Monday, June 7, 2021

పాండురంగ మహాత్మ్యం కథా సంగ్రహం : వనం జ్వాలా నరసింహారావు

 పాండురంగ మహాత్మ్యం కథా సంగ్రహం

వనం జ్వాలా నరసింహారావు

(గుంటి సుబ్రహ్మణ్యశర్మ వచన రచన ఆధారంగా)

భారతదేశంలో కాశీ గొప్ప పుణ్య క్షేత్రం. అది గొప్ప శైవ స్థలం. దాని సమీపంలో గంగానది పారుతుంటుంది. దానికి ఇరుపక్కలా మునీశ్వరులు ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని తపస్సు చేసుకుంటారు. వారిలో అగస్త్య మహర్షి ముఖ్యుడు. ఆయన భార్య మహా పతివ్రత లోపాముద్ర. ఇక అగస్త్యుడి గొప్పతనాన్ని పొగడడం ఎవరికీ సాధ్యం కాదు.

ఇలా వుండగా ఒకప్పుడు వింధ్య పర్వతానికి, మేరు పర్వతానికి ఎవరు ఎత్తైన వారని పోటీ వచ్చింది. వింధ్య పర్వతం ఆకాశమంత ఎత్తు పెరిగింది. సూర్యచంద్రుల చలనం అరికట్టబడింది. లోకాలు బతకడం కష్టమైపోయింది. వింధ్య పర్వతం గర్వం అణచడం ఎలాగా అని దేవతలు ఆలోచించారు. వారంతా అగస్త్యమునిని ప్రార్థించారు. అగస్త్యుడు భార్యాసమేతంగా, కొంతమంది శిష్యులతో సహా  దక్షిణాభిముఖుడై బయల్దేరాడు. అగస్త్యుడిని చూసిన వింధ్య పర్వతం భయపడి అణగిపోయింది. ఆ తరువాత లోపాముద్రతో కలిసి అగస్త్యుడు చాలా దూరం నడచి వెళ్లాడు. భార్య అలసట పోగొట్టడానికి ఆ ప్రాంతాలను వర్ణించి చెప్పసాగాడు అగస్త్యుడు.

కొన్నాళ్లకు తుంగభద్రానదిని సమీపించారు. ఆ నదిలో స్నానం చేశారు. జపానుష్టానాలను జరుపుకున్నారు. అక్కడి నుండి ముందుకు పోయి కుమారస్వామి వున్న కొండ ఎక్కారు. ఆయన్ను సేవించారు. ఆయన్ను అగస్త్యుడు స్తుతించాడు. కుమారస్వామి ద్వారా సమస్త క్షేత్ర మహాత్మ్యాలను తెలుసుకున్నాడు. దేవుడు, తీర్థము, క్షేత్రము ఒకే చోట కూడి వున్న ప్రదేశం ఏదైనా వున్నదా అని కుమారస్వామిని అడిగాడు అగస్త్యుడు. దీనికి సరైన సమాధానం చెప్పగలవాడు ఈశ్వరుడు తప్ప అన్యులు ఎవరూ లేరని కాబట్టి అందరం కలసి ఆయన దగ్గరికి పోయి ఆయన్ను దర్శించుకుని ఆయన్నే ప్రశ్నించుదామని అన్నాడు కుమారస్వామి. వెంటనే అంతా ప్రయాణమయ్యారు. వారికి పోను పోను అల్లంత దూరంలో కైలాసగిరి కనిపించింది. దాన్ని అధిరోహించారు కుమారస్వామి ఆయన వెంట వున్నవారు.      

ఆ సమయంలో ఉమాదేవి ఉద్యానవనంలో భర్త శివుడితో ఏకాంతంగా వున్నది. ఆమె అప్పుడు ఆయన పాదాలకు నమస్కారం చేసి క్షేత్ర, తీర్థ, దేవతాసమాగమ మొందిన పుణ్యస్థలం గురించి వివరించమని అడిగింది. జవాబు చెప్పబోయేటంతలో కుమారస్వామి వచ్చిన విషయం చెప్పారు ఆయనకు సేవకులు. కుమారస్వామి అగస్త్య సమేతంగా పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్నాడు. అంతా ఉచితాసనాలమీద కూచున్నారు. వారి రాకకు కారణం అడిగాడు శివుడు.

