Saturday, August 21, 2021

శ్రీ మదాంధ్ర మహాభారతంలో వాల్మీకి రామాయణం-3 ...... వారధి నిర్మాణం, రామరావణ యుద్ధం, శ్రీరాముడి విజయం-పట్టాభిషేకం ..... ఆస్వాదన-34 : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీ మదాంధ్ర మహాభారతంలో వాల్మీకి రామాయణం-3

వారధి నిర్మాణం, రామరావణ యుద్ధం, శ్రీరాముడి విజయం-పట్టాభిషేకం

ఆస్వాదన-34

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధంమ్ (22-08-2021)

శ్రీరాముడు లంకమీదకు దండయాత్రకు బయల్దేరగానే వాయునందనుడైన హనుమంతుడు ఆ కోతుల సేనలకు మార్గదర్శకుడై నాయకత్వం వహించి ముందు నిలిచాడు. సైన్యంతో సహా శ్రీరాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, అంగదుడు, నలుడు, నీలుడు మున్నగు యోధులు దక్షిణ సముద్ర తీరాన్ని చేరారు. అప్పుడు సుగ్రీవుడితో శ్రీరాముడు సముద్రాన్ని దాటే ఉపాయం చేయమన్నాడు. వానరనాయకులు రకరకాల ఆలోచనలు చెప్పారు కాని అవి ఏవీ సాధ్యపడేవి కావని అన్నాడు శ్రీరాముడు. తాను ఆహారం విసర్జించి ఉపవాస వ్రతంతో సముద్రుడిని ఆరాదిస్తానని, దారి ఇవ్వమని ప్రార్థిస్తానని, ఆయన అంగీకరించకపోతే సాత్త్విక పధ్ధతి విడనాడి రాజసపద్ధతిన తన బాణాగ్నితో సముద్ర జలాలను ఇంకింప చేస్తానని అన్నాడు శ్రీరాముడు. ఇలా చెప్పి రామలక్ష్మణులు నిరాహార దీక్ష పూని దర్భలమీద పడుకొని సముద్రుడిని ఆరాధించారు.

సముద్రుడు ప్రత్యక్షమై పదిమందికి తెలిసే విధంగా దారి ఇవ్వడం సమంజసం కాదని చెప్పి, ఒక ఉపాయం సూచించాడు. వానరసేనలలో నలుడనే పేరుకల శిల్పకళావేత్త ఉన్నాడని, అతడు విశ్వకర్మ కొడుకని, అతడు సముద్రంలో చెట్లు, చేమలు, కొండలు వేస్తే వారధిగా ఉపయోగపడుతుందని, ఆ వారధి మీద పయనించి వానరసేన సముద్రాన్ని దాటి శత్రువులను గెల్వవచ్చని చెప్పాడు. శ్రీరాముడు నలుడుని పిలిచి వారధి కట్టడానికి నియమించాడు. వానరవీరులు నలుదిక్కుల నుండి తెచ్చి ఇచ్చిన పర్వత శిఖరాలను నలుడు సముద్రంలో వేసి, వంద ఆమడల పొడవు, పది ఆమడల వెడల్పు గల గట్టి వారధిని నిర్మించాడు. సరిగ్గా అదే సమయంలో రావణాసురుడి తమ్ముడు విభీషణుడు అన్నమీద ఆగ్రహించి లంకను వీడి వచ్చి, శ్రీరాముడి శరణు కోరాడు. శ్రీరాముడు అతడికి అభయప్రదానం చేశాడు. విభీషణుడిని లంకకు పట్టాభిషిక్తుడిని చేస్తానని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేశాడు.

వానరసేనతో, విభీషణుడు మార్గదర్శకుడుగా సేతుమార్గాన శ్రీరామలక్ష్మణులు సముద్రాన్ని దాటారు. త్రికూట పర్వతాన్ని అధిరోహించారు. శిబిరాలను నిర్మించుకున్నారు వానర నాయకులు. వానరసేనల విషయం తెలుసుకోవడానికి వచ్చిన రావణాసురుడి గూఢచారులు శుకసారణులను గుర్తించి విభీషణుడు రాముడికి అప్పచెప్పాడు. రాముడు వారిని విడిచి పెట్టాడు. వారు వెళ్లి రామలక్ష్మణుల యుద్ధ సన్నాహాలను రావణాసురుడికి విపులంగా వివరించి చెప్పారు. లంకకు పూర్తి రక్షణ కలిపించాడు రావణుడు. శ్రీరాముడు అంగదుడిని రావణుడి దగ్గరికి రాయభారిగా పంపాడు. సీతను వదలడం మంచిదని రాముడి మాటలుగా హితవు చెప్పాడు అంగదుడు రావణాసురుడికి. రావణుడు చేసిన తప్పులన్నీ ఎత్తి చూపాడు. తనను శరణు వేడమని, సీతను అప్పగించమని రాముడు చెప్పినట్లు చెప్పాడు.

