నాను. పుత్రుడికి పుత్రశోకం కలిగించడం తండ్రికి తగదు. నేనెంత నిర్భాగ్యుడనో కనుకనే, ఏళ్ళబట్టి తపస్సుచేసి పొందిన కొడుకులను - ప్రయాస పొంది లభించిన కొడుకులను, కళ్ళు తెరచీ-తెరవకముందే రాక్షసుల పాలు చేయాల్సిన దురదృష్టం కలుగబోతోంది. యాచించడం నా కులవృత్తి, క్షత్రియ ధర్మం కాకపోయినా, వ్రతం చెడినా - ఫలితం దక్కాలన్న సామెత ప్రకారం, పుత్రబిక్షపెట్టమని ప్రార్థిస్తున్నాను. ఈ బాలుడిని నేను పంపించలేను - క్షమించు" అని మనసులో మాట చెప్తాడు.

"దేవ జాతులైన దేవతలు – కిన్నరులు – యక్షులు – కింపురుషులు - గంధర్వులు కూడా రావణుడితో యుద్ధంచేయలేరే! మనుష్యులకది సాధ్యమా? రావణుడు, వీరుడని చెప్పుకొనే ఎవర్నైనా, దర్పమణుస్తాడు. సేనలతో కానీ - వంటరిగాకానీ, వాడినెదిరించి యుద్ధంచేయలేను నేను. దేవతలకు అసాధ్యులై - ఎవరికీ అజేయులై మరణించిన వారైన సుందోపసుందుల కొడుకులు మారీచ-సుబాహువులు. వారు సామాన్యులు కారు-యముడితో సరితూగేవారు. మిక్కిలిబలశాలులు. వారిచేతికిచిక్కితే యముడివశమైనట్లే. వారు యుద్ధంలో ఆరితేరిన వారైతే, నాకొడుకేమో బాలుడు - గురిచూసి కొట్టలేడు. కాబట్టి, నేను వాడిని పంపలేను. వాళ్ళిదరిలో ఒకడితోనన్నా, నేను నా సేనలతో కలిసి యుద్ధంచేస్తాను" అని కొడుకుపై నున్న వాత్సల్యంతో దశరథుడు నిష్ప్రయోజనమైన మాటలు అనగానే, యజ్ఞంలోని అగ్నిలో నెయ్యిపోసినప్పుడు వచ్చేమంటల్లాగా - కంట్లోంచి నిప్పులు కురిపిస్తూ విశ్వామిత్రుడికి కోపమొచ్చింది.

No comments:

Post a Comment