జవాబుగా కుమారస్వామి తండ్రికి నమస్కారం చేసి, క్షేత్ర దైవత తీర్థాలు మూడూ ప్రధానంగా వుండే స్థలాన్ని గురించి తెలియచేయమని అగస్త్య మునీంద్రుడు తనను అడిగాడని, ఆ విషయాన్ని తండ్రిగారి ద్వారా వినాలనుకుని అంతా ఇక్కడికి వచ్చామని, కాబట్టి అలాంటి భుక్తి, ముక్తి దాయకమైన గొప్ప క్షేత్రముంటే దాన్ని గురించి చెప్పమని కోరాడు. అతడి తల్లి పార్వతి కూడా ఆ ప్రశ్నే అడిగిందని అంటూ, విష్ణుమూర్తిని ధ్యానించి చెప్పడం మొదలుపెట్టాడు.

ఘర్మవీరానది భైమీనదిలో కలిసిన చోట దక్షిణ తీర్థాన కల తీర్థక్షేత్రాలు పౌండరీకాలని ప్రసిద్ధి చెందాయని, అక్కడ దేవదేవుడైన లక్ష్మీవల్లభుడు పాండురంగడు అన్న పేరుతో ప్రఖ్యాతిగాంచాడని, అదే కుమారస్వామి, అగస్త్యుడు అనుకుంటున్న ఉత్తమ స్థలం అని శివుడు చెప్పడం ప్రారంభించాడు. ద్వాపర యుగానంతరం పుండరీకుడు అనే ముని అక్కడ ఘోరమైన తపస్సు చేయగా శ్రీకృష్ణుడు అతడికి ప్రత్యక్షమయ్యాడు. అతడి కోరిక ఏమిటని అడిగాడు. భక్తపక్షపాతైన శ్రీకృష్ణుడు తన మనోహర రూపంతో ఎప్పుడూ అక్కడే వుండాలని, అక్కడి తీర్థక్షేత్రాలు తన పేరుమీద ప్రసిద్దమై వుండాలని వరాన్ని కోరాడు పుండరీకుడు. శ్రీకృష్ణుడు సమ్మతించి ఆ క్షేత్రాన్ని పౌండరీ క్షేత్రమని ప్రసిద్ధి చెందుతుందని చెప్పి తాను అక్కడే నిలిచి పోయాడు. ఆ క్షేత్రం లోకోత్తరమైనదని శివుడు చెప్పగా పుండరీకుడు గురించి మరింత వివరంగా చెప్పమని కోరాడు కుమారస్వామి. అలాగే అతడు కోరినట్లు చెప్పసాగాడు శివుడు.

పుండరీకుడు సామాన్యుడు కాడు. అతడు వివేకనిధి. గొప్ప బుద్ధికలవాడు. నిరంతరం విష్ణుమూర్తిని స్మరించేవాడు. ఆ లక్ష్మీనారాయణుడు నిరంతరం పుండరీకుడి హృదయ కమలాన కొలువై వుండేవాడు. పుండరీకుడు మాతాపితలను ప్రత్యక్ష దైవాలుగా భావించి వారంటే అమితమైన భక్తి భావం కలిగి వుండేవాడు. తల్లితండ్రులను ఇద్దరినీ భార్యాసమేతంగా సేవించేవాడు. అనునిత్యం దేవతార్చన చేసి భోజనాన్ని మొదలు తల్లితండ్రులకు పెట్టి తరువాత తాను, తన భార్య చేసేవారు. వారి మరణానంతరం వారికి గయలో పిండ ప్రదానం చేసి వారు పుణ్యలోకాలకు పోయేట్లు చేశాడు. ఆ తరువాత అణకువ కల కొడుకులను కని పితృదేవతల ఋణాన్ని తీర్చుకున్నాడు. చివరకు పుండరీకుడు అడవికి పోయి విష్ణుమూర్తినే నమ్మి ఘోరమైన తపస్సు చేశాడు.

పుండరీకుడు చేసిన తపస్సుకు మెచ్చి బాలకృష్ణ రూపంలో శ్రీమహావిష్ణువు ఆయనకు దర్శనం ఇచ్చాడు. ఇష్టమైన వరాలను కోరుకొమ్మని పుండరీకుడికి చెప్పాడు. శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ, పుండరీకుడు, ఆయన మనోహరమైన రూపంతో అక్కడే వుండమని, తన పేరుమీద ఆ క్షేత్రం ప్రసిద్ధి చెందాలని వరం కోరాడు. అలాగే వరం ఇచ్చాడు శ్రీకృష్ణుడు. ఇతర క్షేత్రాలలో పూజలు చేస్తే కలిగే పుణ్యం కంటే పౌండరీక క్షేత్రంలో చేసే పూజలు వేయిరెట్ల ఫలితాలను ఇస్తాయి. అక్కడ ఒక్క రోజుంటే చాలు, మోక్షం లభిస్తుంది. ఎంతో అదృష్టం ఉన్నవారికి మాత్రమె పాండురంగ క్షేత్ర నివాసం లభిస్తుంది.

ఇలా చెప్పిన శివుడు, మంత్రపూర్వక స్నానం చేసిన తరువాత పాండురంగడిని పూజించాలన్నాడు. ఒక్కో ఋతువులో ఒక్కో విధంగా అక్కడున్న శ్రీకృష్ణుడిని పూజించాలని చెప్పాడు. పాండురంగడి విగ్రహం చుట్టూ కల 25 మూరల ప్రదేశంలో ఎక్కడ పూజించినా అది అతడి క్షేత్రమూర్తిని పూజించినట్లే అవుతుంది. పాండురంగడికి పడమటి దిక్కున పద్మ తీర్థం వున్నది. అక్కడే నరనారాయణులున్నారు. ఈ శాన్య దిశలో కుండల తీర్థం వున్నది. అక్కడ నరసింహుడు 32 చేతులతో వున్నాడు. అక్కడే అనేక తీర్థాలున్నాయి.

పరమ శివుడు ఈ విధంగా పౌండరీక క్షేత్రాన్ని గురించి చెప్పిన తరువాత కుమారస్వామి అగస్త్యాది మునులతో కూడి మరలి పోతుండగా శివుడి దగ్గరికి వస్తున్న నారదుడు వారిని చూశాడు. వారెందుకు వచ్చారని శివుడిని అడిగాడు నారదుడు. విషయాన్ని చెప్పాడు శివుడు. ఆ విషయాన్ని తనకు కూడా సవివరంగా చెప్పమని కోరాడు నారదుడు. అవన్నీ మళ్లీ చెప్పిన శివుడు అక్కడి నరసింహ క్షేత్రం గొప్పదనాన్ని తెలియచేస్తూ ఒక ఇతిహాసాన్ని చెప్పాడు.

కళింగ దేశాభరణం అయిన పిఠాపురంలో ఒక బ్రాహ్మణ శ్రేష్టుడు వుండేవాడు. అతడికి ఒక కొడుకు కలిగాడు. అతడి పేరు నిగమశర్మ. మన్మథాకారుడు. విద్వాంసుడైనప్పటికీ పోకిరీగా నగరంలో తిరిగేవాడు. యువతులను అనుభవించేవాడు. వాడికి భార్య అంటే పరమ అసహ్యం. వేశ్యలంటే పరమ ప్రేమ. తాతతండ్రులు ఇచ్చిన ఆస్తిని నాశనం చేశాడు. వీడి గతేమి కానున్నదో అని ప్రజలు ఆశ్చర్యపడేవారు. చివరకు ఉన్నదంతా పోయిన తరువాత నిగమశర్మ అవమానాల పాలయ్యాడు.

ఇదిలా వుండగా సమీప గ్రామంలో వున్న నిగమశర్మ జ్యేష్ట సోదరి ఒకనాడు వచ్చి ఇంటిని చక్కబరిచింది. ఎక్కడికో పోయిన నిగమశర్మ ఇంటికి వచ్చాడు. అతడికి సకల విధాలైన మర్యాదలు చేయించింది సోదరి. కాసేపు కఠినంగా, కాసేపు అనునయంగా మాట్లాడింది. తమ్ముడి సంసార బరువు బాధ్యతలు గుర్తు చేసింది. నిగమశర్మ ఆమె మాటలకు సద్బుద్ధితో ఆదరించాడు. ఇంట్లో సుఖంగా వుండసాగాడు. పూజాపునస్కారాలు చేయసాగాడు. భార్యను గౌరవించసాగాడు. అవన్నీ కపట బుద్ధితో చేస్తున్న సంగతి ఎవరికీ తెలియదు. ఒకనాడు అక్కవి, భార్యవి నగలు అపహరించి పారిపోయాడు. అలాపోతూ ఒక కారడివిలో ప్రవేశించాడు. దొంగలు అడ్డుకొని ఆయన దగ్గరున్న బంగారాన్ని అపహరించి, అతడిని గాయపరచి పోయారు.

అప్పుడు ఒక కాపువాడు నిగమశర్మను చూసి తన ఇంటికి తీసుకునిపోయాడు. పెక్కు రీతుల సేవ చేశారు. చికిత్స చేశారు. అతడు బతికి బయట పడి పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. ఆ ఇంటి కోడలికి నిగమశర్మ మీద మనసు పడింది. తనకు మేలు చేసిన కాపువాడికే ద్రోహం చేయడానికి పూనుకున్నాడు నిగమశర్మ. కోడలితో కామక్రీడలు సలపసగాడు. కాపు యువతిని ఎక్కడికైనా ఎత్తుకుపోవాలని సమయం కోసం ఎదురు చూడసాగాడు. అదే రోజుల్లో రాజుగారు జాతర చాటించడం, అదే అదనుగా కోడలిని తీసుకుని నిగమశర్మ దేశాంతరం పోవడం జరిగింది. ఇరువురూ భయంతో, వేగిరపాటుతో ప్రయాణం చేస్తూ ఒక భయంకరమైన అడవిని ప్రవేశించారు. అక్కడున్న ఒక బోయపల్లెను చేరారు. బోయవారితో కలిసిపోయారు. కులభ్రష్టులయ్యారు ఇద్దరూ. కొంత కాలానికి ఆ కాపు వనిత పరలోకానికి పోయింది.

ఆ తరువాత ఒక మాలపడుచును ప్రేమించి, ఆమెతో వుండడం ప్రారంభించాడు నిగమశర్మ. ఆ జంటకు ఇద్దరు కొడుకులు కలిగారు. ఒకనాడు నిగమశర్మ అడవికి పోయిన సమయంలో గుడిసెలో వున్న అతడి ప్రేయసి, కొడుకులు, ఆకస్మికంగా గుడిసెకు నిప్పు అంటుకొనడం వల్ల అందులో పడి కాలిపోయారు. ఇంటికి వచ్చి ఇది గమనించిన నిగమశర్మ అమితంగా దుఃఖించాడు. అలా దుఃఖిస్తూ దైవ యోగం వల్ల, ఎక్కడైతే హిరణ్యకశిపుడిని నరసింహస్వామి చీల్చి చంపాడో అక్కడికి వచ్చాడు. పూర్వజన్మ సుకృతం వల్ల ఆ పుణ్యతీర్థంలో స్నానం చేసి నరసింహస్వామిని దర్శించాడు. స్వామి ఎదురుగుండా చనిపోయిన భార్యను తలచుకుంటూ విపరీతంగా దుఃఖపడ్డాడు. అలా చాలా రోజులు గడిచాక నిగమశర్మ దుర్బలుడై ప్రాణాలు కోల్పోయాడు.

యమకింకరులు అతడిని పాశాలతో బంధించి పలురకాలుగా బాధించారు. నిగమశర్మ పెద్దగా అరిచాడు. అతడి మొర ఆలకించిన విష్ణు చక్రం యమదూతలను తరిమేసింది. విష్ణు దూతలు నిగమశర్మను శ్వేత ద్వీపానికి గరుడ వాహనం మీద తీసుకుపోయారు. భూలోకంలో వున్నప్పుడు మహాపాపైనప్పటికీ నరసింహ క్షేత్రంలో మరణించిన కారణాన అతడికి ఉత్తమ గతి కలిగింది. ఇలా నరసింహ క్షేత్ర గొప్పదనాన్ని చెప్పిన శివుడు తాను ఆ క్షేత్రానికి దక్షిణ భాగాన పార్వతితో సహా నివసించి వుంటానని, మహాపాపులైనా అక్కడ మరణిస్తే ఇంద్రపదవిని పొందగలరని అన్నాడు. ఆ తరువాత నారదుడి కోరిక మేరకు మరిన్ని వివరాలను చెప్పాడు.

నృసింహ క్షేత్రం దగ్గరనే పౌండరీక క్షేత్రం వున్నదని, ఆ క్షేత్రం మధ్యలో శ్రీకృష్ణుడు పాండురంగడు అనే పేరుతో వెలిసాడని, దానికి కారణం చెప్పాడు. పూర్వం పుండరీకుడు అనే మహాముని అక్కడ ఘోరమైన తపస్సు చేశాడు. అదే సమయంలో భూదేవి కోరిక మేరకు భూభారాన్ని మాన్పించడానికి శ్రీహరి యాదవ కులంలో దేవకీ-వసుదేవులకు కృష్ణుడుగా పుట్టాడు. శతగోపుడి కూతురుగా బ్రహ్మ పంపిన శక్తి రాధ పుట్టింది. రాధాకృష్ణులలో పరస్పర ప్రేమ అంకురించింది. మాధవుడే తనకు భర్త కావాలని రాధ తపస్సు చేయసాగింది. రాధకు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమెను తన అర్థాంగిగా చేసుకొని సంతోషించాడు. ఇరువురూ సమస్త భోగాలను అనుభవించారు.

ఇదిలా వుండగా తపస్సు చేస్తున్న పుండరీకుడికి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఆయన అభీష్టం ఏమిటో చెప్పమని అడిగాడు. హరిమీద భక్తిని, ధర్మ మార్గాన్ని వీడనట్టి బుద్ధిని ప్రసాదించమని కోరాడు పుండరీకుడు. అలాగే వరమిచ్చాడు బ్రహ్మ. ఆ తరువాత మూడవనాడు శ్రీకృష్ణుడు ఐదేళ్ల వయసువాడై ప్రత్యక్షమయ్యాడు. ఆయన్ను పలురకాలుగా స్తుతించాడు పుండరీకుడు. ఏం వరం కావాలో కోరుకొమ్మన్నాడు శ్రీకృష్ణుడు. ఆయన తనకు దర్శనమిచ్చిన ఆకారంలోనే ఆ పుణ్య క్షేత్రంలో నిలిచి సకల జనులకు మోక్షరాజ్యాన్ని ఇవ్వమని కోరాడు పుండరీకుడు. అలాగే అనుగ్రహించానన్నాడు శ్రీకృష్ణుడు. ఇక నుండి అదే తన శ్వేత ద్వీపమని, భక్తుల కోరికలు తీర్చడానికి తాను అక్కడే వుంటానని అన్నాడు. దేవతలంతా విష్ణుదేవుడి దయకు ఆశ్చర్యపడి ఆయన్ను, పుండరీకుడిని పొగిడారు. ఎవరు పుండరీక తీర్థంలో స్నానం చేసి శ్రీకృష్ణ పరమాత్మను అర్చిస్తారో వారు శాశ్వతజ్ఞాన సంతోషాలతో కూడి వుంటారని శివుడు నారదుడికి చెప్పాడు. పౌండరీక తీర్థంలో హరిమూర్తిని సేవిస్తే సర్వవిధ పాపాలనుండి విముక్తి పొంది దివ్యపదము పొందగలరన్నాడు.

గోవు, కాకి, హంస, చిలుక, పాము, తేనెటీగ ఆదేవుడిని సేవించి ఉత్తమ జన్మలను పొంది ముక్తి పొందిన విషయాన్ని కూడా శివుడు వివరించాడు.

ఒకనాడు శ్రీకృష్ణుడు రాసక్రీడ సల్పుతూ మురళి వాయిస్తుండగా ఒక హోమధేనువు పాలు కురిపించింది. గాలికి ఆ పాలనురుగు బిందువు ఒకటి వచ్చి కృష్ణుడి తలమీద పడింది. ఆ పుణ్య విశేషం వల్ల ఆ గోవు చనిపోయిన తరువాత ఒక వైష్ణవ భక్తుడికి సుశీల అనే పేరుతో కూతురుగా జన్మించింది. భర్త తిట్టినా, కొట్టినా భూదేవికి వున్నంత ఓర్పుతో వుండేది. మగడు పెట్టే బాధలన్నిటినీ సహించేది. ఇలా వుండగా వారింటికి ఒకనాడు ఒక కపట బ్రహ్మచారి భోజనం కోసం వచ్చాడు. తనకు ఆకలిగా వున్నదని ఏదుంటే అది పెట్టమని అడిగాడు బ్రహ్మచారి. అలా పెట్టితే తనకు పాపం తగులుతుందని ఆమె భావించింది. చివరకు అతడి కోరిక కాదనలేక ఇంట్లో వున్న చల్ది అన్నాన్ని పెట్టింది. ఆమె పెట్టింది తిని ఇంకా-ఇంకా కావాలన్నాడు. భర్త తెచ్చుకున్న చక్కర పాకం అప్పాలు కూడా పెట్టింది. అయినా సంతృప్తి చెందలేదు అతడు. సుశీల అగ్నిహోత్రుడిని ప్రార్థించగా ఆయన అనుగ్రహించి రకరకాల వంటకాలు సమకూర్చాడు.

అప్పుడు కపట బ్రహ్మచారి కృష్ణుడి వేషంలో కనిపించి, సుశీలను పరీక్షించడానికి అలా చేశానని చెప్పాడు. తన పరీక్షలో ఆమె నెగ్గిందని అన్నాడు. ఆ రోజు నుండి ఆమె భర్త మంచివాడుగా మారుతాడని, వారికి ఐశ్వర్యం చేకూరుతుందని, ఆమె నూరేళ్లు భూలోకంలో జీవించి భర్తతో కూడి వైకుంఠానికి చేరుతుందని చెప్పాడు. ఆ విధంగా విష్ణుమూర్తి వరమిచ్చి అదృశ్యమయ్యాడు. ఆయన చెప్పినట్లే సుశీల, ఆమె భర్త విష్ణువు మీద భక్తి కలవారై ఎన్నో వ్రతాలను చేసి సుఖపడ్డారు. వైకుంఠానికి చేరారు.  

ఇదిలా వుండగా ఒక కాకి పాండురంగ క్షేత్రంలో విష్ణు దేవుడి గుడి ఎదుట వున్న ఒక రావి చెట్టుమీద గూడు కట్టుకొని నివసిస్తూ వున్నది. ఒకనాడు ఆ కాకి పాండురంగడి దేవాలయం వాకిట బలిపీఠం మీదున్న మెతుకులు తినడానికి రివ్వున ఎగిరి రాగా దాని వెడల్పు రెక్కల వల్ల పుట్టిన పెనుగాలికి అక్కడున్న దుమ్ము కొట్టుకొని పోయింది. అందువల్ల  ఆ కాకికి వూడవడం వల్ల అనంత పుణ్యరాశి కలిగింది. పుణ్యలోక ప్రాప్తి కలిగింది.

శ్రీకృష్ణుడి దేవాలయంలో ఒక కలహంస నివసిస్తూ వుండేది. ఒకనాడు అది నీటిలో స్నానం చేసి మధ్యాహ్నపు ఎండకు తాళలేక గర్భగుడిలో ప్రవేశించింది. అది రెక్కలను విదిలించగా అందువల్ల కలిగిన నీటి తుంపరలు నేలమీది దుమ్ము దుమారం దూరం చేయడంతో ఆ స్థలం చల్లబడింది. హంస అలా చేయడం వల్ల శ్రీకృష్ణుడి గర్భాలయం అలకడం వల్ల కలిగే సుకృతం దానికి కలిగింది. అలాగే చిలుక, పాము, తేనెటీగ ఏవిధంగా సుకృతం పొందింది వివరించాడు శివుడు.

ఇలా పాండురంగక్షేత్ర మహాత్మ్యాన్ని గురించి శివుడి ద్వారా విన్నాడు నారదుడు. ఈశ్వరుడికి నారద మునీంద్రుడు నమస్కారం చేసి, పార్వతీదేవికి ప్రదక్షిణ నమస్కారం చేసి, పౌండరీక క్షేత్రానికి వెళ్లి భైమిలో తీర్థమాడి, విష్ణువును పూజించి వెళ్లిపోయాడు. పాండురంగ విఠలుడిని భజించితే ఎలాంటి పాపాత్ములైనా మనశ్శాంతి పొందగలరు.       

No comments:

Post a Comment