అంగదుడి మాటలకు రావణుడికి కోపం వచ్చింది. బంధించాలనుకున్నాడు. కాని అతడికి చిక్కకుండా అంగదుడు ఎగిరిపోయాడు. శ్రీరాముడి దగ్గరికి పోయి తాను నిర్వహించిన రాయభారాన్ని గురించి చెప్పాడు అంగదుడు.  ఆ తరువాత కపివీరులు యుద్ధానికి బయల్దేరారు. లంక కోట వద్దకు చేరి రాక్షసులను పారద్రోలారు. సమస్తం ధ్వంసం చేశారక్కడ. లంకను ఆక్రమించుకునే ప్రయత్నంలో వానరులకు, రాక్షసులకు మధ్య భీకరమైన యుద్ధం చోటు చేసుకున్నది. ఇంతలో రామలక్షణులు యుద్ధానికి ఉపక్రమించారు. రాక్షసులు కాసేపు మాయా యుద్ధం చేసి వానరులను బాధించారు. విభీషణుడు కూడా యుద్ధానికి దిగాడు. అతడి ధాటికి రాక్షస సేన సగం మంది చావగా, మిగిలిన సగం మంది పారిపోయారు. ఇది విని రావణుడు రణరంగానికి బయల్దేరాడు. యుద్ధంలో రాముడు రావణుడిని ఎదుర్కొన్నాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తును, సుగ్రీవుడు విరూపాక్షుడిని ఎదుర్కొన్నారు. ఇరుపక్షాల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది.

రావణుడు యుద్ధంలో శ్రీరాముడి ధాటికి ఓర్వలేక రణరంగం వదిలి లంకానగారానికి వెళ్లాడు. ప్రహస్తుడు మాత్రం యుద్ధం కొనసాగించాడు. వాడిని విభీషణుడు డీకొన్నాడు. విభీషణుడు ‘శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించి ప్రహస్తుడిని చంపాడు. అప్పుడు యుద్ధానికి ధూమ్రాక్షుడు వచ్చాడు రావణుడి పక్షాన. హనుమంతుడు అతడిని ఎదుర్కొని భీకరంగా ద్వంద్వ యుద్ధం చేసి సంహరించాడు. అప్పుడు రావణుడి ఆజ్ఞానుసారం ఆయన తమ్ముడు కుంభకర్ణుడిని గాఢనిద్ర నుండి మేలుకొల్పారు రాక్షస భటులు. విషయం విన్న కుంభకర్ణుడు యుద్ధానికి బయల్దేరాడు. యుద్ధ రంగంలో రామలక్ష్మణులు వున్న దిక్కుకు పోయి విజృంభించి యుద్ధం చేయసాగాడు. అనేక మంది వానర వీరులను చంపాడు. తనమీదకు యుద్ధానికి వచ్చిన సుగ్రీవుడిని పట్టుకున్నాడు. అది చూసి లక్ష్మణుడు కుంభకర్ణుడిని గొప్ప బాణంతో గట్టిగా కొట్టాడు. ఆ తరువాత బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి కుంభకర్ణుడిని సంహరించాడు.

కుంభకర్ణుడి మరణవార్త విన్న రావణుడు తన కొడుకైన ఇంద్రజిత్తును అతడి కోరికమీద యుద్ధానికి పంపాడు. అతడిమీడికి లక్ష్మణుడు యుద్ధానికి దిగాడు. వారిద్దరూ ముల్లోకాలు భీతి చెందే విధంగా భయంకరమైన యుద్ధం చేశారు. కాసేపు అంగదుడు లక్ష్మణుడికి సాయంగా వచ్చాడు. ఇలా కాదనుకొని ఇంద్రజిత్తు ఆదృశ్యమై ఆకాశానికి ఎగిరిపోయాడు. మబ్బుల చాటునుండి మాయా యుద్ధం చేయసాగాడు. అప్పుడు రామలక్ష్మణులు శబ్దభేది బాణాలను ప్రయోగించి, ఇంద్రజిత్తును కొట్టారు. ఇంద్రజిత్తు బాణాలకు రామలక్ష్మణులు మూర్చపోయారు. అప్పుడు ఇంద్రజిత్తు సింహనాదం చేశాడు. రామలక్ష్మణులను నాగాస్త్రంతో బంధించాడు ఇంద్రజిత్తు. ఇది చూసి, విభీషణుడు అక్కడికి వచ్చి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి రామలక్ష్మణులను నాగపాశ బంధవిముక్తులను చేశాడు. సుగ్రీవుడు విశల్యకరణి అనే ఔషధంతో రామలక్ష్మణుల దేహబాధ తొలగించాడు. విభీషణుడు ఇచ్చిన దివ్యజలాలను కళ్లకు రాసుకున్నారు రామలక్ష్మణులు.

