Sunday, August 1, 2021

తాటకను వధించిన శ్రీరాముడు ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-67 : వనం జ్వాలా నరసింహారావు

 

తాటకను వధించిన శ్రీరాముడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-67

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (02-08-2021)

విశ్వామిత్రుడు చెప్పిన మాటలన్నీ గొప్ప విషయాలను బోధించేవిగాను-యుక్తి యుక్తంగాను వుండడంతో, రామచంద్రమూర్తి తనలో తానే ఆలోచించాడు కొంత సేపు. " స్త్రీ వధ పాపం అనిపిస్తుంది. గురువైన విశ్వామిత్రుడేమో అధర్మ ప్రవర్తైన తాటకను చంపడం పాపం కాదంటున్నాడు. ఆయనెందుకు అసత్యం చెప్పి తనతో అధర్మ కార్యం చేయిస్తాడు? ఏదేమైనా, ఈ ధర్మ-అధర్మ విచారం తో నాకు పనిలేదు. నిండు సభలో తన తండ్రి విశ్వామిత్రుడు చెప్పిన పనులన్నీ చేయమని చెప్పాడు తనతో. జనకుడు ఆజ్ఞ జవదాటకూడదు. గౌరవించాలి. కాబట్తి ధర్మమో - అధర్మమో మునీంద్రుడి ఇష్టప్రకారం నడచుకుంటాను" అని నిర్ణయించుకుంటాడు.

తండ్రి ఆజ్ఞ ప్రకారం బ్రహ్మ సమానుడైన ఈ బ్రహ్మవాది ఆజ్ఞ నెరవేరుద్దామని అనుకుంటాడు రాముడు. "అలా చేస్తే, గురువు ఆజ్ఞ - జనకుడి ఆజ్ఞ, రెండూ నెరవేర్చిన వాడినవుతాను. కేవలం దయా గుణంతో కార్యం నెరవేర్చకపోతే, ఇరువురి ఆజ్ఞ మీరినవాడినవుతాను. కాబట్టి ఇక సందేహించాల్సిన పనిలేదు" అని నిశ్చయించుకున్న రాముడు, విశ్వామిత్రుడిని చూసి, చేతులెత్తి నమస్కరించి " మునీంద్రా ! బ్రాహ్మణులు, గోవులు, దేశాలు సుఖపడేందుకు నీ ఆజ్ఞ ప్రకారం తాటక ను చంపుతాను" అంటూ, దిక్కులు వూగే ధ్వని వచ్చే విధంగా తన అల్లె తాడును లాగాడు. చెవులు పగిలి పోయేటట్లు వచ్చిన ఆ ధ్వనిని విన్న తాటక, హుంకారాలతో - భూమి, దిక్కులు పగిలిపోయే విధంగా గర్జిస్తూ,  రాముడి అల్లె త్రాటి ధ్వని వచ్చిన దిక్కును పసిగట్టి, దబ్బు -దబ్బు అని ధ్వని చేసుకుంటూ, పాదాలు నేలపై కొట్టుకుంటూ, భయంకరాకారంతో వీరున్నవైపు రాసాగింది.

దాన్ని గమనించిన రాముడు లక్ష్మణుడితో అంటాడీవిధంగా: " తమ్ముడా, లక్ష్మణా ! ఈ రాక్షసి ఎలా వికార వేషంతో, భయంకర దేహంతో, దిగులు పుట్టే ధ్వని చేస్తుందో చూశావా? భయంకరమైన దీని రూపం చూసినంతనే ఎంతటి ధీరులైనా గుండెలు బద్దలై పోయి వెంటనే చావరా? కేవలం దేహ బలం మాత్రమే కాకుండా, అసమానమైన మాయా విద్యకూడా దీనికొచ్చు. ఎవరికైనా దీన్ని జయించడం సులభం కాదు. విశ్వామిత్రుడు సత్యమే చెప్పాడు. దీన్నెవరూ జయించ లేకపోవడం నిజమే. నేనే దీన్ని చంపాలి. కాకపోతే, స్త్రీ ని ఎట్లా చంపాలన్న కరుణ నన్ను పీడిస్తున్నది. అందుకే దీన్ని చంపకుండా, ముక్కు-చెవులు కోసి, గమన వేగాన్ని అణచివేసి, వెనక్కు తిరిగి పోయేటట్లు చేస్తాను. దాంతో భయం కలిగి చెడ్డ పనులు చేయదు" అని అంటుండగానే, ఆ రాక్షసి చేతులు పైకెత్తి హూంకరిస్తూ, రాముడి మీద పడబోయింది. ఎప్పుడైతే తాటక భయంకర ఆకారంతో రాముడి పై పడబోయిందో, అప్పుడే విశ్వామిత్రుడు, హుంకారంతో అదిలించి, "రామభద్రుడికి జయం-జయం" అని దీవించాడు. తాటక కూడా దూరం నుండే రాముడిపై గాలి వాన కురిపించింది. నివ్వెరపడ్డ రాముడు ప్రతిగా ఏం చేద్దామని ఆలోచిస్తుండగానే, తాటక మాయతో రామ లక్ష్మణులమీద రివ్వు-రివ్వున, ధారలు-ధారలుగా, రాళ్లవాన విరామం లేకుండా కురిపించింది. దాని చేష్టలకు కోపించిన రాముడు బాణాలను కురిపించి తాటక రెండు చేతులను నరికివేశాడు. దానిని చంపనని - ముక్కు చెవులు మాత్రమే కోస్తానని అన్న చెప్పిన మాటలు జ్ఞప్తికి తెచ్చుకున్న లక్ష్మణుడు, ఆ పనిని తానే చేయదలిచి, దాని పైకి దూకి, దాని ముక్కు చెవులు ఖండిస్తాడు. అంతమాత్రాన అది వెనుకంజ వేయకుండా, విజృంభించి - నానా రూపాలు ధరించి - కళ్ళకు కనిపించకుండా - మాయలతో - మతి భ్రమణం కలిగించే రీతిలో విపరీతంగా రాళ్ల వాన కురిపిస్తూ ఎదిరించసాగింది.

తాటక విక్రమాన్ని-వేగాన్ని గమనించిన విశ్వామిత్రుడు రాముడి మనసులోని ఆలోచనను తెలుసుకున్నవాడివలె, "రామా ! దీని పై దయతల్చి చంపకుండా వూరుకుని, తరిమి కొట్టుదా మనుకుంటున్నావు. అదట్లా పారిపోయేది కాదు. చెడు నడవడి కలది. విస్తార పరాక్రమం కలది. యజ్ఞాలు నాశనం చేసే శక్తిగలది. దీన్ని చంపటంలో ఆలశ్యం చేస్తే, సంధ్య వేళైతే, ఇక చంపడం అసాధ్యం" అని హెచ్చరిస్తాడు. ఆయనలా అంటుండగానే, తాటక రాళ్లవాన కురిపిస్తూ, మాయా బలంతో తనను సమీపిస్తుంటే, అది కనబడకపోయినా, ధ్వనిని బట్టి గుర్తించి, బాణాలు ప్రయోగించి రాముడు దాని మదం అణిచాడు. తన మాయలు నిష్ప్రయోజనం కావడంతో, వాటిని వదిలి, ప్రత్యక్షంగా ఎదురొచ్చి, రివ్వున ఒడిసెల రాయిలాగా తనమీద పడబోతే, రాముడు భయంకరమైన - తీక్షణమైన బాణాన్ని సంధించి, దాని రొమ్ములో నాటుకునేటట్లు వేయడంతో, ఆ రాక్షసి చచ్చిపోయి, భూమి అదిరిపోయేటట్లు దబీలుమని పడిపోయింది. అది చూసిన ఇంద్రాది దేవతలు, దుష్ట రాక్షసి చనిపోయిందని సంతోషించారు. ఇంతటి బలవంతురాలిని కేవలం బాణాలతోనే రామచంద్రమూర్తి సంహరించాడు - ఆయనకే కనుక అస్త్ర బలం వుంటే ఎంత కార్యమైనా చేయగలడని పొగుడుతూ శ్రీరాముడిని పూజించారు దేవతలు.

(శ్రీరామచంద్రమూర్తి అవతార కార్య ధురంధరత్వం స్త్రీ వధతో ప్రారంభం అవుతుంది. స్త్రీ వధ పాపం అని రామాయణమే చెపుతుంది. భరత వాక్యం - హనుమంతుడి వాక్యం అదే విషయం తెలియచేస్తుంది. అలాంటప్పుడు శ్రీరాముడు ఎందుకు స్త్రీ వధ చేశాడు? భగవద్గీత పుట్టింది ఇలాంటి సంశయ నివృత్తికే. అర్జునుడు, శ్రీరాముడు - ఇరువురు క్షత్రియులే. స్వధర్మమని, బంధువులను చంపితే పాపం వస్తుందని, భయపడ్డాడు అర్జునుడు. స్వధర్మమని, స్త్రీ ని చంపవచ్చానని, శంకించాడు రాముడు. కృష్ణుడు అర్జునుడికి ఏం ఉపదేశించాడో - విశ్వామిత్రుడు అదే చేశాడు రాముడికి. స్వధర్మ నిర్వహణ తన విధి అని శ్రీరామచంద్రమూర్తి ఆసక్తి లేకపోయినా చేశాడు. అందుకే శ్రీరాముడు తాటకను చంపడం దోషం కాదు).

ఇంద్రాది దేవతలు విశ్వామిత్రుడి దగ్గరున్న భృశాశ్వనందనులనే అస్త్రాలను, లోక సంరక్షణార్థమై, రామచంద్రమూర్తికి అప్పగించమని ఆయన్ను ప్రార్థిస్తారు. రాముడు చేయవలసిన కార్యాలెన్నో వున్నాయని, అస్త్ర జ్ఞానం లేకుండా అవన్నీ ఎలా చేస్తాడని ఆయన్ను అడుగుతారు వారు. అస్త్ర దానం చేయడానికి విశ్వామిత్రుడికి రాముడుకంటె యోగ్యుడైన వాడు మరొకరు కనిపించడని, అందుకే, ఆయన దగ్గరున్న విద్యా సమూహాన్నంతా రాముడికివ్వమని చెప్పి పోతారు వారందరు. విశ్వామిత్రుడు వారి మాటలను విని, రాముడిని కౌగలించుకుని, ప్రేమతో శిరస్సును ఆఘ్రాణించి, అప్పటికి సంధ్యా సమయం అయిందని, ఆ రాత్రి అక్కడే గడిపి ఉదయం కాగానే, తన ఆశ్రమానికి పోదామని అంటాడు. సరేనన్న రామ లక్ష్మణులు, ఆ మూడో రోజు రాత్రి, అక్కడే వుండిపోయారు. ఆ వనం కూడా తాటక చావుతో శాపం తీరిన దానిలాగా, కొత్త చిగుళ్లు - పూలు గుత్తులు-గుత్తులుగా కనిపించి, చైత్ర రథమనే పేరున్న కుబేరుడి ఉద్యానవనం లాగా అనిపిస్తూ, సుందర లక్ష్మికి నివాస భూమిలాగా అగుపడ సాగింది.

2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. >> రాముడుకంటె
    రాముడి కంటె అని ఉండాలండి.

    ReplyDelete