ఆకాశంలో తిరుగుతున్న ఇంద్రజిత్తును స్పష్టంగా చూడగలిగారు రామలక్ష్మణులు. అభిచార హోమం చేయడానికి వెళ్తున్న ఇంద్రజిత్తుమీద, విభీషణుడి సూచన మేరకు లక్ష్మణుడు బాణాలను ప్రయోగించాడు. ఇద్దరి మధ్యా యుద్ధం జరిగింది మరోమారు. చివరకు ఇంద్రజిత్తు శిరస్సును లక్ష్మణుడు నరికాడు. రావణుడు పుత్రశోకాన్ని భరించలేక అశోకవనానికి పోయి సీతను సంహరించడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు అవింధ్యుడు అనే రాక్షసుడు అడ్డుకున్నాడు. స్త్రీహత్యా ప్రయత్నం తప్పని వారించాడు. ఆ తరువాత రావణుడు యుద్ధ రంగానికి వెళ్లాడు. భీకరమైన యుద్ధం జరిగింది. అప్పుడు దేవేంద్రుడి ఆజ్ఞానుసారం ఆయన సారథి మాతలి ‘వైజయంతి అనే దివ్యరథాన్ని తేగా, శ్రీరాముడు దాన్ని అధిరోహించి యుద్ధం చేశాడు. యుద్ధంలో రావణుడు విజృంభించి పోరాడాడు. చివరకు శ్రీరాముడు బ్రహ్మాస్త్రాన్ని సంధించి ఒక్క త్రుటిలో రావణుడిని సంహరించాడు. ఇంద్రాది దేవతలు, గంధర్వులు, కిన్నరులు సంతోషించారు. ముల్లోకాలు పండుగ జరుపుకున్నాయి.

శ్రీరాముడు లంకకు వచ్చి విభీషణుడికి పట్టం కట్టాడు. అవింధ్యుడుతో కలిసి విభీషణుడు సీతను తీసుకువచ్చి శ్రీరాముడికి సగౌరవంగా సమర్పించారు. అప్పుడు శ్రీరాముడు కఠినాత్ముడై, సీతాదేవి చెడునడవడి కల రావణుడి గృహంలో ఉన్నందున తాను స్వీకరించలేనని చెప్పి, ఆమె ఇష్టం వచ్చిన స్థలానికి పొమ్మన్నాడు. సీత అగ్నిప్రవేశం చేస్తానన్నది. అప్పుడు పంచభూతాలు, జనకుడి కూతురైన సీతాదేవి ఉత్తమురాలని, మహాపతివ్రత అని ముక్తకంఠంతో చెప్పాయి. బ్రహ్మదేవుడు కూడా వచ్చి సీతలో ఏ దోషం లేదని చెప్పాడు. ఎలాంటి సంకోచం లేకుండా సీతను అయోధ్యానగరానికి తీసుకుపొమ్మని అన్నాడు. యుద్ధంలో చనిపోయిన వానరులందరినీ బతికించాడు. మాతలి ఇంద్రలోకానికి వెళ్లిపోయాడు.

శ్రీరాముడు సతీసమేతంగా పుష్పక విమానం ఎక్కి అయోధ్యానగరానికి వెళ్లాడు. రాముడి తమ్ముడు భరతుడు సంతోషించాడు. వశిష్ట వామదేవులు ఒక శుభలగ్నంలో శ్రీరామ పట్టాభిషేకం జరిపారు. ఆ తరువాత శ్రీరాముడు అనేక వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసి, భోగ భాగ్యాలను అనుభవించి, వైకుంఠం చేరారు.

మార్కండేయుడు చెప్పిన రామాయణ కథ విని ధర్మరాజు శ్రీరాముడి పరాక్రమాన్ని, సీతాదేవి పాతివ్రత్యాన్ని మెచ్చుకుని, ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు.  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, అరణ్యపర్వం, సప్తమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment